These AP 7th Class Science Important Questions 3rd Lesson జీవులలో పోషణ will help students prepare well for the exams.

AP Board 7th Class Science 3rd Lesson Important Questions and Answers జీవులలో పోషణ

7th Class Science 3rd Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
పోషణ అనగానేమి?
జవాబు:
జీవులు ఆహారం తీసుకొనే విధానాన్ని మరియు వినియోగాన్ని పోషణ అంటారు.

ప్రశ్న 2.
పోషణలోని రకాలు తెలపండి.
జవాబు:
పోషణ ప్రధానంగా రెండు రకాలు

  1. స్వయంపోషణ
  2. పరపోషణ

ప్రశ్న 3.
పరపోషకాలు అనగానేమి?
జవాబు:
ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడే జీవులను పరపోషకాలు అంటారు.

AP 7th Class Science Important Questions Chapter 3 జీవులలో పోషణ

ప్రశ్న 4.
పత్రహరితం అనగానేమి?
జవాబు:
మొక్కలలోని ఆకుపచ్చ వర్ణాన్ని పత్రహరితం అంటారు. ఇది హరితరేణువులలో ఉంటుంది.

ప్రశ్న 5.
పత్రంలోనికి కార్బన్ డై ఆక్సెడ్ ఎలా చేరుతుంది?
జవాబు:
పత్రం పైన, క్రింది భాగాలలో చిన్నరంధ్రాలు ఉంటాయి. వీటిని పత్రరంధ్రాలు అంటారు. వీటి ద్వారా CO2 పత్రంలోనికి ప్రవేశిస్తుంది.

ప్రశ్న 6.
పత్రాల నుండి ఆక్సిజన్ బయటకు ఎలా వెళుతుంది?
జవాబు:
పత్రరంధ్రాల ద్వారా ఆకులో ఏర్పడిన ఆక్సిజన్ బయటకు వస్తుంది.

ప్రశ్న 7.
పత్రరంధ్రాలు అనగానేమి?
జవాబు:
పత్రం పైన ఉండే చిన్న రంధ్రాలను పత్రరంధ్రాలు అంటారు.

ప్రశ్న 8.
మొక్కలలో మొదటిగా ఉత్పత్తి అయ్యే పదార్థాలు ఏమిటి?
జవాబు:
మొక్కలలో మొదట చక్కెరలు ఉత్పత్తి అవుతాయి. తరువాత ఇవి పిండిపదార్ధంగా మార్చి నిల్వ చేయబడతాయి.

ప్రశ్న 9.
సూక్ష్మ పోషకాలు అనగానేమి?
జవాబు:
మొక్కలకు తక్కువ పరిమాణంలో అవసరమయ్యే ఖనిజ లవణాలను సూక్ష్మ పోషకాలు అంటారు.

ప్రశ్న 10.
పరపోషకాలు అనగానేమి?
జవాబు:
ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడే జీవులను పరపోషకాలు అంటారు.

ప్రశ్న 11.
పూతికాహారుల ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
చనిపోయిన కళేభరాలను పూతికాహారులు కుళ్ళబెట్టి భూమిని శుభ్రం చేస్తాయి.

AP 7th Class Science Important Questions Chapter 3 జీవులలో పోషణ

ప్రశ్న 12.
వృక్ష పరాన్న జీవికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
కస్కుట వృక్షపరాన్న జీవికి ఉదాహరణ.

ప్రశ్న 13.
సహజీవనానికి ఉదాహరణ తెలపండి.
జవాబు:
లైకెన్ల శైవలాలు, శిలీంధ్రాలు సహజీవనం చేస్తాయి.

ప్రశ్న 14.
N.D.D అనగానేమి?
జవాబు:
(నేషనల్ డీ వార్మింగ్ డే)
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంను N.D.D అంటారు.

ప్రశ్న 15.
జాలకం అనగానేమి?
జవాబు:
నెమరువేయు జంతువులలో జీర్ణాశయం నాలుగు గదులుగా ఉంటుంది. వీటిలోని రెండవ గదిని జాలకం అంటారు.

ప్రశ్న 16.
‘కడ్’ అనగా నేమి?
జవాబు:
నెమరువేయు జంతువులలో మొదటి గదిని ప్రథమ ఆశయం అంటారు. దీనిలో ఆహారం పాక్షికంగా జీర్ణమౌతుంది. దీనిని ‘కడ్’ అంటారు.

ప్రశ్న 17.
మానవునిలో జీర్ణం కాని పదార్థం ఏమిటి?
జవాబు:
మానవుని జీర్ణవ్యవస్థలో ‘సెల్యులోజ్’ అనే పదార్థం జీర్ణం కాదు.

ప్రశ్న 18.
స్వాంగీకరణం అనగా నేమి?
జవాబు:
జీర్ణమైన ఆహారం రక్తం ద్వారా వివిధ భాగాలకు చేరటాన్ని స్వాంగీకరణం అంటారు.

AP 7th Class Science Important Questions Chapter 3 జీవులలో పోషణ

ప్రశ్న 19.
జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తెలపండి.
జవాబు:
డయేరియా, మలబద్దకం, ఎసిడిటి, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ మొదలైనవి జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు.

7th Class Science 3rd Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
మొక్కల ఆకులు ఆకుపచ్చరంగులో ఉంటాయి ఎందుకు?
జవాబు:

  1. ఆకులు హరితరేణువులను కలిగి ఉండటం వలన ఆకుపచ్చగా ఉంటాయి.
  2. హరితరేణువులు అనేవి కేవలం మొక్కల కణాలలో మాత్రమే ఉంటాయి.
  3. వీటిలో పత్రహరితం అనే వర్ణకం ఉంటుంది.
  4. దీని వలన ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి.
  5. ఇవి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారం తయారుచేస్తాయి.

ప్రశ్న 2.
మొక్కలు ఆహారం తయారు చేసుకొనే విధానాన్ని మనం ఆహారం తయారుచేసుకొనే విధానంతో పోల్చుతూ పట్టిక తయారుచేయండి.
జవాబు:

అన్నం ఉడికించే విధానం ఆకుపచ్చని మొక్కలలో ఆహారం తయారీ
ముడి పదార్థాలు బియ్యం , నీరు కార్బన్ డై ఆక్సైడ్
శక్తి వనరు పొయ్యి నుండి వచ్చే మంట సూర్యకాంతి
జరిగే ప్రదేశం పాత్ర / కుక్కర్ ఆకుపచ్చని భాగాలలోని పత్రహరితం
అంతిమంగా ఏర్పడే పదార్థం ఉడికించిన అన్నం గ్లూకోజ్ / పిండిపదార్థం

ప్రశ్న 3.
కిరణజన్య సంయోగక్రియను నిర్వచించి సమీకరణం రాయండి.
జవాబు:
ఆకుపచ్చటి మొక్కలు సూర్యకాంతి సమక్షంలో పత్రహరితంను ఉపయోగించుకొని కార్బన్ డై ఆక్సైడ్ నీటి నుండి స్వయంగా ఆహారం తయారు చేసుకొనే విధానాన్ని ‘కిరణజన్య సంయోగక్రియ’ అంటారు.
AP 7th Class Science Important Questions Chapter 3 జీవులలో పోషణ 2

ప్రశ్న 4.
కిరణజన్య సంయోగక్రియను ఎలా నిర్ధారిస్తావు?
జవాబు:

  1. కిరణజన్య సంయోగక్రియలో గ్లూకోజ్ ఏర్పడుతుంది.
  2. ఇది పిండిపదార్థంగా ఆకులలో నిల్వ ఉంటుంది.
  3. ఆకు నుండి రసాన్ని సేకరించి అయోడిన్ కలపాలి.
  4. ఆకురసం నీలి నలుపుకు మారి, పిండిపదార్థ ఉనికిని తెలుపుతుంది.

ప్రశ్న 5.
ఆకులలోని పిండిపదార్థాన్ని పరీక్షించటానికి అయోడిన్ ద్రావణాన్ని నేరుగా పత్రాలపై వేయరు ఎందుకు?
జవాబు:

  1. పత్రాలలోని పిండిపదార్థం కణాల లోపల నిల్వ ఉంటుంది.
  2. పత్ర కణాలు అయోడినను అనుమతించవు.
  3. పత్రాలు పలుచని మైనపు పొరచే కప్పబడి ఉంటాయి.
  4. ఈ పొర ద్వారా అయోడిన్ లోపలికి ప్రవేశించలేదు.
  5. అందువలన పత్రాలపై నేరుగా అయోడిన్ వేసి పిండిపదార్థాన్ని పరీక్షించలేము.

ప్రశ్న 6.
ఆకులు “ఆహార కర్మాగారం” అని అంటారు ఎందుకు?
జవాబు:

  1. మొక్కలు గాలి నుండి CO2 ను, నేల నుండి నీటిని, సూర్యరశ్మి నుండి శక్తిని పొంది ఆకుపచ్చని భాగాలలో ఆహారం తయారు చేసుకుంటాయి.
  2. ఈ ఆకుపచ్చ భాగాలన్నింటిలో పత్రహరితం అనే ఆకుపచ్చని వర్ణద్రవ్యం ఉంటుంది.
  3. పత్రహరితం ఆకులలో అధికంగా ఉండి ఆహార తయారీలో పాల్గొంటాయి.
  4. అందువలన ఆకును మొక్క యొక్క “ఆహార కర్మాగారం” అంటారు.

AP 7th Class Science Important Questions Chapter 3 జీవులలో పోషణ

ప్రశ్న 7.
కీటకాహార మొక్కలు గురించి రాయండి.
జవాబు:
కొన్ని మొక్కలు కీటకాలను తింటాయి. ఇవి ఆకుపచ్చగా వుండటం వలన వాటి ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. కానీ ఇవి నత్రజని తక్కువగా ఉన్న నేలలో పెరుగుతాయి. కాబట్టి ఇవి కీటకాల నుండి నత్రజని సంబంధ పదార్థాలను గ్రహిస్తాయి. ఈ మొక్కల ఆకులు కీటకాలను పట్టుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా రూపాంతరం చెందాయి. నెఫంథీస్ (పిచ్చర్ ప్లాంట్), డ్రాసిరా, యుట్రిక్యులేరియా (బ్లాడర్‌వర్ట్), (వీనస్ ఫైట్రాప్) డయోనియా మొదలైనవి కీటకాహార మొక్కలకు ఉదాహరణలు. వీటినే మాంసాహార మొక్కలు అని కూడా అంటారు.

ప్రశ్న 8.
పత్రరంధ్రం పటం గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP 7th Class Science Important Questions Chapter 3 జీవులలో పోషణ 3

ప్రశ్న 9.
పూతికాహార పోషణ గురించి రాయండి.
జవాబు:
పుట్టగొడుగులు చనిపోయిన మరియు కుళ్ళిన పదార్థాలపైన పెరుగుతుంటాయి. ఇవి కొన్ని రకాల జీర్ణరస ఎంజైములను స్రవించి ఆయా పదార్థాలను ద్రవ స్థితిలోకి మార్చి వాటిలోని పోషకాలను గ్రహిస్తాయి. ఈ విధంగా చనిపోయిన మరియు కుళ్ళిన పదార్థాల నుండి జీవులు ద్రవస్థితిలో పోషకాలను సేకరించే పోషణ విధానాన్ని “పూతికాహార పోషణ” అంటారు. సాధారణంగా ఇటువంటి పూతికాహార పోషణను బ్యాక్టీరియా లాంటి కొన్ని సూక్ష్మజీవులలో పుట్టగొడుగులు, బ్రెడ్ మోల్డ్ వంటి శిలీంధ్రాలలో చూస్తాము.

ప్రశ్న 10.
సహజీవనం గురించి రాయండి.
జవాబు:
కొన్ని పప్పు ధాన్యాల (లెగ్యూమ్ జాతి మొక్కలు)కు చెందిన మొక్కల వేరు బొడిపెలలో ఒక రకమైన బ్యాక్టీరియా నివశిస్తుంది. ఈ బ్యాక్టీరియా మొక్కలకు కావాల్సిన నత్రజనిని ఇస్తూ మొక్క వేర్లలో నివాసం ఏర్పరచుకుంటుంది. ఇలా ఒకదానికొకటి ఉపయోగపడుతూ జీవించడాన్ని “సహజీవనం” అంటారు.

లైకెన్ లాంటి జీవులలో పత్రహరితంను కల్గిన శైవలం మరియు శిలీంధ్రం కలిసి సహజీవనం చేస్తాయి. శిలీంధ్రాలు శైవలాలకు కావలసిన నీటిని, ఖనిజ లవణాలను అందించడమే కాకుండా వాటికి రక్షణ కల్పిస్తాయి. దానికి బదులుగా, శైవలాలు శిలీంధ్రాలకు కావలసిన ఆహారాన్ని అందిస్తాయి.

ప్రశ్న 11.
పరాన్న జీవనం గురించి రాయండి.
జవాబు:

  1. రెండు జీవుల మధ్యగల ఆహార సంబంధాలలో ఒకదానికి మేలు జరిగి వేరొక దానికి హాని కలిగించే పోషణ విధానాన్ని పరాన్న జీవనం అంటారు.
  2. ఈ ప్రక్రియలో మేలు జరిగే జీవులను పరాన్న జీవులు అంటారు.
  3. పరాన్న జీవనం మొక్కలలో కూడా కనిపిస్తుంది.
    ఉదా : కస్కుట
  4. జంతువులలో పరాన్న జీవనానికి
    ఉదా : నులిపురుగులు

ప్రశ్న 12.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం గురించి రాయండి.
జవాబు:
ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 10 మరియు ఆగస్టు 10వ తేదీలలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం (NDD) జరుపబడుతుంది. ఈ దినం జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం 1 – 19 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలలో ప్రేగులో వుండే పురుగులను నివారించడం. ఆ రోజు అందరికి ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు వేస్తారు.

ప్రశ్న 13.
పరపోషణలోని రకాలు తెలపండి.
జవాబు:
పరపోషణలో ప్రధానంగా

  1. పూతికాహార పోషణ
  2. పరాన్నజీవనం
  3. జాంతవ భక్షణ అనే రకాలు ఉన్నాయి.

AP 7th Class Science Important Questions Chapter 3 జీవులలో పోషణ

ప్రశ్న 14.
జాంతవ భక్షణలోని ప్రధాన అంశాలు ఏమిటి?
జవాబు:
జాంతవ భక్షణలోని ప్రధాన అంశాలు :

  • జంతువులు ఇతర జీవుల నుండి ఆహారాన్ని పొందుతాయి.
  • అవి ద్రవ లేదా ఘన స్థితిలో ఆహారాన్ని తీసుకుంటాయి.
  • ఆహారాన్ని శరీరంలోనికి తీసుకొని జీర్ణం చేస్తాయి.
  • జీర్ణక్రియ శరీరం లోపల జరుగుతుంది.

ప్రశ్న 15.

జాంతవ భక్షణ అనగా నేమి? దానిలోని దశలు ఏమిటి?
జవాబు:
శరీరం వెలుపల నుండి ద్రవ లేదా ఘన రూపంలో ఆహారాన్ని తీసుకొని శరీరం లోపల జీర్ణం చేసుకొనే విధానాన్ని జాంతవ భక్షణ అంటారు.

జాంతవ భక్షణలోని దశలు :

  • అంతర గ్రహణం – ఆహారాన్ని శరీరంలోకి తీసుకోవడం.
  • జీర్ణక్రియ – ఆహారాన్ని శోషణం చేసి సరళ పదార్థాలుగా మార్చుట.
  • శోషణ – జీర్ణమైన ఆహారం రక్తంలోకి తీసుకోవడం.
  • స్వాంగీకరణం – శోషించుకున్న ఆహారం శరీరంలో కలసిపోవడం.
  • మల విసర్జన – జీర్ణం కాని పదార్థాలు, వ్యర్థ పదార్థాలు శరీరం నుండి బయటకు పంపబడడం.

ప్రశ్న 16.
అమీబాలోని పోషణ విధానం తెలపండి.
జవాబు:

  1. అమీబా సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలిగే ఏకకణజీవి.
  2. ఇది చెరువు నీటిలో కనిపిస్తుంది.
  3. అమీబా కణకవచాన్ని కలిగి ఉండి కణద్రవ్యంలో స్పష్టమైన గుండ్రని కేంద్రకాన్ని, అనేక బుడగల వంటి రిక్తికలను కలిగి ఉంటుంది.
  4. అమీబా నిరంతరం తన ఆకారాన్ని, స్థానాన్ని మార్చుకుంటుంది.
  5. ఇది ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వేళ్ళ వంటి మిద్యాపాదాలు అనే నిర్మాణాలను కణ ఉపరితలం నుండి బయటకు పొడుచుకునేటట్లు చేసిన వాటిని ఆహార సేకరణకు, చలనానికి వినియోగిస్తుంది.
  6. ఈ మిద్యాపాదాలను లభించిన ఆహారం చుట్టూ వ్యాపింపచేసి ఆహార రిక్తికగా మారుస్తుంది. ఆహార రిక్తికలో ఆహారం జీర్ణం కాబడి కణద్రవ్యంలోకి శోషణం చెంది చివరకు స్వాంగీకరణం చెందుతుంది.
  7. జీర్ణం కాని ఆహారం ఆహార రిక్తిక తెరుచుకుని కణ ఉపరితలం నుండి బయటకు పంపబడుతుంది.

ప్రశ్న 17.
అమీబాలోని పోషణను పటం రూపంలో చూపండి.
జవాబు:
AP Board 7th Class Science Solutions Chapter 3 జీవులలో పోషణ 5

ప్రశ్న 18.
మానవ జీర్ణవ్యవస్థలోని భాగాలు ఏమిటి?
జవాబు:
మానవ జీర్ణవ్యవస్థ ఆహార నాళం మరియు జీర్ణ గ్రంధులు కలిగి ఉంటుంది. ఆహారనాళం మొత్తం పొడవు 9 మీ.లు ఉంటుంది. దీనిలో ముఖ్యమైన భాగాలు నోరు, నోటి కుహరం / ఆస్యకుహరం, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళం మరియు పాయువు. లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమము అనే జీర్ణవ్యవస్థ గ్రంథులు ఆహార నాళంతో కలుపబడి ఉంటాయి.

ప్రశ్న 19.
దంతక్షయం అనగా నేమి?
జవాబు:
దంతాలపైన ఎనామిల్ అనే పొర ఉంటుంది. ఇది చాలా దృఢమైనది. ఇది నోటిలో ఏర్పడే ఆమ్లాల వలన దెబ్బతింటుంది. దీనినే దంత క్షయం అంటారు.

ప్రశ్న 20.
దంతాలపై ఆమ్లం ఎలా చర్య జరుపుతుంది?
జవాబు:
దంతాల మధ్య ఆహారం ఇరుక్కున్నప్పుడు బ్యాక్టీరియా ఆ ఆహారంపై పెరుగుతుంది. దాని ఫలితంగా లాక్టికామ్లం విడుదలై ఎనామిల్ పొర నాశనం కావడానికి కారణమవుతుంది. చాక్లెట్లు, తీపి పదార్థాలు, శీతల పానీయాలు, ఇతర చక్కెర ఉత్పత్తులు దంతక్షయానికి ప్రధానమైన కారణాలు.

AP 7th Class Science Important Questions Chapter 3 జీవులలో పోషణ

ప్రశ్న 21.
‘ఎసిడిటి’ అనగా నేమి? దానికి కారణాలు, నివారణ మార్గాలు తెలపండి.
జవాబు:
ఎసిడిటి :
అధిక ఆమ్లాల వలన జీర్ణాశయంలో ఏర్పడే మంటను అసౌకర్యాన్ని ఎసిడిటి అంటారు. .

కారణాలు :
అధిక మసాలా, ఒత్తిడి, క్రమంలేని భోజనాలు, ఆల్కహాలు వాడటం.

లక్షణాలు :
ఛాతిలో, జీర్ణాశయంలో, గొంతులో మంట. పుల్లని త్రేన్పులు, పొట్టలో అసౌకర్యం, కడుపు ఉబ్బరం.

నివారణ :
మజ్జిగ త్రాగటం, కొబ్బరినీరు, బెల్లం తీసుకోవటం, తులసి ఆకులు, జీలకర్ర, పుదీనా ఆకులు, లవంగాలు లాంటి మూలికలు గృహచికిత్స విధానం వలన ఎసిడిటిని నివారించవచ్చు.

ప్రశ్న 22.
అనారోగ్య అలవాట్లు మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయి?
జవాబు:
పొగ త్రాగడం, పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి చెడు అలవాట్లు వున్నట్లయితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఆల్కహాల్ తీసుకోవడం వలన కాలేయ వ్యాధులు, జీర్ణాశయ సమస్యలు కలుగుతాయి. పొగాకు పదార్థాలను (గుట్కా లాంటివి) నమలడం వలన పొగాకులోని రేణువులు దంతాలకు, చిగుర్లకు మరియు నోటి కుహరంలోని గోడలకు అంటుకొని వాపు, గాయం, నొప్పి లాంటి లక్షణాలు కల్గించడమే కాకుండా గొంతు మరియు ప్రేగు కేన్సర్‌కు దారి తీస్తాయి.

ప్రశ్న 23.
వజ్రాసనం యొక్క ప్రయోజనం తెలపండి.
జవాబు:
వజ్రాసనం వేయడం వలన జీర్ణాశయ ప్రాంతానికి రక్త ప్రసరణ జరిగి, తద్వారా ప్రేగు కదలికలు పెంపొంది మలబద్దకాన్ని నివారిస్తుంది. కడుపు ఉబ్బరం, అసిడిటీని కూడా నివారిస్తుంది. పూర్తిగా ఆహారాన్ని తిన్న తరువాత వేయగలిగిన ఒకే ఒక ఆసనం ఇది.

ప్రశ్న 24.
ప్రక్కపటం ఆధారంగా నీవు ఏమి అర్ధం చేసుకున్నావు?
జవాబు:
AP 7th Class Science Important Questions Chapter 3 జీవులలో పోషణ 4

  1. ప్రక్క పటం ద్వారా మానవ జీర్ణవ్యవస్థను దెబ్బతీసే భోజనం చేయకపోవడం అంశాలు తెలుసుకొన్నాను.
  2. వత్తిడి, అధికశ్రమ, జంక్ ఫుడ్, శీతల పానీయాలు, మద్యం, భోజనాన్ని తినకపోవటం వంటి పనులు మన జీర్ణవ్యవస్థను పాడుచేస్తాయి.

7th Class Science 3rd Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
నెమరువేసే జంతువులలో జీర్ణక్రియను వర్ణించండి.
జవాబు:
ఆవులు, గేదెలు లాంటి గడ్డి తినే జంతువులు ఆహారాన్ని తీసుకోనప్పటికీ నిరంతరం ఆహారాన్ని నములుతూ ఉంటాయి. వీటిలో ప్రత్యేకంగా నాలుగు గదుల జీర్ణాశయం వుంటుంది. ఆ నాలుగు గదులు వరుసగా ప్రథమ అమాశయం, జాలకం, తృతీయ అమాశయం మరియు చతుర్థ అమాశయం. ఇవి గడ్డిని నమలకుండా మింగి జీర్ణాశయంలోని భాగమైన ప్రథమ అమాశయంలో నిల్వ ఉంచుతాయి. ప్రథమ అమాశయంలో ఆహారం పాక్షికంగా జీర్ణం అవుతుంది. దీనిని ‘కడ్’ అంటారు. తరువాత ఈ కడు తిరిగి నోటిలోకి చిన్న ముద్దలుగా తెచ్చుకొని ఈ జీవులు నెమ్మదిగా, విరామంగా నములుతాయి. ఈ విధానాన్ని “నెమరువేయుట” అని, ఈ జీవులను “నెమరువేసే జంతువులు” అంటారు.

గడ్డిలో సెల్యులోజ్ అనే పిండి పదార్థం వుంటుంది. నెమరు వేయు జీవులలో జీర్ణాశయంలోని, ప్రథమ అమాశయంలో ఉన్న బ్యాక్టీరియాల చర్యల వలన ఆహారంలో వున్న సెల్యులోజ్ జీర్ణం చేయబడుతుంది. మానవునితో సహ చాలా జంతువులు ఇటువంటి బ్యాక్టీరియా లేకపోవడం వలన సెల్యులోజ్ ను జీర్ణం చేసుకోలేవు.

ప్రశ్న 2.
మానవునిలోని దంతాల రకాలను వాటి పనిని పట్టిక రూపంలో రాయండి.
జవాబు:

దంతాలు రకాలు మొత్తం సంఖ్య పని
1. కుంతకాలు 8 కొరకటం
2. రదనికలు 4 ఆహారాన్ని చీల్చటం
3. చర్వణకాలు 8 ఆహారాన్ని నమలటం
4. అగ్రచర్వణకాలు 12 ఆహారాన్ని విసరటం

AP 7th Class Science Important Questions Chapter 3 జీవులలో పోషణ

ప్రశ్న 3.
దంతక్షయం గురించి రాయండి.
జవాబు:
సాధారణంగా మన నోటిలో వుండే బ్యాక్టీరియా హానికరమైనది కాదు. కానీ మనం ఆహారాన్ని తిన్న అనంతరం దంతాలను, నోటిని శుభ్రం చేసుకోనట్లయితే, హానికరమైన బ్యాక్టీరియాలు ఆయా ఆహార పదార్థాలపై వృద్ధి చెందుతాయి. ఈ బ్యాక్టీరియాలు మిగిలిపోయిన ఆయా ఆహార పదార్థాలపై వృద్ధి చెందుతాయి. ఈ బ్యాక్టీరియాలు మిగిలిపోయిన ఆహార పదార్థాలలోని చక్కెరలను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను విడుదల చేస్తాయి. ఈ ఆమ్లాలు క్రమేణా దంతాలను నాశనం చేస్తాయి. దీనినే “దంతక్షయం” అంటారు. దీనికి సరియైన సమయంలో చికిత్స తీసుకోకపోతే, తీవ్రమైన పరిస్థితులలో దంతాలను కోల్పోవడం జరుగుతుంది. చాక్లెట్లు, తీపి పదార్థాలు, శీతల పానీయాలు మరియు చక్కెర పదార్థాలు దంతక్షయానికి ప్రధానమైన కారణాలు.

ప్రశ్న 4.
మానవుని జీర్ణవ్యవస్థలోని వివిధ భాగాలు వాటి పనులను తెలపండి.
జవాబు:
AP 7th Class Science Important Questions Chapter 3 జీవులలో పోషణ 5
1) నోరు :
దీని ద్వారా ఆహారం తీసుకోబడుతుంది. ఇది ఆస్యకుహరంలోకి తెరచుకుంటుంది.

2) ఆస్య కుహరం :
దీనిలో నాలుక, దంతాలు, లాలాజల గ్రంథుల స్రావాలు వుంటాయి. పిండి పదార్థాల జీర్ణక్రియ ఇక్కడ మొదలవుతుంది.

3) గ్రసని :
ఇది ఆహార, శ్వాస మార్గాలు రెండింటికి సంబంధించిన భాగం. ఇది ఆహారవాహికలోకి తెరుచుకుంటుంది.

4) ఆహార వాహిక :
ఇది కండరయుతమైన గొట్టం వంటి నిర్మాణం. ఇది గ్రసనిని జీర్ణాశయంలో కలుపుతుంది.

5) జీర్ణాశయం :
ఇది కండరయుతమైన సంచి వంటి నిర్మాణం. ఇక్కడి స్రావాలతో కలిసి ఆహారం మెత్తగా చిలక బడుతుంది. మాంసకృత్తుల జీర్ణక్రియ ఇక్కడ మొదలవుతుంది. దీనిలో విడుదలయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆహారంలో ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది.

6) ఆంత్రమూలం :
ఇది చిన్న ప్రేగులోని మొదటి భాగం కాలేయం నుండి పైత్య రసం, క్లోమం నుండి క్లోమరసం ఈ భాగంలోకి విడుదలై జీర్ణక్రియలో తోడ్పడతాయి.

7) చిన్న ప్రేగు :
ఇది సుమారు 6 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ భాగంలో విడుదలయ్యే జీర్ణ రసాల వలన ఇక్కడ జీర్ణక్రియ పూర్తవుతుంది. దీని లోపలి పొరలో వందల సంఖ్యలో “ఆంత్ర చూషకాలు” ఉంటాయి. ఇవి జీర్ణమైన ఆహారాన్ని శోషణం చేస్తాయి. ఈ శోషించబడిన ఆహారం రక్తం ద్వారా అన్ని శరీర భాగాలలోకి స్వాంగీకరణం చెందుతుంది.

8) పెద్ద ప్రేగు :
ఇది జీర్ణం కాని ఆహారంలో వున్న నీటిని ఖనిజ లవణాలను శోషించుకుంటుంది.

9) పురీష నాళం :
ఇది జీర్ణం కాని ఆహారాన్ని నిల్వ చేసే ప్రదేశము.

10) పాయువు :
దీని ద్వారా మలం బయటకు విసర్జింపబడుతుంది.

ప్రశ్న 5.
పరపోషణ అనగానేమి? అందలి రకాలు తెలపండి.
జవాబు:
తమ ఆహారం కోసం ఇతర జీవుల పైన ఆధారపడే జీవులను పరపోషకాలు అని, ఈ జీవన విధానాన్ని పరపోషణ అంటారు. దీనిలో ప్రధానంగా మూడు రకాలు కలవు.
1) పూతికాహార పోషణ :
చనిపోయిన కళేబరాలను కుళ్ళబెట్టి పోషకాలను గ్రహించటం పూతికాహార పోషణ అంటారు.
ఉదా : శిలీంధ్రాలు, బాక్టీరియాలు.

2) మిశ్రమ పోషణ :
రెండు జీవుల మధ్య ఉండే ఆహార సంబంధాలను మిశ్రమ పోషణ అంటారు. ఈ ప్రక్రియలో రెండు జీవులకు మేలు జరిగితే దానిని సహజీవనం అంటారు.
ఉదా : లైకెన్స్
మిశ్రమ పోషణలో ఏదో ఒక జీవికి మేలు జరిగితే దానిని పరాన్న జీవనం అంటారు.
ఉదా : మానవుడు, నులిపురుగులు.

3) జాంతవ భక్షణ :
ఘన లేదా ద్రవ ఆహారాన్ని శరీరంలోనికి తీసుకొని జీర్ణం చేసుకొని శక్తిని పొందే పోషణ విధానాన్ని జాంతవ భక్షణ అంటారు.
ఉదా : మానవుడు

AP Board 7th Class Science 3rd Lesson 1 Mark Bits Questions and Answers జీవులలో పోషణ

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. జీవి పోషకాలను గ్రహించే విధానము
A) పోషణ
B) శోషణ
C) జీర్ణం
D) విసర్జన
జవాబు:
A) పోషణ

2. మొక్కలలోని పోషణ విధానము
A) స్వయంపోషణ
B) పరపోషణ
C) పరాన్నజీవనం
D) జాంతవ భక్షణ
జవాబు:
A) స్వయంపోషణ

AP 7th Class Science Important Questions Chapter 3 జీవులలో పోషణ

3. కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడే పదార్థము
A) పత్రహరితం
B) CO2
C) పిండిపదార్థం
D) అయోడిన్
జవాబు:
C) పిండిపదార్థం

4. పత్రరంధ్రాల పని
A) వాయుమార్పిడి
B) ఆహారం తయారీ
C) నీటి రవాణా
D) జీర్ణక్రియ
జవాబు:
A) వాయుమార్పిడి

5. పూతికాహార పోషణకు ఉదాహరణ.
A) పాములు
B) మొక్కలు
C) పుట్టగొడుగులు
D) జంతువులు
జవాబు:
C) పుట్టగొడుగులు

6. వృక్ష పరాన్న జీవి
A) కస్కుట
B) మర్రి
C) చింత
D) వేప
జవాబు:
A) కస్కుట

7. లైకెలో పోషణ విధానము
A) సహజీవనం
B) పరాన్నజీవనం
C) జాంతవ భక్షణం
D) పరాన్నజీవనం
జవాబు:
A) సహజీవనం

8. నులిపురుగుల నివారణకు ఇచ్చే మందు
A) పారాసెటమాల్
B) ఆల్బెండజోల్
C) సిటిజన్
D) జింకోవిట్
జవాబు:
B) ఆల్బెండజోల్

9. కస్కుటాలోని ప్రత్యేకమైన వేర్లను ఏమంటారు?
A) హాస్టోరియా
B) ఊతవేర్లు
C) తల్లివేర్లు
D) పీచువేర్లు
జవాబు:
A) హాస్టోరియా

10. లెగ్యుమినేసి మొక్కలలో పోషణ విధానం
A) పరాన్నజీవనం
B) సహజీవనం
C) పూతికాహారం
D) జాంతవ భక్షణ
జవాబు:
B) సహజీవనం

AP 7th Class Science Important Questions Chapter 3 జీవులలో పోషణ

11. మిద్యాపాదాలు గల జీవి
A) ఆవు
B) అమీబా
C) పావురం
D) నెమలి
జవాబు:
B) అమీబా

12. మానవ ఆహారనాళం మొత్తం పొడవు
A) 7 మీ.
B) 8 మీ.
C) 9 మీ.
D) 10 మీ.
జవాబు:
C) 9 మీ.

13, రదనికలు ఏ జీవులలో స్పష్టంగా కనిపిస్తాయి?
A) శాఖాహారులు
B) మాంసాహారులు
C) ఉభయాహారులు
D) పక్షులు
జవాబు:
B) మాంసాహారులు

14. మానవ శరీరంలో అతి గట్టిదైన నిర్మాణం
A) దంతాలు
B) ఎముకలు
C) చేయి
D) గుండె
జవాబు:
A) దంతాలు

15. మానవునిలోని పోషణ విధానం ఏ రకానికి చెందుతుంది?
A) పరపోషణ
B) జాంతవ భక్షణ
C) పరాన్నజీవనం
D) పూతికాహారపోషణ
జవాబు:
B) జాంతవ భక్షణ

16. మానవునిలోని మొత్తం దంతాల సంఖ్య
A) 8
B) 16
C) 32
D) 64
జవాబు:
C) 32

17. ఏ పోషణ విధానం భూమిని శుభ్రపర్చుతుంది?
A) పూతికాహార పోషణ
B) జాంతవ భక్షణ
C) స్వయంపోషణ
D) పరపోషణ
జవాబు:
A) పూతికాహార పోషణ

AP 7th Class Science Important Questions Chapter 3 జీవులలో పోషణ

18. చిన్నపిల్లలలో కనిపించని దంతాలు
A) కుంతకాలు
B) రదనికలు
C) చర్వణకాలు
D) అగ్రచర్వణకాలు
జవాబు:
D) అగ్రచర్వణకాలు

II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. జీవులు ఆహారాన్ని తీసుకొనే విధానాన్ని ………….. అంటారు.
2. పోషణ రీత్యా మొక్కలు …………….
3. మొక్కలకు ఆకుపచ్చని రంగుని కల్గించే పదార్థం ………………….
4. మొక్కలు ఆహారం తయారు చేసుకొనే ప్రక్రియ ……………………
5. ……………… పోషణ పరిసరాలను శుభ్రంగా ఉంచటంలో తోడ్పడుతుంది.
6. ఆహారం కోసం, ఆశ్రయం కోసం వేరే జీవిపై ఆధారపడే జీవి ……………
7. పరాన్న జీవి …………….. పై ఆధారపడుతుంది.
8. అమీబాలో ఆహార సేకరణకు తోడ్పడునవి …………………………..
9. మానవుని జీర్ణవ్యవస్థ ఆహారనాళం మరియు ………………… కల్గి ఉంటుంది.
10. మానవుని నోటిలో దంతాలు …………… రకాలు.
11. చిన్న పిల్లలలో దంతాల సంఖ్య ……………..
12. మానవుని జీర్ణవ్యవస్థలో పొడవైన భాగం ……………
13. దంతాల పై పొర పాడైపోవడాన్ని ………….. అంటారు.
14. పాక్షికంగా జీర్ణమైన నెమరువేయు జంతువులలోని ఆహారాన్ని ……………….. అంటారు.
15. నెమరువేయు జంతువుల జీర్ణాశయంలోని రెండవ గది …………….
16. జీర్ణమైన ఆహారం రక్తంలో కలవడాన్ని …………. అంటారు.
17. వృక్ష పరాన్న జీవి ………………….
జవాబు:

  1. పోషణ
  2. స్వయంపోషకాలు
  3. పత్రహరితం
  4. కిరణజన్య సంయోగక్రియ
  5. పూతికాహార
  6. పరాన్నజీవి
  7. అతిథేయి
  8. మిద్యాపాదములు
  9. జీర్ణగ్రంథులు
  10. నాలుగు
  11. 20.
  12. చిన్నప్రేగు
  13. దంతక్షయం
  14. కడ
  15. జాలకం
  16. స్వాంగీకరణ
  17. కస్కుటా

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

Group – A Group – B
ఎ) పత్రరంధ్రాలు 1) వృక్ష పరాన్న జీవి
బి) ఎనామిల్ 2) వాయుమార్పిడి
సి) లైకెన్లు 3) జీర్ణాశయం
డి) ఎసిడిటి 4) దంతం
ఇ) కస్కుటా 5) సహజీవనం
6) పత్రహరితం

జవాబు:

Group – A Group – B
ఎ) పత్రరంధ్రాలు 2) వాయుమార్పిడి
బి) ఎనామిల్ 4) దంతం
సి) లైకెన్లు 5) సహజీవనం
డి) ఎసిడిటి 3) జీర్ణాశయం
ఇ) కస్కుటా 1) వృక్ష పరాన్న జీవి

2.

Group – A Group – B
ఎ) అమీబా 1) ఎసిడిటి
బి) కుంతకాలు 2) మిద్యాపాదాలు
సి) కాల్షియం 3) స్వాంగీకరణ
డి) చిన్నప్రేగు 4) దంతాలు
ఇ) జంక్ ఫుడ్ 5) కొరకటం

జవాబు:

Group – A Group – B
ఎ) అమీబా 2) మిద్యాపాదాలు
బి) కుంతకాలు 5) కొరకటం
సి) కాల్షియం 4) దంతాలు
డి) చిన్నప్రేగు 3) స్వాంగీకరణ
ఇ) జంక్ ఫుడ్ 1) ఎసిడిటి

మీకు తెలుసా?

అడవులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి కదా? నిజానికి అవి మొక్కలను కలిగి వుండటం వలన ఆకుపచ్చగా ఉంటాయి. మొక్కలు ఆకులను కలిగి ఉండటం వలన ఆకుపచ్చగా ఉంటాయి. ఆకులు హరితరేణువులు కలిగి ఉండటం వలన ఆకుపచ్చగా ఉంటాయి. హరితరేణువులు అనేవి జంతు కణాలలో లేకుండా వృక్షకణాలలో మాత్రమే ఉండే ప్రత్యేక నిర్మాణాలు. వీటిలో పత్రహరితం అనే ఆకుపచ్చని రంగులో ఉండే వర్ణక పదార్థం ఉంటుంది. ఈ పత్రహరితం, ఈ ఆకుపచ్చదనానికి కారణం. ఇదే మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోవటంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

కొన్ని మొక్కలు కీటకాలను తింటాయి. ఇవి ఆకుపచ్చగా వుండటం వలన వాటి ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. కానీ ఇవి నత్రజని తక్కువగా ఉన్న నేలలో పెరుగుతాయి. కాబట్టి ఇవి కీటకాల నుండి నత్రజని సంబంధ పదార్థాలను గ్రహిస్తాయి. ఈ మొక్కల ఆకులు కీటకాలను పట్టుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా రూపాంతరం చెందాయి. నెపంథీస్ (పిచ్చర్ ప్లాంట్), డ్రాసిరా, యుట్రిక్యులేరియా (బ్లాడర్వే), వీనస్ ఫైట్రాప్ (డయానియా) మొదలైనవి కీటకాహార మొక్కలకు ఉదాహరణలు. వీటినే మాంసాహార మొక్కలు అని కూడా అంటారు.

కొన్ని పప్పుధాన్యాల (లెగ్యూమ్ జాతి మొక్కలు)కు చెందిన మొక్కల వేరు బొడిపెలలో ఒక రకమైన బ్యాక్టీరియా నివశిస్తుంది. ఈ బ్యాక్టీరియా మొక్కలకు కావల్సిన నత్రజనిని ఇస్తూ మొక్క వేర్లలో నివాసం ఏర్పరచుకుంటుంది. ఇలా ఒకదానికొకటి ఉపయోగపడుతూ జీవించడాన్ని “సహజీవనం” అంటారు. లైకెన్ల లాంటి జీవులలో పత్రహరితంను కల్గిన శైవలం మరియు శిలీంధ్రం కలిసి సహజీవనం చేస్తాయి. శిలీంధ్రాలు శైవలాలకు కావలసిన నీటిని, ఖనిజ లవణాలను అందించడమే కాకుండా వాటికి రక్షణ కల్పిస్తాయి. దానికి బదులుగా, శైవలాలు శిలీంధ్రాలకు కావలసిన ఆహారాన్ని అందిస్తాయి.

ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 10 మరియు ఆగష్టు 10వ తేదీలలో జాతీయ నులి పురుగుల దినోత్సవం (NDD) జరుపబడుతుంది. ఈ దినం జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం 1-19 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలలో ప్రేగులో వుండే పురుగులను నివారించడం. ఆ రోజు అందరికి ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు వేస్తారు.

AP 7th Class Science Important Questions Chapter 3 జీవులలో పోషణ

నెమరు వేసే జంతువులలో జీర్ణక్రియ :
ఆవులు, గేదెలు లాంటి గడ్డి తినే జంతువులు ఆహారాన్ని తీసుకోనప్పటికీ నిరంతరం ఆహారాన్ని నములుతూ ఉంటాయి. వీటిలో ప్రత్యేకంగా నాలుగు గదుల జీర్ణాశయం వుంటుంది. ఆ నాలుగు గదులు వరుసగా ప్రథమ అమాశయం, జాలకం, తృతీయ అమాశయం మరియు చతుర్థ అమాశయం. ఇవి గడ్డిని నమలకుండా మింగి జీర్ణాశయంలోని భాగమైన ప్రథమ అమాశయంలో నిల్వ ఉంచుతాయి. ప్రథమ అమాశయంలో ఆహారం పాక్షికంగా జీర్ణం అవుతుంది. దీనిని ‘కడ్’ అంటారు. తరువాత ఈ కడన్ను తిరిగి నోటిలోకి చిన్న ముద్దలుగా తెచ్చుకొని ఈ జీవులు నెమ్మదిగా విరామంగా నములుతాయి. ఈ విధానాన్ని “నెమరువేయుట” అని, ఈ జీవులను “నెమరువేసే జంతువులు” అంటారు.

గడ్డిలో సెల్యులోజ్ అనే పిండి పదార్థం వుంటుంది. నెమరు వేయు జీవులలో జీర్ణాశయంలోని ప్రథమ అమాశయంలో ఉన్న బ్యాక్టీరియాల చర్యల వలన ఆహారంలో వున్న సెల్యులోజ్ జీర్ణం చేయబడుతుంది. మానవునితో సహ చాలా జంతువులు ఇటువంటి బ్యాక్టీరియా లేకపోవడం వలన సెల్యులోజ్ ను జీర్ణం చేసుకోలేవు.

సాధారణంగా మన నోటిలో వుండే బ్యాక్టీరియా హానికరమైనది కాదు. కానీ మనం ఆహారాన్ని తిన్న అనంతరం దంతాలను, నోటిని శుభ్రం చేసుకోనట్లయితే, హానికరమైన బ్యాక్టీరియాలు ఆయా ఆహార పదార్థాలపై వృద్ధి చెందుతాయి. ఈ బ్యాక్టీరియాలు మిగిలిపోయిన ఆహార పదార్థాలలోని చక్కెరలను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను విడుదల చేస్తాయి. ఈ ఆమ్లాలు క్రమేణా దంతాలను నాశనం చేస్తాయి. “దీనినే దంతక్షయం” అంటారు. దీనికి సరియైన సమయంలో చికిత్స తీసుకోకపోతే, తీవ్రమైన పరిస్థితులలో దంతాలను కోల్పోవడం జరుగుతుంది. చాక్లెట్లు, తీపి పదార్థాలు, శీతల పానీయాలు మరియు చక్కెర పదార్థాలు దంతక్షయానికి ప్రధానమైన కారణాలు.

వజ్రాసనం వేయడం వలన జీర్ణాశయ ప్రాంతానికి రక్త ప్రసరణ జరిగి, తద్వారా ప్రేగు కదలికలు పెంపొంది మల బద్దకాన్ని నివారిస్తుంది. కడుపు ఉబ్బరం, అసిడిటీని కూడా నివారిస్తుంది. పూర్తిగా ఆహారాన్ని తిన్న తరువాత వేయగలిగిన ఒకే ఒక ఆసనం ఇది.