SCERT AP State 7th Class Telugu Textbook Solutions 10th Lesson ప్రకటన Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 10th Lesson ప్రకటన

7th Class Telugu 10th Lesson ప్రకటన Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ఇలాంటి ప్రకటనలు ఎప్పుడైనా చూశారా? ఎక్కడ చూశారు?
జవాబు:
ఇలాంటి ప్రకటన నేను చూడలేదు. కాని మా ప్రక్క ఇంటివారి ‘కుక్కపిల్ల’ తప్పిపోయినపుడు పత్రికలో ఇలాంటి ప్రకటన ఇచ్చారు. బహుమతిగా దానిని తెచ్చి ఇచ్చిన వారికి రూ. 200 ఇస్తామని మా ప్రక్క ఇంటివారు ప్రకటించారు.

ప్రశ్న 2.
ఈ ప్రకటన ఎవరి కోసం?
ఈ ప్రకటన “శాంతి కపోతం” కోసం.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ప్రశ్న 3.
ప్రకటనలోని కపోతాన్ని వెతకడానికి నీవేం చేస్తావు?
జవాబు:
అమెరికా ప్రెసిడెంటుకూ, రష్యా ప్రధానమంత్రికీ దేశాల మధ్య కలతలు సృష్టించవద్దని శాంతిలేఖలు పంపిస్తాను.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
ఈ కవితను భావయుక్తంగా చదవండి. సారాంశాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
సాధన చేసి చదవండి.
పాఠ్యభాగ సారాంశం :
ఎవరికీ రైలు టిక్కెట్లు ఇవ్వకండి. రైళ్ళను ఆపివేయండి. ‘గుళ్ళ పూజలు చేయించండి. రేడియోల్లో ప్రకటనలు చేయండి. అన్నిచోట్లా జాగ్రత్తగా వెతకండి. సైన్యాన్ని, కాపలా పెట్టండి. రాకెట్లను అన్ని గ్రహాలకూ పంపండి. కాలిముద్రలు, వేలిముద్రలు పరిశీలించండి.

జనం గుంపులు గుంపులుగా వస్తూ భయంతో గుసగుసలాడుతున్నారు. స్వార్థం ఉన్నవాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. ఒప్పందాల కాగితాలు చింపేస్తున్నారు. సిద్ధాంతాల చర్చలు ఆగిపోయాయి.

ఇంక చరిత్రలు ఎవరూ రాయనక్కర లేదు. ఎవరూ పాలించనక్కరలేదు. అణుబాంబు ప్రజల్ని నాశనం చేసే ముహూర్తం, దగ్గరకు వచ్చేసింది. మనం మనజాతిని కాపాడుకోవాలంటే, పరారీ అయిన శాంతిని వెతికి తీసుకురావాలి. జయజయ ధ్వనులు చేస్తూ కదలండి.

శాంతి చక్కని తల్లి. ఆమె మన చెల్లి. ఆమె కళ్ళల్లో జాలి ఉంటుంది. ఆమె ముఖంలో చిరునవ్వు ఉంటుంది. ఆమె జడలో గులాబి పువ్వు ఉంటుంది. ఆమె ప్రజల మేలునే ఎప్పుడూ కోరుతుంది. తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది.

ప్రశ్న 2.
మీరు ప్రకటనలు ఎక్కడెక్కడ విన్నారు? ఇవి వేటికి సంబంధించినవి.
జవాబు:
జాతరలలో, తీర్థాలలో పిల్లలూ, ముసలివారూ తప్పిపోతే పేపర్లలో, రేడియోలలోనూ, టీవీలలోనూ ప్రకటనలు ఇస్తారు. ఉద్యోగాల ఖాళీలను గూర్చి ప్రకటిస్తారు. కళాశాలలో సీట్ల ఖాళీలను ప్రకటిస్తారు. పరీక్ష ఫలితాలు ప్రకటిస్తారు. ధరల ప్రకటన ఉంటుంది. ప్రభుత్వం తాను చేసే కార్యక్రమాలను గూర్చి ప్రకటిస్తుంది. సభలను గూర్చి, అక్కడకు వచ్చే అతిథులను గూర్చి ప్రకటనలు ఇస్తారు. వర్తకులు, వ్యాపారులు తమ వద్ద ఉన్న సరకులను గురించి, ధర వరలను గురించి ప్రకటనలు చేస్తే నేను విన్నాను.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ప్రశ్న 3.
ప్రకటనలు ఎన్ని రకాలుగా ఉంటాయి? మీకు ఇష్టమైన ఏదైనా ఒక ప్రకటనను గురించి చెప్పండి. అది ఎందుకు ఇష్టమైందో వివరించండి.
జవాబు:
ఉద్యోగ ప్రకటనలు, కొత్త సినిమాలు, కళాశాలల్లో సీట్ల వివరాలు, విశ్వవిద్యాలయాల్లో వివిధ కోర్సుల ప్రకటనలు, వస్తువుల అమ్మకాలను గురించి ప్రకటనలు, పెళ్ళి కావలసిన వధూవరుల గురించి ప్రకటనలు ఉంటాయి. నాకు కొత్త సినిమాలను గురించి ఇచ్చే ప్రకటనలు అంటే చాలా ఇష్టం. సినిమాలలో మంచి హాస్యం ఉంటుంది. అందుకే ఆ సినిమా ప్రకటనలంటే నేను ఇష్టపడతాను. …

II. చదవడం – రాయడం

ప్రశ్న 1.
పాఠం చదవండి. కింది వాటిని పాఠంలో గుర్తించండి.

అ) ఆపివేయండి – పంపించండి – ప్రకటించండి – పరిశీలించండి.
జవాబు:
రైళ్ళు ఆపివేయండి. కేబుల్ గ్రామ్స్ పంపించండి. ఆకాశవాణిలో విషయం ప్రకటించండి. నిశితంగా పరిశీలించండి.

ఆ) గుసగుసలాడుతున్నారు – బాదుకుంటున్నారు – చింపేస్తున్నారు. ఇలాంటి పదాలు గల వాక్యాలను గుర్తించండి – వాటి కింద గీత గీయండి.
జవాబు:

  1. కంగారుగా భయంతో గుసగుసలాడుతున్నారు.
  2. స్వార్థ జీవనులు గభాలున టొమ్ములు బాదుకుంటున్నారు.
  3. సిరా ఇంకకుండానే అగ్రిమెంట్లు చింపేస్తున్నారు.
  4. ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు.

ప్రశ్న 2.
కవితలో శాంతిని గురించి వర్ణించిన పంక్తులు చదవండి. వాటి కింద గీత గీయండి.
జవాబు:
“అపార కృపాతరంగితాలైన నయనాంచలాలు
ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు
సంస్కారపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబి
సదా ప్రజాహితైషిణి సుభాషిణి గర్వంలేని రాణి
కల్లనీ క్రౌర్యాన్నీ కాలుష్యాన్ని తిరస్కరిస్తుంది
తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది
చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి”.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ప్రశ్న 3.
పాఠం చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) జాతిని కాపాడుకోవడానికి కవి ఏం చేయాలన్నారు?
జవాబు:
మనం మన జాతిని కాపాడుకోవాలంటే, ఒక్కటే మార్గం ఉందని కవి చెప్పాడు. పరారీ అయిన శాంతిని వెతికి తీసుకురావాలని చెప్పాడు. అంతకంటే మరోదారిలేదనీ, జై అంటూ శాంతిని వెదకడానికి కదలండనీ ప్రజలకు – కవి పిలుపునిచ్చాడు.

ఆ) కవి దేనికోసం వెతకమన్నారు? ఎక్కడెక్కడ వెతకమన్నారు?
జవాబు:
కవి పరారీ అయిన శాంతి కోసం వెతకమన్నారు. దాని కోసం కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో, కర్మాగారాలలో, సముద్ర తీరాలలో, నదీ జలాలలో వెతకమన్నారు. రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపి, అడుగుజాడల్నీ, వేలిముద్రల్నీ పరీక్షించమన్నారు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలతో సమాధానాలు రాయండి.

అ) ‘ప్రకటన’ అంటే ఏమిటి? ప్రకటనలు ఎందుకోసం?
జవాబు:
‘ప్రకటన’ అంటే వెల్లడి చేయడం. పదిమందికీ విషయాన్ని తెలపడం కోసం ప్రకటనలు చేస్తారు. పన్నులు ఫలానా తేదీ లోపల చెల్లించాలని, మున్సిపల్ కమిషనరు మైకు ద్వారా ప్రకటన చేస్తాడు. రేషను సరుకులు వచ్చాయనీ, వాటిని ఫలానా తేదీ నుండి పంపిణీ చేస్తారనీ దుకాణం దారులు ప్రకటన చేస్తారు. చౌకగా బట్టలు అమ్ముతున్నామని బట్టల వర్తకులు ప్రకటిస్తారు. ఈ విధంగా ప్రచారం చేసుకోవడం కోసం, ప్రకటనలు చేస్తారు. తప్పిపోయిన వారిని గూర్చి కూడా ప్రకటన ఇస్తారు.

ఆ) ఈ’ పాఠానికి మరొక శీర్షికను సూచించండి. దానికి మూడు కారణాలు తెలపండి.
జవాబు:
ఈ పాఠానికి మరో శీర్షిక “శాంతి పావురం”.

  1. ఈ పాఠంలో శాంతి లేకపోతే వచ్చే అలజడిని వర్ణించారు.
  2. ‘శాంతి’ స్వరూపాన్ని వర్ణించారు.
  3. జాతిని రక్షించుకోవడానికి శాంతిని వెదకడమే ఏకైక మార్గము అని కవి చెప్పాడు. కాబట్టి ఈ పాఠానికి ‘శాంతి పావురము’ పేరు బాగుంటుంది.

ఇ) ఆకాశవాణి, దూరదర్శన్లలో ఏ ఏ ప్రకటనలు వస్తాయి?
జవాబు:

  1. వీటిలో ముఖ్యంగా ఆనాడు వచ్చే కార్యక్రమాల ప్రకటనలు ఉంటాయి.
  2. ముఖ్యమైన కార్యక్రమాలు ఏ సమయంలో ఏ రోజు వస్తాయో ప్రకటిస్తారు.
  3. ప్రభుత్వం చేసే ప్రకటనలు ఉంటాయి.
  4. తమకు కావలసిన కళాకారులను గూర్చి వారు ప్రకటనలు ఇస్తారు.
  5. అప్పుడప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలను గూర్చి, దరఖాస్తు పెట్టుకొనే తీరును గూర్చి ప్రకటనలు ఉంటాయి.
  6. తప్పిపోయిన వారిని గూర్చి ప్రకటనలు ఉంటాయి.
  7. తుపాన్లు వంటి సమయాలలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రకటనలు ఉంటాయి.

ఈ) “ప్రకటన” పాఠం గురించి మీ అభిప్రాయాలు తెల్పండి.
జవాబు:
‘బాలగంగాధర తిలక్’ గొప్ప భావుకుడైన మహాకవి. తిలక్ వచన గేయాలు తెలుగు కవితకు మణిహారాలు. ఈ కవితలో కవి “శాంతి” అవసరాన్ని నొక్కి చెప్పాడు. యుద్దాలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించాడు. తప్పిపోయిన వారిని ఎలా వెతకాలో ఎక్కడ వెతకాలో చెప్పాడు. దేశాల మధ్య జరిగిన ఒడంబడికలను వారు పాటించకపోవడాన్ని విమర్శించాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) తిలక్ ప్రకటన కవితకు నేపథ్యం ఏమిటి? ఈ కవిత రాయడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది?
జవాబు:
తిలక్ ఈ కవిత రాసేనాటికి రెండు ప్రపంచ యుద్ధాలు, ఆర్థిక మాంద్యం, అంతర్యుద్ధాలు, ప్రచ్ఛన్నయుద్ధ వ్యూహాలను పన్నుతున్న రెండు అగ్రరాజ్యాల మధ్య పోటీ వంటి అంతర్జాతీయ అంశాలు ఉన్నాయి.

భారతదేశంలో జరిగిన స్వాతంత్ర్య ఉద్యమపోరాటం, విముక్తి, కరవులు వంటి స్థానిక విషయాలు ఉన్నాయి. . తిలక్ వీటిని పరిశీలించి ఈ కవిత రాశారు. ఇవే ఈ కవితకు నేపథ్యం.

ప్రపంచంలో అశాంతి పోవాలంటే, అణుయుద్ధ భయం పోవాలంటే, శాంతి ఒక్కటే మార్గమని, చెప్పడమే ఈ కవిత రాయడానికి గల ప్రధాన కారణం.

ఆ) తిలక్ శాంతి అనే స్త్రీని ఏ విధంగా వర్ణించాడు?
జవాబు:
శాంతి చల్లని తల్లి. చక్కని చెల్లి. ఆమె కనుగొలకులు దయతో నిండి ఉంటాయి. ఆమె ముఖంలో సంతోషం పొంగే చిరునవ్వు పరిమళాలు ఉంటాయి. ఆమె కొప్పులో ప్రేమ గులాబి ఉంటుంది. ఆమె ప్రజల హితాన్ని కోరుతుంది. చక్కగా మాట్లాడుతుంది. ఆమె గర్వంలేని రాణి. ఆమె అసత్యాన్ని, క్రూరత్వాన్ని, మాలిన్యాన్ని ఖండిస్తుంది. తెల్లని పావురాన్ని సరదాగా ఎగరేస్తుంది.

IV. పదజాలం

1. గీత గీసిన పదాలకు సమానమైన అర్థమిచ్చే పదాలు పాఠంలో ఉన్నాయి. వాటిని వెతికి ఎదురుగా రాయండి.

అ) సాగరంలో అలలు ఎగసిపడుతున్నాయి.
జవాబు:
1. సముద్రము
2. పారావారము

ఆ) ఆయుధాలు ధరించిన సైనికులు సరిహద్దుల్లో కాపలాకాస్తున్నారు.
జవాబు:
సాయుధ దళాలు

ఇ) రేడియోలో రోజూ నేను వార్తలు వింటాను.
జవాబు:
విషయం

ఈ) శాంతికి గుర్తుగా కపోతాలను ఎగరవేద్దాం.
జవాబు:
పావురాలు

ఉ) నేను ఎప్పుడూ అబద్ధం ఆడను.
జవాబు:
కల్ల

ఊ) గులాబీ తోటలోని సువాసనలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించాయి.
జవాబు:
పరిమళాలు

2. కింది వాక్యాలలో గీత గీసిన పదానికి సమానమైన పర్యాయపదాలు అదే వాక్యంలో ఉన్నాయి. వాటిని గుర్తించండి. ఆ.వాటి కింద గీత గీయండి.

అ) దేవాలయంలో దేవుడి విగ్రహాలు ఉంటాయి. పూజారులు కోవెలలో పూజలు చేస్తారు. గుడికి మనమందరం తప్పకుండా వెళతాం.
జవాబు:
దేవాలయం, కోవెల, గుడి (పర్యాయపదాలు)

ఆ) సర్వేంద్రియాణాం నయనం ప్రధానం, అంటూంటారు. అందుకే మన కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి, అప్పుడప్పుడు నేత్ర వైద్యుడి దగ్గరకు వెళ్ళాలి.
జవాబు:
నయనం, కన్ను, నేత్రం (పర్యాయపదాలు)

ఇ) సరిహద్దుల్లో సైనిక దళాలు ఉంటాయి. వాళ్ళను చూడడానికి మనం బృందాలుగా వెళ్లాం. సమూహంగా వెళ్ళడంలో ఆనందం ఉంటుంది.
జవాబు:
దళాలు, బృందాలు, సమూహం (పర్యాయపదాలు) :

ఈ) గూఢచారులు రహస్యంగా విషయాలను కూపీ లాగుతారు. వాళ్ళు ఆరా తీయడంలో చాలా నేర్పరులు.
జవాబు:
కూపీ, ఆరా (పర్యాయపదాలు)

3. పాఠ్యాంశం ఆధారంగా ఈ కింది. నానార్థాల మూలపదాలను వెతికి రాయండి.

అ) దళము = గుంపు, ఆకు
ఆ) ముద్ర = గుర్తు, ప్రభావం

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

4. ఈ క్రింది పదాలకు వ్యతిరేక పదాలు మీ పాఠ్యాంశంలోనే ఉన్నాయి. వాటిని గుర్తించండి. రెండు పదాలనూ ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ఉదా :
అజాగ్రత్త × జాగ్రత్త
నేను ఏ విషయమైనా జాగ్రత్తగా పరిశీలిస్తాను. ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండను.

అభ్యాసము :
అ) నీతి × అవినీతి
వాక్య ప్రయోగం : నీతి కలవారు, అవినీతిని చూచి ‘సహించలేరు.

ఆ) నిస్స్వార్గం × స్వార్థం
వాక్య ప్రయోగం : నేను నిస్స్వార్థంగా జీవిస్తాను, స్వార్థంగా జీవించను.

ఇ) సుఖం × కష్టం
వాక్య ప్రయోగం : సుఖం వెంబడి కష్టం ఉంటుందని గుర్తించాలి.

ఈ) శాంతి × అశాంతి
వాక్య ప్రయోగం : ప్రపంచంలోని అశాంతి పోవాలంటే శాంతి దేవతను ఆహ్వానించాలి.

ఉ) నిగర్వి × గర్వి
వాక్య ప్రయోగం : నిగర్వి ఆనందాన్నీ, గర్వి దుఃఖాన్ని తప్పక పొందుతాడు.

ఊ) అంగీకారం × అనంగీకారం
వాక్య ప్రయోగం : నా చదువు విషయంలో అమ్మానాన్నాల మధ్య ఇంకా అంగీకారం, అనంగీకారం ఉంది.

ఎ) నిర్భయం × భయం
వాక్య ప్రయోగం : నిర్భయంగా మాట్లాడేవారంటే అందరికీ భయం.

5. కింది పదాలకు ప్రకృతి పదాలు పాఠ్యాంశంలో ఉన్నాయి. వాటిని గుర్తించి, సొంతవాక్యంలో ఉపయోగించి రాయండి.
ఉదా : దేవళం (వికృతి) – దేవాలయం (ప్రకృతి)
వాక్యము : నేను రోజూ దేవాలయానికి వెళ్లి దేవునికి దండం పెడతాను.

అ) దరి (వికృతి) – తీరము (ప్రకృతి)
నా మిత్రుడు గోదావరీ తీరమున ఇల్లు కట్టాడు.

ఆ) సంద్రం (వికృతి) – సముద్రం (ప్రకృతి)
మనదేశంలో తూర్పు దిక్కున “బంగాళాఖాతము” అనే సముద్రం ఉంది.

ఇ) గారవం (వికృతి) – గౌరవం (ప్రకృతి)
గురువులపై భక్తి, గౌరవం కలిగియుండాలి.

ఈ) నిచ్చలు (వికృతి) – నిత్యము (ప్రకృతి)
నిత్యం శివునికి నేను అభిషేకం చేస్తాను.

6. కింది పదాలలో ఏవైనా రెండేసి పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు తయారుచేయండి.

అ) తండోపతండాలు
ఆ) విరగబడు
ఇ) రొమ్ములు బాదుకొను
ఈ) గుసగుసలాడు
ఉ) పరీక్షించండి
ఊ) ఆకర్షించటం
ఎ) విరుచుకుపడు
ఏ) నిరూపిస్తున్నది

వాక్య ప్రయోగాలు :
ఉదా : ఆ జాతరకు ప్రజలు తండోపతండాలుగా విరగబడి వచ్చారు.

  1. శత్రువుల ఘాతుకాల్ని చూచి, ప్రజలు రొమ్ములు బాదుకొని వారిపై విరుచుకుపడ్డారు.
  2. ఆమె ప్రజలను బాగా ఆకర్షించడం ద్వారా తన గొప్పతనాన్ని నిరూపిస్తున్నది.
  3. నిజమేమిటో పరీక్షించండని ప్రజలు భయంతో గుసగుసలాడారు.
  4. తండోపతండాలుగా వస్తున్న వారిని పరీక్షించండి.

V. సృజనాత్మకత

1. రవి నాలుగు సంవత్సరాల పిల్లవాడు. ఒకసారి కోటప్పకొండ తిరునాళ్ళకు వెళ్ళినపుడు కిక్కిరిసిన జనంలో తప్పిపోయాడు. అప్పుడు నీలంరంగు నిక్కరు, తెల్లచొక్కా వేసుకున్నాడు. ఈ వివరాలతో ఒక ప్రకటన తయారు. చేయండి.
జవాబు:

తప్పిపోయాడు

మా అబ్బాయి రవికి నాలుగు ఏళ్ళు. కోటప్పకొండ తిరునాళ్ళకు మేము వెళ్ళినపుడు జనంలో తప్పిపోయాడు. అతడు అప్పుడు నీలంరంగు నిక్కరు, తెల్లరంగు చొక్కా వేసుకున్నాడు. నా పేరు ముదిరాజు. నా భార్య పేరు “గీర్వాణి. మాది గురజాల గ్రామం. మా పిల్లవాడు చామనచాయగా ఉంటాడు. చురుకుగా ఉంటాడు.

ఆచూకీ తెలిసినవారు, క్రింది చిరునామాకు తెలుపగోరిక. ఆచూకీ తెలిపినవారికి మంచి బహుమతి ఇస్తాము. వివరాలకు ‘గురజాల’ పోలీసు స్టేషను వారిని సంప్రదించండి.

ఇట్లు,
తండ్రి,
కె. ముదిరాజు,
గురజాల గ్రామం,
‘ఫోన్ నెంబరు 286742.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

2. పాఠం ఆధారంగా అంత్యప్రాస పదాలను ఉపయోగించి నాలుగు పంక్తుల కవిత రాయండి.
జవాబు:
విరివిగా చందాలను పంపించండి
మీ ఔదార్యగుణాన్ని ప్రకటించండి
ధర్మాధర్మాలను పరిశీలించండి
ధర్మాన్నీ, న్యాయాన్ని నిలబెట్టండి.”

3. అందరినీ ఆకర్షించే “శాంతి నినాదాలు” తయారు చేయండి.
ఉదా : యుద్ధాలు వద్దని చెప్పేద్దాం – శాంతే ముద్దని చాటిద్దాం.
జవాబు:

  1. మందుగుండు తగ్గిద్దాం – పదిమందికింత పెడదాం.
  2. కలహాలు మానేద్దాం – సలహాలు పాటిద్దాం
  3. యుద్ధం వద్దు – శాంతి ముద్దు.
  4. మైత్రిని పెంచు – ఆయుధాలు త్రుంచు.
  5. నమ్మకం పెంచుకుందాం – అందరం కలిసి మెలిసి తిరుగుదాం
  6. ప్రపంచ మానవులంతా దేవుని బిడ్డలే – వారంతా అన్నదమ్ములే
  7. మనుషుల మధ్య కలహం – వినాశానికి మూలం
  8. కావాలి తప్పక శాంతి – ఇచ్చేద్దాం యుద్ధాలకు విశ్రాంతి.

VI. ప్రశంసము

1. ఆయా సందర్భాల కనుగుణంగా శాంతికోసం జరిగే సభల్లో, ర్యాలీలో పాల్గొనండి. ఇతరులతో చర్చించండి. ‘ప్రపంచ శాంతి దినోత్సవాన్ని గురించి తెలుసుకోండి.
జవాబు:
ఈనాడు ప్రపంచంలో సుమారు 194 దేశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరము సెప్టెంబరు 21వ తేదీన అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిర్వహింపబడుతుంది. దానిలో అందరూ పాల్గొనాలి.

VII. ప్రాజెక్టు పని

* మీ గ్రామంలో, వాడలో శాంతికోసం ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరో తెలుసుకోండి. వారు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకోండి.
జవాబు:
మా వాడలో పుల్లయ్య, వెంకట్రావులు శాంతి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మాది అమలాపురం నగరంలో నారాయణ పేట అనే పేట. అక్కడ ఆంజనేయ దేవాలయానికి సంబంధించి ఖాళీస్థలాల్లో చాలామంది బీదలు పాకలు వేసుకొని నివసిస్తూ ఉంటారు.

వాళ్ళు నిత్యం కుళాయి నీటి కోసమో, లేక చిన్న చిన్న దొంగతనాల సంబంధంగానో, ఒకరిని ఒకరు తిట్టుకుంటూ అరుచుకుంటూ ఉండేవారు.

పుల్లయ్య, వెంకట్రావు మునిసిపల్ అధికారులతో మాట్లాడి ప్రతి ఇంటికీ కుళాయిలు వేయించారు. ఇళ్ళ మధ్య తారురోడ్లు వేయించారు. వాడలో శాంతి సంఘాలు నెలకొల్పారు.

ఇప్పుడు మనుషులంతా అన్నదమ్ముల్లా, అక్కాచెల్లెండ్రుగా ఉంటున్నారు. వారు శాంతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు వారి ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారు.

(లేదా)

* ప్రపంచ శాంతికోసం కృషిచేసిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల ఫోటోలు, వివరాలు సేకరించండి. వారి ఫోటోలను ఛార్జ్ మీద అతికించి వివరాలు ప్రదర్శించండి.
జవాబు:
ప్రపంచ శాంతికోసం కృషిచేసిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల వివరాలు :

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన
1) నెల్సన్ మండేలా :
ఈయన దక్షిణాఫ్రికా దేశంలో “ట్రాన్సీలో 1918లో పుట్టారు. ఆఫ్రికా నేషనల్ కాంగ్రెసులో చేరి, బ్రిటిషు పాలకుల జాతివర్ణ వివక్షతకు ఎదురొడ్డి పోరాడాడు. బ్రిటిషు వారి పాలనలో 27 సంవత్సరాలు చెరసాలలో ఉన్నారు. ఈయన . దక్షిణాఫ్రికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1993లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఈయన 1990లో భారతరత్న అవార్డు పొందిన రెండవ విదేశీయుడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన 3
2) యాసర్ అరాఫత్ :
ఈయన కయిరోలో 1929లో జన్మించాడు. పాలస్తీనియన విద్యార్థి నాయకుడిగా, పాలస్తీనా విమోచన సైన్య నాయకుడిగా పోరాటం నడిపాడు. పాలస్తీనాకు అధ్యక్షుడయ్యాడు. ఈయన పాలస్తీనాలోని అతి పెద్ద గెరిల్లా గ్రూపు అయిన ‘ఆల్తా కు’ అధిపతి. ఈయనకు 1994లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈయన మన భారత్ కు మంచి మిత్రుడు.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

అ) కింది వాక్యాలను చదవండి. ఆమ్రేడిత పదాలను గుర్తించండి.

1) ఔర ! ఎంత పని చేశావు.
2) అరెరె ! అలా అయిందా?
3) ఆహాహా ! నేనే గొప్పవాడిని.
4) ఏమేమి? నువ్వు చూశావా?
5) ఎట్లెట్లూ? మరోసారి చెప్పండి.
6) ఏమిటేమిటి? నువ్వు వినలేదా?
7) ఓహోహో ! మీరు వచ్చారా !

గమనిక :
పై వాక్యాల్లో కొన్ని పదాలు రెండుసార్లు వచ్చాయి. అవి
ఉదా :
1) ఔర + ఔర = ఔరౌర
2) అరె + అరె = అరెరె
3) ఆహా + ఆహా = ఆహాహా
4) ఏమి + ఏమి = ఏమేమి?
5) ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లూ?
6) ఏమిటి + ఏమిటి? = ఏమిటేమిటి?
7) ఓహో + ఓహో = ఓహోహో

గమనిక :
వీటిలో మనం తొలుత పలికిన పదాన్నే రెండోమారు పలుకుతున్నాం. అలా రెండోమారు పలికే పదాన్ని “ఆమ్రేడితం” అని అంటాం.

ఆ) పైన ఉన్న, పూర్వపదాల్లో చివరన ఏముందో చూద్దాం.
అ) ఔర్ + అ – (ఔర)
ఆ) అర్ + ఎ – (అరె)
ఇ) ఆహ్ + ఆ – (ఆహా)
ఈ) ఏమ్ + ఇ – (ఏమి)
ఉ) ఎట్ + ఉ – (ఎట్లు)
ఊ) ఏమిట్ + ఇ – (ఏమిటి)
ఎ) ఓహ్ + ఓ – (ఓహో)

ఈ పదాలను పరిశీలిస్తే అ, ఆ, ఇ, ఉ, ఎ, ఓ లు పదం చివరన ఉన్నాయి. అంటే అచ్చులు ఉన్నాయన్నమాట.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ఇ) కింది పదాలను పరిశీలించండి.

1) ఔర + ఔర = ఔరౌర = (అ + ఔ = ఔ)
2) ఆహా + ఆహా = ఆహాహా = (అ + ఆ = ఆ)
3) ఏమి + ఏమి = ఏమేమి = (ఇ + ఏ = ఏ)
4) ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు – (ఉ + ఎ = ఎ)
5) ఏమిటి + ఏమిటి = ఏమిటేమిటి = (ఇ + ఏ = ఏ)
6) అరె + అరె = అరరె – (ఎ + అ = అ)
7) ఓహో + ఓహో = ఓహోహో = (ఓ + ఓ = ఓ) లుగా మారుతాయి.

ఈ) కింది వాటిలో కూడా అచ్చుకు ఆమ్రేడితం పరమైందనే విషయాన్ని గమనించండి.

ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి
ఎట్లు + ఎట్లు ఎట్లెట్లు, ఎట్లుయెట్లు
ఎంత + ఎంత = ఎంతెంత, ఎంతయెంత

గమనిక :
ఇలాంటి పదాల్లో ఒక్కోసారి ఆమ్రేడితం విడిగా ఉండటం జరుగుతున్నది.

పై విషయాలను బట్టి అచ్చుకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది. అదే ఆమ్రేడిత సంధి అని తెలుస్తున్నది.

ఆమ్రేడిత సంధి సూత్రం :
అచ్చుకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది.

ఇప్పటివరకు ఆమ్రేడితానికి సంబంధించిన సంధి అంటే ఆమ్రేడిత సంధి గురించి తెలుసుకున్నారు.

ఉ) ఈ కింది పదాలను పరిశీలించి సూత్రాన్ని సరిచూడండి.
అభ్యాసం :
అ) అడిగడిగి = అడిగి + అడిగి = (ఇ + అ = అ) – ఆమ్రేడిత సంధి
ఆ) ఊరూరు = ఊరు + ఊరు = (ఉ + ఊ = ఊ) – ఆమ్రేడిత సంధి
ఇ) అంతంత = అంత + అంత = (అ + అ = అ) – ఆమ్రేడిత సంధి
ఈ) ఓరోరి = ఓరి + ఓరి = (ఇ + ఓ = ఓ) – ఆమ్రేడిత సంధి

సూత్రం :
అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగానగు.

1. కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.

అ) దేవాలయాలు : దేవ + ఆలయాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఆ) సాయుధ దళాలు = స + ఆయుధదళాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఇ) అంగారకాది గ్రహాలు = అంగారక + ఆదిగ్రహాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధీ
ఈ) యుగాంతాన్ని = యుగ + అంతాన్ని = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఉ) నయనాంచలాలు = నయన + అంచలాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఊ) సంస్కారపు కేశపాశం = సంస్కారము + కేశపాశం – పుంప్వాదేశసంధి
ఎ) అనురాగపు గులాబి = అనురాగము + గులాబి – పుంప్వాదేశసంధి
ఏ) కళాలయాలు = కళా + ఆలయాలు = (ఆ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి

2. కింది సమాసాలకు విగ్రహవాక్యం రాసి, వాటి పేర్లు రాయండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాస నామం
1) ప్రజాపారావారం ప్రజలు అనే పారావారం రూపక సమాసం
2) దరహాస పరిమళాలు దరహాసము అనే పరిమళాలు రూపక సమాసం
3) నయనాంచలాలు నయనముల యొక్క అంచలాలు షష్ఠీ తత్పురుష సమాసం
4) యుగాంతము యుగము యొక్క అంతము షష్ఠీ తత్పురుష సమాసం
5) అనురాగపు గులాబి అనురాగము అనే గులాబి రూపక సమాసం

కవి పరిచయం

పాఠం ఫేరు : ‘ప్రకటన’
కవి : దేవరకొండ బాలగంగాధర తిలక్
దేని నుండి గ్రహింపబడింది : తిలక్ రచించిన ‘అమృతం కురిసిన రాత్రి’ అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
రచయిత కాలం : 1921-1966
జన్మస్థానం : ‘మండపాక’ గ్రామం, తణుకు తాలూకా, ప:గో జిల్లా.
రచనలు :
1) అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు, (కవితా సంపుటాలు)
2) తిలక్ కథలు
పురస్కారాలు : ‘అమృతం కురిసిన రాత్రి’ కవితా గ్రంథానికి 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది.

1. ‘చల్లని తల్లి చక్కని చెల్లి’ అని శాంతిని ఉద్దేశిస్తూ ‘ప్రకటన’ కవితను రచించిన కవిని గురించి రాయండి.
జవాబు:
దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రకటన కవితను రాశాడు. ఈ కవిత ఆయన రచించిన ‘అమృతం కురిసిన
రాత్రి’ అనే కవితా సంకలనంలోది. తిలక్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో – 1921లో జన్మించాడు. ఈయన అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు, తిలక్ కథలు రచించాడు. 1971లో ఈయన అమృతం కురిసిన రాత్రి అనే కవిత సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.

గేయానికి – ప్రతిపదారాలు – భావాలు

1 నుండి 5 పంక్తులు :
1. స్టేషన్లో టిక్కెట్లను జారీ చెయ్యకండి
ఎక్కడి రైళ్ళు అక్కడ ఆపివెయ్యండి
దేశదేశాలకి కేబుల్ గ్రామ్స్ పంపించండి
దేవాలయాల్లో నిత్యం పూజలు చేయండి
ఆకాశవాణిలో యీ విషయం ప్రకటించండి.
ప్రతిపదార్ధం :
స్టేషన్లో = రైల్వే స్టేషన్లలో
టిక్కెట్లను = రైలు టిక్కెట్లను
జారీ చెయ్యకండి = ఇవ్వకండి (అమ్మకండి)
ఎక్కడి రైళ్ళు = ఏ స్టేషన్లో నిలిచిన రైళ్ళు
అక్కడ ఆపివెయ్యండి = ఆ స్టేషన్లోనే నిలిపి ఉంచండి
దేశదేశాలకి = విదేశాలన్నింటికీ
కేబుల్ గ్రామ్స్ = విదేశాలకు పంపే
(Cable gram) టెలిగ్రాము సమాచారాలు
పంపించండి = పంపండి
దేవాలయాల్లో = గుళ్ళలో
నిత్యం = ప్రతిరోజూ
పూజలు చేయండి = పూజలు జరిపించండి.
ఆకాశవాణిలో ఈ విషయం = రేడియోలో ఈ విషయాన్ని
ప్రకటించండి = ప్రకటన ఇవ్వండి

భావం :
ఎవరూ ప్రయాణం చెయ్యకుండా స్టేషన్లలో టిక్కెట్లు ఇవ్వడం ఆపివేయండి. ఎక్కడి రైళ్ళను అక్కడే నిలిపివేయండి. దేశాలు అన్నింటికీ టెలిగ్రాములు పంపండి. దేవాలయాల్లో రోజూ పూజలు చేయండి. అన్ని రేడియో స్టేషన్ల నుండి ఈ విషయం ప్రకటించండి.

విశేషం :
ఏ దొంగ అయినా పారిపోతే అతడు రైలు ఎక్కి పారిపోకుండా రైళ్ళు ఆపివేస్తారు. విదేశాలకు ఆ దొంగ పారిపోతే పట్టుకొని తమకు అప్పగించమని విదేశాలకు టెలిగ్రాములు పంపుతారు. దొంగ దొరికేలా చేయమనిదేవుడికి పూజలు చేస్తారు. దొంగ పారిపోయేడని ప్రజలకు, అందరికీ తెలిసేలా రేడియోలో ప్రకటనలు చేస్తారు. అలాగే ఇక్కడ శాంతి పావురం పారిపోయింది. కాబట్టి, దాన్ని వెతకడం కోసం పై విధంగా చెయ్యమని కవి చెప్పాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

6 నుండి 12 పంక్తులు :
2. కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో, కర్మాగారాల్లో
కాస్త జాగ్రత్తగా నిశితంగా పరిశీలించండి.
సముద్రతీరాలలో నదీజలాలలో వెదకండి
సాయుధ దళాల్ని దిక్కులలో నిలబెట్టండి
రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపించండి.
అడుగుజాడల్ని కూపీ తియ్యండి
వేలిముద్రల్ని పరీక్షించండి
ప్రతిపదార్థం :
కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో = కాఫీ హోటళ్ళలోనూ, క్లబ్బులలోనూ
కర్మాగారాలలో = కర్మాగారాలోనూ (ఫ్యాక్టరీలలోనూ)
కాస్త జాగ్రత్తగా = కొంచెం జాగ్రత్త తీసుకొని
నిశితంగా పరిశీలించండి = క్షుణ్ణంగా పరిశీలన చేయండి
సముద్రతీరాలలో = సముద్రము యొక్క తీర ప్రాంతాలలో
నదీజలాలలో వెదకండి = నదులలోని నీళ్ళలో వెతకండి
సాయుధ దళాన్ని = ఆయుధాలతో, ఉన్న సైనికుల్ని
దిక్కులలో నిలబెట్టండి = అన్ని దిక్కులలో కాపలా పెట్టండి (శాంతి పావురం పారిపోకుండా)
రాకెట్లను = రాకెట్లను
అంగారకాది (అంగారక + ఆది) = అంగారకుడు మొదలయిన
గ్రహాలకు పంపించండి = గ్రహముల వద్దకు పంపించండి (శాంతి పావురాన్ని వెదకడానికి)
అడుగుజాడల్ని = పాదముద్రలను (సంగీతం, నాటకం మొదలైనవి)
కూపీ తియ్యండి = గుట్టు లాగండి
వ్రేలి ముద్రల్ని = వేలి ముద్రల్ని
పరీక్షించండి = పరిశీలించండి

భావం :
కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో, కర్మాగారాలలో చాలా జాగ్రత్తగా అన్నిచోట్లా పరిశీలన చేయండి. సముద్ర తీరాలలో, నదీజలాలలో వెదకండి. ఆయుధాలు ధరించిన సైనికుల్ని దిక్కులలో నిలబెట్టండి. రాకెట్లను అంగారకుడు మొదలైన గ్రహాల వద్దకు పంపించండి. నేలమీద అడుగుముద్రల్లో ఏమైనా జాడలు కనిపిస్తాయేమో గుట్టు తీయండి. వేలిముద్రల్ని కూడా పరిశీలించండి.

విశేషం :
శాంతి పావురం జాడను పట్టుకోడానికి పై విధంగా చెయ్యమని కవి చెప్పాడు. పారిపోయిన వానిని పట్టుకోవడానికి పై చర్యలు చేస్తారు కదా !

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

13 నుండి 18 పంక్తులు :
3. ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు
కంగారుతో భయంతో గుసగుసలాడుతున్నారు.
కావ్యచర్చలు కళాలయాలు ఆకర్షించటం లేదు.
స్వార్థజీవనులు గభాలున రొమ్ములు బాదుకుంటున్నారు
సిద్ధాంతాలు చర్చలు ఎవరూ చేయడం లేదు
సిరా యింకకుండానే ఎగ్రిమెంట్లు చింపేస్తున్నారు
ప్రతిపదార్థం :
ప్రజలు తండోపతండాలుగా = ప్రజలు గుంపులు గుంపులుగా
విరగబడుతున్నారు. = విరగబడి వస్తున్నారు
కంగారుతో భయంతో = ప్రజలు కంగారుపడి భయంతో
గుసగుసలాడుతున్నారు = ఒకరితో ఒకరు రహస్యంగా మాట్లాడు కుంటున్నారు
కావ్య చర్చలు = సాహిత్య చర్చలు
కళానిలయాలు = లలిత కళా స్థానములు
ఆకర్షించటంలేదు = జనాన్ని ఆకర్షించడం లేదు (జనం వీటిపై దృష్టి పెట్టడం లేదు)
స్వార్థ జీవనులు = తమకోసమే బ్రతికేవారు
గభాలున = గమ్ముని (వేగంగా)
రొమ్ములు బాదుకుంటున్నారు = గుండెలు బాదు కుంటున్నారు
సిద్ధాంతాలు, చర్చలు = విభిన్నవాద సిద్ధాంతాలు, దానిపై చర్చలు
ఎవరూ చేయడం లేదు = మౌనంగా ఉండిపోయారు
సిరా ఇంక కుండానే = శాంతి ఒప్పందాలపై సంతకం చేసిన పెన్ను సిరా ఆరకుండానే (వెంటనే)
ఎగ్రిమెంట్లు చింపేస్తున్నారు = ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారు

భావం :
ఇసుకవేస్తే రాలనంతగా ప్రజలు గుంపులు గుంపులుగా వస్తున్నారు. కంగారుతో, భయంతో, ఏవేవో అనుమానాలతో గుసగుసలాడుతున్నారు. కావ్య చర్చలు, కళా నిలయాలు జనాన్ని ఆకర్షించడం లేదు. తమ స్వార్థం కోసమే ఆలోచించే మనుష్యులు మాత్రం, గుండెలు బాదుకుంటున్నారు. విభిన్నవాద సిద్ధాంతాల మీద రకరకాల చర్చలు జరిపే మేధావులు, మౌనంగా ఉండిపోయారు. ఎన్నో అంశాల మీద చేసుకున్న ఒప్పందాలు అన్నింటినీ సంతకం చేసిన సిరా ఆరకముందే, చింపేస్తున్నారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

19 నుండి 28 పంక్తులు :
4. అతృప్త అశాంత ప్రజాపారావార తరంగం
అంచుల్ని దాటి భీకరంగా విరుచుకుపడుతోంది.
ఇంక చరిత్రలు వ్రాయనక్కరలేదు.
ఇక రాజ్యాలు పాలించనక్కరలేదు
అణుబాంబు యుగాంతాన్ని నిరూపిస్తున్నది
ఆ ముహూర్తం త్వరలోనే వస్తున్నది
కాబట్టి స్టాండ్ ఎటెన్షన్ – మన జాతిని మనం
కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం
వెదికి తీసుకురండి పరారీ అయిన వ్యక్తిని
వేరుదారి లేదు కదలండి కదలండి జై అని
ప్రతిపదార్థం :
అతృప్త = తృప్తిలేని
అశాంత = శాంతిలేని
ప్రజా, పారావార, తరంగం = ప్రజలు అనే, సముద్రపు కెరటం (ప్రజా సమూహం)
అంచుల్ని దాటి = చెలియలి కట్టలను దాటి
భీకరంగా విరుచుకు పడుతోంది = భయంకరంగా మీదకు పడుతున్నారు
ఇంక చరిత్రలు వ్రాయ నక్కరలేదు = ఇకమీదట చరిత్రలు వ్రాయవలసిన అవసరం లేదు
ఇక రాజ్యాలు పాలించనక్కరలేదు = రాజులు రాజ్యాలు పాలించవలసిన పనిలేదు
అణుబాంబు = ఆటంబాంబు
యుగాంతాన్ని (యుగ + అంతాన్ని) = యుగ సమాప్తి జరుగుతుందని
నిరూపిస్తున్నది = వెల్లడిస్తోంది
ఆ ముహూర్తం = యుగ సమాప్తి అయ్యే సమయము
త్వరలోనే వస్తున్నది = తొందరగానే వస్తోంది
కాబట్టి స్టాండ్ ఎటెన్షన్ = శ్రద్ధగా నిలబడండి
(Stand attention)
మన జాతిని = మన భారతజాతిని
మనం కాపాడుకోవాలంటే = మనము రక్షించుకోవాలంటే
ఒక్కటే మార్గం = ఒక్కటే దారి ఉంది
వెదకి తీసుకురండి = వెదకి వెనక్కు తీసుకురండి
పరారీ అయిన వ్యక్తిని = పారిపోయిన దానిని (శాంతి కపోతాన్ని)
వేరు దారి లేదు = మరో మార్గం లేదు
కదలండి కదలండి జై అని = జయ జయ ధ్వనులు చేస్తూ నడవండి.

భావం :
అసంతృప్తి, అశాంతితో ఉన్న ప్రజలు, సముద్రంలోని కెరటాల్లా భయంకరంగా విరుచుకు పడుతున్నారు. ఇకమీదట ఎవరూ చరిత్రలు రాయనవసరం లేదు. రాజులు రాజ్యాల్ని పాలింపవలసిన అవసరం లేదు. అణుబాంబు, ఈ యుగాన్నీ, మానవులనూ నాశనం చేసే సమయం తొందరలోనే ఎదురవుతుంది. కాబట్టి శ్రద్ధగా నిలబడండి. మన జాతిని మనం కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. అందరూ కదలి పరారీ అయిన వ్యక్తిని వెతికి తీసుకురావాలి. మరోదారి లేదు. అందరూ ‘జై’ అంటూ కదలండి.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

29 నుండి 35 పంక్తులు :
5. అపార కృపాతరంగితాలైన నయనాంచలాలు
ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు
సంస్కారపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబి
సదా ప్రజాహితైషిణి సుభాషిణి గర్వంలేని రాణి
కల్లనీ క్రౌర్యాన్నీ కాలుష్యాన్ని తిరస్కరిస్తుంది
తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది.
చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి.
ప్రతిపదార్ధం :
అపార – అంతులేని
కృపా తరంగితాలు + ఐన = దయతో పొంగి పొరలే వయిన (నిండిన)
నయనాంచలాలు (నయన + అంచలాలు) = కన్నుల అంచులు (కను గొలకులు)
ఆనందం జాలువారే = సంతోషం ప్రవహించే
స్నిగ్ధ దరహాస = స్వచ్ఛమైన చిఱునవ్వు యొక్క
పరిమళాలు = సువాసనలు
సంస్కారపు కేశపాశంలో = చక్కగా దువ్వుకొన్న తల వెండ్రుకల కొప్పులో
తురిమిన = ధరించిన
అనురాగపు గులాబి = ప్రేమ గులాబీ పుష్పం
సదా = ఎల్లప్పుడూ
ప్రజా హితైషిణి = ప్రజల మేలు కోరేది
సుభాషిణి = చక్కగా మాట్లాడేది
గర్వం లేని రాణి = గర్వము ఎరుగని రాణి
కల్లనీ = అబద్దాన్ని
క్రౌర్యాన్నీ = క్రూరత్వాన్ని
కాలుష్యాన్ని = మాలిన్యాన్ని
తిరస్కరిస్తుంది = నిరసిస్తుంది
తెల్లని పావురాన్ని = తెల్లని పావురాలను
సరదాగా ఎగరేస్తుంది = వేడుకగా ఎగురవేస్తుంది
చల్లని తల్లి = ఆమె చల్లని తల్లి
చక్కని చెల్లి = ఆమె మనకు చక్కని చెల్లెలు
ఆమె పేరు శాంతి . = ఆ చల్లని తల్లి, చెల్లి పేరు శాంతి

భావం :
ఆమె కనుగొలకులు అంతులేని దయతో నిండియుంటాయి. ఆమె ముఖంలో ఆనందమూ, స్వచ్ఛమైన చిఱునవ్వు పరిమళమూ కనిపిస్తాయి. ఆమె తలలో ప్రేమ గులాబిని ధరిస్తుంది. ఆమె ఎప్పుడూ చక్కగా మాట్లాడుతూ, ప్రజల హితాన్ని కోరుకుంటుంది. ఆమె గర్వంలేని రాణి. ఆమె అసత్యాన్నీ, క్రూరత్వాన్నీ, కాలుష్యాన్ని నిరసిస్తుంది. ఆమె ఎప్పుడూ తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది. ఆమె మన చల్లని తల్లి. చక్కని చెల్లెలు. ఆమె పేరు శాంతి.