SCERT AP 9th Class Biology Guide Pdf Download 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Biology 4th Lesson Questions and Answers ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక
9th Class Biology 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
కణాలలోని, బయటకు పదార్థాల కదలికలను నియంత్రించే నిర్మాణం (AS 1)
ఎ) కణకవచం
బి) కణత్వచం
సి) రెండూ
డి) పైవేవీ కావు
జవాబు:
బి) కణత్వచం
ప్రశ్న 2.
ఖాళీలను పూరించండి. (AS 1)
ఎ) పువ్వుల పరిమళం మనకు చేరే ప్రక్రియ …………..
బి) భోపాల్ విషాధంలో MIC అను వాయువు నగరమంతా వ్యాపించిన పద్ధతి
సి) పొటాటో ఆస్మోమీటర్ లోనికి నీరు ………………. పద్ధతి ద్వారా ప్రవేశిస్తుంది.
డి) తాజా ద్రాక్ష ఉప్పు నీటిలో ఉంచినప్పుడు కృశించుటకు కారణం. ………………
జవాబు:
ఎ) వ్యాపనం
బి) వ్యాపనం
సి) ద్రవాభిసరణం
డి) ద్రవాభిసరణం
ప్రశ్న 3.
త్వచానికి ఉండే పారగమ్య స్వభావం అంటే ఏమిటి? సరైన ఉదాహరణలతో వివరించండి. (AS 1)
జవాబు:
ద్రావితాలు, ద్రావణిని తమ గుండా ప్రసరింపనీయడాన్ని పారగమ్యత అంటారు.
ఉదాహరణ :
- ప్లాస్మాపొర తన గుండా కార్బన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్ మరియు క్రొవ్వులో కరిగే ఆల్కహాలు, ఈథర్ మరియు క్లోరోఫామ్ లను తన గుండా పోవటానికి అనుమతి ఇస్తుంది.
- ప్లాస్మాపొర తన గుండా పాలిసాకరైడ్లు, ఫాస్ఫోలిపిడ్లు మరియు ప్రోటీనులను తనగుండా పోవడానికి అనుమతి ఇవ్వదు.
ప్రశ్న 4.
ఎండిన కూరగాయలు మంచినీటిలో ఉంచినపుడు తాజాగా తయారవుతాయి. కారణమేమి? (AS 1)
జవాబు:
- ఎండిన కూరగాయలందు నీరు తక్కువగా ఉంటుంది మరియు లవణాల గాఢత ఎక్కువగా ఉంటుంది.
- ఎండిన కూరగాయలను మంచినీటిలో ఉంచినపుడు అవి నీటిని గ్రహించి తాజాగా మారతాయి.
- మంచినీటిలో కూరగాయలను ఉంచినపుడు ద్రవాభిసరణ ప్రక్రియ జరిగి కూరగాయలలోనికి నీరు ప్రవేశిస్తుంది.
ప్రశ్న 5.
సముద్రపు నీటి నుండి మంచి నీటిని పొందే విధానం ఏది? (AS 1)
జవాబు:
వ్యతిరేక ద్రవాభిసరణము ద్వారా సముద్రపు నీటి నుండి మంచినీటిని పొందుతాము.
ప్రశ్న 6.
సముద్రపు చేపను మంచినీటి ఎక్వేరియమ్ లో ఉంచితే ఏమవుతుంది? (AS 2)
జవాబు:
సముద్రపు చేపను మంచినీటి ఎక్వేరియమ్ లో ఉంచితే చనిపోతుంది.
కారణాలు :
- సముద్రపు చేప శరీరము నందు లవణాలు ఎక్కువ గాఢతలో ఉంటాయి.
- సముద్రపు చేపను మంచినీటి ఎక్వేరియమ్ లో ఉంచినపుడు చేప శరీరములోనికి నీరు ద్రవాభిసరణము ద్వారా ప్రవేశిస్తుంది.
- ఎక్కువ మొత్తంలో నీరు చేప శరీరంలోనికి ప్రవేశించడం వలన కణములు ఉబ్బి పగిలిపోతాయి. చేప చనిపోతుంది.
ప్రశ్న 7.
డాక్టర్లు (ఉప్పునీటి ద్రావణం) సెలైనను మాత్రమే రక్తంలోకి ఎక్కిస్తారు. మంచినీరు కాదు. ఎందుకో రాయండి. (AS 2)
జవాబు:
- మంచి నీటిని సిరలోనికి ఎక్కించినపుడు దాని వలన కొద్దిమేర ‘కణముల విచ్ఛిన్నము జరుగుతుంది.
- ఎర్ర రక్తకణములు సాధారణముగా నీటిచేరిక వలన విచ్చిన్నం చెందుతాయి.
- ఎక్కువ మొతంలో శరీరంలోనికి మంచినీటిని ఎక్కించినపుడు ఎర్రరక్త కణములు విచ్చిన్నం అవటం మాత్రమే కాకుండా మెదడుకు నష్టం జరగటం, గుండె ఆగిపోవటం జరిగి మనిషి చనిపోవచ్చు.
- అందువలన డాక్టర్లు సరిపోయినంత మొత్తంలో గల ద్రవపదార్ధములు అనగా సెలైనును మాత్రమే రక్తంలోకి ఎక్కిస్తారు.
ప్రశ్న 8.
మన రక్తంలోకి అంతర సిరల ద్వారా 50% గ్లూకోజ్ ద్రావణాన్ని నేరుగా ఎక్కిస్తే ఏమవుతుంది? (AS 2)
జవాబు:
- 50% గ్లూకోజ్ ద్రావణాన్ని డెక్టోజ్ అంటారు. దీనిని మెదడు, వెన్నెముక సంబంధం గల ఒత్తిడిని తగ్గించడానికి మరియు శరీర అంతరభాగాలలో ద్రవపదార్థం చేరికను తగ్గించడానికి ఉపయోగిస్తారు.
- అంతర సిరల’ ద్వారా 50% గ్లూకోజ్ ద్రావణాన్ని నేరుగా ఎక్కిస్తే కొంతమందిలో ఇది వేదనాత్మకతను (ఎలర్జీ) కలిగిస్తుంది.
- వేదనాత్మక చర్యలు అనగా నాడులు ఉత్తేజం చెందడం, కీళ్ళ వద్ద వ్యాధి సోకటం, అవయవాలలోని కణజాలములు చనిపోవటం, వ్యాధిసోకిన భాగము వరకు సిరలందు రక్తం గడ్డకట్టడం మొదలైనవి.
- అందువలన గాఢత గల 50% గ్లూకోజ్ (డెక్టోజ్) ద్రావణాన్ని నీటికి కలిపి పలుచగా చేసిన తరువాత సిరగుండా ఎక్కించాలి.
ప్రశ్న 9.
పారగమ్యత సామర్థ్యం కణాలకి లేకపోతే ఏమవుతుంది? (AS 2)
జవాబు:
- కణములకు పారగమ్యత సామర్థ్యం లేకపోయినట్లయితే, అవి ముఖ్యమైన జీవక్రియలను నిర్వహించలేవు.
- ఆక్సిజన్, గ్లూకోజ్, విటమినులు, క్రొవ్వులు కణమునకు అందకపోయినట్లయితే కణములు జీవక్రియలను జరపలేవు.
- పరిపక్వం చెందిన కణములకు పారగమ్యత సామర్థ్యం లేకపోయినట్లయితే విషపదార్ధములు పేరుకొనిపోతాయి. తద్వారా కణం నశించిపోతుంది.
ప్రశ్న 10.
వ్యాపనం గురించి తెలుసుకోవడానికి నీవు చేసిన ప్రయోగంలో నీవు గమనించిన దేమిటి? (AS 3)
జవాబు:
గమనించిన విషయాలు :
- ద్రవ, వాయుపదార్థాలలో వ్యాపనం జరుగుతుంది.
- ఎక్కువ గాఢత నుండి తక్కువ గాఢతకు పదార్థాలు కదలడం వలన వ్యాపనం జరుగుతుంది.
- వ్యాపనమనేది భౌతిక చర్య.
- గాలి లేదా నీరు లాంటి మాధ్యమంలో కొన్ని పదార్థాలను ఉంచినప్పుడు అవి ఆ మాధ్యమంలో సమానంగా విస్తరించడాన్ని వ్యాపనం (diffussion) అంటారు.
ప్రశ్న 11.
మీ స్నేహితులతో చర్చించి వ్యాపనం జరిగే సందర్భాల జాబితా రాయండి. (AS 4)
జవాబు:
- మా స్నేహితుడు రాసుకొచ్చిన సెంటు వాసన తరగతి గది అంతయూ వ్యాపిస్తుంది.
- మధ్యాహ్న భోజన సమయంలో మా స్నేహితురాలి క్యారేజిలో నుండి వచ్చిన మసాలా కూరవాసనను మేమందరం ఆస్వాదించాము.
- సాయంత్రం ఇంటికి వెళ్ళే సమయంలో మురికి కాలువ నుండి వచ్చిన దుర్గంధమును పీల్చలేకపోయాము.
- రాత్రికి మా ఇంటిలో దేవుని వద్ద వెలిగించిన అగరుబత్తి వాసన ఇల్లంతా వ్యాపించినది.
- మా వీధిలో వెళుతున్న పెళ్ళి ఊరేగింపునకు ముందు కాల్చిన బాణాసంచా వాసన మా వీధి అంతయూ వ్యాపించినది.
ప్రశ్న 12.
మీరు కోడిగుడ్డును ఉపయోగించి చేసిన ప్రయోగాన్ని వివరించే దశలను తెలిపే ఫ్లోచార్ట్ గీయండి. (AS 5)
జవాబు:
ప్రశ్న 13.
మీరు ఒక కొబ్బరికాయను కొన్నారు. దానిని ఊపినప్పుడు నీరు నిండుగా లేదని తెలిసింది. కొబ్బరికాయలోనికి రంధ్రం చేయకుండా నీరు నింపగలరా? ఎలా? (AS 6)
జవాబు:
- రంధ్రము చేయకుండా కొబ్బరికాయలోనికి నీరును నింపలేము.
- కొబ్బరికాయను నీళ్ళలో ఉంచినప్పటికి ద్రవాభిసరణం ద్వారా నీరు దానిలోనికి ప్రవేశించదు.
- కొబ్బరికాయ పెంకు నిర్జీవ కణములయిన దృఢ కణజాలముతో నిర్మితమైనది.
- నిర్జీవ కణాలలో ద్రవాభిసరణక్రియ జరుగదు.
- అందువలన కొబ్బరికాయకు రంధ్రము చేయకుండా నీరు నింపలేము.
ప్రశ్న 14.
నిత్య జీవితంలో వ్యాపనాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటావు? (AS 7)
జవాబు:
- గదిలో సిగరెట్ తాగినపుడు పొగ అణువులు గది అంతా వ్యాపించి వాసన కలుగచేస్తాయి.
- పంచదార స్ఫటికములను నీరు కలిగిన గ్లాసులో ఉంచిన పంచదార అణువులు వ్యాపనం ద్వారా నీరు అంతా వ్యాపిస్తాయి.
- బేకింగ్ పదార్థములను వండుతున్నప్పుడు ఇల్లంతా వాసన రావటానికి కారణం వ్యాపనం.
- తేయాకు సంచినందలి వర్ణద్రవ్యములు వ్యాపనం ద్వారా కరిగి నీటికి రంగును, రుచిని ఇస్తాయి.
- గాలిని శుభ్రపరిచే డియోడరెంట్ నందలి అణువులు వ్యాపనము ద్వారా గాలిలోనికి ప్రవేశిస్తాయి.
- వంటచేయడానికి ఉపయోగించే వాయువు సిలిండర్ నుండి బయటకు వచ్చిన గది నిండా వ్యాపనం ద్వారా చేరుతుంది.
- సోడానందలి కార్బన్ డై ఆక్సెడ్ వ్యాపనము ద్వారా బయటకు రావటం వలన సోడా నీరు కదలకుండా ఉంటుంది.
- అగర్బత్తీ, దోమల నివారణ మందులు వ్యాపన సూత్రంపై పనిచేస్తాయి.
ప్రశ్న 15.
నిత్యజీవితంలో ద్రవాభిసరణ జరిగే 3 సన్నివేశాలను తెలపంది. (AS 7)
జవాబు:
- మొక్కల వేర్లలోనికి నీరు ద్రవాభిసరణ ద్వారా చేరుతుంది.
- కణాల మధ్య నీరు ప్రవహించడానికి కారణం ద్రవాభిసరణం.
- పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరచుకోవడం ద్రవాభిసరణ వల్ల జరుగుతుంది.
- ద్రవాభిసరణం మొక్కలలో నీరు, లవణాల కదలికలకు సహాయపడుతుంది.
- రక్తంలో మలినాలు వడపోయడానికి ద్రవాభిసరణం అవసరం.
- మన శరీరానికి కావలసిన నీరు మరియు లవణాలు పునఃశోషణం చేసుకోవడానికి ద్రవాభిసరణం ఉపయోగపడుతుంది.
- వాడిపోయిన క్యారెట్ ను నీటిలో ఉంచిన, ద్రవాభిసరణ ద్వారా నీరు ప్రవేశించి క్యారెట్ తాజాగా అవుతుంది.
9th Class Biology 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక Textbook Activities (కృత్యములు)
కృత్యం – 1
1. కణంలోకి వచ్చేవి బయటకు పోయేవి.
పట్టికలో ఇచ్చిన పదార్థాల జాబితాను చూచి కణం లోపలికి ప్రవేశించే పదార్థాలను, కణం బయటకు వెళ్ళే పదార్థాలను (✓) తో గుర్తించండి.
జవాబు:
పదార్థం | కణంలోకి ప్రవేశిస్తుంది | కణం బయటకు వెళుతుంది |
ఆక్సిజన్ | ✓ | |
గ్లూకోజ్ | ✓ | |
ప్రోటీన్లు | ✓ | |
కొవ్వులు | ✓ | |
విటమిన్లు | ✓ | |
ఖనిజ లవణాలు | ✓ | |
కార్బన్ డై ఆక్సైడ్ | ✓ | |
వ్యర్థాలు | ✓ |
ప్రయోగశాల కృత్యము
2. గాఢతల పరిశీలన :
వివిధ ద్రావణాల గాఢతను పరిశీలించు విధమును రాయండి.
(లేదా)
మీకు బీకరు, ఎండుద్రాక్ష, చక్కెర, నీరు అందిస్తే వీటితో ద్రవాభిసరణను ఎలా చూపిస్తావు?
జవాబు:
ఎ) ఉద్దేశం : నీటిలో వేసిన ఎండు ద్రాక్షను పరిశీలించుట
పదార్థాలు / పరికరాలు : 1) బీకరు 2) కుళాయి నీరు 3) ఎండు ద్రాక్ష
విధానం:
- ఒక బీకరులో 100 మి.లీ నీరు తీసుకొని దానిలో ఎండు ద్రాక్ష వేయాలి.
- ఒక గంట తరువాత ఎండు ద్రాక్షను బయటకు తీసి మామూలు ఎండు ద్రాక్షతో పోల్చాలి.
పోలిక :
మామూలు ఎండు ద్రాక్ష కంటె నీటి నుండి బయటకు తీసిన ద్రాక్ష పరిమాణము పెద్దదిగా ఉన్నది.
బి) ఉద్దేశం : సంతృప్త చక్కెర ద్రావణంలో ఉంచిన తాజాద్రాక్షను పరిశీలించుట.
పదార్థాలు / పరికరాలు :
1) బీకరు 2) కుళాయి నీరు 3) చక్కెర 4) తాజా ద్రాక్ష.
విధానం:
- 100 మి.లీ. చక్కెర ద్రావణాన్ని బీకరులో తీసుకొని అందులో తాజా ద్రాక్ష పండును వేయాలి.
- ఒక రాత్రి అంతా ఉంచి తెల్లవారగానే ద్రాక్షను తీసి పరిశీలించాలి.
గమనిక : తాజా ద్రాక్ష పరిమాణము తగ్గి ముడుచుకుపోయినది.
పరిశీలనలు:
- మొదటి ప్రయోగములో నీరు బీకరులో నుండి ఎండుద్రాక్షలోనికి ప్రవేశించినది.
- రెండవ ప్రయోగములో తాజా ద్రాక్ష నుండి నీరు బీకరులోనికి వెళ్తుంది.
నిర్ధారణ :
పై రెండు ప్రయోగములలో ద్రాక్ష త్వచంలోని కణాలు నీటిని లోపలికి మరియు బయటకు వెళ్ళడానికి సహకరించినవి.
ప్రయోగశాల కృత్యము
3. ద్రవాభిసరణం (Osmosis) :
ద్రవాభిసరణను నిరూపించుటకు ఒక ప్రయోగమును వివరింపుము.
(లేదా)
ద్రవాభిసరణంను నిరూపించడానికి మీరు ప్రయోగశాలలో కృత్యం నిర్వహించారుగదా! క్రింది అంశాలను వివరించండి.
a) కావలసిన పదార్థాలు
b) తీసుకోవలసిన జాగ్రత్తలు
c) ప్రయోగ విధానం
d) ఫలితం
జవాబు:
ఉద్దేశం : బంగాళాదుంపను ఉపయోగించి ద్రవాభిసరణను నిరూపించుట.
కావల్సిన పదార్థాలు :
1) తాజా బంగాళాదుంప 2) ఉడికించిన బంగాళాదుంప 3) రెండు బీకర్లు లేదా కప్పులు 4) రెండు గుండు సూదులు 5) నీరు 6) పదునైన కత్తి 7) చక్కెర ద్రావణం.
ప్రయోగ విధానం (లేదా) పద్ధతి :
- తాజా దుంపను తీసికొని పై పొట్టును తొలగించి దానిని తొట్టి లేదా కప్పు గిన్నె మాదిరిగా తయారుచేయాలి.
- తయారుచేసిన చక్కెర ద్రావణాన్ని బంగాళాదుంప కప్పు లేదా తొట్టియందు పోయాలి.
- చక్కెర ద్రావణ మట్టమును సూచిస్తూ గుండుసూది గుచ్చాలి.
- బంగాళాదుంప కప్పు లేక తొట్టిని బీకరులో ఉంచాలి.
- బీకరులో బంగాళాదుంప తొట్టి లేదా కప్పు సగం వరకు వచ్చేటట్లు నీరు నింపి అది మునగకుండా, తేలకుండా జాగ్రత్త తీసుకోవాలి.
- ఈ అమరికను ఒక అరగంట పాటు కదిలించకుండా ఉంచి పరిశీలించాలి.
పరిశీలన:
బంగాళాదుంప కప్పు లేదా గిన్నెలోనికి బీకరులోని నీరు ప్రవేశించుట వలన చక్కెర ద్రావణమట్టం పెరుగుతుంది. పద్దతి : తరువాత బంగాళాదుంప కప్పులోనికి నీటిని, చక్కెర ద్రావణమును చక్కెర ద్రావణంలో బంగాళాదుంప గిన్నె బీకరులో ఉంచి అరగంట తరువాత పరిశీలించాలి. పరిశీలన : బంగాళాదుంప కప్పులోని నీరు బీకరులోనికి ప్రవేశించడం వల్ల క్రమేపి నీటిమట్టము తగ్గుతుంది.
నిర్ధారణ:
- పై రెండు సందర్భాలలోను నీరు చక్కెర ద్రావణం వైపు ప్రవహిస్తుంది. ఈ ప్రక్రియను ద్రవాభిసరణం అంటారు.
- ఈ ప్రక్రియలో నీరు తక్కువ గాఢత నుండి ఎక్కువ చక్కెర గాఢతవైపు బంగాళాదుంప పొర ద్వారా ప్రయాణిస్తుంది.
కృత్యం – 2
4. వడపోత:
వడపోత ప్రక్రియను ప్రయోగం ద్వారా వివరింపుము.
జవాబు:
ఉద్దేశం : వడపోత జరిగే విధానమును నిరూపించుట.
కావలసిన పదార్థాలు / పరికరాలు : రెండు బీకర్లు, ఒక గరాటు, వడపోత కాగితం, రిటార్ట్ స్టాండు, చక్కెర, అయోడిన్, గోధుమపిండి లేదా వరిపిండి.
ప్రయోగ విధానం:
- ఒక రిటార్టు స్టాండునకు వడపోత కాగితమును అమర్చిన గరాటును బిగించాలి.
- గరాటు కింద బీకరును ఉంచాలి.
- 100 మి.లీ. నీటికి ఒక చెంచాడు గోధుమపిండి లేదా వరిపిండి కలిపి ద్రావణం తయారుచేయాలి.
- ఈ ద్రావణానికి ఒక చుక్క టింక్చర్ అయోడినను కలిపి వడపోయాలి.
పరిశీలన :
- వడపోత ద్వారా నీరు మరియు నీటిలో కరిగిన పిండి గరాటు కింద గల బీకరులోనికి చేరుతుంది.
- వడపోత కాగితం నీటిలో కరగని పిండిని తనగుండా ప్రయాణించడానికి అనుమతి ఇవ్వలేదు. పిండి అవక్షేపము వడపోత కాగితము మీద ఏర్పడినది.
కృత్యం – 3
5. బాహ్య ద్రవాభిసరణం మరియు అంతర ద్రవాభిసరణ ప్రక్రియలను ప్రయోగపూర్వకముగా నిరూపించుము.
జవాబు:
ఉద్దేశం : బాహ్య మరియు అంతర ద్రవాభిసరణలను నిరూపించుట.
కావలసిన పదార్థాలు : మూడు బీకర్లు, పెట్రెడిష్, ఉప్పు, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, రెండు సమాన పరిమాణంలో ఉన్న పచ్చి గుడ్లు, తుడవడానికి గుడ్డ, గుడ్డు చుట్టుకొలత కొలవడానికి సన్నని పొడవైన కాగితం, ఒక చెమ్చా.
పద్ధతి / ప్రయోగ విధానం :
- గుడ్లను సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో నాలుగు నుండి ఐదుగంటల పాటు ఉంచాలి.
- గుడ్లను చెమ్చాతో బయటకు తీయాలి. గుడ్డుపైన ఉండే కాల్షియం కార్బొనేట్ తో తయారైన పెంకు కరిగిపోతుంది.
- గుడ్లను కుళాయి కింద నీటిలో కడగాలి.
- గుడు చుట్టు సన్నని కాగితం చీలికను చుట్టి పెన్సిల్ లేదా పెన్నుతో గుర్తించి గుడ్ల చుట్టుకొలతను కొలవాలి.
- ఒక బీకరులో గాఢమైన ఉప్పునీటి ద్రావణాన్ని తయారు నీటితో కడగడం చేయాలి.
- రెండు గుడ్లలో ఒకదాన్ని మంచినీరు ఉన్న బీకరులోను, HCl లో ఉంచిన గుడ్డు రెండవ దాన్ని ఉప్పునీటి ద్రావణంలోను ఉంచాలి.
- బీకర్లను రెండు నుండి నాలుగు గంటల పాటు కదపకుండా అలాగే ఉంచాలి.
- గుడ్లను బయటకు తీసి తుడిచి వాటి చుట్టుకొలతను కాగితంతో కొలవాలి. దానిని నమోదుచేయాలి.
పరిశీలన :
ఉప్పు నీటి ద్రావణంలో ఉంచిన గుడ్డు కృశించుకుపోయినది. మంచినీటిలో ఉంచిన గుడు ఉబ్బియున్నది.
నిర్ధారణ :
- ఉప్పు నీటి ద్రావణంలో ఉంచిన గ్రుడు నుండి నీరు బాహ్యద్రవాభిసరణం వలన బయటకు పోతుంది.
- మంచి నీటిలో ఉంచిన గుడ్డు లోపలికి నీరు అంతర ద్రవాభిసరణ వలన వస్తుంది.
ప్రయోగశాల కృత్యము
6. పాక్షిక పారగమ్య త్వచాన్ని తయారుచేద్దాం :
పాక్షిక పారగమ్య త్వచాన్ని తయారుచేసి దాని సహాయముతో ద్రవాభిసరణమును నిరూపించండి.
(లేదా)
ఉడకబెట్టని కోడిగుడ్డు నుండి పాక్షిక పారగమ్య త్వచాన్ని ఎలా తయారుచేస్తావు?
జవాబు:
పాక్షిక పారగమ్య త్వచమును తయారుచేయుట :
- రెండు గుడ్లను తీసికొని వాటిని సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో నాలుగు నుండి ఐదుగంటల సేపు ఉంచాలి.
- గుడ్ల పైన ఉండే కాల్షియం కార్బొనేట్ తో తయారయిన ‘పెంకు కరిగిపోతుంది.
- గుడ్లను బయటకు తీసి కుళాయి నీటితో కడగాలి.
- పెంకు కరిగిన గుడ్లకు జాగ్రత్తగా పెన్సిల్ పరిమాణంలో ఉండే రంధ్రం చేయాలి. లోపలి పదార్థం అంతటినీ రంధ్రం ద్వారా నెమ్మదిగా బయటకు తీసివేయాలి.
- సంచిలాగా కనిపించే గుడ్ల పొర లోపలి భాగాన్ని నీటితో శుభ్రంగా కడగాలి.
- పారగమ్య త్వచాలు వాడటానికి సిద్ధంగా ఉన్నవి. ఇవి పాక్షిక పారగమ్యత్వచాలు.
కోడిగుడ్డు పారగమ్య త్వచంతో ద్రవాభిసరణ ప్రయోగము :
ఉద్దేశం : పారగమ్య త్వచం ఉపయోగించి ద్రవాభిసరణమును నిరూపించుట.
కావలసిన పదార్థాలు / పరికరాలు : రెండు గుడ్లు పొరలు, మూడు బీకర్లు, చక్కెర, నీరు, దారం, కొలజాడి, సిరంజి.
ప్రయోగ విధానం :
- గుడ్డు పొర సంచిని తీసుకొని సిరంజి సహాయంతో 10 మి.లీ. సంతృప్త చక్కెర ద్రావణంతో నింపాలి.
- పొరకు ఉన్న రంధ్రాన్ని దారంతో కట్టాలి. 100 మి.లీ. నీటిని ఒక బీకరులో పోయాలి.
- చక్కెర ద్రావణం ఉన్న గుడ్డు పొర సంచిని బేకరులో ఉంచాలి.
- ఒక రాత్రి పూర్తిగా దానిని అలాగే వదలివేయాలి.
- సిరంజి సహాయంతో 10 మి.లీ. మంచినీటిని రెండవ గుడ్లు పొర సంచిలో నింపాలి.
- 100 మి.లీ. సంతృప్త చక్కెర ద్రావణాన్ని కొలజాడీతో కొలిచి బీకర్లో పోయాలి.
- ఈ అమరికను ఒక రాత్రి పూర్తిగా కదలించకుండా వదలివేయాలి.
- రెండవ రోజు గుడ్ల పొర సంచులను బయటకు తీసి వాటిలోపలి ద్రవాలను కొలిచి పరిశీలించాలి.
పరిశీలనలు:
- మొదటి కృత్యములో చక్కెర ద్రావణం నింపిన కోడిగుడ్డు త్వచములోనికి నీరు ప్రవేశించుట వలన నీటి పరిమాణము పెరిగినది.
- రెండవ కృత్యములో గుడ్డు పొర సంచి నుండి నీరు బీకరులోనికి ప్రవేశించుట వలన సంచి నందు నీటి పరిమాణం తగ్గినది.
నిర్ధారణ :
కోడిగుడ్డు త్వచం ద్వారా నీరు తక్కువ గాఢత గల ప్రదేశం నుండి ఎక్కువ గాఢత గల ద్రవంలోనికి ప్రయాణించినది. ఈ పద్ధతిని ద్రవాభిసరణం అంటారు.
కృత్యం – 4
7. కాఫీ పొడితో వ్యాపనం
కాఫీ పొడిని ఉపయోగించి వ్యాపనమును పరిశీలించుము. పరిశీలనలను రాయుము.
జవాబు:
- చిన్న గిన్నెలో నీరు తీసుకోవాలి.
- కాఫీ పొడిని చిన్న ఉండగా తయారుచేయాలి.
- కాఫీ పొడి ఉండను నెమ్మదిగా నీటిలో జారవేయాలి.
- కాఫీ పొడి ఉండ బీకరు అడుగుకు చేరిన తర్వాత బీకరును కదపకుండా ఉంచి పరిశీలించాలి.
పరిశీలనలు:
- కాఫీ పొడి అణువులు నీటిలో కరగడం మొదలవుతాయి.
- స్ఫటికాల చుట్టూ ఉన్న నీరు మిగిలిన నీటికన్నా గాఢమైన రంగులో ఉంటుంది.
- సమయం గడచిన కొద్దీ నీరు మొత్తం రంగు మారుతుంది.
- మొదట నీరు లేత రంగులో ఉండి చివరకు నీరంతా ఒకే రంగులోకి మారుతుంది. వ్యాపనము ద్వారా కాఫీ పొడి అణువులు నీరు అంతా ప్రసరించి చివరికి ఒకే రంగులోకి మారుతుంది.
కృత్యం – 5
8. నీటిలో పొటాషియం పర్మాంగనేటు స్పటికం వ్యాపనం చెందు విధమును రాయండి.
జవాబు:
- పొటాషియం పర్మాంగనేటు స్ఫటికం ఒకదాన్ని శ్రావణం సహాయంతో పెట్రెడిష్ మధ్యలో ఉంచాలి.
- జాగ్రత్తగా పెట్రిడిలో నీళ్ళు పోయాలి.
- నీటిలో పర్మాంగనేటు పింక్ రంగు విస్తరించడం ప్రతి నిమిషానికీ గమనించాలి.
- పెట్రెడిష్ మధ్య నుండి అంచుల వరకు వ్యాపించే విధమును పరిశీలించాలి.
పరిశీలనలు :
- పొటాషియం పర్మాంగనేటు స్పటికం నీటిలో కరగడం మొదలవుతుంది.
- స్పటికం చుట్టూ ఉన్న నీరు మిగిలిన నీటికన్నా గాఢమైన రంగులో ఉంటుంది.
- సమయం గడచిన కొద్దీ నీరు మొత్తం రంగు మారుతుంది.
- మొదట నీరు లేత రంగులో ఉండి చివరకు నీరంతా ఒకే రంగులోకి మారుతుంది.
విసరణము :
ఎక్కువ గాఢత గల ప్రదేశం నుండి పొటాషియం పర్మాంగనేటు అణువులు తక్కువ గాఢత గల ప్రదేశమయిన నీటిలోనికి సమానంగా వ్యాపించే ప్రక్రియ విసరణము.
కృత్యం – 6
9. కాపర్ సల్ఫేటు స్ఫటికంను నీటిలో ఉంచినపుడు విసరణ జరుగు ప్రక్రియను వివరించుము.
జవాబు:
- కాపర్ సల్ఫేట్ స్పటికం ఒక దానిని శ్రావణం సహాయంతో పెట్రేడిష్ మధ్యలో ఉంచాలి.
- జాగ్రత్తగా పెట్టాడిలో నీరు పోయాలి.
- నీటిలో కాపర్ సల్ఫేట్ నీలం రంగు విస్తరించడం ప్రతి నిమిషానికి గమనించాలి.
- పెట్రెడిష్ మధ్య నుండి అంచులవరకు వ్యాపించే విధమును పరిశీలించాలి.
పరిశీలనలు:
- కాపర్ సల్ఫేట్ స్పటికం నీటిలో కరగడం మొదలవుతుంది.
- స్పటికం చుట్టూ ఉన్న నీరు మిగిలిన నీటికన్నా గాఢమైన రంగులో ఉంటుంది.
- సమయం గడచిన కొద్దీ నీరు మొత్తం రంగు మారుతుంది.
- మొదట నీరు లేత రంగులో ఉండి చివరకు నీరంతా ఒకే రంగులోకి మారుతుంది.
విసరణము :
ఎక్కువ గాఢత గల ప్రదేశం నుండి కాపర్ సల్ఫేట్ అణువులు తక్కువ గాఢత గల ప్రదేశమయిన నీటిలోనికి సమానంగా విస్తరించే ప్రక్రియ.