These AP 6th Class Social Important Questions 10th Lesson స్థానిక స్వపరిపాలన will help students prepare well for the exams.
AP Board 6th Class Social 10th Lesson Important Questions and Answers స్థానిక స్వపరిపాలన
ప్రశ్న 1.
భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా ఏర్పాటు చేసిన విధమును వివరించండి.
జవాబు:
భారతదేశంలో స్థానిక స్వపరిపాలన, రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వ అధికార పరిధిని సూచిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 స్థానిక స్వపరిపాలవను సూచిస్తుంది. ఈ ఆర్టికల్ మన జాతిపిత గాంధీజీ అభిప్రాయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో చేర్చబడింది. భారత పార్లమెంట్ రెండు సవరణలు చేసింది. 1992వ సంవత్సరంలో చేయబడిన 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను, 74వ సవరణ పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనలను ఏర్పాటు చేశాయి. ఈ సవరణల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయితీ రాజ్ చట్టం 1994ను చేసి రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది.
ప్రశ్న 2.
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక స్వపరిపాలన గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని స్థాయిల్లో కలదు? అవి ఏవి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994 గ్రామీణ ప్రాంతాల్లో మూడు అంచెల స్థానిక స్వపరిపాలనలను ఏర్పాటు చేసింది. అవి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయితీ, మండల స్థాయిలో మండల ప్రజా పరిషత్ మరియు – జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్.
ప్రశ్న 3.
గ్రామ పంచాయితీలోని వార్డుల గురించి తెలుపుము.
జవాబు:
సాధారణంగా ప్రతి గ్రామాన్ని కొన్ని వార్డులు (వీధులు, కాలనీలు)గా విభజిస్తారు. ప్రతి వార్డులో ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉంటుంది. ప్రతివార్డు నుంచి ఒక సభ్యుడు గ్రామపంచాయితీకి ఎన్నికవుతారు. అతనిని “వార్డు సభ్యుడు” అని పిలుస్తారు. ఈ విధంగా ప్రతి వీధి / ప్రాంతం నుంచి ఒక వ్యక్తి గ్రామ పంచాయితీకి ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రతి గ్రామ పంచాయితీకి జనాభాను బట్టి 5 నుంచి 21 మంది వరకు వార్డు సభ్యులుంటారు. 21 సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయితీ ఎన్నికలలో పోటీ చేయవచ్చు.
ప్రశ్న 4.
గ్రామ పంచాయితీల్లో రిజర్వేషన్లు ఏ విధంగా అమలవుతున్నాయి?
జవాబు:
ఇంతకుముందు మన సమాజంలో స్త్రీలు ఎన్నికలలో పోటీచేయడం, వార్డు మెంబరు గానో, సర్పంచ్ గానో ఎన్నిక కావడం అంత సులభం కాదు. ఎందుకంటే స్థానిక సంస్థలలో పురుషుల ఆధిక్యం ఉంది. దీనివల్ల సగం జనాభాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ స్త్రీలకు స్థానిక సంస్థలలో 1/3 వంతు స్థానాలను కేటాయించింది. మన రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లు 50% కు పెంచడం జరిగింది.
అలాగే షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు, వెనుకబడిన తరగతులకు వారి జనాభా ప్రాతిపదిక ప్రకారం స్థానాలు కేటాయించారు. ఆ విధంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో ఈ సంస్థలలో అన్ని వర్గాలవారికీ ప్రాతినిధ్యం లభిస్తుంది.
ప్రశ్న 5.
గ్రామ సర్పంచ్ గురించి నీకేమి తెలుసు?
జవాబు:
సర్పంచ్ గ్రామ పంచాయితీకి పెద్ద. గ్రామానికి మొదటి పౌరుడు. గ్రామ పంచాయితీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత సర్పంది. రోజువారి కార్యకలాపాలు కూడా సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. గ్రామ పంచాయితీకి వచ్చే ఆదాయం, వ్యయాలకు కూడా సర్పంచే బాధ్యత వహిస్తాడు. ఆ విధంగా సర్పంచ్ గ్రామ పంచాయితీలో చాలా బాధ్యతలు కలిగి ఉంటాడు. చాలా గ్రామాలలో సర్పంచ్ క్రియాశీలకంగా ఉండడం వల్ల అభివృద్ధి చెందిన విషయం మనకు తెలుసు.
ప్రశ్న 6.
గ్రామ పంచాయితీ విధులను తెలుపుము.
జవాబు:
గ్రామ పంచాయితీ విధులు :
- నీటి వనరులు, రోడ్లు, మురుగునీరు, పాఠశాల భవనాలు ఎరియు ఇతర ఉమ్మడి వనరుల నిర్మాణం మరియు నిర్వహణ
- స్థానికంగా పన్నులు విధించటం మరియు వసూలు చేయడం.
- ఉషాధికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను అమలు చేయడం
ప్రశ్న 7.
గ్రామ పంచాయితీ ఆర్థిక వనరులను గూర్చి తెల్పండి.
జవాబు:
గ్రామ పంచాయితీ ఆర్థిక వనరులు :
- ఇళ్ళు, మార్కెట్, స్థలాలు మొదలైన వాటిపై పన్నులు వసూలు.
- రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ ల నుండి మంజూరయే నిధులు మరియు రుణాలు.
- స్థానిక ప్రజల నుండి విరాళాలు.
ప్రశ్న 8.
గ్రామ సచివాలయం ఏర్పాటు, లక్ష్యాలను వివరించండి.
జవాబు:
మన రాష్ట్రంలో అక్టోబర్ 2, 2019న గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించబడింది. ప్రతి 2000 మందికి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయబడింది. ప్రతి గ్రామ సచివాలయంలో 11 మంది గ్రామ నిర్వాహకులు (ఉద్యోగులు) ఉంటారు. గ్రామ సచివాలయం యొక్క ప్రధాన లక్ష్యం ప్రజలకు సమర్ధవంతంగా, పారదర్శకంగా మరియు జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవలను అందించడం, సేవలు గ్రామ వాలంటీర్ల ద్వారా వారికి కేటాయింపబడిన ఇళ్ళకు అందించడం జరుగుతుంది.
ప్రశ్న 9.
ఆంధ్రప్రదేశ్ లోని మొదటి పురపాలక సంఘం గురించి మీకు తెలుసా?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని మొదటి పురపాలక సంఘం గురించి తెలుసు, అది భీముని పట్నం పురపాలక సంఘం. దీనినే భీమిలి అని కూడా పిలుస్తారు. ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది. దీనిని 1861లో స్థాపించారు. ఇది 2011లో 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఇది భారతదేశంలోని పురాతన మునిసిపాలిటీలలో ఒకటి.
ప్రశ్న 10.
మండల పరిషత్, జిల్లా పరిషత్ల నిర్మాణం గూర్చి వివరించండి.
జవాబు:
మండల పరిషత్, జిల్లా పరిషల నిర్మాణం: ప్రతి మండలంలో సుమారు 20 నుండి 40 గ్రామ పంచాయితీలు ఉంటాయి. జిల్లాలోని అన్ని మండల పరిషత్తులు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (MPTCS) సభ్యులను ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. మండల పరిషత్ లో కొందరు సభ్యులు (కో – ఆప్టెడ్ సభ్యులు) నియమించబడతారు. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (MPTC) సభ్యులు తమలో ఒక సభ్యుడిని’ మండలాధ్యక్షునిగాను, మరొకరిని ఉపాధ్యాక్షుని గాను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. జిల్లా పరిషత్ సభ్యులను జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాల (ZPTCS) నుండి ఓటర్లు నేరుగా ఎన్చుకొంటారు. జిల్లా పరిషత్ కొంతమంది సభ్యులు (కో- ఆప్టెడ్ సభ్యులు) నియమించబడతారు. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ZPTC) సభ్యులు తమలో ఒకరిని జిల్లా పరిషత్ చైర్మన్ గాను, మరొకరిని వైస్ ఛైర్మన్ గాను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకొంటారు. జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ జిల్లాలోని పంచాయితీల కార్యకలాపాలను సమన్వయం చేస్తాయి. పంచాయితీల ప్రణాళికలను ఆమోదించి నిధుల కేటాయింపును సమన్వయపరుస్తాయి.
ప్రశ్న 11.
నగర పంచాయితీ, పురపాలక సంఘంల నిర్మాణం గూర్చి వివరించండి.
జవాబు:
నగర పంచాయితీ నిర్మాణం : ప్రతి నగర పంచాయితీలో వార్డు కౌన్సిలర్లు మరియు ఛైర్మతో ఒక కమిటీ ఉంటుంది. ప్రతి నగర పంచాయితీ కమిటీలో కనీసం పదిమంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు మరియు ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు. నగర పంచాయితీ నోటిఫైడ్ ఏరియా కమిటీ (N.A.C.) సభ్యులు ఆయా వార్డుల నుండి వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన ఐదు సంవత్సరాలకొకసారి ఎన్నుకోబడతారు.’ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు మరియు మహిళలకు సీట్లు కేటాయించబడ్డాయి. ‘కౌన్సిలర్లు లేదా వార్డు సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నగర పంచాయితీలోని వార్డుల నుండి ఎన్నుకోబడతారు. పురపాలక సంఘం నిర్మాణం : ప్రతి మున్సిపాలిటీలో ఎన్నిక కాబడిన సభ్యులు అయిన “కౌన్సిలర్లు” మరియు నామినేటెడ్ సభ్యులతో ఒక మున్సిపల్ కౌన్సిల్ ఉంటుంది. మునిసిపల్ కౌన్సిలను ఏర్పాటుచేయడానికి గాను, మున్సిపాలిటీ యొక్క ప్రాంతాన్ని వార్డులుగా విభజిస్తారు. ప్రతి ఐదేళ్ళకొకసారి వార్డు కౌన్సిలర్లను నేరుగా ఎన్నుకుంటారు. ఈ కౌన్సిలర్లు మరియు కౌన్సిల్ యొక్క ఇతర సభ్యులు కలిసి మున్సిపల్ ఛైర్మనను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు.
ప్రశ్న 12.
పురపాలక సంఘం ఏ విధంగా పనిచేస్తుందో సోదాహరణంగా వివరించండి.
జవాబు:
పురపాలక సంఘాలు చాలా పనులు చేస్తాయి. ఉదా : నీటి సరఫరా, వీధి దీపాలు, కొత్త రోడ్లు వేయడం, మరమ్మత్తులు, మురికి కాలువల మరమ్మత్తు, నిర్వహణ, చెత్తను తొలగించడం, పాఠశాలలను నడపడం, చౌకదుకాణాలు, ఆసుపత్రుల నిర్వహణ మొదలయినవే కాకుండా ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేస్తాయి. ఇవన్నీ చేయడానికి మానవ వనరులు అవసరం చాలా ఉంది. కేవలం, కౌన్సిలర్లు / కార్పొరేటర్ల వల్ల ఈ పనులు కావు. ఈ పనుల కోసం పురపాలక సంఘాలు చాలా మంది ఉద్యోగులను, అధికారులను, అకౌంటెంట్లను, గుమస్తాలను నియమిస్తుంది.
అలాగే ప్రతి మున్సిపాలిటీని ఎన్నో విభాగాలుగా విభజిస్తారు. ప్రతి విభాగానికి ఒక అధికారిని నియమించి ఆయనకు బాధ్యతలు అప్పజెప్పుతారు. ఉదాహరణకు నీటి సరఫరా విభాగం, విద్యుత్ సరఫరా విభాగం మొదలయినవి పురపాలక సంఘంలో విభాగాలు. మరి కౌన్సిలర్లు ఏం చేస్తారు అని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి కౌన్సిలర్లు ప్రజలతో ఎల్లప్పుడు కలిసి ఉండి వారి అవసరాలు, సమస్యలు పురపాలక సమావేశంలో చర్చిస్తారు.
వివిధ రకాల పనులు చేపట్టడానికి పురపాలక సంఘానికి కొన్ని కమిటీలు ఉంటాయి. వీటిలో కౌన్సిలర్లకు ముఖ్య భూమిక ఉంటుంది. ఈ కమిటీలు వివిధ విభాగాలు చేస్తున్న పనిని పరిశీలిస్తాయి. ఇది పురపాలక ప్రణాళికను కూడా తయారు చేస్తాయి. తరువాత ప్రతిపాదనలను తయారు చేసి, పురపాలక సంఘాల సమావేశంలో చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలను అధికారులు, ఉద్యోగులు అమలుపరుస్తారు. ప్రతివార్డు కౌన్సిలరూ తన వార్డు సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. అలా చేస్తూనే ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలపట్ల సానుకూల దృక్పథం కలిగి ఉంటారు.
ప్రశ్న 13.
పురపాలక సంఘంనకు నిధులు ఎలా సమకూరతాయి?
జవాబు:
పురపాలక సంఘం నిధులు :
పురపాలక సంఘం ఎన్నో రకాల పన్నులను విధిస్తుంది. ఉదా : ఇంటి పన్ను, నీటి పన్ను, వీధి దీపాలపై పన్ను, దుకాణాలపై పన్ను, సినిమా టికెట్ల మీద పన్ను మొదలైనవి. పన్నుల మీద వచ్చే ఆదాయం పురపాలక సంస్థల పనులకు సరిపోదు. ఈ సంస్థ ప్రభుత్వం మంజూరు చేసే నిధులపై ఆధారపడుతుంది. ప్రభుత్వం ఎన్నో రకాల పనులకు (రోడ్లు వేయడానికి, నీటి ట్యాంక్ నిర్మించడానికి, మున్సిపాలిటీ రోజువారీ పనులకు) నిధులను మంజూరు చేస్తుంది.
ప్రశ్న 14.
మున్సిపల్ కార్పోరేషన్ నిర్మాణం గూర్చి తెలుపుము.
జవాబు:
మున్సిపల్ కార్పోరేషన్ నిర్మాణం : ప్రతి మున్సిపల్ కార్పోరేషన్ “కార్పొరేటర్లు” అని పిలువబడే ఎన్నుకోబడిన సభ్యులు మరియు నామినేటెడ్ సభ్యులను కలిగి ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం, మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్రాంతాన్ని విభాగాలుగా (వార్డులు) విభజిస్తాయి. ప్రతి వార్డు నుండి కార్పొరేటర్లు ప్రతి ఐదు సంవత్సరాలకు నేరుగా ఎన్నుకోబడతారు. ఈ కార్పొరేటర్లు మరియు ఇతర సభ్యులు కలిసి కార్పొరేషన్ మేయర్‌ను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకొంటారు.
ప్రశ్న 15.
క్రింది ఫ్లోచార్టును పరిశీలించి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానము లివ్వండి.
i) ఒక పట్టణం జనాభా 4,80,000. అయితే ఆ పట్టణం ఏ స్థానిక సంస్థ అవుతుంది.?
జవాబు:
మున్సిపల్ కార్పోరేషన్
ii) NAC అనగా నేమి?
జవాబు:
నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ (కమిటి)
iii) 40,000 నుండి 3,00,000 జనాభా ఉన్న స్థానిక సంస్థనేమంటారు?
జవాబు:
పురపాలక సంఘం
iv) దేని ఆధారంగా పట్టణ స్థానిక సంస్థలను 3 రకాలుగా విభజించారు?
జవాబు:
జనాభా ప్రాతిపదికన
పట నైపుణ్యం
ప్రశ్న 16.
a) పటాన్ని గుర్తించుట :
ఈ క్రింది వాటిని గుర్తించుము. 1. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు 2. రాష్ట్ర రాజధాని
b) పటాన్ని చదువుట :
ఈ క్రింది పటాన్ని గమనించి ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
1. అనంతపురానికి ఉత్తరాన ఉన్న జిల్లా ఏది?
జవాబు:
కర్నూలు
2. ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాన ఉన్న జిల్లా ఏది?
జవాబు:
శ్రీకాకుళం
3. ఒడిశాను ఆనుకుని ఉన్న ఒక జిల్లా పేరు వ్రాయుము.
జవాబు:
శ్రీకాకుళం
4. పశ్చిమ గోదావరి, గుంటూరుకు మధ్యన ఉన్న జిల్లా ఏది?
జవాబు:
కృష్ణా జిల్లా
5. నీ వుండే జిల్లాకు ఎరుపు రంగు వేయుము.
జవాబు:
విద్యార్థి కృత్యం