AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 1st Lesson స్వామి వివేకానంద

9th Class Telugu ఉపవాచకం 1st Lesson స్వామి వివేకానంద Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
నరేంద్రుని బాల్యం, విద్యాభ్యాసం గురించి రాయండి.
జవాబు:
నరేంద్రుడు ఆరవ ఏట విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. మొదట్లో ఇంట్లోనే తల్లిదండ్రులు నియమించిన గురువు వద్ద చదువుకున్నాడు. గురువు ఒకసారి చెప్పగానే నేర్చుకొని, అప్పచెప్పగలిగేవాడు.

ఏడవ ఏట ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేరాడు. నరేన్ తెలివితో, చురుకుతో తోటి బాలురందరికీ నాయకుడయ్యాడు. నరేన్ కు ఆటలంటే ప్రాణం.

నరేనకు ఇష్టమైన ఆట “రాజు – దర్బారు”. ఇంటిలోనే సొంతంగా ఒక వ్యాయామశాల ఏర్పాటుచేశాడు. తర్వాత వ్యాయామశాలలో చేరి కర్రసాము, కత్తిసాము, గుర్రపుస్వారీ నేర్చాడు.

నరేను క్రమంగా పుస్తకాలు చదవడంపై ఆసక్తి పెరిగింది. తండ్రిగారు బదిలీ కావడంతో, రాయపూర్ వెళ్ళి తిరిగి కలకత్తా వచ్చి మూడేళ్ళ చదువు ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేశాడు. ఆ పరీక్ష మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ పాఠశాలలో ఆ శ్రేణిలో పాసైన ఏకైక విద్యార్థి నరేన్ ఒక్కడే.

తరువాత ప్రెసిడెన్సీ కాలేజీలోను, మరుసటి సంవత్సరం ఇప్పుడు స్కాటిష్ చర్చ్ అని పిలువబడే కళాశాలలోనూ చేరాడు. ప్రిన్సిపాలూ, గురువులూ నరేన్ ప్రతిభాపాటవాలకు ఆశ్చర్యపోయేవారు. నరేంద్రుడు ఎన్నో గ్రంథాలు చదివాడు. 1884లో బి.ఏ. పాసయ్యాడు.

ప్రశ్న 2.
వివేకానందుని అమెరికా పర్యటన విశేషాలు తెల్పండి.
(లేదా)
నరేంద్రుని అమెరికా పర్యటన విశేషాలను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
స్వామీజీయైన నరేంద్రుడు అమెరికాలో జరుగబోయే సకల మతముల మహాసభకు వెళ్ళి, భారతదేశ ధర్మాన్ని ప్రపంచానికి తెలియపరుద్దామనుకున్నాడు. మద్రాసులో యువకులు అందుకు సహాయం చేశారు. ఖేత్రీ మహారాజు నరేంద్రునికి కెనడా వెళ్ళే ఓ ఓడలో టిక్కెట్టుకొని ఇచ్చాడు. నరేంద్రుడుని “వివేకానంద” అనే నామాన్ని స్వీకరింపమన్నాడు.

వివేకానందుడు 1893 మే 31న అమెరికాకు బయలుదేరాడు. ఓడ కెనడా దేశంలోని ‘వాంకోవర్’లో ఆగింది. అక్కడ నుండి రైలులో “షికాగో” నగరానికి వివేకానంద వెళ్ళాడు. రైల్లో ‘సాన్ బోర్న్’ అనే మహిళతో పరిచయం అయ్యింది. ఆమె వివేకానందుడు ‘బోస్టన్’ నగరానికి వచ్చినపుడు తన ఇంటికి రమ్మంది.

షికాగో ధనవంతుల నగరం. విశ్వమత మహాసభలకు ఇంకా రెండు నెలల వ్యవధి ఉంది. అదీగాక, ఆ సభలో మాట్లాడేందుకు వివేకానందుని వద్ద ధ్రువపత్రాలు లేవు. దానితో వివేకానందుడు ‘బోస్టన్’లో సాన్ బోర్న్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జే. హెచ్.రైట్ తో పరిచయమైంది. రైట్, వివేకానందుని విశ్వమత మహాసభలో హైందవ ధర్మం గురించి మాట్లాడమన్నాడు. తనవద్ద ధ్రువపత్రాలు లేవని వివేకానందుడు చెప్పాడు.

ఆ ప్రొఫెసర్ విశ్వమత మహాసభల అధ్యక్షుడికి వివేకానందుని గూర్చి అమెరికాలోని పండితులందరి కంటే వివేకానందుడు గొప్పవాడని రాశాడు. వివేకానందుడిని ఆ ప్రొఫెసర్ చికాగోకు పంపాడు. కానీ రైట్ ఇచ్చిన కాగితం కనబడలేదు. వివేకానందుడు చికాగోలో భిక్షాటన చేశాడు. చెట్టు కింద పడుకున్నాడు. జార్జ్. డబ్ల్యూ. హేల్ అనే ఆమె వివేకానందుడిని చూసి, విశ్వమత మహాసభలకు వచ్చిన భారతీయ సన్యాసి అని గౌరవించింది. ఆమె సాయంవల్లనే వివేకానందుడు విశ్వమత మహాసభలో మాట్లాడాడు.

సభలో వివేకానందుడు “నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా ! అంటూ తన ఉపన్యాసం ప్రారంభించాడు. ఆ కమ్మని పిలుపుకు సభ్యులు ఆనందించి మూడు నిమిషాలపాటు లేచి చప్పట్లు కొట్టారు. వివేకానంద ఆ సభలో అన్ని ధర్మాల తరపునా మాట్లాడి, సర్వమత సామరస్యాన్ని చూపాడు. వివేకానందుని ఖ్యాతి దేశదేశాలకూ పాకింది.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 3.
వివేకానందుడు జాతికిచ్చిన సందేశమేమి?
జవాబు:
వివేకానందుని సందేశము :
“మన భారతదేశం పుణ్యభూమి. సంపద, అధికారం మన భారత జాతికి ఎప్పుడూ ఆదర్శాలు కాలేదు. భారతీయుడు ఎవరైనా సరే, జాతిమత తారతమ్యం లేకుండా, పేద, గొప్ప వివాదం లేకుండా, కుల వివక్షతను దగ్గరకు రానీయకుండా, అందరూ నా సహోదరులే అని చాటాలి. భారతదేశానికి అంతటికీ ఏది హితమో, అదే తనకు కూడా హితము అని ప్రకటించాలి.

భారతదేశానికి మంచి జరగాలంటే, స్త్రీ జనోద్దరణ, జన చైతన్యం ప్రధానంగా సంభవించాలి. పేద జనానికి ఆహారం ఇవ్వాలి. విద్యావ్యాప్తి సక్రమంగా జరగాలి. సర్వజనులకూ తగినంత ఆహారం, జీవనోపాధి అవకాశాలు కల్పించాలి.

వ్యావహారిక భాషలోనే కళాత్మకంగా, సహజంగా శాస్త్ర పాండిత్యం సాధించాలి. పరిశోధనలను కూడా వాడుక భాషలోనే నిర్వహించాలి. విద్య సమస్త సమస్యలను పరిష్కరించే మార్గం కావాలి.
వివేకానంద యువకులకు ఇలా సందేశం ఇచ్చారు – “మీకు ప్రేమ, నిజాయితీ, సహనం కావాలి. నిరుపేదలను, అమాయక ప్రజలను, అణగదొక్కబడిన వారిని ప్రేమించండి. వారి కొరకు పరితపించండి. పిరికితనాన్ని విడచి, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. దీనజనులను ఉద్ధరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయని మరువకండి. లేవండి ! మేల్కొనండి ! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలు అనుసరించండి !”

ప్రశ్న 4.
వివేకానందుని సందేశాలు ఆధారంగా ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
ఏకపాత్రాభినయం “వివేకానంద” :

నా భారతీయ సహోదరులారా !
మన భారతదేశం ఒక్కటే అసలైన పుణ్యభూమి, మన భారతజాతి శతాబ్దాలుగా శక్తిమంతమైన జాతి. ఐనా అది ఇతర రాజ్యా లపై దండయాత్ర చేయలేదు. మన భారతీయుడు ఎవరైనా సరే, జాతిమత భేదం, పేద – గొప్ప తేడా, కుల భేదం లేకుండా అందరూ నా సోదరులే అని చాటాలి. భారతీయ సమాజం నా బాల్యడోలిక, నా యౌవన ఉద్యానం, నా వార్ధక్యంలో వారణాసి. భారతీయ సమాజం నాకు స్వర్గతుల్యం.

మన భారతదేశానికి మంచి జరగాలంటే, స్త్రీ జనోద్దరణ, జనచైతన్యం ప్రధానంగా సంభవించాలి. నాకు ఈ లోకంలో సరిపడ తిండిని ప్రసాదించలేక, స్వర్గంలో ఆనందాన్నిచ్చే భగవంతుని నేను విశ్వసించలేను. ముందు కడుపునిండా తిండి. తర్వాతనే మతం.

మనం వ్యావహారిక భాషలోనే శాస్త్ర పాండిత్యం సాధించాలి. మన పరిశోధనలు వ్యావహారిక భాషలోనే నిర్వహించాలి.

సాహసం గల యువకులారా ! మీకు ప్రేమ, నిజాయితీ, సహనం కావాలి. నిరుపేదలను, అమాయకులను, అణగదొక్కబడిన వారిని ప్రేమించండి. దీనుల కోసం శ్రమించండి.

“ఉత్తిష్ఠత ! జాగ్రత ! ప్రాప్య వరాన్ నిబోధత !” లేవండి ! మేల్కొనండి ! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలను అనుసరించండి!

ప్రశ్న 5.
‘శివా శివా’ అంటూ నెత్తిమీద చల్లనీళ్లు పోస్తే మాత్రం అల్లరంతా క్షణంలో తగ్గిపోయే నరేంద్రుడి బాల్యం గురించి రాయండి.
జవాబు:
విశ్వవిఖ్యాతి నొంది సింహసదృశమైన మనోబలానికి ప్రతిరూపమై భారతదేశ యువజనులందరికీ ఆదర్శమై నిలిచిన శ్రీ వివేకానంద చిన్నప్పుడు బాగా అల్లరివాడు. ఈ గడుగ్గాయిని పట్టుకోవడం తల్లియైన భువనేశ్వరిదేవికి గగనమైపోయేది. అల్లరి బాగా మితిమీరిపోయినపుడు ‘శివశివా’ అంటూ నెత్తిమీద చల్లని నీళ్ళు పోస్తే మాత్రం అల్లరంతా క్షణంలో తగ్గిపోయి శాంతపడిపోయేవాడు. బాలనరేంద్రుడు తన తల్లి వద్ద ఎన్నో విషయాలు (రామాయణ, భారత, భాగవతాలు) నేర్చుకున్నాడు. ముఖ్యంగా శ్రీరాముడి కథంటే నరేంద్రుడికి పంచప్రాణాలు. మట్టితో చేసిన సీతారాముల విగ్రహాన్ని తెచ్చి రకరకాల పూలతో పూజించేవాడు. రామ నామ జపం చేసే ఆంజనేయుడు అరటితోటల్లో ఉంటాడని ఎవరో చెప్పగా, ఆ మహావీరుణ్ణి చూడడానికై అక్కడి తోటల్లో వెతికేవాడు.

9th Class Telugu ఉపవాచకం 1st Lesson స్వామి వివేకానంద Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వాక్యాలను వరుసక్రమంలో అమర్చి రాయండి. 4 మార్కులు

ప్రశ్న 1.
అ) నరేంద్రుడు బి.ఎ. పట్టా పొందాడు.
ఆ) ఏడేళ్ళ వయస్సులో నరేనను మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేర్పించారు.
ఇ) 1897 మే నుండి 1898 జనవరి వరకు వివేకానందస్వామి ఉత్తర భారతదేశంలోని ఎన్నో నగరాలకు వెళ్ళారు.
ఈ) వివేకానందస్వామి చికాగోలో ప్రసంగించాడు.
జవాబు:
ఆ) ఏడేళ్ళ వయస్సులో నరేనను మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేర్పించారు.
అ) నరేంద్రుడు బి.ఎ. పట్టా పొందాడు.
ఈ) వివేకానందస్వామి చికాగోలో ప్రసంగించాడు.
ఇ) 1897 మే నుండి 1898 జనవరి వరకు వివేకానందస్వామి ఉత్తర భారతదేశంలోని ఎన్నో నగరాలకు వెళ్ళారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 2.
అ) ఆరేళ్ళ వయస్సులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలుపెట్టాడు.
ఆ) స్వామీజీ 1888లో కాశీకి ప్రయాణమయ్యారు.
ఇ) స్వామీజీ ఇక శాశ్వతంగా ఆ శరీరాన్ని వదిలేశారు.
ఈ) అయ్యా ! తమరు భగవంతుణ్ని చూశారా ! అని నరేంద్రుడు శ్రీరామకృష్ణులను అడిగారు.
జవాబు:
అ) ఆరేళ్ళ వయస్సులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలు పెట్టాడు.
ఈ) అయ్యా ! తమరు భగవంతుణ్ని చూశారా ! అని నరేంద్రుడు శ్రీరామకృష్ణులను అడిగారు.
ఆ) స్వామీజీ 1888లో కాశీకి ప్రయాణమయ్యారు.
ఇ) స్వామీజీ ఇక శాశ్వతంగా ఆ శరీరాన్ని వదిలేశారు.

ప్రశ్న 3.
అ) ఆవిడ అతడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నది.
ఆ) బండిని గుర్రం తన బలమంతా ఉపయోగించి వెఢవేగంతో లాక్కెళ్ళుతోంది.
ఇ) బాలుడు బండిలోకి ఎక్కి పరుగెడుతున్న ఆ గుఱ్ఱపు కళ్ళెం చేజిక్కించుకొని, గుజ్రాన్ని శాంతపరచి ఆగిపోయేటట్లు చేశాడు.
ఈ) బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది. బండిని గట్టిగా పట్టుకుని ఆమె పడిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తోంది.
జవాబు:
ఆ) బండిని గుర్రం తన బలమంతా ఉపయోగించి వెట్టి వేగంతో లాక్కెళ్ళుతోంది.
ఈ) బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది. బండిని గట్టిగా పట్టుకొని ఆమె పడిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తోంది.
ఇ) బాలుడు బండిలోకి ఎక్కి పరుగెడుతున్న ఆ గుఱ్ఱపు కళ్ళెం చేజిక్కించుకొని, గుజ్రాన్ని శాంతపఱచి ఆగిపోయేటట్లు చేశాడు.
అ) ఆవిడ అతడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నది.

ప్రశ్న 4.
అ) ఎవరైనా సరే భగవంతుడి కోసం తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పక దర్శనమిస్తాడు. ఇది నిజం. నా అనుభవం.
ఆ) ‘అయ్యా ! తమరు భగవంతుణ్ణి చూశారా?’ అని నరేన్ రామకృష్ణుడిని అడిగాడు.
ఇ) ‘ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు?’ రామకృష్ణుడు అన్నాడు.
ఈ) “ఓ చూశాను. కావాలంటే నీకు కూడా చూపించగలను’. రామకృష్ణుడు చెప్పాడు.
జవాబు:
ఆ) ‘అయ్యా ! తమరు భగవంతుణ్ణి చూశారా?’ అని నరేన్ రామకృష్ణుడిని అడిగాడు.
ఈ) ‘ఓ చూశాను. కావాలంటే నీకు కూడా చూపించగలను’. రామకృష్ణుడు చెప్పాడు.
ఇ) ‘ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు?’ రామకృష్ణుడు అన్నాడు.
అ) ఎవరైనా సరే భగవంతుడి కోసం తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పక దర్శనమిస్తాడు. ఇది నిజం. నా అనుభవం.

ప్రశ్న 5.
అ) స్వామీజీ రెండు మూడడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగులంకించుకున్నాయి.
ఆ) దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటే, ఒక కోతుల గుంపు కనిపించింది. అవి ఆయన వైపు తిరిగి పరుగెత్తసాగాయి.
ఇ) ఒక సన్యాసి గమనించి “ఆగు ! వెనుదిరిగి ఆ జంతువుల నెదుర్కో అని గట్టిగా అరిచాడు”.
ఈ) అవి కరుస్తాయనే తలంపుతో స్వామీజీ వెనుదిరిగి చిన్నగా పరుగెత్తనారంభించాడు.
జవాబు:
ఆ) దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటే, ఒక కోతుల గుంపు కనిపించింది. అవి ఆయన వైపు తిరిగి పరుగెత్తసాగాయి.
ఈ) అవి కరుస్తాయనే తలంపుతో స్వామీజీ వెనుదిరిగి చిన్నగా పరుగెత్తనారంభించాడు.
ఇ) ఒక సన్యాసి గమనించి “ఆగు ! వెనుదిరిగి ఆ జంతువుల నేదుర్కో అని గట్టిగా అరిచాడు”.
అ) స్వామీజీ రెండు మూడడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగులంకించుకున్నాయి.

ప్రశ్న 6.
అ) జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకున్నారు. అక్కడి భవంతులు, సాంకేతిక పరిజ్ఞానం చూసి, స్వామీజీ విస్తుపోయారు.
ఆ) ఖేత్రీ మహారాజు స్వామివారిని ఆహ్వానించి, కెనడా వెళ్ళే ఓడలో ప్రథమశ్రేణి టిక్కెట్టు కొని ఇచ్చారు.
ఇ) రైల్లో సాన్బోర్న్ “స్వామీజీ ! మీరెప్పుడైనా బోస్టన్ నగరానికి వస్తే దయచేసి మా ఇంటికి అతిథిగా వచ్చి మమ్మానందింప చేయండి” అని కోరింది.
ఈ) ఓడ కెనడా దేశంలోని వాంకోవర్ లో ఆగింది. స్వామీజీ అక్కడి నుండి షికాగోకి రైల్లో వెళ్ళారు.
జవాబు:
ఆ) ఖేత్రీ మహారాజు స్వామివారిని ఆహ్వానించి, కెనడా వెళ్ళే ఓడలో ప్రథమశ్రేణి టిక్కెట్టు కొని ఇచ్చారు.
ఈ) ఓడ కెనడా దేశంలోని వాంకోవర్ లో ఆగింది. స్వామీజీ అక్కడి నుండి షికాగోకి రైల్లో వెళ్ళారు.
ఇ) రైల్లో సాన్‌బోర్న్ “స్వామీజీ ! మీరెప్పుడైనా బోస్టన్ నగరానికి వస్తే దయచేసి మా ఇంటికి అతిథిగా వచ్చి మమ్మానందింప చేయండి” అని కోరింది.
అ) జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకున్నారు. అక్కడి భవంతులు, సాంకేతిక పరిజ్ఞానం చూసి, స్వామీజీ విస్తుపోయారు.

ప్రశ్న 7.
అ) రాత్రికి రాత్రి స్వామీజీ ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది. భారతీయ పత్రికలు కూడా ఈ వార్తను బాగా ప్రచురించాయి.
ఆ) సరస్వతీ దేవిని తలచుకొని, శ్రావ్యమైన కంఠంతో ” నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా !” అని స్వామి మొదలు పెట్టారు.
ఇ) జన సముద్రమంతా లేచి నుంచొని పులకించిపోయి కరతాళ ధ్వనుల వర్షం కురిపించారు.
ఈ) నా మతమే గొప్పది. నా మతమే నిలవాలి అనుకొనేవారు బావిలో కప్ప వంటివారని స్వామీజీ తెలిపారు.
జవాబు:
ఆ) సరస్వతీ దేవిని తలచుకొని, శ్రావ్యమైన కంఠంతో “ నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా !” అని స్వామి మొదలుపెట్టారు.
ఇ) జన సముద్రమంతా లేచి నుంచొని పులకించిపోయి కరతాళ ధ్వనుల వర్షం కురిపించారు.
ఈ) నా మతమే గొప్పది. నా మతమే నిలవాలి అనుకొనేవారు బావిలో కప్ప వంటివారని స్వామీజీ తెలిపారు.
అ) రాత్రికి రాత్రి స్వామీజీ ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది. భారతీయ పత్రికలు కూడా ఈ వార్తను బాగా ప్రచురించాయి.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 8.
అ) స్వామీజీకి సపరివారంగా సాష్టాంగ నమస్కారం చేసి స్వయంగా తన రథంలో కూర్చుండపెట్టారు.
ఆ) తన పవిత్ర భారత భూమిపై కాలు పెట్టగలుగుతున్నానని స్వామీజీ మనస్సు పొంగిపోయింది.
ఇ) రామనాడుకి రాజైన భాస్కర సేతుపతి, స్వామీజీకి ఎదురుగా వెళ్ళి తన తలపై కాలుమోపి, దిగమని తలవంచి ప్రార్థించారు.
ఈ) స్వామీజీని స్వాగతించడానికి స్వాగత కమిటీలు ఏర్పడ్డాయి.
జవాబు:
ఆ) తన పవిత్ర భారత భూమిపై కాలు పెట్టగలుగుతున్నానని స్వామీజీ మనస్సు పొంగిపోయింది.
ఈ) స్వామీజీని స్వాగతించడానికి స్వాగత కమిటీలు ఏర్పడ్డాయి.
ఇ) రామనాడుకి రాజైన భాస్కర సేతుపతి, స్వామీజీకి ఎదురుగా వెళ్ళి తన తలపై కాలుమోపి, దిగమని తలవంచి ప్రార్థించారు.
అ) స్వామీజీకి సపరివారంగా సాష్టాంగ నమస్కారం చేసి స్వయంగా తన రథంలో కూర్చుండపెట్టారు.

ప్రశ్న 9.
ఈ కింది వాక్యాలను సంఘటనల ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.
అ) వివేకానంద స్వామి వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది.
ఆ) జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకొన్నారు.
ఇ) ఆరేళ్ళ వయసులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలుపెట్టాడు.
ఈ) శ్రీరామకృష్ణులను కలిస్తే తనకు సమాధానం దొరుకుతుందేమోననే ఆశతో నరేంద్రుడు ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి ఆయన వద్దకు వెళ్లాడు.
జవాబు:
ఇ) ఆరేళ్ళ వయసులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలు పెట్టాడు.
ఈ) శ్రీరామకృష్ణులను కలిస్తే తనకు సమాధానం దొరుకుతుందేమోననే ఆశతో నరేంద్రుడు ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి ఆయన వద్దకు వెళ్లాడు.
ఆ) జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకొన్నారు.
అ) వివేకానంద స్వామి వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది.

ప్రశ్న 10.
ఈ కింది వాక్యాలను సంఘటనల ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.
అ) తన పవిత్ర భారతభూమిపై కాలుమోపుతున్నానని స్వామీజీ పొంగిపోయాడు.
ఆ) తండ్రి మరణంతో నరేంద్రుని జీవితం తెగిన గాలిపటమైంది.
ఇ) ‘నా అమెరికా దేశ సోదర, సోదరీ మణులారా …..’ అని స్వామీజీ ఉపన్యాసం ప్రారంభించాడు.
ఈ) నరేన్ బాల్యంలో పరుగు పెడుతున్న గుర్రాన్ని అదుపు చేసి ఒక స్త్రీని రక్షించాడు.
జవాబు:
ఈ) నరేన్ బాల్యంలో పరుగు పెడుతున్న గుర్రాన్ని అదుపు చేసి ఒక స్త్రీని రక్షించాడు.
ఆ) తండ్రి మరణంతో నరేంద్రుని జీవితం తెగిన గాలిపటమైంది.
ఇ) ‘నా అమెరికా దేశ సోదర, సోదరీ మణులారా ……’ అని స్వామీజీ ఉపన్యాసం ప్రారంభించాడు.
అ) తన పవిత్ర భారతభూమిపై కాలుమోపుతున్నానని స్వామీజీ పొంగిపోయాడు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వివేకానందుడు ఎప్పుడు, ఎక్కడ జన్మించాడు? తల్లిదండ్రులెవరు?
జవాబు:
నరేన్ అని, నరేంద్రనాథ్ దత్తా అని పూర్వాశ్రమంలో పేర్కొనబడిన వివేకానంద స్వామి కలకత్తాలో 1863 జనవరి 12వ తేదీన భువనేశ్వరీ దేవి, విశ్వనాథ దత్తా దంపతులకు జన్మించారు. విశ్వనాథ దత్తా మంచి పేరున్న వకీలు. భువనేశ్వరీ దేవి రూపంలోను, ప్రవర్తనలోను ఒక రాణి వలె ఉండేది.

ప్రశ్న 2.
వివేకానందుడు తనకు తాను పెట్టుకొన్న నియమాలేవి?
జవాబు:
స్వామీజీ ఎన్నోసార్లు తనకోసం తాను కొన్ని నియమాలు పెట్టుకునేవారు. ఎవరైనా పిలిచి ఆపితే తప్ప ఆగకుండా యాత్ర సాగిస్తూనే ఉండాలని, ఎవరైనా పిలిచి భిక్ష ఇస్తే తప్ప ఆహారం తీసుకోకూడదని ఇలాంటి కఠిన నియామాలెన్నో పాటించేవారు.

ప్రశ్న 3.
వివేకానంద స్వామి కల ఏమిటి?
జవాబు:
అమెరికా, భారతదేశాల మధ్య ప్రాక్పశ్చిమ సంబంధాలు పెరిగి, భారతదేశం పశ్చిమ దేశాలకు ధర్మము, ఆధ్యాత్మికతను బోధించాలని, వాళ్ళు భారతీయులకు సైన్సు, సాంకేతికత సంస్థలుగా కలిసి ఒకటిగా పనిచేయడం వంటివి నేర్పించాలనేది ఆయన కల.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 4.
వివేకానందుని గురువైన శ్రీరామకృష్ణుల స్వభావాన్ని గురించి రాయండి. . .
జవాబు:
వివేకానందుని గురువైన శ్రీ రామకృష్ణులు మహాశక్తి సంపన్నులే కాదు, ఆయన జీవితం పవిత్రతకు ప్రతిరూపం. ఆయన ఏమి ఆలోచించేవారో అదే చెప్పేవారు, ఏం చెప్పేవారో అదే చేసేవారు. వీటన్నింటికీ మించి నరేంద్రుని అతని తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించేవారు.

ప్రశ్న 5.
‘ఈ వ్యక్తి మేధస్సూ, పాండిత్యం మనదేశంలో గొప్ప గొప్ప పండితులందరి పాండిత్యాన్ని కలిపితే వచ్చే పాండిత్యం కన్న గొప్పది’ అని నరేంద్రుని గురించి ప్రొఫెసర్ జెహెచ్.రైట్ చెప్పిన విషయాన్ని బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
బోస్టన్లోని సాన్ బోర్న్ ఇంట్లో హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసరైన జె. హెచ్. రైట్ తో వివేకానందకు పరిచయమైంది. శాస్త్రీయమైన, తాత్త్వికమైన విషయాలెన్నో చర్చించుకున్నారు. వారిరువురు. షికాగో విశ్వమత మహాసభల అధ్యక్షుడికి వివేకానంద గూర్చి సిఫార్సు చేస్తూ “ఈ వ్యక్తి మేధస్సూ, పాండిత్యం మనదేశంలో గొప్ప గొప్ప పండితులందరి పాండిత్యాన్ని కలిపితే వచ్చే పాండిత్యం కన్న గొప్పది” అని రాశారు. ఈ మాటలను బట్టి వివేకానందుని పాండిత్య ప్రతిభ ప్రకటితం అవుతోంది. వివేకానంద శాస్త్రీయ, తాత్త్విక విషయ పరిజ్ఞానం గొప్పదని తెలుస్తోంది. ఇంకా ప్రొఫెసర్ రైట్ గొప్ప వ్యక్తిత్వం కూడా తెలుస్తోంది.

ఆ) క్రింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వివేకానందుడు, రామకృష్ణుల మధ్య జరిగిన తొలి సంభాషణను రాయండి.
జవాబు:
నరేంద్రునికి ఆధ్యాత్మికత ఇష్టం. మతం బోధించే చాలా విషయాల్లో అతడికి ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో స్పష్టంగా తెలియడం లేదు. స్నేహితుల సలహాతో శ్రీరామకృష్ణ పరమహంసను కలిశారు. తన సంశయాన్ని ప్రశ్నరూపంలో “అయ్యా! తమరు భగవంతుణ్ణి చూశారా?” అని అడిగాడు. దానికి సమాధానంగా “ఓ చూశాను. నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగా చూశాను. కావాలంటే నీకు కూడా చూపించగలను. కానీ, నాయనా ! భగవంతుడు కావాలని ఎవరు ఆరాటపడతారు ? భార్యాపిల్లలకోసం, ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు? ఎవరైనా సరే భగవంతుడి కోసం తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పక దర్శనమిస్తాడు. ఇది నిజం. నా అనుభవం” – అని గుండె పై చేయి వేసుకొని శ్రీరామకృష్ణులు సమాధానమిచ్చారు. ఇలా వారి తొలి సంభాషణ జరిగింది.

ప్రశ్న 2.
షికాగో విశ్వమత మహాసభల్లో స్వామి వివేకానంద చేసిన తొలి ప్రసంగం గూర్చి రాయండి.
జవాబు:
1893 సెప్టెంబరు 11వ తేదీన విశ్వమత మహాసభలు మొదలైనాయి. కొలంబస్ హాల్ అనే పెద్ద భవనంలో అవి జరిగాయి. వివేకానంద స్వామి ఇతర వ్యక్తులతో పాటు వేదికపై ముందు వరుసలో కూర్చున్నారు. స్వామివారిని పిలిచేసరికి లేచారు. సరస్వతీ దేవిని తలచుకొని, శ్రావ్యమైన ఆయన కంఠంతోను, అంతకంటే మధురమూ, పరమ పవిత్రమూ అయిన ఆయన హృదయాంతరాళాలలో నుండి వచ్చిన విశ్వమాన సౌభ్రాత్ర భావనతోను “నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా ……..” అని మొదలుపెట్టాడు. దాంతో ఆ జనసముద్రమంతా ఒక్కసారిగా లేచి నుంచొని కమ్మని ఆ పిలుపుకీ, ఇంద్రియగ్రహణము కాకపోయినా తమముందు మూర్తీభవించిన ఆ పవిత్రతకూ, ఏ నాగరికత పరిపూర్ణతకైనా చిహ్నమైన ఆ సన్యాస స్ఫూర్తికీ తమకు తెలియకనే పులకించిపోయి కరతాళ ధ్వనుల వర్షం కురిపించారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 3.
షికాగో నగరంలో ప్రముఖులు, ధనవంతులు స్వామీజీకి ఆతిథ్యం ఇచ్చిన సందర్భంలో ఆయన మానసిక స్థితిని రాయండి.
జవాబు:
షికాగో నగరంలో వివేకానంద స్వామీజీకి ఇచ్చిన వసతులు ఆయనకు తృప్తినివ్వకపోగా గుండెను ఎవరో రంపంతో కోసినట్లయింది. “అయ్యో ! నా భారతదేశ ప్రజల్లో అధికభాగం తినడానికి తిండిలేక, కట్టుకోడానికి బట్టలేక అలమటిస్తూంటే ఇక్కడ వీళ్ళు డబ్బుల్ని నీళ్ళలా ఖర్చు పెడుతున్నారే ! వీరికి ఉన్న సదుపాయాల్లో కొన్నైనా నా వారికి లేవే! అటువంటప్పుడు నాకెందుకీ హంసతూలికా తల్పాలు? ఎవరిక్కావాలి ఈ ధనం, కీర్తి ప్రతిష్ఠ? అమ్మా జగజ్జననీ, నేనివేవీ అడగలేదే ? వాకివేవీ వద్దు. నా దేశ ప్రజల అన్నార్తినీ, జ్ఞానార్తినీ తీర్చు. వారిని మేల్కొలుపు. వారిని మనుష్యులను చేసి తమ కాళ్ళపై తాము నిలబడి తామూ ఏదైనా సాధించగలమనే విశ్వాసాన్ని కలుగజేయి అంటూ రోదిస్తూ నేలకు వాలి అక్కడే శయనించారు.

ప్రశ్న 4.
స్వామి వివేకానంద పాత్ర స్వభావాన్ని రాయండి.
జవాబు:
వివేకానందుడికి బాల్యంలో నరేంద్రుడు అని పేరు ఉండేది. వివేకానందుడు సాహసవంతుడైన బాలుడు. పరుగు పెడుతున్న బండిలోకి ఎక్కి ఒకసారి బండిలోని స్త్రీని రక్షించాడు. నరేంద్రుడు అల్లరి పిల్లవాడు. ‘శివశివా అంటూ నెత్తిపై నీళ్ళు పోస్తే శాంతించేవాడు.’

బాల్యంలో తల్లి నుండి భారత భాగవత రామాయణ కథలు విన్నాడు. రాముడన్నా, రామాయణమన్నా నరేంద్రుడికి ఎంతో ప్రేమ. ఆటలంటే బాగా ఇష్టం. మంచి జ్ఞాపకశక్తి కలవాడు. ‘రాజు – దర్బారు’ ఆట అంటే బాగా ఇష్టం. రామకృష్ణ పరమహంసను గురువుగా స్వీకరించి, సన్యాసం స్వీకరించాడు. భారతదేశమంతా పర్యటించాడు. వివేకానంద అనే పేరుతో అమెరికాలోని విశ్వమత మహాసభలో పాల్గొని, భారతీయ ధర్మం అన్ని మతాల్ని అంగీకరిస్తుందన్నారు.

వివేకానందుడి ఖ్యాతి ప్రపంచం అంతా వ్యాపించింది. విదేశాల నుండి తిరిగి వచ్చిన స్వామికి భారతదేశం బ్రహ్మరథం పట్టింది. వివేకానంద స్వామి యువకులకు సందేశం ఇచ్చాడు. యువకులకు ప్రేమ, నిజాయితీ, సహనం ముఖ్యమన్నారు.

లేవండి! మేల్కొనండి! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలను అనుసరించండని వివేకానంద యువకులకు సందేశం ఇచ్చారు.

ప్రశ్న 5.
లేవండి ! మేల్కొనండి ! అంటూ జాతిని జాగృతం చేసిన వివేకానంద యువతకు ఇచ్చిన సందేశం ఏమిటి?
జవాబు:
ఇప్పటి యువకుల మీద, వారి ఆధునికత పైన పరిపూర్ణమైన విశ్వాసం ఉంది అంటూ వివేకానంద యువకులకు ఇలా సందేశం ఇచ్చారు. సాహసికులైన యువకులారా ! మీకు కావల్సినవి మూడే విషయాలు. అవి ప్రేమ, నిజాయితీ, సహనం. ప్రేమించలేని మానవుడు జీవన్మృతుని కింద పరిగణింపబడతాడు. నిరుపేదలను, అమాయక ప్రజలను, అణగదొక్కబడిన వారిని ప్రేమించండి. వారికొరకు వేదన చెందండి. పరితపించండి. పిరికితనాన్ని విడనాడండి. ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. దీనజనుల కోసం శ్రమించండి. వారిని ఉద్దరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి. సహనంతో వ్యవహరించడమే సత్ఫలితాలను సాధిస్తుందని మరవకండి. లేవండి ! మేల్కొనండి ! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలననుసరించండి.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 6.
వివేకానందుడు జాతికిచ్చిన సందేశాన్ని బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
“భారతీయ ధర్మం అన్ని మతాల్ని అంగీకరిస్తుంది, గౌరవిస్తుంది. అన్ని మతాలూ సత్యాలే, అవన్నీ భగవంతుని చేరుకోవడానికి మార్గాలు” అని స్వామీజీ చెప్పిన మాటలు అమెరికా ప్రజలనే కాదు యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాయి. ఎవరూ మతం మార్చుకోనవసరం లేదనీ, నా మతం గొప్పది, నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్ప వంటి వారనీ స్వామీజీ చెప్పిన మాటలు అక్షరసత్యాలు. మతం తల్లి లాంటిది. తల్లి మనసే అర్థం కానప్పుడు మనం మనుగడ ఎలా సాగిస్తాం ? ఇదేమి స్వార్ధ రాజకీయం కాదుగా ? కప్పలాగా అటూ ఇటూ గెంతడానికి.

సభలోని మిగతా వక్తలు తమతమ మతాలకు ప్రాతినిధ్యం వహిస్తే, స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరుఫునా మాట్లాడి నిజమైన మత సామరస్యాన్ని చూపారు. సదస్యులందరికి స్వామీజీ ప్రసంగమే నచ్చింది. ఎక్కడైనా నలుగురి గురించి ఆలోచించేవారే మన్నన పొందుతారు అనడానికి ఇదే నిదర్శనం.

జాతి, మత తారతమ్యం కూడదనీ, ధనిక, పేద వివాదం లేకుండా అందరూ నా సహోదరులేనని చాటాలి, ప్రతి ఒక్కరూ తనకోసం కాక, దేశం గూర్చి ఆలోచించాలన్నారు. స్త్రీ జనోద్ధరణ, విద్యావ్యాప్తి సక్రమంగా సాగాలన్నారు. పరిశోధనలు కూడా వాడుకభాషలో నిర్వహించాలన్నారు. యువతకు ‘ప్రేమ, నిజాయితీ, సహనం’ కావాలన్నారు. పిరికితనం విడిచి ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. దీన జనులను ఉద్దరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయని మరువకండి. శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలు అనుసరించండి” అంటూ ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కల్గించే వివేకానందుని స్ఫూర్తిదాయకమైన మాటలు అప్పటికే కాదు ఇప్పటికీ ప్రేరణ కల్గించేవని నేను గ్రహించాను.