AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 6th Lesson యుద్ధకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 6th Lesson యుద్ధకాండ

10th Class Telugu ఉపవాచకం 6th Lesson యుద్ధకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం

1. అ) వంద యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది.
ఆ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.
ఇ) విశ్వకర్మ కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు, ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువు నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు.
ఈ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు.
జవాబులు
ఈ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు.
ఇ) విశ్వకర్త కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు. ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువు నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు.
అ) వందయోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది.
ఆ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.

2. అ) లంకను నాలుగువైపుల నుండీ సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు.
ఆ) సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని, లంకకు విభీషణుడు రాజు కాగలడని శ్రీరాముని వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు.
ఇ) అంగదుని చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఈ) రామలక్ష్మణులను మూర్ఛపోయేటట్టు చేసి నాగాస్త్రంతో బంధించాడు.
జవాబులు
ఆ) సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని, లంకకు విభీషణుడు రాజు కాగలడని శ్రీరాముని వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు.
అ) లంకను నాలుగువైపుల నుండీ సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు.
ఇ) అంగదుని చేతిలో రావణకుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఈ) రామలక్ష్మణులను మూర్చపోయేటట్టు చేసి నాగాస్త్రంతో బంధించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

3. అ) సుషేణుని సూచన మేరకు హనుమంతుడు ఓషధులు తేవడానికి వేగంగా వెళ్లాడు.
ఆ) ఆకాశానికి ఆకాశం, సముద్రానికి సముద్రమే సమానమైనట్లు రామరావణ యుద్దానికి రామరావణ యుద్ధమే సమానమన్నట్లు సాగుతున్నది.
ఇ) ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు.
ఈ) ఐంద్రాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేలరాల్చాడు లక్ష్మణుడు.
జవాబులు
ఇ) ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు.
ఈ) ఐంద్రాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేలరాల్చాడు లక్ష్మణుడు.
అ) సుషేణుని సూచన మేరకు హనుమంతుడు ఓషధులు తేవడానికి వేగంగా వెళ్లాడు.
ఆ) ఆకాశానికి ఆకాశం, సముద్రానికి సముద్రమే సమానమైనట్లు రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సమానమన్నట్లు సాగుతున్నది.

4. అ) ఆమె శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు చాటడానికే అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పదనాన్ని వెల్లడించాడు.
ఇ) ‘నా వంశ ప్రతిష్ఠ నిలుపుకోడానికి దుష్ట రావణుని చెరనుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుడి పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహముంది. కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లవచ్చునని’ శ్రీరాముడు అన్నాడు.
ఈ) శ్రీరామునికి విశ్వాసం కలిగించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే శరణ్యమని భావించింది.
జవాబులు
ఇ) ‘నా వంశ ప్రతిష్ఠ నిలుపుకోవడానికి దుష్ట రావణుని చెరనుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుడి పంచన . ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహముంది. కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లవచ్చు’నని శ్రీరాముడు అన్నాడు.
ఈ) శ్రీరామునికి విశ్వాసం కలిగించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే శరణ్యమని భావించింది.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పదనాన్ని వెల్లడించాడు.
అ) ఆమె శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు చాటడానికే అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు.

5. అ) అంగరంగ వైభవంగా శ్రీరామపట్టాభిషేక మహోత్సవం జరిగింది.
ఆ) పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు.
ఇ) పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు భరతుడు, ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ) శ్రీరాముడి కోరిక మేరకు ఇంద్రుడు మృతులైపడి ఉన్న వానరులను మళ్లీ బతికించాడు.
జవాబులు
ఆ) పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు.
ఈ) శ్రీరాముడి కోరిక మేరకు ఇంద్రుడు మృతులైపడి ఉన్న వానరులను మళ్లీ బతికించాడు.
ఇ) పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు భరతుడు, ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు.
అ) అంగరంగ వైభవంగా శ్రీరామపట్టాభిషేక మహోత్సవం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

6. అ) రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుడి గుండెలో నాటుకుంది.
ఆ) అంగదుని చేతిలో రావణుని కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఇ) సముద్రుడిని ప్రార్థించడం వల్ల అది సాధ్యపడదన్నాడు విభీషణుడు.
ఈ) రావణుడి బాణ శక్తికి సుగ్రీవుడు మూర్ఛపోయాడు.
జవాబులు
ఇ) సముద్రుడిని ప్రార్థించడం వల్ల అది సాధ్యపడదన్నాడు విభీషణుడు.
ఆ) అంగదుని చేతిలో రావణుని కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఈ) రావణుడి బాణ శక్తికి సుగ్రీవుడు మూర్చపోయాడు.
అ) రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుడి గుండెలో నాటుకుంది.

7. అ) యజ్ఞయాగాది క్రతువులను శ్రీరాముడు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు.
ఆ) విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు.
ఇ) అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్తానికి బలైనాడు.
ఈ) విభీషణుని లంకారాజుగా లక్ష్మణుడు పట్టాభిషిక్తుణ్ణి చేశాడు.
జవాబులు
ఇ) అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనాడు.
ఆ) విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు.
ఈ) విభీషణుని లంకారాజుగా లక్ష్మణుడు పట్టాభిషిక్తుణ్ణి చేశాడు.
అ) యజ్ఞయాగాది క్రతువులను శ్రీరాముడు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు.

8. అ) కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావుదెబ్బ తీస్తున్నాడు.
ఆ) శ్రీరామచంద్రాదులు వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు.
ఇ) రావణుని వద్దకు అంగదుడిని రాయబారిగా పంపాడు రాముడు.
ఈ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.
జవాబులు
ఈ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.
ఆ) శ్రీరామచంద్రాదులు వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు.
ఇ) రావణుని వద్దకు అంగదుడిని రాయబారిగా పంపాడు రాముడు.
అ) కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావుదెబ్బ తీస్తున్నాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

9. అ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుడిని ఉపాసించాడు.
ఆ) సుషేణుని చేతిలో విద్యున్మాలి మరణించాడు.
ఇ) వందయోజనాల పొడవు పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదురోజుల్లో పూర్తి అయింది.
ఈ) ఉత్సాహం ఉరకలు వేస్తుంటే అందరు సముద్రతీరాన్ని చేరుకున్నారు.
జవాబులు
ఈ) ఉత్సాహం ఉరకలు వేస్తుంటే అందరు సముద్రతీరాన్ని చేరుకున్నారు.
అ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుడిని ఉపాసించాడు.
ఇ) వందయోజనాల పొడవు పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదురోజుల్లో పూర్తి అయింది.
ఆ) సుషేణుని చేతిలో విద్యున్మాలి మరణించాడు.

10. అ) పుష్పక విమానంలో సీతా రామలక్ష్మణులు నందిగ్రామం చేరుకున్నారు.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతను తీసుకొని వచ్చి ఆమె గొప్పతనాన్ని కొనియాడాడు.
ఇ) శ్రీరాముడు హనుమంతుని సాహసాన్ని ప్రశంసించాడు.
ఈ) లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు.
జవాబులు
ఇ) శ్రీరాముడు హనుమంతుని సాహసాన్ని ప్రశంసించాడు.
ఈ) లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతను తీసుకొనివచ్చి ఆమె గొప్పతనాన్ని కొనియాడాడు.
అ) పుష్పక విమానంలో సీతా రామలక్ష్మణులు నందిగ్రామం చేరుకున్నారు.

పాత్ర స్వభావాలు

1. రావణుడు :
కైకసీ విశ్రవసుల కుమారుడు. లంకా నగరానికి అధిపతి. వేదాధ్యాయనం చేసినవాడు. శివభక్తుడు. కోపం ఎక్కువ. మూర్ఖత్వం ఎక్కువ. మంచి చెబితే వినడు. చెప్పిన వారిపై కక్ష కడతాడు. సీతాపహరణ చేశాడు. స్త్రీ వ్యా మోహం ఎక్కువ. శ్రీరాముని ఆగ్రహానికి గురి అయ్యాడు. తన వంశ నాశనానికి కారకుడయ్యాడు.

2. విభీషణుడు :
రావణుని తమ్ముడు. రావణుడు పరాయి స్త్రీలను తీసుకుని వచ్చినపుడు అది తప్పని చెప్పేవాడు. సీతాదేవిని అపహరించడం తప్పని చెప్పిన ధర్మాత్ముడు. అనేక ధర్మసూక్ష్మాలు తెలిసినవాడు. రావణునిచేత అనేక అవమానాలు పడ్డాడు. ధర్మ రక్షణకోసం శ్రీరాముని పక్షంలో చేరాడు. రాక్షస నాశనానికి కారకుడయ్యాడు. రావణ సంహారం తర్వాత లంకా నగరానికి రాజయ్యాడు.

3. ఇంద్రజిత్తు :
రావణుని పెద్ద కుమారుడు. ఇతని అసలు పేరు మేఘనాథుడు. ఇంద్రుని ఓడించడం వల్ల ఇంద్రజిత్తు అని పేరు వచ్చింది.

రావణుడు తన తమ్ముడైన కుంభకర్ణుణ్ణి, కొడుకైన అతికేయుని పోగొట్టుకొని తల్లడిల్లుతుంటే ఇంద్రజిత్తు ఆయనను ఓదార్చాడు. తాను యుద్ధ రంగానికి వచ్చి రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. వాళ్ళు స్పృహ కోల్పోయినట్లు నటిస్తే మరణించారని భావించి ఆ వార్తను తన తండ్రికి తెలియచేశాడు. శత్రుపక్షాన్ని మానసికంగా దెబ్బతీయాలనే ఆలోచన కలవాడు ఇంద్రజిత్తు. అందుకే మాయ సీతను సృష్టించి ఆమెను సంహరించాడు. చివరికి లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
“ఏ దేశంలోనైనా భార్య దొరకవచ్చు, బంధువులు దొరకవచ్చు, కాని లక్ష్మణుని వంటి తమ్ముడు దొరకడు.” అన్న శ్రీరాముని మాటలను బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
రావణుడు ప్రయోగించిన “శక్తి” అనే ఆయుధం కారణంగా నేలకూలిన లక్ష్మణుడిని చూసి విలవిలలాడిపోతూ శ్రీరాముడు అన్న మాటలివి.

ఈ మాటలు రామలక్ష్మణులకు గల అనుబంధాన్ని సోదరప్రేమను చాటుతున్నాయి. అన్నకోసం అన్ని సుఖాలు . వదులుకొని అడవులకు వచ్చినవాడు లక్ష్మణుడు. అతడు లేనిచో తాను జీవించలేనని భావించినందున రాముడు ఈ మాటలు అన్నాడు. ఇవి రాముడికి లక్ష్మణునిపై గల ప్రేమాభిమానాలను సూచిస్తున్నాయి. శ్రీరామునికి లక్ష్మణుడు తలలోని నాలుకలాంటివాడని, ఆరోప్రాణమని ఈ మాటల ద్వారా నేను గ్రహించాను. లక్ష్మణుడి వంటి సోదరుడు ఎవరికీ దొరకడని గ్రహించాను.

ప్రశ్న 2.
“వ్యక్తులు జీవించి వున్నంత వరకే వైరముండాలి. తరువాత దానిని వదలి వేయాలి” అని విభీషణుడితో శ్రీరాముడు పలికిన మాటలను బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
1. వ్యక్తులు జీవించి ఉన్నంత వరకే వైరముండాలి, తరువాత దానిని వదిలివేయాలి అని విభీషణునితో శ్రీరాముడు పలికిన మాటలను బట్టి రాముడు గొప్ప వ్యక్తిత్వం కలవాడని నేను గ్రహించాను.
2. ఏ వ్యక్తి అయినా మరణించిన తర్వాత అతనితో పూర్వము ఉన్న వైరము మరచిపోవాలని, మరణముతోనే వైరము పోవాలని గ్రహించాను.
3. రావణుని మరణానంతరము శ్రీరాముడు విభీషణునితో “రావణుడు నీకు ఎటువంటి వాడో నాకు కూడా అటువంటివాడే” అని చెప్పి తన విశాల హృదయాన్ని చాటుకొన్నాడని గ్రహించాను.
4. రాముడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ, మరణించిన శత్రువు పట్ల గౌరవ భావం కలవాడని గ్రహించాను.

ప్రశ్న 3.
“నీవు యుద్ధంలో అలసిపోయావు. సేద దీర్చుకొనిరా” అని రాముడు రావణాసురునితో చెప్పిన మాటలను బట్టి, మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
రామరావణుల యుద్ధం మహాఘోరంగా సాగుతోంది. శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని ధనుస్సు ముక్కలయ్యింది. రావణుని కిరీటం నేలపై పడింది. అప్పుడు కావాలంటే రాముడు రావణుని సంహరింపవచ్చు. కాని ధర్మాత్ముడయిన, కరుణా సముద్రుడయిన రాముడు రావణుడు తనకు శత్రువయినా అతనిపై దయతలచాడు. రావణునితో రాముడు “నీవు యుద్ధంలో అలసిపోయావు, విశ్రాంతి తీసుకొని మరునాడు యుద్దానికి రా” అని చెప్పి రావణుని దయతలచి విడిచిపెట్టాడు.

దీనిని బట్టి రాముడు శత్రువుపట్ల కూడా దయచూపే కరుణాంతరంగుడని గ్రహించాను. ధనుస్సు చేతపట్టిన ఆయుధం చేతిలో ఉన్న వీరునితోనే రాముడు యుద్ధం చేసేవాడని, రాముడు మహావీరుడని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 4.
“వానరా! భళా, నాకు శత్రువువే అయినా, నీ శక్తిని మెచ్చుకుంటున్నాను” అని రావణుడు హనుమంతునితో అన్న – మాటలను బట్టి, మీరేమి గ్రహించారో తెల్పండి.
జవాబు:
యుద్ధంలో హనుమంతుడిని రావణుడు తన అరచేతితో చరచాడు. హనుమంతుడు తిరిగి కోపంతో రావణుడిని తన అరచేతితో ఒక్క దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు రావణుడు కంపించి పోయి, హనుమంతుడి దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు రావణుడు కంపించి పోయి, హనుమంతుడి బలపరాక్రమాలనూ, శక్తినీ, మెచ్చుకుంటూ పై విధంగా మాట్లాడాడు.

ఈ రావణుని మాటలను బట్టి, హనుమంతుడు మహాబలశాలి, ధైర్యశాలి, శక్తివంతుడు అనీ, రావణుడంతటి వీరునిచే ప్రశంసలు పొందిన గొప్ప బలపరాక్రమ సంపన్నుడనీ, నేను గ్రహించాను. శత్రువుచే మెచ్చుకోబడిన హనుమంతుడే నిజమైన వీరుడని నేను అభిప్రాయపడ్డాను.

ప్రశ్న 5.
“సీతను శ్రీరామునికి అప్పగించడమే, అన్ని విధాలా మంచిది. అనవసరంగా కలహం తెచ్చుకోవడం దేనికి? శ్రీరాముని పంటి మహావీరునితో యుద్ధం తగదు” అని విభీషణుడు అన్న రావణునకు చెప్పిన మాటలను బట్టి, మీరేమి గ్రహించారు?
జవాబు:
విభీషణుడు రావణాసురునికి తమ్ముడయినా, రాక్షసుడయినా, అతడు ధర్మాత్ముడనీ, విభీషణునికి రావణుడు చేసిన సీతాపహరణం ఇష్టం లేదనీ, సీతమ్మను రామునికి తిరిగి అప్పగించడం శ్రేయస్కరమని విభీషణుడు భావించాడనీ గ్రహించాను. శ్రీరాముడు మహావీరుడని గ్రహించాను. పరస్త్రీహరణం పాపకార్యం అనీ, అది ఎంత బలవంతునికైనా చేటు తెస్తుందనీ గ్రహించాను. విభీషణుడు రాక్షస జాతిలో పుట్టిన రత్నమాణిక్యం వంటివాడని, బుద్ధిమంతుడనీ గ్రహించాను. విభీషణుడు ధైర్యవంతుడనీ, అందుకే అన్నకు ఇష్టం లేకపోయినా, అన్నకు హితమైన మాటను ధైర్యం చేసి చెప్పాడనీ గ్రహించాను.

ప్రశ్న 6.
“సీతను అప్పగించకపోతే శ్రీరాముని చేతిలో మరణం తథ్యం” అని అంగదుడు పలికిన తీరును బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి లంకను చేరాడు. అంగదుడిని రావణుని వద్దకు రాయబారిగా పంపించాడు. అంగదుడు రావణుని సమీపించి హితోపదేశం చేశాడు. సీతను శ్రీరామునికి అప్పగించకపోతే మరణం తప్పదని రావణుని హెచ్చరించాడు.

అంగదుని మాటల వల్ల శ్రీరాముడి పరాక్రమం, ధైర్యం, సాహసం అసమానమైనదని గ్రహించాను. అంగదుడిని రాయబారిగా రాముడు పంపించడం వల్ల శ్రీరాముడు రాజనీతిజ్ఞుడని గ్రహించాడు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలనే ఆలోచన శ్రీరామునికి ఉందని గ్రహించాను. అంతేగాదు శ్రీరాముని యుద్ధనీతిని కూడా గ్రహించాను.

ప్రశ్న 7.
యుద్ధరంగంలో అగస్త్యుడు శ్రీరామునికి ఆదిత్య హృదయాన్ని బోధించడం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
రామరావణ యుద్ధం భీకరంగా సాగుతున్నది. ఆ సమయంలో అగస్త్యుడు శ్రీరాముడిని సమీపించాడు. ఆ మహర్షి శ్రీరామునికి ఆదిత్య హృదయాన్ని బోధించాడు. రామునిలో విజయకాంక్షను పెంచాడు. చక్కని విజయాన్ని అందించాడు. అగస్త్యుడు చేసిన ఉపదేశం ద్వారా ఆదిత్య హృదయం సర్వ విజయప్రదమని, శత్రువులను జయించు సామర్థ్యాన్ని అందించగలదని, యుద్ధరంగంలో శక్తిని సమకూర్చగలదని గ్రహించాను. ఆదిత్య హృదయాన్ని చదివితే ఆరోగ్యం కూడా కలుగుతుందని, అందువల్లనే శ్రీరాముడు రావణుని జయించగలిగాడని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సముద్రానికి వారధిని ఎవరు కట్టారు? ఎలా?
జవాబు:
విశ్వకర్మ కుమారుడు నలుడు. శిల్పకళా నిపుణుడు. ఉత్సాహవంతుడు. శక్తియుక్తులున్నవాడు. సేతువును భరిస్తానని శ్రీరామునకు సముద్రుడు మాట ఇచ్చాడు. నలుడు నిర్మిస్తానన్నాడు. వానరుల సహకారంతో నలుడి సూచనలననుసరించి సేతువు నిర్మాణం 5 రోజులలో పూర్తయింది. అది వంద యోజనాల పొడవు. పది యోజనాల వెడల్పు కలది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 2.
రావణ మరణాన్ని వర్ణించండి.
జవాబు:
ఇంద్రుడు పంపిన రథాన్ని శ్రీరాముడు అధిరోహించాడు. రాముడు యుద్ధ నైపుణ్యం ముందు రావణుడు ఆగలేకపోతున్నాడు. అగస్త్యుడు రామునికి ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించాడు. రామబాణ ధాటికి రావణ శిరస్సులు నేలరాలుతున్నాయి. మళ్ళీ మొలుస్తున్నాయి. మాతలి సూచనతో బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు శ్రీరాముడు. రావణుడు అంతమయ్యాడు.

ప్రశ్న 3.
శ్రీరామ పట్టాభిషేకాన్ని వివరించండి.
జవాబు:
రావణ మరణానంతరం శ్రీరామ విజయం సీతకు హనుమ చెప్పాడు. అగ్ని ప్రవేశానంతరం సీతాదేవి శ్రీరాముని చేరింది. పుష్పక విమానంలో అయోధ్యకు చేరారు. పౌరులు ఘనస్వాగతం పలికారు. గురువులకు, పెద్దలకు నమస్కరించారు. శ్రీరామ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేశాడు. రామరాజ్యం ఏర్పడింది. ప్రజలకు శ్రీరామరక్ష కలిగింది.

ప్రశ్న 4.
శ్రీరాముడు శరణుకోరిన విభీషణుని ఆదరించిన విధానాన్ని వివరించండి.
జవాబు:
శ్రీరాముడు శరణుకోరిన విభీషణునితో “నేను రావణుణ్ణి బంధుమిత్ర సమేతంగా హతమారుస్తాను. నిన్ను రాజును చేస్తా” నని తమ్ముల మీద ఒట్టేసి చెప్పాడు. ఈ పనిలో తాను యథాశక్తి సహాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు. రాముడు విభీషణుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. రాముని ఆజ్ఞపై లక్ష్మణుడు సముద్రజలం తెచ్చి లంకారాజుగా విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయటం జరిగింది. అందరూ ఆనందాన్ని ప్రకటించారు.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
శ్రీరాముడు సముద్రునిపై అస్త్ర ప్రయోగానికి సిద్ధపడటానికి కారణం ఏమిటి? దాని పర్యవసానమేమిటి?
జవాబు:
లంకకు వెళ్ళాలంటే రాముడు సముద్రం దాటాలి. సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటని సుగ్రీవుడిని రాముడు అడిగాడు. సముద్రుడిని ప్రార్థించమని విభీషణుడు సలహా చెప్పాడు. శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుడిని ప్రార్థించాడు. మూడు రాత్రులు గడచినా సముద్రుడు ఎదుట కనబడలేదు.

కోపముతో శ్రీరాముడి కళ్ళు ఎరుపు ఎక్కాయి. సముద్రుడి అహంకారాన్ని పోగొట్టాలనీ, సముద్రంలో నీటిని ఇంకిపోయేటట్లు చేయాలనీ రాముడు అనుకున్నాడు. అప్పుడు శ్రీరాముడు బ్రహ్మాస్తమును స్మరించాడు.

దానితో ప్రకృతి అంతా అల్లకల్లోలమయ్యింది. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. పరుగెత్తేవాడిపై బాణం ప్రయోగించరాదని, శ్రీరాముడు ఆగాడు. సముద్రుడు దారికి వచ్చాడు. లంకకు వెళ్ళడానికి తాను దారి ఇస్తానన్నాడు.

ఎక్కుపెట్టిన బాణం వృథాకారాదని, రాముడు సముద్రుడి మాటపై పాపాత్ములు ఉండే ద్రుమకుల్యంపై దాన్ని ప్రయోగించాడు. సేతువు నిర్మించడానికి నలుడు సమర్థుడనీ, సేతువును తాను భరిస్తాననీ, సముద్రుడు రామునికి చెప్పాడు. సేతు నిర్మాణం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 2.
అంగద రాయబారాన్ని వివరించండి.
జవాబు:
అంగదుడు వాలి కుమారుడు. మహాశక్తిమంతుడు. రావణుడితో యుద్ధానికి దిగేముందు, రాముడు రావణుని దగ్గరకు అంగదుని రాయబారిగా పంపాడు. అంగదుడు రావణుడి దగ్గరకు వెళ్ళి, సీతను రామునికి అప్పగించకపోతే, శ్రీరాముడి చేతిలో రావణుడి మరణం తథ్యమనీ, లంకకు విభీషణుడు రాజు కాగలడనీ, రావణుడిని హెచ్చరించాడు.

దానితో రావణుని సభ అంతా అట్టుడికిపోయింది. నలుగురు రాక్షసులు అంగదుడి మీద విరుచుకుపడ్డారు. అంగదుడు ఆ రాక్షసులను తన చంకలో ఇరికించుకొని, మేడపైకి ఎగిరాడు. అంగదుడు మేడపై నుండి ఆ రాక్షసులను నేలపైకి విసిరాడు.

తరువాత అంగదుడు సింహనాదం చేసి, ఆకాశమార్గంలో శ్రీరాముడిని చేరాడు. ఈ విధంగా శ్రీరాముడు రావణుని భావాన్ని గ్రహించాడు. ఇక రావణుడితో యుద్ధం చేయక తప్పదని రాముడు నిశ్చయించాడు.

ప్రశ్న 3.
రావణుని శక్తి ఆయుధ ప్రయోగం వలన కలిగిన పరిణామాలను వివరించండి.
జవాబు:
రావణుడు తనతో యుద్ధం చేస్తున్న లక్ష్మణుడి పై ‘శక్తి’ అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. ఆ శక్తి ఆయుధం, లక్ష్మణుడి హృదయంలో గుచ్చుకుంది. దానితో లక్ష్మణుడు స్పృహ తప్పాడు. రావణుడు లక్ష్మణుడిని ఎత్తుకొని వెళ్ళాలని అనేక విధాల ప్రయత్నించాడు. కాని రావణుడు లక్ష్మణుడిని పైకి ఎత్తలేకపోయాడు.

అప్పుడు ఆంజనేయుడు రావణుడి మీద దాడి చేశాడు. హనుమంతుడు రావణుడి వక్షఃస్థలం మీద తన పిడికిలితో గట్టిగా గుద్దాడు. దానితో రావణుడు కూలిపోయాడు. హనుమంతుడు లక్ష్మణుడిని శ్రీరాముడి వద్దకు చేర్చాడు. శ్రీరాముడు హనుమంతుడి భుజాలపై కూర్చుండి, రావణునితో యుద్ధం చేశాడు. రాముడి పరాక్రమం ముందు, రావణుడి ధనుస్సు ముక్కలయ్యింది. రావణుని కిరీటం నేలకూలింది.

శ్రీరాముడు రావణునిపై దయతలచి “రావణా ! నీవు యుద్ధంలో అలసిపోయావు.. విశ్రాంతి తీసుకొనిరా” అని చెప్పాడు. రావణుడు యుద్ధం నుండి తిరుగుముఖం పట్టాడు.

ప్రశ్న 4.
రామరావణ సంగ్రామాన్ని వివరించండి.
జవాబు:
రాముడు హనుమంతుడి భుజాలపై కూర్చుండి, రావణునితో యుద్ధం చేశాడు. రాముని పరాక్రమంతో రావణుని ధనుస్సు ముక్కలయ్యింది. రావణుడి కిరీటం నేలకూలింది. రాముడు రావణునిపై దయతలచి అప్పటికి విడిచి పెట్టాడు.

తరువాత రామలక్ష్మణులతో రావణుడు భయంకరంగా యుద్ధం చేశాడు. రావణుడు శక్తి అనే ఆయుధాన్ని లక్ష్మణుడిపై వేశాడు. రాముడు శక్తిని వేడుకున్నాడు. శక్తి తన ప్రాణశక్తిని కోల్పోయింది. శక్తి లక్ష్మణుడికి తగిలింది. రాముడు శక్తిని విరిచివేశాడు. రాముడు విజృంభించాడు. దానితో రావణుడు పరుగుపెట్టాడు.

హనుమ తెచ్చిన ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచాడు. ఇంద్రుడు తన సారధి మాతలిని, తన దివ్యరథాన్ని, రాముని కోసం పంపాడు. రాముడు ఇంద్ర రథం ఎక్కి రావణుడితో యుద్ధం చేశాడు. రామరావణులు సమానంగా పోరాడారు.

రాముడు విజృంభించడంతో, రావణుడి రథసారధి రావణుని రథాన్ని ప్రక్కకు మరలించాడు. రావణుడు తన సారధిని మందలించాడు. తిరిగి రావణ రథం, రాముని ముందు నిలిచింది. అగస్త్య మహర్షి దేవతలతో వచ్చి, రామునికి ఆదిత్యహృదయ మంత్రం ఉపదేశించాడు.

రాముని బాణానికి రావణుడి తలలు నేలపై రాలి తిరిగి మొలుస్తున్నాయి. అప్పుడు మాతలి రావణునికై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని రామునికి చెప్పాడు. రాముని బ్రహ్మాస్త్రంతో, రావణ సంహారం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 5.
శ్రీరాముడు సైన్యంతో లంకానగరాన్ని చేరిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
సీతాదేవిని చూసి వచ్చి కుశల వార్తను అందించిన హనుమను శ్రీరాముడు ఆలింగనం చేసికొన్నాడు. మహోపకారం చేసిన హనుమకు తాను ఇయ్యగల సత్కారం అదే అన్నాడు. రాముడికి దుఃఖం వచ్చింది. సుగ్రీవుడు రాముడిని ఓదార్చాడు. క్రోధం చూపించాలి అని రామునికి సుగ్రీవుడు సలహా ఇచ్చాడు. సముద్రానికి సేతువు కడితేకాని, లంకను జయించలేము అన్నాడు. హనుమ లంకానగర రక్షణ వ్యవస్థను గూర్చి తెలిపాడు.

విజయ ముహూర్తంలో లంకకు బయలుదేరాలని రాముడు అన్నాడు. నీలుడు సైన్యానికి మార్గం చూపించాలని, రాముడు హనుమంతుని భుజం మీద, లక్ష్మణుడు అంగదుని భుజం మీద కూర్చొని వెళ్ళాలని, సుగ్రీవుడు పల్లకిపై రావాలని, రాముడు నిర్ణయించాడు. అందరూ సముద్రతీరాన్ని చేరుకున్నారు.

విభీషణుడు ధర్మం విడిచిన రావణుని విడిచి పెట్టి, తన నలుగురు అనుచరులతో రామలక్ష్మణులు ఉన్న చోటికు చేరాడు. విభీషణుడు రాముని శరణు కోరగా, రాముడు అంగీకరించాడు. రాముడు రావణుని చంపి విభీషణుణ్ణి రాజును చేస్తానని ప్రమాణం చేశాడు. ఆ పనిలో రామునికి తాను సహాయం చేస్తానని విభీషణుడన్నాడు. రాముడు విభీషణుణ్ణి లంకకు పట్టాభిషిక్తుణ్ణి చేయమని లక్ష్మణుడికి చెప్పాడు. లక్ష్మణుడు ఆ పని చేశాడు. సముద్రుణ్ణి ప్రార్థిస్తే సముద్రాన్ని దాటగలవని విభీషణుడు రామునికు చెప్పాడు. శ్రీరాముడు సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రోజులు అయినా, సముద్రుడు ప్రసన్నుడు కాలేదు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. సముద్రుడు పరుగుపెట్టాడు. లంకకు వెళ్ళడానికి దారి ఇస్తానని సముద్రుడు చెప్పాడు. రాముడు ఎక్కుపెట్టి అస్త్రం వ్యర్థం కాకుండా, పాపాత్ములు ఉండే “ద్రుమకుల్యం” పై ప్రయోగించాడు. నలుడు సేతువు నిర్మించడానికి తగినవాడని సముద్రుడు చెప్పాడు. సేతువును భరిస్తానని సముద్రుడు మాట ఇచ్చాడు.

రాముడు సేతువు నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. వానరులు వృక్షాలు తెచ్చి సముద్రంలో పడవేశారు. 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు గల సేతువు 5 రోజుల్లో కట్టబడింది. రామలక్ష్మణ సుగ్రీవులు ముందు నడుస్తున్నారు. సైన్యం వారి వెంట నడిచింది. వానరులు కొందరు సముద్రంలో దూకి ఈదుతూ వచ్చారు.

ఈ విధంగా శ్రీరాముడు, సుగ్రీవుడు మొదలయిన వానర నాయకులతో లంకా నగరానికి చేరాడు.

ప్రశ్న 6.
వానర సైన్యానికీ, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధం వివరాలను తెలపండి.
జవాబు:
రాముడు సైన్యాన్ని విభాగించి, ఎవరి బాధ్యతలు వారికి అప్పగించాడు. రావణుని మంత్రులైన శుకసారణులు రాముని బలం తెలిసికోడానికి గూఢచారులుగా వచ్చి వానరులలో చేరారు. విభీషణుడు వారిని గుర్తించి, రాముని ముందు పెట్టాడు. రాముడు వారిని క్షమించి, సీతను అప్పగించకపోతే రావణుడి మరణం తప్పదని హెచ్చరించాడు. శుకసారణులు రావణునికి ఆ విషయం తెలిపారు.

రావణుడు అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో మరణించాడని సీతకు అబద్దం చెప్పాడు. విద్యుజిహ్వుడిచే రామునివి అనిపించే మాయా శిరస్సునూ, ధనుర్భాణాలనూ తెప్పించి, సీతకు చూపించాడు. సీతను తన్ను ఆశ్రయించమని కోరాడు. సీత విచారించింది. విభీషణుడి భార్య “సరమ” సీతను ఊరడించి రాముడు క్షేమంగా ఉన్నాడనీ, అదంతా రాక్షసమాయ అనీ సీతకు తెలిపింది.

శ్రీరామ చంద్రాదులు సువేల పర్వతానికి చేరారు. లంకానగర శోభను చూశారు. రావణుడు ఠీవిగా మేడపై ఉన్నాడు. సుగ్రీవుడు రావణునిపై కోపంతో ఎగిరి రావణ భవనంపై వాలాడు. తన నుండి రావణుడు తప్పించుకోలేడని, రావణుడి కిరీటాన్ని తీసి నేలపై కొట్టాడు. రావణుడు రెచ్చిపోయాడు. ఇద్దరికీ బాహాబాహీ యుద్ధం జరిగింది. సుగ్రీవుడు రావణుడిని ముప్పుతిప్పలు పెట్టి, తిరిగి సువేల పర్వతం చేరాడు. శ్రీరాముడు సుగ్రీవుణ్ణి మందలించాడు.

అంగదుడిని రాముడు రావణుడి దగ్గరకు రాయబారిగా పంపాడు. రాముడి చేతిలో రావణుడు మరణిస్తాడని, విభీషణుడు రాజు అవుతాడని రాముని వాక్యంగా, అంగదుడు రావణునికి తెలిపాడు. అంగదుడిని నలుగురు రాక్షసులు చంపబోయారు. అంగదుడు వారిని చంపి వచ్చాడు. రాముడు యుద్ధానికి సిద్ధం అయ్యాడు.

లంకపై దండయాత్ర :
వానరసైన్యం లంకను నాల్గువైపుల నుండి ముట్టడించింది. ఆంజనేయుడి చేతిలో జంబుమాలి, సుషేణుడి చేతిలో విద్యున్మాలి మరణించారు. అంగదుడి చేతిలో ఇంద్రజిత్తు ఓడిపోయాడు. దానితో ఇంద్రజిత్తు కపట యుద్దానికి దిగాడు. ఇంద్రజిత్తు నాగాస్త్రంతో రామలక్ష్మణులను బంధించాడు. రామలక్ష్మణులు మరణించారని ఇంద్రజిత్తు రావణుడితో చెప్పాడు. రావణుడు ఆజ్ఞాపించగా “త్రిజట మొదలయిన రాక్షస స్త్రీలు సీతను పుష్పక విమానంలో యుద్ధభూమికి తీసుకువచ్చి, నేలపై ఉన్న రామలక్ష్మణులను చూపించారు. సీత ఏడ్చింది. త్రిజట సీతను ఓదార్చింది. రామలక్షణులు బతికి ఉన్నారని ఆమె సీతకు ఆధారాలు చూపింది. సీత మనస్సు కుదుట పడింది.

గరుత్మంతుడి రాకతో నాగాస్త్ర ప్రభావం నుండి రామలక్ష్మణులు విముక్తి పొందారు. హనుమంతుడు అకంపనుణ్ణి, ధూమ్రాక్షుణ్ణి చంపాడు. అంగదుడు వజ్రదంష్ట్రుడిని, నీలుడు ప్రహస్తుడిని చంపాడు. రావణుడి చేతిలో సుగ్రీవుడు మూర్ఛపోయాడు. లక్ష్మణుడు రావణుడిని ఎదిరించాడు. రావణుడు బాణవర్షం కురిపించాడు. హనుమ అడ్డుకున్నాడు. రావణుడి అరచేతి దెబ్బకు హనుమ చలించి, తిరిగి తేరుకొని, రావణుడిని అరచేతితో కొట్టాడు. దశగ్రీవుడు కంపించిపోయి, ‘భళా! వానరా’ అని హనుమశక్తిని మెచ్చుకున్నాడు.

రావణుడు ‘శక్తి’ అనే ఆయుధాన్ని లక్ష్మణుడి పై వేశాడు. లక్ష్మణుడు స్పృహ కోల్పోయాడు. రావణుడు లక్ష్మణుడిని ఎత్తుకొని పోవడానికి విఫలయత్నం చేశాడు. ఆంజనేయుడు పిడికిలితో పొడిచి రావణుడిని కూలగొట్టి, లక్ష్మణుడిని రాముని దగ్గరకు చేర్చాడు. శ్రీరాముడు హనుమంతుని భుజాలపై కూర్చుండి రావణునితో యుద్ధం చేశాడు. రావణుని కిరీటం, ధనుస్సు నేలపై పడ్డాయి. రాముడు కరుణించి, అలసిపోయిన రావణుడిని విశ్రాంతి తీసుకొని తిరిగి యుద్ధానికి రమ్మన్నాడు.

ప్రశ్న 7.
రామరావణ యుద్ధాన్ని గురించి రాయండి.
జవాబు:
హనుమంతుని భుజాలపై కూర్చుండి, రాముడు రావణునితో యుద్ధం చేశాడు. రాముని పరాక్రమం ముందు, రావణుని ధనుస్సు, కిరీటం దాసోహం అన్నాయి. రాముడు రావణునిపై దయతలచి, “నీవు యుద్ధంలో అలసిపోయావు. విశ్రాంతి తీసుకొని రేపురా, నా బలం తెలుస్తుంది” అన్నాడు.

రావణుడు అంతఃపురానికి వెళ్ళి తమ్ముడు కుంభకర్ణుని నిద్ర నుండి లేపించాడు. కుంభకర్ణుడు ఆరునెలలు నిద్రపోయి, ఒకరోజు భోజనం చేస్తూ ఉంటాడు. రావణుడు కుంభకర్ణుడికి విషయం వివరించాడు. కుంభకర్ణుడు యుద్ధానికి సిద్ధమయి, వానరులను చావగొడుతున్నాడు. వానరులు తలో దారి పట్టారు. రాముడు కుంభకర్ణుని ఐంద్రాస్త్రంతో సంహరించాడు. కుంభకర్ణుని తల, లంకలో పడి రాజవీధులలోని భవనాల, ఇంటి కప్పులు, ప్రాకారాలు కూలిపోయాయి. కుంభకర్ణుని మరణవార్త విని రావణుడు విచారించాడు.

రావణ పుత్రుడైన “అతికాయుడు” లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలయ్యాడు. ఇంద్రజిత్తు తండ్రిని ఓదార్చాడు. ఇంద్రజిత్తు యుద్ధరంగానికి వచ్చి, రామలక్ష్మణులపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రామలక్ష్మణులు స్పృహ కోల్పోయినట్లు పడియున్నారు. అదిచూసి రామలక్ష్మణులు మరణించారని ఇంద్రజిత్తు తండ్రికి చెప్పాడు.

వానరులు అలజడి చెందడంతో, విభీషణుడు వారికి ధైర్యం చెప్పాడు. రామలక్ష్మణులు బ్రహ్మపై గౌరవంతో అస్త్ర బాధను అనుభవించారని విభీషణుడు వానరులకు చెప్పాడు. బ్రహ్మాస్త ప్రభావంతో 67 కోట్ల మంది మరణించారు. హనుమ, విభీషణుడు జాంబవంతుడి కోసం వెతుకుతున్నారు. జాంబవంతుడు ధ్వనిని బట్టి విభీషణుడిని గుర్తించాడు. హనుమ క్షేమమా ? అని జాంబవంతుడు విభీషణుడిని అడిగాడు. హనుమ జీవిస్తే వానరులంతా జీవించినట్లే అన్నాడు. హనుమ సర్వౌషధి పర్వతాన్ని పెల్లగించి తెచ్చాడు. ఓషధుల వాసనకు రామలక్ష్మణుల గాయాలు మాయం అయ్యాయి. వానరులు లేచి కూర్చున్నారు. వానరులు లంకకు నిప్పు పెట్టారు.

ఇంద్రజిత్తు మాయా. సీతను సంహరించాడు. అందరూ చనిపోయింది నిజం సీత అనుకున్నారు. ఈ వార్త తెలిసి రాముడు విచారించాడు. అది ఇంద్రజిత్తు మాయ అని విభీషణుడు తెలిపాడు. శత్రువుల సంహారానికి ఇంద్రజిత్తు నికుంభిలా అభిచార హోమాన్ని తలపెట్టాడు. ఇంద్రజిత్తు యజ్ఞాన్ని భంగం చేయడానికి లక్ష్మణుడు వెళ్ళాడు. లక్ష్మణ ఇంద్రజిత్తులు ఘోరయుద్ధం చేశారు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు తలను ఐంద్రాస్త్రంతో నేల రాల్చాడు.

రావణుని యుద్ధం :
రావణుడు ప్రళయకాల రుద్రుడిలా విజృంభించాడు. వానరులు పారిపోతున్నారు. సుగ్రీవుడు విరూపాక్షుడిని, మహోదరుడిని సంహరించాడు. రామలక్ష్మణులతో రావణుడి యుద్ధం భయంకరంగా సాగుతోంది. రావణుడు విభీషణుడిని చంపడానికి బల్లెము ఎత్తాడు. అప్పుడు లక్ష్మణుడు రావణునిపై బాణాలను వేశాడు. రావణుడు లక్ష్మణునిపై ‘శక్తి’ అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. శ్రీరాముడు ‘శక్తి’ని వేడుకొన్నాడు. శక్తి తన ప్రాణశక్తిని కోల్పోయింది. శక్తి లక్ష్మణుని మాత్రం తాకింది. అతడు నేలపై పడ్డాడు. రాముడు ఆ శక్తిని లాగి విరచివేశాడు. రాముడు విజృంభించాడు. దానితో రావణుడు పరుగుపెట్టాడు.

పడిపోయిన లక్ష్మణుడిని చూసి, రాముడు విలవిలలాడాడు. సుషేణుడు లక్ష్మణుడు చనిపోలేదని చెప్పాడు. సుషేణుడి సూచన ప్రకారంగా హనుమ ఓషధులు తెచ్చాడు. ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచాడు. ఇంద్రుడు మాతలితో పాటు తన దివ్య రథాన్ని రాముని కోసం పంపాడు. రాముడు రథం ఎక్కాడు. రామరావణులు సమంగా యుద్ధం చేశారు. రాముడు విజృంభించాడు. దానితో రావణుడి రథసారథి రావణుడి రథాన్ని పక్కకు మరలించాడు. రావణుడు సారథిని మందలించాడు. తిరిగి రావణరథం రాముని ముందు నిలిచింది. అగస్త్యుడు దేవతలతో అక్కడకు వచ్చి, రాముడికి ‘ఆదిత్య హృదయ మంత్రం’ ఉపదేశించాడు.

రాముని బాణానికి రావణుడి తలలు నేలరాలి తిరిగి మొలుస్తున్నాయి. రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని వేయమని మాతలి రామునికి చెప్పాడు. రాముడి బ్రహ్మాస్త్రంతో రావణ సంహారం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 8.
రావణుని చంపి శ్రీరాముడు పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పాలించిన విధానాన్ని తెలపండి.
జవాబు:
మాతలి సూచనతో శ్రీరాముడు రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రావణ సంహారం జరిగింది. రాముడి ఆదేశం మేరకు విభీషణుడు తన అన్న రావణునికి ఉత్తర క్రియలను నిర్వహించాడు. రాముని ఆజ్ఞ ప్రకారం, లక్ష్మణుడు విభీషణుడిని లంకారాజుగా పట్టాభిషేకం చేశాడు. హనుమ సీతమ్మకు రావణసంహారం గురించి చెప్పాడు. సీతను బాధించిన స్త్రీలను చంపుతానన్న హనుమను, సీతమ్మ వారించింది.

విభీషణుడు సీతను పల్లకిలో రాముని వద్దకు తీసుకువచ్చాడు. సీత భర్తను చేరుకుంది. రాముడు సీతతో తన వంశ ప్రతిష్ఠను నిలుపుకోడానికి రావణుడి చెర నుండి సీతను విడిపించాననీ, సీత పరుల పంచన ఉన్నందువల్ల తనకు ఆమెపై సందేహం ఉందనీ, ఆమె ఇష్టం వచ్చినచోటుకు వెళ్ళవచ్చునని అన్నాడు. శ్రీరాముడి మాటలు సీతకు బాణాల్లా గుచ్చుకున్నాయి. రాముడికి తనపై విశ్వాసం కల్గించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే దిక్కని సీత భావించింది. లక్ష్మణుడు చితిని సిద్ధం చేశాడు. సీత అగ్నిప్రవేశం చేసింది. అగ్నిదేవుడు సీతను స్వయంగా తీసుకువచ్చి ఆమెను స్వీకరించమని రాముని కోరాడు.

సీత శీలాన్ని ముల్లోకాలకూ చాటడానికే, సీత అగ్ని ప్రవేశం చేస్తున్నప్పటికీ, తాను ఊరుకున్నానన్నాడు. సీతను రాముడు స్వీకరించాడు. శివుడు రాముని ప్రశంసించాడు. ఇంద్రుడు చనిపోయిన వానరులను బ్రతికించాడు. విభీషణుడు రాముడిని మరికొంతకాలం లంకలో ఉండమన్నాడు. కాని భరతుని కోసం రాముడు పుష్పకవిమానంలో అయోధ్యకు బయలుదేరాడు. రాముడు తాను తిరిగి వస్తున్న విషయాన్ని భరతుడికి హనుమ ద్వారా కబురంపాడు.

పుష్పకవిమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు, భరతాదులు స్వాగతం చెప్పారు. సీతారాములు తల్లులకూ, వశిష్ఠుడికి నమస్కరించారు. భరతుణ్ణి రాముడు దగ్గరకు తీసుకొన్నాడు. శ్రీరామ పట్టాభిషేకం మహా వైభవంగా జరిగింది. రాముడు లక్ష్మణుడిని యువరాజుగా ఉండమన్నాడు. లక్ష్మణుడు అంగీకరించలేదు. భరతుణ్ణి యువరాజుగా చేశాడు.

రాముడు ప్రజలను కన్నబిడ్డలవలె చూశాడు. ప్రజలు ధర్మబద్ధంగా నడచుకున్నారు. రాముడు 11 వేల సంవత్సరాలు పాలించాడు. ప్రజలకు ఈతిబాధలు లేవు. అందుకే రామరాజ్యం ‘ అనేమాట ప్రసిద్ధం అయ్యింది.

ప్రశ్న 9.
సేతువు నిర్మాణం గురించి రాయండి.
జవాబు:
శ్రీరాముడు సముద్రాన్ని దాటే ఉపాయమేమిటని సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు. సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుందని విభీషణుడు చెప్పాడు. శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రాత్రులు గడిచాయి. సముద్రుడు ఎదుట నిలువలేదు. శ్రీరాముడికి కోపం వచ్చింది. సముద్రుడి అహంకారాన్ని అణగదొక్కాలనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. సముద్రుడు పరుగెత్తాడు. లంకకు వెళ్ళడానికి దారి ఇస్తానన్నాడు.

విశ్వకర్మ కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు. సేతువు (వంతెన)ను నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు. ఆ సేతువును తాను భరిస్తానని మాట ఇచ్చాడు. సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. అందరూ మహారణ్యం దారి పట్టారు. పెద్ద పెద్ద చెట్లను బండరాళ్ళను మోసుకువచ్చారు. సముద్రంలో పడేశారు. వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిసిపడింది. నీలుని సూచనలను అనుసరించి కొలతల ప్రకారం సేతువు నిర్మాణం జరిగింది. వంద యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదురోజుల్లో పూర్తయింది.

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 1.
‘రామాయణం” ఆధారంగా అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో వివరించండి. –
జవాబు:
రామాయణం ఆధారంగా అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలుసుకొనే అవకాశం ఉంది.

  1. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మధ్య ఉండే అనుబంధం ఆదర్శప్రాయమైనది. ఆప్యాయతానురాగాలకు నిలయమైనది.
  2. వనవాసంలో అన్న సేవకు అడ్డు కాకూడదని ఊర్మిళను అయోధ్యలోనే విడిచి వచ్చిన లక్ష్మణుడు సోదరప్రేమకు, త్యాగానికి నిదర్శనంగా నిలిచాడు. శ్రీరామ సేవాభాగ్యము ముందు “త్రిలోకాధిపత్యం” కూడా చిన్నదేనని భావించి, వనవాసంలో సకలోపచారాలు చేసే అవకాశం తన కిమ్మని శ్రీరాముణ్ణి కోరిన ఆదర్శమూర్తి లక్ష్మణుడు.
  3. లక్ష్మణుడు రామునికి ఆరోప్రాణం. యుద్ధరంగంలో నేలమీద పడిపోయిన లక్ష్మణుడిని చూచి శ్రీరాముడు విలవిల లాడిపోవటం అతనికి తమ్మునిపై గల ప్రేమానురాగాలను చాటుతోంది.
  4. భరతుడు కూడా ఆదర్శ సోదరుడే. రామునివలే తానూ వనవాస నియమాలు పాటించి 14 ఏళ్ళు శ్రీరామ పాదుకలపై పాలనాభారం ఉంచి, రాజభోగాలకు దూరంగా నగరం వెలుపల గడిపిన ఆదర్శమూర్తి.
  5. వాలి సుగ్రీవుల అనుబంధం ఆదర్శవంతమైనది కాదు. అపోహలకు, అపార్థాలకు, అధర్మానికి నిలయమైనట్టిది.
  6. రావణ కుంభకర్ణ విభీషణుల అనుబంధం కూడ ఆదర్శనీయమైనది కాదు. రావణుని అధర్మమును పూర్తిగా తెలిసికొని కూడ సహాయపడిన వ్యక్తి కుంభకర్ణుడు. ధర్మం వీడిన రావణుని, వీడినవాడు విభీషణుడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 2.
రామ లక్ష్మణులు సిద్ధాశ్రమం చేరుకొన్న ప్రయాణ విశేషాలు వివరించండి.
జవాబు:
దశరథ పుత్రులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, వేదశాస్త్రాలు, ధనుర్విద్య నేర్చారు. లక్ష్మణుడు రాముడికి బహిః ప్రాణం. తన కుమారులను దశరథుడు వివాహం చేద్దామనుకుంటున్నాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు దశరథుని దగ్గరకు వచ్చాడు. ఆ ఋషి చెప్పిన కార్యాన్ని చేస్తానన్నాడు దశరథుడు.

విశ్వామిత్రుడు తన యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కలుగజేస్తున్నారనీ, యజ్ఞం చేసేటప్పుడు తాను శపించకూడదనీ, యజ్ఞరక్షణకు శ్రీరాముణ్ణి తనతో 10 రోజులు పంపమనీ దశరథుని కోరాడు. దశరథుడు మహర్షితో రాముడికి ఇంకా 16 ఏళ్ళు నిండలేదనీ రాముడికి యుద్ధం తెలియదనీ, రాముణ్ణి విడిచి తాను ఉండలేననీ, తానే యజ్ఞరక్షణకు వస్తానని చెప్పాడు.

తన యజ్ఞానికి రావణుని ఆజ్ఞపై మారీచ సుబాహులు విఘ్నాలు కల్గిస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు. అప్పుడు దశరథుడు రాముణ్ణి పంపనని చెప్పగా, విశ్వామిత్రునకు కోపం వచ్చింది. ‘వశిష్ట మహర్షి దశరథునికి నచ్చచెప్పి, రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలు ఉపదేశించాడు. ఆ విద్యల మహిమవల్ల అలసట, ఆకలిదప్పులు ఉండవు. రాముడు విశ్వామిత్రునికి గురుసేవ చేశాడు. రామలక్ష్మణులు మహర్షితో ‘మలద’ , ‘కరూశ’ గ్రామాలకు చేరారు. అక్కడ తాటక అనే యక్షిణి విధ్వంసం చేసేది. ఆమె కొడుకు మారీచుడు జనపదాలను అతలాకుతలం చేసేవాడు. తాటకను చంపమని విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. రాముడు వాడి బాణాలతో తాటక బాహువులను ఖండించాడు. లక్ష్మణుడు తాటక ముక్కు చెవులు కోశాడు. రాముడు శబ్దవేధి విద్యతో, బాణం వేసి తాటకను చంపాడు. విశ్వామిత్ర మహర్షి సంతోషించి, అనేక దివ్యాస్త్రాలను రాముడికి అనుగ్రహించాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తన సిద్ధాశ్రమం చేరి, యజ్ఞదీక్ష చేపట్టాడు. ఆ యజ్ఞం, ఆరురోజులు. రామలక్ష్మణులు యజ్ఞాన్ని జాగ్రత్తగా రక్షిస్తున్నారు. ఇంతలో మారీచ సుబాహులు అనే రాక్షసులు, యజ్ఞకుండంలో రక్తం కురిపించారు. మారీచుడి పై రాముడు ‘శీతేషువు’ అనే మానవాస్త్రాన్ని వేసాడు. మారీచుడు సముద్రంలో పడ్డాడు. రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి చంపాడు. మిగిలిన వారిని, ‘వాయవ్యాస్త్రం’తో రామలక్ష్మణులు తరిమారు. మహర్షి యజ్ఞం పూర్తయ్యింది.

ప్రశ్న 3.
రామాయణం ఎందుకు చదవాలి?
(లేదా)
‘రామాయణం వంటి ఆదర్శకావ్యం న భూతో న భవిష్యతి” దీనిని సమర్థిస్తూ రామాయణం గొప్పదనాన్ని రాయండి.
జవాబు:
మానవ జీవన మూలాలకు రామాయణం మణిదర్పణం. అందువల్లనే కొండలు, సముద్రాలు ఉన్నంతవరకూ రామాయణము లోకంలో ఉంటుందని బ్రహ్మగారు చెప్పారు. రామాయణం శాశ్వతత్వాన్ని సంపాదించుకున్న కావ్యము.

రామాయణం’ అంటే రాముని మార్గము. శ్రీరాముడు సత్యవాక్య పరిపాలకుడై ధర్మమార్గంలో ప్రజారంజకంగా పరిపాలించాడు. శ్రీరాముడు నడచిన నడత ధర్మబద్దం.

మానవ జీవితాన్ని సంస్కరించగల కావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎన్నటికీ చెరగని కథ రామాయణం. , ఇందులో అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురువుపై భక్తి, శిష్యులపై ప్రేమ, స్నేహఫలం, ధర్మబలం వంటి జీవిత సంబంధాలను రామాయణం పట్టి చూపిస్తుంది.

వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవనకారుణ్య భావం, ప్రకృతి లాలన వంటి జీవిత పార్శ్వాలకు రామాయణం మణిదర్పణం.

రామాయణం ఆచరణ ప్రధానమైన కావ్యం. సీతారాముల వంటి ఆదర్శనాయికానాయకుల చరిత్ర ఇది. “రామో విగ్రహవాన్ ధర్మః” అనే గొప్పమాట మారీచుని వంటి దుష్ట రాక్షసుని నోటి నుండి మహర్షి వాల్మీకి పలికించాడు. రామాయణం ఆదికావ్యం. ఇటువంటి కావ్యం ప్రపంచ సాహిత్యంలో “నభూతో నభవిష్యతి”.

ప్రశ్న 4.
రామాయణములోని స్నేహాల గురించి రాయండి.
జవాబు:
రామాయణంలో రామసుగ్రీవుల స్నేహం, రామవిభీషణుల స్నేహాలు, సుప్రసిద్ధమైనవి. సుగ్రీవుడు రామునితో స్నేహం చేశాడు. సుగ్రీవుడికీ అతని అన్న వాలికీ విరోధం ఉంది. వాలి, కిష్కింధకు రాజు. సుగ్రీవుడు రామునితో స్నేహం చేసి, రామునిచేత తన అన్న వాలిని చంపించి, తాను కిష్కింధకు రాజు అయ్యాడు. రాముడే సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు. రావణుని చంపి, సీతను తిరిగి తెచ్చుకోడానికి సుగ్రీవుడు తన వానర సైన్యంతో రామునికి సాయపడ్డాడు. ఈ విధంగా రామసుగ్రీవుల స్నేహం వల్ల వారిద్దరికీ మేలు జరిగింది.

రామాయణంలో రామవిభీషణుల స్నేహం కూడా ప్రసిద్ధమైనది. విభీషణుడు. లంకా నగరాధిపతి, రావణుడికి తమ్ముడు. రావణుడు సీతను అపహరించి తీసుకురావడం, విభీషణుడికి ఇష్టం లేదు. అందుకే విభీషణుడు తన అన్న రావణుని విడిచి, రాముని స్నేహాన్ని ఆశ్రయించాడు. రాముడు విభీషణుని ఆదరించాడు. రామ విభీషణుల స్నేహం గొప్పది.

విభీషణుని మాట సాయంతో రాముడు రావణుని జయించాడు. విభీషణుని లంకా నగరానికి రాజును చేశాడు. విభీషణుడు సీతను రామునకు అప్పగించాడు. ఈ విధంగా రామవిభీషణులు స్నేహం వల్ల ఒకరికి ఒకరు మేలు చేసుకున్నారు. రామవిభీషణుల స్నేహం వల్ల వారిద్దరికీ మేలు జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 5.
రామాయణంలో సీత – కైకల పాత్రల భేదాలను విశ్లేషించండి.
జవాబు:
సీత, శ్రీరామచంద్రునికి ధర్మపత్ని. ఈమె మహాపతివ్రత. మహా సౌందర్యవతి. ఈమె జనకమహారాజు కుమార్తె. రామునితో పాటు సీత కూడా వనవాసానికి వెళ్ళి ఎన్నో బాధలు పడింది. రావణుడు ఈమెను అపహరించి లంకకు తీసుకువెళ్ళాడు. రాముడు సీతాదేవి జాడను తెలిసికోడానికి హనుమంతుడిని దూతగా పంపాడు. హనుమ సీతను కలిసి, రాముని ఉంగరాన్ని ఆమెకు ఇచ్చాడు. సీత ఇచ్చిన చూడామణిని తెచ్చి రామునకు ఇచ్చాడు.

రాముడు సీత కోసం సముద్రానికి వారధిని కట్టి యుద్ధంలో రావణుని సంహరించి సీతను తీసుకువచ్చాడు. రామాయణంలోని పాత్రలలో రాముని తరువాత సీత పాత్ర ప్రధానమైనది.

కైక దశరథ మహారాజునకు ముద్దుల భార్య. ఈమెకు రాముడంటే మంచి ప్రేమ. మంథర చెప్పిన చెప్పుడు మాటలు విని, కైక తన మనస్సును మార్చుకొని దుష్టురాలయ్యింది. పుత్ర ప్రేమతో భరతుడిని రాజును చేయ్యమనీ, రాముడిని అడవులకు పంపమనీ ఈమె పట్టుపట్టింది. దశరథుడు బ్రతిమాలి చెప్పినా ఈమె వినలేదు. కైక మొండిది.

కైక పట్టుదల వల్లనే దశరథుడు రాముడిని వనవాసానికి పంపవలసి వచ్చింది. రామునిపై బెంగతో దశరథుడు మరణించాడు. రాముని వనవాసానికి, దశరథుని మరణానికి కైక యొక్క మూర్ఖపు పట్టుదలయే కారణము.

‘సీత’ భర్త రామునికి తోడుగా ఉండి అరణ్యానికి వెళ్ళింది. కైక, భర్త దశరథుని మరణానికి కారణం అయ్యింది. సీత మహాపతివ్రత కాగా, కైక గయ్యాళి భార్య. కైక భర్త మాటను లెక్కచేయలేదు. సీత రాముని కోసం, తన ప్రాణాలను కూడా ఇవ్వగల ఉత్తమ సతి.

రామాయణ కావ్యంలో సీత – కైక పాత్రలు రెండూ ప్రధానమైనవే. రామాయణ కథ, ఈ రెండు పాత్రల వల్లనే సాగింది. సీత మహాసాధ్వి. కైక గయ్యాళి గంప.