AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu వ్యాసాలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 1.
‘ఆరుబయట మలవిసర్జన’ ఎంతటి ప్రమాదకరమో వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
అత్యంత ప్రమాదం

మలవిసర్జన అంటే మన శరీరంలోని మలినాలను బయటకు వదలడం.

మలవిసర్జన వలన వచ్చే మలినాలు చాలా దుర్వాసనతో కూడుకొని ఉంటాయి. అంతేకాకుండా వాటిపై అత్యంత ప్రమాదకరమయిన సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు వ్యాపించినట్లయితే కలరా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ఇవి వృద్ధులకు, బలహీనులకు, చిన్న పిల్లలకు, అనారోగ్యవంతులకు, గర్భిణీలకు, బాలింతలు మొదలైన వారికి తొందరగా వ్యాపిస్తాయి.

బహిరంగ మలవిసర్జన చేసినపుడు దానిపై ఈగలు, దోమలు వాలతాయి. వాటిపైకి అక్కడి సూక్ష్మజీవులు చేరతాయి. ఆ ఈగలు, దోమలు మనం తినే ఆహారంపై వాలతాయి. ఈ సూక్ష్మజీవులు ఆహారంతోబాటు మనలోపలికి ప్రవేశిస్తాయి. ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.

అందుకే బహిరంగ మలవిసర్జన వద్దని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రజలను చైతన్యపరుస్తున్నాయి. మరుగుదొడ్లు నిర్మించుకొందుకు ప్రభుత్వం కూడా మినహాయింపుతో కూడిన ఋణం మంజూరు చేస్తోంది.
బహిరంగ మలవిసర్జన మానేద్దాం – నాగరికతను చాటుదాం.
మరుగుదొడ్డి వాడదాం – రోగాలు నివారిద్దాం.
పరిశుభ్రత పాటిద్దాం – పదికాలాలు చల్లగా ఉందాం.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 2.
‘స్వచ్ఛభారత్’ కార్యక్రమం గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మనదేశ ప్రధాని నరేంద్రమోడీ గారు, దేశంలోని కాలుష్యమును గమనించి, నదీజలములు అన్నీ కలుషితం కావడం చూసి, ఈ ‘స్వచ్ఛభారత్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులయిన వ్యక్తులను మోడీ గారు నియమించారు. అమితాబ్ బచ్చన్, రామోజీరావు వంటి వారు, ఈ కార్యక్రమానికి చేయూత నిస్తున్నారు. మన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికిపేటలు, గంగ, గోదావరి వంటి నదుల జలాలు నేడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విద్యార్థులూ, ఆఫీసులలో ఉద్యోగులూ తమ పాఠశాలలనూ, కార్యాలయాలనూ “పరిశుభ్రంగా ఉంచుకోవాలి.” ప్రజలు తమ గృహాలనూ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి.

నదులు, చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్ఛతను కాపాడితే, దేశం ఆరోగ్యవంతం అవుతుంది. ప్రజలకు కావలసిన మంచినీరు లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. దీన్ని ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పత్రికల వారు, దూరదర్శనా వారు స్వచ్ఛభారత్ గురించి మంచి ప్రచారం చేయాలి. దానివల్ల దేశం సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రశ్న 3.
అధిక జనాభా వల్ల మన పర్యావరణం దెబ్బ తింటోంది. పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
భూమి, నీరు, గాలి మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. కాబట్టి పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం అని అర్థం. పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది.

ప్రాణులు నివసించేది నేలపైన గదా ! ఆ నేలతల్లిని సరిగా చూసుకోవాలి. భూమిపై చెత్త, చెదారమేకాదు ఓషధులుంటాయి. చెట్లుంటాయి. జంతువులుంటాయి. మనం జీవించటానికి ఆహారం లభించేది భూమి వల్లనే గదా ! రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమైపోతోంది. భూమిని ఆరోగ్యంగా ఉంచాలి. భూమి సమతౌల్యాన్ని పోషించాలి.

జలకాలుష్యం మిక్కిలి భయంకరమైనది. రసాయనిక పదార్థాలు, పరిశ్రమల వల్ల విడుదలయ్యే ద్రవపదార్థాలు సాగునీటిని, త్రాగేనీటిని కాలుష్యపరుస్తాయి. మురుగునీరు, త్రాగేనీరు అనే భేదం లేకుండా పోతోంది. డ్రైనేజి వ్యవస్థ అరొకరగా వుంది. దీనివల్ల కలరా, మలేరియా, ఫ్లోరోసిస్, విషజ్వరం, టైఫాయిడ్ వంటివేకాక వైద్యులకి అంతుపట్టని కొత్త రోగాలు కూడా బయలుదేరాయి.

ఇక వాయు కాలుష్యం, గాలివల్లనే మనం జీవిస్తున్నాం. అటువంటి గాలి స్వచ్ఛంగా వుండాలి. కాని ఆధునిక పారిశ్రామికత పేరుతో గాలి కూడా కలుషితమైపోతోంది. విషపూరితమైన గాలి పీల్చటం వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, గుండెకాయ, కళ్ళు అనారోగ్యానికి గురై ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జీవితం రోగాలమయం అవుతోంది.

యంత్రాలవల్ల, వాహనాలవల్ల ధ్వనికాలుష్యం వ్యాపిస్తోంది. అణుశక్తి పరీక్షల వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది.

1970లో అమెరికాలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమం బయలుదేరింది. వాటి నుంచి శాస్త్రజ్ఞులు పర్యావరణ కాలుష్యనివారణకు విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థలోని సమతౌల్యాన్ని కాపాడుకోవటానికి అందరూ కృషి చేయాలి.

ప్రశ్న 4.
నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ “వ్యాసం” రాయండి.
జవాబు:
పవిత్ర భారతదేశంలో స్త్రీలకు సమున్నతమైన గౌరవం ఉంది. స్త్రీలు భూమిపై కదిలే దేవతామూర్తులుగా భావిస్తాము. స్త్రీలు ఎక్కడ ఉంటే అక్కడ దేవతలు ఆనందిస్తారని మనం భావిస్తాము. కాని వర్తమాన సమాజంలో పరిస్థితులు పూర్తిగా మారాయి. స్త్రీల ప్రగతి నానాటికి దిగజారుతున్నది. స్త్రీలు ఎన్నో సమస్యలను, కష్టాలను ఎదుర్కొంటున్నారు.

స్త్రీలు ఇప్పటికీ స్వేచ్ఛగా జీవించలేకపోతున్నారు. కొందరు స్త్రీలను పైకి రానీయకుండా అడ్డుపడుతున్నారు. రాజకీయాల్లో రిజర్వేషన్ కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాలేదు. చట్టసభల్లో మహిళా సభ్యులను చులకనగా చూస్తున్నారు.

ప్రేమ పేరుతో స్త్రీలపై దాడులు జరుగుతున్నాయి. అకృత్యాలు జరుగుతున్నాయి. కులాంతర వివాహాలు చేసుకున్న మహిళలపై వివక్షను చూపిస్తున్నారు. పరువు కోసం తండ్రులు కన్న కూతుర్లనే చంపడం మనం చూస్తున్నాం. దీన్ని నాగరిక సమాజం హర్షించదు. దీన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి.

గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు అక్షరాస్యతకు దూరంగా ఉంటున్నారు. కొందరు కట్నాల పేరుతో మహిళలను వేధిస్తున్నారు. ఆరోగ్యపరంగా స్త్రీలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. బాలింతలకు తగిన పౌష్టికాహారం దొరకడం లేదు. ఈ రకంగా స్త్రీలు సమాజంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిని మన ప్రభుత్వాలు పరిష్కరించాలి. స్త్రీల జీవితాల్లో వెలుగులను నింపాలి.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 5.
మీకు నచ్చిన సన్నివేశాన్ని లేదా ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
సూర్యోదయం
తూర్పువైపు ఆకాశంలోకి ఉదయమే చూస్తే ఎర్రగా కనిపిస్తుంది. అప్పటి వరకూ కోళ్ళు కూస్తూ ఉంటాయి. నక్షత్రాలు ఆకాశంలో వెలవెలపోతాయి. అప్పుడు పక్షులు తమ గూళ్ళ నుండి బయలుదేరి ఆహారం కోసం బారులు కట్టి ప్రయాణం చేస్తూ ఉంటాయి. పక్షులు రెక్కలు ఆడిస్తూ నేరుగా దూసుకుపోతూ ఉంటే, ఆ దృశ్యం చూడ్డానికి కళ్ళకు పండుగలా కనిపిస్తుంది.

అదే సమయానికి సూర్యకిరణాలు నేరుగా వచ్చి నేలకు తాకుతాయి. మా ఇంటి పక్క గుళ్ళో గంటలు మోగుతూ ఉంటాయి. గుడి పక్క చెరువులో సూర్యకిరణాలు పడి, తామర పూలు విచ్చుకుంటాయి. తుమ్మెదలు ఆ పద్మాలపై ఏదో రొద చేస్తూ తిరుగుతూ ఉంటాయి.. సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. సూర్యోదయం కాగానే ప్రకృతి అంతా మేలుకొని తమ తమ పనుల్లో మునిగిపోతుంది.

ప్రశ్న 6.
‘నవ సమాజంలో విద్యార్థుల పాత్ర అనే అంశం మీద వ్యాసము వ్రాయండి.
జవాబు:
విద్యార్థులు అంటే విద్యను కోరి వచ్చినవారు. విద్యార్థుల ముఖ్య కర్తవ్యం, శ్రద్ధగా చదివి, మంచి మార్కులు సాధించడం. ఈనాడు మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి దేశ నాయకులతో పాటు, ప్రజలు కూడా బాబాధ్యత వహించాలి. విద్యార్థులు చదువుకుంటున్న దేశ పౌరులు. కాబట్టే భావి భారత పౌరులయిన విద్యార్థులు కూడా, నవ సమాజంలో పెరిగిపోతున్న అవినీతి, అపరిశుభ్రత, దురాగతాలు, రాజకీయ నాయకుల వాగ్దాన భంగాలు వంటి వాటిపై తప్పక తిరుగబడాలి.

విద్యార్థులు ‘స్వచ్ఛభారత్’ వంటి కార్యక్రమాలు చేపట్టాలి. అంటువ్యాధుల నిర్మూలనకు దీక్ష చేపట్టాలి. అవినీతి ఎక్కడ కనబడినా, సామూహికంగా. ఎదిరించాలి. విద్యార్థులు నీతినియమాలు పాటించాలి. వృద్ధులను గౌరవించాలి. తోడి వారికి సాయం చేయాలి.

విద్యార్థినీ విద్యార్థులు, క్రమశిక్షణను పాటించాలి. దేశభక్తిని కలిగియుండాలి. మంచి అలవాట్లను అలవరచుకోవాలి. గురువులనూ, తల్లిదండ్రులనూ గౌరవించాలి. బాగా ఆటలు ఆడి, వ్యాయామం చేసి ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రచారం చేయాలి.

విద్యార్థులు రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనరాదు. కాని దేశం కోసం తమ శక్తియుక్తులనన్నింటినీ ధారపొయ్యాలి.

ప్రశ్న 7.
కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.
జవాబు:
కవి అలిశెట్టి ప్రభాకర్ “నగరం అర్థంకాని రసాయనశాల” అన్నమాట యదార్థము. నేడు పల్లెలను వీడి ప్రజలంతా పట్టణాలకు వలస పోతున్నారు. నగరాలు అన్నీ మురికివాడలుగా మారి పోయాయి.

నగరాల్లో జనాభా పెరిగిపోతోంది. ప్లాస్టిక్ సంచుల వాడకం పెరిగింది. ప్రజలు పారవేసే చెత్త, వాడి పారవేసిన ఇంజక్షను సూదులు, ఫ్యాక్టరీలవారు విడిచిపెట్టే రసాయనిక వ్యర్థాలు , పందులు, కుక్కలు వంటి జంతువుల మాలిన్యాలు, నగరంలో పోగుపడుతున్నాయి.

నగరాలలో ప్రజలకు త్రాగడానికి సరిపడ మంచినీరు దొరకడం లేదు. నగరాన్ని శుభ్రంగా ఉంచాలన్న దీక్ష, ప్రజలకు ఉండడం లేదు. నగరంలో తిరిగే వాహనాలు ఎంతో కాలుష్యాన్ని గాలిలోకి విడిచిపెడుతున్నాయి. నదులలో కాలువలలో, చెరువులలో మురికినీరు వదలుతున్నారు. జలాశయాల్లో బట్టలు ఉతుకుతున్నారు. చెత్త దూరంగా పారవేసేందుకు నగరాల్లో చోటు దొరకడం లేదు. అందువల్ల నగరాలు కాలుష్య నిలయాలుగా, రోగాలకు పుట్టుక స్థలాలుగా మారుతున్నాయి.

నివారణ :
ప్రతి నగర పౌరుడు తమ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. మొక్కలు నాటాలి. జలాశయాల్లోకి మురికినీరు విడువరాదు. పరిశుభ్రతకూ, మంచి నీటికి మంచి వాతావరణానికి నగరాధికారులతో పాటు అందరూ కృషి చేయాలి.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 8.
నగర జీవనంలోని అనుకూల అంశాలపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
నగర జీవనం – అనుకూల అంశాలు :
‘నగరం’ అంటే పట్టణము. పల్లెలలో కన్న నగరాలలో ప్రజలకు అవసరమయ్యే సదుపాయాలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. అందువల్ల ప్రజలు గ్రామాల నుండి నగరాలకు వలసపోతున్నారు.

నగరాలలో ప్రజలకు విద్యా, వైద్య, ప్రయాణ సౌకర్యాలు హెచ్చుగా దొరుకుతాయి. ప్రజలకు మంచి విద్య నగరాల్లో లభిస్తుంది. కార్పొరేట్ కళాశాలలు, వైద్యశాలలు నగరాల్లో ఉంటాయి. నగరాల్లో పరిశ్రమలు ఉంటాయి. అందువల్ల ప్రజలకు ఉద్యోగ వసతి లభిస్తుంది. నగరాల్లో ప్రయాణాలకు సిటీ బస్సులు, రైళ్ళు, ఆటోలు, టాక్సీలు దొరుకుతాయి.

చేతి వృత్తుల వారికి సైతము, నగరాల్లో వారికి తగ్గ పని లభిస్తుంది. ప్రజలు ఏదోరకంగా నగరాల్లో బ్రతుకగలరు. వారికి కావలసిన పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు నగరాల్లో దొరుకుతాయి. కుళాయిల ద్వారా మంచి నీరు దొరుకుతుంది. రైతు బజార్లలో చౌకగా కావలసిన వస్తువులు దొరుకుతాయి. రోగం వస్తే, చిన్న పెద్ద వైద్యశాలలు నగరంలో ఉంటాయి. నగరాల్లో 24 గంటలు విద్యుచ్ఛక్తి సరఫరా అవుతుంది.

ఈ విధమైన అనుకూలములు ఉన్నందు వల్లే ప్రజలు పల్లెలను వదలి నగరాలకు వలసపోతున్నారు.

ప్రశ్న 9.
మాతృభాషా ప్రాముఖ్యాన్ని గూర్చి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
మాతృభాష అంటే తల్లి భాష అని అర్థం. మనం పుట్టిన చోట జనవ్యవహారంలో ఉండే భాష మాతృభాష. మానవుడు పుట్టింది మొదలు గిట్టేవరకు మాతృభాషలోనే ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. మనం ఏ భాషలో మాట్లాడతామో, ఏ భాషలో కలలు కంటామో ఆ భాషలోనే విద్యను నేర్చుకోవడం ఎంతైనా అవసరం.

పరాయి భాషలో విద్యాభ్యాసం చేస్తే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుగా పరాయి భాషను అర్థం చేసుకోవడానికే చాలా ప్రయాస పడాల్సివస్తుంది. అందులో తగినంత పరిజ్ఞానం అలవడనిదే విషయ గ్రహణంగానీ, విషయ వ్యక్తీకరణగానీ సాధ్యపడదు. మాతృభాషలో విద్యాభ్యాసం వల్ల విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పిన విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. గుర్తుంచుకొని పరీక్షలు బాగా వ్రాయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ విజ్ఞానాన్ని పొందవచ్చు.

మాతృభాషలో విద్యను నేర్చుకోవడం తల్లిపాలు త్రాగి పెరగడం వంటిది. పరభాషలో విద్యను నేర్చుకోవడం దాది పాలు త్రాగడం వంటిది. ఆంగ్లం వంటి పరాయిభాషలో విద్యార్థికి సరైన పరిజ్ఞానం లేనందువల్ల విద్యార్థికి ఆ భాషరాక బట్టీపట్టి ఏదోవిధంగా కృతార్థుడవుతున్నాడు. ఉపాధ్యాయులు చెప్పేది అర్థం కాక గైడ్సు (Guides) వెంట పడుతున్నాడు. కాబట్టి కనీసం సెకండరీ విద్యాస్థాయి వరకు మాతృభాషలోనే విద్యను బోధించడం, విద్యను నేర్చుకోవడం అవసరం.

ప్రశ్న 10.
‘వాతావరణ కాలుష్యం’ లేదా ‘పర్యావరణ పరిరక్షణ’ అన్న విషయంపై వ్యాసం రాయండి.
జవాబు:
ఆరోగ్యమే మహాభాగ్యం. వాతావరణం పరిశుభ్రంగా ఉంటే, మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అతడి జీవితం, ఆనందంగా సాగుతుంది. మానవుల ఆరోగ్యానికి హానిని కల్గించే హానికారక పదార్థాలు వాతావరణంలో కలిసిపోతే, దానిని వాతావరణ కాలుష్యం అంటారు.

మన చుట్టూ ఉండే గాలి, నీరు, భూమి వంటి వాటిని పర్యావరణం అంటారు. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి.

వివిధ కర్మాగారాలు, పరిశ్రమలు, లెక్కలేనన్ని మోటారు వాహనాలు, మురికి నీరు, మొ||నవి. వాతావరణ కాలుష్యాన్ని కల్గిస్తున్నాయి. కర్మాగారాలు వదిలే వ్యర్థ పదార్థాల వల్ల, నదుల జలాలు కలుషితం అవుతున్నాయి. దానితో జలకాలుష్యం ఏర్పడుతోంది. మోటారు వాహనాల ధ్వనులతో ధ్వని కాలుష్యం ఏర్పడుతోంది.

వాతావరణ కాలుష్యం వల్ల, మానవుని మనుగడకు ప్రమాదం ఏర్పడుతోంది. దీనివల్ల ఉదరకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కేన్సర్ రోగాలు, గుండె జబ్బులు వస్తున్నాయి.

వాతావరణ కాలుష్య నివారణకూ, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి అమలు పరచాలి. కర్మాగారములు పరిశుభ్రము చేసిన తరువాతే వ్యర్థాలను విడిచి పెట్టాలి. ఫ్యాక్టరీల వారు మొక్కలు బాగా పెంచాలి. అవకాశం ఉన్న చోట ప్రజలు మొక్కలను బాగా పెంచాలి. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు, పరిశోధనలు చేసి, వాతావరణ కాలుష్య నివారణకు తగు సూచనలు అందించాలి.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 11.
నీకు నచ్చిన మహిళ గుణగణాలు (శ్రీమతి ఇందిరాగాంధీ) గురించి వ్యాసం రాయండి.
జవాబు:
నాకు నచ్చిన మహిళ (శ్రీమతి ఇందిరా గాంధీ) :
భరత మాత ముద్దుబిడ్డలలో, ఇందిరాగాంధీ ఒకరు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహిళామణులలో, ఇందిర సుప్రసిద్ధురాలు. ఈమె 1917వ సంవత్సరము నవంబరు 19వ తేదీన ఆమె అలహాబాదులో జవహర్ లాల్ నెహ్రూ – కమలా నెహ్రూ దంపతులకు జన్మించింది.

ఇందిర శాంతినికేతన్లో రవీంద్రుని వద్ద చదివింది. ఈమె గొప్ప దేశ భక్తురాలు.. ఈమె భర్త ఫిరోజ్ గాంధీ, మహమ్మదీయుడు. ఆ వివాహం ఈమెకు మత సహనాన్ని నేర్పింది. ఈమె తండ్రితో పాటు దేశ విదేశాలు పర్యటించి, రాజనీతి చతురజ్ఞ అయ్యింది.

ఈమె భారతదేశ ప్రధానమంత్రిగా 15 సంవత్సరాలు పనిచేసింది. ఆ కాలంలో ఈమె బ్యాంకులను జాతీయం చేసింది. రాజభరణాలను రద్దు చేసింది. భూ సంస్కరణలను చేపట్టింది. ‘గరీబీ హఠావో’ అని ఈమె ఇచ్చిన నినాదం భారతదేశం అంతటా మారుమ్రోగింది.

ఈమె బడుగువర్గాల ఆశాజ్యోతిగా, దళిత వర్గాల కన్నతల్లిగా పేరు తెచ్చుకొంది. ఈమె గొప్ప సాహసురాలు. గొప్ప రాజనీతిజ్ఞురాలు.

ప్రశ్న 12.
నీకు నచ్చిన జాతీయ నాయకుని గూర్చి వ్యాసం రాయండి.
జవాబు:
మహాత్మాగాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. కానీ భారత ప్రజలు ఆత్మీయంగా ‘బాపూజీ’ అని పిలిచేవారు. ‘మహాత్మా’ అని గౌరవించేవారు. భారత జాతి మహాత్మాగాంధీని ‘జాతిపిత’ గా గౌరవించి కృతజ్ఞత ప్రకటించుకుంది.

గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడున్న భారతీయుల దాస్య వృత్తిని చూసి చలించిపోయాడు. ఆంగ్లేయుల ప్రవర్తన సహించలేక ఎదురుతిరిగాడు. ఎన్నో కష్టాలకు లోనయ్యాడు.

స్వదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ భారతీయుల బానిస బ్రతుకుల్ని చూసి సహించలేకపోయాడు. భారతమాత పరాయి పాలకుల సంకెళ్ళలో బందీగా ఉన్నందుకు గాంధీ తల్లడిల్లాడు. ఆంగ్లేయులపై స్వాతంత్ర్య సమరం ప్రకటించాడు. శాంతి, సత్యం, అహింస అనే ఆయుధాలతో స్వాతంత్ర్య సమరం చేపట్టాడు. స్వరాజ్య ఉద్యమానికి కాంగ్రెసు సంఘం స్థాపించాడు.

ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ, ఖద్దరు ఉద్యమాలను చేపట్టి ఆంగ్లేయులను గుక్క తిప్పుకోనీకుండా గడగడలాడించాడు. సత్యాగ్రహం, నిరాహారదీక్షల ద్వారా భారత జాతిని జాగృతం చేసి ఆంగ్లేయుల గుండెలు దద్దరిల్లజేశాడు.

అనేక జాతులు, కులాలు, మతాలు, భాషలు గల దేశ ప్రజల్ని ఒకే త్రాటి మీద నడిపించి, సమైక్యంగా పోరాటం సాగించాడు. గాంధీ నడిపించిన ఉద్యమం వల్ల 1947, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. దుడ్డు కర్ర, అంగవస్త్రం, కిర్రు చెప్పులు గల గాంధీ ప్రపంచ దేశాల చేత జేజేలు అందుకున్నాడు.

ప్రశ్న 13.
ప్రశాంతతకు, పచ్చదనానికి నిలయమైన పల్లెల గొప్పదనాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
గ్రామాలు దేశ సౌభాగ్యానికి మూలకందములు. పల్లెలలో జీవితం ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. చక్కని ఎండ, గాలి, ప్రతి ఒక్కరికీ పల్లెలలో లభిస్తుంది. పల్లెలు ప్రకృతి రమణీయతకు నిలయాలు. పల్లెలలో పచ్చని చెట్లు, పొలాలు, ఆ చెట్టుపై పక్షుల కలకూజితాలు మనోహరంగా ఉంటాయి. చెట్లు చల్లని గాలిని ఇస్తూ, గ్రామ ప్రజలను సుఖసంతోషాలతో ముంచెత్తుతాయి.

ప్రజలందరికీ పల్లెలలో పాడిపంటలు ఉంటాయి. తాజా కూరగాయలు, పళ్ళు, పూలు వారికి దొరుకుతాయి. గ్రామాలలో ప్రజలందరూ ఒకరితో నొకరు అన్నదమ్ముల్లాగా మెలగుతారు. వారు “అక్కా! బావా” అంటూ ఆప్యాయంగా పలకరించుకుంటారు. కష్టసుఖాల్లో అందరూ కలిసి పాలుపంచుకుంటారు. గ్రామాలలో తీర్థాలు, సంబరాలు మహావేడుకగా జరుగుతాయి.

పల్లెలలో ఒకరింట్లో పెండ్లి అంటే, గ్రామంలో అందరికీ వేడుకే. పల్లెలలో సంక్రాంతికి ముగ్గులు, పూలతోరణాలు, గొబ్బిళ్ళు, భోగిమంటలు, సంక్రాంతి ప్రభలు మహావైభవంగా ఉంటాయి. హరిదాసులు, గంగిరెద్దులు, పగటి వేషధారులు, వారి చక్కని పాటలు ఆనందంగా ఉంటాయి. గ్రామాల్లో పంటలు పండి ఇంటికి వస్తే, ఇళ్ళు కలకలలాడుతాయి. అందమైన పాడి పశువులు, దుక్కిటెడ్లు, ఎడ్ల బళ్ళు మహావైభవంగా ఉంటాయి.

అందుకే పల్లెలు ప్రకృతి రమణీయతకు నట్టిళ్ళు. ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు అని చెప్పగలము.

ప్రశ్న 14.
అవినీతి నిర్మూలనమునకు మీరిచ్చే సలహాలేమిటి?
జవాబు:
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అనేక రంగాలలో దేశం ముందంజ వేసింది. దురదృష్టవశాత్తూ మనదేశంలో అవినీతి కూడ పెచ్చుపెరిగింది. అక్రమ సంపాదన ప్రజల లక్ష్యమయిపోయింది. ఏదోరకంగా తప్పుచేసి అయినా డబ్బు సంపాదించడం, తన పని పూర్తిచేసుకోవడం, ఆశ్రితులకు మేలు చేయడం, నీతికి సమాధి కట్టడం జరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజకీయ నాయకులలో ఈ అవినీతి జాడ్యము విస్తరించిపోతోంది. చిన్న పంచాయతీ మెంబరు నుండి దేశ ప్రధాని వరకు అందరూ అవినీతి ఆరోపణలకు గురియగుచున్నారు. ఇది దేశానికి పట్టిన దౌర్భాగ్యం. దీనిని అరికట్టడంలో భావిభారత పౌరులైన యువతీయువకులు ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు ముందడుగు వేయాలి.

ముందుగా దేశంలో జరిగే అవినీతి కార్యాలను గూర్చి చూద్దాము. వర్తకులు సరకులలో కలీ చేయడం, ప్రభుత్వము పంపిణీ చేసిన నిత్యావసర వస్తువులను దాచి, బ్లాక్ మార్కెట్లో అమ్మడం, ధరలు పెంచివేయడం, ప్రభుత్వానికి పన్నులు ఎగవేయడం వంటి పనులు చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వము ప్రజలకు ఇచ్చే సదుపాయాలు ప్రజలకు లభించేలా చూడ్డానికి భారీగా లంచాలు మింగుతున్నారు. రేషన్ కార్డులు ఇవ్వడానికి, ఇళ్ళ స్థలాలు మొదలైనవి పంచడానికి లంచాలు తీసికొంటూ అర్హులయిన వారికి అన్యాయం చేసి వారికి ఇష్టమైన వారికి ఇస్తున్నారు. చౌకధరల దుకాణంలో సరుకులను దాచివేసి అక్రమ లాభాలు ఆర్జిస్తున్నారు. బ్యాంకుల అప్పులకు లంచాలు తీసికొంటున్నారు. విద్యాలయాలలో సీట్లకు లంచాలు, పాస్ చేయించడానికి లంచాలు ముట్టచెప్పవలసివస్తోంది. ఇట్లా దేశంలో అవినీతి అన్ని రంగాలలో తాండవిస్తోంది.

ఈ అవినీతిని అరికట్టడానికి యువతీయువకులు ముందుకు రావాలి. పత్రికలకు లేఖలు వ్రాసి లంచగొండుల గూర్చి అవినీతి శాఖ వారికి తెలియజేయాలి. అవినీతి శాఖ ఉద్యోగులు కూడా మరింత చురుకుగా పనిచేసి లంచగొండులను నిర్బంధించాలి.

రోజుకొక లంచగొండిని, కలీ వ్యాపారిని, దుష్ట రాజకీయవేత్తను ప్రభుత్వానికి యువత అప్పగిస్తే, కొద్దిరోజులలో దేశములో అవినీతి దానంతట అదే అంతరిస్తుంది. అవినీతిపరులకు ప్రభుత్వం కూడ గట్టి శిక్షలు విధించాలి. వారి ఉద్యోగాలు తీసివేయాలి. కలీ వ్యాపారులకు జరిమానాలు, జైలు శిక్షలు వేయాలి.

అవినీతి నిర్మూలన ప్రజలందరి లక్ష్యం కావాలి. లేనిచో ఈ అవినీతి చెదపురుగు దేశాన్నే కొరికి తినివేస్తుంది.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 15.
‘స్వచ్ఛభారత్’ గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మనదేశ ప్రధాని నరేంద్రమోడీ గారు, దేశంలోని కాలుష్యమును గమనించి, నదీజలములు అన్నీ కలుషితం కావడం చూసి, ఈ ‘స్వచ్ఛభారత్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులయిన వ్యక్తులను మోడీ గారు నియమించారు. అమితాబ్ బచ్చన్, రామోజీరావు వంటి వారు, ఈ కార్యక్రమానికి చేయూత నిస్తున్నారు. మన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికి పేటలు, గంగా, గోదావరి వంటి నదులజలాలు నేడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విద్యార్థులూ, ఆఫీసులలో ఉద్యోగులూ తమ పాఠశాలలనూ, కార్యాలయాలనూ “పరిశుభ్రంగా ఉంచుకోవాలి.” ప్రజలు తమ గృహాలనూ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి.

నదులు, చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్ఛతను కాపాడితే, దేశం ఆరోగ్యవంతం అవుతుంది. ప్రజలకు కావలసిన మంచినీరు లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. దీన్ని ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పత్రికల వారు, దూరదర్శన్ వారు స్వచ్ఛభారత్ గురించి మంచి ప్రచారం చేయాలి. దానివల్ల దేశం సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రశ్న 16.
నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయస్సులోనే కార్మికులుగా చేరుతున్నారని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (ఐ.ఎల్.ఒ) తన సర్వేలో వెల్లడించింది.

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఎల్.ఒ. నిర్వహించిన సర్వేలో తెలియజేసింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా బాల కార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలు సందర్భాలలో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాల కార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేట్లు చూడాలి. .

భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పని చేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాల కార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళు చదువుకొనే అవకాశం కల్పించాలి.

బాల కార్మికులను కూలివారుగానే చూస్తే వారు కార్మికులుగానే మిగిలిపోతారు. వారిలో ఉన్న యోగ్యతను, ప్రతిభను వెలికి తీసేందుకు సహకారం అందజేస్తే భవిష్యత్తులో ఒక మంచి నిపుణుడిని అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.