SCERT AP Board 6th Class Telugu Solutions 6th Class Telugu వ్యాసాలు Notes, Questions and Answers.
AP State Syllabus 6th Class Telugu వ్యాసాలు
1. స్వచ్ఛభారత్
‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మనదేశ ప్రధాని నరేంద్రమోడీ గారు దేశంలోని కాలుష్యమును గమనించి, నదీజలములు అన్నీ కలుషితం కావడం చూసి, ఈ ‘స్వచ్ఛభారత్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులయిన వ్యక్తులను మోడీ గారు నియమించారు. అమితాబ్ బచ్చన్, రామోజీరావు వంటి వారు, ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్నారు. మన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికిపేటలు, గంగా, గోదావరి వంటి నదుల జలాలు నేడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విద్యార్థులూ, ఆఫీసులలో ఉద్యోగులూ తమ పాఠశాలలనూ, కార్యాలయాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలు తమ గృహాలనూ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి.
నదులు,చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్ఛతను కాపాడితే, దేశం ఆరోగ్యవంతం అవుతుంది. ప్రజలకు కావలసిన మంచినీరు లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన. పెద్దలు ఏనాడో చెప్పారు.
స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. దీన్ని ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పత్రికల వారు, దూరదర్శన్ వారు స్వచ్ఛభారత్ గురించి మంచి ప్రచారం చేయాలి. దానివల్ల దేశం సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
2. తెలుగు భాష గొప్పదనం
ఆగస్టు 29వ తేదీ ప్రసిద్ధ భాషావేత్త గిడుగు రామమూర్తి జయంతి. ఆనాడు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటారు. తెలుగు మన మాతృభాష. మాతృభాష కంటె మించిన సంపద మరొకటి లేదు.
ఎవరి భాషలు వారికి గొప్పవి. కాని ఆంగ్లేయులే మన భాషలోని మాధుర్యాన్ని గమనించి తెలుగు భాషను ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని కీర్తించారు. సి.పి. బ్రౌన్ అనే ఇంగ్లీషు దొర వేమన పద్యాలను ఆంగ్లభాషలోకి అనువదించి తన దేశం తీసుకొనిపోయాడు.
మన భారతదేశంలో ఎన్నో. భాషలు ఉన్నాయి. ఎన్ని భాషలు ఉన్నా అందరూ మన తెలుగు భాష విశిష్టతను కీర్తించినవారే. మన తెలుగుభాష ‘అజంత భాష’. ఇలా అచ్చుతో పదం ముగియటం తెలుగు భాషలో తప్ప ఏ భాషలో కనిపించదు. అది మన భాషకు అందాన్ని చేకూరుస్తుంది.
తెలుగు పద్యాలు, గేయాలు, సామెతలు, పొడుపుకథలు మొదలైనవన్నీ మన తెలుగు భాష గొప్పతనాన్ని, తియ్యదనాన్ని తెలియజేస్తాయి. అందుకే విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు మన భాషను ‘దేశభాషలందు తెలుగులెస్స’ అని పొగిడాడు. ఇంతటి కీర్తిని గన్న మన తెలుగుభాష ప్రాచీన భాషగా కూడా గుర్తింపబడింది.
3. ‘భారతదేశం గొప్పదనం’
మన భారతదేశం విశాలమయినది. ఉత్తరాన హిమాలయాలు, మిగిలిన దిక్కుల్లో సముద్రాలు, మన దేశానికి సహజ రక్షణను ఇస్తున్నాయి. ప్రపంచంలో చైనా తర్వాత జనాభా సంఖ్యలో మనదే రెండవ స్థానం.
మన దేశంలో మతాలు – భాషలు వేరయినా ప్రజలంతా ఒకే తాటిపై నిలుస్తారు. మనకు గంగా, గోదావరి వంటి జీవనదులు ఉన్నాయి. కావలసిన పంటలు పండుతాయి. మనది ప్రజాస్వామ్యదేశము. మనదేశంలో భారతము రామాయణము వంటి గొప్ప ఇతి హాసాలు పుట్టాయి. వేదాలు పుట్టాయి.
మనం క్రికెట్ లో ప్రపంచ కప్పు గెలిచాము. గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి గొప్ప నాయకులు మనకు ఉన్నారు. దేశాభివృద్ధికి కావలసిన సహజ వనరులు ఉన్నాయి. ”
4. నన్నయ భట్టు నాకు నచ్చిన కవి
“నన్నయభట్టు” (నాకు నచ్చిన కవి)
రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరం రాజధానిగా చాళుక్య సామ్రాజ్యాన్ని పాలించాడు. నన్నయ భట్టు ఆతని ఆస్థానంలో కవి. కులగురువు. సామాన్య జనులకు వేద ధర్మాలలోని గొప్పతనాన్ని తెలపడానికి రాజరాజు నన్నయ భట్టును తెలుగులో భారతాన్ని రచింపమన్నాడు.
ఆనాడు తెలుగులో రచన చేయడానికి ఎటువంటి భాష వాడాలనే విషయంలో ఒక స్పష్టత లేదు. నన్నయభట్టు ‘ఆంధ్రశబ్ద చింతామణి’ అనే వ్యాకరణం రాసి తెలుగు పదాలను ఉపయోగించే పద్ధతిలో ఒక స్పష్టత చేశాడు. వాగను శాసనుడు. శబ్దశాసనుడు అని పేరుగాంచాడు.
వ్యాకరణం రచించిన తరువాత తన మిత్రుడు, సహాధ్యాయి అయిన నారాయణ భట్టు సహాయం తీసుకొని, తెలుగులో భారతం రచించాడు. భారతంలో ఆది సభాపర్వాలను, అరణ్యపర్వంలో మూడు ఆశ్వాసాలను నన్నయ రచించాడు. తెలుగు భాషలో మొదటగా గ్రంథ రచన చేసి ‘ఆదికవి’ అని కీర్తింపబడ్డాడు.
భారతంలో ప్రధానంగా కౌరవపాండవుల కథ రాశాడు. ఆ కథతో పాటు మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి వంటి విషయాలు చెప్పాడు. ప్రతి కథలో మంచి సందేశం ఇచ్చాడు. నన్నయ భట్టు తెలుగు వారికి పూజ్యుడైన కవిశేఖరుడు.
5. సర్.సి.వి.
రామన్ సి.వి. రామన్ 1888లో తిరుచునాపల్లిలో పార్వతీ అమ్మాళ్, చంద్రశేఖర అయ్యర్ దంపతులకు జన్మించాడు. బాల్యం నుండి పరిశోధనపై ఆసక్తి ఉండేది. బాలమేధావిగా పేరుపొందాడు. 13 ఏళ్ళకు ఇంటర్ పూర్తిచేసి బి.ఏ. మొదటి తరగతిలో ఉత్తీర్ణుడు అయ్యాడు. భౌతిక శాస్త్రంలో యమ్.ఎ. చదివాడు.
కలకత్తాలో ఆర్థికశాఖ ఉపశాఖాధికారిగా ఉద్యోగంలో చేరాడు. ‘భారత వైజ్ఞానిక వికాస సంఘం’ సంస్థలో పరిశోధన ప్రారంభించాడు. కలకత్తా విశ్వవిద్యాలయం సైన్సు కాలేజీలో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా చేరాడు. ఎంతోమంది భారతీయులను పరిశోధనకు ప్రోత్సహించాడు.
రామన్ నిత్యం పరిశోధనలు చేస్తూ “భారతదేశపు మేధావంతుడైన శాస్త్రజ్ఞుడు” అని పేరు పొందాడు. సూర్యునికాంతి ప్రయాణించేటప్పుడు కొన్ని పదార్థాలు కొన్ని రంగుల్ని గ్రహించి మరి కొన్నింటిని బయటకు విడుస్తాయని రామన్ కనిపెట్టాడు. సముద్రం సూర్యకాంతిలో నీలం రంగును బయటకు విడుస్తుంది. అందువల్లే సముద్రం నీరు నీలంగా ఉంటుందని రామన్ పరిశోధించాడు.
1930లో రామను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం రామనకు సర్ బిరుదాన్ని ఇచ్చింది. రామనకు ఎన్నో బహుమతులు వచ్చాయి. 1934లో రామన్ బెంగుళూరులో “ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్”ను స్థాపించి, దానికి తన ఆస్తిని అంతా రాసి ఇచ్చాడు. రామన్ గొప్ప శాస్త్రవేత్త.
6. గ్రంథాలయాలు
తరతరాల విజ్ఞాన సంపదను, అందించేవి గ్రంథాలు. అటువంటి గ్రంథాలు గల నివాసాన్ని గ్రంథాలయం అంటారు.
ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలయాలు ఉన్నాయి. అమెరికాలోని ‘కాంగ్రెసు లైబ్రరీ’, రోమ్ నగరంలోని ‘వాటికన్ లైబ్రరీ’ మొదలైనవి ప్రపంచంలో పేరు పొందాయి. మన దేశంలో చెన్నైలోని ‘కన్నెమరా’ గ్రంథాలయం, తంజావూరులోని, ‘సరస్వతీ మహలు’, హైదరాబాదులోని ‘శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం’, వేటపాలెంలోని ‘సారస్వత నికేతనం’ మొదలైనవి చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయి.
అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నాళం కృష్ణారావు మొదలైన వాళ్ళు మన రాష్ట్రంలో గ్రంథాలయోద్యమాన్ని చేపట్టి గ్రంథాలయాలను స్థాపించారు.
గ్రంథాలయాలలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు ఉన్నాయి. గ్రంథాలయాలవల్ల చాలా లాభాలున్నాయి. గ్రంథ పఠనంవల్ల విజ్ఞాన వినోదాలు పొందవచ్చు. అక్కడ లభించే దిన, వార, పక్ష, మాసపత్రికలను చదివి రాజకీయ, సాహిత్య, క్రీడారంగాది విషయాలు తెలుసుకోవచ్చు. గ్రంథాలయాలు మనిషిని మనిషిగా మారుస్తాయి. దేశాభ్యుదయానికి, సమాజ వికాసానికి మూలస్తంభాలు గ్రంథాలయాలు.
7. కంప్యూటర్
కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. కంప్యూటర్ లో ‘డేటా’ ను నిల్వచేయవచ్చు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ చాలా కచ్చితంగా, త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైన కంప్యూటర్‌ను కనిపెట్టినవాడు ఛార్లెస్ బాబ్బేజి.
కంప్యూటర్ వల్ల చాలా లాభాలున్నాయి. కూడికలు, తీసివేతలు, గుణకారాలు (హెచ్చవేతలు), భాగహారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనికివస్తుంది. కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు.
విమానాలు, బస్సులు, రైళ్ళు మొదలైన వాటి టెక్కెట్ల రిజర్వేషన్లకు కంప్యూటర్లను ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్యా, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి.
కంప్యూటర్‌ను ఉపయోగించి ఇంటర్నెట్ అనే సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటిని మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు. ఆధునిక విజ్ఞాన ప్రగతికి నిదర్శనం కంప్యూటర్.
8. పర్యావరణం
పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం. మనచుట్టూ ఉండేది పరిసరం. పరిసరమంతా కాలుష్యంతో నిండిపోయింది. మానవ జీవితంపై యీ పరిసరాల కాలుష్య ప్రభావం ఉంటుంది. అదే అనారోగ్యానికి కారణమవుతుంది. కాబట్టి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
పరిసరాలలో కాలుష్యం మూడు రకాలుగా ఉంటుంది. అవి :
- జలకాలుష్యం
- ధ్వని కాలుష్యం
- వాతావరణ కాలుష్యం.
1) జలకాలుష్యం :
నదుల్లో, కాలువల్లో, చెరువుల్లో స్నానాలు చేయడం, బట్టలుతకడం, పశువుల్ని కడగడం మొదలైన కారణాల వల్ల నీరు కలుషితమౌతుంది.
2) ధ్వనికాలుష్యం :
రోడ్లపై కార్లు, మోటార్ల హారన్స్, భారీ యంత్రాల కదలికలు, కర్మాగారాల శబ్దాలు మొదలైన వాటివల్ల ధ్వని కాలుష్యం ఏర్పడుతుంది.
3) వాతావరణ కాలుష్యం :
కర్మాగారాలు, బస్సులు, కార్లు, స్కూటర్లు మొదలైన వాటి నుండి వ్యర్థ వాయువులు పొగరూపంలో వాతావరణంలో ప్రవేశిస్తాయి. అందువల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది.
పర్యావరణం కాలుష్యం కాకుండా ఉండాలంటే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాలుష్యాలను నిరోధించాలంటే ఇంటా బయటా అంతటా చెట్లు విరివిగా పెంచాలి. ఇందువల్ల మంచి గాలి వస్తుంది. పరిసరాలు సమతుల్యం అవుతాయి.
9. అక్షరాస్యత
‘విద్య లేనివాడు వింత పశువు’ అని పెద్దలంటారు. చదవడం, రాయడం, లెక్కలు నేర్చుకోవటమే అక్షరాస్యత.
విద్య నేర్చినవాడు అన్ని రంగాల్లో రాణిస్తాడు. కాబట్టి అందరూ బాగా చదువుకోవాలి. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మనదేశంలో చదువుకున్నవారి శాతం చాలా తక్కువ. దీనికి కారణాలు ప్రజల్లో చైతన్యం లేకపోవడం మరియు పేదరికం.
ప్రభుత్వం ప్రత్యేకంగా వయోజనులకోసం అక్షరాస్యతా పథకాలు ప్రారంభించింది. పగలంతా పనుల్లో మునిగిపోయినవారికోసం రాత్రి పాఠశాలలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం జిల్లాల వారీగా సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమాలు చేపట్టింది.
పనిపాటలు చేసుకుంటూ చదువుకోవాలనుకునేవారికోసం, మధ్యలో బడి మానేసిన పిల్లలకోసం అనియత విద్యాకేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే ఇంట్లో కూర్చొని తీరిక వేళల్లో చదువుకోడానికి వీలుగా సార్వత్రిక పాఠశాల విద్య ఏర్పాటు చేశారు.
మనదేశంలో జనవిజ్ఞాన వేదిక, భారత జ్ఞాన విజ్ఞాన సమితి వంటి స్వచ్ఛంద సంస్థలు సాక్షరతా ఉద్యమంలో మంకు ఆ విద్వాప్పుడు నాలు. ఎక్కువగా పాల్గొంటున్నాయి. సుఖసంతోషాలతో బతకాలంటే ప్రతివ్యక్తి విద్యావంతుడు కావాలి.
10. ఆధునిక సాంకేతిక ప్రగతి
మానవ జీవితంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉపయోగం నిత్యకృత్యమయింది. గడియారం, రేడియో, టేప్ రికార్డర్, టి.వి., టెలిఫోన్, ఫ్రిజ్ ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువుల జాబితాను చెప్పవచ్చు. ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల జాబితాలోకి చెందిన వాటిలో కంప్యూటర్ ముఖ్యంగా పేర్కొదగింది. ఆధునిక సాంకేతిక ప్రగతికి నిదర్శనం కంప్యూటర్.
ఒకనాడు టెలిఫోన్ కనిపెట్టినందుకు, రేడియో తయారు చేసినందుకు ఆశ్చర్యపోయాం . ఇప్పుడు దేశ విదేశాలకు నేరుగా వెంటనే మాట్లాడే అవకాశం ఏర్పడింది. మూవింగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఫోన్లు, కాలెస్ ఫోన్లు, సెల్యులర్ ఫోన్లు ప్రవేశించాయి. ‘షేర్’ అనే అద్భుత సాధనం అందుబాటులోకి వచ్చింది. ‘దూరదర్శన్’ మనకి ఈనాడు అత్యవసర సాధనమయింది. ఇవన్నీ ఆధునిక సాంకేతిక ప్రగతికి నిదర్శనాలే.
కంప్యూటర్‌ను కనుక్కోవడంతో ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఇది కంప్యూటర్ యుగం అనిపించుకుంటోంది. మనిషికన్నా వేగంగా చకచకా శాస్త్రీయంగా కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. “ఇంతింతై వటుడింతయై ……………..” అన్నట్లుగా ఈనాడు కంప్యూటర్ అన్ని రంగాలలో విస్తరించింది. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా కంప్యూటర్ తప్ప మరోమాట వినిపించదు.
మనిషి కొన్ని రోజుల్లోగానీ అందించలేని సమాచారం కంప్యూటర్ కొన్ని క్షణాల్లోనే అందిస్తుంది. కంప్యూటర్ లోని ఇంటర్నెట్ సదుపాయంవల్ల ప్రపంచంలో ఏ మూలనైనా జరిగే వింతలు విశేషాలూ క్షణాల్లో తెలుసుకోగలం. ఇంటర్నెట్లో ఉన్న గొప్ప సదుపాయం ఇ – మెయిల్ (e-mail). దీని ద్వారా మనం అనుకున్న సమాచారాన్ని కంప్యూటర్ లో ఇంటర్నెట్ కలిగి ఉన్న మరొక వ్యక్తికి కొన్ని క్షణాల్లోనే అందజేయవచ్చు. ఈ విధంగా ఆధునిక సాంకేతిక ప్రగతి దినదినాభివృద్ధి చెందుతోంది.
11. వార్తా పత్రికలు
వార్తలను అందించే పత్రికలను వార్తాపత్రికలు అంటారు. ప్రాచీనకాలంలో వార్తలను చేరవేయడానికి మనుషుల్ని, జంతువుల్ని, పక్షుల్ని వాడేవారు. విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందిన తరువాత ముద్రణాయంత్రాలు కనిపెట్టబడ్డాయి. వార్తాపత్రికల వ్యాప్తి జరిగింది.
ప్రపంచంలో మొట్టమొదటగా వెనిస్ నగరంలో వార్తాపత్రిక ప్రారంభించబడిందని చెప్తారు. సుమారు క్రీ.శ. 1620 నాటికి వార్తాపత్రికలు వచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ‘ఇండియా గెజిట్’ అని కొందరూ, ‘బెంగాల్ గెజిట్’ అని కొందరూ చెబుతారు. 1850 నుంచి మన దేశంలో పత్రికల ప్రచురణ అధికమైంది.
వార్తాపత్రికలు అనేక భాషలలో వెలువడుతున్నాయి. మన ఆంధ్రభాషలో ఈనాడు, వార్త, అంధ్రభూమి, ఆంధ్రప్రభ, సాక్షి, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర మొదలైనవి బాగా ప్రచారంలో ఉన్న దినపత్రికలు.
వార్తాపత్రికలవల్ల లాభాలు చాలా ఉన్నాయి. వీటివల్ల ప్రపంచవార్తలు తెలుసుకోవచ్చు. విజ్ఞానం పెరుగుతుంది. ఇవి ప్రభుత్వం చేపట్టే పనులూ, లోపాలూ ప్రజలకి తెలియజేస్తాయి. ప్రజల కష్టనష్టాలూ, సమస్యలూ, అభిప్రాయాలూ ప్రభుత్వానికి తెలియజేస్తాయి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు వార్తాపత్రికలు కరదీపికలలాంటివి. ఇవి జాతీయాభివృద్ధికి, జాతి సమైక్యతకు దోహదపడతాయి.
12. దూరదర్శన్ (టి.వి.)
విజ్ఞానశాస్త్ర ప్రగతికి, మానవుడి ప్రతిభకి నిదర్శనం టెలివిజన్. ఇది బ్రిటన్లో 1936లో మొదట వ్యాప్తిలోకి – వచ్చింది. దీనిని స్కాట్ దేశపు ఇంజనీర్ జాన్ లాగ్ బర్డ్ 1928లో కనిపెట్టాడు.
రేడియోలో శబ్దాన్ని మాత్రమే వింటాం. శబ్దంతో పాటు దృశ్యాన్ని చూసే అవకాశం టెలివిజన్లో ఉంటుంది. టెలివిజన్ ఈనాడు ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. టి.వి.లు లేని ఊరు లేదు.
టి.వి.ల వల్ల చాలా లాభాలున్నాయి. ఇది కేవలం ప్రచార సాధనమో, వినోద సాధనమో కాదు. దీనిద్వారా ప్రభుత్వం, వాణిజ్య సంస్థలు ప్రచారం చేసుకోవచ్చు. మనం స్వయంగా వెళ్ళి చూడలేని ప్రదేశాలెన్నో ఇందులో చూడవచ్చు.
విద్యారంగంలో, వైద్య రంగంలో, వాణిజ్య రంగంలో, విజ్ఞానశాస్త్ర రంగంలో ఈనాడు టెలివిజన్‌కు తిరుగులేని స్థానం ఉంది. నిరక్షరాస్యతా నిర్మూలనలో టెలివిజన్ కీలకపాత్ర వహిస్తోంది. ప్రజల్ని అన్ని రంగాలలోనూ చైతన్యవంతం చేస్తున్న శక్తివంతమైన సాధనం టెలివిజన్. ‘వీడియో’ పరిజ్ఞానానికి టి.వి. మూలకారణం. మన సంస్కృతిని కళలను కాపాడుకోవడానికి టి.వి. ఎంతగానో ఉపయోగపడుతుంది.
టి.వి.ల వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. వీటివల్ల కొందరు వృధా కాలయాపన చేస్తున్నారు. విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతోంది. ఎక్కువగా చూడటంవల్ల కండ్ల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
13. ఒక పండుగ (దీపావళి)
మనం జరుపుకొనే ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఇది ప్రతిసంవత్సరం ఆశ్వయుజమాసం కృష్ణపక్షంలో వస్తుంది. దీన్ని రెండు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు నరక చతుర్దశి. రెండోరోజు దీపావళి అమావాస్య. ఈ దీపావళి పండుగను మన దేశంలో అన్ని రాష్ట్రాలవారు జరుపుకొంటారు.
నరక చతుర్దశిని గూర్చి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం నరకుడనే రాక్షసుడు లోకాల్ని బాధిస్తుండేవాడు. ఆ బాధలు భరించలేక ప్రజలు శ్రీకృష్ణునితో మొరపెట్టుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకునిపై యుద్ధానికి వెళ్ళి వాడిని సంహరించాడు. నరకుడు మరణించినందుకు ప్రజలందరూ సంతోషించారు. అది చతుర్దశినాడు జరిగింది. కాబట్టి నరక చతుర్దశి అనే పేర పండుగ చేసుకున్నారు. నరకునివల్ల. చీకటిలో మ్రగ్గిన ప్రజలు వెలుగు చూశారు. కాబట్టి దీపాల వెలుగులో మరునాడొక పండుగ చేసుకున్నారు.
నరక చతుర్దశి రోజు తెల్లవారు జామున లేచి పిల్లలు, పెద్దలు శిరస్నానం చేస్తారు. నూత్న వస్త్రాలు ధరించి, పిండివంటలతో భోజనాలు చేస్తారు. ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. దీపావళి రోజు రకరకాల టపాకాయలు, మతాబులు, చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలవంటి మందు సామానులు కాలుస్తారు. కొందరు దీపావళి పండుగరోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.
14. లాల్ బహదూర్ శాస్త్రి (జాతీయ నాయకుడు)
లాల్ బహదూర్ 1904 వ సంవత్సరం అక్టోబర్ రెండో తేదీన వారణాసిలో జన్మించాడు. ఆయన తల్లి పేరు రామ్ దులారీదేవి, తండ్రి శారదా ప్రసాద్.
లాల్ బహదూర్ కాశీ విశ్వవిద్యాలయం నుండి ‘శాస్త్రి’ పట్టా పొందాడు. ఆనాటి నుండి లాల్ బహదూర్ శాస్త్రిగా ‘ పిలువబడ్డాడు. ఆయన భార్య పేరు లలితాదేవి.
మన దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో జవహర్ లాల్ నెహ్రూకు కుడిభుజంగా పనిచేశాడు. రవాణా, తంతి తపాలా శాఖలు, హోం శాఖ, పరిశ్రమల శాఖ, వాణిజ్య శాఖ, రైల్వేశాఖల మంత్రిగా భారతదేశానికి ఎంతో సేవ చేశాడు.
నెహ్రూ తర్వాత శాస్త్రి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. “జై జవాన్, జై కిసాన్” అన్న నినాదంతో భారతదేశాన్ని ఉర్రూతలూగించాడు. ఆయనలో పట్టుదల ఎక్కువ. నైతిక విలువలకు, నిజాయితీకి, నిరాడంబరతకు పెట్టింది పేరు. ఆయన 1966వ సంవత్సరం జనవరి పదకొండవ తేదీన మరణించాడు.
15. విజ్ఞాన యాత్రలు (విహార యాత్రలు)
విజ్ఞానాన్ని సంపాదించాలనే కోరికతో విద్యార్థులు చేసే యాత్రలను విజ్ఞాన యాత్రలు అంటారు. వీటినే ‘విహారయాత్రలనీ, వినోదయాత్రలనీ’ అంటారు.
పుస్తక పఠనంవల్ల పుస్తక జ్ఞానం మాత్రమే లభిస్తుంది. లోకానుభవం, ప్రజల ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే పర్యటనలు తప్పనిసరిగా చేయాలి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా గ్రహించాలంటే యాత్రలు చేయాలి. ఉదాహరణకు నీటి నుంచి విద్యుత్ ఎలా లభిస్తుందో పుస్తకాలలో వివరంగా ఉంటుంది. అది చదివితే కొంతమాత్రమే తెలుస్తుంది. జల విద్యుత్ కేంద్రానికి వెళ్ళి, పనిచేసే విధానాన్ని పరిశీలించినప్పుడు అది సంపూర్ణ జ్ఞానం అవుతుంది. ముఖ్యంగా చరిత్ర, సైన్సు వంటి విషయాలను అర్థంచేసుకోడానికి యాత్రలు ఎంతో అవసరం.
విజ్ఞాన యాత్రలవల్ల చాలా లాభాలు ఉన్నాయి. వీటివల్ల లోకజ్ఞానం అలవడుతుంది. మానసిక విశ్రాంతి లభిస్తుంది. విభిన్న సంస్కృతుల్ని, భాషల్ని, జీవన విధానాల్ని తెలుసుకోవచ్చు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యార్థులలో ఐకమత్యం పెంపొందుతుంది.
విజ్ఞానయాత్రలు లేదా విహారయాత్రలు కేవలం విద్యార్థులకే అనుకోవడం సరికాదు. అన్ని వయస్సుల వాళ్ళకీ, అన్ని వృత్తుల వాళ్ళకీ ఇవి అవసరమే.
16. చలనచిత్రాలు (సినిమాలు)
చలనచిత్రాలు అంటే ‘కదిలే బొమ్మలు’ అని అర్థం. వీటినే సినిమాలు అంటారు. పూర్వం ప్రజల విజ్ఞాన వినోదాల కోసం తోలుబొమ్మలాటలు, భామా కలాపాలు, వీథినాటకాలు ప్రదర్శింపబడుతుండేవి.
కెమేరాలు కనిపెట్టబడ్డ తరువాత ‘మూకీ’ చిత్రాలు ప్రదర్శించేవారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన తరువాత ‘టాకీ’ చిత్రాలు వచ్చాయి. ప్రపంచంలో నేడు చలనచిత్రరంగాన హాలీవుడ్ పేరుగాంచింది. మన దేశంలో ముంబాయి సినీరంగాన పేరుగాంచింది.
ప్రజలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదాన్ని పొందడానికి ఈ సినిమాలు ఉపయోగిస్తాయి. ప్రపంచంలోగానీ, దేశంలోగానీ ఉన్న వివిధ సుందర దృశ్యాల్ని సినిమాలలో చూసి ఆనందించవచ్చు. సినిమాలు సాంఘికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా గొప్ప ప్రచార సాధనాలు.
నేడు ఈ పరిశ్రమ పెక్కుమందికి జీవనోపాధిని కలిగిస్తున్నది. అనేకమంది నటీనటులు, కళాకారులు దీనివల్ల ఐశ్వర్యవంతులవుతున్నారు. కార్మికులు, విద్యార్థులు, పిన్నలు, పెద్దలు అందరూ వీటిని చూసి మానసిక విశ్రాంతిని, వినోదాన్ని పొందుతున్నారు.
ఈ సినిమాలను సరైన పద్ధతిలో తీయకపోతే సమాజానికి చెడు కలుగుతుంది. కాబట్టి నిర్మాతలు కేవలం వ్యాపారదృష్టితోనే కాక, కళాత్మకపు విలువలను, నైతిక విలువలను పెంచే చిత్రాలను నిర్మించాలి.
17. రేడియో (ఆకాశవాణి)
రేడియోను ‘మార్కొని’ అనే ఇటలీ దేశస్థుడు కనిపెట్టాడు. శబ్దతరంగాలను విద్యుత్తరంగాలుగా మార్చి నిస్తంత్రీ విధానంతో ప్రపంచంలోని అన్ని మూలలకు ఎక్కడెక్కడి విషయాలను తెలియజేసే అద్భుత సాధనం రేడియో.
మన దేశంలో రేడియో కేంద్రాలు పెద్ద పెద్ద నగరాలలో ఉన్నాయి. వాటిని బ్రాడ్ కాస్టింగ్ స్టేషన్లు అంటారు. కొన్ని ఉపకేంద్రాలు ప్రసారం మాత్రమే చేస్తాయి. వాటిని రిలే కేంద్రాలు అంటారు.
రేడియోలో వార్తలు, సంగీతం, నాటకాలు, సినిమాలు, హరికథలు, ప్రసంగాలు ప్రసారం చేయబడతాయి. అలాగే రైతులకు వ్యవసాయ కార్యక్రమాలు, మహిళలకు మహిళామండలి కార్యక్రమాలు, బాలబాలికలకు బాలానందం, యువకులకు యువవాణి కార్యక్రమాలు ప్రసారం చేయబడతాయి. ఈ
ఇంకా భక్తిరంజని కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, విద్యావిషయకమైన కార్యక్రమాలు, క్రీడలు, ధరవరలు, ప్రకటనలు మరెన్నోరకాల కార్యక్రమాలు రేడియోలో ప్రసారం చేయబడతాయి.
అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందిస్తూ, ప్రజలలో దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాల్ని పెంపొందింపజేస్తున్న అద్భుతసాధనం రేడియో.
18. గ్రామ సచివాలయాలు
2019 అక్టోబరు 2న నవ్యాంధ్రప్రదేశ్ సరికొత్త శకానికి నాంది పలికింది. గ్రామసీమలు స్వచ్ఛంగా ఉండాలని, అందుకు గ్రామ స్వరాజ్యమే ఏకైక మార్గమని గాంధీజీ అభిలషించారు. ఆ అభిలాషకు జీవంపోస్తూ గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. “ఈ ‘ప్రపంచంలో నీవు చూడాలనుకున్న మార్పు నీతోనే ఆరంభం కావాలి” అని మహాత్మాగాంధీ చెప్పిన మాటలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాంది పల్కింది.
1959వ సం||రంలో “బల్వంతరాయ్ కమిటీ” నివేదిక ఆధారంగా మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఏర్పాటైంది. ఈ అంచెలే గ్రామపంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లాపరిషత్. తరువాతి కాలంలో గ్రామపంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ గా వ్యవస్థీకృతమైనాయి. 73 రాజ్యాంగ సవరణ ద్వారా 29 శాఖలకు సంబంధించిన నిధులు, విధులు, అధికారాలు స్థానిక సంస్థలకు బదలాయింపు జరిగింది.
2001 సం||రంలో గ్రామ సచివాలయం ప్రవేశపెట్టినా గ్రామ ప్రజలకు సేవలు అందించకుండానే ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇంతేగాక సమాంతర వ్యవస్థల్ని ప్రవేశపెట్టి పంచాయతీరాజ్ సంస్థల్ని నిర్వీర్యపరిచారు.
ఈ పరిస్థితుల్లో ఈనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణులకు పలు సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశ్యంతో నవరత్నాలలో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి కంకణం కట్టుకుంది. ఇప్పటికే గ్రామ వాలంటీర్ల నియామకం జరిగింది.
గ్రామ ప్రజలకు పలు సేవలు అందించే ఉద్దేశ్యంతో ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమించారు. వీరి ద్వారా గ్రామీణ ప్రజలు ప్రభుత్వపరంగా లభించే సర్టిఫికెట్లు, సేవలు,సంక్షేమ పథకాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో పంచాయతీ సంక్షేమ కార్యదర్శి, పోలీసు అసిస్టెంటు, గ్రామ రెవెన్యూ ఆఫీసర్, గ్రామ సర్వేయర్, హార్టికల్చర్ అసిస్టెంటు, ఇంజనీరింగ్ అసిస్టెంటు పోస్టుల్ని మంజూరుచేసింది. గ్రామ సచివాలయాల ద్వారా అవసరమైన ధ్రువపత్రాల జారీ నుంచి విద్యుత్తు బిల్లుల చెల్లింపు, గ్రామపంచాయతీ నిధుల విడుదల వినియోగం తదితర వివరాలు అందుబాటులో ఉంచాలి. రైతులకు మేలైన విత్తనాలు సరఫరా చేయడం, అవసరమైన క్రిమి సంహారక మందులు సరఫరా చేయడం, మేలైన పశువైద్యం, పింఛన్ల పంపిణీ, కుటీర పరిశ్రమలకు ఆర్థిక సహాయం, మార్కెటింగ్ కల్పన, భూములకు సంబంధించిన రికార్డులు త్వరితగతిన అందజేయడం వంటివి జరగాలి. వీటితోపాటు గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, పంచాయతీ నిధుల విడుదల వినియోగంపై సమాచారం కూడా అందజేయవలసిన అవసరం ఉంది. ఇదంతా గ్రామవాలంటీర్ల బాధ్యతే. అందుకని గ్రామవాలంటీర్లు గ్రామ ప్రజలకు, సచివాలయాలకు అందుబాటులో ఉండి శ్రద్ధగా, సమర్థవంతంగా పనిచేయాల్సి ఉంది.
ఈ దశలో గ్రామ సచివాలయం పటిష్ఠతకు ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పంచాయతీలకు నిధులు సకాలంలో సమకూర్చడం, పంచాయతీ సొంత నిధుల వినియోగంపై CFMS తొలగించడం, సకాలంలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి కేంద్రప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల్ని రాబట్టుకోవాలి. అలాగే సిబ్బందికి ఎప్పటికప్పుడు తాజా సాంకేతిక నైపుణ్యం అందజేయడం, నిధుల వినియోగంపై ఆన్లైన్ ద్వారా తనిఖీ చేసే అధికారం పంచాయతీ విస్తరణాధికారికి కల్పించడం వంటివి చేయాల్సి ఉంది. కార్యక్రమాల అమలుకు మండల స్థాయిలో మరొక పంచాయతీ విస్తరణాధికారిని నియమించాలి. నిర్ణీత తేదీల్లో గ్రామ సభలు ఖచ్చితంగా జరిగేలా . చూడాలి. సచివాలయ నిర్ణయాలను మండల స్థాయిలో నెలకొకసారి సమీక్షించడం తప్పనిసరిగా జరగాలి. వీటన్నితోపాటు పంచాయతీ ఉద్యోగుల సమస్య కూడా ప్రభుత్వం పరిష్కరించాలి. ముఖ్యంగా పంచాయతీ తాత్కాలిక సిబ్బంది సేవల్ని క్రమబద్దీకరించాలి. అన్నిస్థాయిల్లో గల ఖాళీలను వెంటనే భర్తీ చెయ్యాలి. మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, డివిజినల్ పంచాయతీ అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు కల్పించడం ద్వారా ఆర్థిక అక్రమాల్ని అరికట్టే అవకాశముంటుంది. గణాంక ఆడిట్ విభాగాల ఏర్పాటు తప్పనిసరి. ఈవిధంగా గ్రామ సచివాలయాల్ని బలోపేతం చేయడం వల్ల మహాత్మాగాంధీ కన్న కలలు నిజమౌతాయి.
19. న్యా యమిత్ర
సామాన్యుడు ఆశించే వ్యవధిలోగా, కేసుల పరిష్కారం లభించాలని న్యాయస్థానాల ముఖ్య ఉద్దేశ్యం. దిగువస్థాయి న్యాయస్థానాల నుండి జిల్లా కోర్టులకు, అక్కడ నుండి హైకోర్టుకు, సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళి న్యాయం కోసం పోరాటం చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోవడం, అధికారులు, ప్రజల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, స్వల్పకాలానికి అధికారంలోకి వస్తున్న పార్టీలు వ్యవస్థను అతలాకుతలం చేయడంలో వ్యాజ్యాలు పెరిగాయి. వేలకొలది కేసులు పెండింగ్ లో పడ్డాయి. ఈ కేసుల విషయంలో సామాన్యుని పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అందుకని సామాన్యునికి సత్వర న్యాయం అందించేందుకు కేంద్రప్రభుత్వం ‘న్యాయమిత్ర’ పథకాన్ని 2017 వ సం||రంలో ప్రవేశపెట్టింది.
1986వ సం||రంలోనే ‘లా’ కమీషన్ గ్రామ న్యాయాలయాల ఏర్పాటు అంశంపై నివేదికను ఇచ్చింది. 2002 సం||రంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2007 నాటికి ప్రతి పదిలక్షలమంది జనాభాకు 50 మంది న్యాయమూర్తులుండాలి. ఇపుడున్నది కేవలం 16 మంది మాత్రమే.
భారత రాజ్యాంగం 39వ ఆర్టికల్ ఆదేశిక సూత్రాల్లో భాగంగా గ్రామ న్యాయాలయాల ముసాయిదా బిల్లు రాజ్యసభలో 2007 సం||రంలో ప్రవేశపెట్టబడింది. రాజ్యసభ బిల్లును అన్ని ప్రభుత్వ శాఖలకు, స్టాండింగ్ కమిటీలకు, న్యాయశాస్త్ర కోవిదులకు పంపించి, ప్రజాభిప్రాయ సేకరణ చేసి, హైకోర్టు రిజిస్ట్రార్లతో ఒక భేటీ నిర్వహించి, వారి అభిప్రాయాలను కూడా తీసుకుని ఆ తర్వాత ముసాయిదాలో సవరణలు తెచ్చారు. లోక్ సభలో ఆమోదం అనంతరం కేంద్రప్రభుత్వం 2008 సం||రంలోగా బిల్లుగా తీసుకువచ్చింది. ఈ బిల్లు 2 అక్టోబరు 2009 నుండి అమలులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా తొలిదశలో 6000 న్యాయాలయాలను ఏర్పాటుచేయాల్సి ఉంది. పేదలకు వారి ఇంటివద్దనే న్యాయం అందించడమే దీని లక్ష్యం. కొత్త కేసులతో పాటు పాతకేసులను కూడా ఈ న్యాయాలయాలకు బదిలీ చేయాలని తొలుత నిర్ణయించారు.
గ్రామ న్యాయాలయాల్ని కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కనీసం ఏడాదిపాటు వ్యయాన్ని కేంద్రం భరిస్తుంది. తర్వాత కాలంలో కేంద్రం కొంతమేర ఆర్థికసాయం చేస్తుంది. కేవలం చట్టాల పరిధికే పరిమితం కాకుండా సహజ న్యాయ సూత్రాలకు లోబడి పనిచేయాలనే కీలక అంశం ఈ గ్రామ న్యాయాలయాల నిర్వహణలో ఉండడం అనేది అందరికీ కలిసొచ్చిన విషయం.
గ్రామాల్లో న్యాయ సహాయాన్ని తక్షణమే అందించేందుకు, సలహా సంప్రదింపులకు, మధ్యవర్తిత్వానికి, లోక్అదాలత్ ఏర్పాటుకు, ఉచిత న్యాయసహాయం, పేదలకు, బాలలకు, మహిళలకు అల్పసంఖ్యాక వర్గాల వారికి తక్షణ సాయం అందించేందుకు వీలుగా గ్రామ న్యాయాలయాలు పనిచేస్తాయి.
గ్రామ న్యాయాలయాల చట్టం – 2008ని హైకోర్టుకు పంపించి గ్రామ న్యాయాధికారుల్ని నియమించాలి. వారికి ప్రథమశ్రేణి మెజిస్టేట్ హెూదాతో పాటు సమాన జీతభత్యాల్ని చెల్లించాలి. ప్రతి నగర పంచాయతీ, గ్రామపంచాయతీల్లో కోర్టుల్ని ఏర్పాటు చేయాలి. మొబైల్ కోర్టుల్ని ఏర్పాటు చేయడంతోపాటు సివిల్, క్రిమినల్ కేసుల్ని కూడా విచారించే అధికారం ఈ న్యాయాలయాలకు ఉంటుంది. ఆస్తి కొనుగోలు, కాలువనీరు వినియోగంలో వివాదాలు, కనీస వేతన చట్టం అమలు, వ్యవసాయభూమి భాగస్వామ్య వివాదాలు గ్రామ న్యాయాలయాల పరిధిలోకి వస్తాయి. సివిల్ కేసుల్ని తొలుత రాజీమార్గంలో పరిష్కరించాల్సి ఉంటుంది.
గ్రామ న్యాయాలయాలు ఇచ్చే తీర్పులపై ఒక అప్పీలుకు వీలుంటుంది. తీర్పు అనంతరం 30 రోజుల్లో అసిస్టెంట్ జవద్ద అప్పీలు చేసుకోవచ్చు. తర్వాత ఈ తీర్పులపై అప్పీలుండవు. తద్వారా హైకోర్టులపై భారం తగ్గుతుంది. ఈ చట్టాన్ని 8 చాప్టర్లు, 40 క్లాజులతో రూపొందించారు.
మనదేశంలో 11 రాష్ట్రాల్లో 320 పంచాయతీల్లో మాత్రమే న్యాయాలయాల ఏర్పాటుపై నోటిఫై చేయగా అందులో 204 మాత్రమే తమ కార్యకలాపాల్ని ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా 50వేల పంచాయతీల్లో ప్రారంభంకానున్నాయి. ఇవి కూడా ప్రారంభమైతే గాంధీజీ కన్నకలలు పండి గ్రామాభ్యుదయం జరుగుతుందనుట నిర్వివాదాంశం.
20. సుజల స్రవంతి
ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడున్న సాగునీటి వనరుల్ని అభివృద్ధి చెయ్యాలి. ఉత్తరాంధ్రలో మొత్తం 23.24 లక్షల ఎకరాలు సాగుభూమి ఉండగా అందులో కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. ఉత్తరాంధ్ర ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి కష్టాల్ని పరిష్కరించడానికై ఒకే ఒక్కమార్గం “బాబూ జగజ్జీవనరామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి” ప్రాజెక్టును పూర్తిచేయడమే తప్ప మరో మార్గం లేదు.
విశాఖపట్టణంలో 3.21 లక్షల ఎకరాలు; విజయనగరంలో 3.94 లక్షల ఎకరాలు; శ్రీకాకుళం జిల్లాలో 0.85 లక్షల ఎకరాలు; మొత్తం 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 12 వందల గ్రామాలకు తాగునీరు లభిస్తుంది. 53.40 TMCలు పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతుల్ని GO.MS No. 3 తేది 02 – 01 – 2009న 7,214. 10 కోట్ల రూపాయలతో పూర్తిచేయడానికి ఉత్తర్వులు జారీ చేశారు.
అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వై.యస్. రాజశేఖరరెడ్డి 21 ఫిబ్రవరి 2009న ఈ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారు. దీన్ని గురించి తర్వాత వచ్చిన నాయకులెవ్వరూ పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ 2014 సం||రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడానికి “ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధన సమితి” వివిధ ప్రజా సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో పలు ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో అప్పటి ప్రభుత్వంలో చలనం వచ్చి ఈ ప్రాజెక్టు పనులపైన కొంత దృష్టి సారించింది.
5 సెప్టెంబరు 2017న G.O.MS No. 53 ప్రాజెక్టుకు మొదటి దశ పనులకు 2022.22 కోట్లకు పరిపాలనా అనుమతుల్ని మంజూరు చేసింది. 2009 నాటి ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 7,214.10 కోట్ల వ్యయం అవుతుంది. ధరల పెరుగుదల, రూపాయి విలువ తరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రాజెక్టు వ్యయం కనీసం 30,000 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రభుత్వం కేటాయించిన విధంగా నిధులు ఇస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తికావడానికి కనీసం 176 ఏళ్ళు పడుతుంది.
గోదావరి వరదనీరు వృధాగా సముద్రంలోకి కేవలం 120 రోజులపాటు కాలువల్లోకి ఎత్తిపోసి, 196 కిలోమీటర్లు పొడవునా కాలువలు నిర్మించి నాలుగు రిజర్వాయర్లలో నిలువ చేయడం ద్వారా ఉత్తరాంధ్ర సాగు, తాగు నీరు అవసరాలు తీర్చేందుకు ఈ ప్రాజెక్టును నిర్దేశించారు. పోలవరం ఎడమ కాలువనుండి ఉత్తరాంధ్రకు నీటిని మళ్ళించేందుకు మూడుచోట్ల ఎత్తిపోతల పథకాలను నిర్మించాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద మొదటిదశలో 28 మీటర్లు పాపాయిపాలెం వద్ద రెండవదశలో 45 మీటర్లు, చివరి దశలో 4 రిజర్వాయర్ల వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాల్సి ఉంది. విశాఖజిల్లా రావికమతం వద్దనున్న పెద్దపూడి రిజర్వాయర్, భూదేవి రిజర్వాయర్, విజయనగరం జిల్లాలోని S. కోట వద్దనున్న వీరనారాయణం రిజర్వాయర్ తాటిపూడి వద్ద ఎటెన్షన్ రిజర్వాయర్లను నిర్మించాల్సి ఉంది. మొత్తం 4 రిజర్వాయర్లలో 19.70 టి.యం.సీల నీటిని నిలువ చేసేందుకు 339 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది.
వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు గోదావరి జిల్లాలకు దీటుగా అభివృద్ధి చెందాలంటే ఉత్తరాంధ్ర ‘సుజల స్రవంతి’ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడమే శరణ్యం తప్ప మరో మార్గం లేదు. ఈ ప్రాంత అభివృద్ధికి జీవనాధారమైన ప్రాజెక్టు పనులు చేపట్టాలని ప్రతి ఒక్కరూ గొంతెత్తాల్సిన సమయం ,ఆసన్నమైంది.
21. అమ్మ ఒడి
మన ఆంధ్రప్రదేశ్ లో చదువుకోని సంఖ్య ఇంకను 40% ఉందని చారిత్రకుల అంచనా. పైచదువులు చదువుటకై ఆర్థిక స్తోమత లేనివారు, 30% ఉన్నారు. బాల్యంలో చదువుకొనుటకు ఆర్థిక స్తోమత లేని పేదవారికి ధనసహాయం ప్రభుత్వమే చేసి చదివిస్తుంది. ఇలా సహకారంగా చేయూతనిచ్చే పథకానికి ‘అమ్మ ఒడి’ పథకం అని పేరు. అక్షరాస్యతను పెంచడమే అమ్మ ఒడి పథకం లక్ష్యం.
అమ్మ ఒడి పథకానికి ప్రభుత్వం కొన్ని అర్హతల్ని నిర్దేశించింది. అవి (1) ప్రభుత్వం జారీచేసిన తెల్లరేషన్ కార్డు ఉండాలి. (2) లబ్దిదారుని తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి. (3) ఈ పథకం 1వ .తరగతి నుండి ఇంటర్మీడియట్ స్థాయి వరకు వర్తిస్తుంది. (4) విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగియుండాలి. (5) ప్రభుత్వ ఉద్యోగస్థులు ఈ పథకానికి అర్హులు కారు. పిల్లల్ని బడికి పంపే ప్రతి పేదతనికి ప్రతిసం||రం రూ. 15,000 రూపాయల్ని ఇస్తుంది. అన్ని ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థుల తల్లులకు ఇస్తారు. దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు, తద్వారా దాదాపుగా 82 లక్షలమంది పిల్లలకు లబ్ధి చేకూరుతుంది. ఇందుకుగాను ప్రభుత్వం రు. 6456 కోట్లు ఏటా ఖర్చు చేస్తుంది.
భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లులు గురించి వారి పిల్లల గురించి ఆలోచించి 9 జనవరి 2020న చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించారు. చదువుకు పేదరికం అడ్డురాకుండా సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే నేటి ప్రభుత్వ లక్ష్యం.
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యాబోధన కావిస్తూ, తప్పనిసరి సబ్జక్టుగా తెలుగును చదవాలి. 2020 – 21 విద్యాసంవత్సరం నుండి అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన ; ఆ తర్వాత సం||రం నుండి 7వ తరగతి, ఆ తర్వాత 8వ తరగతి దశలవారీగా ప్రతి సం||రం ఒక్కో తరగతిని పెంచుకుంటూ నాలుగేళ్ళలో 10వ తరగతి బోర్డు పరీక్షలు ఇంగ్లీషు మీడియంలో వ్రాసే విధంగా బోధన జరుగుతుంది.
మధ్యాహ్న భోజన మెనూను మార్చి నాణ్యతను పెంచి పౌష్టికాహారం అందించటానికిగాను 353 కోట్లు .. కేటాయించారు. 21 జనవరి 2020 నుండి దీన్ని ప్రారంభిస్తారు. సోమవారం నాడు అన్నం, పప్పుచారు, ఎగ్ కర్రీ, చిక్కి, మంగళవారం నాడు పులిహోర, టమాటాపప్పు, ఉడికించిన గుడ్డు, బుధవారం నాడు కూరగాయలతో అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి గురువారం నాడు పెసరపప్పు అన్నం (కిచిడి), టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు, శుక్రవారం నాడు అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి శనివారం నాడు అన్నం, సాంబారు, స్వీట్ పొంగలి. ఈ విధంగా బాలబాలికలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మధ్యాహ్న భోజనం ఏర్పాటు, చేసింది.
తర్వాత డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కోర్సులు చదివే ST, SC, BC, EBC, కాపు, దివ్యాంగ, మైనార్టీ , మరియు పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయంబర్స్మెంటు చేయుట. ఈ ఫీజు రీయింబర్స్మెంటు పథకం – అర్హతకు – వార్షిక ఆదాయం పరిమితి రు.2.5 లక్షలకు పెంపు చేశారు.
అంతేకాకుండా ST.SC, BC, EBC, కాపు, దివ్యాంగ, మైనార్టీ మరియు పేదవిద్యార్థులకు వసతితో భోజనం ఏర్పాటు చేయుటకు అయ్యే ఖర్చు రు. 20,000 రెండు దఫాల్లో ఇస్తారు. మొదటి దఫా రు. 10,000 జనవరి, ఫిబ్రవరిలోను; . రెండవ దఫా రు. 10,000 లు జులై-ఆగష్టులలో చెల్లిస్తారు.
ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో నున్న పేద విద్యార్థులకు మౌఖిక మరియు సాంకేతిక సౌకర్యాల్ని ప్రభుత్వం కల్పించింది. నిరక్షరాస్యత సమూలంగా నశింపచేస్తారు. ప్రతి పేదవిద్యార్థి ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తారు. మేము పేదవాళ్ళం అనే భావన ఉండదు. చదువుకోవాలని ఆసక్తి కల్గుతుంది. ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్న సూక్తి నేడు నిజం అవుతోంది. దేశభక్తి విద్యార్థుల్లో అభివృద్ధి అవుతుంది. మానవులంతా ఒక్కటే అనే జ్ఞానం కల్గుతుంది. విద్యార్థులంతా కలసి అన్నదమ్ముల్లా మెలగుట వల్ల తరతమ భేదాలు నశిస్తాయి.
ఏమైనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల బాధ్యతాయుతంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం ముదావహం. ప్రతి విద్యార్థి అక్షర జ్ఞానాన్ని సంపాదించుకొని మేధావులవుతారన్నది అక్షరసత్యం.
22. నాడు – నేడు (విద్యావ్యవస్థ)
ఈనాటి విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండుటవలన నేటి ప్రభుత్వం ‘నాడు – నేడు’ అనే పేరుతో ఒక పథకాన్ని 14 నవంబరు 2019న ప్రారంభించింది. ఇప్పుడున్న పాఠశాల పరిస్థితిని ఫోటో తీసి రికార్డు చేస్తారు. తర్వాత ఆ పాఠశాలకు కావలసిన సౌకర్యాల్ని రూపొందించి ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. పూర్తి అయిన తదుపరి మరల ఫోటోతీస్తారు. నాటికీ – నేటికీ ఉన్న తేడాను గమనిస్తారు. తర్వాత ఇంకను కావలసిన అవసరాలుంటే వాటిని కూడా పూర్తిచేస్తారు. ఇదియే ‘నాడు – నేడు’ పథక ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14 నవంబరు 2019న ప్రకాశం జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా సుమారు 45,000 పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 151 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 3287 ప్రభుత్వ హాస్టళ్ళ రూపురేఖలు సమూలంగా ఈ కార్యక్రమం క్రింద అభివృద్ధి చేయాలని నిర్దేశించారు.
పాఠశాలల్లో మౌలిక వసతులైన మరుగుదొడ్ల నిర్మాణం, ప్రహరీల్ని నిర్మించుట, క్రీడామైదానాన్ని ఏర్పాటు చేయుట, ఫర్నిచర్ ను రూపొందించుట, కరెంటు, ఫ్యాన్లను ఏర్పాటు చేయుట, పక్కా భవనాల్ని నిర్మించి వాటికి రంగులు వేయుట ఇవన్నీ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయుట, ఇందుకోసం ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని నేటి ప్రభుత్వం వెల్లడించింది. ప్రతిపాఠశాలలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి జాబితాను సిద్ధం చేసుకొని పారదర్శకంగా నిర్వహించి పరీక్షిస్తారు. ప్రతి పాఠశాలలో తొమ్మిది రకాల పనుల్ని చేపట్టాలని ఈనాటి ప్రభుత్వం ఆదేశించింది. మూడుదశలుగా ఈ కార్యక్రమాల్ని అమలుచేస్తారు. ఈ కార్యక్రమంలో విద్యాకమిటీల్ని భాగస్వామ్యం చేస్తారు.
విద్యాసంవత్సరం ప్రారంభమైన వెంటనే పుస్తకాలు, జతబూట్లు పంపిణీ చేస్తారు. అవసరమైన పాఠ్యప్రణాళికలతో విద్యార్థుల సంఖ్యకు తగ్గ ఉపాధ్యాయులుండేలా చర్యలు చేపడతారు. తొలిదశలో 15వేల పాఠశాలల్లో అమలుచేస్తారు. అంతేకాక మండలాల్లో ఉత్తమ హైస్కూల్ ని ఎంపికచేసి జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చేస్తారు. 500 మంది విద్యార్థులున్న హైస్కూళ్ళను ఈ పరిధిలోకి తెస్తారు. 2020 -2021 విద్యాసంవత్సరం నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. 2021 నాటికి 9వ తరగతికి అమలుచేస్తారు. అంతేగాక పాఠశాలలు తెరిచే నాటికి 3 జతల యూనిఫామ్ లు, పుస్తకాలు, నోటు పుస్తకాలు, బెల్ట్ బ్యాగ్ తో కూడిన కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఆంగ్లభాషా నైపుణ్యాన్ని పెంపొందించేలా ప్రతిపాఠశాలలో ఇంగ్లీషు ల్యాబీలు ఏర్పాటుచేయుట. ఈ పథకం అమలుకు 14 వేల
కోట్లు కేటాయిస్తారు.
పాఠశాలలకు సంబంధించిన పరిపాలనా అంశాలతో పాటు నిర్వహణలో కూడా పిల్లల తల్లిదండ్రులతో కూడిన విద్యాకమిటీలు కీలకపాత్ర పోషిస్తాయి. పాఠశాల అభివృద్ధి తర్వాత దశలో జూనియర్, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, ఐటిఐ, గురుకుల పాఠశాలలు, హాస్టళ్ళను అభివృద్ధి చేస్తారు.
ఇంకను పాఠశాలలకు కావల్సిన సైన్స్ లాబ్స్, సోషల్ లాబ్, లైబ్రరీలు ఏర్పాటుచేసి, విద్యార్థుల విజ్ఞానానికి దోహదం చేస్తారు. ఇలా చేయడం వల్ల ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉత్తమ విద్యార్థిగా ఎదుగుటకు అవకాశం కల్గుతుంది. అన్ని రంగాల్లో కూడా విజ్ఞానాభివృద్ధిని పెంపొందించుకుంటారు. చదువుతో పాటు ఆటలుకూడా విజ్ఞానాభివృద్ధికి దోహదం చేస్తాయి. ఆటలందు మంచి క్రీడాకారులుగా ఎదిగి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆటలాడి ఉత్తమ క్రీడాకారులవుతారు.
ఏమైనను నేటి ప్రభుత్వం విద్యావ్యవస్థ యందు తీసుకున్న నిర్ణయాల వల్ల ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దబడతారు.
23. వలసలు
జీవనోపాధి కొరకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళడాన్ని వలసలు అని అంటారు. ఇవి అనేక రకాలుగా ఉంటాయి. ఒక ఊరి నుండి మరొక ఊరికి; పల్లె నుండి పట్నానికి ; పట్నం నుండి పల్లెకు ; ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి ; ఒక దేశం నుండి మరొక దేశానికి ; ఒక ఖండం నుండి మరొక ఖండానికి జీవనం కొరకు వలసలు వెడుతుంటారు. వలసలు వెళ్ళడానికి సైతం విభిన్న పరిస్థితులతో కూడుకొని ఉంటాయి. పెళ్ళిళ్ళరీత్యా మరియు చదువుల నిమిత్తం కొందరు ; బ్రతుకు దెరువుకై కొందరు ; వ్యాపార నిమిత్తం మరికొందరు వలసలు వెడుతుంటారు.
వివిధ దినపత్రికలు, టీవీలలో, మాసపత్రికలలో వెలువడిన వ్యాసాలు, పరిశోధన పత్రం ద్వారా దీనిని విపులంగా వివరించిన మాట వాస్తవం. ప్రభుత్వం సైతం వాటిని నియంత్రించడానికి పలు పథకాల్ని ప్రవేశపెట్టినప్పటికీ అనుకున్నంత ప్రగతి సాధించలేదన్నది నిజం.
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా తయారయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లలో చేపట్టే అభివృద్ధి పథకాల్ని కాంట్రాక్టర్లకు అప్పగించడం ఆనవాయితీ. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో పనిచేసే పనివారి గురించి తెలుసుకుంటే గుండె తరుక్కుమనక మానదు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పట్నాలకు వలసలు వెళ్ళే కార్మికులు భవనాల నిర్మాణంలో ఎక్కువగా పనిచేస్తూ, మిగతా చిన్న చితక పనులు చేయడానికి మొగ్గుచూపుచున్నారు. వారి సంపాదన తక్కువగా ఉండి ఖర్చులు అధికంగా ఉండటం మూలంగా నగరాల్లో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ కాలం గడుపుతుంటారు.
బీహార్ రాష్ట్రం నుంచి వలస కార్మికులు కొంతమంది తెలంగాణాలోని జాతీయ రహదారులకు ఇరువైపుల ధనవంతులు వ్యసాయం భూమిని కొనుగోలు చేసి అక్కడ వివిధ పండ్లతోటల పెంపకం చేపడుతూ, అందులో పనిచేయడానికి ఈ రాష్ట్రం నుండి వచ్చిన వ్యక్తుల్ని నియమించుకోవడం జరుగుతోంది. అలాగే బడా కాంట్రాక్టర్లు వివిధ రహదారుల ఏర్పాటు నిమిత్తం రకరకాల బ్రిడ్జిలు, వంతెనలు, ప్రాజెక్టులు, డ్యాముల నిర్మాణంలో పనిచేసే కార్మికులు ఎక్కువగా ఈ ప్రాంతానికి చెందినవారు.
బోర్ వెల్స్ లో పనిచేసే కార్మికుల్లో అత్యధికమంది ఛత్తీస్ డ్ కు చెందిన ఆదివాసులే ఉన్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ, ఎలాంటి లాభార్జన లేకుండా ఏదో మోటు కష్టానికి పరిమితమై పనిచేస్తూ ఎప్పుడు ఎక్కడ ఉంటారో వారికే తెలియకుండా పనిచేస్తూ కాలం గడుపుతుంటారు.
భాగ్యనగరంలో ఇటుకల తయారీలో ఎక్కువగా ఒడిషా రాష్ట్రానికి చెందినవారే ఉన్నారు. వారు నామమాత్రపు డబ్బులు తీసుకొని యజమానుల క్రింద పనిచేస్తుంటారు. పేదరికంతో ముందుగానే వారి వద్ద డబ్బులు తీసికొని అప్పు తీర్చుటకు నెలలకొద్దీ పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణాకు వలసలు వచ్చి పండ్లతోటలలో పనిచేస్తున్నారు.
“ఎన్నో కష్టాలు, మరెన్నో చీదరింపులు, వేధింపుల మధ్య పనిచేస్తూ పొట్టకూటి కోసం పనిచేస్తున్న వలసకూలీల బ్రతుకులను మార్చేవారే లేరు సరికదా! అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టినా ఆ ఫలాలు ఎవరికి వెళుతున్నాయో అర్థం కాని పరిస్థితి.
దేశంలో రోజు రోజుకు నిరుద్యోగత పెరిగిపోతోంది. ఎలాంటి ఉన్నతమైన చదువులు చదివినా నేటికీ తల్లిదండ్రులపై ఆధారపడి జీవించే పరిస్థితులు నెలకొన్నాయి. ‘కనుక ముందు ప్రభుత్వాలు మేల్కొని పల్లెల్లో వ్యవసాయానికి తగిన పరిశ్రమలు నెలకొల్పాలి. అర్హత కలిగిన వారికి ఉద్యోగాలివ్వాలి. కూలీలకు శాశ్వతమైన వేతనంతో కూడిన పనిని కల్పించాలి. ప్రజలు వలసలు వెళ్ళకుండా ప్రభుత్వమే అరికట్టాలి.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలసకూలీల పట్ల, శ్రామిక వర్గాల పట్ల అండగా ఉంటూ, రక్షణనిస్తూ, ఉద్యోగ భద్రతను కల్పిస్తూ, వారిని అన్ని విధాలుగా ఆదుకునేలా ప్రత్యక్ష చర్యలు తీసుకునే విధంగా చట్టాల్ని రూపొందించాలి. ఈ వలసల నియంత్రణను కావించాలి. వలసలు వెళ్ళేవారికి ఆర్థికపరమైన భరోసా ఇవ్వాలి. అప్పుడే మన భారతదేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందనటంలో అతిశయోక్తి లేదు.
24. కరోనా
కరోనా వైరస్ చైనాలోని ఊహాన్ నగరంలో పుట్టి అన్ని ప్రాంతాలకు పాకుతుండడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ఈ వైరస్ అడ్డుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొదట ఈ వైరస్ ఎలా పుట్టిందో అన్న విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నాల్లో అనేక సంచలన విషయాలు తెలిశాయి.
చైనాలో కైట్, కోబ్రా అను రెండూ కూడా విషపూరితమైన సర్పాలు, ఎక్కువగా ఉంటాయి. ఈ విషపూరితమైన … పాములు కరవడం వల్ల లేదంటే వాటిని తినడంవల్లను వైరస్ సోకి ఉండవచ్చు అని అంటున్నారు. ఈ వైరస్ సోకిన 28 రోజుల్లోగా మనిషి మరణిస్తాడు. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. దీన్ని ఎదుర్కోవడానికి యాంటీయాక్షన్ మెడిసన్ తయారుచేసే పనిలో నిమగ్నమై పోయింది చైనాదేశం. ఇప్పటికే వేలకొలది మనుష్యులకు వైరస్ సోకిందని చైనా ప్రభుత్వం చెప్తోంది.
కొత్తగా పుట్టుకు వచ్చిన – ‘కరోనా’ వైరస్ ప్రాణాంతకంగా మారుతోంది. ఇది శ్వాస వ్యవస్థపై పంజా విసరి ప్రాణాల్ని హరిస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు.
1937వ సం||రంలో ఈ కరోనా వైరస్ ను కనిపెట్టారు. ఈ వైరస్ ఎక్కువగా కోళ్ళు , చుంచు ఎలుకలు, ఎలుకలు, కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పందులు, ఆవులు, గేదెలు, ఒంటెలు, గబ్బిలాల ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమౌతోంది. కొన్నిరకాల కరోనా వైరస్లు మానవుల్లో కూడా సాధారణ జలుబు, ఫ్లూఫీవర్ వంటి స్వల్పకాలిక వ్యాధులకు కారణమవుతున్నాయని 1960 సం||రంలో గుర్తించారు. కాలక్రమేణా ఈ వైరస్లో ఉత్పరివర్తనలు జరిగి మనిషికి ప్రాణాంతక వైరస్లుగా మారాయని వైద్య పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరురకాల హ్యూమన్ కరోనా వైరస్లను గుర్తించారు. వీటినే 229 E – ఆల్ఫా కరోనా వైరస్ ; OC 43 — బీటా కరోనా వైరస్ ; HRU. I – బీటా కరోనా వైరస్ ; సార్స్ కరోనా వైరస్ ; మెర్స్ కరోనా, వైరస్ ; నోవెల్ కరోనా వైరస్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం చైనాలోని ఊహాన్ – నగరంలో విజృంభిస్తున్న వైరసను నోవెల్ కరోనా వైరస్ గా గుర్తించారు.
ఈ వైరస్ సోకిన రెండు మూడు రోజుల్లోనే లక్షణాలు బయటపడతాయి. వ్యాధి లక్షణా జిట్టి మైల్డ్, మోడరేట్, సేవియర్ లక్షణాలుగా విభజించారు. మైల్డ్, మోడరేట్ లక్షణాల్లో ముక్కుల నుంచి స్రావాలు కారడం (రన్నింగ్ నోస్), దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, నీరసం, నిస్సత్తువ, ఫ్లూజ్వరం, కామన్ కోల్డ్ లాంటి లక్షణాలుంటాయి. వైరస్లు 1 శ్వాసనాళాలు, శ్వాసకోశాలకు వ్యాపించినపుడు బ్రాంకైటీస్, న్యుమోనియా లక్షణాలు బయటపడతాయి. తీవ్ర జ్వరం, ఆయాసం, దగ్గు, ఊపిరి పీల్చడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలుంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, అవయవాలు మార్పిడి చేయించుకున్న వారిలో క్యాన్సర్, ఎయిడ్స్ బాధితుల్లో, ఎక్కువ కాలం విచక్షణా రహితంగా స్టెరాయిడ్స్ వాడిన వారిలో, ఊపిరితిత్తుల వ్యాధుల బాధితులు, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణుల్లో వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
మంచినీరు, పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. వ్యాధి లక్షణాలు గుర్తించిన “వెంటనే నిపుణులైన వైద్యుల్ని సంప్రదించాలి. వ్యాధిపై అప్రమత్తతతో ఉండి ముఖానికి మాస్క్ ధరించాలి. వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలకు, కోళ్ళఫారాలు, జంతు సంరక్షణశాలలు, కబేళాల దగ్గరకు వెళ్ళకూడదు. అనుమానితులకు ఇతరులు దూరంగా ఉండాలి. దగ్గినా, తుమ్మినా కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలి. తరచూ చేతుల్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విధంగా మానవాళి జాగ్రత్తలను పాటించినచో మానవులు ఎటువంటి రోగాల బారినపడకుండా సుఖంగా ఉంటారు.