SCERT AP Board 6th Class Telugu Solutions 7th Lesson మమకారం Textbook Questions and Answers.
AP State Syllabus 6th Class Telugu Solutions 7th Lesson మమకారం
6th Class Telugu 7th Lesson మమకారం Textbook Questions and Answers
వినడం – ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరు ఉన్నారు?
జవాబు:
ఇద్దరు పిల్లలు, ఒక తల్లి ఈ చిత్రంలో ఉన్నారు.
ప్రశ్న 2.
చిత్రంలోని అమ్మాయి అమ్మకు తన స్నేహితురాలిని ఎలా పరిచయం చేస్తుంది?
జవాబు:
తన స్నేహితురాలు పేరు చెప్పింది. ఆ అమ్మాయి చదువుతున్న తరగతి చెప్పింది. ఏ బెంచీలో కూర్చుంటారో చెప్పింది. వారిద్దరి స్నేహం గురించి చెప్పి పరిచయం చేసింది.
ప్రశ్న 3.
మీ స్నేహితులు మీ అమ్మానాన్నలను ఏమని పిలుస్తారు?
జవాబు:
కొంతమంది స్నేహితులు మా అమ్మానాన్నలను ఆంటీ, అంకుల్ అంటారు. కొంతమంది పిన్నిగారూ, బాబాయి గారూ అంటారు. కొంతమంది అత్తయ్యగారూ, మామయ్యగారూ అంటారు.
అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
మీ భాష అంటే మీకు ఎందుకు ఇష్టమో చెప్పండి.
జవాబు:
మా భాష తెలుగుభాష. అది మా మాతృభాష. మా ఇంట్లో అందరం మాట్లాడుకొనే భాష. మా స్నేహితులంతా మాట్లాడుకొనే భాష. మా చుట్టుప్రక్కల వారంతా మాట్లాడే భాష. రోజూ నేను మా తాత దగ్గర కథలు వినేది మా మాతృభాషలోనే, రోజూ మా మామ్మ దగ్గర మా భాష (తెలుగు)లోనే ఎన్నో పాటలు, పద్యాలు, పొడుపు కథలు, సామెతలు, జాతీయాలు, చమత్కారాలు వింటాను. నేర్చుకుంటాను. అందుకే మా (తెలుగు) భాషంటే మాకు చాలా చాలా ఇష్టం.
ప్రశ్న 2.
ఏది స్వర్గంతో సమానమైనదని రచయిత అన్నాడో రాయండి.
జవాబు:
పిల్లల కేరింతలూ, ఆటలూ, వాళ్ల మధ్య చిట్టి పొట్టి తగవులూ, కొట్లాటలూ, ఏడుపులూ ఒకవైపు కొనసాగుతుండాలి. మరొక వైపు వదిన మరదళ్ల సరసాలూ, విరసాలు, బావ బావమరుదుల వెక్కిరింతలూ, జాణతనాలూ సాగుతుండాలి. అక్కా చెల్లెళ్లూ, తమ్ముళ్లూ వాళ్ల ఒద్దికలూ, ప్రేమలూ, ఆప్యాయతానురాగాలూ ఉండాలి. ఇలా ఎక్కడయితే ఇల్లంతా సందడిగా ఉంటుందో ఆ ఇల్లు స్వర్గంతో సమానమని రచయిత అన్నారు. తమ అత్తగారిల్లు అటువంటి స్వర్గతుల్యం అని ఆయన అభిప్రాయం.
ప్రశ్న 3.
బంధువుల ఇంట్లో రచయితకు కనిపించిన కొత్త వాతావరణం ఏమిటో రాయండి.
జవాబు:
రచయిత ఒక ఆదివారం బళ్లారిలోని అత్తవారింటికి వెళ్లాడు. అక్కడ వదిన, మరదళ్ల సరసాలు, పిల్లల అల్లరి, పెద్దల హడావిడీ అంతా రచయితకు చాలా ఇష్టం.
కాని, అక్కడ వాతావరణం అలా లేదు. కొత్త వాతావరణం కనిపించింది. అదేమిటా అని పరిశీలించాడు. గతంలో లాగా వాళ్ల సంబోధనలు లేవు. చిన్నాయనా-పిన్నీ, మామా-అత్తా పిలుపులను ఆంటీ, అంకుల్ తో సరిపెడుతున్నారు. అట్లా పిలుస్తున్నది రచయిత మరదళ్ల పిల్లలే.
రచయితకు తెలుగులో పిలవడం, పిలిపించుకోవడం అలవాటు, ఇష్టం. తెలుగు సంస్కృతి కూడా ఇష్టం. కానీ, అక్కడ ఆ వాతావరణం లేదు. అదే విషయం మరదళ్ళకు చెబితే వాళ్లు మొగాలు మాడ్చుకొన్నారు. తన భార్య తనకు అలా ప్రవర్తించకూడదని కూడా చెప్పింది.
ప్రశ్న 4.
కింది కరపత్రాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆలయ పరిరక్షణ అందరి బాధ్యత భక్తులారా ! ఇట్లు, |
అ) ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది?
జవాబు:
కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర విష్ణు దేవాలయం ఉంది.
ఆ) ఈ కరపత్రం ప్రచురించింది ఎవరు?
జవాబు:
అమరావతిలోని అఖిలాంధ్ర ఆలయ పరిరక్షణ సంఘంవారు ఈ కరపత్రం ప్రచురించారు.
ఇ) నా భాష తెలుగు భాష – అని చెప్పింది ఎవరు?
జవాబు:
నా భాష తెలుగు భాష అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు.
ఈ) ఆముక్తమాల్యద గ్రంథం రాసింది ఎవరు?
జవాబు:
ఆముక్తమాల్యద గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు రచించారు.
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
అత్త-మామ, పిన్ని-బాబాయి, బావ బావమరిది…. ఇలా మీకు తెలిసిన బంధువాచక పదాలు పది రాయండి.
జవాబు:
అమ్మ – నాన్న, అన్న – వదిన, తమ్ముడు – మరదలు, అక్క – బావ, చెల్లి – బావ, పెద్దమ్మ – పెదనాన్న, తాత – మామ్మ, తాతయ్య – అమ్మమ్మ, పెద్దత్త – పెద్ద మామయ్య, చిన్నత్త – చిన్న మామయ్య.
ప్రశ్న 2.
‘సత్యం’ కుటుంబాన్ని చూసి రచయితకు ‘మమకారం’ ఎందుకు కలిగింది?
జవాబు:
సత్యం ఇంటికి వెళ్లగానే వాళ్లబ్బాయి ఆరేళ్ళవాడు ‘మామా’ అని అభిమానంగా పలకరించాడు. “నువ్వు రాజు మామవని మా నాన్న చెప్పాడు”, అని ఆ అబ్బాయి అనడంతో వారి అభిమానానికి, చక్కటి వరస పెట్టి పిలవడం . చూసి రచయిత పొంగిపోయేడు. ఆ పిల్లలు, తండ్రిని ప్రశ్నలు వేయడం, సత్యం వాటికి విసుక్కోకుండా జవాబులు చెప్పడం చూసి రచయితకు ముచ్చటేసింది. మళయాళీ అయిన సత్యం భార్య కూడా చక్కగా తెలుగు మాట్లాడుతుందని తెలుసుకొని చాలా ఆనందించాడు. తను కోరుకొనే తెలుగు కుటుంబాన్ని సత్యం ఇంట చూసిన రచయితకు ఆ కుటుంబంపై మమకారం కలిగింది.
ప్రశ్న 3.
ఈ కథ “ఎందుకో నా కళ్లల్లో నీటి పొర…” అని ముగుస్తుంది. ఆనందంతో వచ్చే కన్నీటిని ఏమంటాం? అవి ఎప్పుడు వస్తాయి?
జవాబు:
ఆనందంతో వచ్చే కన్నీటిని ఆనందబాష్పాలు అంటారు. విపరీతమైన ఆనందం కలిగినపుడు ఆనంద బాష్పాలు వస్తాయి. తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులు వస్తే ఆనందబాష్పాలు వస్తాయి. పాఠశాల సమావేశంలో . మెచ్చుకొంటే వస్తాయి. ఏదైనా పోటీలో రాష్ట్రస్థాయి విజయం సాధిస్తే ఆనందబాష్పాలు వస్తాయి. కోటి రూపాయల లాటరీ తగిలితే ఆనందబాష్పాలు వస్తాయి. ఈ విధంగా మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఫలితం వచ్చినపుడు ఆనందబాష్పాలు వస్తాయి.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
భాష విషయంలో రచయిత అభిప్రాయాలను వివరించండి.
జవాబు:
రచయితకు తెలుగుభాష అంటే చాలా ఇష్టం. సాధ్యమైనంతవరకూ తెలుగులో మాట్లాడాలి. తెలుగులోనే చక్కటి వరసలు పెట్టి పిలుచుకోవాలి. పిల్లలకు చిన్నతనం నుండి తెలుగు భాష మాధుర్యాన్ని రుచి చూపించాలి.
తెలుగు కుటుంబాల గొప్పతనమంతా తెలుగులో మాట్లాడుకోవడంలోనే ఉంది. అమ్మా-నాన్న, అత్త-మామా ఇలా తెలుగులో పిలుచుకోవడంలోనే ఆనందం ఉంది. తప్పనిసరి పరిస్థితులలో ఆంగ్లం ఉపయోగించాలి. కానీ, ఇంట్లో కూడా ఆంగ్లం మాట్లాడడం రచయితకు నచ్చదు. బంధుత్వాలను కూడా ఆంగ్లంలోకి మార్చడం రచయితకు అస్సలు నచ్చదు.
ప్రశ్న 2.
“ఇంగ్లీష్ భాష మనకు అవసరమే ! అంతవరకే దాన్ని వాడుకుంటాం. మన భాషనీ, సంస్కృతినీ ఎందుకు వదిలేసుకుంటాం ?” దీనిపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
ఉన్నత చదువులకు ఆంగ్లభాష అవసరం. ఉద్యోగాలలో కూడా ఆంగ్లభాష అవసరమే. ఎక్కువ విజ్ఞానాన్ని సంపాదించాలంటే ఆంగ్ల గ్రంథాలు కూడా చదవాలి. అర్థం చేసుకోవాలి. దీని కోసం ఆంగ్లభాషా పాండిత్యం అవసరమే. ఇతర దేశాలకు వెళ్లినా ఆంగ్లం తప్పదు.
కానీ, మన ఇంట్లో ఆంగ్లం మాట్లాడక్కరలేదు. తెలుగువాళ్ళం తెలుగులోనే మాట్లాడుకోవాలి. తెలుగులోని తీపిని మరచిపోకూడదు. మన తెలుగు భాషలాగే మన సంస్కృతి కూడా చాలా గొప్పది. ఎవరినైనా ఆప్యాయంగా పలకరించే సంస్కృతి మనది. శత్రువునైనా ఆదరించే సంస్కారం మనది.. అడిగిన వారికి లేదనకుండా దానం చేసే స్వభావం తెలుగువారిది.
అందుకే ఎన్ని భాషలు నేర్చినా మన తెలుగు భాషను వదలకూడదు. ఎన్ని దేశాలు తిరిగినా మన సంస్కృతిని విడిచిపెట్టకూడదు. మనం సంపాదించిన ఆంగ్ల భాషా జ్ఞానంతో మన భాషను సుసంపన్నం చేసుకోవాలి.
ప్రశ్న 3.
మీరు బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు పిల్లలంతా ఒకచోట చేరి ఉండటంతో కనుల పండుగగా ఉంటుంది కదా ! ఆ పిల్లల కేరింతలు, ఆటలు, వాళ్ల మధ్య చిన్న చిన్న తగాదాలు…. వీటిని గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
కాకినాడ, ప్రియమైన రజనీకి, నీ స్నేహితురాలు జ్యోత్స్న వ్రాయు లేఖ. మొన్న వేసవి సెలవులు వచ్చాయి కదా ! ఆ సెలవులలో మా కుటుంబం, మా పెదనాన్న గారి కుటుంబం, మా బాబయ్యగారి కుటుంబం కలిసి అమలాపురంలోని మా. మేనత్త గారింటికి వెళ్లాం. వాళ్లది పెద్ద పెంకుటిల్లు. ఇంటి ముందు బోలెడంత స్థలం. ఇంటి వెనక పెద్ద కొబ్బరితోట ఉంది. అక్కడ మామిడి, జామ, సపోటా లాంటి చెట్లు చాలా ఉన్నాయి. మేము మొత్తం 12 మంది పిల్లలం పోగయ్యాం . చాలా అల్లరి చేశాం. పెరట్లోని చెట్లెక్కేశాం. చెరువులో ఈతలు కొట్టాం. కోతి కొమ్మచ్చి, వాలీబాల్, కుంటాట, తొక్కుడు బిళ్ల ఎన్నో ఆటలు ఆడాం. ట్రాక్టరు, ఎడ్లబండి ఎక్కి ఊళ్లన్నీ తిరిగేశాం. ఈ సారి మీ కుటుంబం కూడా రండి. కోనసీమకు భూతల స్వర్గం అని పేరు. చూద్దురుగాని, ఉంటామరి. నీ స్నేహితురాలు, చిరునామా : |
భాషాంశాలు
అ) కింది సూచనల ఆధారంగా ‘కారం’ తో అంతమయ్యే పదాలు రాయండి.
1. ఈ పాఠం పేరు మమకారం.
2. ఎదుటివారికి మేలు చేయడం …………………….. కారం.
3. ఎదుటివారిని గేలి చేయడం …………………… కారం.
4. దట్టమైన చీకటి …………………….. కారం.
5. గర్వం , అహంభావం …………………….. కారం.
జవాబు:
1. మమకారం
2. ఉపకారం
3. వెటకారం
4. అంధకారం
5. అహంకారం
ఆ) కింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాల అర్థాలు తెలుసుకొని సొంతవాక్యాలు రాయండి.
ఉదా :
విహారయాత్రకు వెళ్లాలన్న మా ఉబలాటం చూసి మా ఉపాధ్యాయులు ముచ్చటపడ్డారు.
ఉబలాటం = కోరిక
మా మిత్రులందరూ సినిమాకు వెళ్ళాలని ఉబలాటపడుతున్నారు.
1. బాపు, రమణలు ఒద్దిక గా ఉండి జీవితాంతం స్నేహితులుగా ఉన్నారు.
ఒద్దిక = అనుకూలం
ఒకరికొకరు అనుకూలంగా ఉంటే స్నేహం నిలబడుతుంది.
2. మదర్ థెరిసా చూపే వాత్సల్యం చాలామంది జీవితాల్లో వెలుగులు నింపింది.
వాత్సల్యం = ప్రేమ
రోగులకు ప్రేమతో సేవ చేయాలి.
3. ఆ నగరంలోని అధునాతన కట్టడాలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.
అధునాతన = ఆధునికమైన
ఆధునికమైన జీవితాలలో మానవత్వం దూరమౌతోంది.
ఇ) కింది వాక్యాలలో సమానార్ధక పదాలు ఉన్నాయి. గుర్తించి గీత గీయండి.
1. వచ్చీరాని మాటలతో ఆ బుడతడు చేసే అల్లరి అందరికీ ఆనందాన్నిస్తోంది. ఆ పిల్లవాడు అందరి దృష్టినీ ఆకర్షించాడు.
జవాబు:
బుడతడు, పిల్లవాడు
2. మనిషికి అసలైన ధనం విద్యాధనమే ! అని తేటతెల్లం చేశారు పూర్వికులు. దీంతో మనం సంపాదించు కోవాల్సింది ఏమిటో స్పష్టమైంది కదా !
జవాబు:
తేటతెల్లం, స్పష్టం
3. మహాత్ముల జీవనశైలి నన్ను ఆకర్షిస్తుంది. వారు బతికే పద్ధతి నిరాడంబరంగా ఉంటుంది.
జవాబు:
శైలి, పద్ధతి
ఈ) కింది వ్యతిరేక పదాలను జతపరచండి.
1. పండితుడు | అ) దురదృష్టం |
2. సరసం | ఆ) పామరుడు |
3. అదృష్టం | ఇ) విరసం |
జవాబు:
1. పండితుడు | ఆ) పామరుడు |
2. సరసం | ఇ) విరసం |
3. అదృష్టం | అ) దురదృష్టం |
ఉ) కింది ప్రకృతి – వికృతులను జతపరచండి.
1. ఆశ్చర్యం | అ) బయం |
2. భయం | ఆ) ఇంతి |
3. స్త్రీ | ఇ) అచ్చెరువు |
జవాబు:
1. ఆశ్చర్యం | ఇ) అచ్చెరువు |
2. భయం | అ) బయం |
3. స్త్రీ | ఆ) ఇంతి |
వ్యాకరణాంశాలు
అ) సామాన్య – సంక్లిష్ట వాక్యాలు :
సామాన్య వాక్యం :
అసమాపక క్రియలు లేకుండా ఒక ‘సమాపక క్రియ’ తో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యమంటారు.
ఉదా :
సురేష్ గుడికి వెళ్ళాడు.
మేరీ పుస్తకం తీసింది.
చందు కలం పట్టుకున్నాడు.
సంక్లిష్ట వాక్యం :
ఒకటి కాని అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి, చివరకు ఒక సమాపక క్రియతో ముగిసిన వాక్యాన్ని సంక్లిష్ట వాక్యమంటారు.
ఉదా :
పద్మ నిద్రలేచింది. (సామాన్య వాక్యం)
పద్మ స్నానం చేసింది. (సామాన్య వాక్యం)
పద్మ బడికి వెళ్ళింది. (సామాన్య వాక్యం)
ఈ మూడు వాక్యాలనూ కలిపితే …….
అలా రెండు వాక్యాలను కూడా ‘కలపవచ్చు.
* రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు. రమేష్ బడికి వెళ్తున్నాడు.
ఆ) కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
1. గురువుగారు పాఠం చెబుతున్నారు. గురువుగారు నవ్వుతున్నారు.
జవాబు:
గురువుగారు పాఠం చెబుతూ, నవ్వుతున్నారు.
2. అమ్మ బుజ్జగించింది. అమ్మ అన్నం పెట్టింది.
జవాబు:
అమ్మ బుజ్జగించి, అన్నం పెట్టింది.
3. ఎలుక అక్కడకు వచ్చింది. ఎలుక గుడ్లగూబను చూసింది.
జవాబు:
ఎలుక అక్కడకు వచ్చి, గుడ్లగూబను చూసింది.
ప్రాజెక్టు పని (మూడవ నిర్మాణాత్మక మూల్యాంకనం కోసం)
1. పది పొడుపు కథలు సేకరించి ప్రదర్శించండి.
1) తండ్రి గరగరా,
తల్లి పీచు పీచు
బిడ్డలు రత్న మాణిక్యాలు
మనుమలు బొమ్మరాళ్లు.
జవాబు:
పనసపండు :
తండ్రి – పైభాగం, తల్లి – లోపల పీచు, బిడ్డలు – తొనలు, మనుమలు – లోపలి గింజలు
2) అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. మా ఇంటికి వచ్చింది. తైతక్కలాడింది.
జవాబు:
రోకలి
3. మా తాతకు జత ఎడ్లున్నాయి.
వాటికి నీళ్లంటే భయం. అవేమిటి?
జవాబు:
(లెదర్) చెప్పులు
4. గుడినిండా నీళ్లు గుడికి తాళం.
జవాబు:
కొబ్బరి కాయ
5. ఇంటి వెనకాతల ఇంగువ చెట్టు. ఎంత కోసినా తరగదు.
జవాబు:
పొగ
6. తోకలేని పిట్ట తొంభై ఆమడలు తిరిగింది.
జవాబు:
ఉత్తరం
7. అమ్మ అంటే కలుస్తారు. నాన్న అంటే విడిపోతారు? ఎవరూ?
జవాబు:
పెదవులు
8. తెల్లటి పొలంలో విత్తనాలు. చేత్తో వేస్తాం. కళ్లతో ఏరతాము?
జవాబు:
అక్షరాలు
9. నాలుగు కాళ్ళు ఉంటాయి గాని, నడవలేదు.
జవాబు:
కుర్చీ
10. తోకతో తాగే పిట్ట.
జవాబు:
దీపం
చమత్కార పద్యం
ఒడలినిండ కన్నులుండు నింద్రుడుకాడు
కంఠమందు నలుపు కాడు శివుడు
ఫణులబట్టి చంపు పక్షీంద్రుడా ? కాదు
దీనిభావమేమి తెలుసుకొనుడు
అర్థాలు :
ఒడలు = శరీరం
కంఠం = గొంతు
ఫణి = పాము
పక్షీంద్రుడు = గరుత్మంతుడు
ఇంద్రునిలాగా శరీరం నిండా కన్నులుంటాయి. శివుని లాగా గొంతు నల్లగా ఉంటుంది. గరుత్మంతుని లాగా పాములను చంపుతాడు. అది ఏమిటి?
జవాబు:
నెమలికి శరీరం నిండా నెమలి కన్నులుంటాయి. దాని మెడ నల్లగా ఉంటుంది. అది పాములను చంపుతుంది. కనుక ఈ చమత్కార పద్యానికి జవాబు ‘నెమలి’.
మమకారం కవి పరిచయం
రచయిత పేరు : చిలుకూరి దేవపుత్ర
జననం : అనంతపురం జిల్లా కాల్వ పల్లెలో 24.4.1952న జన్మించారు.
తల్లిదండ్రులు : సోజనమ్మ, ఆశీర్వాదం గార్లు
విద్య : 12వ తరగతి
ఉద్యోగం : జైళ్ల శాఖలో ఉద్యోగం, డిప్యూటీ తహసీల్దారు.
రచనలు : ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, ఆరుగ్లాసులు మొదలైనవి కథా సంపుటాలు. అద్దంలో చందమామ, పంచమం నవలలు.
పురస్కారాలు : పంచమం నవలకు 1996లో ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్) వారి నవలల పోటీలో తృతీయ బహుమతి, 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం, 2001 లో చా.సో. స్ఫూర్తి సాహితీ సత్కారం, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం పొందారు.
ప్రస్తుత పాఠ్యాంశం : వీరు రచించిన ‘ఆరుగ్లాసులు’ అనే కథా సంపుటిలోనిది. ఆయన 18. 10, 2016న స్వర్గస్తులయ్యారు.
కఠిన పదాలు అర్థాలు
జాంతణాలు = జాణతనాలు (తెలివిగా ప్రవర్తించడాలు)
ఒద్దిక = అనుకూలం
తుల్యం = సమానం
మునుపు = గతం
ప్రతీక = గుర్తు
వాత్సల్యం = పెద్దలకు పిల్లల పట్ల ఉండే ఆప్యాయత
శైలి = విధానం
కొలీగ్ = సహోద్యోగి
వార్నింగ్ = హెచ్చరిక
అనర్గళంగా = ధారాళంగా
దొరసాని = దొరగారి భార్య, పరిపాలకు రాలు
ఉబలాటం = ఆత్రుత
వీథి మొగదల = వీథి చివర, వీథి ప్రారంభం
తేటతెల్లం = పూర్తిగా అర్థం కావడం
తొణుకూబెణుకూ = తొట్రుబాటు, జంకు
కరచాలనం = చేతులు కలపడం (షేక్ హాండ్)