AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions 8th Class Telugu లేఖలు Notes, Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu లేఖలు

1. విహార యాత్రను వివరిస్తూ తండ్రికి లేఖ :
జవాబు:

ఏలూరు,
x x x x x

పూజ్యులైన నాన్నగారికి నమస్కారములు.

నేను క్షేమంగానే ఉన్నాను. అక్కడ అందరూ క్షేమమని తలుస్తాను. ఇటీవల నేను నా మిత్రులతో కలిసి హైదరాబాదు విహారయాత్రకు వెళ్ళి వచ్చాను. ఆ విశేషాలు ఈ లేఖలో తెలియజేస్తున్నాను.

గడచిన బుధవారం సాయంకాలం ఏలూరులో రైలు ఎక్కి తెల్లవారేసరికి హైదరాబాదు చేరాం. అక్కడ కార్యక్రమాలన్నీ ముగించుకొని నగరదర్శనానికి బయలుదేరాం.

ఆ నగర శోభను చూస్తుంటే నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఎక్కడ చూసినా ఫ్లెఓవర్ బ్రిడ్జీలు చూడముచ్చటగా ఉన్నాయి. ట్యాంక్ బండ్ పై గల విగ్రహాలు చూపరులను అట్టే ఆకర్షించేలా ఉన్నాయి.

ముఖ్యంగా సాలార్‌జంగ్ మ్యూజియం, నెహ్రూ జంతుప్రదర్శనశాల, చార్మినార్, బిర్లామందిర్, పబ్లిక్ గార్డెన్స్, రామోజీ ఫిల్మ్ సిటీ, గోలకొండ కోట వంటివి యాత్రికులను బాగా ఆకర్షిస్తాయి. రెండు రోజులపాటు అక్కడి దర్శనీయ స్థలాలను చూసి మరల రైలులో సరదాగా పాటలు పాడుకొంటూ జోక్స్ వేసుకొంటూ కాలం తెలియకుండా తిరుగు ప్రయాణం చేశాం. అమ్మగారికి నా నమస్కారాలు.

ఇట్లు,
తమ కుమారుడు,
రాళ్ళబండి సిద్ధార్థ.

చిరునామా :
శ్రీరాళ్ళభండి శ్రీనివాస్ గారు,
కానూరు,
పెనమలూరు మండలం, కృష్ణాజిల్లా.

2. వార్షికోత్సవమును గూర్చి మిత్రునకు లేఖ :
జవాబు:

అమలాపురం,
x x x x x

ప్రియ మిత్రుడు శ్రీరాంకుమార్‌కు,

ఇక్కడ మేమంతా కుశలంగా ఉన్నాం. అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. గడచిన బుధవారం మా పాఠశాల వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. పాఠశాలంతా రంగురంగుల తోరణాలతో అలంకరించాం. సాయంత్రం 6 గం||లకు సభ ప్రారంభింపబడింది. ఆ సభకు మా ప్రాంత ఎం.ఎల్.ఏ. గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ప్రధానోపాధ్యాయుడు పాఠశాల నివేదిక చదివి వినిపించారు. ముఖ్య అతిథిగారు విద్యార్థులంతా బాగా చదువుకోవాలని చక్కని సందేశం ఇచ్చారు. ఆటల పోటీలలోనూ, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలోనూ గెలుపొందిన వారికి బహుమతులు పంచిపెట్టబడ్డాయి. ఆ తరువాత పిల్లలచే నాటికలు వేయబడ్డాయి.

మీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం గూర్చి వ్రాయగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
వి. దిలీప్ కుమార్.

చిరునామా :
గార్లపాటి శ్రీరాంకుమార్,
10వ తరగతి,
ఎస్.పి.వి.కె.ఆర్. హైస్కూలు,
దొమ్మేరు – ప.గో.జిల్లా, పిన్ : 534 351.

AP Board 8th Class Telugu లేఖలు

3. సందర్శించిన ఒక ప్రదేశాన్ని గూర్చి వివరిస్తూ మిత్రునికి లేఖ.
(లేదా)
చూసిన విజ్ఞానయాత్రా విశేషాలను వివరిస్తూ మిత్రునికి లేఖ.
జవాబు:

హైద్రాబాదు,
x x x x x

ప్రియ మిత్రుడు శంకరు,

నేను క్షేమంగా ఉన్నాను. మీరంతా క్షేమమని తలుస్తాను. నేను ఇటీవల ఆగ్రా వెళ్ళివచ్చాను. అక్కడి విశేషాలు నీకు వివరిస్తాను.

ఆలో ముఖ్యంగా చూడదగ్గది తాజ్ మహల్. షాజహాన్ దంపతుల పవిత్ర ప్రణయానికి శాశ్వత చిహ్నమే తాజమహల్. దాన్ని చూసి నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. అది ఒక ఎత్తైన వేదిక మీద ఉన్న చలువరాతి కట్టడం. దానికి నాలుగువైపులా నాలుగు చంద్రకాంత శిలా స్తంభాలున్నాయి. ప్రధాన భవనం లోపల గోడలు మణులతో చెక్కబడి ఉన్నాయి. యమునా నదీతీరంలో ఉన్న ఆ తాజ్ మహల్ సౌందర్యం చూసి ఆనందించవలసిందే గాని చెప్పడానికి వీలుకాదు. అందుకే ప్రపంచంలోని ఏడు వింతలలో తాజ్ మహల్ కూడా చోటు చేసుకుందని చెప్పవచ్చు. నీవు కూడా అవకాశం దొరికినప్పుడు తాజ్ మహల్ తప్పక చూడవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
ఆర్ శ్రీనివాస్.

చిరునామా :
కె. శంకరరావు,
S/O సత్యనారాయణరావు గారు,
ఆర్.ఆర్. నగర్,
విజయవాడ – 520 012.

4. మీ వీధిలో పారిశుధ్య పరిస్థితిని (అపరిశుభ్రతను) గూర్చి వివరించుచు సంబంధిత అధికారికి లేఖ వ్రాయుము.
జవాబు:

పామర్రు,
x x x x x

మున్సిపల్ ఆరోగ్యశాఖాధికారి గారికి నమస్కరించి మోహన్ వ్రాయు విన్నపము.

అయ్యా,
నేను కరణం గారి వీధిలో నివాసం ఉంటున్నాను. మా వీధిలో ఎక్కడ చూసినా చెత్త, దుమ్ము, మురికి ప్రత్యక్షమవుతాయి. చెత్త పారెయ్యడానికి చెత్త కుండీలు లేవు. మురికినీరు కాలువలు నిండిపోయి రోడ్డుమీదే ప్రవహిస్తుంది. ఇక దుర్గంధం చెప్పడానికి వీలులేదు. ఆ మురికి వల్ల దోమల బాధకూడా ఎక్కువైంది. దీనివల్ల మలేరియా సోకే ప్రమాదముంది. కాబట్టి మావీధి పారిశుధ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవల్సిందిగా ప్రార్థిస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
వి.యస్. మోహన్.

చిరునామా :
ఆరోగ్యశాఖాధికారి గారు,
పురపాలక సంఘ కార్యాలయం,
పామర్రు, కృష్ణాజిల్లా.

AP Board 8th Class Telugu లేఖలు

5. నచ్చిన రాజకీయ నాయకుని గురించి మిత్రునికి లేఖ :
జవాబు:

నెల్లూరు,
x x x x x

ప్రియ స్నేహితురాలు పద్మకు,

నేను క్షేమముగా ఉన్నాను. నీ క్షేమసమాచారములు తెలుపగలవు. నీవు ఈ మధ్య నాకు వ్రాసిన ఉత్తరములో నాకు నచ్చిన రాజకీయ నాయకుని గురించి వ్రాయమన్నావు కదా ! అందుకే ఈ లేఖ వ్రాయుచున్నాను.

నాకు నచ్చిన రాజకీయ నాయకుడు భారత మాజీ ప్రధాని, ‘భారతరత్న’ అవార్డు గ్రహీత శ్రీ మొరార్జీ దేశాయ్. భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనిన మహోన్నత నాయకులలో ఆయన ఒకరు. గాంధీజీ ఆదర్శాలకోసం జీవితాంతము పాటుబడిన వ్యక్తి మొరార్జీ. ఉన్నతమైన విలువలు, ఆదర్శమైన విధానాలకు కట్టుబడిన వ్యక్తిగా మొరార్జీ ప్రపంచ ప్రఖ్యాతి పొందినారు. మొరార్జీ ఏనాడు పదవులను ఆశించలేదు, పదవులే ఆయనను జీవితాంతం ఆశించినాయి. నైతిక విలువలకు మొరార్జీ గొప్ప ఉదాహరణ. అందులకే ఆయన అంటే నాకు ఎంతో ఇష్టము.

ఇట్లు,
నీ స్నేహితురాలు,
పి. శశికళ.

చిరునామా :
వి. పద్మ,
10వ తరగతి, బాలికోన్నత పాఠశాల,
నరసరావుపేట, గుంటూరు జిల్లా.

6. మీ పాఠశాలలో జరిగిన జాతీయ పండుగను గూర్చి మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

చెరుకూరు,
x x x x x

ప్రియ మిత్రుడు ప్రవీణ్ కుమార్‌కు,

ఇక్కడ మేమంతా కుశలంగా ఉన్నాం. అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. ఇటీవల మా పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ‘ఫిబ్రవరి 21 న బ్రహ్మాండంగా జరిగింది. పాఠశాలంతా చక్కనైన సూక్తులు రాసిన చార్టులు తగిలించి, అలంకరించాం. మన మాతృభాషను కాపాడిన, కాపాడుతున్న ఎందరో మహనీయులైన వారి చిత్రపటాలు సేకరించి, ప్రదర్శనగా ఉంచాం. ప్రక్కనే వారు మాతృభాష కోసం చేసిన కష్టాన్ని క్లుప్తంగా రాసి, ఉంచాం. గిడుగు, గురజాడ వంటి మహనీయులకు పెద్దపీట వేసాం. ఆ సభకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త “ఆర్ష విద్యాసాగర్, మధురభారతి” శ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిని ఆహ్వానించాం. వారి ఉపన్యాసం ఎలా సాగిందంటే బీడునేల మీద వాన చినుకులు పడిన విధంగా మమ్మల్ని ఉత్తేజితులను చేసింది. ఆ తర్వాత మాలో కొంతమంది మాతృభాష గొప్పదనాన్ని గురించి మాట్లాడారు. అలాగే మీ పాఠశాలలో జరిగిన విశేషాలను లేఖ వ్రాయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
డి. ప్రవీణ్ కుమార్,
8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
బాపట్ల, గుంటూరు జిల్లా.

7. ఇటీవల మీ పాఠశాలలో నిర్వహించబడిన ‘అమ్మకు వందనం’ కార్యక్రమంలోని విశేషాలను తెలుపుతూ మీ సోదరికి లేఖ రాయండి.
జవాబు:

లేఖ

చెరుకూరు,
x x x x x

ప్రియమైన పద్మావతి అక్కకు,

మేము ఇక్కడ క్షేమం. మీరు అక్కడ క్షేమమని తలుస్తాను. నేను బాగా చదువుతున్నాను. ఇటీవల మా పాఠశాలలో ‘అమ్మకు వందనం’ అనే కార్యక్రమం జరిగింది. దానిలో భాగంగా ప్రతి విద్యార్థి తల్లిని
పిలిపించారు. ఆ తల్లులకు వారి పిల్లల చేత కాళ్ళు కడిగించి, పాదాల మీద పూలు వేసి, నమస్కరించమన్నారు. మేమంతా అట్లా చేసి, అమ్మల ఆశీస్సులు తీసుకొన్నాము. నేను, మరికొంతమంది విద్యార్థులు అమ్మ గొప్పదనాన్ని గురించి మాట్లాడాము. అమ్మ కళ్ళలో ఏదో తెలియని ఆనందం కనిపించింది. దానిని ఎప్పుడూ పోకుండా చూసుకోవాలని అనుకున్నాను. బావగారు, పిల్లలు ఏం చేస్తున్నారు ? అందరినీ అడిగానని చెప్పు.

ఇట్లు,
నీ తమ్ముడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
ఎస్. పద్మా వతి,
W/o ఎస్. పూర్ణచంద్ర,
ఒంగోలు, ప్రకాశం జిల్లా.

AP Board 8th Class Telugu లేఖలు

8. మామూలు వాక్యాలు కూడా సరైన పదాలు జోడించి అందంగా వివరిస్తూ రాస్తే వర్ణనాత్మక వాక్యాలు అవుతాయి కదా! అలాగే మీరు కూడా మంచి పదాలతో మీకు నచ్చిన ఒక కథను వర్ణిస్తూ రాయండి.
జవాబు:
వర్ణనాత్మక కథ :

ప్రేమే పరమాన్నం

ఆప్యాయతతో ఆదరించిన వారింట పచ్చడన్నం తిన్నా తృప్తిగా ఉంటుంది. అదే ప్రేమ నటిస్తూ పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా ఆ భోజనం రుచించదు. అంటే నిజమైన రుచి వంటకంలో లేదు. వండి వడ్డించిన వారి మనసులో ఉంది. దానికి ఉదాహరణే ఈ కథ.

పాండవులు పాచికల ఆటలో మోసపోయి 12 యేండ్లు అడవుల్లో, ఒక యేడాది మారువేషాల్లో బతికి అరణ్య, అజ్ఞాత వాసాలు పూర్తి చేసుకొన్నారు. తిరిగి రాజ్యాన్ని అప్పగించమంటూ కృష్ణుడి ద్వారా కౌరవులకు రాయబారం పంపారు పాండవులు. అప్పుడు కృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళగా, దుర్యోధనుడు శ్రీకృష్ణుణ్ణి మచ్చిక చేసుకొని, తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నించి, కపట ప్రేమను ఒలకబోస్తాడు. కానీ కృష్ణుడు తాను కౌరవుల అతిథిగా రాలేదని, పాండవుల రాయబారిగా వచ్చానని చెబుతాడు. ఆ రాత్రి బసకు ధృతరాష్ట్రుని మంత్రి విదురుని ఇంటికి వెళతాడు. ఆయన భోగభాగ్యాల లాలస లేక నిరాడంబర జీవితాన్ని గడుపుతుంటాడు. తన ఇంటి తలుపు తట్టిన కృష్ణుని చూసి నివ్వెరపోయాడు. అంతులేని ఆనందంతో చేతులు జోడించాడు. అపరిమితమైన ప్రేమతో స్వాగతం పలికాడు.

శ్రీకృష్ణునికి పాదపూజ చేస్తాడు. ఆకలిగా ఉందన్న ఆయనకు అరిటాకు వేసి, ఇంటిలో ఉన్న కొన్ని అరటిపళ్ళు పెడతాడు విదురుడు. శ్రీకృష్ణునికి భక్తిపూర్వక నైవేద్యంగా ప్రేమతో వడ్డించింది ఆ ఇంటి ఇల్లాలు. విదురుడు వింజామరతో విసురుతున్నాడు. వారి ఆదరాభిమానాలకు వాసుదేవుడు కరిగిపోయాడు. ఆ దంపతులు భక్తి పారవశ్యంలో కృష్ణుణ్ణి చూస్తూ అరటిపండ్లు ఒలిచి పండును పక్కన పెట్టి తొక్కను ఇస్తుంటే వాటినే ఆరగించాడు ఆ పరమాత్మ. తర్వాత గమనించిన దంపతులు తేరుకొని మన్నించమని ప్రార్థిస్తారు. భక్తులకు తాను దాసుణ్ణని, వారు మనసు పెట్టి సమర్పించింది ఏదైనా సరే స్వీకరిస్తానని చెప్తాడు.

ఎదుటి వారికి ఇచ్చేది ఏదైనా సరే అణకువతో ఇవ్వాలి. అహంకారం లేని సమర్షణను ఆనందంగా స్వీకరించడానికి భగవంతుడైనా నిరుపేద ముంగిటికి వస్తాడు. తన భక్తులు తనకేమిచ్చారో చూడకుండా ఎలా ఇచ్చారన్న దానికే పెద్దపీట వేస్తాడు.