AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు
AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 10th Lesson గోరంతదీపాలు
10th Class Telugu 10th Lesson గోరంతదీపాలు 2 Marks Important Questions and Answers
ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
గోరంత దీపాలు పాఠం ఎవరు రచించారు? రచయిత గురించి వ్రాయండి.
జవాబు:
గోరంత దీపాలు పాఠం పులికంటి కృష్ణారెడ్డిగారు రచించారు. ఆయన 30.7.1931న చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని ‘జక్కదన్న’ గ్రామంలో జన్మించారు. తండ్రి గోవిందరెడ్డి, తల్లి పాపమ్మ. 18.11.2007లో తిరుపతిలో స్వర్గస్తులయ్యారు.
ఆయన రాయలసీమ కథానికా రచయిత, నటుడు, జానపద కళాకారుడు, కవి, నాటక రచయిత, బుర్రకథా కళాకారుడు. పునర్జన్మ నాటకంలో వృద్ధుని పాత్రను తొలిసారిగా ఆయన ధరించారు.
ప్రశ్న 2.
పులికంటి కృష్ణారెడ్డిగారి సాహిత్యసేవను వివరించండి.
జవాబు:
పులికంటివారు నటనలో అసమాన ప్రతిభ కనబరిచారు. 150 కథలు రచించారు. వాటిలో 14 కథలకు బహుమతులు అందుకొన్నారు. ‘గూడులేని గువ్వలు’ కథ తొలికథగా ఆయన కలం నుండి జాలువారింది.
కుటుంబ సంక్షేమం, వాతావరణ కాలుష్యం, పొదుపు మొదలైన సామాజిక అంశాలపై 100కు పైగా బుర్రకథలు వ్రాసి, ప్రదర్శించారు.
ఆంధ్రప్రభ దినపత్రికలో ‘నాలుగ్గాళ్ళ మండపం’ శీర్షికను 67 వారాలు నిర్వహించారు. దీనిలో గ్రామీణ రైతుల జీవితాన్ని రాయలసీమ మాండలికంలో చిత్రించారు.
ప్రశ్న 3.
పులికంటి వారు అందుకొన్న పురస్కారాలు, చేసిన సత్కారాలు వివరించండి.
జవాబు:
2001లో తెలుగు విశ్వవిద్యాలయం, పులికంటి కృష్ణారెడ్డిగారిని ఘనంగా సత్కరించింది. 2003లో గోపీచంద్ అవార్డు ఆయనను వరించింది.
2005లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి పురస్కారం అందుకొన్నారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు.
2000వ సంవత్సరంలో ‘పులికంటి సాహితీ సంస్కృతి’ని పులికంటి కృష్ణారెడ్డిగారు ప్రారంభించారు. ఈ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో 18 మందిని సన్మానించారు.
ప్రశ్న 4.
‘గోరంత దీపాలు’ కథానిక ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
- అనాథ బాలురు కొడిగట్టిన దీపాలు వంటివారు. కొంచెం సానుభూతితో కొడిని దులిపి నూనెపోసి వత్తి ఎగదోస్తే, ఆ గోరంతదీపం ఎప్పటికో అప్పటికి, గొప్ప వెలుగును ఇస్తుంది.
- ప్రతి వ్యక్తి మానవత్వంతో దిక్కులేని వారికి, తనకు ఉన్నంతలో సాయం చేయాలి.
- దిక్కులేని వాళ్ళను చేరదీసి ఆశ్రయమిస్తే ఆశ్రయం పొందిన వ్యక్తి, జీవితాంతం ఆశ్రయం ఇచ్చిన వారికి కృతజ్ఞతగా ఉంటాడు.
- తమ సహాయంతో అనాథలు అభివృద్ధిలోకి వస్తే, సాయంచేసిన వారి మనస్సు ఆనందంతో నిండిపోతుంది.
- అనాథలకు మన శక్తి కొలదీ చేయూతను అందించాలి.
ప్రశ్న 5.
కుర్రవాడి బ్రతుకు మీద వృద్ధుడు చేసిన ప్రయత్నం ఏమిటి? దాని ఫలితం ఎలా ఉంది?
జవాబు:
ఆ వృద్ధుడు కావాలని ఐదు రూపాయిల కాగితం, రైలులో తన సీటు కింద పడవేశాడు. రైలు తుడిచే పిల్లవాడు నిజాయితీ గల పిల్లవాడు. అందువల్లనే ఆ నోటును తీసి వృద్దుడికి తిరిగి ఇచ్చాడు.
ఆ పిల్లవాడు నిజాయితీ గలవాడనీ, చేరదీసి చదివిస్తే బాగుపడతాడనీ వృద్ధుడు అనుకున్నాడు. అదే మాట ఆ కుర్రాడికి చెప్పాడు. ఆ కుర్రవాడు వృద్ధుడితో వెళ్ళడానికి అంగీకరించాడు. వృద్ధుడు ఆ పిల్లవాడిని తన విద్యానగరం పాఠశాలలో ఉంచి, చదివించి అతడికి ఉద్యోగం వచ్చాక పెళ్ళి కూడా చేశాడు.
ప్రశ్న 6.
కుర్రవాడి బ్రతుకు మీద వృద్ధుడు చేసిన ప్రయత్నం ఫలించిందా? వివరించండి.
జవాబు:
ఒక వృద్ధుడు రైలులో ప్రయాణం చేస్తూ ఉంటే రైలు పెట్టెలు తుడుస్తూ ప్రయాణికులు ఇచ్చే డబ్బులతో పొట్ట పోసుకొనే ఒక కుర్రవాడు ఆయనకు కనిపించాడు. ఆ పిల్లవాడు నిజాయితీ గలవాడు. వృద్ధుడు, ఆ కుర్రవాడు నిజాయితీపరుడని గ్రహించాడు. అతడిని చేరదీసి చదివిస్తే బాగుపడతాడని వృద్ధుడు అనుకున్నాడు. పిల్లవాడు కూడా చదువుకుంటానని చెప్పాడు.
ఆ కుర్రవాడిని ఆ వృద్ధుడు తాను నడిపే విద్యానగరం పాఠశాలలో చేర్చి చదివించాడు. ఆ కుర్రవాడు శ్రద్ధగా చదివాడు. ఉద్యోగం సంపాదించాడు. తరువాత ఆ వృద్ధుడు ఆ కుర్రవాడికి పెళ్ళి చేశాడు. ఈ విధంగా వృద్దుడి ప్రయత్నం చక్కగా ఫలించింది.
ప్రశ్న 7.
‘చదువుకొనే వయసులో సంపాదనపైకి దృష్టి పోకూడదు’ ఈ వాక్యంపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
చదువుకొనే రోజులలో పిల్లల దృష్టి పూర్తిగా వారి చదువుల పైనే ఉండాలి. కాని కొందరు పిల్లలు తీరిక సమయాల్లో ఏదో విధంగా డబ్బులు సంపాదిస్తూ ఖర్చు పెట్టుకుంటారు. కొందరు పిల్లలకు ఏదోరకంగా సంపాదింపవలసిన అవసరాలు కూడా ఉంటాయి.
పేపర్లు వేయడం, పెట్రోలు బంకుల్లో పనిచేయడం, తండ్రి చేసే వృత్తుల పనుల్లో సాయం చెయ్యడం ద్వారా వారు సంపాదిస్తారు. అందువల్ల వారి దృష్టి చదువులపై పూర్తిగా పెట్టలేరు. సంపాదించే డబ్బుతో విలాసాలకు వారు అలవాటు పడతారు. సినిమాలకు పోతారు. సిగరెట్లు వగైరాలకు అలవాటు పడతారు.
కాబట్టి చదువుకొనే వయసులో సంపాదనపై దృష్టి పెట్టరాదు. దానివల్ల వారి చదువులు సక్రమంగా సాగవు.
ప్రశ్న 8.
‘ఏకాంతంలో పుస్తకాలను మించిన నేస్తం లేదు’ దీనిపై మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించండి.
జవాబు:
ఒంటరిగా ఉన్నప్పుడు మనతో మాట్లాడే స్నేహితులు ఎవరూ ఉండరు. అలాంటప్పుడు ఏదో మంచి పుస్తకాన్ని తీసుకొని చదువుకుంటే, హాయిగా కాలం గడుస్తుంది. ప్రక్కన కబుర్లు చెప్పేవారు లేరనే బెంగ కూడా ఉండదు.
పుస్తకాలు స్నేహితుడిలా ఆనందాన్ని ఇస్తాయి. మంచి పుస్తకం చదువుతూ ఉంటే, కాలమే తెలియదు. కాబట్టి పుస్తకం ఒంటరిగా ఉన్నప్పుడు మన నేస్తం అనే మాటతో నేను ఏకీభవిస్తాను.
10th Class Telugu 10th Lesson గోరంతదీపాలు 4 Marks Important Questions and Answers
ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘ఒక వ్యక్తి ఆలోచన ఆచరణగా మారితే ఏర్పడిన మహాసంస్థ ఎన్నో కొడిగట్టిన దీపాలకు ఆశ్రయమిచ్చింది.’ గోరంత దీపాలు పాఠం ఆధారంగా వివరించండి. (June 2017)
జవాబు:
అనాథ బాలురు గోరంత దీపాల వంటివాళ్ళు. ఆ దీపాలను నిలుపుతున్న వ్యక్తి ఒక వృద్ధుడు.
వృద్ధుడు దీనజనబాంధవుడు. విద్యానగరం అనే విద్యాలయం కట్టించాడు. అక్కడ బాలబాలికలకు వసతి గృహాలు, అతిథులకు గదులు, వయస్సులో పెద్దవాళ్ళకు వసతులు, గ్రంథాలయం, ప్రార్థనాలయం ఏర్పాటుచేశాడు.
వృద్ధుడు విద్యానగరంలో మకుటం లేని మహారాజు, దిక్కులేని వారినందరినీ అక్కడకు చేర్చి, వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించేవాడు. అక్కడ వందలాది మంది ఉపాధ్యాయుల్ని నియమించి, వేలాదిమంది పిల్లలకు చదువు చెప్పించేవాడు. దానికయిన ఖర్చు అంతా ఆయనే భరించేవాడు.
ఎవరయినా ఈ వృద్ధుణ్ణి స్వార్థం కల మనిషి అని నిందించినా, ఆయన తన ధ్యేయాన్ని విడిచి పెట్టేవాడు కాదు. రైల్లో అడుక్కుతింటున్న పిల్లవాణ్ణి తనతో తీసుకువచ్చి చదువు చెప్పించి పెళ్ళిచేశాడు. ఆ పిల్లవాడు ప్రతి పుట్టినరోజుకీ వచ్చి ఈ వృద్ధుడిని కలిసి, కృతజ్ఞత వెల్లడించేవాడు. పిల్లవాడికి తన యందుకల ప్రేమకు వృద్ధుడి మనస్సు పొంగిపోయేది. ఆ వృద్ధుని పిలుపులో ఆప్యాయత ఉండేది.
విద్యానగరంలో చదువుకొంటున్న పిల్లల్ని చూసి వృద్ధుడు ఆనందానుభూతిలో తేలిపోయేవాడు. వృద్ధుని మాటలు అక్షరసత్యాలు. ఈ విధంగా వృద్ధుడి ఆలోచనతో ఒక మహాసంస్థ వెలిసింది. ఎన్నో కొడిగట్టిన దీపాలకు అతడు ఆశ్రయం ఇచ్చాడు. ఆ వృద్ధుడు వెలిగించిన ఎన్నో గోరంత దీపాలు, కొండంత వెలుగునిచ్చాయి.
ప్రశ్న 2.
చిన్నతనంలో చదువుకొంటే పెద్దవయసులో బాగా సంపాదించవచ్చు. ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తారా? చర్చించండి.
జవాబు:
చిన్న వయస్సులో చదువుకుంటే పెద్ద వయస్సులో సంపాదించుకోవచ్చు అని వృద్ధుడు రైలు తుడుస్తున్న పిల్లవాడితో అన్నాడు.
రైలు తుడుస్తున్న పిల్లవాడు చిన్న పిల్లవాడు. కాబట్టి రైలు తుడుస్తూ ప్రయాణీకులు ఇచ్చిన డబ్బులతో బతికేసేవాడు. వృద్ధుడు చెప్పినట్లు ఆ పిల్లవాడు పెద్దవాడు అయితే, సిగ్గు విడిచి అలా తుడవలేడు. డబ్బు సంపాదించలేడు. అదీగాక అందరూ అతణ్ణి తప్పుపడతారు.
కాబట్టి వృద్ధుడు చెప్పినట్లు అతడు అతనితో వెళ్ళి చదువుకున్నాడు. శ్రద్ధగా చదివాడు. ఉద్యోగం సంపాదించి పెద్ద అయ్యాక హాయిగా పెళ్ళి చేసుకొని సుఖంగా బ్రతికాడు.
కాబట్టి వృద్ధుడు పిల్లవాడితో అన్నమాట సరయిన మాట. పిల్లలందరూ బాల్యంలో చక్కగా చదువుకోవాలి. అప్పుడు వారు పెద్దతనంలో చక్కగా సంపాదించుకోవచ్చు.
ప్రశ్న 3.
క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
1. వృద్ధుడు :
అనాథలను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పిస్తాడు. సమాజంలోని పేదలను, అనాథలను ఆదుకొనే స్వభావం కలవాడు. సమాజం పట్ల బాధ్యత గలవాడు. వయోవృద్ధులకు కూడా సదుపాయం కల్పించాడు. సమాజం పట్టించుకోని వారికి పెద్ద దిక్కు అయ్యాడు. తన వద్ద పెరిగిన అనాథలు ఉన్నత స్థితిలో ఉంటే చూసి, ఆనందించే స్వభావం కలవాడు. తనను విమర్శించే వారిని కూడా పట్టించుకోకుండా సేవ చేసే మహామనీషి.
2. కుర్రవాడు :
అనాథ. రైలు పెట్టెలు తుడిచేవాడు. వృద్ధుని దయతో విద్యానగరం వచ్చాడు. చక్కగా చదువుకొన్నాడు. మంచి ఉద్యోగం సంపాదించుకొన్నాడు. వృద్ధుని పట్ల అమితమైన కృతజ్ఞతను ప్రదర్శించాడు. తన కన్నీటితో వృద్ధుని పాదాలకు అభిషేకం చేశాడు. మేలు చేసిన వారిని భగవంతునితో సమానంగా పూజించే అత్యుత్తమ సంస్కారం కలవాడు. వినయం కలవాడు. ‘మంచివాడు’ అనడానికి సరిపోయే అన్ని లక్షణాలు ఉన్నవాడు.
3. రచయిత :
వృద్ధుని స్నేహితుడు. వృద్ధుని మంచితనాన్ని, గొప్పతనాన్ని ఆకళింపు చేసుకొన్న వ్యక్తి. పరిశీలనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా సమాజాన్ని పరిశీలిస్తాడు. వృద్ధునిలోని ఆలోచనా ధోరణిని అభినందించిన సంస్కారి. గోరంతదీపాలు ఇచ్చే కొండంత వెలుగులో తన పాత్ర కూడా గోరంత ఉండాలని తపించే స్వభావం కలవాడు. ఓర్పు, నేర్పు కలవాడు.
ప్రశ్న 4.
గోరంత దీపాలు కథలో వృద్ధుని గూర్చి వివరించండి.
(లేదా)
“గోరంత దీపాలు” కథానికలో వృద్ధుడు చేసిన సమాజసేవను వివరిస్తూ అతని గొప్పతనాన్ని తెలియజేయండి. (March 2019)
జవాబు:
గోరంత దీపాలు కథలో వృద్ధుడు దీనజన బాంధవుడు. ఆయన విద్యానగరం అనే విద్యాలయం కట్టించాడు. అక్కడ బాలబాలికలకు వసతి గృహాలు, అతిథులకు గదులు, వయస్సులో పెద్దవాళ్ళకు వసతులు, గ్రంథాలయం, ప్రార్థనాలయం కట్టించాడు.
దిక్కులేని పిల్లలను తన పాఠశాలలో చేర్చి, వారికి భోజనం పెట్టి చదువు చెప్పించేవాడు. అక్కడ వందల కొద్దీ ఉపాధ్యాయులను నియమించి, వేలాది పిల్లలకు చదువు చెప్పించేవాడు. దానికయిన మొత్తం ఖర్చును తానే భరించేవాడు.
ఇతరులు ఆయన్ని విమర్శించినా, ఆయన పట్టించుకొనేవాడు కాదు. రైలులో అడుక్కుతింటున్న పిల్లవాడిని తీసుకువచ్చి ఆయన వాడికి చదువు చెప్పించి పెళ్ళి చేశాడు. ఆ విద్యానగరంలో చదువుకొనే పిల్లల్ని చూసి ఆ వృద్ధుడు మురిసిపోయేవాడు. ఆయన కొడిగట్టిన దీపాలవంటివారికి ఆశ్రయం ఇచ్చి వారి జీవితాలను కొండంత దీపాలుగా వెలిగించాడు. ఆయన మహానుభావుడు, ఉత్తముడు.
ప్రశ్న 5.
వృద్ధునికి ప్రయోజకుడైన యువకుడికి గల అనుబంధాన్ని వివరించండి.
జవాబు:
ఒకసారి వృద్ధుడు రైలులో ప్రయాణం చేస్తున్నాడు. దానిలో ఒక పిల్లవాడు రైలు పెట్టి తుడుస్తూ అడుక్కుంటున్నాడు. వృద్ధుడికి ఆ పిల్లవాడి మనస్తత్వాన్ని పరీక్షించాలని బుద్ధిపుట్టింది. ఐదు రూపాయల నోటు కింద జారవిడిచాడు. ఆ పిల్లవాడు నోటును తీసి వృద్దుడికి అప్పగించాడు. ఆ పిల్లవాడిని చదివించి వృద్ధిలోకి తేవాలని వృద్ధుడు అనుకున్నాడు. పిల్లవాడు సరే అని, వృద్ధుని వెంట వెళ్ళి విద్యాలయంలో శ్రద్ధగా చదివి ఉద్యోగం కూడా సంపాదించాడు. వృద్ధుడు ఆ యువకుడికి పెళ్ళి కూడా చేశాడు.
ఆ యువకుడికి ఆ వృద్ధునిపై ఎంతో కృతజ్ఞత ఉంది. వృద్ధుడు ఆ యువకుడిని ప్రేమగా చూసేవాడు. ఆ యువకుడికి పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు. ఆ యువకుడు విద్యాలయంలో చేరిన రోజునే, తన పుట్టినరోజుగా ఆ యువకుడు భావించేవాడు.
యువకుడు ఎక్కడ ఉన్నా, వృద్ధుడు ఎక్కడ ఉన్నా యువకుడు తన పుట్టినరోజున తప్పకుండా వచ్చి ఆ వృద్ధుడి కాళ్ళు పట్టుకొని ఆ వృద్ధుడి పాదాలను, తన ఆనందబాష్పాలతో ముంచెత్తేవాడు. ఆ వృద్ధుడు ఆ యువకుడిని ఆశీర్వదించి, తన ఆనందబాష్పాలతో యువకుడి తలను తడిపివేసేవాడు. వారి మధ్యన ఉన్న అనుబంధం అనిర్వచనీయం.
10th Class Telugu 10th Lesson గోరంతదీపాలు Important Questions and Answers
ప్రశ్న 1.
‘అనాథ బాలలకు చేయూతనందిస్తే ఎంతటి స్థాయికైనా ఎదుగగలరు’ – ఈ అంశంపై వ్యాసం వ్రాయండి.
జవాబు:
‘అనాథ బాలలు – చేయూత’
తల్లిదండ్రులు లేని పిల్లలను అనాథ బాలలు అంటారు. అలాగే తల్లిదండ్రులకు డబ్బులేక, చదువు సంధ్యలు చదువుకోకుండా వీథి బాలలుగా తిరిగే దిక్కులేని పిల్లలు ఉంటారు. కొందరు పిల్లలు తల్లిదండ్రులపై కోపగించుకొని పారిపోయి రోడ్లపై బిచ్చం ఎత్తుకుంటూ, రైళ్ళల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అనాథలుగా తిరుగుతారు. ఇలాంటి అనాథలకు రక్షణ కల్పించి వారు చదువుకోడానికి ఆశ్రయం కల్పిస్తే వారు కూడా మంచిగా పెరిగి అభివృద్ధిలోకి వస్తారు. ఆ గోరంత దీపాలను కొండంత దీపాలుగా చేయడానికి సంఘంలోని సంపన్నులూ, దాతలూ, అనాథ శరణాలయాలవారూ, ప్రభుత్వమూ సహాయం చేయాలి.
ఈనాడు దేశంలో ఎన్నో అనాథ శరణాలయాలు ఉన్నాయి. వారు ప్రజల నుండి చందాలు వసూలు చేసి అనాథ బాలబాలికలకు ఆశ్రయం కల్పించి, వారిని పెద్దవారిని చేసి వారికి పెళ్ళిళ్ళు చేయిస్తున్నారు. ఇటువంటి అనాథ శరణాలయాలకు డబ్బు కలవారు విరివిగా విరాళాలు ఇవ్వాలి. అనాథ బాలబాలికలకు తోడుగా నిలవాలి.
డబ్బు కలవారు, దాతలు, ఉదారహృదయం కలవారు తమ సంపాదనలో కొంత భాగం అనాథలకు కేటాయించాలి. అలా ఇచ్చి అనాథలను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించాలి. అలా చేస్తే వారు పెద్దవారై ఎంతో ఉన్నత స్థానాన్ని తప్పక పొందుతారు. అటువంటి అనాథలు పెద్దవారై డాక్టర్లుగా, ప్రజాపరిపాలకులుగా, ఇంజనీర్లుగా తయారవుతారు. ప్రభుత్వం కూడా అనాథ శరణాలయాలను స్థాపించి, అనాథ బాలబాలికలకు చేయూతను అందివ్వాలి. అప్పుడే ఆ గోరంత దీపాలు పెద్దవై, కొండంత వెలుగును ఇస్తాయి. అనాథ బాలబాలికలకు సాయంచేస్తే దేవుడు కూడా సంతోషించి వారికి మోక్షాన్ని, సంపదలను, సౌఖ్యాన్ని ఇస్తాడు.
ప్రశ్న 2.
అనాథలను ఆదుకొన్న మీ మామయ్యను అభినందిస్తూ లేఖ వ్రాయండి.
జవాబు:
నెల్లూరు, పూజ్యులైన చిన్న మామయ్యకు నమస్కరించి, ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను. మొన్న తుపాను మీ ప్రాంతంలో చాలా భీభత్సం సృష్టించిందని టీ.వీ. లో చూశాను. పేపర్లో చదివాను. చాలా కంగారు పడ్డాము. మా అమ్మా నాన్నా మిమ్మల్ని చూసి వచ్చేక నాకొక సంగతి చెప్పారు. ఒక కుటుంబంలో తుపానుకు ఇల్లు కూలి అందరూ మరణించారనీ, ముగ్గురు చిన్నపిల్లలు మిగిలారనీ, ఆ పిల్లలను మీరు పెంచుతున్నారనీ మా అమ్మ చెప్పింది. అంతేకాకుండా చాలామందికి ఆహారం, బట్టలు అందించారని కూడా చెప్పారు. మీ పరోపకార బుద్ధికి నాకు చాలా ఆనందం కల్గింది. నా స్నేహితులకు మీ మంచి మనసు గురించి చెప్పాను. వాళ్ళంతా చాలా ఆనందించారు. మీ మేనకోడలిని అయినందుకు చాలా గర్వపడ్డాను. కేవలం మాటలు కాకుండా, చేతలతో మంచి చేసే మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, అభినందిస్తున్నాను. అత్తయ్యకు నా నమస్కారాలు. ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 3.
అనాథలను ఆదుకోవలసిన అవసరం గురించి వివరిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
అమృత హృదయులారా ! ఆదుకోండి
అనాథలను ఆదుకోవడం మన కర్తవ్యం. మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. తోటి మనిషిని ఆదరించండి. పట్టెడన్నం పెట్టండి. సమాజానికి ఉపయోగపడే మాణిక్యాలను మట్టిలో కలిసిపోనీయకండి. ఇది మన బాధ్యత. వాళ్లు కూడా మన సోదరులే.
భగవంతుడికి ‘దరిద్ర దామోదరుడ’ని పేరు. అనాథలలో దైవాన్ని సందర్శించండి. ఆదరించండి. తీర్చిదిద్దండి. భరతమాత సేవలో పునీతులవ్వండి.
ఇట్లు,
అనాథల పెద్ద అన్న.
10th Class Telugu 10th Lesson గోరంతదీపాలు 1 Mark Bits
1. వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నం చేయాలి – గీత గీసిన పదాలకు నానార్థమును గుర్తించుము. (March 2017)
A) కృషీవలుడు
B) కృషి
C) కర్షకుడు
D) కారణము
జవాబు:
B) కృషి
2. ప్రజలను పాలించే ప్రభువు దేవతలకు తోడు ఇంద్రుడులా ఉండాలి – గీత గీసిన పదానికి నానార్థమును గుర్తించుము. (March 2017)
A) భర్త
B) రాజు
C) శని
D) ధర్మము
జవాబు:
B) రాజు
3. ఏ వయస్సులో చేయవలసిన దానిని, ఆ సమయంలో చేయకున్నచో జీవితము నరకంతో సమానం కాగలదు – గీత గీసిన పదాలకు సంబంధించిన నానార్థ పదాన్ని గుర్తించుము. (March 2018)
A) ప్రాయము
B) కాయము
C) కార్యము
D) ఆదాయము
జవాబు:
A) ప్రాయము
4. విద్యార్థులు ఎల్లవేళలా చదువుపై దృష్టిని తిరముగా ఉంచుకోవాలి – గీత గీసిన పదానికి ప్రకృతి రూపాన్ని గుర్తించండి. (March 2018)
A) తీరము
B) స్థిరము
C) దూరము
D) భారము
జవాబు:
B) స్థిరము
5. రైతులు కష్టపడగలరు. (ఏ వాక్యమో గుర్తించండి ?) (June 2017)
A) సంభావనార్ధకం
B) చేదర్థకం
C) ప్రశ్నార్ధకం
D) సామర్ధ్యార్ధకం
జవాబు:
D) సామర్ధ్యార్ధకం
6. వైద్యుడు ప్రథమ చికిత్స చేసి, మందులు ఇస్తాడు. (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) క్వార్థకము
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) అష్యర్ధకం
జవాబు:
A) క్వార్థకము
7. గోరంత దీపాలు కొండంత వెలుగు నిస్తాయి – దీనికి వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి. (March 2018)
A) గోరంత దీపాలు కొండంత వెలుగు నివ్వవు
B) గోరంత దీపాలు కొండంత వెలుగు నివ్వవచ్చు
C) గోరంత దీపాలు కొండంత వెలుగు ఇవ్వగలవు.
D) గోరంత దీపాలు కొండంత వెలుగు ఇవ్వకపోవచ్చు
జవాబు:
A) గోరంత దీపాలు కొండంత వెలుగు నివ్వవు
8. వృద్ధుని చేత బాలుడు రక్షింపబడెను – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.
A) సామాన్య
B) సంయుక్త
C) కర్తరి
D) కర్మణి
జవాబు:
D) కర్మణి
9. వఱదైన చేనుదున్న వద్దు. (ఇది ఏ వాక్యమో గుర్తించండి) (S.A. I – 2018-19)
A) నిషేధార్థక వాక్యం
B) ప్రార్థనార్థక వాక్యం
C) విధ్యర్ధకం
D) సామర్థ్యార్థక వాక్యం
జవాబు:
A) నిషేధార్థక వాక్యం
10. క్రింది వానిలో విధ్యర్థక వాక్యం గుర్తించండి. (S.A. I – 2018-19)
A) చదవ గలరు
B) చదవండి
C) దయచేసి చదవండి
D) చదువుతున్నారు
జవాబు:
B) చదవండి