These AP 6th Class Telugu Important Questions 2nd Lesson తృప్తి will help students prepare well for the exams.
AP State Syllabus 6th Class Telugu 2nd Lesson Important Questions and Answers తృప్తి
6th Class Telugu 2nd Lesson తృప్తి Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
పరిచిత గద్యాలు
1. కింది పరిచిత గద్యభాగాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఒకసారి వనసంతర్పణ పెట్టుకున్నారు. జనం అంతా మామిడి తోపులో చేరారు. చాపలు పరచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. గాడిపొయ్యి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. “అందరూ వినండరా” అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు. “వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను” అంటూ లిస్టు చదివాడు.
ప్రశ్నలు – జవాబులు :
అ) జనం మామిడి తోటలో ఎందుకు చేరారు?
జవాబు:
జనం వనసంతర్పణ కోసం మామిడి తోటలో చేరారు.
ఆ) జనం ఎక్కడ కూర్చున్నారు?
జవాబు:
జనం చాపల మీద కూర్చున్నారు.
ఇ) గావుకేక పెట్టింది ఎవరు?
జవాబు:
పూర్ణయ్య గావుకేక పెట్టాడు.
ఈ) పూర్ణయ్య దేని గురించి లిస్టు తయారుచేశాడు?
జవాబు:
పూర్ణయ్య వనసంతర్పణలో చేసే వంటకాల గురించి లిస్టు తయారుచేశాడు.
2. కింది పరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
నిగనిగలాడే వాక్కాయల బుట్టతో, లేత చుక్కకూర మోపుతో వచ్చి అందర్నీ పలకరించాడు. “వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి” అని తలా ఓ కాయ పంచాడు. “చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది” అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. మళ్లీ జనం అంతా వంట కబుర్లలో పడేవారు. బావగాడు ఇలా ప్రదర్శనలిస్తుంటే ఆకలి రెపరెప పెరుగుతోంది.
ఇక అక్కడ గాడిపొయ్యి దగ్గర వంటవాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వెయ్యమని పురమాయిస్తున్నాడు.
ప్రశ్నలు – జవాబులు :
అ) పూర్ణయ్య బుట్టలో ఏమి తెచ్చాడు?
జవాబు:
పూర్ణయ్య బుట్టలో వాక్కాయలు తెచ్చాడు.
ఆ) వాక్కాయ ఏ రుచితో ఉంటుంది?
జవాబు:
వాక్కాయ పులుపు రుచితో ఉంటుంది.
ఇ) చుక్కకూర ఏ పప్పుతో చక్కగా మేళవిస్తుంది?
జవాబు:
చుక్కకూర పెసరపప్పుతో చక్కగా మేళవిస్తుంది.
ఈ) పాయసంలో ఏమి వేయమని పూర్ణయ్య పురమాయిస్తున్నాడు?
జవాబు:
పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వెయ్యమని పూర్ణయ్య పురమాయిస్తున్నాడు.
3. కింది పరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
“అప్పుడే మంచినీళ్ళు తాగెయ్యకు. మీగడ పెరుగుంది…” ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగగలరు? జనం కలబడి భోంచేశారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. విస్తళ్ళ ముందునుంచి పైకి లేవడమే కష్టమైంది. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తరువాత వంటవాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. “కష్టపడి వండారు తినకపోతే ఎలా?” అని కొసరి కొసరి వడ్డించాడు. వాళ్ళ భోజనాలు కూడా అయిన తరువాత అందరికంటే ఆఖరున గాడిపొయ్యి పక్కన ఓ చిన్న ఆకు వేసుకుని తను కూర్చున్నాడు.
ప్రశ్నలు – జవాబులు:
అ) “మీగడ పెరుగుంది’ – అని ఎవరు చెప్పారు?
జవాబు:
మీగడ పెరుగుంది అని పూర్ణయ్య చెప్పాడు.
ఆ) విస్తళ్ళ ముందు నుంచి పైకి లేవడం ఎందుకు కష్టమైంది?
జవాబు:
‘వంటలు రుచిగా ఉండడం, ఎక్కువగా ఆహారం తినడం చేత విస్తళ్ళ ముందునుండి పైకి లేవడం కష్టమైంది.
ఇ) అందరికీ తాంబూలాలు ఇచ్చిన తరువాత భోజనానికి ఎవరు కూర్చున్నారు?
జవాబు:
అందరికీ తాంబూలాలు ఇచ్చిన తరువాత వంటవాళ్ళు భోజనానికి కూర్చున్నారు.
ఈ) అందరి కంటే చివరన భోజనానికి కూర్చున్నదెవరు?
జవాబు:
అందరికంటె చివరన పూర్ణయ్య భోజనానికి కూర్చున్నాడు.
అపరిచిత గద్యాలు
1. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆరోగ్య పరిరక్షణకు మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 35 ఏళ్ళు దాటాక మరింత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబానికి ఆయువు పట్టు మహిళలే. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలి. దానివలన రుగ్మతలను ముందుగానే తెలుసుకోవచ్చును. వ్యాధులు ముదిరిన తర్వాత తెలుసుకొంటే వైద్యం కష్టమవుతుంది.
ప్రశ్నలు – జవాబులు:
అ) ఏ వయసు మహిళలు ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి?
జవాబు:
35 సం||లు దాటినవారు ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆ) కుటుంబానికి ఆయువు పట్టు ఎవరు?
జవాబు:
మహిళ కుటుంబానికి ఆయువు పట్టు.
ఇ) “రుగ్మత” అంటే అర్థం ఏమిటి?
జవాబు:
రుగ్మత అంటే రోగం అని అర్థం.
ఈ) వ్యాధులు ముదిరితే ఏమవుతుంది?
జవాబు:
వ్యాధులు ముదిరితే వైద్యం దొరకడం కష్టమవుతుంది.
2. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
మానవాళికి ప్రాణాధారమైన నీటిని కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీటిని కాపాడుకోవాలి. దీని గురించి అందరికీ అవగాహన ఏర్పడాలి.
దీనికి మంచి మార్గం భూగర్భజలాలను పెంపొందించుకోవాలి. ఇంకుడు గుంటలు ఎక్కువగా ఏర్పరచుకొంటే భూగర్భజలాలు అడుగంటిపోవు. వర్షపునీరు, వాడిన నీరు ఇంకుడు గుంటలోకి ఇంకేలా చేయాలి. ఇంకుడు గుంటలో ఇసుక, కంకర వేయాలి.
ప్రశ్నలు – జవాబులు:
అ) మానవులకు ప్రాణాధారమేది?
జవాబు:
మానవులకు నీరు ప్రాణాధారం.
ఆ) నీటిని కాపాడడం ఎవరి బాధ్యత?
జవాబు:
నీటిని కాపాడడం అందరి బాధ్యత.
ఇ) ఇంకుడు గుంటలెందుకు నిర్మించాలి?
జవాబు:
భూగర్భజలాల రక్షణ కోసం ఇంకుడు గుంటలు నిర్మించాలి.
ఈ) పై పేరాకు తగిన శీర్షికను పెట్టండి.
జవాబు:
జలరక్షణ
3. క్రింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆంధ్రులకు ప్రీతిపాత్రుడైన కాటన్ ఆంధ్రుడు కాడు. కనీసం భారతదేశంలోనైనా జన్మించలేదు. ‘హెన్రీ’, ‘కాల్వెలీ కాటన్’ అనే ఆంగ్ల దంపతులకు పదవ కుమారుడు ఆర్థర్ థామస్ కాటన్, క్రీ.శ. 1803వ సంవత్సరం మే 15న ‘కాంబర్ మిర్ అబీ’ అనే గ్రామంలో జన్మించాడు. ఆయన ధవళేశ్వరం బ్యారేజీని నిర్మించారు. దానివలన పంటలకు నీరందుతోంది. నేల సస్యశ్యామలమైంది.
ప్రశ్నలు – జవాబులు:
అ) కాటన్ తల్లిదండ్రులెవరు?
జవాబు:
కాటన్ తల్లి హెన్రీ, తండ్రి కాల్వెలీ కాటన్.
ఆ) కాటన్ సోదరులెంతమంది?
జవాబు:
కాటన్ కు తొమ్మిదిమంది సోదరులు.
ఇ) కాటన్ అంటే ఆంధ్రులకెందుకిష్టం?
జవాబు:
కాటన్ ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి, చేలకు నీరందించాడు.
ఈ) పై పేరాకు తగిన శీర్షికను పెట్టండి.
జవాబు:
కాటన్.
4. కింది అపరిచిత గద్యం చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
భోజరాజు తఱచుగా రాత్రివేళల్లో మాటువేషం వేసుకొని తిరుగుతూ నగర ప్రజల పరిస్థితిని గమనిస్తూండేవాడు. ఒకనాటి అర్ధరాత్రి ఇలాగే తిరుగుతున్న వేళలో ఒక ఇంటిలో దొంగతనం జరుగుతున్నట్టు ఆయనకు అనిపించింది. ఆ యింటిలోని వారెవ్వరూ కొన్ని రోజులుగా ఊళ్ళో లేనట్టుంది. ఆ కారణంగా ఈ దొంగలకి ఈ ఇల్లు మణింత అనుకూల మన్పించిందని భోజరాజుకి తోచింది. ఇంట్లో ఎవరూ లేని కారణంగా వాళ్ళు చేయవలసిన దొంగతనాన్ని చాలా శ్రద్ధగా చేసి ఆ దొంగసొత్తుని ఊరి వెలుపల ఉన్న మామిడి తోపులోకి పట్టుకుపోయి పంచుకోవాలని నిశ్చయించుకుని బయటికి రాబోయే సరికి నగరంలో గస్తీ తిరుగుతున్న రక్షక భటుల నగారాధ్వనులు వినిపించాయి.
ప్రశ్నలు – జవాబులు:
అ) ఎవరు మాఱువేషంలో ఎప్పుడు నగర ప్రజల పరిస్థితిని గమనించేవారు?
జవాబు:
భోజరాజు మాఱువేషంలో రాత్రివేళ నగర ప్రజల పరిస్థితిని గమనించేవాడు.
ఆ) ఒకనాటి అర్ధరాత్రి భోజరాజుకి ఏమనిపించింది?
జవాబు:
ఒకనాటి అర్ధరాత్రి భోజరాజుకు ఒక ఇంటిలో దొంగతనం జరుగుతున్నట్టు అనిపించింది.
ఇ) ఏ కారణంగా దొంగలకు ఇల్లు అనుకూలమన్పించింది?
జవాబు:
ఇంటిలోని వారు ఎవ్వరూ లేని కారణంగా ఇల్లు దొంగలకు అనుకూలమన్పించింది.
ఈ) దొంగలు సొత్తుని ఎక్కడ పంచుకోవాలనుకున్నారు?
జవాబు:
దొంగలు సొత్తుని ఊరి వెలుపల ఉన్న మామిడి తోపులోకి పట్టుకుపోయి పంచుకోవాలని నిశ్చయించుకున్నారు.
5. కింది అపరిచిత గద్యం చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
మరాలుడనే దొంగ తను దొంగతనం చేయడానికి కారణం ఏమని చెప్పాడంటే “నా తల్లిదండ్రులు బాగా వృద్ధులు. నేను వారిని కాశీకి తీసుకుపోగలిగినంత సంపన్నతతో లేను. మా కెటిగిన ఒక కుటుంబం కాశీకి పోతోందని తెలిసింది. మా తల్లిదండ్రులనీ ఆ కుటుంబాన్నీ కాశీకి ఈ మొత్తం ద్రవ్యంతో పంపించాలనేది నా తలంపు. ఆ వెళ్ళే కుటుంబం కూడా కాశీ వెళ్ళగలిగినంత స్తోమత కలిగింది కాదు. అందుకని ఈ విధమైన ఏర్పాటు చేయదలిచాను” అని చెప్పాడు.
ప్రశ్నలు – జవాబులు:
అ) ఎవరు దొంగతనం చేసారు?
జవాబు:
మరాలుడు అనేవాడు దొంగతనం చేసాడు.
ఆ) ఎవరు వృద్ధులు?
జవాబు:
మరాలుని తల్లిదండ్రులు వృద్ధులు.
ఇ) ఎవరు కాశీకి వెళుతున్నారు?
జవాబు:
మరాలునికి తెలిసిన కుటుంబం కాశీకి వెళుతున్నారు.
ఈ) మరాలుని తలంపు ఏమిటి?
జవాబు:
దొంగిలించిన ద్రవ్యంతో తల్లిదండ్రుల్ని కాశీకి పంపాలని తలంపు కలిగింది.
6. కింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఒకప్పుడు ‘అన్నంభట్టు’ అనే పేరున్న ఒక విద్యార్థి ఉండేవాడు. అతనికి పెద్దగా చదువు ఒంట బట్టేది కాదు. ఏదో ఎలాగో వేదవిద్య పూర్తయిందనిపించాడు. వివాహానికి తగిన వయసు రాగా, తల్లిదండ్రులు మంచి శుద్ధ శ్రోత్రియుని కూతురూ సంస్కృతంలో కవిత్వం కూడా చెప్పగల పిల్లతో అతనికి పెళ్ళి జరిపించారు. ఆమె తల్లిదండ్రులూ ఆమె కూడా వీలయినంత ఎక్కువగా సంస్కృతంలోనే మాట్లాడుకుంటూ ఉండడం, కనీసం పెళ్ళిపీటల మీద కూడా సంస్కృతాన్ని విడవకపోవడం కారణంగానూ, ఆ భాష తనకంతగా రాని కారణంగానూ కొంత అర్థమయ్యి, కొంత కాకా అన్నంభట్టుకి పెద్ద తలనొప్పిగా అన్పించింది వారి ధోరణి. అయినా ఏం చేస్తాం? అనుకున్నాడు అన్నంభట్టు అప్పటికి.
ప్రశ్నలు – జవాబులు:
అ) అన్నంభట్టు ఎవరు?
జవాబు:
అన్నంభట్టు ఒక విద్యార్థి.
ఆ) అన్నంభట్టు వివాహం ఎవరితో జరిగింది?
జవాబు:
శుద్ధ శ్రోత్రియుని కుతురూ, సంస్కృతంలో కవిత్వం చెప్పగల అమ్మాయితో అన్నంభట్టు వివాహం జరిగింది.
ఇ) పెళ్ళికూతురూ, తల్లిదండ్రులూ ఎలా మాట్లాడుకున్నారు?
జవాబు:
పెళ్ళికూతురూ, ఆమె తల్లిదండ్రులు కూడా వీలయినంత ఎక్కువగా సంస్కృతంలో మాట్లాడుకునేవారు.
ఈ) పై గద్యాన్ని చదివి ఏవేని రెండు ప్రశ్నలు తయారుచేయండి.
జవాబు:
- ఎవరికీ చదువు ఒంటబట్టేదికాదు?
- అన్నంభట్టుకి తలనొప్పిగా ఎందుకు అన్పించింది?
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్న 1.
వనసంతర్పణకు వచ్చినవారు పూర్ణయ్య గురించి ఏమనుకొన్నారు?
జవాబు:
వనసంతర్పణలో అన్ని ఏర్పాట్లు చేసినవాడు పూర్ణయ్యే. అతనిని అందరూ ప్రేమగా ‘బావా’ అని పిలుస్తారు. అతను లేకపోతే వారెవరికీ సరదా లేదు. వారికెవరికీ సంబరంగా ఉండదు. ఎవరింట్లో పెళ్లినా, పేరంటమైనా హడావుడి అంతా పూర్ణయ్యదే. అతను లేకపోతే ఆ కార్యక్రమం అందంగా ఉండదు. వనసంతర్పణలో వంట ఏర్పాట్లు అన్నీ పూర్ణయ్యే చూశాడు. పూర్ణయ్య లేకపోతే వంట ఏర్పాట్లు, గాడిపొయ్యి తవ్వించడం ఎవరివల్లా కాదని వారి అభిప్రాయం. తినేవాళ్ళని ఉత్సాహపరుస్తున్న పూర్ణయ్య అంటే అందరికీ అభిమానమే. వనసంతర్పణకు వచ్చిన వారందరూ పూర్ణయ్యను మెచ్చుకొన్నారు, అనుసరించారు. తృప్తిగా తిన్నారు, ఉత్సాహంగా ఉన్నారు.
ప్రశ్న 2.
వంట విషయంలో పూర్ణయ్య అందరినీ ఎలా ఉత్సాహపరిచాడు?
జవాబు:
వంకాయ మెంతికారం పెట్టిన కూర వండిస్తున్నానని పూర్ణయ్య వారందరికీ చెప్పాడు. అంతటితో ఆగలేదు, మరో అరగంటలో వంకాయలు కడిగించి, బుట్టలో వేయించి, అందరి దగ్గరకూ తెచ్చి, చూపించాడు. అవి లేత వంకాయలు, నవనవలాడుతున్నాయి. అవి అప్పుడే తోటలో కోయించుకొని వచ్చినట్లు చెప్పి అందరినీ ఉత్సాహపరిచాడు.
మరో అరగంటకు వాక్కాయల బుట్టతో వచ్చాడు. వాక్కాయలు నిగనిగలాడుతున్నాయి. అందరికీ తలొక వాక్కాయ రుచి చూపించాడు. పుల్లగా ఉన్నాయి. తర్వాత లేత చుక్కకూర తెచ్చి చూపించాడు. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతోనే బాగుంటుందని వారందరికీ చెప్పి ఉత్సాహపరిచాడు.
పులిహోర తిరగమోత వెయ్యగానే రయ్యిన జనం దగ్గరకు పరిగెత్తుకొని వచ్చాడు. ఆ వాసన చూశారా ! సన్నబియ్యంతో చేయిస్తున్నట్లు చెప్పాడు. అని చెప్పి అందరి దృష్టినీ భోజనాల వైపు పూర్తిగా మలిచాడు. నిమ్మకాయ పిండిన అరటికూర రుచిని చెప్పి, అందరినీ ఉత్సాహపరిచాడు.
ప్రశ్న 3.
పూర్ణయ్య వడ్డనలోని ప్రత్యేకతను వివరించండి.
జవాబు:
పూర్ణయ్య నేతి జారీ తీసుకొన్నాడు. అందరినీ పేరు పేరునా అడిగి నెయ్యి వడ్డించాడు. వంకాయకూర, అరటికాయ కూరల రుచిని వర్ణిస్తూ వడ్డింపచేశాడు. చుక్కకూర పప్పులో ఊరమిరపకాయలు కొరుక్కుతింటే బాగుంటుందని ఊరించాడు. పప్పుచారులో గుమ్మడి వడియాలు కలుపుకొని తినమని ఉత్సాహపరిచాడు. వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంజుకొంటే ఉండే మజాను వర్ణించాడు. పాయసానికి ఖాళీ ఉంచుకోమని ఆదేశించాడు. మంచినీళ్లెక్కువగా త్రాగవద్దన్నాడు. పెరుగన్నం తినడానికి ఖాళీ ఉంచుకోమన్నాడు. ఈ విధంగా అందరినీ ఉత్సాహపరిచాడు.
ప్రశ్న 4.
వనసంతర్పణలో ఆకలి పెరగడానికి కారణాలేమిటి?
జవాబు:
వనసంతర్పణలో అందరికీ ఆకలి పెరగడానికి కారణం పూర్ణయ్యే. వండిస్తున్న కూరల గురించీ, పిండి వంటల గురించీ, పచ్చళ్ల గురించీ, పులుసుల గురించీ అందరికీ పూర్ణయ్య చెప్పాడు. వాటి రుచులను ఊహించుకోవడంతో అందరికీ ఆకలి మొదలైంది. వంకాయలు, వాక్కాయలు, చుక్కకూరలను అందరికీ చూపించడంతో వంటల గురించి చర్చ జరిగింది. దానితో ఆకలి ఇంకా పెరిగింది. పులిహోర ఘుమఘుమలు తగిలేటప్పటికి అందరికీ ఆకలి ఇంకా పెరిగిపోయింది. పూర్ణయ్య దగ్గరుండి వడ్డన చేయించిన తీరుకు అందరూ మితిమీరి భోజనాలు చేశారు. మాటలలో ఆదరణ, ఆప్యాయతలుండాలి. వడ్డనలో కొసరి కొసరి వడ్డించే గుణం ఉండాలి. అప్పుడు అతిథులకు ఉత్సాహం, ఆకలి పెరుగుతాయి. మొహమాటం లేకుండా తృప్తిగా తింటారు.
ప్రశ్న 5.
ఈ పాఠంలో ఎవరెవరు ఎందుకు తృప్తి చెందారు?
జవాబు:
వనసంతర్పణకు వచ్చిన వారందరూ పూర్ణయ్య ఆదరణతో తృప్తి చెందారు. అతను చేసిన హడావుడి కబుర్లు, ప్రదర్శనలూ వారందరినీ ఉత్తేజపరిచాయి. వంటకాల ఘుమఘుమలతో తృప్తి చెందారు. అతని వడ్డన తీరుకు అందరూ తృప్తిగా భోజనాలు చేశారు. వనసంతర్పణకు వచ్చిన వారందరినీ పూర్ణయ్య తన కలుపుగోలుతనంతో సంతృప్తి పరిచాడు. వారంతా ఆనందించారు. అందరూ తృప్తిగా కడుపునిండా భోజనాలు చేశారు. కనుకనే పూర్ణయ్యకు ఆహార పదార్థాలు మిగలలేదు. ఆ మిగలకపోవడమే పూర్ణయ్యకు తృప్తి నిచ్చింది. ఇంత చక్కటి పాఠం చదవడం మాకూ తృప్తిగానే ఉంది.
ప్రశ్న 6.
మీ గ్రామం / పట్టణంలో జరిగే వనభోజనాలను వర్ణించండి.
జవాబు:
మా కాలనీలో ఉన్నవారందరం కార్తీకమాసంలో ఉసిరిచెట్టు కింద భోజనాలు పెట్టుకొంటాం. అప్పుడు మా కాలనీలో ఉన్న వాళ్లందరం రాజుగారి తోటలోని ఉసిరిచెట్టు కిందికి ఉదయమే వెళ్లిపోతాం. పిల్లలందరం కోతి కొమ్మచ్చి, కబడి, బాలాట మొదలైనవి ఆడుకొంటాం. బోలెడంత అల్లరి చేసేస్తాం. మగవాళ్లలో పెద్దవాళ్లంతా పేకాట, క్యారమ్స్, చెస్ మొదలైనవి ఆడుకొంటారు. ఆడవాళ్లంతా వంట వండుతూనే అంత్యాక్షరి, పాటల పోటీలు, అష్టాచమ్మా మొదలైనవి ఆడుకొంటారు. పిల్లలందరం కరివేపాకు తుంపుతాం. మిరపకాయలు ముచికలు తీస్తాం. మగవాళ్లు కూరలు తరుగుతారు. నీళ్లు తెస్తారు. వడ్డన మాత్రం పిల్లలదే, భోజనాలయ్యాక ఆటల పోటీలు, బహుమతులు ఉంటాయి. ఆ రోజు మాత్రం మాకందరికీ పండుగే.
ప్రశ్న 7.
మీరు వెళ్లిన విహారయాత్ర గురించి వ్రాయండి.
జవాబు:
ఒకసారి మా పాఠశాల విద్యార్థులందరం రెండు బస్సులలో ‘అరకు’ విహారయాత్రకు వెళ్లాం. అక్కడ వాతావరణం చాలా బాగుంది. బొర్రా గుహలు చూశాం. చాలా బాగున్నాయి. ప్యాసెంజర్లో ఆ గుహలలోంచి వేడుతుంటే భలే సరదాగా ఉంది.
ఇది సముద్ర మట్టానికి 900 మీటర్లు ఎత్తున ఉందని మా మాష్టారు చెప్పారు. ఇక్కడ జలపాతాలు చాలా బాగున్నాయి. ఆ జలపాతాలు కనుల పండువగా ఉన్నాయి. మ్యూజియం కూడా చాలా బాగుంది. మేం వెళ్లినప్పుడు సినిమా షూటింగ్ జరుగుతోంది. సినిమా యాక్టర్లతో ఫోటోలు తీయించుకొన్నాం. మేమందరం ఈ విహారయాత్రలో చాలా ఆనందించాం.
III. భాషాంశాలు:
1. కింది పదాలను ఒత్తులతో సరిచేసి రాయండి.
1. అమ నాన నను తీసికెళారు
జవాబు:
అమ్మ నాన్న నన్ను తీసికెళ్ళారు.
2. అన చెటు ఎకి ఒక కాయ కోశాడు.
జవాబు:
అన్న చెట్టు ఎక్కి ఒక్క కాయ కోశాడు.
3. కొత. బటలు కొనుకొనాను.
జవాబు:
కొత్త బట్టలు కొనుక్కొన్నాను.
4. ఆకులు కట కటి తెమనారు.
జవాబు:
ఆకులు కట్ట కట్టి తెమ్మన్నారు.
5. చినాన నను రావదనాడు.
జవాబు:
చిన్నాన్న నన్ను రావద్దన్నాడు.
6. కపల పెళ్లికి వెళి వచాము .
జవాబు:
కప్పల పెళ్ళికి వెళ్ళి వచ్చాము.
7. తిక తికగా మాటాడవదనారు
జవాబు:
తిక్కతిక్కగా మాట్లాడవద్దన్నారు.
8. నతినతిగా అనానని నవారు.
జవాబు:
నత్తినత్తిగా అన్నానని నవ్వారు.
9. చకని చుక మా అక అకడ ఉంది.
జవాబు:
చక్కని చుక్క మా అక్క అక్కడ ఉంది.
10. కవం పటిన అవను చూసి నవవదు.
జవాబు:
కవ్వం పట్టిన అవ్వను చూసి నవ్వవద్దు.
2. కింది పదాలను సంయుక్తాక్షరాల వత్తులతో సరిచేసి రాయండి.
1. లక్ + ష్ + మ్ + ఇ = లక్ష్మి
2. పక్ + ష్ + య్ + అ + ము = పక్ష్య ము
3. స్వాతంత్ + ర్ + య్ + అ + ము = స్వాతంత్ర్యము
4. లక్ + ష్ + య్ + అ + ము = లక్ష్యము
5. హర్ + మ్ + య్ + అ + ము = హర్మ్యము
6. దార్ + డ్ + య్ + అ + ము = దార్యా ము
3. ఈ క్రింది ప్రశ్నలకు సరైన జవాబులను బ్రాకెట్లలో గుర్తించండి.
1. కిందివానిలో సంయుకాక్షరం గుర్తించండి.
అ) క
ఆ) క్క
ఇ) క్ష్మి
జవాబు:
ఇ) క్ష్మి
2. పెద్దవారికి, స్త్రీలకు గౌరవం ఇవ్వాలి. (సంయుక్తాక్షరం గుర్తించండి)
అ) ద్ద
ఆ) స్త్రీ
ఇ) వ్వా
జవాబు:
ఆ) స్త్రీ
3. స్వాతంత్ర్యం మన జన్మహక్కు. (గీతగీసిన దానిలోని అక్షరాలు) ( ఆ )
అ) త్ + అ + రే + య్
ఆ) త్ + ర్ + య్ + అ
ఇ) త + ర + య
జవాబు:
ఆ) త్ + ర్ + య్ + అ
4. కురుక్షేత్రం ధర్మక్షేత్రం – (దీనిలో సంయుక్తాక్షరాలెన్ని ఉన్నాయి)
అ) 3
ఆ) 2
ఇ) 4
జవాబు:
అ) 3
5. న్యాయం కావాలి. గీత గీసిన దానిలోని అక్షరాలు గుర్తించండి)
అ) న + య
ఆ) న్ + య్ + అ
ఇ) న్ + య్ + ఆ
జవాబు:
ఇ) న్ + య్ + ఆ
6. మూర్బత్వం పనికిరాదు. (గీత గీసిన దానిలోని అక్షరాలను గుర్తించండి)
అ) ర + ఖ్
ఆ) ర్ + ఖ్ + అ
ఇ) ర్ + అ + ?
జవాబు:
ఆ) ర్ + ఖ్ + అ
7. జ్యోత్స్న అందంగా ఉంటుంది. (గీత గీసిన దానిలోని అక్షరాలు గుర్తించండి)
అ) త్ + స్ + న్ + అ
ఆ) త + స్ + న్
ఇ) త్ + అ + స్ + న్
జవాబు:
అ) త్ + స్ + న్ + అ
8. అన్నమును వృధా చేయకు. (గీత గీసిన దానిలోని అక్షరాలు గుర్తించండి)
అ) న + న
ఆ) న్ + అ + న్ + అ
ఇ) న్ + న్ + అ
జవాబు:
ఇ) న్ + న్ + అ
9. కత్తితో జాగ్రత్తగా ఉండాలి. (గీత గీసిన దానిలోని అక్షరాలు గుర్తించండి)
అ) త్ + త్ + అ
ఆ) త్ + త్ + ఇ
ఇ) తి + తి
జవాబు:
ఆ) త్ + త్ + ఇ
10. ఎక్కడైనా నిజాయితీగానే ఉండాలి. (గీత గీసిన దానిలోని అక్షరాలు గుర్తించండి)
అ) క్ + క
ఆ) క్ + క్ + అ
ఇ) క + క
జవాబు:
ఆ) క్ + క్ + అ
11. అమ్మేది అని బాలుడడిగాడు. (గీత గీసిన దానిలోని అక్షరాలు గుర్తించండి)
అ) మ్ + య్ + ఏ
ఆ) మ + మే
ఇ) మ్ + మ్ + అ + ఏ
జవాబు:
అ) మ్ + య్ + ఏ
12. కుయ్యేరులో బడి ఉంది. (గీత గీసిన దానిలోని అక్షరాలు గుర్తించండి)
అ) యే + యే
ఆ) య్ + య్ + అ + ఏ
ఇ) య్ + య్ + ఏ
జవాబు:
ఇ) య్ + య్ + ఏ
13. వేరు వేరు హల్లుల కలయికతో ఏర్పడేది?
అ) ద్విత్వం
ఆ) సంయుక్తం
ఇ) చేదర్థకం
జవాబు:
ఆ) సంయుక్తం
14. ఒకే హల్లు రెండుసార్లు వస్తే ఏర్పడేది?
అ) ద్విత్వం
ఆ) సంయుక్తం
ఇ) హల్లు
జవాబు:
అ) ద్విత్వం
15. ఒక సంయుక్తాక్షరంలోని అచ్చుల సంఖ్య
అ) రెండు
ఆ) ఒకటి
ఇ) ఎన్నెనా ఉంటాయి
జవాబు:
ఆ) ఒకటి
చదవండి – ఆనందించండి
కుచేలోపాఖ్యానం
కుచేలుడు అనే పేరు విన్నారా మీరెప్పుడైనా ? – విన్నాం గురువుగారూ! శ్రీకృష్ణుడి స్నేహితుడు కదా! అంటూ పిల్లలంతా ఉత్సాహంగా అన్నారు.
అందరికీ బాగా తెలిసిందే అంటూ కథ ప్రారంభించారు గురువుగారు. కుచేలుడు చాలా పేదవాడు. చినిగిపోయిన వస్త్రాలు కట్టుకొని తిరిగేవాడు. కుటుంబం గడవటం కష్టంగా ఉండేది. ఒకనాడు కుచేలుడితో ఆయన భార్య “నాథా ! ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా ! చిన్ననాటి మీ స్నేహితుడు శ్రీకృష్ణుడున్నాడు గదా ! ఆయనను సహాయం అడగండి” అని చెప్పింది.
సరే! అన్నాడు కుచేలుడు. కుచేలుడు చిన్ననాటి స్నేహితుడికి ఏదైనా తీసుకొని వెళ్లాలని అనుకొన్నాడు. తీసుకొనిపోవడానికి ఇంట్లో ఏమీ లేవు. భార్య తన పంచెకొంగున కట్టిన పిడికెడు అటుకులు తీసుకొని శ్రీకృష్ణుడి వద్దకు బయలుదేరాడు కుచేలుడు.
కుచేలుణ్ణి చూచి శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడ్డాడు, అక్కున చేర్చుకున్నాడు, సకలోపచారాలూ చేశాడు. కుచేలుడు తెచ్చిన అటుకులు ఎంతో మక్కువతో ఆరగించాడు. రుక్మిణీ కృష్ణులు కుచేలునికి పరిచర్యలు చేశారు. కుచేలుడు శ్రీకృష్ణుడిని ఏమీ అడగలేదు. కుచేలుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని పాత కుటీరం స్థానంలో మహాభవనం వెలిసింది. కుచేలుడు ఏమీ అడగకపోయినా శ్రీకృష్ణుడు అతన్ని ఐశ్వర్యవంతుడిని చేశాడు. ఈ సన్నివేశం మిత్ర ప్రేమకు దృష్టాంతం.