AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 11 భూదానం Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Telugu Solutions 11th Lesson భూదానం
8th Class Telugu 11th Lesson భూదానం Textbook Questions and Answers
చదవండి – ఆలోచించండి – చెప్పండి
ప్రశ్నలు జవాబులు
ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరున్నారు? ఏం చేస్తున్నారు?
జవాబు:
చిత్రంలో గాంధీజీ, ఆయన అనుచరులూ, కాంగ్రెసు సేవాదళ్ కార్యకర్తలూ ఉన్నారు. వారు పాదయాత్ర చేస్తున్నారు.
ప్రశ్న 2.
వీళ్ళు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు?
జవాబు:
వీళ్ళు పార్టీ కార్యక్రమాలను ప్రజలలో ప్రచారం చేయడానికి, ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకోవడానికి, పాదయాత్ర చేస్తున్నారు.
ప్రశ్న 3.
ఇలా పాదయాత్రలు చేసినవారు మీకు తెలుసా? చెప్పండి.
జవాబు:
గాంధీజీ, వినోబా భావే, వంటి నాయకులు పాదయాత్రలు చేశారు. వెనుక, శంకరాచార్యులు, మహావీరుడు, బుద్ధుడు, కబీరు, చైతన్యుడు, నామ్ దేవ్ వంటి గురువులు కూడా పాదయాత్రలు చేశారు.
ఇవి చేయండి
I. వినడం – మాట్లాడడం
ప్రశ్న 1.
‘భూదానం’ అని పాఠం పేరును విన్నప్పుడు మీరేమి అనుకున్నారు?
జవాబు:
సామాన్యంగా పుణ్యం కోసం దానాలు చేస్తూ ఉంటారు. ఆ దానాల్లో దశదానాలు ముఖ్యం. ఆ పది దానాల్లో భూదానం ఒకటి. పెద్దలు చనిపోయినపుడు వారు స్వర్గానికి వెళ్ళడానికి బ్రాహ్మణులకు భూమిని దానం చేస్తారు. లేదా లక్షవర్తి వ్రతం, ఋషి పంచమీ వ్రతం వంటివి చేసినపుడు, పుణ్యం కోసం భూదానం చేస్తారు. ఈ విధంగా ఎవరో పుణ్యాత్ములు, భూదానం చేశారని భూదానం మాట విన్నప్పుడు అనుకున్నాను.
ప్రశ్న 2.
ఈ పాఠం ద్వారా మీరు గ్రహించినదేమిటి?
జవాబు:
గాలి మీద, నీటి మీద, వెలుగు మీద ప్రజలందరికీ సమాన హక్కు ఉన్నట్లే, భూమి మీద కూడా అందరికీ సమాన హక్కు ఉన్నదని గ్రహించాను.
ప్రశ్న 3.
‘భూ సమస్య చాలా పెద్దది’ అని వినోబా అన్నారు కదా ! ఇలా ఎందుకు అని ఉంటారు ? ఇది ఈనాటి పరిస్థితులలో కూడా ఇలాగే ఉందా? దీని మీద మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
మనదేశంలో కొందరి దగ్గర అంగుళం భూమి కూడా లేదు. కొందరి దగ్గర వందలాది వేలాది ఎకరాల భూమి ఉంది. భూమి కలవారు తక్కువ. లేని వారు ఎక్కువ. అందువల్ల భూ సమస్య చాల పెద్దది అని వినోబా అన్నారు.
ఈనాడు మనదేశంలో భూసంస్కరణలు అమలయ్యాయి. అందువల్ల ప్రతి వ్యక్తి వద్ద కూడా 28 ఎకరాల పల్లం భూమి, లేక 50 ఎకరాల మెట్ట భూమి మించి ఉండరాదు. ఇప్పుడు కూడా భూ సమస్య ఉంది. ఇల్లు కట్టుకొనే చోటు లేక పేదలు బాధపడుతున్నారు. కొందరు నాయకులు అక్రమంగా సెజ్ ల పేరుతో వేల ఎకరాల భూమిని ఆక్రమిస్తున్నారు.
II. చదవడం – రాయడం
1. కింది వాక్యాలు చదవండి. ఆ వాక్యాలకు సమానభావం వచ్చే వాక్యాన్ని గుర్తించండి.
అ) పల్లె పట్టణాల ప్రజల్లో ఉత్సాహం ఎక్కువగా ఉంది. పల్లెల్లో ఆప్యాయతతో కూడిన ప్రత్యేక విశేషం కనబడింది.
అ) పల్లె పట్టణాల ప్రజల్లో ప్రత్యేక విశేషం ఉంది. (✗)
ఆ) పల్లె ప్రజల కంటే, పట్టణాల ప్రజల్లో ఎక్కువ విశేషం ఉంది. (✗)
ఇ) పల్లె ప్రజల్లో పట్టణ ప్రజల కంటే తక్కువ విశేషం కనబడింది. (✗)
ఈ) ఆప్యాయత అనే ప్రత్యేక విశేషం, పల్లె ప్రజల్లో ఎక్కువగా కనబడింది. (✓)
ఆ) వినోబాకు తెలుగు వచ్చు. కానీ తెలుగులో మాట్లాడలేరు. అయినా వచ్చిన తెలుగు భాష వల్ల ఎంతో ప్రయోజనం కలిగింది.
అ) వినోబాకు తెలుగు వచ్చు. కానీ సరిగా మాట్లాడలేరు. (✓)
ఆ) వినోబాకు తెలుగు రాదు. కాబట్టి అసలే మాట్లాడలేరు. (✗)
ఇ) వినోబాకు తెలుగు బాగా వచ్చు, బాగా మాట్లాడగలరు. (✗)
ఈ) వినోబాకు తెలుగు బాగా రాదు. కానీ ఎంతో కొంత మాట్లాడగలరు. (✗)
ఇ) శివరాంపల్లి వెళ్ళవలసిన అవసరం లేకపోతే తోవలో కొద్ది రోజులపాటు ఉండవలసిన గ్రామాలు అనేకం తగిలాయి.
అ) శివరాంపల్లికి తప్పకుండా వెళ్ళాలి కాబట్టి తోవలోని గ్రామంలో ఉండవలసిన అవసరం ఉన్నా ఉండకుండా వెళ్ళారు. ( ✓)
ఆ) శివరాంపల్లికి వెళ్ళవలసిన అవసరం లేదు. అందుకే తోవలోని గ్రామాల్లో ఉండకుండా వెళ్ళారు. (✗)
ఇ) శివరాంపల్లికి వెళ్ళారు. తోవలోని గ్రామాల్లో కూడా కొద్దిరోజులు ఉండి వెళ్ళారు. (✗)
ఈ) శివరాంపల్లికి వెళ్ళడం కంటే ఇతర గ్రామాల్లో ఉండడం ఎక్కువ అవసరం. (✗)
ఈ) “మాకు కొద్దిగా భూమి దొరికితే, కష్టపడి పని చేసుకుంటాం; కష్టార్జితం తింటాం”.
అ) కష్టపడి పనిచేయడానికి భూమి ఉంటే, మేము మా కష్టార్జితం తింటాం. (✓)
ఆ) భూమి లేదు కాబట్టి, మేము కష్టపడి కష్టార్జితం తింటున్నాం. (✗)
ఇ) మాకు కొద్దిగా భూమి దొరికితే కష్టపడకుండా తినవచ్చు. (✗)
ఈ) మాకు భూమి ఉన్నది కాబట్టి కష్టార్జితం తినవలసిన పనిలేదు. (✗)
2. పాఠంలోని కింది పేరాలు చదవండి. ఆ పేరాలోని ముఖ్యమైన పదం / పదాలు కింద గీత గీయండి. అవి ఎందుకు ముఖ్యమైనవో రాయండి.
1వ పేరా, 3వ పేరా, 6వ పేరా, 7వ పేరా, 13వ పేరా, చివరి పేరా
పేరా | పేరా లో ముఖ్యమైన పదం/పదాలు | ఎందుకు ముఖ్యమో రాయడం |
1వ పేరా | పాదయాత్ర | పాదయాత్ర వల్ల ప్రజలను, ప్రకృతిని దగ్గరగా చూడవచ్చు. |
3వ పేరా | పాదయాత్రే తగిన యాత్రా సాధనం | పాదయాత్రలో తిరిగేటప్పుడు ప్రతి మాట నిండు హృదయంతో, ఎంతో విశ్వాసంతో చెప్పగలిగే వారు. అవసరమైన నిబ్బరం, ఆత్మవిశ్వాసం భావే గారికి కలిగాయి. |
6వ పేరా | ప్రజలు ప్రేమతో భూమిని ఇవ్వగలరు. | ప్రేమతో 100 ఎకరాలు వెదిరె రామచంద్రారెడ్డి భూదానం చేయడం వల్ల. |
7వ పేరా | ఏ సమస్యనైనా అహింసా విధానంలో పరిష్కరింపవచ్చు. | వినోబా భావే సాధించిన భూదాన విజయము నెహ్రూజీ అభినందనలను అందుకొంది. |
13వ పేరా | ఏడాదిలో లక్ష ఎకరాల భూదానం | ప్రతి సభలో ప్రజలు భూదానం చేయడం వల్ల. |
చివరి పేరా | దేవుడు కల్పవృక్షం వంటివాడు | భగవంతుడే భూదాన రూపంలో సాక్షాత్కరించాడని భావే గారి తలంపు. |
3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) వినోబా శివరాంపల్లికి ఎలా వెళదామనుకున్నారు? ఎందుకు?
జవాబు:
వినోబా శివరాంపల్లికి పాదయాత్ర ద్వారా వెళ్ళాలనుకున్నారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రకృతినీ, ప్రజలనూ, మిక్కిలి దగ్గరగా చూడవచ్చు. అందుకే వినోబా పాదయాత్ర ద్వారా శివరాంపల్లి వెళ్ళాలనుకున్నారు.
ఆ) వినోబాకు తెలుగు రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం పొందారు?
జవాబు:
వినోబాకు తెలుగు రావడం వల్ల, ప్రార్థన సభల్లో స్థితప్రజ్ఞుని లక్షణాలను గురించి తెలుగులో చెప్పేవారు. వినోబాగారి తెలుగుమాటలు ప్రజల హృదయాలకు హత్తుకొనేవి. మాట్లాడుతున్నవాడు తనవాడే, తన సోదరుడే అని, ప్రజలు ప్రేమతో ఆయనకు స్వాగతం పలికారు.
ఇ) వినోబా గ్రామాలకు వెళ్ళడం వల్ల ఏమి గ్రహించారు?
జవాబు:
వినోబా గ్రామాలకు వెళ్ళడం వల్ల, అక్కడ గ్రామంలో ఉన్న లోటుపాట్లు తెలుసుకోగలిగారు. అక్కడి సమస్యల్ని గ్రహించి వాటిని పరిష్కరించగలిగారు. ప్రతి గ్రామంలోనూ వినోబా భావే గారి ఉద్యమానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉండాలనీ, గ్రామస్థులతో సంబంధం ఏర్పడి ఉండాలనీ, అప్పుడు ఎన్నో గొప్ప కార్యాలను సాధించగలమని ఆయన గ్రహించారు.
ఈ) వినోబాకు పోచంపల్లిలో ఎలాంటి అనుభవం ఎదురైంది?
జవాబు:
వినోబా భావే పోచంపల్లి గ్రామం వెళ్ళారు. ఆ గ్రామ దళితులు వినోబాగార్ని కలిసి, తమకు కొద్దిగా భూమి దొరికితే కష్టపడి పనిచేసుకుంటాం, కష్టార్జితం తింటాం అని చెప్పారు. వారంతా సమష్టి వ్యవసాయం చేసుకోవడానికి అంగీకరిస్తే, వారికి పొలం ఇప్పిస్తాననీ, వారికి పొలం కావాలి అన్న అర్జీని ప్రభుత్వానికి పంపిస్తాననీ వినోబా చెప్పారు. ఇంతలో అదే సభలో వెదిరె రామచంద్రారెడ్డిగారు ఆ దళితులకు తాను వంద ఎకరాల భూమిని దానం ఇస్తానని వాగ్దానం చేశారు.
ఉ) వినోబా భూ సమస్యను ఎలా పరిష్కరించాలని భావించారు?
జవాబు:
పోచంపల్లిలో వినోబాగారికి గొప్ప అనుభవం కల్గింది. ప్రజలు ప్రేమతో భూమిని ఇవ్వగలరనే అనుభూతి ఆయనకు కలిగింది. భూ సమస్య విషయంలో కలిగిన ప్రత్యక్ష అనుభవాన్ని అర్థం చేసుకొంటే, భూ సమస్యకు పరిష్కారం సులభం అవుతుందని వినోబా గ్రహించారు. భూదానం చేయమని ప్రతి సభలోనూ ప్రజల ముందు ఆయన చేయి చాచారు. గాలిమీద, నీటిమీద, వెలుగుమీద అందరికి హక్కు ఉన్నట్లే, భూమిపై కూడా హక్కు అందరికీ ఉందని వినోబా ప్రజలకు చెప్పారు. భూదాన యజ్ఞం ద్వారా శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించాలని వారు భావించారు.
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) “పల్లెల్లో పట్టణాల కంటే ఆప్యాయతతో కూడిన ప్రత్యేక విశేషం కనబడింది,” అని వినోబా అన్నారు కదా ! పల్లెల్లోని ప్రత్యేక ఆప్యాయత అంటే ఏమై ఉంటుంది?
జవాబు:
పల్లెల్లో అతిథులకు ప్రేమగా స్వాగతం పలుకుతారు. వచ్చిన అతిథులకు అన్నపానీయములు అందిస్తారు. అందులోనూ తమ సమస్యల్ని అడిగి తెలుసుకొనే వినోబా వంటి సత్పురుషులను పల్లె ప్రజలు ప్రేమతో ఆదరంగా పిలిచి, వారికి ఉండడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. వారికి భోజన సదుపాయములు చేస్తారు. తమకు ఉన్న భూమిని దానం చేస్తారు. వినోబా వంటి వారి మాటలను ఆదరంగా వింటారు. ఇది చూచిన వినోబా, పల్లె ప్రజలలో ప్రత్యేక ఆప్యాయత ఉందని రాశారు.
ఆ) ఏదైనా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి భాషను నేర్చుకోవడం అవసరమా? ఎందువల్ల?
జవాబు:
మనము ఏదైనా ఇతర ప్రాంతాలకు, అక్కడ కొన్నిరోజులు ఉండి, అక్కడి ప్రజలతో పనిచేయవలసిన పరిస్థితి ఉంటే మనము అక్కడి ప్రజల భాష తెలిసికోవలసిన అవసరం వస్తుంది. ఒక ప్రక్క రాష్ట్రానికి గానీ, ఒక విదేశానికి కానీ, చదువుకోసమో, ఉద్యోగం కోసమో వెళ్ళవలసివస్తే అక్కడి ప్రజల భాషను నేర్చుకోవడం తప్పనిసరి అవుతుంది.
ఇ) సమష్టి వ్యవసాయం అంటే ఏమిటి? ఈనాడు గ్రామాల్లో సమష్టి వ్యవసాయాలు జరగకపోవడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
‘సమష్టి వ్యవసాయం’ అంటే గ్రామంలో రైతులు అందరూ తమకు ఉన్న పొలాల్ని కలిసికట్టుగా శ్రమించి పండించడం. వారు వచ్చిన ఫలసాయాన్ని, వారికి ఉన్న పొలాలను బట్టి పంచుకుంటారు. వ్యవసాయానికి పెట్టుబడులు అందరూ కలిసి పెడతారు. లాభనష్టాల్ని సమంగా పంచుకుంటారు.
ఈనాడు గ్రామాల్లో ప్రజలు బీదలు, ధనికులుగా, కులాలు మతాలుగా విడిపోయారు. గ్రామాల్లో అందరికీ వ్యవసాయ భూములు లేవు. అందరూ సమానంగా పెట్టుబడులు పెట్టలేరు. ప్రజలు గ్రామాల్లో ఐకమత్యంగా లేరు. అందువల్ల గ్రామాల్లో సమష్టి వ్యవసాయం నేడు సాగడం లేదు.
ఈ) బీదలకు ఉపకారం చేశామని దాతలు భావించకూడదని వినోబా చెప్పారు కదా ! ఆయన ఎందుకని అలా అని ఉంటారు?
జవాబు:
బీదవాళ్ళకు ఉపకారం చేశామని భూదానం చేసిన దాతలు అనుకుంటే, అది అహంకారం అవుతుంది. దానివల్ల వినోబా ఆశించిన ఫలితం సిద్ధించదు. గాలిమీద, నీటి మీద, వెలుగు మీద ప్రజలందరికీ హక్కు ఉన్నట్లే, భూమి మీద కూడా అందరికీ హక్కు ఉన్నదని ప్రజలు భావించాలి. కొందరి దగ్గర అంగుళం భూమిసైతం లేకపోవడం, మరికొందరి దగ్గర వేలాది ఎకరాలు ఉండడం సబబు కాదు. కాబట్టి దాతలు ఉపకారం చేశామని కాకుండా, ప్రజలందరికీ భూమిపై హక్కు ఉందని గ్రహించి భూదానం చేయాలి.
ఉ) పేదలకు, భూమికి ఉండే సంబంధం తల్లికి, బిడ్డలకు ఉన్న సంబంధం వంటిది అని వినోబా అన్నారు కదా ! అది సరైందేనా? ఎందుకు?
జవాబు:
పేదవారికి భూమిని ఇప్పించడమే వినోబాగారి పాదయాత్రలో ప్రధానమైన ఉద్దేశ్యం. ప్రజలలో భూదానం చేయాలన్న ప్రవృత్తిని మేల్కొల్పాలని వినోబా భావించారు. భూమి తల్లి వంటిది. కాగా ప్రజలు ఆ భూమికి బిడ్డలవంటివారు. ప్రజలు తల్లి వంటి భూమిని దున్ని పంటలు పండిస్తారు – అంటే తల్లి వంటి భూమి, తనకు పిల్లల వంటి ప్రజలకు, ఫలసాయాన్ని అందిస్తుంది. కాబట్టి పేదలకూ, భూమికీ గల సంబంధం, తల్లీ బిడ్డల సంబంధం వంటిది అని వినోబా భావించారు.
2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.
అ) వినోబా గురించి 10 వాక్యాలలో వ్యాసం రాయండి.
(లేదా)
భూదానోద్యమాన్ని విజయవంతంగా వినోబాభావే నడిపిన విధము రాయండి.
జవాబు:
వినోబా భావే గాంధీగారి ముఖ్య శిష్యుడు. గొప్ప సర్వోదయ నాయకుడు. వార్దాలో ఉండేవాడు. 1951లో హైదరాబాదు దగ్గరలో ఉన్న “శివరాంపల్లి” లో సర్వోదయ సమ్మేళనం జరిగింది. ప్రజలను దగ్గరగా చూడవచ్చని, వార్ధా నుండి వినోబా పాదయాత్రలో శివరాంపల్లి వెడుతున్నారు. 1951 ఏప్రిల్ 8వ తేదీన, వినోబా ‘పోచంపల్లి’ గ్రామం వచ్చారు. ఆ గ్రామ దళితులు తమకు కొంచెం భూమి దొరికితే కష్టార్జితంతో తింటాం భూమి ఇప్పించండి అని వినోబాను అడిగారు. వారు సమష్టి వ్యవసాయం చేసుకొని జీవిస్తామంటే, భూమిని ఇప్పిస్తాననీ, అర్జీ పెట్టమనీ, వినోబా వారికి చెప్పారు.
ఇంతలో ఆ ఊరి పెద్ద రైతు వెదిరె రామచంద్రారెడ్డి ఆ దళితులకు తాను వంద ఎకరాల భూమిని దానం చేస్తానన్నాడు. ప్రజలు ప్రేమతో భూమిని దానం ఇస్తారని వినోబాకు అనుభవం అయ్యింది. వినోబా పేదలకు భూమిని ఇప్పించడం కోసం, పాదయాత్ర చేశారు. ఒక ఏడాదిలో లక్ష ఎకరాల భూమి దానంగా వచ్చింది. వినోబా భూదాన యజ్ఞం ఫలించింది. గాలి, నీరు, వెలుగు వలె భూమి కూడా ప్రజలందరి హక్కు అని వినోబా నమ్మకం.
ఆ) కొందరికి అసలే భూమి లేకపోవడం, మరికొందరికి వందల ఎకరాల భూమి ఉండడం అనే పరిస్థితి నేడు కూడా ఉంది కదా! ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మీరు సూచించే పరిష్కార మార్గాలు ఏమిటి?
జవాబు:
నేటికీ మన ప్రజలలో కొందరికి అంగుళం కూడా భూమి లేదు. కాగా కొందరికి వందలు, వేల ఎకరాల భూమి ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మన ప్రభుత్వాలు భూసంస్కరణలు తెచ్చాయి. ఏ వ్యక్తికీ పల్లం భూమి 28 ఎకరాలు, మెట్టభూమి అయితే 50 ఎకరాలు మించి ఉండకూడదని చట్టం ఉంది. ఎక్కువగా పొలం ఉన్నవారి నుండి సర్కారు తీసుకొని, పేదలకు పంచింది.
కాని ఈ పని సక్రమంగా జరగలేదు. ప్రజలలో కొందరు తమవద్ద ఎక్కువగా ఉన్న పొలాలను ఎవరో కావలసిన వారి పేరున రాసి, బినామీ ఆస్తులుగా తమవద్దనే వాటిని ఉంచుకున్నారు. అదీగాక నేడు పరిశ్రమల స్థాపన పేరుతో, విమానాశ్రయాలు, ఓడరేవులు పేరుతో వేల ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూముల్ని ప్రభుత్వ పెద్దల పలుకుబడితో కొందరు స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వము భూసంస్కరణలను నియమబద్ధంగా, న్యాయంగా అమలు జరిపిస్తే, ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
IV. పదజాలం
1. పాఠం ఆధారంగా కింది పదాల అర్థాలు తెలుసుకోండి. వీటిని సొంతవార్యాలలో రాయండి.
అ) “కష్టార్జితం” :
కష్టార్జితం అంటే కష్టపడి సంపాదించడం. తానే కష్టపడి పనిచేసి డబ్బునూ, భూమినీ సంపాదిస్తే, దాన్ని కష్టార్జితం అంటారు. తల్లిదండ్రుల వల్ల, తాత ముత్తాతల వల్ల ఆస్తులు సంక్రమిస్తే, దాన్ని “పిత్రార్జితం” అంటారు.
ఆ) “నిండు హృదయం” :
‘నిండు హృదయం’ అంటే మనశ్శుద్ధిగా అని భావం. తన మనస్సుకు పూర్తిగా అంగీకారం అయిన విషయం .
ఇ) “అసాధారణ ఘట్టం” :
సాధారణంగా జరిగే సంగతి కానిది. ఇటువంటి సంఘటన అరుదుగా జరుగుతుంది. అరుదైన సంఘటన అని భావం.
ఈ) “హృదయశుద్ధి” :
నిర్మలమైన మనస్సుతో చేసే పని. ఏదో తప్పని పరిస్థితులలో ఎదుటివారినీ నమ్మించడానికి కాకుండా, నిండు మనస్సుతో పవిత్రమైన బుద్ధితో చేయడం.
ఉ) “జీవన పరివర్తనం” :
బ్రతుకు విధానంలో మార్పు. అప్పటివరకు సాగించే బ్రతుకు విధానంలో మార్పు రావడాన్ని ‘జీవన పరివర్తనం’ – అంటారు.
ఊ) “సమాజ పరివర్తనం” :
మన చుట్టూ ఉంటే సంఘాన్ని ‘సమాజం’ అంటారు. నాటి వరకు నడచుకొనే మార్గం నుండి కొత్త విధానంలోకి సంఘ ప్రజలు మారడాన్ని “సమాజ పరివర్తనం” అంటారు.
ఎ) “సత్కార్యాలు” :
మంచిపనులు. సంఘంలోని ప్రజల మంచికోసం చేసే పనులు సత్కార్యాలు. దానధర్మాలు చేయడం, భూదానం, నేత్రదానం, అవయవదానం వంటి మంచి పనులను సత్కార్యాలు అంటారు.
2. కింది పదాలకు పర్యాయపదాలు రాసి సొంతవాక్యాలు రాయండి.
అ) రాత్రి = నిశి, రేయి రాత్రిపూట చంద్రుడు ఉదయిస్తాడు.
ఆ) పల్లె = గ్రామం, జనపదం పల్లెలు ప్రగతికి పట్టుకోమ్మలు.
ఇ) హృదయం= ఎద, మనసు హృదయం నిర్మలంగా ఉండాలి.
ఈ) భూమి = వసుధ, ధరణి భూమిపై శాంతి నెలకోవాలి.
ఉ) ఆకాంక్ష = కోరిక, వాంఛ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలి.
3. కింది పదాలకు నానార్థాలు రాయండి.
అ) పాపము = దుష్కృతం, పావడం
ఆ) ప్రజలు – జనులు, సంతానము
ఇ) ధనము = సంపద, ఆవులమంద
ఈ) యుగము = కృతాదియుగం, రెండు
ఉ) పొలం – కేదారము, అడవి
ఊ) వ్యవసాయం = కృషి, ప్రయత్నం, పరిశ్రమ
4. కింది వాక్యాలలో గీత గీచిన పదాలకు వికృతి పదాలు రాయండి.
అ) ప్రజలు ప్రేమతో భూమిని ఇస్తున్నారు.
ఆ) త్రిలింగ భాష మధురమైనది.
ఇ) మంచివారి హృదయంలో భగవంతుడుంటాడు.
ఈ) ఎవరి కార్యములను వారు సమర్థవంతంగా చెయ్యాలి.
ప్రకృతి వికృతి
ప్రజలు – పజలు
ప్రేమ – ప్రేముడి
భాష – బాస
త్రిలింగం – తెలుగు
హృదయం – ఎద, డెందము
కార్యం – కర్జము
V. సృజనాత్మకత
ప్రశ్న 1.
నువ్వే వినోబా స్థానంలో ఉంటే, నేటి పరిస్థితుల్లో ప్రజలకు ఏమని సందేశం ఇస్తావు ? దాన్ని రాసి ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
“ఏకపాత్రాభినయం”
నేను గాంధీగారి శిష్యుణ్ణి. నా పేరు వినోబా భావే. నా పేరు ఈ పాటికే మీ చెవిన పడి ఉంటుంది. నేను భూదాన యజ్ఞం ప్రారంభించాను. ఈ యజ్ఞంలో మొదటి దానం చేసిన పుణ్యాత్ముడు పోచంపల్లిలో రామచంద్రారెడ్డి. ఆ దానకర్ణుడు తన గ్రామంలో దళితులకు 100 ఎకరాలు భూదానం చేశాడు. మనం తల్లికి పుట్టినప్పుడు, మన వెంట ఏమీ తీసుకురాలేదు. పోయినప్పుడు పూచికపుల్ల కూడా పట్టుకెళ్ళలేము.
మన తోటి సోదరులు బీదవారు, ఇల్లు కట్టుకోవడానికి కూడా జాగా లేక ఏడుస్తున్నారు. దాతలారా ! వారి కన్నీరు తుడవండి. భూదాన యజ్ఞంలో మీ వంతుగా ఒక సమిధ వేసి, పుణ్యం సంపాదించండి. మీకు గాంధీజీ ఆశీస్సులు ఉంటాయి. కదలండి. వస్తా …
(లేదా)
ప్రశ్న 2.
ఈనాటి పరిస్థితులకునుగుణంగా భూదానం ఆవశ్యకతను వివరిస్తూ ఒక పోస్టరును తయారుచేసి ప్రదర్శించండి.
జవాబు:
పోస్టరు
“మిత్రులారా ! భూదానం అన్ని దానాల్లో గొప్పదానం. భూదానం చేసేవారికి స్వర్గాది పుణ్యలోకాలు వస్తాయి. మీ తోడిజనంలో కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి చోటులేక, కూరగాయలు పండించడానికి జాగాలేక, వ్యవసాయం చేయడానికి పొలం లేక బాధపడుతున్నారు. మీకు వ్యవసాయ కూలీలు దొరకడం లేదు.
మనం గాలి, నీరు, వెలుగు సమంగా అనుభవిస్తున్నాం. అలాగే భూమి కూడా ప్రజలందరిది. మీకున్న వంద ఎకరాలలో రెండు ఎకరాలు తక్కువైతే, మీ వారికి లోటు రాదు. కానీ ఆ రెండు ఎకరాలు మీరు దానం ఇస్తే, 100 మంది దరిద్ర నారాయణులు ఇళ్ళు కట్టుకుంటారు. కలకాలం మీ పేరు చెప్పుకుంటారు. మీకు స్వర్గం వస్తుంది.
ఎకరం పైగా దానం చేసిన రైతులకు ముఖ్యమంత్రి గారు స్వయంగా సత్కారం చేస్తారు. త్వరపడండి. భూదానం చేయండి. పుణ్యం మూట కట్టుకోండి. పత్రికల్లో మీ పేరు, మీ ఫొటోతో వేస్తారు. మరువకండి.
ఇట్లు,
భూదాన యజ్ఞం సభ్యులు.
VI. ప్రశంస
1. భూదానం అనేది ఒక సత్కార్యం. ఇలాంటివే ఇంకా ఏ ఏ సత్కార్యాలు చేయవచ్చు ? ఇలాంటి సత్కార్యాలు చేసిన వారిని అభినందిస్తూ లేఖ రాసి ప్రదర్శించండి.
జవాబు:
భూదానం ఒక మంచిపని. భూదానం లాగానే విద్యాదానం, నేత్రదానం, కిడ్నీదానం, అవయవదానం, పాఠశాలలకు కావలసిన ఫర్నిచరు దానం, పేద విద్యార్థులకు పుస్తకదానం, పేద విద్యార్థులకు ఫీజులకు ధన దానం, మెరిట్ విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం, మంచి క్రీడాకారులకు షీల్డులు ఇవ్వడం వంటివి చేయవచ్చు.
సత్కార్యాలను చేసిన వారిని అభినందిస్తూ లేఖ విజయవాడ, పి. సుధీర్ కుమార్, పూజ్యశ్రీ కె. గుణశేఖర్ గార్కి, అయ్యా, నమస్తే. మీరు మీ ‘బంటుమిల్లి’ గ్రామంలో, దళితులకు ఇండ్లు కట్టుకోవడానికి మూడు ఎకరాల పొలం ఇచ్చారట. మీ ఊరి హైస్కూలు పిల్లలకు ఉచితంగా నోటుపుస్తకాలు, పెన్నులు ఇచ్చారట. మీ తదనంతరం మీ నేత్రాలను నేత్రదానం చేశారట. మేము పేపరులో చదివాం. మీరు చేసిన ఈ దానాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తాయి. మీకూ, మీ దానగుణానికీ, మా పాఠశాల విద్యార్థుల తరఫున అభినందనలు. నమస్కారాలు. సెలవు. ఇట్లు, చిరునామా : |
(లేదా)
2. వినోబా భూదాన ఉద్యమం కోసం చేసిన పాదయాత్రను అభినందిస్తూ, ఆయనకు ఏమని లేఖ రాస్తారు? రాసి గోడ పత్రికలో ప్రదర్శించండి.
జవాబు:
వినోబాభావే గారికి అభినందన లేఖ గుంటూరు, పి. సీతాలక్ష్మి, పూజ్యశ్రీ వినోబా భావే మహాశయులకు, నమస్కారములు. మీరు మా నగరానికి దగ్గరలో గల పోచంపల్లిలో రామచంద్రారెడ్డి గారు ఇచ్చిన వంద ఎకరాల భూదానంతో ప్రేరణ పొంది, భారతదేశంలో భూదాన యజ్ఞం ప్రారంభించారనీ, బీదలకు లక్షల ఎకరాలు భూమిని ఇప్పించారనీ మా మాష్టారు చెప్పారు. నేను మీ ఉద్యమాన్ని, యజ్ఞాన్ని గూర్చి తెలుసుకొని మురిసిపోయాను. మీకు శతకోటి నమస్కారాలు. ప్రజలలో భూదానం చేయాలనే ప్రేరణ కల్గించిన మీకు, మా పాఠశాల విద్యార్థుల తరఫున అభినందన మందారాలు. నమస్తే. ఇట్లు, చిరునామా : |
ప్రాజెక్టు పని
1. పోచంపల్లిలో రామచంద్రారెడ్డిగారు వినోబా భావే ప్రసంగానికి ప్రేరణపొంది ఒకేసారి వంద ఎకరాలను దానం చేశారు కదా! అలా మీ ఊరిలోనూ పేరు పొందిన దాతలు కొందరు ఉంటారు కదా ! వాళ్ళ పేర్లను సేకరించి ఎవరు ఏ రకమయిన దానం చేశారో తెలియజేసే వివరాలను రాసి గోడపత్రికలో పెట్టండి.
జవాబు:
కొవ్వూరు గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో రెవెన్యూ డివిజన్ కేంద్రము. కొవ్వూరు గ్రామం గోదావరీ నదికి పశ్చిమతీరాన ఉంది.
మా గ్రామంలో ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠము అనే సంస్కృతాంధ్ర కళాశాల ఉంది. దానికి ప్రిన్సిపాలుగా కీ|| శే|| కేశిరాజు వేంకట నృసింహ అప్పారావుగారు ఉండేవారు. వారు గాంధీ మార్గంలో నడిచిన దేశభక్తులు. వినోబా భావే గారి పిలుపుతో ప్రేరణ పొంది, వీరికున్న నాలుగు ఎకరాల పంటభూమిని భూదానం చేశారు. వారు కేవలం ఖద్దరు ధరించేవారు. వీరికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈయన మా గ్రామవాసి అని తెలిసి నేను ఆనందిస్తున్నాను.
పి. శకుంతల, యన్. శ్రీధర్
గవర్నమెంటు హైస్కూలు,
కొవ్వూరు, ప|| గో|| జిల్లా,
VII. భాషను గురించి తెలుసుకుందాం
1. కింది పదాలను విడదీయండి. సంధి పేరు రాయండి.
అ) సర్వోదయం = సర్వ + ఉదయం – గుణసంధి
ఆ) ఊహాతీతం = ఊహ + అతీతం – సవర్ణదీర్ఘ సంధి
ఇ) ఆయాచోట్ల = ఆ + ఆచోట్ల – యడాగమ సంధి
ఈ) తేవాలని = తేవాలి + అని – ఇత్వసంధి
ఉ) మరొకటి = మరి + ఒకటి – ఇత్వసంధి
2. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు, సమాస నామాలు రాయండి.
అ) పాదయాత్ర – పాదములతో యాత్ర – తృతీయా తత్పురుష
ఆ) పల్లె ప్రజలు – పల్లె యందలి ప్రజలు – సప్తమీ తత్పురుష
ఇ) వంద ఎకరాలు – వంద సంఖ్యగల ఎకరాలు – ద్విగు సమాసం
ఈ) నా గ్రంథం – నా యొక్క గ్రంథం – షష్ఠీ తత్పురుష సమాసం
3. కింది వానిలో కర్తరి వాక్యం కర్మణి వాక్యంగా, కర్మణి వాక్యం కర్తరి వాక్యంగా మార్చండి.
అ) నెహ్రూ తన జాబులో సంతోషాన్ని వ్యక్తం చేశారు. (కర్తరి వాక్యం)
జవాబు:
నెహ్రూ చేత తన జాబులో సంతోషం వ్యక్తము చేయబడింది. (కర్మణి వాక్యం)
ఆ) ఆయనకు సమాధానం రాయబడి పంపబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
ఆయనకు సమాధానం రాసి పంపారు. (కర్తరి వాక్యం)
ఇ) భగవంతుడు నా మాటలకు శక్తిని ప్రసాదించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
భగవంతుని చేత నా మాటలకు శక్తి ప్రసాదింపబడింది. (కర్మణి వాక్యం)
ఈ) నాచే దీనికి భూదానయజ్ఞం అని పేరు పెట్టబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను దీనికి భూదానయజ్ఞం అని పేరు పెట్టాను. (కర్తరి వాక్యం)
వ్యాకరణంపై అదనపు సమాచారం
పర్యాయపదాలు
ఇల్లు : గృహం, సదనం
హృదయం : ఎద, మనసు
వ్యవసాయం : కృషి, సేద్యము
అవసరం : ఆవశ్యకం, అక్కల
తోవ : దారి, పథము
నిర్ణయం : నిశ్చయం, సిద్ధాంతం
వ్యతిరేకపదాలు
రాత్రి × పగలు
సమిష్టి × వ్యష్టి
లక్ష్యం × అలక్ష్యం
శాంతి × అశాంతి
ప్రత్యక్షం × పరోక్షం
సుఖం × కష్టం
ప్రవృత్తి × అప్రవృత్తి
స్పష్టం × అస్పష్టం
న్యాయం × అన్యాయం
విశ్వాసం × అవిశ్వాసం
అంగీకారం × తిరస్కారం
సత్కార్యం × దుష్కార్యం
హింస × అహింస
ప్రకృతి – వికృతులు
దూరం – దవ్వు
శక్తి – సత్తి
రూపం – రూపు
హృదయం – ఎద, ఎడద
గుణము – గొనము
కార్యం – కర్జం
న్యాయం – నాయం
యాత్ర – జాతర
యజ్ఞము – జన్నము
సత్యం – సత్తు
సంధులు
సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశమగును.
శంకరాచార్యులు = శంకర + ఆచార్యులు – సవర్ణదీర్ఘ సంధి
ఊహాతీతుడు = ఊహ + అతీతుడు – సవర్ణదీర్ఘ సంధి
కష్టార్జితం = కష్ట + ఆర్జితం – సవర్ణదీర్ఘ సంధి
ప్రత్యక్షానుభవం = ప్రత్యక్ష + అనుభవం – సవర్ణదీర్ఘ సంధి
ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగును.
వందలాది = వందలు + ఆది – ఉత్వసంధి
సాధనమని = సాధనము + అని – ఉత్వసంధి
అవసరమైన : అవసరము + ఐన – ఉత్వసంధి
ఇత్వసంధి
సూత్రము : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
కావాలనుకొని = కావాలి + అనుకొని – ఇత్వసంధి
సమాసాలు
సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
హృదయ పరివర్తనము | హృదయము నందు పరివర్తనము | సప్తమీ తత్పురుష సమాసం |
మూడు విధానాలు | మూడు సంఖ్యగల విధానాలు | ద్విగు సమాసం |
భూసమస్య | భూమి యొక్క సమస్య | షష్ఠీ తత్పురుష సమాసం |
లక్ష ఎకరాలు | లక్ష సంఖ్యగల ఎకరాలు | ద్విగు సమాసం |
రెండుమాటలు | రెండు సంఖ్యగల మాటలు | ద్విగు సమాసం |
యాత్రాసాధనము | యాత్ర కొరకు సాధనము | చతుర్థి తత్పురుష సమాసం |
భూదానం | భూమి యొక్క దానము | షష్ఠీ తత్పురుష సమాసం |
సత్కార్యము | మంచిదైన కార్యము | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
భూదాన యజ్ఞము | భూదానమనెడి యజ్ఞము | రూపక సమాసం |
భూఖండము | భూమి యొక్క ఖండము | షష్ఠీ తత్పురుష సమాసం |
శాంతియుతం | శాంతితో యుతం | తృతీయా తత్పురుష సమాసం |
కష్టార్జితం | కష్టముతో ఆర్జితం | తృతీయా తత్పురుష సమాసం |
కొత్త పదాలు-అర్ధాలు
అభిలషించు = కోరు
అవధులు = హద్దులు, మేరలు
అనుగ్రహించు = దయతో ఇచ్చు
అనుభూతి = ప్రత్యక్ష జ్ఞానము
అహంకారం = గర్వము
ఆత్మవిశ్వాసం = తనపై నమ్మకం
ఆటపట్టు = నిలయం, చోటు
ఆచరణ = నడవడి (చేయుట)
అర్జీ = పై అధికారులకు రాసే లేఖ.
ఈర్ష్య = ద్వేషం
ఊహాతీతం = ఊహింపశక్యం కానిది
ఔదార్యం = దాతృత్వము;
కష్టార్జితం = కష్టపడి సంపాదించినది
కుత్తుక = కంఠము
కృతనిశ్చయులు = నిశ్చయం చేసుకున్నవారు
చిత్తశుద్ధి = మనస్సు పరిశుద్ధి
జాబు = ఉత్తరము
టూకీగా = కొద్దిగా, సంగ్రహంగా
తార్కాణం = నిదర్శనము
తామస భావం = తమోగుణం
నిబ్బరం = స్థిరము, తదేకాగ్రత
నిక్షిప్తం = ఉంచబడినది
దళితులు = హరిజనులు
దర్శనం = చూచుట
పరిష్కరించు = చక్కబెట్టు
పరివర్తన – మార్పు
ప్రభంజనం = పెద్ద గాలి
బీజాలు = విత్తనాలు
మహత్కార్యం = గొప్ప పని
మహత్తర = గొప్ప
మాత్సర్యం = అసూయ
ముమ్మరంగా = అధికంగా
సమ్మేళనం = సమావేశం
యోచించడం = ఆలోచించడం
రాజస భావం = రజోగుణం
లోభం = దురాశ
వ్యక్తం = వెల్లడి
వాగ్దానం = మాట ఇచ్చుట
విడ్డూరం = మొండితనం
సుగమము = సులభముగా తెలియునది
సమష్టి వ్యవసాయం= అందరూ కలసి చేసే వ్యవసాయం
సమక్షం = ఎదుట
సాక్షాత్కారం = ప్రత్యక్షము
హత్తుకోవడం = చేరుకోవడం
హేతువు = కారణం
స్థిత ప్రజ్ఞులు = మనస్సులోని కోరికలను పూర్తిగా వదలి, నిర్మలమైన మనస్సుతో తృప్తి పొందేవారు ‘సిద్ధ ప్రజ్ఞులు’ అని భగవద్గీత చెబుతుంది.