SCERT AP 8th Class Social Study Material Pdf 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Social Solutions 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు
8th Class Social Studies 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
శాసనసభలో చట్టాలు చేసేటప్పుడు దానిపై వివిధ దృష్టి కోణాల నుంచి ఎంతో చర్చ జరుగుతుంది. 1950లలో భూసంస్కరణల చట్టంపై వివిధ అభిప్రాయాలు ఏమై ఉంటాయి ? ఏ దృష్టి కోణం బలంగా ఉండి ఉంటుంది? (AS1)
జవాబు:
వివిధ అభిప్రాయాలు :
- జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలి.
- నష్టపరిహారంగా వీరికి ఎంతో కొంత మొత్తాన్ని చెల్లించాలి.
- పేదలకు భూమిని పంచాలి.
- కౌలుదార్లను స్వంతదారులుగా మార్చాలి.
- వెట్టి / బేగారను రూపుమాపాలి.
- అటవీ, బంజరు భూములపై నియంత్రణ సాధించి పేదలకు పంచాలి.
- శిస్తు వసూలు అధికారం ప్రభుత్వానికి ఉండాలి.
- భూస్వామ్య దోపిడీ నుండి సామాన్య రైతులను రక్షించాలి.
బలమైన దృష్టికోణం :
గ్రామీణ పేదరిక నిర్మూలన అనే దృష్టి కోణం బలీయంగా ఉండి ఉంటుంది.
ప్రశ్న 2.
1970లలో భూ పరిమితి చట్టాలు చేసినప్పుడు ఎటువంటి అభిప్రాయాలు ఉండి ఉంటాయి? (AS1)
జవాబు:
- దేశంలోని సంపద ఒక చోటే కేంద్రీకృతమై ఉంది.
- చాలామంది రైతులు చిన్నచిన్న కమతాలను కలిగియున్నారు.
- దళితులు భూమిలేని వారై ఉన్నారు.
- పశువుల కొట్టాలు, భవనాలు మొదలైనవన్నీ భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయి.
- జమీందారులు భూస్వాములుగానూ, భూస్వాములు పారిశ్రామికవేత్తలుగానూ మారారు.
- ఈ అవకతవకలన్నింటినీ సరిచేయాలనే భావన ఉండి ఉంటుంది.
ప్రశ్న 3.
ఈ సంస్కరణల వల్ల రైతాంగ మహిళలు ఏమైనా లబ్ది పొందారా ? కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
రైతాంగ మహిళలు కొంతవరకు లబ్ధి పొందారని చెప్పవచ్చు.
కారణాలు:
- కొంతమంది మిగులు భూములను భార్యల, కూతుళ్ళ, కోడళ్ళ పేరు మీదకు బదిలీ చేసి వారిని ఆస్తిదారులను చేశారు.
- ఉత్తుత్తి విడాకులు ఇచ్చుకుని భార్యాభర్తలు రెండు కుటుంబాలుగా మారిపోయారు. ఈ రకంగా కూడా మహిళలు ఆస్తి పరులయ్యారు.
- మహిళలు కూడా తమ భర్తలతో పాటు యజమానుల పొలాలలో పనిచేసేవారు. ఈ చట్టాల వలన స్వంత పొలాలలో పని, వాటిపై అజమాయిషీ చేయగలుగుతున్నారు.
ప్రశ్న 4.
అన్ని వర్గాల రైతాంగానికి పెట్టి ఎందుకు సమస్యగా ఉంది? భూస్వాములు తమ భూములను సాగుచేయడానికి ప్రస్తుతం ఏం చేస్తూ ఉండి ఉంటారు? (AS6)
జవాబు:
‘వెట్టి’ మానవత్వానికి మాయని మచ్చ వంటిది. దీనికి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు జరిగాయి. కాబట్టి ఇది అన్ని రకాల రైతాంగానికి ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం పూర్వకాలం నాటి భూస్వాములు లేరు. ఉన్నవారు పాలేర్లను, కూలీలను నియమించుకుని భూములను సాగు చేస్తున్నారు.
ప్రశ్న 5.
మీరు ఒక కౌలుదారు. భూ సంస్కరణ చట్టాల వల్ల మీకు భూమి లభించింది. అప్పుడు మీ అనుభవాలను గురించి వ్రాయండి. (AS4)
జవాబు:
“నాకు ఈ చట్టం వలన 4 ఎకరాలు భూమి లభించింది. దీనికోసం నేను కొద్ది మొత్తం చెల్లించాను. ఇప్పటి వరకు నేను, నా భార్యా, పిల్లలు అందరూ మా దొరగారి పొలంలో పని చేయాల్సి వచ్చేది. కానీ నేటి నుండి ఈ పొలానికి నేనే యజమానిని. నా కుటుంబం అంతా ఈ పొలంలోనే చెమటోడ్చి, శ్రమించి పండిస్తాము. మేమంతా ఎంతో ఆనందంగా ఉన్నాము. స్వేచ్ఛా వాయువులు మమ్మల్ని పరవశింపచేస్తున్నాయి.”
ప్రశ్న 6.
భూసంస్కరణల చట్టం సమయంలో మీరు ఒక భూస్వామి అని ఊహించుకోండి. అప్పుడు మీ భావాలు, చర్యలు ఎలా ఉంటాయో రాయండి. (AS4)
జవాబు:
“అయ్యో ! ఈనాడు ఎంత దుర్దినం. నా 4000 ఎకరాల భూమిని కోల్పోవలసివచ్చింది. నేటి వరకు నా యిల్లు ధాన్యం తోటి నౌకర్లు, చాకర్లు, వెట్టివారితోటి కళకళలాడుతూ ఉండేది. ఇవ్వాళ ఎన్నో అబద్దాలాడి కేవలం 150 ఎకరాలు . మిగుల్చుకోగలిగాను. నా దేశానికి స్వాతంత్ర్యం రావడం ఆనందమే అయినా, నేను మాత్రం చాలా నష్టపోయాను. అధికారమూ, ఆస్తులు లేకుండా మేమెలా జీవించాలి?”
ప్రశ్న 7.
రైతులు ఇష్టం వచ్చినప్పుడు తొలగించగల కౌలుదార్లకు భూసంస్కరణల వల్ల వాస్తవానికి నష్టం జరిగిందని చాలామంది అభిప్రాయపడతారు. దీనితో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలు తెల్పండి. (AS1)
జవాబు:
ఇది కొంతవరకు ఏకీభవించదగ్గ విషయమే. కారణాలు:
- ప్రభుత్వం చెల్లించమని నిర్ణయించిన వెలను చెల్లించి కొంతమంది కౌలుదారులు భూయజమానులయ్యారు.
- చట్టబద్ద గుర్తింపు లేని వారు ఎటువంటి ప్రయోజనం పొందలేదు.
- జమీందారులు ‘ఖుదా కాస్తే’ను అడ్డం పెట్టుకుని, చాలావరకు భూమిని సొంత సాగులోనే చూపించారు.
- కౌలుదార్లను పెద్ద ఎత్తున తొలగించి భూమిని జమీందారులు తమ సొంత సాగులోనికి తెచ్చుకున్నారు.
ప్రశ్న 8.
ప్రభుత్వం సమర్థవంతమైన చట్టాలు చేసినా భూ పరిమితి చట్టాన్ని సమర్థంగా ఎందుకు అమలు చేయలేకపోతుంది? (AS1)
జవాబు:
ప్రభుత్వం సమర్ధవంతమైన చట్టాలు చేసినా, భూస్వాముల పన్నాగాల వల్ల, ప్రభుత్వానికి అంతగా రాజకీయ నిబద్ధత లేనందువల్ల ఈ చట్టం సరిగా అమలు కాలేదు.
ప్రశ్న 9.
భూదాన ఉద్యమస్ఫూర్తి “భూస్వామ్యాన్ని అంతం చేయడం”లో, “దున్నేవానికే భూమి ఇవ్వటం”లో ఎందుకు విఫలమైంది? (AS1)
జవాబు:
ఈ ఉద్యమంలో భూస్వాములు తమంతట తామే భూములను దానంగా ఇవ్వాలి. అంతటి ఔదార్యం అందరికీ ఉండదు. ఇచ్చినవారు కూడా బంజరు, బీడు భూముల్నే ఇచ్చారు కానీ, సారవంతమైన వాటిని ఇవ్వలేదు. సారవంతమైనవి ఎక్కువ భూస్వాముల దగ్గరే ఉండటం మూలాన ఇది భూస్వామ్యాన్ని అంతం చేయలేకపోయింది. దున్నేవానికి భూమి ఇవ్వలేక పోయింది.
ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పటంలో (నల్గొండ) యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి గ్రామాన్ని గుర్తించండి. (AS5)
జవాబు:
ప్రశ్న 11.
“స్వాతంత్ర్యం వచ్చే నాటికి గ్రామీణ పేదరికం” అనే శీర్షిక కింద మొదటి పేరా చదివి ఈ కింది ప్రశ్నకు సమాధానం రాయండి. (AS2)
స్వాతంత్ర్యం వచ్చేనాటికి భారతదేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళలో కడు పేదరికం ఒకటి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరీ ఎక్కువ. గ్రామీణ జనాభాలో సగానికంటే ఎక్కువ మంది (65 శాతం), అంటే 18:6 కోట్ల జనాభా తీవ్ర పేదరికంలో ఉందని అంచనా. వాళ్లకు భూమి వంటి వనరులు ఏవీ అందుబాటులో లేవు, కనీస ఉపాధి పొందటానికి ఉపయోగపడే చదువు లేదు. వాస్తవానికి ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. చాలా తక్కువ కూలీ దొరికే వ్యవసాయ పని మాత్రమే వాళ్లకు దొరికేది. వ్యవసాయదారుల్లో అధిక శాతానికి ఎటువంటి సొంత భూమిలేదు. వాళ్లలో కొంతమంది భూస్వాములకు చెందిన భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసేవారు. భూస్వాముల పొలాల్లో వీళ్లు కూలీ లేకుండా పని చేయాల్సి వచ్చేది. కరవు కాటకాలు, రోగాలు తరచు సంభవిస్తూ వినాశనాన్ని సృష్టించేవి. ఆకలి ఎప్పుడూ వాళ్లని వెంటాడుతూనే ఉండేది.
ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడ్డాయా? ఎలా?
జవాబు:
ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పవచ్చు. వీరు వ్యవసాయ పనులకే కాక ఇతర పనులకు కూడా వెళుతున్నారు.
ఉదా :
పారిశ్రామిక పనులు, రోడ్డు పనులు, అనేక రకాలైన చేతివృత్తులు మొదలైనవి. వీరు ప్రస్తుతం విద్యను కూడా అభ్యసిస్తున్నారు. నేడు వ్యవసాయ కూలీలకు మంచి డిమాండు ఉన్నది. కాబట్టి వీరి పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పవచ్చును.
8th Class Social Studies 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు InText Questions and Answers
8th Class Social Textbook Page No.185
ప్రశ్న 1.
“దున్నేవానికి భూమి” అన్న నినాదంతో కౌలుదారులకు భూమి లభిస్తుంది. మరి కూలికి పనిచేసే వ్యవసాయ కూలీల . పరిస్థితి ఏమిటి?
జవాబు:
కౌలుదార్ల పరిస్థితి కొంత బాగవుతుంది. కాని వ్యవసాయ కూలీల పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లు ఉంటుంది. వారి పరిస్థితి నేటికీ అలాగే ఉందని మనం భావించవచ్చు.
ప్రశ్న 2.
గ్రామీణ పేదలకు ఆదాయం వచ్చే ఉపాధి కల్పించడానికి ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయని నీవు భావిస్తున్నారా?
జవాబు:
నేటికాలంలో అయితే అనేక మార్గాలున్నాయి. కానీ నాటి కాలంలో ఉపాధి మార్గాలు తక్కువగానే ఉన్నాయి. బ్రిటిషు వారు మనదేశంలో వృత్తి, ఉపాధుల మీద దెబ్బకొట్టారు. ఉన్న కొన్ని అవకాశాలు కూడా చేయిజారి పోయాయి. కాబట్టి ఇంక వేరే ఏ మార్గాలు లేవని నేను భావిస్తున్నాను.
ప్రశ్న 3.
మీ ప్రాంతంలో నలుగురు వ్యక్తులున్న ఒక కుటుంబం గౌరవప్రదమైన జీవితం గడపటానికి ఎన్ని ఎకరాల భూమి ఉంటే సరిపోతుంది?
జవాబు:
మా ప్రాంతంలో నలుగురు వ్యక్తులున్న ఒక కుటుంబం గౌరవప్రదమైన జీవితం గడపడానికి 8 ఎకరాలు నీటి వసతి ఉన్న భూమి, 30 ఎకరాలు నీటి వసతి లేని భూమి ఉంటే సరిపోతుంది.
8th Class Social Textbook Page No.186
ప్రశ్న 4.
భూ సంస్కరణ చట్టాలు భూస్వాములకు సహాయం చేయటానికి ప్రయత్నించాయని కొంతమంది అంటారు. మీరు వాళ్లతో ఏకీభవిస్తారా?
జవాబు:
నేను వారితో ఏకీభవిస్తాను. జమీందారులకు నష్టపరిహారం చెల్లించడం, ఖుద్ కాస్త లకు వారినే యజమానులుగా కొనసాగించడం మొదలైనవి ఈ వాదనను బలపరుస్తున్నాయి.
ప్రశ్న 5.
భూ సంస్కరణ చట్టాలు భూమినీ, అధికారాన్ని సంపన్న కౌలు రైతులకు మాత్రమే బదిలీ చేయటానికి ప్రయత్నించాయని కొంతమంది అంటారు. మీరు వాళ్లతో ఏకీభవిస్తారా?
జవాబు:
అవును. నేను వారితో ఏకీభవిస్తాను.
ప్రభుత్వం కౌలుదారులకు భూమిని ఇవ్వడానికి కొంత మొత్తాన్ని వెలగా నిర్ణయించింది. ఇది చెల్లించిన వారు మాత్రమే వీరు తాము సాగుచేసే భూమిని పొందగలిగారు. చెల్లించలేని పేదవారు కూలీలుగానే మిగిలిపోయారు.
ప్రశ్న 6.
వివిధ గ్రామీణ వర్గాల ప్రయోజనాల మధ్య సమతౌల్యం సాధించటానికి అంతర్గత ఘర్షణలు తగ్గించే ఉద్దేశంతో ఈ చట్టాలు ప్రయత్నించాయని మరికొంతమంది అభిప్రాయం. మీరు వాళ్లతో ఏకీభవిస్తారా?
జవాబు:
అవును. ఏకీభవిస్తాను.
ఈ చట్టాల వల్ల జమీందారులు భూస్వాములు గానూ, కొంతమంది కౌలుదారులు స్వంతదారులుగాను కొంతమంది పేదలు బంజరు భూముల యజమానులుగాను మారారు. దీనివల్ల ఘర్షణలు కొంతవరకు తగ్గాయని చెప్పవచ్చు.
ప్రశ్న 7.
ఈ చట్టాల వల్ల ఎవరు ఎక్కువ లాభపడ్డారు? ఎవరు అస్సలు లాభపడలేదు ? భూస్వాములు చాలా నష్టపోయారని మీరు అనుకుంటున్నారా?
జవాబు:
ఈ చట్టాల వలన జమీందారులు ఎక్కువ లాభపడ్డారు. కారణం
- వీరికి ఆదాయం పోయినా, అంతకు 20, 30 రెట్లు నష్టపరిహార రూపంలో లభించింది.
- ఖుదా కాలు కూడా వీరి ఆధీనంలోనే ఉన్నాయి.
- చట్టంలోని లొసుగులను ఉపయోగించి ఎక్కువ భూములను నియంత్రణలోనికి తెచ్చుకున్నారు.
ఈ చట్టాల వల్ల అస్సలు లాభపడని వారు పేద వ్యవసాయ కూలీలు.
కారణం :
వీరు గుర్తింపు లేక వ్యవసాయ కూలీలుగానే మిగిలిపోయారు.
8th Class Social Textbook Page No.189
ప్రశ్న 8.
వివిధ సంస్కరణల వల్ల తెలంగాణలో ఏ వర్గాల రైతాంగం లబ్ధి పొందింది? ఏ రకంగా లబ్ధి పొందింది?
జవాబు:
వివిధ సంస్కరణల వల్ల తెలంగాణలో భూస్వామ్య, ఆధిపత్య కులాల రైతాంగం లబ్ది పొందింది.
- జాగీర్దారీ రద్దు వల్ల ఈ జాగీర్లలో భూమిని సాగు చేస్తున్న ఆధిపత్య కులాలకు ఈ భూముల మీద పట్టాలు లభించాయి.
- జాగీర్దార్లు నష్టపరిహారంగా కొట్లు సంపాదించారు.
- పెద్ద పెద్ద భవనాలు, పశువుల కొట్టాలు, వ్యవసాయ పరికరాలు భూస్వాముల ఆధీనంలోనే ఉన్నాయి.
- వేలాది ఎకరాలు ఖుద్ కాఫ్ కింద ఉండిపోయాయి.
ఈ రకంగా భూస్వామ్య వ్యవస్థ లబ్ధి పొందిందని చెప్పవచ్చు.
ప్రశ్న 9.
భూమిలేని వృత్తి కులాలవారికి ఈ సంస్కరణల వల్ల ఏ మేరకు ప్రయోజనం కలిగింది?
జవాబు:
ఈ సంస్కరణల వలన వీరికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు.
ప్రశ్న 10.
భూస్వాములు ఎంత నష్టపోయారు? తమ ప్రయోజనాలను ఎంతవరకు కాపాడుకోగలిగారు?
జవాబు:
భూస్వాములు ఏమీ నష్టపోలేదని చెప్పవచ్చును. అనేక చట్టాలను సరిగా అమలుచేయలేదు. వీటి అమలులో జాప్యం వల్ల భూస్వాములు వీటిని తమ ప్రయోజనానికి వాడుకున్నారు. కౌలుదారీ చట్టాలలోని లొసుగులను ఆధారంగా చేసుకుని జమీందారులు కౌలుదారుల నుంచి భూములను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. జమీందారీల రద్దు తరువాత వాళ్లు ఆ భూములన్నీ తమవేనంటూ పెద్ద పెద్ద భూస్వాములుగా మిగిలారు. ఈ భూములను పరిశ్రమలు నెలకొల్పటానికి మళ్లించారు. ఉదాహరణకు చల్లపల్లి జమీందారు పంచదార కర్మాగారం కింద 2650 ఎకరాలు చూపించాడు. కాలక్రమంలో వీళ్లు ఆంధ్రలో పారిశ్రామికవేత్తలుగా మారారు. తెలంగాణలో వీళ్లు 21వ శతాబ్దంలో సైతం తమ పెత్తనాన్ని కొనసాగించారు.
ప్రశ్న 11.
కింది పట్టికను గమనించి ఖాళీలను పూరింపుము.
పట్టికను చదవటం :
1955-56కు సంబంధించిన గణాంకాలను జాగ్రత్తగా చదవండి. భూ సంస్కరణల తరవాత 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న సన్నకారు రైతులు 58 శాతంగా ఉన్నారు. రైతుల సంఖ్యలో సగం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ల కింద 20 శాతం కంటే తక్కువ సాగుభూమి ఉంది. ఇంకొకవైపున 10 శాతంగా ఉన్న పెద్ద రైతులు, భూస్వాముల కింద మొత్తం సాగుభూమిలో 38 శాతం ఉంది.
భూ సంస్కరణలు అమలు జరిపిన తరువాత 1970 దశకంలో చాలా మార్పులు వచ్చాయి. సన్నకారు రైతులు 58% నుండి 83% వరకు పెరిగారు. చిన్న రైతులు 32% నుండి 16% కు తగ్గారు. కాని వారు గతం కంటే కొంచెం ఎక్కువ భూమిని కలిగి ఉన్నారు. పెద్ద రైతులు 10% నుండి 1% కు తగ్గారు. వారి ఆధీనంలోని భూమి కూడా 38% నుండి 6% కి తగ్గింది.
8th Class Social Textbook Page No.190
ప్రశ్న 12.
ఈ చట్టాన్ని 1950లలోనే అమలు చేసి ఉండాల్సిందని చాలామంది భావిస్తారు. అయితే దీనివల్ల చాలా వ్యతిరేకత వచ్చి ఉండేదని కొంతమంది అభిప్రాయం. ఈ రెండు అభిప్రాయాల గురించి తరగతిలో చర్చించండి. మీరు దేనితో ఏకీభవిస్తారు?
జవాబు:
1950లో అమలుచేయటం నిజంగానే కష్ట సాధ్యం అయ్యేది. ఒకేసారిగా అందరి నుండి అంతంత భూమిని తీసుకున్నట్లయితే స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలోనే దేశ అంతర్గత పరిస్థితి అస్తవ్యస్తమయ్యేది. దీనివల్ల వ్యతిరేకత కూడా వచ్చి ఉండేది. కాని నాడు ‘ఉక్కు మనిషి’ అని పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ వంటి నాయకులున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ సమస్యలను త్వరలోనే అధిగమించగలిగేది. కాబట్టి అప్పుడు అమలుచేసి ఉండాల్సిందని నేను భావిస్తున్నాను.
ప్రశ్న 13.
భూ పరిమితి చట్టం ఆంధ్రప్రదేశ్ లోనూ, పశ్చిమ బెంగాల్ లోనూ అమలు అయిన విధానాన్ని పోల్చండి. చట్టాన్ని సమర్ధవంతంగా ఎలా అమలు చేయాలో చర్చించండి.
జవాబు:
భూ పరిమితి చట్టం ఆంధ్రప్రదేశ్ లో చాలా అధ్వాన్నంగా అమలు అయిందని చెప్పవచ్చు. అనేకమంది భూస్వాములు అధికారుల ముందు తప్పుడు ప్రకటనలు చేసి, అదనపు భూమిని వెల్లడి చేయలేదు. చట్టం వస్తుందని ముందుగానే తెలిసిన అనేకమంది భూస్వాములు తమ భూములను దగ్గర బంధువులు, స్నేహితులు, జీతగాళ్ళ పేరు మీద కూడా బదిలీ చేశారు. భార్యాభర్తలను వేరువేరు కుటుంబాలుగా చూపించటానికి కోర్టుల ద్వారా ఉత్తుత్తి విడాకులు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చట్టం ప్రకారం అదనపు భూమి ఉన్న రైతులు కూడా తమ భూములను కాపాడుకుని మిగులు భూమిని చూపించలేదు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న మిగులు భూమిలో చాలా వరకు సాగుకు పనికిరానిదిగా ఉంది. భూపరిమితి చట్టాలను సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలలో పశ్చిమబెంగాల్ ఒకటి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కృతనిశ్చయంతో వ్యవహరించి సన్నకారు రైతులు, భూమిలేని పేదలను సమీకరించి భూ పరిమితి చట్టాలు అమలు అయ్యేలా చూసింది. ఇది సరిగా అమలు కావాలంటే రాజకీయ నాయకులకు, అధికారులకు, ప్రజానీకానికీ కూడా నిబద్ధత ఉండాలి.
ప్రశ్న 14.
భూ పరిమితి చట్ట అవసరం ఎందుకు ఏర్పడింది?
జవాబు:
1950 నుండి ఎన్ని రకాల చట్టాలు చేసినా అవి భారతదేశంలోని భూమి యాజమాన్య పరిస్థితులను మార్చలేకపోయాయి. జమీందారులను భూస్వాములు గాను, భూస్వాములు పెద్ద రైతులు గాను మారారు తప్ప సామాన్య ప్రజానీకానికి, పేదవారికి ఒరిగినదేమీ లేదు. భూమి అంతా కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోయింది. అందువలన భూ పరిమితి చట్టం అవసరం ఏర్పడింది.
ప్రాజెక్టు
అయిదుగురు విద్యార్ధుల చొప్పున బృందాలుగా ఏర్పడి, మీ ప్రాంతంలోని కొంతమంది పెద్దలతో భూ సంస్కరణల అమలులో వాళ్ల అనుభవాల గురించి అడగండి. ఈ పాఠంలో పేర్కొన్న అంశాలు మీ ఊల్లో కూడా జరిగాయేమో తెలుసుకోండి. దీనిపై ఒక నివేదిక తయారుచేసి తరగతిలో చర్చించండి.
జవాబు:
నివేదిక
మా ప్రాంతంలో దాదాపు 15 మంది పెద్దలను మేము అనుభవాలు అడిగి తెలుసుకున్నాము. ఈ భూ సంస్కరణల అమలులో కొద్దిమంది. బికారులు అయిపోయారట. కొద్దిమంది తప్పించుకున్నారట. రాత్రికి రాత్రి చట్టం గురించి తెలిసిన వారు ఆస్తిని బంధువులు, పాలేర్లు అందరి పేర్ల మీద మార్చి తమ భూములను కాపాడుకున్నారు. విషయం తెలియని వారు వారి భూమిని, ఆస్తిని పోగొట్టుకున్నారని వాపోయారు. మొత్తం మీద ఇది కొంతమందికి ఉపశమనాన్ని, కొంతమందికి దుఃఖాన్ని మిగిల్చింది.