SCERT AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Physical Science 3rd Lesson Questions and Answers మన చుట్టూ ఉన్న పదార్థం
8th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
కింది వాటిని వివరించే కృత్యాలను తెలపండి. (AS1)
(అ) కణాల చలనం (ఆ) కణాల మధ్య ఆకర్షణ , (ఇ) కణాల మధ్య స్థలం
జవాబు:
(అ) కణాల చలనాన్ని వివరించే కృత్యం :
- రెండు ‘250 మి.లీ. బీకర్లు తీసుకొని వాటిలో కొద్దిగా నీరు నింపండి.
- ఒక డ్రాపర్ సహాయముతో ఎరుపు / నీలం ఇంకును ఒక బీకరు గోడల వెంబడి నీటిలో కలపండి.
- రెండవ బీకరులోని నీటికి పొటాషియం పర్మాంగనేటు (KMNO4) ద్రావణాన్ని కలపండి.
- మొదటి బేకరులో ఇంకు కణాలు నెమ్మదిగా నీటిలో వ్యాపనం చెందడాన్ని గమనిస్తాము.
- రెండవ బీకరులో పొటాషియం పర్మాంగనేటు కణాలు నీటిలో త్వరగా వ్యాపనం చెందడాన్ని గమనిస్తాము.
- ఈ కృత్యం ద్వారా పదార్థంలోని కణాలు చలిస్తాయని తెలుస్తుంది.
(ఆ) కణాల మధ్య ఆకర్షణను వివరించే కృత్యం : (కృత్యం – 9 )
- ఒక కుళాయి (నల్లా)ను విడిచి నీరు ధారగా వచ్చునట్లు చేయండి.
- నీటి ధారను మధ్యగా మీ చేతి వేలితో విడగొట్టే ప్రయత్నం చేయండి.
- నీటి ధారను పాక్షికంగా విడగొట్టగలిగాముగాని, శాశ్వతంగా విడగొట్టలేము.
- నీటి అణువుల మధ్య గల ఆకర్షణ బలమే నీటి ధార విడిపోకుండా నిరంతరంగా కలిసి ఉండడానికి కారణము.
- ఇప్పుడు ఒక మేకును మీ చేతితో విరగగొట్టడానికి ప్రయత్నం చేయండి.
- మేకులోని కణాల మధ్యగల ఆకర్షణ బలం చాలా ఎక్కువగా ఉండడం వల్ల మేకును విరగగొట్టలేము.
- ఇదే విధంగా సుద్దముక్కను విరవడానికి ప్రయత్నించినపుడు సులభంగా విరవగలము.
- దీనికి కారణం, సుద్దముక్కలోని కణాల మధ్య గల బలహీన ఆకర్షణ బలాలే.
- పై పరిశీలనల ద్వారా పదార్థపు కణాల మధ్య ఆకర్షణ బలం ఉంటుందని, ఆ బలం పదార్థ కణాలను కలిపి ఉండేలా చేస్తుందని చెప్పవచ్చు.
- కణాల మధ్య ఉండే ఈ ఆకర్షణ బలం పదార్థం యొక్క అన్ని స్థితులలో ఒకేలా ఉండదు.
(ఇ) కణాల మధ్య స్థలాన్ని వివరించే కృత్యం : (కృత్యం – 8)
- ఒక బీకరులో కొంత నీటిని తీసుకొని దాని మట్టాన్ని గుర్తించండి.
- దానికి కొద్దిగా ఉప్పును కలిపి, అది కరిగే వరకు గాజు కడ్డీతో తిప్పండి.
- నీటి మట్టంలో ఏమైనా తేడా ఉందేమో గమనించండి. ఎటువంటి ఆ తేడాను గమనించము.
- మరికొంత ఉప్పును కలిపి చూడండి.
- మరల నీటి మట్టాన్ని గుర్తించండి. ఇప్పుడు కూడా ఎటువంటి తేడాను గమనించము.
- బీకరులోని నీటిలో కొంత ఉప్పు కరగకుండా ఉండే వరకు ఈ ప్రక్రియను కొనసాగించండి.
- ఈ కృత్యము నుండి ఘన, ద్రవ పదార్థాలలోని కణాల మధ్య కొంత ఖాళీస్థలం ఉంటుందని తెలుస్తుంది.
- ఘన పదార్థాలను ద్రవ పదార్థాలలో కరిగించినపుడు ఘన పదార్థాలలోని కణాలు ద్రవాల మధ్య గల ఈ ఖాళీ స్థలంలోకి చేరతాయి.
- ఈ విధంగా కణాలు ఖాళీ స్థలాన్ని ఆక్రమించిన తరువాత ఘన పదార్థంలోని కణాలను, ఆక్రమించుకోవడానికి ఖాళీ స్థలం లేకపోవడం వల్ల కరగకుండా ఉండిపోతాయి.
ప్రశ్న 2.
వ్యాపన ధర్మం ఆధారంగా పదార్థ లక్షణాలను వివరించండి. (AS1)
జవాబు:
వ్యాపన ధర్మం ఆధారంగా పదార్థ లక్షణాలు కింది విధంగా ఉన్నాయి. అవి :
- పదార్థం అతి సూక్ష్మమైన కణాలచే నిర్మింపబడి ఉంటుంది.
- పదార్థంలోని కణాల మధ్య ఖాళీ స్థలం ఉంటుంది.
- ఘన మరియు ద్రవ పదార్థ కణాలు ద్రవాలలోకి వ్యాపనం చెందుతాయి.
- వాయు కణాలు వాయు పదార్థంలోకి వ్యాపనం చెందుతాయి.
- వ్యాపన రేటు వాయు పదార్థాలకు అధికంగాను, ఘన పదార్థాలకు అత్యల్పంగాను, ద్రవ పదార్థాలకు మధ్యస్థంగాను ఉంటుంది.
- ఘన పదార్థాలను ద్రవ పదార్థాలలో కరిగించినపుడు, ఘన పదార్థాలలోని కణాలు ద్రవకణాల మధ్య గల ఖాళీ స్థలంలోకి చేరతాయి.
- పదార్థం యొక్క కణాలు ద్రవ మరియు వాయు పదార్థాలలో నిరంతరం చలిస్తుంటాయి.
ప్రశ్న 3.
“నీటిలో చక్కెర కలిపినపుడు ద్రావణం ఘనపరిమాణం పెరగదు.” ఈ వాక్యం సరైనదా? కాదా? కారణాన్ని తెలపండి. చక్కెర, నీటి పరిమాణాలను దృష్టిలో పెట్టుకుని పై వాక్యాన్ని గురించి వ్యాఖ్యానించండి. (AS1)
ఈ వాక్యం సరైనదే.
కారణం :
చక్కెరను నీటిలో కలిపినపుడు చక్కెర కణాలు నీటి అణువుల మధ్యనున్న ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తాయి. కావున నీటి ఘనపరిమాణములో ఎటువంటి మార్పూ ఉండదు.
ప్రశ్న 4.
పదార్థ స్థితిలో మార్పు జరిగినపుడు దాని ద్రవ్యరాశిలో మార్పు ఉంటుందా? ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:
- ఒక బీకరును తీసుకొని దానిని మంచు ముక్కలతో నింపండి.
- స్ప్రింగు బాలెన్స్ ద్వారా మంచు ముక్కలతో సహా బీకరు ద్రవ్యరాశిని (m1) కనుగొనండి.
- బీకరును కొంత సేపు నిలకడగా ఉంచి మంచు ముక్కలు కరగనివ్వండి.
- ఇప్పుడు మరల స్ప్రింగు బాలెన్స్ సహాయంతో బీకరు ద్రవ్యరాశిని (m2) కనుగొనండి.
- m1 = m2 అని మనము గమనిస్తాము.
- దీని ద్వారా పదార్థ స్థితిలో మార్పు జరిగినపుడు దాని ద్రవ్యరాశిలో మార్పు ఉండదని తెలుస్తుంది.
ప్రశ్న 5.
అన్ని పదార్థాలు వేడిచేసినపుడు ఘనస్థితి నుండి ద్రవస్థితికి, ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుతాయా? వివరించండి. (AS1)
జవాబు:
అన్ని పదార్థాలు వేడిచేసినపుడు ఘనస్థితి నుండి ద్రవస్థితికి, ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారవు.
ఉదా :
- చెక్కను వేడిచేసినపుడు అది ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారదు. కానీ దాని రూపంలో మార్పు వస్తుంది.
- రక్తాన్ని వేడిచేసినపుడు ద్రవస్థితి నుండి ‘ఘనస్థితికి మారును.
ప్రశ్న 6.
కింది వానిని నిర్వచించండి. (AS1)
అ) ద్రవీభవన స్థానం – ఆ) మరుగుస్థానం ఇ) ఇగురుట
జవాబు:
అ) ద్రవీభవన స్థానం :
ఏ ఉష్ణోగ్రత వద్ద ఘనపదార్థం కరిగి ద్రవ పదార్థంగా మారుతుందో, ఆ ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటారు.
ఆ) మరుగుస్థానం :
వాతావరణ పీడనం వద్ద ద్రవాలు బాష్పంగా మారే ఉష్ణోగ్రతను ‘మరుగుస్థానం’ అంటారు.
ఇ) ఇగురుట :
మరుగు స్థానం కన్నా దిగువున ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవాలు బాష్పంగా మారగలిగే దృగ్విషయాన్ని ‘ఇగురుట’ అంటారు.
ప్రశ్న 7.
కింద ఇవ్వబడిన వాక్యాలను సరిచేయండి. (AS1)
అ) వాతావరణ పీడనంలో 100°C.వద్ద నీరు మరుగును.
జవాబు:
ఈ వాక్యము సరియైనది.
ఆ) ద్రవం ఉష్ణోగ్రత మరుగుస్థానం దాటిన తరువాత మాత్రమే ద్రవం ఇగురుతుంది.
జవాబు:
ఈ వాక్యము సరియైనది కాదు.
కారణం :
మరుగు స్థానం దిగువన ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవం ఇగురుతుంది.
ఇ) ఘన పదార్థాలలో కణాల మధ్య ఎక్కువ స్థలం ఉంటుంది.
జవాబు:
ఈ వాక్యం సరియైనది కాదు.
కారణం :
- ఘన పదార్థాలలో కణాల మధ్య ఖాళీ స్థలం చాలా తక్కువ.
- దీనివల్ల కణాల మధ్య ఆకర్షణ బలం అధికంగా ఉంటుంది.
- అందువల్లనే ఘనపదార్థాలు నిర్దిష్ట ఆకారాన్ని, స్థిరమైన ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయి.
ఈ) వాయు పదార్థాలలో కణాల మధ్య బలమైన ఆకర్షణ బలం ఉంటుంది.
జవాబు:
ఈ వాక్యము సరియైనది కాదు.
సరైన వాక్యం :
వాయు పదార్థాల కణాల మధ్య బలహీనమైన ఆకర్షణ బలం ఉంటుంది.
వివరణ :
- వాయువులలో కణాల మధ్య ఖాళీ స్థలం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కణాల మధ్య ఆకర్షణ బలాలు చాలా బలహీనంగా ఉంటాయి.
- దీనివల్ల వాయు పదార్థాలు స్థిరమైన ఆకారాన్ని గాని, నిర్దిష్టమైన ఘనపరిమాణాన్ని గాని కలిగి ఉండవు.
- వాయు పదార్థాలను మూయబడిన సిలిండర్లలో మాత్రమే నిలువ చేస్తారు.
ప్రశ్న 8.
వేడిగా ఉన్న ‘టీ’ ని కప్పుతో పోల్చినపుడు సాసర్ తో త్వరగా త్రాగవచ్చు. ఎందుకు? (AS1)
జవాబు:
- సాసర్ యొక్క ఉపరితల వైశాల్యము కప్పు యొక్క ఉపరితల వైశాల్యము కన్న ఎక్కువ.
- ఉపరితల వైశాల్యం పెరిగినపుడు వేగంగా ఇగరడం మనకు తెలుసు.
- దీనివల్ల వేడి ‘టీ’ లోని కణాలు కప్పుకన్నా సాసర్ నుండి త్వరగా తప్పించుకొనిపోగలవు.
- అందువల్ల కప్పుకన్నా సాసరులో టీ త్వరగా చల్లారును.
ప్రశ్న 9.
నీరు ఘనీభవించి మంచుగా మారుతుంది. ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రత ………. (AS1)
అ) కోల్పోతుంది ఆ) గ్రహిస్తుంది ఇ) మార్పు ఉండదు
ఈ) ఆయా పరిస్థితులననుసరించి గ్రహించడం కాని, కోల్పోవడం కాని జరుగుతుంది.
జవాబు:
అ) కోల్పోతుంది.
ప్రశ్న 10.
కింద ఇవ్వబడిన ఉష్ణోగ్రతలను సెల్సియస్ డిగ్రీలలోకి మార్చండి. (AS1)
అ) 283K
ఆ) 570K
జవాబు:
అ) 283K
283K = 283 – 273 = 10
∴ 283K = 10°C
ఆ) 570K
570K = 570 – 273 = 297
∴ 570K = 297°C
ప్రశ్న 11.
కింద ఇవ్వబడిన ఉష్ణోగ్రతలను కెల్విన్ డిగ్రీలలోనికి మార్చండి. (AS1)
అ) 27°C
ఆ) 367°C
జవాబు:
అ) 27°C
0°C = 273K
27°C = 273 + 27 = 300
∴ 27°C = 300K
ఆ) 367°C
0°C = 273K
367° = 273 + 367 = 640
∴ 367°C = 640K
ప్రశ్న 12.
ఖాళీలను పూర్తి చేయండి. (AS1)
అ) పదార్థాన్ని ఒక స్థితి నుండి మరొక స్థితిలోకి మార్చడానికి ………. ను తగ్గించాలి, లేదా ……. ను పెంచాలి.
జవాబు:
ఉష్ణోగ్రత, పీడనము
ఆ) ఘన పదార్థం ద్రవస్థితిలోకి మారకుండానే నేరుగా వాయు స్థితిలోకి మారడాన్ని ……… అంటారు.
జవాబు:
ఉత్పతనం
ప్రశ్న 13.
కింది వాటిని జతపరచండి. (AS1)
1. ద్రవస్థితి నుండి వాయు స్థితికి మార్పు | A. వాయువు |
2. సంపీడ్యము కాకపోవటం | B. ఘనస్థితి |
3. వీలైనంత విస్తరించటం | C. కణం |
4. పదార్థంలో భాగం | D. ఇగురుట |
జవాబు:
1. ద్రవస్థితి నుండి వాయు స్థితికి మార్పు | D. ఇగురుట |
2. సంపీడ్యము కాకపోవటం | B. ఘనస్థితి |
3. వీలైనంత విస్తరించటం | A. వాయువు |
4. పదార్థంలో భాగం | C. కణం |
ప్రశ్న 14.
అత్తరు ఉంచిన స్థానం నుండి కొన్ని మీటర్ల దూరం వరకు వాసనను గుర్తించగలం. ఎందుకు? (AS2, AS1)
జవాబు:
- వాయు కణాలు, గాలిలో వేగంగా చలిస్తాయని మనకు తెలుసు.
- అదే విధంగా అత్తరు కణాలు కూడా గాలిలో కొన్ని .మీటర్ల దూరం వరకు చలిస్తాయి.
- అందువల్ల అత్తరు ఉంచిన స్థానం నుండి కొన్ని మీటర్ల దూరం వరకు వాసనను గుర్తించగలం.
ప్రశ్న 15.
శరీరంపై వేడి నీరు కన్నా నీటి ఆవిరి (steam) ఎక్కువ గాయం కలుగజేస్తుంది. ఎందుకు? (AS2, AS1)
జవాబు:
- వేడి నీటి కణాలకన్నా నీటి ఆవిరి కణాలకు ఎక్కువ శక్తి ఉంటుంది.
- బాష్పీభవన గుప్తోష్ణం రూపంలో నీటి ఆవిరి కణాలు అధిక శక్తిని గ్రహించడం వల్ల వీటి శక్తి అధికంగా ఉంటుంది.
- అందువల్ల శరీరంపై వేడి నీరు కన్నా నీటి ఆవిరి ఎక్కువ గాయం కలుగజేస్తుంది.
ప్రశ్న 16.
ఘన, ద్రవ, వాయుస్థితులలో కణాల అమరికను చూపే నమూనాను రూపొందించండి. (AS5)
జవాబు:
విద్యార్థులు జాగ్రత్తగా ఆలోచించి తమ సొంత నమూనాలు ఉపాధ్యాయుని సహకారంతో తయారు చేసుకోవాలి.
ప్రశ్న 17.
శరీరంలోని చెమట ద్వారా మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే ప్రక్రియను నీవు ఎలా ప్రశంసిస్తావు? (AS6)
జవాబు:
- మనం ఏదైనా భౌతిక వ్యాయామం చేసినపుడు కానీ, ఎండలో కష్టపడి పనిచేసినప్పుడు గాని మన శరీరంపై చెమట ఏర్పడుటను గమనిస్తాము.
- మన శరీరంలోని వేడిని సంగ్రహించిన చెమట శరీర ఉపరితలం నుండి ఇగురును.
- అనగా ద్రవరూపంలోని చెమట బిందువులు, మన శరీరం నుండి వేడిని సంగ్రహించి పరిసరాలలోనికి ఇగిరిపోవును.
- దీనివల్ల మనము చల్లదనాన్ని అనుభవిస్తాము.
8th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం Textbook InText Questions and Answers
ఆలోచించండి – చర్చించండి
8th Class Physical Science Textbook Page No. 34
ప్రశ్న 1.
రబ్బర్ బాండ్ లాగండి, దాని ఆకారం మారిందా?
రబ్బర్ బాండ్ ఘన పదార్థమా లేక ద్రవ పదార్థమా? ,ఎందుకు? అలాగడం ఆపినపుడు ఏం జరుగుతుంది? అలాగే ఎక్కువగా లాగినపుడు ఏం జరుగుతుంది? ఆలోచించండి.)
జవాబు:
- రబ్బరు బ్యాండును లాగినపుడు దాని ఆకారం మారుతుంది.
- ఇది ఒక ఘనపదార్థం.
- లాగడం ఆపినపుడు తిరిగి పూర్వపు ఆకారాన్ని పొందుతుంది.
- అలాగే ఎక్కువగా లాగినపుడు అది తన ఆకారాన్ని శాశ్వతంగా కోల్పోతుంది. (తెగిపోతుంది)
కారణం :
రబ్బరు బాండ్ ఘనపదార్థమే అయినప్పటికీ, దానిని తయారుచేసిన పదార్థ కణాల స్వభావం వల్ల పై ఫలితాలు కనబడుతాయి.
ప్రశ్న 2.
సన్నని పొడిగా ఉన్న ఉప్పును కొంత పరిమాణంలో తీసుకుని రెండు వేర్వేరు గాజు గ్లాసులలో వేసినపుడు ఆ ఉప్పు ఏ ఆకారాన్ని పొందింది? ఆకారంలో వచ్చిన మార్పు కారణంగా ఉప్పు ద్రవస్థితిలో ఉందని చెప్పగలమా? సమర్థించండి.
జవాబు:
- పొడిగా ఉన్న ఉప్పు అది పోసిన పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతుంది.
- ఇది ఒక ఘనపదార్థము.
సమర్థన :
- స్థితి లేదా ఆకారంలోని మార్పు అనగా కణాల అమరికలో పూర్తి మార్పు.
- కానీ పొడిగానున్న ఉప్పు అతి సూక్ష్మ కణాల కలయిక. ఇవి తమ ఆకారాన్ని కోల్పోవు.
ప్రశ్న 3.
ఒక స్పాంజ్ ముక్కను తీసుకొని దాని ఆకారాన్ని పరిశీలించండి. స్పాంజ్ ను మీరు అదమగలరా? ఇది ఘన పదార్ధమేనా? ఎందుకు? (స్పాంజ్ ను అదిమినపుడు దాని నుండి ఏదైనా పదార్థం బయటకు వస్తుందా? ఆలోచించండి) మనం కర్రముక్కను ఎందుకు అదమలేం?
జవాబు:
స్పాంజ్ ని అదమగలము. ఇది ఒక ఘనపదార్థము.
సమర్థన:
- సాధారణ దృఢ వస్తువు కన్నా, స్పాంజ్ లోని కణాల మధ్య ఖాళీ స్థలం కొంచెం ఎక్కువగా ఉంటుంది.
- కావున దీనిని అదిమి, దాని ఆకారాన్ని మార్చగలము.
- చెక్కముక్కలో కణాల మధ్య ఖాళీ స్థలం చాలా తక్కువగా వుంటుంది.
- కావున కర్ర/ చెక్కను సాధారణ పరిస్థితులలో అదిమి, దాని ఆకారాన్ని మార్చలేము.
8th Class Physical Science Textbook Page No. 42
ప్రశ్న 4.
వేసవి కాలంలో నూలు దుస్తులు ఎందుకు ధరిస్తాము?
జవాబు:
- వేసవిలో బాహ్య వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత వల్ల మన శరీరం నుండి చెమట అధికంగా వెలువడుతుంది.
- చెమట బాష్పంగా మారినపుడు మన శరీరం చల్లగా ఉందనే అనుభూతి కలుగుతుంది.
- నూలు దుస్తులు చెమటను త్వరగా పీల్చుకుంటాయి. అందువల్ల చల్లదనం అనే అనుభూతి కలుగుతుంది.
- సిల్కు పాలిస్టర్ లాంటి సింథటిక్ వస్త్రాలు చెమటను పీల్చుకోవు.
- అందువల్ల వేసవిలో నూలు దుస్తులను మాత్రమే ధరిస్తాము.
ప్రశ్న 5.
మంచుముక్కలు గల గాజుపాత్ర వెలుపలి గోడలపై నీటి బిందువులు ఎందుకు ఏర్పడతాయి?
జవాబు:
- గ్లాసులోని మంచుముక్కలు గ్లాసు యొక్క ఉపరితలాన్ని చల్లబరుస్తాయి.
- గ్లాసు ఉపరితలం చుట్టుపక్కల గల గాలిలో నీటి బాష్పం ఉంటుంది. ఈ నీటి బాష్పం , గ్లాసు ఉపరితలం కన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది.
- చల్లని గ్లాసు ఉపరితలం, తన చుట్టుపక్కలనున్న నీటి బాష్పాన్ని చల్లబరుస్తుంది.
- ఈ నీటి బాష్పం మరల నీరుగా మారుతుంది.
- ఈ నీరు గ్లాసు ఉపరితలంపై నీటి బిందువులుగా ఏర్పడుతుంది.
ప్రశ్న 6.
వేడి ఎక్కువగా ఉన్న రోజులలో పందులు నీటి గుంటలలో ఎక్కువ సమయం గడుపుతాయి. ఎందుకు?
జవాబు:
- పందుల చర్మం పైనున్న స్వేదరంధ్రాలు మామూలు జంతువులు/ మనుషుల కన్నా కొంచెం పెద్దవిగా వుంటాయి.
- పెద్ద స్వేదరంధ్రాల ద్వారా శరీరంలోని నీరు అధికంగా చెమట రూపంలో బయటకు రావడంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది.
- దీనిని అరికట్టడానికై పందులు బురదలో పొర్లి తమ చర్మం పైనున్న పెద్ద స్వేద రంధ్రాలను బురదతో కప్పి ఉంచుతాయి.
- అందువల్ల చెమట ఇగురుట అనేది త్వరగా జరుగదు.
8th Class Physical Science Textbook Page No. 31
ప్రశ్న 7.
నీటి వలె మూడు స్థితులలో లభించే పదార్థాలేమైనా ఉన్నాయా?
జవాబు:
‘మైనం’ కూడా నీటి .వలె మూడు స్థితులలో లభిస్తుంది.
ప్రశ్న 8.
పెట్రోల్, పాలను ఏ ధర్మాల ఆధారంగా ద్రవాలుగా పరిగణిస్తాము?
జవాబు:
పెట్రోల్, పాలు వంటి వాటికి నిర్దిష్ట ఆకారం లేదు. ఇవి, వాటిని పోసిన పాత్రల ఆకారాన్ని పొందుతాయి. అందువల్ల వీటిని ద్రవాలుగా పరిగణించవచ్చు.
8th Class Physical Science Textbook Page No. 32
ప్రశ్న 9.
ఘన పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం, ఘనపరిమాణం ఉంటుందా?
జవాబు:
ఘన పదార్థాలు నిర్దిష్ట ఆకారాన్ని, స్థిరమైన ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయి.
ప్రశ్న 10.
నీటిని నేలపై పోస్తే ఏ ఆకారంలోకి మారుతుంది?
జవాబు:
నీటిని నేల పై జారవిడిస్తే అది నేలపై ప్రవహిస్తుంది.
ప్రశ్న 11.
ప్రవాహి అంటే ఏమిటో చెప్పగలరా?
జవాబు:
ప్రవహించే పదార్థాన్ని ‘ప్రవాహి’ అంటారు.
8th Class Physical Science Textbook Page No. 33
ప్రశ్న 12.
CNG కి నిర్దిష్టమైన ఘనపరిమాణం ఉంటుందా?
జవాబు:
CNG కి నిర్దిష్టమైన ఘనపరిమాణం ఉండదు.
ప్రశ్న 13.
CNG కి నిర్దిష్టమైన ఆకారం ఉంటుందా?
జవాబు:
CNG కి నిర్దిష్టమైన ఆకారం లేదు. అది దానిని నిల్వ ఉంచిన సిలిండర్ ఆకారాన్ని పొందుతుంది.
8th Class Physical Science Textbook Page No. 34
ప్రశ్న 14.
అగరబత్తి, అత్తరు వాసనలు ఒకే సమయంలో ఒక మూల నుండి మరొక మూలకు చేరతాయా?
జవాబు:
అత్తరు వాసన, అగరబత్తి వాసన కన్నా త్వరగా ఒక మూల నుండి మరొక మూలకు చేరుతుంది. వాయువుల వ్యాపన వేగంలో మార్పే దీనికి కారణము.
8th Class Physical Science Textbook Page No. 36
ప్రశ్న 15.
ఘన, ద్రవ పదార్థాల కన్నా వాయువులు ఎందుకు వేగంగా వ్యాపనం చెందుతాయి?
జవాబు:
వాయుకణాల మధ్య ఖాళీ స్థలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఖాళీ స్థలం ఘనపదార్థ కణాలు, ద్రవపదార్థ కణాల కన్నా అధికం. అందువల్ల వాయుకణాల మధ్య ఆకర్షణ బలం చాలా బలహీనంగా ఉంటుంది. కావున వాయువులు త్వరగా వ్యాపనం చెందుతాయి.
ప్రశ్న 16.
నీరు ఎప్పుడు మంచుగా మారుతుంది? ఎప్పుడు బాష్పంగా మారుతుంది?
జవాబు:
- నీటిని రిఫ్రిజిరేటరులో ఉంచి చల్లబరచినపుడు (ఉష్ణోగ్రతను తగ్గించినపుడు) మంచుగా మారును.
- నీటిని వేడిచేసినపుడు (ఉష్ణోగ్రతను పెంచినపుడు) భాష్పంగా మారును.
8th Class Physical Science Textbook Page No. 38
ప్రశ్న 17.
పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారేటప్పుడు ఆ పదార్థంలో అంతర్గతంగా ఏ ఏ మార్పులు సంభవిస్తాయి?
జవాబు:
పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారేటప్పుడు ఆ పదార్థంలో అంతర్గతంగా ఘనపరిమాణం పెరుగుట/ తగ్గుటను గమనిస్తాము.
8th Class Physical Science Textbook Page No. 39
ప్రశ్న 18.
పదార్థంలో స్థితి మార్పు ఎలా జరుగుతుంది?
జవాబు:
పదార్థ ఉష్ణోగ్రతలో మార్పు వల్ల స్థితి మార్పు జరుగుతుంది.
ప్రశ్న 19.
పదార్థ స్థితిలో మార్పు జరిగేటప్పుడు కణాలు ఎలాంటి మార్పుకు లోనవుతాయి?
జవాబు:
పదార్థ స్థితిలో మార్పు జరిగేటప్పుడు కణాల గతిశక్తిలో (పెరుగుదల/తగ్గుదల) మార్పు జరుగుతుంది. దీనివల్ల కణాల మధ్య ఆకర్షణ బలం (పెరుగుట / తగ్గుట)లో మార్పు జరుగుతుంది.
8th Class Physical Science Textbook Page No. 41
ప్రశ్న 20.
ఒక సిలిండర్ లో ఉన్న వాయువుపై పీడనాన్ని పెంచి సంపీడ్యం చెందిస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
ఒక సిలిండర్ లో ఉన్న వాయువుపై పీడనాన్ని పెంచి సంపీడ్యం చెందిస్తే దాని ఘనపరిమాణం తగ్గుతుంది (బాయిల్ నియమం).
ప్రశ్న 21.
సిలిండర్ లోని వాయు కణాలు దగ్గరగా వస్తాయా?
జవాబు:
వాయు కణాల మధ్య ఖాళీస్థలం బాగా తగ్గి, సిలిండర్ లోని వాయుకణాలన్నీ దగ్గరగా వస్తాయి.
ప్రశ్న 22.
పదార్థ పీడనంలో మార్పు కలిగిస్తే పదార్థపు స్థితిలో మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారా?
జవాబు:
పదార్థ పీడనంలో మార్పు కలిగిస్తే పదార్ధపు స్థితిలో మార్పు వస్తుంది.
ప్రశ్న 23.
పీడనాన్ని పెంచటం ద్వారా లేదా ఉష్ణోగ్రత తగ్గించడం ద్వారా వాయువును ద్రవస్థితిలోకి మార్చగలమా?
జవాబు:
వాయువును వాటి సంక్లిష్ట ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద చల్లబరచినపుడు ద్రవస్థితిలోకి మార్చవచ్చు. కావున – పీడనం, ఉష్ణోగ్రతలలో మార్పు ద్వారా వాయువును ద్రవస్థితిలోకి మార్చవచ్చు.
ప్రశ్న 24.
పదార్థ స్థితిని మార్చడానికి మనం ప్రతిసారి దానికి ఉష్ణాన్ని అందించడం లేక పీడనంలో మార్పు కలిగించడం చేయవలసిందేనా?
జవాబు:
సహజంగా నీరు ఇగిరే ప్రక్రియ వంటి కొన్ని సహజ దృగ్విషయాలకు మినహా మిగిలిన సందర్భాలలో స్థితిని మార్చడానికి దానికి ఉష్ణాన్ని అందించడం లేక పీడనంలో మార్పు కలిగించడం అవసరమే.
ప్రశ్న 25.
ద్రవాలు వాటి ఉష్ణోగ్రత బాష్పీభవన స్థానాన్ని చేరకుండానే ద్రవస్థితి నుండి బాష్పంగా మారడం సాధ్యమేనా?
జవాబు:
తడి బట్టలు పొడిగా మారే ప్రక్రియలో, నీరు దాని బాష్పీభవన స్థానాన్ని చేరకుండానే ద్రవస్థితి నుండి బాష్పంగా మారుతుంది. కావున ఇది సాధ్యమే.
ప్రశ్న 26.
స్థితి మార్పులకు మరికొన్ని ఉదాహరణలివ్వండి.
జవాబు:
అయొడిన్ ఉత్పతనము, తడిగావున్న శరీరం ఆరుట మొదలైనవి.
ప్రశ్న 27.
ఈ రకమైన స్థితిమార్పులకు కారణం ఏమై ఉంటుంది?
జవాబు:
- పదార్ధంలోని ప్రతికణం దాని స్థితులతో సంబంధం లేకుండా నిర్దిష్ట ఉష్ణోగ్రతల వద్ద ఎంతో కొంత శక్తిని కలిగి ఉంటుంది.
- ఉదాహరణకు ద్రవాల ఉపరితలంపై ఉండే కణాలు ద్రవం లోపలి భాగంలో ఉండే మిగతా కణాల కన్నా అధిక శక్తిని కలిగి ఉంటాయి.
- అందువల్ల ఈ కణాలు వాటి మధ్యగల ఆకర్షణ బలాన్ని సులువుగా అధిగమించి బాష్పంగా మారతాయి.
పరికరాల జాబితా
వివిధ ఆకారములలో ఉన్న పాత్రలు, బీకరు, కొలజాడీ, శాంకువకు ప్పె, గోళాకారపు గాజుకుప్పె, పరీక్ష నాళిక, పెద్ద సిరంజి, అగరుబత్తి, సెంటు సీసా, పొటాషియం పర్మాంగనేట్, కాపర్ సల్ఫేట్, గుర్తించబడిన స్కేలు గల గాజు గొట్టం, రెండు రబ్బరు కార్కులు, దూది, అమ్మోనియా, హైడ్రోక్లోరికామ్ల ద్రావణాలు, డ్రాపర్, నీరు, ఉప్పు, ధర్మామీటరు, సారాయి దీపం, పింగాణి పాత్ర.
8th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం Textbook Activities
కృత్యములు
కృత్యం – 1
ప్రశ్న 1.
ద్రవాల ఆకార, పరిమాణాలను గుర్తించటం :
a) ద్రవ పదార్థాలకు నిర్దిష్ట ఆకారం లేదని నిరూపించుము.
జవాబు:
- ఒక స్థూపాకార కొలజాడిని, వేరు వేరు ఆకారాలలో ఉన్న పారదర్శకమైన పాత్రలను కొన్నింటిని తీసుకోండి.
- కొలజాడిలో కొంత పరిమాణంలో నీటిని తీసుకోండి.
- ఈ నీటిని ఒక పాత్రలో పోసి ఆ నీటి ఆకారాన్ని గమనించండి.
- ఇదే నీటిని వేరు వేరు పాత్రలలో పోసి, నీరు పొందిన ఆకారాన్ని ఒకే ఘనపరిమాణం, వివిధ ఆకారం గల ద్రవం గమనించండి.
- నీరు (ద్రవపదార్థం) అది పోసిన పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతుందని గమనిస్తాము.
- ఈ కృత్యం ద్వారా ద్రవ పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం లేదని, అవి వాటిని పోసిన పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతాయని తెలుస్తుంది.
b) ద్రవ పదార్థాలు నిర్దిష్ట ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయని నిరూపించండి.
జవాబు:
- ఒక కొలజాడి సహాయంతో 50 మి.లీ. నీటిని తీసుకోండి.
- ఈ నీటిని ఒక గాజు బీకరులో పోయండి.
- ఈ బీకరులో నీటి మట్టాన్ని గుర్తించి, నీటిని పారపోయండి.
- ఇప్పుడు కొలజాడితో 50 మి.లీ. పాలను కొలిచి అదే బీకరులో పోయండి.
- పాల మట్టాన్ని గ్లాసుపై గుర్తించండి. ఫాలను బీకరు నుండి తొలగించండి.
- పాలు మరియు నీరు ఒకే మట్టంలో ఉన్నట్లు గుర్తిస్తాము.
- ఇప్పుడు కొంత నూనెను తీసుకొని, దానిని గాజు బీకరులో నీటి మట్టం గుర్తించినంత వరకు పోయండి.
- ఈ నూనె ఘనపరిమాణాన్ని కొలజాడి సహాయంతో కొలవండి. అది 50 మి.లీ. ఉండడం గమనిస్తాము.
- ఈ కృత్యం ద్వారా ద్రవాలను వివిధ ఆకారాలు గల పాత్రలలోనికి మార్చినపుడు అవి వేర్వేరు ఆకారాలు పొందినప్పటికి వాటి ఘనపరిమాణంలో ఎలాంటి మార్పూ ఉండదు అని తెలుస్తుంది.
కృత్యం – 2 వాయువులకు నిర్దిష్ట ఆకారం, ఘనపరిమాణాలను పరిశీలించడం :
ప్రశ్న 2.
వాయువులకు నిర్దిష్టమైన ఘనపరిమాణంకాని, ఆకారంగాని ఉండదని ఒక కృత్యం ద్వారా నిరూపించండి.
జవాబు:
- CNG అనగా సంపీడత సహజ వాయువు (Compressed Natural Gas).
- ఈ వాయువును ఫిల్లింగ్ స్టేషన్లలో ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువును తక్కువ పరిమాణంలో నిల్వ చేస్తారు.
- అదే విధంగా ఫిల్లింగ్ స్టేషన్ నుండి వాహనాలలోనికి ఎక్కువ పరిమాణ వాయువును తక్కువ పరిమాణంలో ఎక్కిస్తారు.
- కనుక CNG కి నిర్దిష్టమైన ఘనపరిమాణం, నిర్దిష్టమైన ఆకారం ఉండదు.
- పై పరిశీలనల ఆధారంగా CNG మరియు ఇతర అన్ని వాయువులు నిర్దిష్టమైన ఘనపరిమాణాన్ని కాని, ఆకారాన్ని కాని కలిగి ఉండవని నిర్ధారించవచ్చు.
కృత్యం – 3 వివిధ పదార్థాల సంపీడ్యతా ధర్మాన్ని పరిశీలించడం :
ప్రశ్న 3.
ఘన, ద్రవ పదార్థాలతో పోల్చినపుడు వాయు పదార్థాలు అధిక సంపీడ్యతను కలిగి ఉంటాయని చూపండి.
జవాబు:
- 50 మి.లీ.ల సిరంజిని తీసుకోండి.
- సిరంజిలోకి గాలి వెళ్ళేలా పిస్టన్ ను వెనుకకు లాగండి.
- నాజిల్ నుండి గాలి బయటకు రాకుండా మీ వేలును అడ్డంగా ఉంచి పిస్టనన్ను ముందుకు వత్తండి.
- సిరంజిలోనికి పిస్టన్ ఎంత దూరం నెట్టబడిందో గమనించి, గాలి స్తంభం ఎత్తును గుర్తించండి.
- గాలి స్తంభం కొంత ఎత్తును చేరుకున్న తరువాత పిస్టనను నెట్టడం కష్టమవడాన్ని గమనిస్తాము.
- ఇక్కడ సిరంజిలోని గాలి సంపీడ్యం చెందబడింది.
- ఇప్పుడు సిరంజిని నీటితో నింపి ఇదే ప్రయోగాన్ని చేయండి.
- సిరంజిలోని పిస్టనను నొక్కడం కష్టమనిపించినపుడు నీటి స్తంభం ఎత్తును కొలవండి.
- నీటి, స్తంభం ఎత్తు, గాలిస్తంభం ఎత్తుకన్న ఎక్కువగా ఉండడాన్ని గమనిస్తాము.
- ఇప్పుడు ఒక చెక్కముక్కను తీసుకొని నీ బొటనవేలితో నొక్కి చూడండి.
- చెక్క ఘనపరిమాణంలో ఎటువంటి గమనించదగ్గ మార్పూ కనబడదు.
- పై పరిశీలనల నుండి వాయు పదార్థాలు, ఘన, ద్రవపదార్థాల కంటే అధికంగా సంపీడ్యత చెందుతాయని తెలుస్తుంది.
కృత్యం – 4 వాయువుల వ్యాపనంను పరిశీలించుట :
ప్రశ్న 4.
వాయువుల వ్యాపనాన్ని పరిశీలించడానికి ఒక కృత్యాన్ని వివరింపుము.
జవాబు:
- మీ స్నేహితుడిని ఒక అగర్ బత్తి పట్టుకొని గదిలోని ఒక మూల నిలుచోమని చెప్పండి.
- మీరు గదిలో ఇంకో మూలలో నిలబడండి.
- గదిలో వాసనలో ఎటువంటి మార్పును గమనించము. (కొన్ని రకాల అగర్బత్తిలకు ఇది వర్తించదు)
- ఇప్పుడు అగర్బత్తిని వెలిగించమని మీ స్నేహితుడికి చెప్పండి.
- కొన్ని సెకనుల తరువాత గదిలో అగరబత్తి వాసనను గమనిస్తాము.
- అగర్ బత్తి వెలిగించగానే దానిలోని సుగంద ద్రవ్యం ఆవిరిగా మారి అగరబత్తి పొగతో బాటు గాలిలో కలిసి, గది అన్ని వైపులా వ్యాపించి మన ముక్కును చేరుతుంది.
- ఈ కృత్యం ద్వారా వాయువులు వ్యాపనం చెందుతాయని తెలుస్తుంది.
కృత్యం – 5 ద్రవాలలో వ్యాపనాన్ని పరిశీలించుట :
ప్రశ్న 5.
ద్రవాలలో వ్యాపనాన్ని పరిశీలించుట :
జవాబు:
250 మి.లీ. గోళాకార గాజుకుప్పెను తీసుకొని దానిలో కొద్దిగా నీరు నింపండి. డ్రాపర్ సహాయంతో రెండు లేదా మూడు చుక్కల నీలం లేదా ఎరుపు సిరాను లేదా పొటాషియం పర్మాంగనేట్ (KMnO4) ద్రావణాన్ని బీకరు గోడల వెంట నెమ్మదిగా నీటిలో వేయండి.
పరిశీలన :
వాయువులలో వ్యాపనం జరిగినట్లుగానే ద్రావాలలోనూ వ్యాపనం జరుగుతుందని మీరు గుర్తించవచ్చు.
కృత్యం – 6 ద్రవాలలో ఘనపదార్థ కణాల వ్యాపనం పరిశీలించుట :
ప్రశ్న 6.
ద్రవాలలో ఘనపదార్థాల కణాలు వ్యాపనం చెందుతాయని ఒక కృత్యం ద్వారా చూపండి.
జవాబు:
- ఒక బీకరును తీసుకొని దానిని పూర్తిగా నీటితో నింపండి.
- అందులో కొద్దిగా పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలను కలిపి మార్పులను గమనించండి.
- పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలు నీటిలో వ్యాపనం చెంది నీటి రంగును మార్చుటను గమనిస్తాము.
- ఇదే ప్రయోగాన్ని కాపర్ సల్ఫేట్ స్ఫటికంతో చేయండి.
- ఇక్కడ కూడా కాపర్ సల్ఫేట్ స్ఫటికం నీటిలో వ్యాపనం చెంది నీటి రంగును మార్చుటను గమనిస్తాము.
- పై ప్రయోగాల నుండి, ఘనపదార్థ కణాలు ద్రవాలలో వ్యాపనం చెందుతాయని తెలుస్తుంది.
ప్రయోగశాల కృత్యం రెండు వాయువుల మధ్య వ్యాపనం :
ప్రశ్న 7.
రెండు వాయువుల మధ్య వ్యాపన వేగం కనుగొనుటకు ఒక ప్రయోగాన్ని వివరించండి.
జవాబు:
లక్ష్యం : రెండు వాయువుల వ్యాపన వేగం పరిశీలించుట.
కావలసిన పదార్థాలు :
గుర్తించబడిన స్కేలు గల గాజు గొట్టం, అమ్మోనియం ద్రావణం(NH3), హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCl), దూది, రెండు రబ్బరు బిరడాలు, టాంగ్స్.
విధానం :
- 1 మీటరు పొడవైన, గుర్తించబడిన స్కేలు గల సన్నని గాజు గొట్టం తీసుకోండి.
- రెండు దూది ఉండలు తీసుకొని టాంగ్స్ సహాయంతో ఒకదానిని అమ్మోనియం ద్రావణంలో, రెండవ దానిని హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ముంచండి.
- వాటిని గాజు గొట్టం రెండు చివర్లలో ఉంచి బిరడాలతో రెండు చివరలను మూయండి. ఇప్పుడు గొట్టాన్ని పరిశీలించండి.
- హైడ్రోక్లోరిక్ ఆమ్లం హైడ్రోజన్ క్లోరైడ్ వాయువును, అమ్మోనియా ద్రావణం అమ్మోనియా వాయువును వెలువరిస్తాయి.
- రెండు వాయువులు పరస్పరం చర్య జరుపుకొని అమ్మోనియం క్లోరైడ్ అనే తెల్లని పదార్థాన్ని ఏర్పరుస్తాయి.
- గొట్టం రెండు చివరల నుండి, తెల్లని అవక్షేపం ఎంత దూరంలో ఉందో కొలవండి.
- అమ్మోనియా ద్రావణం ఉన్న చివరి నుండి ఎక్కువ దూరంలో అవక్షేపం ఏర్పడినది.
- ఈ ప్రయోగం ద్వారా అమ్మోనియా వాయువు ఎక్కువ వేగంతోనూ, హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు తక్కువ వేగంతోనూ వ్యాపనం చెందాయని తెలుస్తుంది.
కృత్యం – 7 పదార్థంలో ఉండే కణాలు ఎంత చిన్నవి?
ప్రశ్న 8.
పదార్థంలోని కణాలు ఎంతో చిన్నవని ఒక ప్రయోగం ద్వారా చూపుము.
జవాబు:
- ఒక బీకరులో నీరు తీసుకొని, దానిపై నీటి మట్టాన్ని గుర్తించండి.
- దానికి 1 లేదా 2 పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలను కలపండి.
- నీరు, ఊదారంగులోకి మారడాన్ని గమనిస్తాము.
- ఇప్పుడు ఆ ద్రావణాన్ని సుమారు 10 మి.లీ. తీసుకొని, వేరొక బీకరులోని 90 మి.లీ. నీటికి కలపండి.
- ఇప్పుడు నీటి యొక్క ఊదారంగు ఇంతకు మునుపు కంటే కొంచెం తక్కువగా ఉండడాన్ని గమనిస్తాము.
- మరల దీని నుండి 10 మి.లీ. ద్రావణాన్ని తీసుకొని మరొక బీకరులోని 90 మి.లీ. నీటికి కలపండి.
- ఈ ప్రక్రియను 4, 5 సార్లు చేసి ద్రావణం యొక్క రంగులోని మార్పును గమనించండి.
- చివరి బీకరులోని నీరు కూడా కొంచెం ఊదారంగు కలిగి ఉండుటను గమనిస్తాము.
- ఈ కృత్యం ద్వారా ఘన, ద్రవ పదార్థాలు అతి సూక్ష్మ కణాలను కలిగి ఉంటాయని తెలుస్తుంది.
కృత్యం – 10 పదార్థ స్థితి మార్పుపై ఉష్ణోగ్రత ప్రభావం :
ప్రశ్న 9.
ఒక పదార్థం యొక్క స్థితిలో జరుగు మార్పుపై ఉష్ణోగ్రత ప్రభావంను తెల్పు కృత్యంను వ్రాయుము.
జవాబు:
- పటంలో చూపిన విధముగా ఒక బీకరులో సుమారు 100 గ్రా||ల మంచు ముక్కలను తీసుకొనుము.
- ప్రయోగశాలలో ఉపయోగించు థర్మామీటరును తీసుకొనుము.
- దాని బల్బ్ ను మంచు ముక్కలకు తాకు విధముగా అమర్చుము. ఉష్ణోగ్రతను గుర్తించుము.
- బీకరును నెమ్మదిగా సారాయి) దీపంతో వేడి చేయుము.
- గాజు కడ్డీతో మంచు ముక్కలను కలుపుతూ ప్రతి 30 సెకన్లకు ఉష్ణోగ్రతలో వచ్చు’ మార్పులను పరిశీలించుము.
- పదార్థం ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారుటకు ఉష్ణోగ్రతలో పెరుగుదల కారణమైనది.
- ఒక గాజు కడ్డీని బీకరులో ఉంచి వేడి చేయుము.
- నీరు క్రమముగా మరగడం ప్రారంభమై కొంత సమయం తర్వాత బాష్పంగా మారును.
- ఇక్కడ పదార్థం ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుటకు ఉష్ణోగ్రతలో పెరుగుదల కారణమైనది.
- దీనిని బట్టి పదార్థ స్థితిలో మార్పునకు ఉష్ణోగ్రత ప్రభావం కారణమని అవగాహన చేసుకొనవచ్చును.
కృత్యం – 11
ప్రశ్న 10.
బాష్పీభవనంపై పదార్థ ఉపరితల వైశాల్యం, గాలి వేగం, ఆర్థతల ప్రభావం :
ఎ) బాష్పీభవనంపై ఉపరితల వైశాల్యం యొక్క ప్రభావమును వివరింపుము.
జవాబు:
ఉపరితల వైశాల్యం పెరిగినపుడు ఇగిరే వేగం పెరుగుతుంది.
వివరణ :
- ఇగిరే ప్రక్రియలో, ద్రవ ఉపరితల కణాలు బాష్పంగా మారతాయి.
- ఉపరితల వైశాల్యం పెరగడం వల్ల ఉపరితలంలోని ఎక్కువ కణాలు బాష్పంగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది.
- అందువల్ల ఇగిరే వేగం పెరుగుతుంది.
ఉదా : పింగాణి పాత్రలోని నీరు, పరీక్షనాళికలోని నీటి కన్నా వేగంగా ఇగురుతుంది.
బి) బాష్పీభవనంపై ఆర్థత యొక్క ప్రభావాన్ని వివరింపుము.
జవాబు:
గాలిలో ఆర్ధత అధికంగా ఉంటే ఇగిరే వేగం తగ్గుతుంది.
వివరణ :
- గాలిలో గల తేమ శాతాన్ని ఆర్ధత అంటారు.
- మన పరిసరాలలో ఉన్న గాలి ఒక నిర్దిష్ట పరిమాణం వరకు మాత్రమే నీటి బాష్పంను నిలిపి ఉంచగలుగుతుంది.
- గాలిలో నీటి బాష్పం అధికంగా ఉంటే ఇగిరే వేగం తగ్గుతుంది.
ఉదా : సాధారణ రోజు కన్నా వర్షమున్న రోజున బట్టలు నెమ్మదిగా ఆరతాయి.
సి) బాష్పీభవనంపై గాలి వేగం యొక్క ప్రభావాన్ని వివరింపుము.
జవాబు:
గాలి వేగం పెరిగినపుడు ఇగిరే వేగం పెరుగుతుంది.
వివరణ :
- గాలి వేగంగా వీయడం వల్ల అందులోని నీటి బాష్పం గాలితో పాటు దూరంగా వెళుతుంది.
- తద్వారా పరిసరాలలోని గాలిలో నీటి బాష్పం కూడా తగ్గుతుంది.
- ఇది ఇగిరే వేగాన్ని పెంచుతుంది.
ఉదా : గాలి బలంగా వీచే రోజున కాని, ఫ్యాను కింద కాని బట్టలు సాధారణంగా కన్నా త్వరగా ఆరతాయి.