AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 2 స్వభాష Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Telugu Solutions 2nd Lesson స్వభాష
9th Class Telugu 2nd Lesson స్వభాష Textbook Questions and Answers
ఆలోచించండి-చెప్పండి
ప్రశ్నలు జవాబులు
ప్రశ్న 1.
జంఘాలశాస్త్రి దేన్ని గురించి ఉపన్యసించి ఉంటాడని మీరనుకుంటున్నారు?
జవాబు:
తెలుగుభాష గొప్పతనాన్ని గురించి ఉపన్యసించి ఉంటాడని అనుకుంటున్నాను.
ప్రశ్న 2.
ఎదుటి వ్యక్తి ప్రశంసిస్తున్నా, జంఘాలశాస్త్రి నిర్ఘాంతపోవడానికి కారణమేమై ఉంటుంది?
జవాబు:
తన ఉపన్యాస సారాంశాన్ని ఏ మాత్రం గ్రహించకుండా తనని ఆంగ్ల భాషలో పొగిడినందుకు.
ప్రశ్న 3.
జంఘాలశాస్త్రి అంటే ఎవరో మీకు తెలుసా?
జవాబు:
పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు రచించిన ‘సాక్షి వ్యాస సంకలనం’ లోని ఒక పాత్ర.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
అ) కింది వాటి గురించి సొంతమాటల్లో చెప్పండి.
ప్రశ్న 1.
మాతృభాషలోనే మాట్లాడితే కలిగే ప్రయోజనాలేమిటి?
జవాబు:
మాతృభాషలోనే మాట్లాడటం వలన అనేక ప్రయోజనాలున్నాయి. మాతృభాషలో మన భావాలను సూటిగా, స్పష్టంగా చెప్పగలము. పరభాషలను ఎంతోకాలంగా అభ్యసించినప్పటికి అటువంటి సౌలభ్యాన్ని పొందలేము. పరభాషలలో ఉపన్యసించగల శక్తి గలవారైనా, గ్రంథాలను రచించగల సమర్థులైనా, ఆయా భాషలు మాతృభాషలుగా గలవారి ముందు దిగదుడుపే గదా ! ఆంగ్ల సాహిత్యంలో సుప్రసిద్ధుడైన ‘మిల్టన్’ మహాశయుడు లాటిన్ భాషలో పద్యాలను రాశాడు. లాటిన్ భాష మాతృభాషగాగల కవులలో తక్కువ స్థాయిగల కవులు రాసిన పద్యాలకంటే ‘మిల్టన్’ మహాకవి పద్యాలు తక్కువ స్థాయికి చెందినవని పరిశోధకులు చెబుతుంటే ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది ?
పరభాషాపదాలకర్థం తెలుసుకున్నంతమాత్రాన అందు పండితులమయ్యామనుకోకూడదు. ఆయా భాషలలోని జీవాన్ని, తత్త్వాన్ని, కళను కనిపెట్టగలగాలి. అది ఆయా భాషలు మాతృభాషలుగా గలవారికే సాధ్యము. ఇతరులకది ఎన్ని సంవత్సరాలు అభ్యసించినా అసాధ్యమే. మాతృభాషలోనే మాట్లాడటం వలన ఆ భాషలోని జాతీయాలు, నుడికారాలు, పలుకుబళ్ళు, సామెతలు, జీవాన్ని పొంది భాషకు జీవాన్ని, బలాన్ని కలిగిస్తాయి. మనోభావాలను ఆవిష్కరించడానికి భాషకై వెదుక్కోవాల్సిన పని ఉండదు. ఎదుటివారికి కూడా మనం చెప్పదలచిన విషయాన్ని సందేహరహితంగా, నిర్దోషంగా సవివరంగా చెప్పగలము. ఈ సౌలభ్యం ఒక్క మాతృభాషవల్లే సాధ్యం.
ప్రశ్న 2.
ఈ కింది అంశం గురించి విభేదిస్తూ లేదా సమర్థిస్తూ మాట్లాడండి. “మాతృభాషలో విద్య”
జవాబు:
“మాతృభాషలో విద్య” విభేదించడం లేక ఖండన :
నేటి సమాజం శరవేగంతో ప్రయాణిస్తోంది. ప్రపంచం మొత్తం “గ్లోబలైజేషన్” పుణ్యమా అని కుగ్రామమైపోయింది. ఇటువంటి పరిస్థితులలో విద్యార్థులు ఎన్ని ఎక్కువ భాషలు అధ్యయనం చేస్తే అంత త్వరగా పోటీ ప్రపంచంలోకి దూసుకుపోవచ్చు. చిన్నప్పటినుండే ఆంగ్లభాషా మాధ్యమంలో విద్యార్థులు విద్యను అభ్యసించినట్లైతే ఉన్నత విద్యలకు వెళ్లేటప్పటికి ఆ భాషపై పట్టు, సాధికారతను సాధించవచ్చు. నేటి ఆధునిక సౌకర్యాలన్నింటిని ఉపయోగించుకోవాలంటే ఆంగ్ల భాషే శరణ్యం. ఉదాహరణకు కంప్యూటర్ ప్రవేశించని రంగమంటూ నేడు లేదు. దాన్ని సమర్థతతో నిర్వహించాలంటే ఆంగ్ల భాషాజ్ఞానమెంతో ఆవశ్యకం.
కాదు, కూడదని మాతృభాషలో విద్యనభ్యసిస్తే దాని ప్రభావం నుండి బయటపడటానికి చాలాకాలం పడుతుంది. ఆంగ్లం మొదలైన భాషలను అభ్యసించేటప్పుడు ఇది ఇబ్బందికరమవుతుంది. వేరే భాషలలో మాట్లాడాల్సివచ్చినప్పుడు మనస్సులో మాతృభాషలో ఆలోచించుకొని దాన్ని ఆయా భాషలలోనికి అనువదించినప్పుడు ఆ సంభాషణ చాలా కృతకం గాను, అసహజంగాను, హాస్యాస్పదంగాను తయారవుతుంది. ఇదే ఆయా భాషలలోనే ఆలోచించినట్లైతే సంభాషణ నిర్దోషంగాను, సహజ సుందరంగాను, ఆకర్షణీయంగాను ఉంటుంది. ఇది సాధించాలంటే చిన్నప్పటి నుండి ఆయా భాషలను శ్రద్ధతో అభ్యసించాల్సి ఉంటుంది. దీనిని గుర్తించే మన ప్రభుత్వం ప్రాథమిక విద్య నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మండల ప్రాథమిక పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. దీనివలన ప్రైవేటు పాఠశాలలలో ఖర్చుల కోర్చి చదవలేని పేద విద్యార్థులు సైతం లబ్ధి పొందవచ్చు.
శాస్త్ర సంబంధిత సాంకేతిక పదాలను, అంశాలను, మాతృభాషలోనికి అనువదించుట సాధ్యం కాదు. ఒక్కోసారి అలా అనువదించడం వలన విపరీతార్థాలు ఏర్పడే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి మూలభాషలో తగినంత పరిజ్ఞానాన్ని సంపాదించడం ద్వారా ఆయాశాస్త్రాలను చక్కగా అధ్యయనం చేయవచ్చు. తద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందవచ్చు. ఇవన్నీ సాధించబడాలంటే “మాతృభాషలో విద్య” బోధించబడకూడదు.
సమర్దన:
మాతృభాషలో విద్యాబోధన ద్వారా అనేక లాభాలున్నాయి. చిన్న వయస్సులో విద్యార్థుల బుద్ధివికాసం తక్కువగా ఉంటుంది. ఇటువంటి స్థితిలో వారు మాతృభాషలో బోధించిన అంశాలను సులభంగా గ్రహించగలుగుతారు. కంఠస్థం చేయాల్సిన పనిలేకుండా ఆయా అంశాలను అవగతం చేసుకోవడం ద్వారా ఎక్కువ కాలం గుర్తుంచుకోగలుగుతారు. అన్యభాషలను సైతం ప్రాథమిక దశలో మాతృ భాష ద్వారా బోధించడం వలన ఆయా భాషలపై విద్యార్థులు ఒక అవగాహనకు రాగలుగుతారు. వాటి పై భయాన్ని వీడి అభ్యసించడానికి సంసిద్ధులవుతారు.
మాతృభాషలో విద్యను బోధించడం వలన విద్యార్థుల మనోవికాసం ఎక్కువగా ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు. కఠిన శాస్త్రాలను అభ్యసించేటప్పుడు భాష కూడా కొత్తదైనట్లైతే కొద్ది సేపటికే విషయం అర్థంకాక, విసుగు కలిగి, ఆయా శాస్త్రాలపై శాశ్వతంగా అనిష్టత పెరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మాతృభాషలో బోధన ద్వారా ఈ ఇబ్బందిని దాటవచ్చు. ఇతర భాషలలోని ఆయా అంశాలను, సాంకేతికపదాలను, మాతృభాషలోకి ఉన్నవి ఉన్నట్లుగా తీసుకొని రాలేకపోవచ్చు. ఇటువంటివి చాలా కొద్దివి మాత్రమే కష్టంగా అన్పిస్తాయి. అంతమాత్రాన మొత్తం ఆయా భాషలలోనే బోధించాలనుకోవటం ఎంత బుద్ధి తక్కువ పనో విజ్ఞులు గ్రహింతురు గాక !
మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఒడిశా మొదలైన రాష్ట్రాలు మాతృభాష గొప్పతనాన్ని గుర్తించి దాన్ని కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మనం “పొరుగింటి పుల్లకూర రుచి” అన్న చందంగా మన మాతృభాష తప్ప తక్కినవన్నింటిని తలపై పెట్టుకొంటున్నాం. త్వరలో అంతరించే భాషల్లో మన తెలుగు కూడా ఉందని తెలుసుకొని ఇప్పుడు బాధపడుతున్నాం. “చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదు” కదా !
ఇక ‘మాతృభాషలో అన్నింటినీ బోధించడం సాధ్యం కాదు’ అనే మాట ఒట్టిమాటే. మాతృభాషాభిమానం లేనివారు సాకుగా చెప్పేమాటిది. తమిళనాడు రాష్ట్రంలో సాంకేతికశాస్త్ర విద్య (ఇంజనీరింగ్), వైద్య విద్య (మెడిసన్) లు సైతం మాతృభాషలో బోధించబడుతున్నాయి. న్యాయాలయాలలో వాద ప్రతివాదాలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఉత్తర ప్రత్యుత్తరాలు, అనుమతులు మొదలైనవన్నీ మాతృభాషలోనే కొనసాగుతున్నాయి. వీటి అన్నింటికీ కారణం మాతృభాషలో విద్యాబోధనే. కాబట్టి మనం కూడ బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మాతృభాష గొప్పదనాన్ని గుర్తించి, దానిలో విద్యాబోధన ద్వారా భాషను బతికించుకొందాం. విజ్ఞానాన్ని అందిపుచ్చుకుందాం.
ఆ) పాఠం చదవండి. కింది అంశాలను గుర్తించండి.
ప్రశ్న 1.
ఆంగ్లభాష గురించి ప్రస్తావించిన అంశాలు.
జవాబు:
పరాయి భాష ఎప్పటికీ పరాయి భాషే. అందులో ఎంతోకాలం కష్టపడి ఎంత జ్ఞానమార్జించినా ఆ భాష మాతృభాషగా గలవారి ముందు ఈ పాండిత్యం దిగదుడుపే. ఆంగ్లభాషలో ఎన్ని గ్రంథాలు రాసినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా అవి స్వతంత్రత లేనివే. ఆ భాషలో పూర్వులు చెప్పినవే. వాటిలో సహజత లేదు. ఆంగ్లేయ భాషలో వ్యాసరచనలో ఉత్తమోత్తముడని అనిపించుకున్న “మిల్టన్” మహాశయుడు లాటిన్ భాషలో కొన్ని పద్యాలను రచించాడు. లాటిన్ మాతృభాషగాగల పండితులు వాటిని చదివి, లాటిన్ భాషలో ఇంతకన్నా అథమమైన పద్యాలు లేనేలేవని నిగ్గుతేల్చారు.
“కన్నింగ్ హామ్స్ ఎవిడెన్సు యాక్ట్”ను చదువుట వలన న్యాయవాదిగా మన కడుపును నింపుకోగలం కాని కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం చదవడం వలన మన మనస్సు సంతోషంతో నిండుతుంది.
ప్రశ్న 2.
పాఠంలోని ఆంగ్లపదాలు.
జవాబు:
- ఎం.ఏ.,బి.యల్. పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు.
- విల్ ఎనీ జెంటిల్మన్ కం ఫార్వర్డు టు స్పీక్
- బర్కు, సిసిరో, డెమా సైనీసు, గ్లాడ్ట్స్
- ఇంగ్లీషు మీడియం
- ఒరిజినాలిటీ
- మిల్టన్
- లాటిన్
- ప్యారడైజు లాస్ట్
- కాలేజీ
- వర్నాక్యులర్ సూపరింటెండెంట్
- అయాంబికుమీటరు
- ది వెల్ నోన్ తెలుగు స్కాలర్
- బ్రౌను
- ఇన్ మెమోరియం
- మ్యూజిక్
- క్రిమినల్ ప్రొసీజర్ కోడ్
- ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ
- కన్నింగ్ హామ్స్ ఎవిడెన్స్
- జస్టిస్ హాలోవే
- సివిల్ ప్రొసీజర్ కోడ్
- ఇంగ్లీషు
- పార్టీ
- బాయ్ రూమ్, పాట్, రైస్, కెన్ డ్లీ గెటిట్ హియర్
- థ్యాంక్యూ
- ఇన్ ఆంటిసిపేషన్
- డియర్ ఫ్రెండ్
- యువర్సు ట్రూలీ
ప్రశ్న 3.
జంఘాలశాస్త్రి సందేశ వాక్యాలు.
జవాబు:
ఆంధ్రదేశంలో ఆంధ్రులైన తల్లిదండ్రులకు పుట్టి ఆంధ్రభాష రాదని చెప్పడం ఎంతో హస్యాస్పదం. మ్యావుమని కూయ లేని పిల్లి, కిచకిచలాడలేని కోతి ఎక్కడా ఉండవు. పుట్టగానే క్యారుమనలేని బిడ్డ చచ్చినదనుటకు సందేహించాలా? ఆంధ్రదేశంలో పుట్టి తక్కువలో తక్కువగా ఆరు సంవత్సరాల వరకైనా ఆంధ్రంలో మాట్లాడి, ఆంగ్లేయ భాషను అభ్యసించినంత మాత్రాన తెలుగు రాదనుట ఎంత ఆశ్చర్యకరం? ఆంగ్లంలో ఎన్ని గ్రంథాలు రాసినా, ఎన్ని ఉపన్యాసాలిచ్చినా అందు భాషా సౌకర్యం ఏమీ ఉండదు. ఆంగ్లం మాతృభాషగా గలిగిన వ్యక్తికి గల సౌలభ్యం 50 సంవత్సరములు ఆంగ్లభాషను అభ్యసించిన మనకు కలుగదు గదా ! సంపూర్ణ భాషోచ్చారణ పట్టువడదు కదా ! ఇట్లే ఆంగ్లేయుడు 18 సంవత్సములు సంస్కృత భాషను నిరంతర దీక్షతో నేర్చుకున్నా, నేర్చుకున్నంత కాలమూ మనస్సులో మననం చేసినా “హగుం సశ్యుచిషత్” అనే ఉపనిషత్ మంత్రాన్ని సరైన ఉచ్చారణతో పలకలేడు. ఇక మనం 24 సంవత్సరాలు ఆంగ్లభాషను నేర్చుకున్నా “ఇన్ మెమోరియం” లో ఉన్న సంగీతాన్ని కనిపెట్టలేం. పరభాషా పదాలకు అర్థం తెలిసినంత మాత్రాన పరభాషా పాండిత్యం లభించినట్లు కాదు. భాషలోని కళను, ప్రాణాన్ని, ఆత్మను కనిపెట్టగలగాలి. అది మాతృభాషలోనే సాధ్యం.
పొలాలను అమ్మి, అమ్మ మెడలోని పుస్లెపూసలమ్మి, ఇంట్లో సామానులమ్మి, దైన్యంగా ముష్టియెత్తి సంపాదించిన ఆంగ్లేయ భాషా పాండిత్యం వలన మనకేమి ఒరిగింది ? అటు స్వభాషకు దూరమై, పరభాషను సంపూర్ణంగా నేర్చుకోలేక రెండింటికి చెడుతున్నాం. పరభాషకై వెచ్చించిన ధనంలో పడిన శ్రమలో, ఉపయోగించిన కాలంలో, పొందిన బాధలో 14వ వంతైనా అవసరం లేకుండా స్వభాషలో పండితులు కావచ్చు. అక్షరాభ్యాసం నుండే మన స్వభాషను అభ్యసిస్తున్నాం అనుకోనక్కరలేదు. నిజానికి తల్లి కడపులో ఉన్నప్పుడే నేర్చుకోవడం మొదలుపెట్టాం. ఉపాధ్యాయుడైనా అవసరం లేకుండా గ్రంథాలను ఊరకనే చదువుకుంటూ పోయినా కూడా భాషాజ్ఞానాన్ని సంపాదించవచ్చు.
తెలుగుభాష అసలు రానివానితోనే ఆంగ్లభాషలో మాట్లాడండి. మీ స్నేహితులకు ఉత్తరాలు రాసేటప్పుడు ‘డియర్ ఫ్రెండ్’ అని మొదలు పెట్టి ‘యువర్స్ ట్రూలీ’ అని ముగించవద్దు. ‘బ్రహ్మశ్రీ’ అనో ‘మహారాజ శ్రీ’ అనో మొదలుపెట్టి ‘చిత్తగింపవలయును’ అని ముగించండి. ఇక తెలుగుభాష అసలు తెలియని వానికే ఆంగ్లంలో ఉత్తరం రాయండి. కొత్తగా వస్తున్న ఆంధ్ర పుస్తకములను విమర్శన బుద్ధితో చదవండి. తొందరపడి నిందించవద్దు. శనివారం మరియు ఆదివారం రాత్రిపూట తప్పకుండా రెండు గంటలు పురాణాలను చదవండి. తెలుగు భాషలోని వివిధ పత్రికలను చదవండి. ఆంగ్లేయ భాషా గ్రంథాలను చదివేటప్పుడు వాటిల్లో మన భాషకు పనికివచ్చే అంశాలను తదేక దృష్టితో వెతకండి. వాటిని గుర్తుంచుకోండి. ఇలా నియమంగా పట్టుదలతో ఉన్నప్పుడే కేవలం పుట్టుక చేత ఆంధ్రులం అనిగాక, బుద్ధిచేత, స్వభావం చేత, యోగ్యతచేత కూడా ఆంధ్రులమని అనిపించుకొంటాం.
ఇ) పాఠం చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
జంఘాలశాస్తి ఎవరు?
జవాబు:
పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు ‘సాక్షి’ అనే పేరుతో అనేక సంఘ సంస్కరణ వ్యాసాలను రాశారు. అందులో జంఘాలశాస్త్రి, బొర్రయ్య సెట్టి, కాలాచార్యులు, సాక్షి వంటివి కొన్ని పాత్రలు. స్వభాష గొప్పదనాన్ని జంఘాలశాస్త్రి చేత ఉపన్యాసరూపంగా ఈ వ్యాసంలో పేర్కొన్నారు.
ప్రశ్న 2.
జంఘాలశాస్త్రి ఆవేదనతో పలికిన మాటలేవి?
జవాబు:
హరహరా ! మహాదేవ శంభూ ! మహాదేవ శంభూ ! ఎంతమాట? ఎంతమాట? మీరు కూడా విన్నారా? నేనొక్కడినే విన్నానా? ఏదో విని ఇంకేదో అని భ్రమపడ్డానా ? భ్రమపడితే అదృష్టవంతుడినే ! నేనొక్కడనే కాదు ఆంధ్రులందరూ అదృష్టవంతులే ! కాని అంతటి అదృష్టమెక్కడిది? ఆంధ్రదేశంలో, ఆంధ్రులైన తల్లిదండ్రులకు పుట్టి, ఆంధ్ర సంప్రదాయాల్ని నేర్చుకొని, ఆంధ్ర జాతీయతత్త్వ సంపదచే అభివృద్ధి పొంది, ఆంధ్రభాషలో పండితులై, గ్రంథములను రచించి, భాషకు చక్కని అలంకారాలుగా అర్పించిన, సేవించిన తమ శరీరాల్ని, ప్రాణాల్ని, ఆత్మల్ని పవిత్రంగా చేసుకుని ప్రాణాలు విడిచి స్వర్గాన్ని చేరిన ప్రాచీనులైన ఆంధ్రులందరూ అదృష్టవంతులే ! అయ్యయ్యో ! అంత అదృష్టం పట్టునా? పట్టదు. విన్నాను. నిజంగానే విన్నాను. నాది భ్రమ కాదు. నాతోపాటు మీరూ విన్నారు. వినక చెవులేమైనా చిల్లులు పడ్డాయా ? బుద్ధి తక్కువైందా? గుండెలు పగిలేలా విన్నాం. మనస్సు మండేలా విన్నాం. సిగ్గుపోయేలా విన్నాం. ప్రాణాలు పోతుండగా విన్నాం. బతికి ఉంటే ఎన్నటికైనా సుఖాలు పొందవచ్చని కవి చెప్పాడే. జీవించి ఉన్నందుకు మనకిదే ఫలమా? ఇదే సుఖమా?
ఆహాహ ! మన అధ్యక్షులవారు చెప్పినదేమి? వారి శ్రీ సూక్తి ఏమిటి? వారి నోటి నుండి వెలువడ్డ సూత్రం ఏమిటి? చెప్పేదా? తెలుగువాడు చెప్ప గూడనిదే ! చెప్పక తప్పదు గదా ! మన అధ్యక్షుల వారికి తెలుగుభాష రాదట. ఆయన తెలుగులో మాట్లాడలేరట. వారేమీ మూగవారు కారే. నత్తిగా మాట్లాడేవారు కారే. ఆంగ్లేయ భాషలో పండితులే. బర్కు, సిసిరో, డెమోస్టెనీసు, గ్లాడ్స్ వంటి గొప్ప ఉపన్యాసకుల ఉపన్యాస వైభవాన్ని అర్థం చేసుకొనడమే గాక, ఒంటబట్టించు కున్నవారే. బి.ఎల్. పరీక్షలో ఉత్తీర్ణులై నల్లని కోటు ధరించి, న్యాయమూర్తుల ఎదుట కాకిని గట్టిగాను, గద్దను కాకిగాను నిరూపించగల, సమ్మోహనం చేయగల సంభాషణ గలవారే. అటువంటి వారు తెలుగులో మాట్లాడలేకపోవడం ఏమిటి? తెలుగుదేశంలో పుట్టిన పక్షుల సైతం నిరంతరం వినడం వలన తెలుగు మాట్లాడుతుంటే అయ్యయ్యో ! మనుషుడై తెలుగువారికి పుట్టి, తెలుగు ప్రాంతపు నీరు, ఆహారం, గాలి స్వీకరిస్తున్నవాడే. తక్కువలో తక్కువగా ఆరు సంవత్సరాల వరకైనా తెలుగులో మాట్లాడినవాడే. అట్టివాడు ఆంగ్లేయ భాషను నేర్చుకున్నంతమాత్రాన ఇప్పుడు తెలుగులో మాట్లాడలేనంటున్నాడే? ఎంత ఆశ్చర్యం ! నమ్మదగని విషయం. పెద్ద అబద్ధం.
తెలుగులో అతణ్ణి మాట్లాడకుండా చేసింది అశక్తి కాదు. అనిష్టత, అసహ్యం. ఇది రాతితో చెక్కిన మాట. ఎందుకని ఇష్టం లేదు? తెలుగు భాషలాంటి దిక్కుమాలిన భాషలేదని ఇతని నమ్మకం. పద్దతి తెలియనివాడు, చదువుకోనివాడు, గౌరవం లేనివాడు, గతిలేనివాడు, తెలివి తక్కువవాడు, దిక్కుమాలినవాడు- ఇలాంటివారే తెలుగులో మాట్లాడతారని ఇతని అభిప్రాయం కాకుంటే ఎందుకు మాట్లాడడు? అయ్యయ్యో ! తెలుగులో మాట్లాడడం అంత చేయగూడని పనా? మకరంద బిందువులను స్రవించే సుందరమైన భాషే. ఇట్టి భాషను విడచి పరభాషను ఆశ్రయిస్తున్నారే.
పోనీ పరభాషలో సాధించిన పాండిత్యమేమైనా గొప్పదా అంటే ఆయా భాషలు మాతృభాషలుగా గలవారి ముందు నిలువలేకుందే ! మన రాజధానిలో ఉన్న ఒక కాలేజీలో ‘వర్నాక్యులర్ సూపరింటెండెంటు’ గా ఒక సంస్కృత భాషా పండితుడగు ఆంగ్లేయుడున్నాడు. అతడు ‘యం బ్రహ్మ వేదాంత’ మొదలైన శ్లోకాలను చదివాడు. ఆ సంగతి చెప్పనక్కరలేదు. అలాగే గొప్ప తెలుగు పండితునిగా పేరొందిన బ్రౌను దొరగారు ఆంధ్రభాషలో ఏమాత్రం పండితులో మనకు తెలియకపోయినా నాటి ఆంధ్రులకు తెలియదా?
ఇలా పరభాషా వ్యా మోహంతో స్వభాషకు దూరమై “రెంటికీ చెడ్డ రేవడి”లా తయారవుతున్నాం. ఈ విధంగా జంఘాలశాస్త్రి ఆవేదనతో పల్కాడు.
ప్రశ్న 3.
జంఘాలశాస్త్రి ఎవరిని అదృష్టవంతులంటున్నాడు?
జవాబు:
సభాధ్యక్షుడు పలికిన తనకు తెలుగులో మాట్లాడటం రాదనే మాట ఒకవేళ భ్రమైతే తాను అదృష్టవంతుణ్ణి అని అన్నాడు. ఇంకా ఆంధ్రులంతా అదృష్టవంతులని చెప్పాడు. ఆంధ్రదేశం కూడా అదృష్టవంతమైనదని భావించాడు. తెలుగు ప్రాంతంలో పుట్టినవారు, తెలుగు తల్లిదండ్రులకు పుట్టినవారు, ఆంధ్ర జాతీయతత్త్వ సంపదచే అభివృద్ధి చెందినవారు అదృష్టవంతులని పేర్కొన్నాడు. ఆంధ్రభాషలో పండితులై, ఆంధ్రభాషలో గ్రంథాలను రచించి, ఆంధ్రభాషా దేవికి వెలకట్టలేని అలంకారాభరణాలుగా సమర్పించినవారు అదృష్టవంతులని చెప్పాడు. ఆంధ్రదేశ సేవచేసి- తమ శరీరాలను, ప్రాణాలను, ఆత్మలను పవిత్రులుగా జేసుకున్న వారిని అదృష్టవంతులన్నాడు. ప్రాణాలు విడచి పరమపదాన్ని చేరిన పూర్వకాలపు ఆంధ్రులందరూ కూడా అదృష్టవంతులే అని సంభావించాడు.
ఈ) కింది అంశానికి భావం ఏమిటి? దీన్ని ఏ సందర్భంలో మాట్లాడాడు?
ప్రశ్న 1.
“కావు కావుమని యనవలసిన కాకులన్నిటిలో నొక కాకికొక్కొరోకోయని యఱచిన యెడల మిగిలిన కాకులు దానిని ముక్కుతో బొడిచివేయక మానునా?”
జవాబు:
భావం :
కాకులు, సహజంగా కావు కావుమని అరుస్తాయి. ఇది వాటి జాతి లక్షణం. కాకులలో ఉన్న ఒక కాకి అలా అరవక కోడిలా ‘కొక్కొరోకో’ అని అరిస్తే మిగిలిన కాకులు దాన్ని కాకిగా భావించక, వేరే పక్షి తమలో చేరిందని భావించి కోపంతో పొడిచి చంపేస్తాయి గదా ! అని భావం.
సందర్భం :
ఈ వాక్యాన్ని జంఘాలశాస్త్రి సభాధ్యక్షుణ్ణి ఉద్దేశించి మాట్లాడాడు. అందరూ తెలుగు మాట్లాడవలసిన చోట, ఇంతమందిలో నీవొక్కడివే ఇంగ్లీషులో మాట్లాడావు. మేము నీలాంటి వారిని చాలామందిని చూశాము. ఇటువంటి పరిస్థితులకు అలవాటు పడ్డాం గనుక సరిపోయింది. లేకుంటే కాకులన్నీ కలిసి తోటికాకిని పొడిచినట్లు నిన్ను హింసించక విడిచేవారమా? అని పల్కాడు.
ప్రశ్న 2.
“మకరంద బిందుబృందరస స్యందన మందరమగు మాతృభాషయే”.
భావం :
తేనె బిందువులను కార్చే మందర పర్వతమువంటిదైన స్వభాష.
సందర్భం :
సభాధ్యక్షుడు ఆంగ్లంలోనే సంభాషించుటకు గల కారణాలను వెదుకుతూ జంఘాలశాస్త్రి ఈ వాక్యాన్ని పల్కాడు. తెలుగులో మాట్లాడేవాడు పద్ధతి తెలియనివాడు. చదువుకోనివాడు. గౌరవం లేనివాడు. దిక్కులేనివాడు. తెలివి తక్కువవాడు అని అధ్యక్షుల వారి అభిప్రాయం. కాబట్టే తేనె లాంటి మధురభాషను విడచి పరభాషలో ఉపన్యసిస్తున్నాడు.
II. వ్యక్తీకరణ-సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సొంతమాటల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
కావ్యభాష, వ్యావహారిక భాషలంటే ఏమిటి? వీటి మధ్య భేదాలు ఏమిటి?
గ్రాంథికభాష, వ్యావహారిక భాషలంటే ఏమిటి? వాటి మధ్య తేడాలను వివరించండి.
జవాబు:
కావ్యభాష :
కావ్యాలలోను, గ్రంథాలలోను ఉపయోగించే, వ్యాకరణంతో గూడిన భాషను ‘కావ్యభాష’ అంటారు.
వ్యావహారికభాష :
రోజువారీ వ్యవహారాలను జరుపుకోవడానికి ఉపయోగించే భాషను ‘వ్యావహారిక భాష’ అంటారు. ఇందులో భావానికే ప్రాధాన్యం. వ్యాకరణ నియమాలను పెద్దగా పట్టించుకోనవసరం లేదు.
భేదాలు :
కావ్యభాష | వ్యావహారికభాష |
1. ఈ భాష జాతి-కుల-మత – ప్రాంతాలకు అతీతంగా అందరిచే ఒకేలా ప్రయోగించబడుతుంది. | 1. ఈ భాష జాతి-కుల-మత – ప్రాంతాలను బట్టి అనేక విధాలుగా మారిపోతుంది. |
2. దీనిలో మార్పులు చేరవు. ఎప్పటికీ ఒకేలా నిలచి ఉంటుంది. | 2. దీనిలో మార్పులు సహజం. కాలం, ప్రాంతం, జనాల అవసరాలను బట్టి ఇది పలు రకాలుగా మారిపోతుంది. |
3. నన్నయ-తిక్కన -ఎర్రనలు రాసిన భారతాన్ని ఇంకా ఇతర ప్రబంధ కవులు రాసిన కావ్యాలను గ్రంథాలను నేటికీ చదివి అర్థం చేసుకోగలుగుతున్నా మంటే కారణం కావ్యభాషలో ఉండటం. | 3. ఇది ఆయా ప్రాంతాల వర్ణాల వారి స్వభావాన్ని, సహజతను తెలుపుతుంది. కాబట్టే అన్నమయ్య సంకీర్తనలలో చాలావరకు రాయలసీమ ప్రాంతపు యాస వాడబడినా “అన్నమయ్య పదసర్వస్వం” వంటి గ్రంథాల ద్వారా ఆయన సంకీర్తన సౌరభాలను ఆస్వాదించగలుగు తున్నాం. |
ప్రశ్న 2.
జంఘాలశాస్త్రి మంచి వక్త అని ఎలా చెప్పగలవు?
జవాబు:
మంచివక్తకు ప్రధానంగా సభలో పిరికితనం పనికిరాదు. కొత్త ప్రదేశమైనా, కొత్త మనుషులైనా చొరవగా చొచ్చుకుపోగలగాలి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోగల నేర్పు ఉండాలి. జంఘాలశాస్త్రికి అటువంటి చొరవ, నేర్పు ఉన్నాయి. చెప్పదలచుకొన్న అంశం పై సాధికారత ఉండాలి. సందర్భానుగుణంగా మాట్లాడే ఇతర అంశాలపై కూడా పట్టు ఉండాలి. భావానుగుణంగా భాష తడబాటు లేకుండా నదీ ప్రవాహంలా ఉరకలెత్తాలి. చెప్పదలచుకొన్న విషయాన్ని పక్షపాతం చూపకుండా నిర్భయంగా, స్పష్టంగా చెప్పగలగాలి. ఈ గుణాలన్నీ జంఘాలశాస్త్రిలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి జంఘాలశాస్త్రి మంచి వక్త అని చెప్పవచ్చు.
ప్రశ్న 3.
సభాధ్యక్షుడు తెలుగు మాట్లాడకపోవడానికి కారణం ఏమై ఉంటుంది?
జవాబు:
తెలుగులో అతడు మాట్లాడలేకపోవడానికి కారణం శక్తి లేకపోవడం కాదు. ఇష్టం లేకపోవడం. తెలుగంటే చులకన భావం. తెలుగు భాషకన్నా దిక్కుమాలిన భాషలేదని అతని నమ్మకం. తెలుగులో మాట్లాడేవాడు పద్ధతి తెలియనివాడు, చదువుకోనివాడు, గౌరవం లేనివాడు, గతిలేనివాడు, తెలివి తక్కువవాడు, ఇంకా దిక్కు మాలినవాడని అతని అభిప్రాయమై ఉంటుంది. తెలుగులో మాట్లాడటం సిగ్గుచేటని అతని విశ్వాసం కాబోలు. సభాధ్యక్షుడు తెలుగులో మాట్లాడకపోవడానికి ఇవన్నీ కారణాలై ఉంటాయి.
ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాలలో సొంతమాటల్లో రాయండి.
ప్రశ్న 1.
జంఘాలశాస్త్రి గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
జంఘాలశాస్త్రికి మాతృభాషపై మక్కువ ఎక్కువ. ఆంగ్లవిద్యను అభ్యసించినా అత్యవసర పరిస్థితుల్లో తప్ప దాన్ని వాడడానికి ఇష్టపడడు. తెలుగును ఎవరైనా కించపరిచేలా మాట్లాడినా, ప్రవర్తించినా సహించలేనివాడు. తోటి తెలుగువారైనా సరే చీల్చి చెండాడుతాడు. భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గూర్చి ప్రచారం చేయడానికి ఉద్యమించాడు. మంచి వక్త, ఏ సభలోకైనా దూసుకొని వెళ్ళే స్వభావం కలవాడు. ప్రాచీన శాస్త్రాలను , నవీన శాస్త్రాలను కూడా ఒంటబట్టించుకున్నవాడు. వ్యంగ్యంగా మాట్లాడటంలో నేర్పరి. ఎదుటివారి మనసులోకి దూసుకొని వెళ్లేలా సూటిగా, స్పష్టంగా మాట్లాడగలడు. చిన్న తప్పును సైతం సహించలేని స్వభావం గలవాడు.
ప్రత్యేకించి తెలుగులో విద్యనభ్యసించేవారిని, తెలుగు సంభాషించేవారిని, తెలుగుదనం కోరేవారిని అభిమానిస్తాడు. ఇతని ఉపన్యాసం ద్వారా ఇతనికి ఆధునిక న్యాయశాస్త్రంపై చక్కని అవగాహన ఉందని తెలుస్తుంది. ఆధునిక ఆంగ్ల సాహిత్యం పై కూడా మంచిపట్టు ఉంది. నిష్కర్షగా, నిర్మొహమాటంగా, నిజాయితీగా మాట్లాడతాడు. చక్కని ఉదాహరణలతో మనసుకు హత్తుకునేలా విషయాన్ని వివరించగల నేర్పు, ఓర్పు గలవాడు. తెలుగు, సంస్కృత భాషలను అనర్గళంగా మాట్లాడగలవాడు. పురాణ పరిజ్ఞానం, నవీన విజ్ఞానం, ఆంధ్ర సాహిత్య జ్ఞానం సమపాళ్లలో గల మేధావి. ప్రాచీనతను ఆధునికతతో మేళవించగలిగిన వ్యవహారదక్షుడు. శ్రోతలను మంత్రముగ్ధులను చేయగల వాగ్దాటి గలవాడు.
ప్రశ్న 2.
“ఆంగ్లభాషయే కాదు. ఇంకననేక భాషలు కూడా నేర్చుకొనుము. నీవు సంపాదించిన పరభాషా జ్ఞానమంతయు నీ భాషను అభివృద్ధిపరచడానికే ఈ వాక్యాల ద్వారా మీరేం గ్రహించారు ? దీనిపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
ఆధునిక కాలంలో కేవలం మాతృభాషాధ్యయనం వలన అన్నీ సాధించుకోలేం. కాబట్టి అన్యభాషలను అధ్యయనం చేయక తప్పదు. దేశీయ భాషలనే కాక అంతర్జాతీయ భాషలైన ఆంగ్లం, ఫ్రెంచ్ వంటి వాటిని సైతం నేర్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ పరభాషల మత్తులో పడి మాతృభాషను మరువకూడదు. ఒకే మాతృభాష మాట్లాడేవారున్నచోట పరభాషలో మాట్లాడకూడదు. ఇంకా పరభాషలను అధ్యయనం చేసి, ఆయా భాషలలోని పదాలను మాతృభాషలోకి తీసుకువచ్చి స్వభాషలోని పదసంపదను పెంపొందించుకోవాలి. పరభాషలలోని గ్రంథాలలో ఉన్న ఉత్తమాభిప్రాయాలను, భావాలను గ్రహించి మాతృభాషలో వాటిని వినియోగించుట ద్వారా మాతృభాషకు వన్నె పెట్టుకోవాలి.
ఇతర భాషలలోని ఉత్తమ గ్రంథాలను, కవితా సంపుటాలను మాతృభాషలోకి అనువదించుట ద్వారా వాటి సౌందర్యాన్ని తోటివారికి పరిచయం చేసి ఆనందం కలిగించవచ్చు. స్వభాషను పరిపుష్టం చేసుకోవచ్చు. పరాయి భాషలలోని నూతన సాహిత్యపు పోకడలను, కొత్తగా పుడుతున్న శాస్త్రాలను, పారిభాషిక పదాలను స్వీయభాషలోకి తర్జుమా చేయడం ద్వారా సాహిత్య శాస్త్ర సంపదలను అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం ద్వారా మాతృభాషను కలకాలం నిలిచి ఉండేలా చేసుకోవచ్చు. అన్య భాషా గ్రంథాలను అభ్యసించేటప్పుడు మన భాషకు ఉపయోగపడే అంశాలేమైనా ఉన్నాయా అని తదేక దృష్టితో గమనించాలి. అట్టి వాటిని జాగ్రత్తగా గుర్తుంచుకొని అవసరమైన చోట వినియోగించాలి.
ఇలా పరభాషా జ్ఞానాన్ని స్వభాషాభివృద్ధికి నిరంతరం వినియోగించడం ద్వారా భాష జీవత్వాన్ని కోల్పోదు. జవసత్వాలను కోల్పోదు. తద్వారా అమృతభాషయై నిలుస్తుంది.
ప్రశ్న 3.
తెలుగు భాష వచ్చి కూడా కావాలని ఆంగ్లంలో మాట్లాడేవారు ఎదురై, మీతో ఆంగ్లంలోనే మాట్లాడితే, మీకెలా ఉంటుంది? మీరేం చేస్తారు?
జవాబు:
నేడు ఆంగ్లంలో సంభాషించడం నాగరికతకు గుర్తుగా భావిస్తున్నారు. మాతృభాషలో మాట్లాడడం మొరటైపోయింది. దూరదర్శన్లలోను, చలన చిత్రాలలోను ఆంగ్లభాషా ప్రభావం అధికంగా కన్పిస్తుంది. రోజువారీ వ్యవహారాలలోను ఆంగ్ల పదాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగుభాష క్రమక్రమంగా కృంగి కృశించిపోతోంది. చాలామంది తెలుగు భాష వచ్చి కూడా కావాలని ఆంగ్లంలో మాట్లాడుతున్నారు. అలాంటి వారు నాకు ఎదురై ఆంగ్లంలో మాట్లాడితే నాకు ఎక్కడలేని చిరాకు వస్తుంది. ఏం రోగం చక్కగా తెలుగులో మాట్లాడవచ్చు కదా అని అన్పిస్తుంది. “పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంద’నే సామెత గుర్తుకు వచ్చి నవ్వు వస్తుంది. భాషపై ఉన్న నిర్లక్ష్య భావానికి కోపం వస్తుంది.
నేను మాత్రం తప్పక తెలుగులోనే మాట్లాడతాను. వాళ్ళు ఆంగ్లంలో మాట్లాడినదానికి తగ్గట్లు సందర్భోచితంగా తెలుగులో మాట్లాడతాను. దానివల్ల నాకు కూడా ఆంగ్ల పరిజ్ఞానం తగినంత ఉందని, కావాలనే నేను తెలుగులో మాట్లాడుతున్నానని వాళ్లు గ్రహించేలా చేస్తాను. తెలుగులో మాట్లాడటం తక్కువతనమేమీ కాదని నిరూపిస్తాను. ఏయే భావాలను, పదాలను తెలుగులో మాట్లాడలేమని కేవలం ఆంగ్లంలోనే మాట్లాడగలమని భావిస్తారో అటువంటి వాటిని మాతృభాషోపాధ్యాయుని సాయంతో, ఇతర పెద్దల సాయంతో తెలుగులో మాట్లాడి చెప్పుతో కొట్టినట్లు చేస్తాను. తెలుగు భాష సత్తాను చాటిచెపుతాను. తెలుగులో మాట్లాడటం వలన కలిగే సౌలభ్యాన్ని తెలియజేస్తాను. తద్వారా ప్రభావితులై కొంతమందైనా తెలుగులో మాట్లాడటానికి ప్రాధాన్యం ఇచ్చేలా చూస్తాను.
ఇ) సృజనాత్మకంగా రాయండి.
జంఘాలశాస్త్రి పాత్రను ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
చెవులు మూసుకున్నట్లు అభినయిస్తూ ….
“హరహరా ! మహాదేవ శంభూ ! మహాదేవ శంభూ ! ఎంతమాట విన్నాను ! ఎంతమాట విన్నాను ! సరిగ్గానే విన్నానా? లేక ఏదో విని మరేదో అని భ్రమపడ్డానా? ఇది భ్రమే అయితే అంతకన్నా అదృష్టమేముంది ? నేనొక్కడినే కాదు యావదాంధ్రులూ అదృష్టవంతులే గదా ! ఆంధ్ర భాషా యోష (స్త్రీ) ను తమ గ్రంథాలచే అలంకరించిన పూర్వులందరూ అదృష్టవంతులే. అయ్యో ! అయ్యయ్యో ! అంతటి అదృష్టం కూడానా? ఇది భ్రమకాదు నిజమే. వినకపోవడమేమి? చెవులేమైనా చిల్లులు పడ్డాయా? గుండెలు పగిలేలా విన్నాను. మనస్సు మండేలా విన్నా ! సిగ్గు చిమిడిపోయేలా విన్నా? ప్రాణాలు ఎగిరిపోయేలా విన్నా ! “జీవన్ భద్రాణి పశ్యతి” – బతికి ఉంటే ఎప్పటికైనా సుఖాలు బడయవచ్చని కదా ఆదికవి వాల్మీకి వాక్యం. ఇంకా బతికి ఉన్నందుకు ఇదా ఫలం ! ఇదా సుఖం !!
ఆహాహా! ఏమి ? అతని ఆలాపకలాపం? ఏమా శ్రీసూక్తి? అతని వదనం నుండి వెలువడిన వాగమృతమేమి? ఆంధ్రుడు చెప్పదగినదికాదే? ఆలోచనలలో సైతం అనుకోకూడనిదే? కాని …… (సాలోచనగా) అంత నిర్లజ్జగా ఎలా చెప్పగలిగాడు తనకాంధ్రభాష రాదని ! తాను తెలుగులో మాట్లాడలేనని ! కృష్ణాతీరంలో ఆంధ్రులైన దంపతులకు పుట్టి, తక్కువలో తక్కువగా ఆరు సంవత్సరాలైనా తెలుగులో మాట్లాడి, ఏమ్.ఏ.,బి.ఎల్. చేసి, న్యాయవాద వృత్తిని నిరాఘాటంగా, నిరంకుశంగా నిర్వహిస్తున్నవాడే. కాలాంబర కవచధారియై న్యాయమూర్తుల ఎదుట గ్రద్దను కాకిగాను, కాకిని గ్రద్దగాను నిరూపించగల కర్కశతర్కంతో, వాగ్విలాసంతో సర్వులనూ సమ్మోహితుల్ని జేయజాలినవాడే. అట్టివాడు ఆంగ్లభాషను అభ్యసించినంతమాత్రాన ఇప్పుడు తెలుగులో మాట్లాడలేడా ? మూగవాడేమీకాదే – నంగి నంగి మాటలాడువాడు కాదే? మెమ్మెపెప్పె అనేవాడు కాదే ? మాట్లాడలేకపోవటం అంటే నాకేమీ బోధపడటం లేదు. మ్యావుమని అరవని పిల్లెక్కడైనా ఉంటుందా ? కిచకిచలాడని కోతినెక్కడైనా చూశామా? తెలుగు గడ్డపై పుట్టిన పక్షులు సైతం అనవరత శ్రవణం వల్ల తెలుగులో మాట్లాడుతుంటే మనిషై పుట్టి, అందునా ఆంధ్రుడిగా పుట్టి తెలుగు ప్రాంతమందలి నీటిని, గాలిని, ఆహారాన్ని వినియోగించుకుంటూ, ఆ మాత్రం విశ్వాసం కూడా చూపక నీచాతినీచంగా తెలుగురాదని అంటాడా ? ఇంతకన్నా విశ్వాసఘాతుకం ఉందా?
హా ! తెలిసింది! ఇప్పటికి కారణం దృగ్గోచరమైంది. తెలుగులో అతణ్ణి మాట్లాడకుండా జేసింది అశక్తి కాదు. అనిష్టత – అహ్యతత – ఇది శిలాక్షరమైన మాట. తెలుగు బాసంత దిక్కుమాలిన బాసే లేదని ఈతని అభిప్రాయం. తెలుగులో మాట్లాడేవాడు పద్ధతి తెలియనివాడు. చదువుకోనివాడు. గౌరవము లేనివాడు. గతిలేనివాడు. బుద్ధిమాలినవాడు. తెలుగులో మాట్లాడుట సిగ్గుసిగ్గు. ఇది ఇతని అభిప్రాయం మాత్రమే కాదు. ఏ కొద్దిపాటి ఆంగ్లం అభ్యసించిన తెలుగువారందరి అభిప్రాయమని కూడా తోస్తుంది.
తెలుగులో మాట్లాడటం అంత సిగ్గుమాలిన పనా ? అయ్యో ! మన భాషకు, మకరంద బిందు బృందరస స్యందన మందరమగు మాతృభాషకు, తేనెలూరు తేట తెలుగుకు ఎంతటి దురావస్థ పట్టింది ? మాన్యాలమ్ముకొని, సొమ్ము వ్యయపరచి, ఎంతోమందిని ఆశ్రయించి, ఎన్నో బాధలుపడి దైన్యంతో సంపాదించిన ఆంగ్లభాష వలన ఒరిగినదేమున్నది ? అర్ధ శతాబ్దం ఆంగ్లభాషను అభ్యసించినా సంపూర్ణ భాషోచ్చారణా సౌష్ఠవం పట్టుపడ్డదా ? భాషా సౌలభ్యం అలవడిందా? లేదే ! గ్రంథజ్ఞాన శూన్యుడైన జన్మమాత్రాంగ్లేయునికి ఉన్న సౌలభ్యంలో సాబాలైనా సిద్ధించలేదే ? ఇక సంస్కృతాంధ్రాలను అభ్యసించిన ఆంగ్లేయులు వేదమంత్రాలను, చిత్ర కావ్యాలలోని శ్లోకాలను, తెలుగు జానపద గీతాలను చక్కగా ఆలపించగలరా? ఎన్నటికి చేయలేరు గదా ! పరభాషా పదాలకు అర్థాలు తెలిసినంతమాత్రాన పండితులమయ్యామనుకుంటే ఎలా ? ఆ భాషలోని కళను, ప్రాణాన్ని, తత్వాన్ని, ఆత్మని కనిపెట్టాలి. అది ఆ భాష మాతృభాషగా గలవారికి మాత్రమే సాధ్యం. మిగతా వారందరికీ అది నేల విడిచిన సామే. స్వభాషను విడిచి పరభాషకై పాకులాడటం వలన రెండింటికి చెడ్డ రేవడిలా అయింది.
స్వభాషను నేర్చుకోవటంలో కష్టమేముంది ? నిజానికి ఇష్టం లేదుగాని. విద్యాభ్యాసానికి ముందే తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకోవటం మొదలైంది గదా ! పరభాషకై వెచ్చించిన ధనంలో, పడిన శ్రమలో, వ్యర్థపరచిన కాలంలో, పొందిన దైన్యంలో, ఏడ్చిన ఏడ్పులో 14వ వంతైన అక్కరలేకుండా మాతృభాషలో పండితులమవుతాం గదా ! ఈ వాస్తవాన్ని నా తెలుగు వారెన్నటికి గ్రహిస్తారో గదా ! నా తెలుగు ఎన్నటికి మహోన్నత వైభవాన్ని పొందుతుందో గదా !! (భారంగా నిట్టూరుస్తాడు.)
అయినా నా భావాలను ఆలోచనల రూపంలో మాత్రమే ఉంచితే లాభం లేదు. తెలుగు భాషోన్నతికై నడుం బిగించి ఉద్యమించాలి. యావదాంధ్రదేశంలో సంచరిస్తూ, మాతృభాషా విషయమై జాగరూకుల్ని చేయాలి. ఇదే కర్తవ్యం. అవును. ఇదే తక్షణ కర్తవ్యం.
ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.
మీ స్నేహితులలో కేవలం తెలుగులోనే ఒక రోజంతా మాట్లాడగలిగే వారెవరో గుర్తించి, వారిని అభినందిస్తూ కేవలం తెలుగుపదాలతో ఒక అభినందన పత్రం రాయండి.
అభినందన పత్రం
జవాబు:
ప్రియమైన మిత్రులకు,
శుభాభినందనలు. నేను చాలా రోజులుగా మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు తెలుగులో మాట్లాడటం నన్ను బాగా ఆకర్షించింది. నిజానికి మనం రోజూవాడే మాటలలో కొన్ని ఆంగ్ల పదాలకు తెలుగు పదాలే లేవని నేను అనుకొన్నాను.
నా ఊహ తప్పని మీరు నిరూపించారు. తరగతి గది, తుడుపు గుడ్డ, సుద్దముక్క, ఉపస్థితి పట్టిక వంటి చక్కని తెలుగు పదాలను ఉపయోగిస్తూ తెలుగు వాతావరణాన్ని ఏర్పరచారు. మీలాంటి వారు నా మిత్రులని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది.
మీ వలన నేను తెలుగు భాష గొప్పదనాన్ని, మాధుర్యాన్ని గుర్తించాను. ఇంతకుముందు నేను తెలుగు మాధ్యమంలో చదువుతున్నందుకు సిగ్గుపడ్డాను. కాని నేడెంతో గర్వపడుతున్నాను. తెలుగుని అభిమాన విషయంగా చదువుతున్నాను. పద్యాలను రాగయుక్తంగా, భావయుక్తంగా చదివే ప్రయత్నం చేస్తున్నాను. గేయాలను చక్కగా గానం చేయడానికి కృషి చేస్తున్నాను. రోజువారీ వ్యవహారంలో మనం ఉపయోగించే ఆంగ్ల పదాలకు సరైన తెలుగు పదాలను మాతృభాషోపాధ్యాయుని సహాయంతో, ఇతర పెద్దల సహాయంతో సేకరించి, తగినచోట్ల వినియోగిస్తున్నాను. వీటి అన్నింటికి ప్రేరకులు మీరే. ధన్యవాదాలు.
ఇలా తెలుగులో నా కార్యకలాపాలకు తగిన భాషను వినియోగిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇంట్లోని పెద్దవారు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మా తాతయ్య – నాయనమ్మల ఆనందానికి అవధులు లేవు. “నీలా నీ మిత్రులందరూ, రాష్ట్రంలోని విద్యార్థులందరూ తెలుగును అభిమానిస్తూ తెలుగు భాషనే వినియోగిస్తూ ఉంటే మన తెలుగుభాష అమృత భాషగా నిలుస్తుంది. మీ వలన పెద్దలలో కూడా తప్పక మార్పు వస్తుంది. ఇది ఒక శుభపరిణామం. నీలో మార్పునకు కారకులైన నీ స్నేహితులకు శుభాశీస్సులు. వీలైతే ఎప్పుడైనా వారిని మనింటికి అతిథులుగా తీసుకొనిరా” అని చెప్పారు. తప్పక మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి. మీ రాకకై మేమందరం ఎదురు చూస్తున్నాం. మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
(లేదా)
పాఠంలోని ఏవైనా రెండు పేరాలను వ్యవహార భాషలోకి మార్చి రాయండి.
1. గ్రాంథికములో ఉన్న పాఠ్యపుస్తకంలోని 4వ పేరా :
“స్వభాష యిదివఱకు మీచేతఁజావనే చచ్చినది. మీగతి యెంత యుభయభ్రష్టమైనదో చూచుకొంటిరా? మీరు వెచ్చించిన ధనములోఁ బడిన శ్రమములో వినియోగపఱచిన కాలములోఁ, బొందిన దైన్యములో, నేడ్చిన యేడ్పులలోఁ, బదునాలవవంతైన నక్కఱలేకుండ మీరు దేశభాషా పండితులై యుందురు. స్వభాషను మీరు నేర్చుకొనుటకే మంత శ్రమమున్నది ? అక్షరాభ్యాస దినమునుండియే మీరు స్వభాష నభ్యసించుచున్నారని యనుకొనవలదు. మీ తల్లి కడుపులో నున్నప్పుడే నేర్చుకొనుట మొదలు పెట్టినారు.
పై పేరా వ్యవహారభాషలో రాయడం :
జవాబు:
స్వభాష ఇదివరకే మీ చేతిలో చచ్చింది. మీ గతి ఎలా ఉభయభ్రష్టమైందో చూసుకున్నారా ? మీరు వెచ్చించిన ధనంలో, పడ్డ శ్రమలో, వినియోగించిన కాలంలో, పొందిన దైన్యంలో, ఏడ్చిన ఏడ్పుల్లో పద్నాలుగవ వంతైనా అక్కర్లేకుండా, మీరు దేశభాషలో పండితులయ్యేవారు. స్వభాషను మీరు నేర్చుకోడానికి ఏమంత శ్రమ ఉంది ? అక్షరాభ్యాస దినం నుంచే మీరు స్వభాషను అభ్యసిస్తున్నారని అనుకోవద్దు. మీ తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకోడం (మొదలెట్టారు.) మొదలుపెట్టారు.
2. గ్రాంథికములో ఉన్న పాఠ్యపుస్తకంలోని 7వ పేరా :
“నాయనలారా ! మీ సభా కార్యక్రమము నంతయుఁ జెడఁగొట్టితిని. నన్ను మీరు క్షమింపవలయును. మఱి యెప్పుడైన నీసభ తిరుగఁజేసికొనుడు. (‘అప్పుడు మీరధ్యక్షులుగా రావలయును’ కేకలు) నాయనలారా ! అటులే-మీరంత యాంధ్రభాషాభిమానంతోఁ బ్రవర్తించుచున్నప్పుడు నా చేతనైన సేవను నేను జేయనా? ఇఁక నాలుగు మాటలు మాత్రము చెప్పుదును. ఆంధ్రభాష బొత్తిగ రానివానితోడనే కాని మీరాంధ్యమున నెన్నఁడు మాటాడవలదు.
వ్యవహారభాషలో పై పేరాను రాయడం :
జవాబు:
నాయనారా ! మీ సభా కార్యక్రమాన్నంతా చెడగొట్టాను. నన్ను మీరు క్షమించాలి. మరెప్పుడైనా ఈ సభ తిరిగి చేసికోండి. (అప్పుడు మీరధ్యక్షులుగా రావాలి. సభలో కేకలు …) నాయనారా ! అలాగే, మీరంత ఆంధ్రభాషాభిమానంతో ప్రవర్తిస్తున్నప్పుడు నా చేతనైన సేవను నేను చేయనా ? ఇక నాలుగు మాటలు మాత్రం చెప్తాను. ఆంధ్రభాష బొత్తిగా, రానివాడితో కాని, మీరాంగ్లంలో ఎన్నడూ మాట్లాడొద్దు.
IV. ప్రాజెక్టు పని
తెలుగు భాష గొప్పదనాన్ని వివరించే వ్యాసాలను, పద్యాలను సేకరించండి. వాటి గురించి తరగతిలో చర్చించండి.
జవాబు:
తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగువల్లభుండ తెలుగొకండ
ఎల్లనృపులు గొలువ నెఱుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స.
III. భాషాంశాలు
పదజాలం
అ) కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాసి, ఆ పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.
1. శిశువుల మాటలు చిలుక పలుకుల్లా ఉంటాయి.
జవాబు:
చిలుక పలుకులు – అర్థం తెలియకుండా అనే మాటలు.
వాక్యప్రయోగం :
మా తమ్ముడు హిందీ వ్యాసాన్ని చదువుతుంటే అర్థం తెలియకుండా అనే మాటల్లా ఉంది.
2. తొందరపడి ఎవరినీ అధిక్షేపించ గూడదు.
జవాబు:
అధిక్షేపించుట = ఎగతాళి చేయుట
వాక్య ప్రయోగం :
వికలాంగులను (దివ్యాంగులను) చూసి ఎగతాళి చేయగూడదు.
ఆ) కింది పట్టికలో ప్రకృతి వికృతుల పదాలున్నాయి. వాటిని గుర్తించి రాయండి.
జవాబు:
ప్రకృతి – వికృతి
1. భాష – బాస
2. పక్షి – పక్కి
3. విద్య – విద్దె
4. రాత్రి – రాతిరి
5. ఆశ్చర్యము – అచ్చెరువు
6. గృధ్రము – గద్ద
వ్యాకరణం
అ) రెండు గాని, అంతకంటే ఎక్కువగాని వాక్యాలలోని సమాపక క్రియలను అసమాపక క్రియలుగా మార్చి, ఆ వాక్యాలను ఒకే వాక్యంగా రాస్తే దాన్ని ‘సంక్లిష్ట వాక్యం’ అంటారని మీరు తెలుసుకున్నారు కదా !
అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
1. ఆంగ్లేయ గ్రంథములెన్నియో వ్రాయుచున్నారు.
ఆంగ్లేయ ఉపన్యాసములెన్నియో ఇచ్చుచున్నారు.
జవాబు:
ఆంగ్లేయ గ్రంథములెన్నియో వ్రాస్తూ, ఆంగ్లేయ ఉపన్యాసములెన్నియో ఇచ్చుచున్నారు.
2. నన్ను మీరు క్షమింపవలయును.
మఱి యెప్పుడైన ఈ సభ తిరుగ జేసికొనుడు.
జవాబు:
నన్ను మీరు క్షమించి, మఱి యెప్పుడైన ఈ సభ తిరుగజేసికొనుడు.
ఆ) సమాన ప్రాధాన్యం గల సామాన్యవాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే దాన్ని సంయుక్తవాక్యమంటారని తెలుసుకున్నారు కదా!
కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
1. ఆయన ఆంధ్రుడు. ఆయన కృష్ణాతీరమున పుట్టినవాడు.
జవాబు:
ఆయన ఆంధ్రుడు మరియు కృష్ణాతీరమున పుట్టినవాడు.
2. మోహిని కూచిపూడి నృత్యం నేర్చుకొంది. భావన భరతనాట్యం నేర్చుకొంది.
జవాబు:
మోహిని కూచిపూడి నృత్యం మరియు భావన భరతనాట్యం నేర్చుకొన్నారు.
క్వార్థకం :
భూతకాలంలోని అసమాపక క్రియను ‘క్త్వార్థకం’ అంటారు. ‘క్వా’ అనే సంస్కృత ప్రత్యయం యొక్క అర్థమే క్వార్థకం.
ఉదా :
వచ్చి, తిని
చేదర్థకం :
సంస్కృతంలో ‘చేత్’ అనే ప్రత్యయానికి ‘అయితే’ అని అర్థం. ఇలా తెలుగులో అదే ప్రత్యయం ఏ పదానికి చేరితే దాన్ని ‘చేదర్థకం’ అంటారు.
ఉదా :
కురిస్తే
శత్రర్థకం :
‘శత్రచ్’ అనే సంస్కృత ప్రత్యయం యొక్క అర్థం శత్రర్థకం. ‘శతృ’ ప్రత్యయం వర్తమానకాలమందలి అసమాపక క్రియకు చేరుతుంది. కాబట్టి వీటిని శత్రర్థకాలు అంటారు.
ఉదా :
చేస్తూ, తింటూ
ఇ) కింది వాక్యాలు చదవండి. వీటిలో క్వార్థకం, చేదర్థకం, శత్రర్థకం ఉన్న అసమాపక క్రియలున్న వాక్యాలను గుర్తించండి.
1. వర్షాకాలంలో వానలు పడితే పంటలు పండుతాయి. – చేదర్థకం
2. కవిత గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తెచ్చింది. – క్వార్థకం
3. సుగుణ వంట చేస్తూ పాటలు వింటోంది. – శత్రర్థకం
4. సరిగ్గా మందులు వాడితే జబ్బు తగ్గుతుంది. – చేదర్థకం
5. రంగయ్యకు రెక్కాడితే కాని డొక్కాడదు. – చేదర్థకం
6. మాధవి ఉద్యోగం చేస్తూ చదువుకొంటున్నది. – శత్రర్థకం
ఈ) కింది పేరాలో అవసరమైనచోట తగిన విరామచిహ్నాలు ఉంచండి.
మనము చూడనే లేదయ్యా మన జంఘాలశాస్త్రియే యయ్యా యని వారిలో వారనుకొనుచు ఎప్పుడు వచ్చినారు ఎక్కడి నుండి వచ్చినారు మీరు సభకు వచ్చిన తరువాతనైనను మాకు తెలియజేయనక్కల లేదా ఏమి న్యాయమయ్యా యని యేవేవో అసందర్భములాడి నన్నుపన్యాసరంగము నొద్దకు తీసికొనిపోయిరి.
జవాబు:
విరామచిహ్నములతో వ్రాయుట :
‘మనము చూడనేలేదయ్యా. మన జంఘాలశాస్త్రియేయయ్యా’, యని వారిలో వారనుకొనుచు, “ఎప్పుడు వచ్చినారు? ఎక్కడి నుండి వచ్చినారు? మీరు సభకు వచ్చిన తరువాతనైనను మాకు తెలియజేయనక్కఱలేదా ? ఏమి న్యాయమయ్యా?”, యని యేవేవో అసందర్భములాడి, నన్నుపన్యాసరంగము నొద్దకు తీసికొనిపోయిరి.
ఉ) ప్రత్యక్ష, పరోక్ష కథనాలు
ప్రత్యక్ష కథనం :
ఒక వ్యక్తి చెప్పిన మాటలను అలాగే ఉన్నది ఉన్నట్లుగా (ఉద్ధరణ చిహ్నాలలో ఉంచి) చెప్పడాన్ని ప్రత్యక్ష కథనం అంటారు.
కింది వాక్యాలు చదవండి.
1) “నాయనలారా ! నేను మీ సభా కార్యక్రమమునంతయు జెడగొట్టితిని.”
2) “నన్ను మీరు క్షమింపవలయును.”
పై వాక్యాలన్నీ జంఘాలశాస్త్రి నేరుగా చెబుతున్నట్లు ఉన్నాయి కదా !
నేను, మేము, …….. ఇలా ఉండే వాక్యాలు అనగా ఉత్తమ పురుషలోని వాక్యాలు సాధారణంగా, ప్రత్యక్షంగా చెబుతున్నట్లుగా ఉంటాయి. అట్లే కింది వాక్యాలను చదవండి.
1) “నేనొక్కడినే అదృష్టవంతుడినా?” అన్నాడు జంఘాలశాస్త్రి.
2) “నేను రాను” అని నరేశ్ రఘుతో అన్నాడు.
(లేదా )
“నేను రా” నని నరేశ్ రఘుతో అన్నాడు.
పై వాక్యాలలో గీత గీసిన మాటలను ఎవరు అన్నారు ?
మొదటి దాంట్లో జంఘాలశాస్త్రి అన్న మాటల్ని, రెండవదాంట్లో నరేష్ అన్న మాటల్ని “ఉద్ధరణ చిహ్నాలు” (ఇన్వర్టడ్ కామాలు) ఉంచి చెప్పినప్పుడు వారే ప్రత్యక్షంగా చెప్పినట్లుగా ఉంటుంది. దీన్నే ప్రత్యక్ష కథనం అంటారు.
పాఠం చదవండి. ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యాలను గుర్తించండి. వాటి కింద గీత గీయండి.
- “బ్రతికి యుండిన సుఖములు పడయవచ్చు” నని కవి చెప్పినాడే.
- “నాయనలారా ! మీరు కూడా వింటిరి కాదా ! నేనొక్కడినే వింటినా? ఏదో విని మటియేదో యని భ్రమపడితినా?”
- ‘నేనొక్కడను మాత్రమే యదృష్టవంతుడనా ? ఆంధ్రులందఱదృష్టవంతులే కదా!”
- “నాది భ్రమము కాదు. తాత్కాలికోన్మాదము కాదు.”
- “మన యగ్రాసనాధిపతి దేవుని కాంధ్రభాష రాదట.”
- “అబ్బా ! మీరే ప్రయత్నము చేసినారని రాదనుచున్నారు?”
- “మా భాష మాకు రాదు.” 8. “ఆంగ్లేయభాష యేల చదువుకొంటివని నే నధిక్షేపింపను.”
- “ఇక నాలుగు మాటలు మాత్రము చెప్పుదును.”
- “మన భాష కక్కఱకు వచ్చు నంశము లేమియా” యని తదేక దృష్టితో జూడండి.
పరోక్ష కథనం :
ఒకరు చెప్పిన మాటలను యథాతథంగా అట్లే చెప్పక ఇంకొకరు చెపుతున్నట్లుగా చెప్పడాన్నే పరోక్ష కథనం అంటారు. ఇందులో వాక్యాలు ఉత్తమ పురుషలో ఉండవు. ఉద్ధరణ చిహ్నాల అవసరమూ ఉండదు.
కింది వాక్యాలు చదవండి.
- నరేష్ తాను రానని రఘుతో అన్నాడు.
- ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లుగా చేస్తామని పిల్లలు అన్నారు.
- తనను క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నాడు.
పాఠం చదవండి. పరోక్ష కథనంలోని వాక్యాలను గుర్తించండి. వాటి కింద గీత గీయండి.
పాఠంలో గుర్తించిన పరోక్ష కథనంలోని వాక్యాలు :
- ఆయన యాంధ్రుడు. కృష్ణాతీరమున బుట్టినవాడు.
- న్యాయవాద వృత్తిని నిరాఘాటముగా, నిరంకుశముగా నిర్వర్తించుచున్నవాడు.
- ఆయన ఆంధ్రమున మాటలాడనేలేరట.
ప్రత్యక్ష కథనంలో ఉన్న వాటిని పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు జరిగే మార్పులు
- ప్రత్యక్ష కథనంలోని మాటల/వాక్యాల భావం మాత్రమే పరోక్ష కథనంలో తీసుకొనబడుతుంది.
- ఉద్దరణ చిహ్నాలు తొలగించబడతాయి పరోక్ష కథనంలో.
- ‘అని’ అనే పదం పరోక్ష కథనంలో చేరుతుంది.
- ప్రత్యక్ష కథనంలోని ఉత్తమ పురుష పదాలైన – నేను – మేము – మన – మా వంటి పదాలు – తాను – తాము – తమ – అనే పదాలుగా పరోక్ష కథనంలో మారుతాయి.
1) పాఠంలోని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలను గుర్తించండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చి రాయండి.
1. “బ్రతికి యుండిన సుఖములు పడయవచ్చు” నని కవి చెప్పినాడు.
జవాబు:
బ్రతికి యుండిన సుఖములు పడయవచ్చు అని కవి చెప్పినాడు.
2. “మీరు కూడ వింటిరి కాదా? నేనొక్కడనే వింటినా? ఏదో విని మఱియేదో యని భ్రమపడితినా?” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
మీరు కూడ వింటిరి కాదా? తానొక్కడే విన్నాడా? ఏదో విని మటియేదో యని భ్రమపడినాడా? అని జంఘాలశాస్త్రి అన్నాడు.
3. “నేనొక్కడనే అదృష్టవంతుడనా? ఆంధ్రులంద అదృష్టవంతులే కదా ! ” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
తానొక్కడే అదృష్టవంతుడా ? ఆంధ్రులందరు అదృష్టవంతులే కదా ! అని అన్నాడు జంఘాలశాస్త్రి.
4. “నాది భ్రమము కాదు. తాత్కాలికోన్మాదము కాదు” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
తనది భ్రమము కాదని, తాత్కాలికోన్మాదము కాదని అన్నాడు జంఘాలశాస్త్రి.
5. “మన యగ్రాసనాధిపతి దేవుని కాంధ్రభాష రాదట ” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
తమ యగ్రాసనాధిపతి దేవుని కాంధ్రభాష రాదట అని అన్నాడు జంఘాలశాస్త్రి.
6. “అబ్బా ! మీరే ప్రయత్నము చేసినారని రాదనుచున్నారు?” అన్నాడు శాస్త్రి.
జవాబు:
అబ్బా ! మీరే ప్రయత్నము చేసినారని రాదనుచున్నారని అన్నాడు శాస్త్రి.
7. “మా భాష మాకు రాదు” ఇలా అనకూడదేవరు.
జవాబు:
తమ భాష తమకు రాదని అనకూడదెవరు.
8. “ఆంగ్లేయభాష యేల చదువుకొంటివని నేధిక్షేపింపనా” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
ఆంగ్లేయభాష యేల చదువుకొంటివని తానధిక్షేపింపనని అన్నాడు జంఘాలశాస్త్రి.
9. “ఇక నాలుగు మాటలు మాత్రము చెప్పుదును” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
ఇక నాలుగు మాటలు మాత్రము చెప్పెదనని అన్నాడు జంఘాలశాస్త్రి.
10. “మన భాషకక్కఱకు వచ్చు నంశము లేమియా’యని తదేక దృష్టి జూడుడి” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
తమ భాష కక్కల వచ్చు నంశము లేమియాయని తదేక దృష్టి జూడండని అన్నాడు జంఘాలశాస్త్రి.
2) మీరే మరికొన్ని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు రాయండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చండి.
1. “నేను బాగా చదువుతాను” అన్నాడు రఘు, రాజుతో.
జవాబు:
తాను బాగా చదువుతానని రఘు రాజుతో అన్నాడు.
2. “నేను అందగత్తెనని” చెప్పింది రాణి.
జవాబు:
తాను అందగత్తెనని రాణి చెప్పింది.
3. “మేము రేపు ఊరికి వెళ్ళుతున్నాం”చెప్పాడు విష్ణు.
జవాబు:
తాము రేపు ఊరికి వెళ్ళుతున్నామని విష్ణు చెప్పాడు.
4. “మన మందరం అమెరికా వెళ్తున్నాం” ఆనందంగా చెప్పింది రోజి.
జవాబు:
తామందరం అమెరికా వెళ్తున్నారని రోజి ఆనందంగా చెప్పింది.
5. ” మా అక్కయ్యకు మెడిసిన్లో సీటు వచ్చింది” అన్నాడు రాము నిఖిల్ తో సంతోషంగా.
జవాబు:
తన అక్కయ్యకు మెడిసిన్లో సీటు వచ్చిందని రాము నిఖిల్ తో సంతోషంగా అన్నాడు.
6. “మా ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది” అని మేరి రమణతో అంది.
జవాబు:
తమ ఇల్లు చాలా విశాలంగా ఉంటుందని మేరి రమణతో అంది.
7. “మా అన్నయ్య కవితలు బాగా రాస్తాడు” అంది సుమ రమతో.
జవాబు:
తన అన్నయ్య కవితలు బాగా రాస్తాడని సుమ రమతో అంది.
8. “మా చెల్లెలు బాగా పాటలు పాడుతుంది” అన్నాడు రమేష్.
జవాబు:
తన చెల్లెలు బాగా పాటలు పాడుతుందని రమేష్ అన్నాడు.
9. “నేను మా తమ్ముడితో ఆటలు ఆడను” తెగేసి చెప్పింది వాణి.
జవాబు:
తాను తమ తమ్ముడితో ఆటలు ఆడనని వాణి తెగేసి చెప్పింది.
10. “మా అబ్బాయి చదరంగం బాగా ఆడతాడు” చెప్పింది గిరిజ నీరజతో.
జవాబు:
తమ అబ్బాయి చదరంగం బాగా ఆడతాడని గిరిజ నీరజతో చెప్పింది.
9th Class Telugu 2nd Lesson స్వభాష రచయిత పరిచయం
పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారు 11.2.1865లో రాజమండ్రి – సీతానగరంలో 1 జన్మించారు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ, వేంకటరమణయ్య. ఉన్నత విద్య వరకూ | రాజమండ్రిలోనే విద్యాభ్యాసం చేశారు. బళ్ళారి జిల్లాలోని ఆనెగొంది సంస్థానంలో దివానుగా | కొంతకాలం చేసి, తరువాత పిఠాపురం సంస్థానంలో ఆస్థానకవిగా స్థిరపడ్డారు.
సారంగధర, ప్రచండ చాణక్యము, విప్రనారాయణ, కంఠాభరణం, పూర్ణిమ, సరస్వతి, సరోజని, సాక్షి మొ||వి వీరి ప్రసిద్ధ రచనలు. వీరి శైలి అద్భుతమైన గ్రాంథిక భాషా ప్రవాహంతో | సున్నితమైన వ్యంగ్యంతో, చురుక్కుమనే హాస్యంతో అలరారుతుంది.
సమకాలీన సమస్యలపై తీవ్రంగా స్పందించి, సంఘ సంస్కరణకు నడుం కట్టి, తన రచనల ద్వారా ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించిన పానుగంటివారు చిరస్మరణీయులు. వారి రచనలు ఈనాటి పరిస్థితులకు కూడా అద్దం పడుతున్నాయి. వీరు 1-1-1940 న పరమపదించారు.
కఠిన పదాలకు అర్థాలు
1వ పేరా :
హరహరా = ఈశ్వరా ! ఈశ్వరా !
శంభూ = ఓ శివా !
భ్రమపడితిని = భ్రాంతి చెందితిని
ఆంధ్ర మాతాపితలు = తెలుగువారైన తల్లిదండ్రులు
ఉద్భవించి = పుట్టి
అభ్యసించి = నేర్చి
అమూల్య + అలంకారములు = విలువ కట్టరాని అలంకారాలు
అర్పించి = ఇచ్చి
ఆచరించి = చేసి
అంగములు = అవయవాలు
అసువులు = ప్రాణాలు
పాసి = విడిచి
పరమ పదము = వైకుంఠము లేక కైలాసము
తాత్కాలికోన్మాదము (తాత్కాలిక + ఉన్మాదము) = అప్పుడు మాత్రమే ఉండిన వెఱ్ఱి
చెవులు చిల్లులుపడు = పెద్ద ధ్వనిచే చెవులు చిల్లులు పడినట్లగుట
2వ పేరా :
ఆలాప కలాపము = మాటల సమూహం
సాయించిన = చెప్పిన
శ్రీ సూక్తి = మంగళకరమైన నీతివాక్యము
ఆస్యగహ్వరము = గుహ వంటి నోరు
అవతరించిన = పుట్టిన
ఆగమ సూత్రము = వేద సూత్రం
వచింపదగినది = చెప్పదగినది
అగ్రాసనాధిపతి (అగ్ర + ఆసన + అధిపతి) = అధ్యక్షుడు
ఆంగ్లేయ భాషా పండిత + అగ్రణులు = ఇంగ్లీషు భాషా పండితులలో శ్రేష్ఠుడు
వక్తృ, వావదూకతా వైభవము = మాటలాడే వ్యక్తి యొక్క ఉపన్యాస వైభవం
కబళించి = ముద్దగా మ్రింగి
కడతేఱ్ఱి = కృతార్థులయి
కాలాంబర కవచధారి = నల్లని వస్త్రాన్ని కవచంగా ధరించినవాడు (నల్లకోటు ధరించిన వకీలు)
కర్కశ తర్క వాగ్వాహినీ = కఠినమైన తర్కవాక్కుల ప్రవాహం
మోహినీకరణ దక్షులు = ‘మోహింపజేయడంలో సమర్థులు
వాగ్దోరణీ ధీరులు = మాట్లాడే తీరులో గొప్పవారు
అనవరత శ్రవణము = ఎల్లప్పుడూ వినడం
మనుజుడు = మనిషి
వాయునీరాహారపారణము = గాలిని, నీటినీ ఆహారంగా తినడం
ఒనర్చినవాడు = చేసినవాడు
అవిశ్వసనీయము = నమ్మదగనిది
3వ పేరా :
అనిష్టత = ఇష్టము లేకపోవడం
శిలాక్షరము (శిల + అక్షరము) = రాతిపై చెక్కిన అక్షరం (శాశ్వతం)
ఆంగ్లేయ తేజస్సు = ఇంగ్లీషు ప్రకాశం
అకార్యకరణము = చేయరాని పనిని చేయడం
మకరంద, బిందు, బృంద, రస = పూదేనె, బిందువుల యొక్క సమూహం యొక్క రసం
స్యందన మందరము = స్రవించే మందారము అనే కల్పవృక్షం
మాతృభాష = తల్లి భాష
పరిత్యజించి = విడిచి
పఠించినవారు = చదివినవారు
మాన్యములు = శ్రీమంతులు పన్నులు లేకుండా గౌరవం కోసం పూజ్యులకు ఇచ్చే పొలాలు
వ్యయపఱచి = ఖర్చు చేసి
చిత్తక్లేశము = మనస్సునకు కష్టం
సౌలభ్యము = సులభత్వము
గ్రంథజ్ఞాన శూన్యుడు = పుస్తక జ్ఞానం లేనివాడు
సాబాలు = సగము
అర్ధశతాబ్దము = ఏబది సంవత్సరాలు
అలవడినది = అబ్బినది
భాషోచ్చారణ (భాషా + ఉచ్చారణ) = భాషను పలుకుట
సౌష్ఠవము = నిండుదనం
విశేషజ్ఞులము = బాగా తెలిసినవారం
ఉపజ్జా సహితములు = ఇతరుల ఉపదేశం లేకుండానే, మొట్టమొదటనే కలిగే జ్ఞానము ‘ఉపజ్ఞ’ – దానితో కూడినవి.
వాగ్దోరణులు = మాటతీరులు
చిలుక పలుకులు = సొంతముగా ఆలోచింపక పలుకు మాటలు
ఒరిజినాలిటీ (originality) = ఉపజ్ఞ, నవీన కల్పనాశక్తి
ధీమంతులు = బుద్ధిమంతులు
వ్యాసపీఠాధిపత్యము = వ్యాసరచన పీఠానికి అధికారిత్వము
4వ పేరా :
ఈనాము = బహుమానంగా ఇచ్చిన భూభాగం, మాన్యం
దైన్యపడి = దీనత్వమును పొంది
5వ పేరా :
ఉభయభ్రష్టము = రెండిటికీ చెడినది
6వ పేరా :
కంఠోక్తి (కంఠ + ఉక్తి) – = గట్టిగా చెప్పడం
అనర్హవాక్యము = తగని మాట
అనుచిత వాక్యము = ఉచితము కాని మాట
నిస్సందేహము = సందేహము లేకుండా
అవకతవక = అసందర్భం
7వ పేరా :
ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ = ఆస్తులను బదలాయించే చట్టం
యథార్థము (యథా + అర్థము) = సరియైనది
రవంత (రవ + అంత) = రేణువు అంత
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ = నేరాలకు శిక్షించు విధిని నిర్ణయించు గ్రంథం
8వ పేరా:
ఎవిడన్సు యాక్ట్ = సాక్ష్య చట్టం
లేటెస్టు ఎడిషన్ = కడపట అచ్చువేసిన ప్రతి
జడ్జిమెంటు = తీర్పు
9వ పేరా :
అధిక్షేపించు = ఆక్షేపించు
ప్రశస్తము = మేలయినది
వన్నెపెట్టుట = మెఱుగు పెట్టుట
అక్కఱములు = అక్షరములు
ఉపచరింపదలచితివి = సేవింపదలచితివి
బాయ్ ! రూములోనున్న పాట్ లో = అబ్బాయీ ! గదిలోని కుండలో
రైస్ = బియ్యం
క్రైండ్లీ గెటిట్ హియర్ = దయతో ఇక్కడకు వాటిని తెండి
థాంక్ యూ ఇన్ ఆంటిసిపేషన్ = ముందుగా కృతజ్ఞతలు
10వ పేరా:
డియర్ ఫ్రెండ్ = ప్రియమైన స్నేహితుడా !
యువర్సు ట్రూలీ = మీ విశ్వసనీయమైన
అక్కఱ = అవసరం
తదేకదృష్టి (తత్ + ఏక దృష్టి) = అది ఒక్కటే చూపు
మెదటిలో = మెదడులో
పదిలపటపుడు = స్థిరపరచండి