AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం రామాయణం Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం రామాయణం

10th Class Telugu ఉపవాచకం రామాయణం Textbook Questions and Answers

రామాయణం – కొన్ని వివరణలు

రామాయణం : సంస్కృతంలో వాల్మీకి మహర్షిచే రచింపబడింది. ఆదికావ్యం.

వాల్మీకి మహర్షి : సంస్కృత రామాయణ కర్త. ఆదికవి.

రామాయణానికి గల పేర్లు : రామాయణం, పౌలస్త్యవధ, సీతాయాశ్చరితం మహత్.

దశరథ మహారాజు : కోసలదేశానికి రాజు.

కోసలదేశం : సరయూ నదీ తీరంలో ఉంది.

అయోధ్య : కోసలదేశ రాజధాని

దశరథ మహారాజు భార్యలు : కౌసల్య, సుమిత్ర, కైక (కైకేయి).

రాముడు : కౌసల్య యందు దశరథ మహారాజుకు జన్మించాడు.

లక్ష్మణుడు : సుమిత్ర యందు దశరథ మహారాజుకు జన్మించాడు.

భరతుడు : కైక యందు దశరథ మహారాజుకు జన్మించాడు.

శత్రుఘ్నుడు : సుమిత్ర యందు దశరథ మహారాజుకు జన్మించాడు.

రామాయణంలోని శ్లోకాల సంఖ్య : 24 వేలు

రామాయణంలోని కాండములు : 1. బాలకాండ, 2. అయోధ్యాకాండ, 3. అరణ్యకాండ, 4. కిష్కింధ కాండ, 5. సుందరకాండ, 6. యుద్ధకాండ, 7. ఉత్తరకాండ

నారదుడు : దేవర్షి, తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు.

వాల్మీకి ఆశ్రమం : తమసానదీ తీరంలో ఉంది.

వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చిన శ్లోకం : “మానిషాద ప్రతిషం…..”

ఋష్యశృంగుడు : విభాండక మహర్షి కుమారుడు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి.

పుత్రకామేష్టి : దశరథ మహారాజు సంతానం కోసం చేసిన యాగం.

మారీచసుబాహులు : తాటకాసునందనుల కుమారులు (రాక్షసులు). ఋషుల యజ్ఞయాగాలకు విఘ్నాలు కలిగించేవాళ్ళు.

మారీచుడు : ఇతడు తన రాక్షస మాయచేత బంగారు లేడి (మాయలేడి) రూపాన్ని ధరించాడు.

బల, అతిబల : విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఉపదేశించిన విద్యలు. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పులు ఉండవు. రూపకాంతులు తగ్గవు.

తాటక : యక్షిణి

సిద్ధాశ్రమం : వామనుడు (విష్ణువు) సిద్ధిపొందిన చోటు.

జనక మహారాజు : మిథిలానగరానికి ప్రభువు. సీతాదేవి తండ్రి.

కుశధ్వజుడు : జనకమహారాజు తమ్ముడు.

అహల్య : గౌతమ మహర్షి భార్య.

శతానందుడు : అహల్యా గౌతముల కుమారుడు.

సీత (జానకి) : శ్రీరాముని భార్య

ఊర్మిళ : లక్ష్మణుని భార్య

మాండవి : భరతుని భార్య

శ్రుతకీర్తి : శత్రుఘ్నుని భార్య

పరశురాముడు : రేణుకా జమదగ్నుల కుమారుడు. ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను సంహరించాడు.

కార్తవీర్యార్జునుడు : పరశురాముని తండ్రియైన జమదగ్నిని సంహరించాడు.

మంథర : కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు ఆమె వెంట వచ్చిన అరణపు దాసి.

సుమంత్రుడు : దశరథుని మంత్రులలో ఒకడు. దశరథుని రథం తోలేవాడు. ఇతడే శ్రీరాముని రథసారథి.

గుహుడు : శృంగిబేరపురానికి రాజు. శ్రీరామభక్తుడు. దండకారణ్య వాసానికి పోతున్న సీతారామ లక్ష్మణులను గంగానది దాటించాడు.

భరద్వాజుడు : సప్త ఋషులలో ఒకడు. వనవాసం చేస్తున్న రాముడు ఈయన ఆశ్రమాన్ని దర్శించాడు.

భరద్వాజాశ్రమం : గంగాయమున సంగమ ప్రదేశంలో ఉంది.

చిత్రకూటం : ఒక పర్వతం. ఇక్కడే రాముని ఆదేశం ప్రకారం లక్ష్మణుడు నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు.

అత్రిమహర్షి : సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేసేటప్పుడు ఈయన ఆశ్రమాన్ని దర్శించారు.

అనసూయ : అత్రి మహర్షి భార్య. ఈమె సీతాదేవికి దివ్య వస్త్రాభరణాలను ఇచ్చింది.

దండకారణ్యం : ఇక్కడ మునుల ఆశ్రమాలు చాలా ఉన్నాయి. వింధ్య పర్వతానికి దక్షిణాన ఉన్న అరణ్యం. దండునిపురం మట్టిలో కలిసిపోయి అక్కడ అరణ్యంగా ఏర్పడటం చేత దీనికి దండకారణ్యం అని పేరు వచ్చింది.

విరాధుడు : తుంబురుడనే గంధర్వుడు కుబేరుని శాపంవల్ల రాక్షసుడిగా మారాడు. శరభంగ మహర్షిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పాడు.

శరభంగ మహర్షి : మహాతపస్వి. దైవ సాక్షాత్కారం పొందినవాడు. తన తపఃఫలాన్నంతా శ్రీరామునికి ధారపోశాడు.

సుతీక్ష్య మహర్షి : సీతారామలక్ష్మణులు ఈయన ఆశ్రమాన్ని దర్శించాడు. ఈయన తన తపశ్శక్తినంతా శ్రీరామునికి ధారపోశాడు.

విశ్వామిత్రుడు : గాధి కుమారుడు. యాగరక్షణార్థం రామలక్ష్మణులను తన వెంట తీసుకువెళ్ళాడు.

అగస్త్య భ్రాత : అగస్త్యుని సోదరుడు. ఇతని పేరు రామాయణంలో చెప్పబడలేదు. అందుకే పేరు తెలియని వారిని ‘అగస్త్య భ్రాత’ అంటారు.

అగస్త్య మహర్షి : వింధ్యపర్వత గర్వాన్ని అణచినవాడు. ఈయన శ్రీరామునికి దివ్య ధనుస్సు, అక్షయ తూణీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహూకరించాడు.

పంచవటి : గోదావరి తీరాన ఉన్న ఒక అరణ్యం. వనవాసం చేస్తున్న సీతారామలక్ష్మణులు ఇక్కడే పర్ణశాలను నిర్మించుకొని నివసించారు.

జటాయువు : ఒక పెద్ద గ్రద్ద. సంపాతికి తమ్ముడు. ఈ జటాయువు దశరథునికి మిత్రుడు. శ్రీరాముడు ఈయనకే సీత సంరక్షణ బాధ్యతను అప్పగించాడు. రావణాసురుడు సీతను అపహరించి తీసుకొని వెళ్ళాడని శ్రీరామునికి తెలిపింది ఇతడే.

శూర్పణఖ : ఒక రాక్షసి. రావణాసురుని చెల్లెలు, లక్ష్మణుడు ఈమె ముక్కు, చెవులను కోసి విరూపినిగా చేశాడు.

ఖరదూషణులు : శూర్పణఖ సోదరులు.

అకంపనుడు : రావణాసురుడి గూఢచారులలో ఒకడు.

రావణుడు : కైకసీ విశ్రవసుల కుమారుడు. లంకానగరానికి అధీశుడు. సీతను అపహరించి తీసుకొని వచ్చినవాడు.

లంకానగరం : త్రికూట పర్వతం మీద ఉంది.

కబంధుడు : ఒక రాక్షసుడు. ఇతని చేతుల్లో చిక్కి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. రావణునిచేత అపహరింపబడిన సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామునికి తెలియజేసినవాడు ఇతడే.

శబరి : ఒక బోయకాంత. తపస్సిద్ధురాలు. పంపాతీరంలో ఆశ్రమాన్ని ఏర్పరచుకొని నివసించింది. శ్రీరామ దర్శనంతో ఈమె తనువు పులకించింది. పంపాతీరంలో దొరికే పండ్లను రామునికి అర్పించింది.

ఋష్యమూక పర్వతం : కిష్కింధకు దగ్గరలో గల ఒక పర్వతం. సుగ్రీవుడు నివసించింది ఈ పర్వతం పైనే.

వాలి సుగ్రీవులు : వనరులు. అన్నదమ్ములు. వాలి సుగ్రీవులు శత్రువులుగా ఉన్నప్పుడే సుగ్రీవుడు రామునితో స్నేహం చేశాడు.

హనుమంతుడు : అంజనకు వాయుదేవుని అనుగ్రహం వల్ల జన్మించాడు. ఇతడు సుగ్రీవుని మంత్రి. ఇతడే సుగ్రీవునికి రామలక్ష్మణులతో స్నేహం ఏర్పాటు చేశాడు. సముద్రానికి వారధి కట్టి లంకలో ప్రవేశించాడు. సీత ఉన్న అశోకవనం తప్ప మిగిలిన లంక అంతా కాల్చాడు. కిష్కింధకు వెళ్ళి సీతను చూసిన వృత్తాంతాన్ని తెలియజేశాడు.

తార : వాలి భార్య.

రుమ : సుగ్రీవుని భార్య. అంగదుడు : వాలి కుమారుడు.

నీలుడు : ఒక వానరుడు. సుగ్రీవుని సేనలోనివాడు.

నలుడు : ఒక వానరుడు. విశ్వకర్మ యొక్క పుత్రుడు. సుగ్రీవుని సేనలోనివాడు. సముద్రానికి వారథి కట్టడానికి ఇతడే ప్రారంభించాడు.

జాంబవంతుడు : భల్లూకరాజు.

సుషేణుడు : వానరరాజు, తారతండ్రి.

సంపాతి : పక్షిరాజు. జటాయువుకు అన్న. లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి కళ్ళకు కట్టినట్లు వివరించాడు. లంకకు ఎలా వెళ్ళాలో చెప్పాడు.

మైనాకుడు : ఒక పర్వతం. మేనకా హిమవంతుల కుమారుడు. ఇంద్రుడు పర్వతాల రెక్కలు విరగగొడుతున్నప్పుడు ఇతడు భయపడి దక్షిణ సముద్రంలో దాక్కున్నాడు. హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు మైనాకుడు పైకి వచ్చి తనపై విశ్రమింపమని కోరాడు. హనుమంతుడు కొంతసేపు విశ్రమించాడు.

సురస : నాగమాత. హనుమంతుని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది.

సింహిక : ఒక రాక్షసి. హనుమంతుని మింగాలని చూసింది. కాని హనుమంతుడే తన వాడి అయిన గోళ్ళతో సింహికను చీల్చేశాడు.

లంకిణి : లంకాధిదేవత.

కుంభకర్ణుడు : రావణుని తమ్ముడు. శ్రీరాముడు ఐంద్రాస్త్రంతో ఇతని శిరస్సును ఖండించాడు.

మహాపార్శ్వుడు : రావణుని సేనానాయకులలో ఒకడు.

వీభీషణుడు : రావణుని తమ్ముడు. రావణుడు పరాయి స్త్రీలను తీసుకొని వచ్చినప్పుడు అది తగదని బోధించాడు. ఇతడు రాముని పక్షంలో చేరాడు.

మహూదరుడు : ఒక రాక్షసుడు. రావణుని సేనలోనివాడు.

విరూపాక్షుడు : మాల్యవంతుని కుమారుడు. రావణుని పక్షాన పోరాడాడు. యుద్ధంలో ఇతనిని సుగ్రీవుడు సంహరించాడు.

విద్యుజిహ్వుడు : ఒక రాక్షసుడు. శూర్పణఖ భర్త.

త్రిజట : విభీషణుని కూతురు. లంకలో సీతకు కావలి ఉన్న రాక్షసి. తనకు వచ్చిన కలను బట్టి సీత కోరిక నెరవేరుతుందని, రావణునికి వినాశం తప్పదని, శ్రీరాముడికి జయం కలుగుతుందని చెప్పింది.

ఇంద్రజిత్తు : రావణుని పెద్ద కుమారుడు. ఇతని పేరు మేఘనాథుడు. ఇంద్రుని ఓడించడం వల్ల ఇంద్రజిత్తు. అని పేరు వచ్చింది. ఇతడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి హనుమంతుణ్ణి బంధించాడు

ప్రహస్తుడు : రావణుని సేనానాయకులలో ఒకడు.

శుకసారణులు : రావణాసురుని మంత్రులు.

సరమ : విభీషణుని భార్య.

జంబుమాలి : ప్రహస్తుని కుమారుడు. రావణుని సేనలోనివాడు

అతికాయుడు : రావణుని కుమారుడు. ఇతనిని లక్ష్మణుడు సంహరించాడు.

మాతలి : ఇంద్రుని రథ సారథి.

పుష్పక విమానం : ఇది కుబేరుని విమానం. దీన్ని బ్రహ్మ కుబేరునికి ఇచ్చాడు. రావణుడు బలాత్కారంగా కుబేరుని వద్ద నుంచి తీసుకున్నాడు. రావణుని చంపిన తరువాత శ్రీరాముడు దీన్ని ఎక్కి లంక నుండి వచ్చాడు. తరువాత దీన్ని కుబేరునకు ఇచ్చాడు.

త్రికూట పర్వతం : లంకానగరం ఈ పర్వతం మీద ఉన్నది.

వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
రామాయణ ప్రాశస్త్యమును గురించి రాయండి.
(లేదా)
రామాయణాన్ని ఎందుకు చదవాలి?
(లేదా)
“రామాయణం భారతీయులకు ఒక ఆచరణీయ గ్రంథం” వివరించండి.
(లేదా)
మానవ సంబంధాల గొప్పతనాన్ని వివరించిన రామాయణం యొక్క ప్రాశస్త్యాన్ని విశ్లేషించండి.
జవాబు:
‘రామాయణం’ మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం. ఈ కథ మానవహృదయాల నుండి ఎప్పటికీ చెరగదు. రామాయణం జీవిత పార్శ్వాలను ఎన్నింటినో కనబరుస్తుంది.

రామాయణంలో అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యాను రక్తి, స్నేహఫలం ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన వంటి జీవిత పార్శ్వా లు ఎన్నో కనబడతాయి.

రామాయణాన్ని చదవడం అంటే, జీవితాన్ని చదవడమే. ‘రామాయణం ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమమైన ధర్మాలను ఆచరిస్తే, మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో, రామాయణం నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా రామాయణం గొప్ప సందేశాన్ని అందిస్తుంది.

రామాయణంలో వాల్మీకి మహర్షి మారీచుని వంటి రాక్షసుని నోటి నుండి, “రామో విగ్రహవాన్ ధర్మః, సత్యధర్మ పరాక్రమః” అనే గొప్పమాటను పలికించాడు.

రాముడి వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శకావ్యం ‘నభూతో నభవిష్యతి!” అంటే “పూర్వమందు లేదు, ముందు కాలంలో రాబోదు” మనిషి ఉన్నంత వరకూ రామాయణం ఉంటుంది.

రామాయణం ప్రపంచ సాహిత్యంలోనే ‘ఆదికావ్యం’. వాల్మీకి మహర్షి సంస్కృతంలో దీనిని 24 వేల శ్లోకాలతో రాశాడు. రామాయణం ముందు తరాల వారికి స్ఫూర్తిని ఇస్తుంది. అందువల్లనే మనం, రామాయణాన్ని తప్పక చదవాలి.

ప్రశ్న 2.
‘రామాయణం’ ఏ విధంగా విశ్వరూపాన్ని చూపిందో రాయండి.
జవాబు:
‘రామాయణం’ మానవ జీవిత మూల్యాలను చూపింపచేసే అక్షరమణుల అద్దం. అందుకే రామాయణం కొండలు, సముద్రాలు ఉన్నంత వరకూ ఉంటుందని బ్రహ్మ వాల్మీకి మహర్షికి చెప్పాడు. వాల్మీకి, రామాయణాన్ని రచించాడు. దీని తరువాత దేశ విదేశాలలో అనేక ప్రక్రియల్లో ఎన్నో రామాయణాలు వచ్చాయి. వీటన్నింటికీ మూలం “వాల్మీకి రామాయణం”. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. రచయితలు కొందరు వాల్మీకి రామాయణ మూలాన్ని అనుసరించారు. కొందరు స్వతంత్ర పోకడలు పోయారు.

సంస్కృత సాహిత్యం – రామకథ :
రామకథ వివిధ పురాణాల్లో కనబడుతుంది.

  1. ఆధ్యాత్మ రామాయణం
  2. కాళిదాసు రచించిన ‘రఘువంశం’- దీనిలో రామకథతోపాటు అతని పూర్వుల చరిత్ర కూడా రాయబడింది.
  3. చంపూ రామాయణం – భోజుడు దీనిని గద్యపద్యాలతో రచించాడు.
  4. “రావణవధ” దీనిని భట్టి కవి రాశాడు.
  5. “ప్రతిమా నాటకం’ పేరుతో రామకథను భాసుడు రాశాడు.
  6. ఉత్తర రామచరితం : భవభూతి నాటకంగా దీనిని రాశాడు.
  7. రాఘవ పాండవీయం : రెండర్థాల కావ్యంగా భారత రామకథలు మేళవించి, ధనంజయుడు దీనిని రాశాడు.

కాశ్మీరీ భాషలో దివాకర ప్రకాశభట్టు “రామావలోకచరిత”, “లవకుశ యుద్ధచరిత” ను రచించాడు. మరాఠీలో సమర్థరామదాసు ‘రామాయణం’, మోరోపంతు రాసిన “లవకుశాఖ్యానమ్’, ‘మంత్ర రామాయణమ్’ పేరు పొందాయి. వంగభాషలో కృత్తివాస ఓఝా “రామాయణానికి” మంచి పేరుంది. తమిళ భాషలో ‘కంబ రామాయణం’ మలయాళంలో ఎళుత్తచ్చన్ “అధ్యాత్మ రామాయణం”, కన్నడంలో నాగచంద్రుడు రాసిన “రామచంద్ర చరిత పురాణం’ చంపూ మార్గంలో సాగింది. ఒరియాలో సిద్ధేంద్రయోగి “విచిత్ర రామాయణం” రాశాడు.

తెలుగు భాషలో రామాయణాలు:
గోనబుద్ధారెడ్డి “రంగనాథ రామాయణం” తెలుగులో మొదటి రామాయణం. ఇందులో వాల్మీకి రాయని ఎన్నో కల్పనలు ఉన్నాయి. ఇది ద్విపద రామాయణం. తాళ్ళపాక అన్నమాచార్యుల రామాయణం, కట్టా వరదరాజు రామాయణం, ఏకోజీ రామాయణం ద్విపదలో సాగాయి.

తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ తెలుగుజాతిపై ముద్ర వేసింది. హుళక్కి భాస్కరుడు, అతని కుమారుడు మల్లికార్జున భట్టు, శిష్యుడు రుద్రదేవుడు, మిత్రుడు అయ్యలార్యుడు, “భాస్కర రామాయణం” రాశారు. ఇక మొల్ల సంక్షిప్తంగా సుందరంగా రామాయణాన్ని తీర్చిదిద్దింది. అయ్యలరాజు రామభద్రుడు ‘రామాభ్యుదయం’ మంచి ప్రబంధం. తంజావూరు రఘునాథ నాయకుడు ‘రఘునాథ రామాయణం’ వాల్మీకిని అనుసరించి రాశాడు. గోపీనాథ వేంకట కవి ‘గోపీనాథ రామాయణం’ రాశాడు. కంకంటి పాపరాజు ‘ఉత్తర రామాయణం’ రాశాడు.

కాణాదం పెద్దన “ఆధ్యాత్మ రామాయణం’ రాశాడు. గద్వాల సంస్థానాధీశులు, ఆరుగురు కవులచే రామాయణాన్ని ఆంద్రీకరింపజేశారు. వావిలికొలను సుబ్బారావుగారు “ఆంధ్రవాల్మీకి రామాయణం, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి “శ్రీకృష్ణ రామాయణం” పేరు పొందాయి.

విశ్వనాథ సత్యనారాయణ గారి “శ్రీమద్రామాయణ కల్పవృక్షం” జ్ఞానపీఠ పురస్కారాన్ని సంపాదించింది. పింగళి సూరన ‘రాఘవ పాండవీయం’ ద్వ్యర్థి కావ్యాన్ని రాశాడు. నెల్లూరి రాఘవకవి. ‘యాదవ రాఘవ పాండవీయం’ అనే త్ర్యర్థి కావ్యం రాశాడు. కేశవయ్య “దాశరథి చరిత్ర” పేరుతో నిరోష్ఠ్యరామాయణం రాశాడు.

ఇవి కాక తెలుగులో రామాయణం పాటలు, నాటకాలు, హరికథలు, స్త్రీల రామాయణం పాటలు, వచన కావ్యాలు వచ్చా యి.