SCERT AP Board 7th Class Telugu Guide Answers 11th Lesson బాలచంద్రుని ప్రతిజ్ఞ Textbook Questions and Answers.
AP State Syllabus 7th Class Telugu 11th Lesson Questions and Answers బాలచంద్రుని ప్రతిజ్ఞ
7th Class Telugu 11th Lesson బాలచంద్రుని ప్రతిజ్ఞ Textbook Questions and Answers
వినడం – ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
చిత్రం గురించి మాట్లాడండి.
జవాబు:
చిత్రంలో ఇద్దరు వీరులు ఉన్నారు. ఇద్దరూ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నవారే.
ప్రశ్న 2.
చిత్రంలో ఉన్న మహనీయుల గొప్పతనం గురించి చర్చించండి.
జవాబు:
భగత్ సింగ్ :
భగత్ సింగ్ 1907 సెప్టెంబరు 28వ తేదీన ఫైసలాబాద్ జిల్లా పంజాబులో జన్మించాడు. నవ జవాన్ భారతసభ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ కీర్తి కిసాన్ పార్టీని నడిపాడు. ఆయన తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతీ దంపతులు. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు. భారత బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమానహక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజులు నిరాహారదీక్షను చేపట్టాడు. లాలాలజపతిరాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు భగత్ సింగ్ ను 1931 మార్చి 23వ తేదీన లాపూర్ లో ఉరితీసారు. అప్పటికి ఆయన వయస్సు 23 సంవత్సరాలు.
అల్లూరి సీతారామరాజు :
అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విజయనగరం దగ్గరలోని పాండ్రంగిలో జన్మించాడు. సీతారామరాజు స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లాలోని మోగల్లు. సీతారామరాజు తల్లిదండ్రులు సూర్యనారాయణమ్మ, వెంకట రామరాజు. ఆరవ తరగతిలోనే తన తండ్రిని కోల్పోయాడు. అప్పటి నుంచి కుటుంబం పేదరికంతో చాలా బాధలు పడ్డారు. సీతారామరాజు చించినాడలో గుర్రపుస్వారీ నేర్చుకున్నాడు. రాజమండ్రిలో 6వ తరగతి, రామచంద్రపురంలో 7వ తరగతి, కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో 3rd ఫారమ్ చదివాడు. 1918 వరకు తునిలోనే ఉన్నారు.
ఆ కాలంలో చుట్టుపక్కల కొండలు అడవుల్లో తిరుగుతూ గిరిజనుల జీవనవిధానం గమనించాడు. తెల్లదొరల దోపిడీని అరికట్టడానికి గిరిజనులను ఏకం చేసి గెరిల్లా యుద్ధ పద్దతులను నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేసాడు. మన్యంలో విప్లవాన్ని సృష్టించి బ్రిటిష్ వారికి కంటిపై కునుకు లేకుండా చేసాడు. 1924 మే 27న కొయ్యూరు గ్రామ సమీపంలో సీతారామరాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరుపరచారు. బంధీగా ఉన్న అల్లూరి సీతారామరాజును ఒక చెట్టుకు కట్టేసి ఏ విచారణ , లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. అప్పటికి సీతారామరాజు వయసు 26 ఏళ్ళు.
ప్రశ్న 3.
మీకు తెలిసిన యోధుల గురించి మాట్లాడండి.
జవాబు:
నేతాజీ సుభాష్ చంద్రబోస్ :
ఈయన 1897 జనవరి 23వ తేదీన కటక్ లో జన్మించాడు. భారత జాతీయ ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు. ఆయన తల్లిదండ్రులు జానకీనాథబోస్, ప్రభావతీ దేవి. 11 సార్లు స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంగ్లేయులచే కారాగారంలో నిర్భందించబడ్డాడు. జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరుతోట కూలీలు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసాడు. బ్రిటిష్ వారితో యుద్ధాన్ని జర్మనీ, జపాన్ల సాయంతో సాగించాడు. 1945 ఆగష్టు 18న తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించాడంటారు. కానీ ప్రమాదం నుండి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.
ఝాన్సీ లక్ష్మీబాయి :
ఝాన్సీ లక్ష్మీబాయి 1828 నవంబరు 19న మహారాష్ట్రలో సతారలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయి. వీరిది . సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె చిన్నప్పటి పేరు మణికర్ణిక. ముద్దుగా ‘మను’ అని పిలిచేవారు. ఆమె 4వ ఏటనే తల్లి మరణించింది. చిన్నతనంలోనే గుర్రపు స్వారీ, కత్తియుద్ధం నేర్చుకొంది.
ఆమెను 13వ ఏట ఝాన్సీ రాజు గంగాధరరావు ఆమెను పెండ్లాడాడు. గంగాధరరావు మరణానంతరం ఝాన్సీని బ్రిటిషువారు కైవసం చేసుకోవాలనుకొన్నారు. కాని లక్ష్మీబాయి అంగీకరించలేదు. తిరుగుబాటు చేసింది. బ్రిటిషువారికి కంటిమీద కునుకు లేకుండా గెరిల్లా పోరాటాలు చేసింది. చివరకు బ్రిటిషువారి దుర్మార్గానికి 1858 జూన్ 18న గ్వాలియర్లో మరణించింది. ఆమె తండ్రిని బ్రిటిషువారు ఉరితీశారు. ఆమె వారసుడిగా దామోదర్ రావుని ప్రకటించారు.
Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)
అవగాహన-ప్రతిస్పందన
ప్రశ్న 1.
పాఠంలోని ద్విపద పాదాలను రాగయుక్తంగా పాడండి.
జవాబు:
ఉపాధ్యాయుని అనుసరించి, స్పష్టంగా, భావయుక్తంగా, స్వల్ప రాగయుక్తంగా పాడండి.
ప్రశ్న 2.
బాలచంద్రుడు ఎవరితో ఏమన్నాడో చెప్పండి.
జవాబు:
బాలచంద్రుడు తల్లితో పలికెను. తను యుద్ధరంగంలో చెలరేగి నలగాముని సైన్యాన్ని నాశనం చేస్తానన్నాడు.
ప్రశ్న 3.
బాలచంద్రునికి తల్లి ఏమని చెప్పిందో ఊహించి చెప్పండి.
జవాబు:
బాలచంద్రుడు చాలా చిన్నవాడనీ, యుద్ధరంగంలో తట్టుకోలేడని భావించి ఉంటుంది. కాని బాలచంద్రుని మాటలు విన్నాక అతని పౌరుషాన్ని గ్రహించింది. ఒక వీరమాతగా కొడుకును యుద్ధానికి వెళ్లమని ప్రేరేపించి ఉంటుంది. వీరుడిగా విజయం సాధించి తిరిగి రమ్మని రక్తతిలకం దిద్ది ఆశీర్వదించి, యుద్ధరంగానికి పంపి ఉంటుంది.
ప్రశ్న 4.
కింది గీతాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
పల్లవి: విశ్వభారత వీర లేవోయీ
– ప్రగతి పథముల వెంట పదవోయీ
చ : స్వాతంత్ర్య వీరుండు రాణా ప్రతాపుండు
నీ జాతి వాడురా ప్రళయాగ్ని వీవురా
వీరాభిమన్యుండు పలనాటిబాలుండు
నీ సహోదరులురా లయ ఝంఝ వీవురా ||వి||
చ : ధీర ఝాన్సీరాణి నీ వీరమాతరా
కాకతీ రుద్రమ్మ నీ సోదరేనురా
మగువ మాంచాల నీ బంగారు వదినరా
వీరవంశము నీది వీర రక్తమ్మురా ||వి||
చ: పదునాల్గు భువనాల నిన్నడు మొనగాడు
లేడురా జగదేక వీరుడవు నీవెరా
శివ సముద్రమ్మువై బడబాగ్ని జ్వాలవై
లంఘించి వెలుగరా లోకాలనేలరా ||వి||
ప్రశ్నలు :
అ) గేయంలో స్వతంత్ర వీరుడెవరు?
జవాబు:
గేయంలో రాణా ప్రతాపుడు స్వతంత్ర వీరుడు.
ఆ) కవి వీరాభిమన్యునితో ఎవరిని పోల్చాడు?
జవాబు:
వీరాభిమన్యునితో పల్నాటి బాలచంద్రుని పోల్చాడు.
ఇ) గేయంలోని వీరవనితల పేర్లు రాయండి.
జవాబు:
ఝాన్సీరాణి, కాకతీ రుద్రమ్మ, మగువ మాంచాలలు గేయంలో పేర్కొన్న వీరవనితలు.
ఈ) కవి ఎవరికి ప్రేరణను కలిగిస్తున్నాడు?
జవాబు:
విశ్వభారత వీరునికి కవి ప్రేరణ కల్గిస్తున్నాడు.
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
బాలచంద్రుని పరాక్రమాన్ని ఎవరెవరితో పోల్చడం జరిగింది?
జవాబు:
బాలచంద్రుని పరాక్రమాన్ని ప్రళయకాలంలో భైరవునితో పోల్చేరు. సైంధవుని చంపి వెళ్ళిన అర్జునునితో పోల్చారు. భీమునితో, హనుమంతునితో పోల్చారు. శ్రీరామునితో పోల్చారు. మంధర పర్వతంతో పోల్చారు.
ప్రశ్న 2.
బాలచంద్రుని పరాక్రమాన్ని రామాయణ, భారత, భాగవత వీరులతో పోల్చిన అంశాలను వివరించండి.
జవాబు:
బాలచంద్రుని భారతంలోని అర్జునుడు, భీముడుతో పోల్చారు. సైంధవ వధలో అర్జునునితో పోల్చారు. గదా యుద్ధంతో కౌరవులను చెల్లాచెదురు చేసిన భీమునితో పోల్చారు.
రామాయణంలో హనుమంతునితో, రామునితో పోల్చారు. లంకాదహనం చేసిన హనుమంతునితో పోల్చారు. రాక్షసులతో యుద్ధంలో శ్రీరామునితో పోల్చారు.
భాగవతంలో త్రిపురాసుర సంహారం చేసిన శివునితో పోల్చారు.
ప్రశ్న 3.
బాలచంద్రుడు తనను ఎదిరించలేరనడానికి చెప్పిన పోలికలేవి?
జవాబు:
తనను తాను దావాగ్నితో పోల్చుకున్నాడు. శత్రు సైన్యాన్ని అడవితో పోల్చాడు. శత్రు సైన్యాన్ని సముద్రంతో, తనను బడబాగ్నితో పోల్చుకున్నాడు. తనను పులితో, శత్రువులను జంతువులతో పోల్చాడు. తనను డేగతో, వారిని కొంగలతో పోల్చాడు. తనను సివంగితో, వారిని జింకలతో పోల్చాడు. తనను తాను మిరియపు గింజతో పోల్చుకున్నాడు.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటలలో రాయండి.
జవాబు:
యుద్ధానికి పోవద్దని చెప్పిన తన తల్లి ఐతమ్మతో బాలచంద్రుడు ఈ క్రింది విధంగా అన్నాడు. తనను భయపెట్ట వద్దన్నాడు. తన పరాక్రమం నలగామునకు తెలుసునన్నాడు. ప్రళయకాలంలో కాలభైరవుని వంటివాడినన్నాడు. సైంధవుని చంపేవేళ అర్జునునిలాంటి వాడినన్నాడు. భీముడు, హనుమ, శ్రీరామచంద్రుని వంటి వీరుడనన్నాడు. తను మంధర పర్వతం వంటి వాడనన్నాడు.. ఫాలాక్షుని వలె నలగాముని సైన్యాన్ని నశింప చేస్తానన్నాడు.
తనను తాను దావాగ్నితో, బడబాగ్నితో, పులితో, డేగతో, సివంగితో, మిరియపు గింజతో, పోల్చుకున్నాడు. శత్రు సైన్యాన్ని అడవితో, సముద్రంతో, జంతువులతో, జింకలతో పోల్చాడు. తన తల్లితో ఇవన్నీ చెప్పాడు.
ప్రశ్న 2.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన ఇద్దరు వీరుల గురించి రాయండి.
జవాబు:
నేతాజీ సుభాష్ చంద్రబోస్ :
ఈయన 1897 జనవరి 23వ తేదీన కటక్ లో జన్మించాడు. భారత జాతీయ ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు. ఆయన తల్లిదండ్రులు జానకీనాథబోస్, ప్రభావతీ దేవి. 11 సార్లు స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంగ్లేయులచే కారాగారంలో నిర్భందించబడ్డాడు. జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరుతోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసాడు. బ్రిటిష్ వారితో యుద్ధాన్ని జర్మనీ, జపాన్ల సాయంతో సాగించాడు. 1945 ఆగష్టు 18న తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించాడంటారు. కానీ ప్రమాదం నుండి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.
ఝాన్సీ లక్ష్మీబాయి :
ఝాన్సీ లక్ష్మీబాయి 1828 నవంబరు 19న మహారాష్ట్రలో సతారలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయి. వీరిది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె చిన్నప్పటి పేరు మణికర్ణిక. ముద్దుగా ‘మను’ అని పిలిచేవారు. ఆమె 4వ ఏటనే తల్లి మరణించింది. చిన్నతనంలోనే గుర్రపు స్వారీ, కత్తియుద్ధం నేర్చుకొంది.
ఆమెను 13వ ఏట ఝాన్సీ రాజు గంగాధరరావు ఆమెను పెండ్లాడాడు. గంగాధరరావు మరణానంతరం ఝాన్సీని బ్రిటిషువారు కైవసం చేసుకోవాలనుకొన్నారు. కాని లక్ష్మీబాయి అంగీకరించలేదు. తిరుగుబాటు చేసింది. బ్రిటిషువారికి కంటిమీద కునుకు లేకుండా గెరిల్లా పోరాటాలు చేసింది. చివరకు బ్రిటిషువారి దుర్మార్గానికి 1858 జూన్ 18న గ్వాలియర్లో మరణించింది. ఆమె తండ్రిని బ్రిటిషువారు ఉరితీశారు. ఆమె వారసుడిగా దామోదర్ రావుని ప్రకటించారు.
ప్రశ్న 3.
తల్లి ఐతమ్మకి, బాలచంద్రునికి మధ్య జరిగిన సంభాషణను రాయండి.
జవాబు:
ఐతమ్మ : బాబూ ! నువ్వు యుద్ధానికి వెళ్లవద్దు.
బాల : భయపడకమ్మా ! నేను మహావీరుడను.
ఐతమ్మ : ఆ నలగాముడి సైన్యం ప్రళయ భీకరమైనది బాబూ !
బాల : అమ్మా ! నేను కాలభైరవుడినై నశింప చేస్తాను.
ఐతమ్మ : వాళ్లది కౌరవ సైన్యంలా చాలా పెద్దది బాబూ !
బాల : నేను అర్జునుడనై, భీముడినై మట్టి కరిపిస్తా.
ఐతమ్మ : ఆ నలగాముడు రావణాసురుడి వంటి వాడురా?
బాల : నేను హనుమంతుడినై వాడి లంకను కాలుస్తా, శ్రీరామచంద్రుడినై వాడిని అంతం చేస్తాను.
ఐతమ్మ : ఆ నలగాముడి సైన్యం త్రిపురాసురులు వలె భయంకరమైన వాళ్లురా?
బాల : నేను ఫాలాక్షుడినై త్రిపురాసుర సంహారం చేస్తా, నువ్వేం భయపడకు. వీర తిలకం దిద్దు అమ్మా !
ఐతమ్మ : (నవ్వుతూ) అలాగే ! నాయనా ! విజయుడివై తిరిగిరా ! బాబూ !
భాషాంశాలు
అ) కింద గీతగీసిన పదానికి అర్ధాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా : కౌరవ సైన్యం కురుక్షేత్ర రణములో మరణించింది.
రణము = యుద్ధము
సొంతవాక్యం : యుద్ధములో వెన్ను చూపకూడదు.
1. భోగిమంటలో వేసిన వస్తువులు కాలి భస్మం అవుతాయి.
భస్మం = బూడిద
సొంతవాక్యం : సగర కుమారుల బూడిదరాశులపై భగీరథుడు గంగను ప్రవహింప చేశాడు.
2. జలధిలోని నీరు ఉప్పగా ఉంటుంది.
జలధి = సముద్రం
సొంతవాక్యం : సముద్రంపై ప్రయాణం సరదాగా ఉంటుంది.
3. హిమాలయ శైలము మంచుతో కప్పబడి ఉంటుంది.
శైలము = కొండ
సొంతవాక్యం : కొండలలో వేసవిలో అగ్ని రగులుతుంది.
4. పృథ్వి గుండ్రంగా ఉంటుంది.
పృథ్వి = భూమి
సొంతవాక్యం : భూమిపై జంతువులలో ఏనుగు పెద్దది.
ఆ) అర్ధాలను జతపరచండి.
1. మది | అ) వేడుక |
2. ఉర్వీశుడు | ఆ) పరాక్రమం |
3. దళము | ఇ) మహారాజు |
4. విక్రమము | ఈ) అగ్ని |
5. సంతోషము | ఉ) అడవి |
6. వనము | ఊ) మనస్సు |
7. దహనుడు | ఋ) సైన్యం |
జవాబు:
1. మది | ఊ) మనస్సు |
2. ఉర్వీశుడు | ఇ) మహారాజు |
3. దళము | ఋ) సైన్యం |
4. విక్రమము | ఆ) పరాక్రమం |
5. సంతోషము | అ) వేడుక |
6. వనము | ఉ) అడవి |
7. దహనుడు | ఈ) అగ్ని |
ఇ) కింద ఇచ్చిన పదానికి సమానార్థక పదాలు వాక్యాలలో ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి.
1. బాలచంద్రుడు రణంలోకి దూకాడు. కాని రాజులకు యుద్ధకాంక్ష తగదు.
సమరం : రణం, యుద్ధం
2. జ్వలనుడు అడవినీ దహించాడు. అగ్ని ధాటికి చెట్లన్నీ కాలిపోయాయి.
వహ్ని = జ్వలనుడు, అగ్ని
3. దేవతలు అమృతం కోసం అంబుధిని మథించారు. ఉదధి నుండి చంద్రుడు పుట్టాడు.
సముద్రం = అంబుధి, ఉదధి
4. పుడమిపై కనకవర్షం కురిసింది. రైతులు ధరణిపై బంగారం పండిస్తున్నారు.
పసిడి = కనకం, బంగారం
భూమి = పుడమి, ధరణి
ఈ) కింది వానిలో ప్రకృతి వికృతులను జతపరచండి.
1. పుత్రుడు | అ) పసువు |
2. రాక్షసుడు | ఆ) పుడమి |
3. పృథ్వి | ఇ) బొట్టె |
4. పశువు | ఈ) రక్కసుడు |
జవాబు:
1. పుత్రుడు | ఇ) బొట్టె |
2. రాక్షసుడు | ఈ) రక్కసుడు |
3. పృథ్వి | ఆ) పుడమి |
4. పశువు | అ) పసువు |
ఉ) కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి.
1. భయం × నిర్భయం
2. న్యాయం × అన్యాయం
3. భువి × ఆకాశం
4. జయం × అపజయం
వ్యాకరణాంశాలు
గసడదవాదేశ సంధి
అ) కింది వాక్యాలను పరిశీలించండి.
1. కల్నల్ సంతోష్ బాబు దేశం కోసం ప్రాణాలర్పించాడు. అతడు గొప్పవాడుగదా.
2. అందరు నిజముదెలిసి మసలుకోవాలి.
3. పాండవులు విరాటమహారాజు కొలువుసేసిరి.
4. లతకు ఏమి చేయాలో పాలువోక ఉంది.
గీత గీసిన పదాలను విడదీయండి.
ఉదా : గొప్పవాడు + కదా : గొప్పవాడుగదా
1. నిజము + తెలిసి = నిజము దెలిసి
2. కొలువు + చేసిరి = కొలువు సేసిరి
3. పాలు + పోక = పాలువోక
పై ఉదాహరణల్లో ప్రథమావిభక్తి ప్రత్యయాలైన డు-ము-వు-లు పూర్వపదం చివర ఉన్నాయి. పరుషాలైన క-చ-ట-త-ప లు పరపదం మొదట ఉన్నాయి. అప్పుడు వాటి స్థానంలో గ-స-డ-ద-వ లు ఆదేశంగా వచ్చాయి. ఒకానొక సమయంలో గసడదవలు రాకపోతే అవే రూపాలు యథాతథంగా ఉంటాయి. ఇలా రెండు విధాలుగా సంధి జరగడాన్ని గసడదవాదేశ సంధిలో గమనించవచ్చు.
సప్తమీ విభక్తి
ఆ) కింది వాక్యాలు చదవండి.
పై వాక్యాలను సరిచేసి తిరిగి రాయండి.
ఉదా : సరయునది తీరమందు కోసలదేశం ఉంది.
1. చాణుక్యుడు మాటల యందు నేర్పరి.
2. కాశీయందు గంగానది ఉంది.
3. తల్లికి పిల్లల యందు అనురాగం ఉంది.
4. గరుత్మంతునికి తల్లియందు భక్తి ఉంది.
పై పట్టికను గమనిస్తే ‘అందు’ అనే ప్రత్యయం వాక్యాలను అర్థవంతంగా మార్చింది. ఇలా వాక్యంలోని కొన్ని, పదాల మధ్యన చేరే ‘అందున్, నన్’ అనే ప్రత్యయాలను సప్తమీ విభక్తిగా చెప్పవచ్చు. సాధారణంగా సామీప్య, విషయ సంబంధాన్ని, అంతటా వ్యాపించటాన్ని గురించి చెప్పేటప్పుడు ‘సప్తమీ విభక్తి’ని ఉపయోగిస్తారు.
ఇ) కింది ఖాళీలను పూరించండి.
సమాస పదం | విగ్రహ వాక్యం | సమాసం పేరు |
ఉదా : వాయుపుత్రుడు | వాయువు యొక్క పుత్రుడు | షష్టీతత్పురుష సమాసం |
1. మా ఇల్లు | మా యొక్క ఇల్లు | షష్టీతత్పురుష సమాసం |
2. నా పుస్తకం | నా యొక్క పుస్తకం | షష్టీతత్పురుష సమాసం |
3. తల్లి మనసు | తల్లి యొక్క మనసు | షష్టీతత్పురుష సమాసం |
4. రాజు సైన్యం | రాజు యొక్క సైన్యం | షష్టీతత్పురుష సమాసం |
ఈ) సంధి పదాలను విడదీసి రాయండి.
ఉదా : ఫాలాక్షుడు = ఫాల + అక్షుడు – సవర్ణదీర్ఘ సంధి
1. ప్రళయాబ్ది = ప్రళయ + అబ్ది – సవర్ణదీర్ఘ సంధి
2. భయమేల = భయము + ఏల – ఉత్వ సంధి
3. బాలుడని = బాలుడు + అని – ఉత్వ సంధి
4. బడబాగ్ని = బడబ + అగ్ని – సవర్ణదీర్ఘ సంధి
5. నీవిప్పుడు = నీవు + ఇప్పుడు – ఉత్వ సంధి
6. వ్రాలినయట్లు = వ్రాలిన + అట్లు – యడాగమం
7. తీర్చినయట్లు = తీర్చిన + అట్లు – యడాగమం
8. ఎదురెవ్వరు = ఎదురు + ఎవ్వరు – ఉత్వ సంధి
9. బాలుడనని = బాలుడను + అని – ఉత్వ సంధి
10. పశుగణంబెదురే = పశుగణంబు + ఎదురె – ఉత్వ సంధి
ప్రాజెక్టుపని
మీకు తెలిసిన వీరవనితల చిత్రాలను సేకరించండి. వారి గురించి రాయండి.
జవాబు:
రాణి రుద్రమదేవి :
కాకతీయుల వంశంలో ఒక ధృవతారగా వెలిగిన మహారాణి రుద్రమదేవి. కాకతీయ వంశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యా లను పరిపాలించిన వీరవనితలలో అగ్రగణ్యురాలు రుద్రమదేవి.
ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతిదేవ చక్రవర్తి. ఆయనకు మగపిల్లలు లేరు. అందుచేత రుద్రాంబను కుమారుడిలా పెంచాడు. రుద్రదేవుడని నామకరణం చేశాడు. ఆమెను వీరభద్రుడికిచ్చి వివాహం చేశాడు.
క్రీ.శ. 1269లో ‘రుద్రమహారాజు’ అనే బిరుద నామంతో రుద్రమదేవి సింహాసనం అధిష్టించింది. స్త్రీని. పరిపాలకురాలిగా అంగీకరించని సామంతులు కొందరు తిరుగుబాటు చేశారు. రుద్రమ వారిని సమర్థవంతంగా అణచివేసింది. దేవిగిరి రాజుతో చేసిన యుద్ధం చాలా పెద్దది. కీలకమైనది. దిక్కు లేక అతను సంధికి దిగి వచ్చి మూడుకోట్ల సువర్ణాలు యుద్ధ పరిహారంగా ఇచ్చాడు. రుద్రమదేవికి రాయగజ కేసరి, ఘటోధృతి అనే బిరుదులున్నాయి. మార్కొపోలో రుద్రమ గురించి వివరంగా వ్రాశాడు. చక్కటి పరిపాలన నందించిన వీరవనిత రుద్రమదేవి.
ఝాన్సీ లక్ష్మీబాయి :
ఝాన్సీ లక్ష్మీబాయి 1828 నవంబరు 19న మహారాష్ట్రలో సతారలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయి. వీరిది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె చిన్నప్పటి పేరు మణికర్ణిక. ముద్దుగా ‘మను’ అని పిలిచేవారు. ఆమె 4వ ఏటనే తల్లి మరణించింది. చిన్నతనంలోనే గుర్రపు ” స్వారీ, కత్తియుద్ధం నేర్చుకొంది.
ఆమెను 13వ ఏట ఝాన్సీ రాజు గంగాధరరావు ఆమెను పెండ్లాడాడు. గంగాధరరావు మరణానంతరం ఝాన్సీని బ్రిటిషువారు కైవసం చేసుకోవాలనుకొన్నారు. కాని లక్ష్మీబాయి అంగీకరించలేదు. తిరుగుబాటు చేసింది. బ్రిటిషువారికి కంటిమీద కునుకు లేకుండా గెరిల్లా పోరాటాలు చేసింది. చివరకు బ్రిటిషువారి దుర్మార్గానికి 1858 జూన్ 18న గ్వాలియర్లో మరణించింది. ఆమె తండ్రిని బ్రిటిషువారు ఉరితీశారు. ఆమె వారసుడిగా దామోదర్ రావుని ప్రకటించారు.
చమత్కార పద్యం
కం. తోక వెనకాలనుండును అని
టీకప్పున నుండు మండుటెండలనుండున్
మోకాలు ముందునుందును
ఆకాశము పైననుండు అద్దిరభన్నా
పై పద్యములో చమత్కారాన్ని గమనించండి.
భావం :
ఈ పద్యంలో తోక వెనకాల, టీకప్పులో, మండుటెండలు, మోకాలుకు ముందు, ఆకాశం పైన ఏముంటుందని అడిగారు. ఇది ఒక చమత్కార పద్యము. పైకి అలా కనబడుతున్నా పద్యములో సమాధానం ఉంది. తోక ఎప్పుడూ వెనకాలే ఉంటుంది. టీ – కప్పులో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదవండి. మీకు పద్య చమత్కారం అర్థమౌతుంది.
ఉపాధ్యాయులకు సూచనలు
1. పల్నాటి వీరచరిత్రను సేకరించి చదవండి. విద్యార్థుల చేత చదివించండి.
2. పోరాటపటిమ పెంపొందించుకోడానికి ఉపకరించే మహనీయుల జీవిత చరిత్రలను కథారూపంలో విద్యార్థులకు వినిపించండి.
ఉదా : అల్లూరి సీతారామరాజు, రాజా రామ్మోహన్ రాయ్, గాంధీజీ, శివాజీ, భగత్సింగ్ మొదలైనవారు.
కవి పరిచయం
కవి పేరు : శ్రీనాథుడు.
ఉద్యోగం : పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు.
బిరుదులు : కవిసార్వభౌముడు.
రచనలు :
మరుత్తరాట్చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండం, హరవిలాసం, పల్నాటి వీరచరిత్రం, క్రీడాభిరామం మొదలైనవి.
ప్రత్యేకతలు : ఆయన రచించిన చాటు పద్యాలు చాలా ప్రఖ్యాతిని పొందాయి.
గేయాలు – అర్థాలు – భావాలు
1. అని తల్లి పలికిన ననియె బాలుండు
“భయమేల గొల్పెదు భామ నీ విపుడు
నలగాము డెరుగును నాదుశౌర్యంబు
ప్రళయకాలమునాటి భైరవురీతి
సైంధవవధ వేళ సాహసస్ఫూర్తి
విజయుడు రణములో విహరించునట్లు
కౌరవ సేనలో గదబట్టిదూరి
వడముడిరణమున వ్రాలినయట్లు
వాయుపుత్రుడు లంక వడితోడఁజొచ్చి
భస్మంబుగావించి ప్రబలినభంగి
రాక్షసరణములో రామచంద్రుండు
వీరపరాక్రమవిధి జెందినట్లు
జలధిమధ్యంబున సారెకుదిరుగు
మందర శైలంబుమాడ్కిఁ దోఁపంగ
ఫాలాక్షుఁడతి రౌద్రపటిమ మీఱంగ
త్రిపురముల్ గాలిచి తీర్చినయట్లు
అర్థాలు :
శౌర్యంబు = పరాక్రమము
భైరవుడు = శివుడు
ప్రళయకాలము = సృష్టి అంతమయ్యే సమయం
రణము = యుద్ధము
విజయుడు = అర్జునుడు
వడముడి = భీముడు
వాయుపుత్రుడు = హనుమంతుడు
వడి = వేగం
భస్మంబు = బూడిద
ప్రబలుట = విజృంభించుట
జలధి = సముద్రం
సారెకు = చక్రానికి
ఫాలాక్షుడు = శివుడు
శైలము = పర్వతం
మాడ్కి = వలె
రౌద్రపటిమ = రౌద్రం యొక్క గొప్పతనం
భావం :
తల్లి పలికిన తర్వాత బాలచంద్రుడు మాట్లాడు తున్నాడు. అమ్మా ! నీకు భయం వద్దు. నలగామరాజుకు బాలచంద్రుని పరాక్రమం తెలుసు. ప్రళయకాలంలో భైరవుడిలా, సైంధవ వధ జరిగేటపుడు అర్జునుడు రణరంగంలో తిరిగినట్లు తిరుగుతాను. కౌరవ సేనలోకి గదపట్టి దూరిన భీమసేనుడులా ప్రవేశిస్తాను. రాక్షసులతో యుద్ధంలో శ్రీరామచంద్రుడిలా ప్రవేశిస్తాను. సముద్రం మధ్యలో చక్రమై తిరిగిన మందర పర్వతంలా కనబడతాను. శివుడు రౌద్రంలో త్రిపురాలు కాల్చినట్లు నలగాముని సైన్యాన్ని కాలుస్తానని బాలచంద్రుడు తల్లితో అన్నాడు.
2. స్థావర జంగమ సకలవస్తువుల
ప్రళయాభై ముంచంగఁ బరగినరీతి
కామభూపదళము గడగడవణక
విక్రమక్రమశక్తి విడివడచొచ్చి
పృథ్విపై పీనుఁగు పెంటలుగాఁగ
విహరింతు మదిలోన వేడుకకొలఁది
ఉర్వీశు దళముల కురుమనిపిడుగ
గర్వించుపగవారి కంటిలో నెరుస
ఎదురెవ్వరే నాకు నీభువిలోన
నలగాముబలముల నలినలిచేసి
వండంగ తరగిన వడుపుననరికి
నెత్తురుమడుగులు నిండంగఁ జేతు
దహనునికడ్డంబె దట్టమౌ వనము
బడబాగ్ని నార్చునే పాధోథిమించి
భయదమౌపులికిని పశుగణం బెదురె
స్వాతికొక్కెరగుంపు సాళ్వంబు కెదురె
జింకలకదుపులు సివ్వంగికీడె
చిన్న మిర్యమునం చెడునె కారంబు
బాలుఁడనని నన్ను భావింపవలదు”
అనిన బాలుని మాట కైతమ్మ పలికె
అర్థాలు :
స్థావరము = కదలనివి
జంగమము = కదిలేవి
సకల వస్తువులు = అన్ని వస్తువులు
అబ్ది = సముద్రం
పరగిన = అతిశయించిన
రీతి = ప్రకారంగా (విధంగా)
కామభూపదళము= కామరాజు యొక్క సైన్యం
విడివడడం = విడిపోవడం
పృథ్వి = భూమి
పీనుగుపెంటలు = శవాలదిబ్బలు
వేడుక = ఉత్సవం
ఉర్వీశుడు = రాజు
దళము = సైన్యం
ఉరుమని = ఉరుములు లేని
పగవారు = శత్రువులు
కంటిలో నేరుసు = కంట్లో నలక
ఎదురు = ఎదిరించేవారు
నలినలిచేసి = పిండి పిండిచేసి
మడుగు = కొలను
దహనుడు = అగ్ని
వనము = అడవి
బడబాగ్ని = సముద్రంలో ఉండే అగ్ని
పాధోథి = సముద్రం
భయదము = భయమును కలిగించేది
పశుగణం = జంతువులు
కొక్కెర = కొంగ
సాళ్వము = డేగ
కదుపులు = సమూహాలు
సివ్వంగి = సివంగిఁ ఆడసింహం
భావం :
ప్రళయకాలంలో సమస్త వస్తువులను సముద్రంలో శివుడు ముంచినట్లుగా యుద్ధంలో నలగాముని సైన్యాన్ని ముంచుతాను. నలగామరాజు గడగడా వణికేలా వాళ్ల సైనిక శక్తి విడిపోయి భూమి మీద శవాల దిబ్బలయ్యేలా చేస్తాను. మనసులో ఉత్సాహం పెరుగుతుండగా నలగాముని సైన్యంపై ఉరమని పిడుగులా పడతాను. గర్వంతో ఉన్న శత్రువుకు కంటిలో నలుసునౌతాను. నాకు ఈ భూమండలంలో ఎదురెవ్వరూ లేరు. నలగాముని సైన్యాన్ని పిండిగుండా కింద నలిపేస్తాను. వండడానికి అనువైన కూర ముక్కలులా వారిని తరిగేస్తాను. నెత్తురు మడుగులు కట్టిస్తాను. దట్టమైన అడవి అగ్నికి అడ్డమా? బడబాగ్నిని. సముద్రం ఆర్పగలదా? భయంకరమైన పెద్దపులికి జంతువులు లెక్కా? డేగకు కొంగలు లెక్కా? జింకల గుంపులు సివంగికి లెక్కా? మిరియపు గింజ చిన్నదైనా కారం తగ్గదు కదా ! నేను బాలుడననుకోకు ! అని బాలుడు తల్లితో పలికెను.