SCERT AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Physical Science 1st Lesson Questions and Answers బలం
8th Class Physical Science 1st Lesson బలం Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
బలం అంటే ఏమిటి? బలం వల్ల తీసుకురాగలిగే మార్పులేమిటి?
జవాబు:
వస్తువుల నిశ్చల స్థితినిగాని, సమవేగంతో ఋజుమార్గంలో పోయే స్థితినిగాని మార్చేదీ లేక మార్చడానికి ప్రయత్నించే దానిని బలం అంటారు. బలం సదిశరాశి. బలానికి ప్రమాణాలు MKS పద్ధతిలో న్యూటన్లు, CGS పద్ధతిలో డైన్లు.
బలం వల్ల తీసుకురాగలిగే మార్పులు :
- నిశ్చల స్థితిలో గల వస్తువును బల ప్రయోగం వలన గమనంలోనికి మార్చవచ్చును.
- గమనంలో ఉన్న వస్తువును బల ప్రయోగం వలన వడిని మార్చవచ్చును.
- గమనంలో ఉన్న వస్తువును బలప్రయోగం వలన నిశ్చల స్థితిలోకి మార్చవచ్చును.
- గమనంలో ఉన్న వస్తువును బలప్రయోగం వలన గమన దిశను మార్చవచ్చును.
- బల ప్రయోగం వలన వస్తువు యొక్క ఆకృతిని మార్చవచ్చును.
- బల ప్రయోగం వలన వస్తువు యొక్క పరిమాణాన్ని మార్చవచ్చును.
ప్రశ్న 2.
బలాన్ని ప్రయోగించడం ద్వారా జరిగే కింది సందర్భాలకు ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
ఎ) వస్తువు వడిలో మార్పు బి) వస్తువు ఆకృతిలో మార్పు సి) వస్తువు కదిలే దిశలో మార్పు
జవాబు:
ఎ) వస్తువు వడిలో మార్పు :
- ఒక పిల్లవాడు రబ్బరు టైరును కర్రతో కొడుతూ ముందుకు పరిగెడుతున్నాడు.
- ఆ టైరు ఎక్కువ వడిగా వెళ్ళడానికి దానిని కర్రతో మళ్ళీ మళ్ళీ కొడుతూ (బలాన్ని ఇస్తూ) ఉన్నాడు. అనగా బలాన్ని పెంచితే వస్తువు వడి పెరుగుతుంది.
బి) వస్తువు ఆకృతిలో మార్పు :
- ఒక స్పాంజ్ డస్టర్‌ను బలం ప్రయోగించి పిండడం వలన ఆ స్పాంజ్ డస్టర్ యొక్క ఆకృతి మారును.
- రొట్టెలు తయారు చేయునప్పుడు పిండి ముద్దను రొట్టెలు తయారు చేయు కర్రతో బలం ప్రయోగించి పలుచని వృత్తాకార ఆకృతిలోకి మార్చినపుడు లేదా సాగదీసినపుడు పిండి ముద్దను కొద్దిగా మార్చవచ్చును.
సి) వస్తువు కదిలే దిశలో మార్పు :
- కేరమ్ కాయిన్ ను స్ట్రైకర్ తో కొట్టినప్పుడు కాయితో పాటు స్ట్రైకర్ కూడ దిశని మార్చుకుంటుంది.
- క్రికెట్ ఆటలో బౌలర్ వేసే బంతి యొక్క దిశను బ్యా ట్స్ మేన్ తన బ్యాట్ తో మార్చుతాడు.
ప్రశ్న 3.
స్పర్శాబలం, క్షేత్రబలం మధ్యగల భేదాలను వివరించండి. (AS1)
(లేదా)
స్పర్శాబలం, క్షేత్రబలంతో ఏ విధంగా విభేదిస్తుంది?
జవాబు:
స్పర్శాబలం | క్షేత్రబలం |
1) రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శా సంబంధం ద్వారా పనిచేసే బలాలను స్పర్శా బలాలు అంటారు. | 1) రెండు వస్తువులు ఒక దానితో ఒకటి ప్రత్యక్ష స్పర్శలో లేకుండా వాటి మధ్య బలం ఉన్నట్లయితే అటువంటి బలాన్ని క్షేత్రబలం అంటారు. |
2) కండర బలం, ఘర్షణ బలం, అభిలంబ బలం మరియు తన్యతా బలాలు స్పర్శా బలానికి ఉదాహరణలు. | 2) అయస్కాంత బలం, విద్యుత్ బలం మరియు గురుత్వాకర్షణ బలాలు క్షేత్ర బలానికి ఉదాహరణలు. |
3) రెండు వస్తువుల మధ్య తాడనం వలన ఏర్పడుతుంది. | 3) రెండు వస్తువులు క్షేత్రంలో ఉన్నపుడు ఏర్పడును. |
4) దీనిలో క్షేత్ర ప్రాంతం ఉండదు. | 4) దీనిలో క్షేత్రప్రాంతం ఉంటుంది. |
5) స్పర్శాబలం చాలా వేగంగా పనిచేస్తుంది. | 5) క్షేత్రబలం కొద్ది నెమ్మదిగా పనిచేస్తుంది. |
6) ఇది సదిశ రాశి. | 6) ఇది సదిశ క్షేత్రం. |
ప్రశ్న 4.
స్పర్శాబలానికి, క్షేత్రబలానికి రెండేసి ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
స్పర్శాబలానికి ఉదాహరణలు :
- టూత్ పేస్ట్ ట్యూబ్ ను చేతి వేళ్ళతో నొక్కినపుడు టూత్ పేస్ట్ ట్యూబ్ నుండి టూత్ పేస్ట్ బయటకు రావడం.
- ఒక బంతిని నేలపై విసిరినపుడు కొంతదూరం వెళ్ళి ఆగిపోతుంది. నీరు, బంతి ఉపరితలాల మధ్య ఘర్షణ బలం స్పర్శాబలంగా పనిచేసింది.
- సైకిల్ తొక్కడం ఆపేస్తే క్రమంగా సైకిల్ వడి తగ్గిపోయి ఆగిపోతుంది. సైకిల్ టైర్లకు, నేలకు మధ్య ఘర్షణ బలం స్పర్శాబలంగా పనిచేసింది.
క్షేతబలానికి ఉదాహరణలు :
- రెండు అయస్కాంతాల మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలాలు.
- ఒక బెలూనను ఒక కాగితంతో బాగా రుద్ది కాగితం ముక్కల వద్దకు తీసుకువస్తే ఆ కాగితం ముక్కలను బెలూను ఆకర్షిస్తుంది.
- పైకి విసిరిన రాయి తిరిగి భూమి మీద పడడం.
ప్రశ్న 5.
కింద ఇవ్వబడ్డ వాక్యంలో తప్పును సరిదిద్ది రాయండి. (AS1)
“కారు నిశ్చల స్థితిలో ఉంది కాబట్టి దానిమీద ఎటువంటి బలాలు లేవు”
జవాబు:
“కారు నిశ్చల స్థితిలో ఉంది కాబట్టి దాని మీద పనిచేసే బలాల ఫలిత బలం శూన్యం”.
ప్రశ్న 6.
కోయడానికి ఉపయోగించే పరికరాల అంచులు పదునుగా ఉంటాయి. ఎందుకు? (AS1)
జవాబు:
- కోయడానికి ఉపయోగించే పరికరాల అంచులు పదునుగా ఉంటాయి.
- ఎందుకంటే పదును ఉన్నవైపు స్పర్శా వైశాల్యం తక్కువగా ఉంటుంది.
- బలాన్ని ప్రయోగించినపుడు పదునైన భాగం వైపు ఉపరితల వైశాల్యం తక్కువ కాబట్టి అధిక పీడనాన్ని కలుగచేస్తుంది. కాబట్టి సులభంగా కోయవచ్చును.
ప్రశ్న 7.
“ఫలిత బలం వల్ల వస్తువుల గమన స్థితిలో మార్పు వస్తుంది” ఈ వాక్యం ద్వారా మీరు ఏం అర్థం చేసుకున్నారో వివరించండి. (AS1)
(లేదా)
ఫలిత బలం వస్తువులపై ప్రయోగించబడడం వల్ల వాటి యొక్క చలనస్థితి మారుతుంది. సరైన ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
- ఒక వస్తువు పై పనిచేసే అన్ని బలాల బీజీయ మొత్తాన్ని ఫలిత బలం అంటారు.
- ఫలిత బలం శూన్యమైతే ఆ వస్తువు నిశ్చలస్థితిలో ఉంటుంది.
- ఫలిత బలం శూన్యం కాకుండా ఉంటే ఆ వస్తువు గమనంలో ఉంటుంది.
- ఫలిత బలం విలువ మారుతూ ఉంటే వస్తువు గమన స్థితిలో మార్పు వస్తుంది.
ప్రశ్న 8.
“ఒక బరువైన వస్తువుని, నీవు ఎంత బలంగా నెట్టినా అది కదలదు” దీనికి గల కారణాన్ని “ఫలిత బలం” అనే భావనతో వివరించండి. (AS1)
జవాబు:
- ఒక బరువైన వస్తువుని నీవు ఎంత బలంగా నెట్టినా అది కదలదు దీనికి గల కారణం దాని ఫలిత బలం శూన్యం అగుట.
- ఒక వస్తువులో కదలిక దాని ఫలిత బలంపై ఆధారపడి ఉంటుంది.
- ఫలిత బలం శూన్యం అయితే ఆ వస్తువు కదలదు.
- ఫలిత బలం శూన్యం కానట్లైతే ఆ వస్తువు కదులుతుంది.
ప్రశ్న 9.
కింది పటాలలో ఫలిత బలాన్ని కనుక్కోండి. (AS5) (AS1)
జవాబు:
ప్రశ్న 10.
భూమి మీద ఘర్షణ లేదని ఊహించండి. ఏం జరుగుతుందో వివరించండి. (AS2)
జవాబు:
- ఘర్షణ బలం లేకపోతే మనం నడవలేము.
- వాహనాలు జారిపడి పోయే ప్రమాదం గలదు.
- పెన్నుతో పేపరుపై వ్రాయలేము.
- అగ్గిపుల్లతో అగ్గి పెట్టె పై రుద్ది మంటను పుట్టించలేము.
- నల్లబల్లపై చాక్ పీతో వ్రాయలేము.
- బల్లపై ఉంచిన వస్తువులు జారిపడతాయి.
- రాక్స్ లేదా అల్మారాలో ఉంచిన వస్తువులు జారిపడిపోతాయి.
- గుర్రపు మరియు ఎద్దుల బండ్లను నడుపలేము.
- మేకులను గోడలో మరియు చెక్కలో దింపలేము.
- ఆహారాన్ని నమలలేము.
- ఏ వస్తువుకు నిశ్చలస్థితి ఉండదు.
- భవనాలు నిర్మించలేము.
ప్రశ్న 11.
కార్తీక్ టి.వి.లో “వన్డే క్రికెట్ మ్యాచ్” చూస్తున్నాడు. ఆట భోజన విరామంలో క్రికెట్ పిచ్ పై రోలర్‌ను దొర్లించడం గమనించాడు. ఆ రోలర్ దొర్లేటప్పుడు దానిపై పనిచేసే వివిధ బలాలు, ఫలిత బలం గురించి అతను ఆలోచించాడు. ఫలితబలం పనిచేసే దిశ గురించి అతని మదిలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆ ప్రశ్నలేవో మీరు ఊహించగలరా? (AS2)
జవాబు:
- బలం ప్రయోగించిన దిశలో రోలర్ ఎందుకు కదలలేదు?
- బలం ప్రయోగించిన దిశలో ఫలిత బలం ఎందుకు లేదు?
- బలం ప్రయోగించిన దిశకు కొంత కోణంలో ఫలిత బలం దిశ ఎందుకు ఉన్నది?
- ఫలిత బలం దిశలో రోలర్ కదిలితే పిచ్ ఎందుకు చదును అయినది?
- పిచ్ చదును అగుటకు ఏ బలం ఉపయోగపడినది?
- ఘర్షణ బలం ఏ దిశలో పని చేస్తుంది?
ప్రశ్న 12.
ఎ. ఒకే విధమైన స్త్రాలు రెండు తీసుకుని, అందులో ఒక దానిని స్వేచ్ఛగా వేలాడదీయండి. రెండవ దానిని కాగితంతో రుద్ది వేలాడదీసిన స్ట్రా వద్దకు తీసుకురండి. ఈ కృత్యం ద్వారా మీరు ఏం గమనించారు? ఇవి ఏ రకమైన బలం? (AS3)
జవాబు:
- కాగితంతో రుద్దిన స్ట్రాను స్వేచ్ఛగా వేలాడదీసిన స్ట్రా వద్దకు తీసుకొని వచ్చినపుడు మొదట ఆకర్షించుకున్నది. ఆ తర్వాత వికర్షించుకున్నది.
- కాగితంతో రుద్దిన స్ట్రా మరియు స్వేచ్ఛగా వేలాడదీసిన స్ట్రాల మధ్య వికర్షణ బలం, స్థావర విద్యుత్ బలం ఏర్పడ్డాయి.
బి. పొడి జుట్టుని దువ్వెనతో దువ్వి ఆ దువ్వెనను చిన్న చిన్న కాగితపు ముక్కల దగ్గరకు తీసుకురండి. ఏం గమనించారు? వివరించండి. (AS3)
జవాబు:
- పొడిజుట్టుని దువ్వెనతో దువ్వి ఆ దువ్వెనను చిన్న చిన్న కాగితపు ముక్కల దగ్గరకు తీసుకువస్తే అది కాగితం ముక్కలను ఆకర్షిస్తుంది.
- పొడి జుట్టు దువ్వెనతో దువ్వడం వలన ఘర్షణ బలం వల్ల స్థావర విద్యుత్ ఆవేశాలు ఏర్పడ్డాయి.
- దువ్వెనకు గల స్థావర విద్యుత్ ఆవేశాలు కాగితం ముక్కలను ఆకర్షిస్తుంది.
ప్రశ్న 13.
స్పర్శాబలాలను, క్షేత్రబలాలను వివరించే చిత్రాలను వార్తాపత్రికలు, అంతర్జాలం మొదలైన వాటి నుండి సేకరించి నోట్ బుక్ లో – అంటించి ప్రదర్శించండి. (AS4)
జవాబు:
ప్రశ్న 14.
పటంలో చూపిన విధంగా మెట్ల మీద ఒక కర్రని పెట్టారు . ఆ కర్ర మీద పనిచేసే అభిలంబ బలాలను గీయండి. (AS5)
జవాబు:
ప్రశ్న 15.
చెట్టు ఊడని పట్టుకొని ఒక కోతి నిశ్చలంగా వేలాడుతూ ఉందనుకోండి. ఆ కోతిపై పనిచేసే బలాలు ఏవి? (AS7)
జవాబు:
కోతిపై పనిచేసే బలాలు :
- కోతిపై గురుత్వ బలం భూమి వైపు పనిచేస్తుంది.
- కోతి నుండి పైవైపు ఊడ తన్యతాబలం పనిచేస్తుంది.
ప్రశ్న 16.
నిశ్చలంగా ఉన్న ఒక బరువైన వస్తువును కదల్చాలంటే నువ్వు దానిపై కొంత బలాన్ని ప్రయోగించాలి. అయితే ఒకసారి కదిలిన తరువాత, దానిని అదే గమనస్థితిలో ఉంచడానికి కొద్ది బలం ప్రయోగిస్తున్నా సరిపోతుంది. ఎందుకు? (AS1)
జవాబు:
- నిశ్చలస్థితి గల ఒక బరువైన వస్తువును గమన స్థితిలోకి మార్చుతూ ఉంటే సైతిక ఘర్షణబలం వ్యతిరేకిస్తుంది.
- గమనంలో ఉన్న వస్తువును జారుడు ఘర్షణ బలం నిశ్చలస్థితిలోకి మారుస్తుంది.
- సైతిక ఘర్షణ బలం కంటే జారుడు ఘర్షణ బలం చాలా తక్కువగా ఉంటుంది.
- కాబట్టి వస్తువు ఒకసారి కదిలిన తరువాత, దానిని అదే గమన స్థితిలో ఉంచడానికి కొద్దిగా బలం (జారుడు ఘర్షణ బలానికి సరిపడు) ప్రయోగిస్తే సరిపోతుంది.
ప్రశ్న 17.
కింది రెండు సందర్భాలలో పీడనాన్ని ఎలా పెంచగలవు? (AS1)
ఎ) వైశ్యాలంలో మార్పు లేనపుడు బి) బలంలో మార్పు లేనపుడు
జవాబు:
ఎ) వైశాల్యంలో మార్పు లేనపుడు :
- వైశాల్యం మార్పు లేనపుడు పీడనాన్ని పెంచాలంటే దానిపై బలాన్ని పెంచాలి.
- పీడనం బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
బి) బలంలో మార్పు లేనపుడు :
- బలం మార్పు లేనపుడు పీడనాన్ని పెంచాలంటే స్పర్శావైశాల్యాన్ని తగ్గించాలి.
- పీడనము, స్పర్శా వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది.
ప్రశ్న 18.
ఘర్షణని తగ్గించడానికి కొన్ని మార్గాలను సూచించి, వాటిని పరీక్షించడానికి ప్రయోగాన్ని రూపకల్పన చేసి నిర్వహించండి.
జవాబు:
ఘర్షణని తగ్గించడానికి కొన్ని మార్గాలు :
- ఘర్షణను తగ్గించడానికి స్పర్శించుకొనే తలాలను నునుపుగా ఉంచాలి.
- ఘర్షణను తగ్గించడానికి స్పర్శించుకొనే తలాలకు కందెనలను, నూనెలను పూయాలి.
- యంత్రాలలో, చక్రాలలో ఘర్షణను తగ్గించడానికి బాల్ బేరింగ్ ను ఉపయోగించాలి.
నునుపైన తలాలు ఘర్షణ బలాలు తగ్గిస్తాయి అని ప్రయోగపూర్వకంగా నిరూపించుట :
1) ఉద్దేశ్యము : నునుపైన తలంపై ఘర్షణ తక్కువగా ఉంటుంది.
2) పరికరాలు : 1) నునుపుగా ఉండే పొడవైన చెక్క, 2) గరుకుగా ఉండే పొడవైన చెక్క, 3) రెండు గోళీలు.
3) ప్రయోగము :
- నునుపైన మరియు గరుకుగా ఉండే చెక్కలను ఒకదాని ప్రక్కన ఒకటి క్షితిజ సమాంతరంగా అమర్చాలి.
- ఒక్కొక్క చెక్కపై ఒక్కొక్క గోళీని ఉంచి ఒకే బలంతో రెండింటిని కదల్చండి.
- ఏ గోళీ ఎక్కువ దూరం కదిలినదో కనుగొనండి.
- నునుపైన చెక్క తలంపై గోళీ ఎక్కువ దూరం కదిలినది. కావున నునుపైన తలంపై ఘర్షణ బలం తక్కువగా ఉండుట వలన గోళీ ఎక్కువ దూరం కదిలినది అని తెలుస్తుంది.
- గరుకైన చెక్క తలంపై గోళీ తక్కువ దూరం కదిలినది. కావున గరుకు తలంపై ఘర్షణ బలం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.
పై ప్రయోగము వలన నునుపైన తలాలు తక్కువ ఘర్షణ బలాన్ని కల్గిస్తాయి అని తెలుస్తుంది.
ప్రశ్న 19.
క్రింది పటం పరిశీలించండి. అందులో ఘర్షణ బలం, అభిలంబ బలం ఏ దిశలో పనిచేస్తాయో తెలపండి. (AS5)
జవాబు:
ప్రశ్న 20.
సమతలంపై స్థిరంగా నిలబడ్డ వ్యక్తిపై ఏయే బలాలు పని చేస్తుంటాయి? అతనిపై పనిచేసే బలాలన్నింటిని సూచించే స్వేచ్ఛావస్తుపటాన్ని (FBD) గీయండి. (AS5)
జవాబు:
ప్రశ్న 21.
నిత్య జీవితంలో మనం వివిధ కృత్యాలు చేయడానికి ఉపయోగపడే ఘర్షణ యొక్క పాత్రని నీవు ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
- నడవడం, పరుగెత్తడం అనే కృత్యాలలో ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
- వాహనాలు నడపడానికి ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
- మేకులను చెక్కలోకి మరియు గోడలోనికి దించడానికి ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
- గుర్రపు బండ్లు మరియు ఎడ్ల బండ్లు నడపడానికి ఘర్షణబలం ఉపయోగపడుతుంది.
- కాగితంపై పెన్నుతో వ్రాయడానికి ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
- బోర్డ్ పై చాపీ తో వ్రాయడానికి ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
- భవన నిర్మాణములో ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
- వస్తువులను చేతితో పట్టుకోవడంలో ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
- వడ్రంగి చెక్క తలాలను నునుపు చేయుటకు ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
నిత్య జీవితంలో మనం వివిధ పనులు చేయడానికి ఉపయోగపడే ఘర్షణ యొక్క పాత్రను ఎంతగానో అభినందించ వలసిన అవసరం ఉన్నది.
8th Class Physical Science 1st Lesson బలం Textbook InText Questions and Answers
ఆలోచించండి – చర్చించండి
8th Class Physical Science Textbook Page No. 5
ప్రశ్న 1.
m ద్రవ్యరాశి గల క్రికెట్ బంతిని కొంత వేగంతో పైకి విసిరారనుకోండి. గాలి నిరోధాన్ని విస్మరిస్తే (ఎ) అది చేరుకునే గరిష్ఠ ఎత్తులో సగం ఎత్తు వద్ద (బి) గరిష్ఠ ఎత్తు వద్ద ఆ బంతిపై ఏ ఏ బలాలు పనిచేస్తుంటాయి?
జవాబు:
(ఎ) గరిష్ఠ ఎత్తులో సగం ఎత్తు (h/2) వద్ద పనిచేసే బలాలు:
- గురుత్వ బలం (mg)
విసిరిన బలంలో కొంత బలము.
(బి) గరిష్ఠ ఎత్తు (h) వద్ద పనిచేసే బలాలు:
- గురుత్వ బలం (mg)
8th Class Physical Science Textbook Page No. 6
ప్రశ్న 2.
ఒకే రంగు పూసిన రెండు లోహపు కడ్డీలు మీ వద్ద ఉన్నాయనుకోండి. అందులో ఒకటి ఉక్కుది, రెండవది అయస్కాంతం. అందులో ఏది అయస్కాంతమో, ఏది ఉక్కు కడ్డీయో మీరు ఏ విధంగా నిర్ణయిస్తారు? (నిబంధన : కడ్డీలను విరచరాదు)
జవాబు:
ఇనుప రజనును ఏ కడ్డీ ఆకర్షిస్తుందో ఆ కడ్డీ అయస్కాంతంగాను, ఇనుప రజనును ఆకర్షించని కడ్డీని ఉక్కు కడ్డీగా గుర్తించవచ్చును.
8th Class Physical Science Textbook Page No. 8
ప్రశ్న 3.
ఒక పుస్తకం బల్లపై నిశ్చలస్థితిలో ఉంది. ఆ పుస్తకంపై ఘర్షణ బలం పనిచేస్తున్నదా? లేదా? వివరించండి.
జవాబు:
- బల్లపై గల పుస్తకంపై ఘర్షణ బలం పనిచేస్తుంది.
- నిశ్చలస్థితిలో గల వస్తువులపై పనిచేసే ఘర్షణ బలాన్ని సైతిక ఘర్షణ బలం అంటారు.
- నిశ్చల స్థితిలో గల పుస్తకాన్ని చలన స్థితి పొందుటకు కావలసిన బలం కంటే తక్కువ బలం ప్రయోగించినపుడు పుస్తకం చలనంలో ఉండదు. కారణం ప్రయోగించిన బలాన్ని సైతిక ఘర్షణ బలం నిరోధిస్తుంది.
8th Class Physical Science Textbook Page No. 10
ప్రశ్న 4.
A మరియు B అనే వస్తువులతో కూడిన ఒక వ్యవస్థ ప్రక్క పటంలో చూపబడింది. A మరియు B వస్తువుల మీద ఏ ఏ బలాలు పనిచేస్తున్నాయో చెప్పండి.
జవాబు:
A వస్తువుపై పనిచేసే బలాలు :
- గురుత్వ బలం
- అభిలంబ బలం
- B యొక్క భారం (B యొక్క గురుత్వబలం)
B వస్తువుపై పనిచేసే బలాలు :
- 1గురుత్వ బలం
- అభిలంబ బలం
ప్రశ్న 5.
స్పర్శా బలాలను ఘర్షణ బలం, అభిలంబ బలం అని వేరుపరచి చూడాల్సిన అవసరం ఏమిటో రెండు కారణాలతో వివరించండి.
జవాబు:
- ఘర్షణ బలం, అభిలంబ బలాలు వేరువేరు దిశలలో పని చేయడం.
- ఘర్షణ బలం చలన దిశకు వ్యతిరేక దిశలో ఉండి, వస్తువు చలనాన్ని నిరోధిస్తుంది. కాని అభిలంబ బలాన్ని గురుత్వ బలం సమతుల్యం చేస్తుంది.
8th Class Physical Science Textbook Page No. 13
ప్రశ్న 6.
మీ స్నేహితునితో మోచేతి కుస్తీ (arm wrestling) ఆట ఆడండి. ఆటలో గెలుపుని ‘ఫలితబలం’ భావనతో వివరించండి. ఈ ఆట ఆడేటపుడు మీ మోచేతిపై పనిచేసే బలాల పేర్లు, వాటి దిశలను తెల్పండి. ఈ సన్నివేశానికి స్వేచ్ఛా వస్తుపటం (FBD) ను గీయడానికి ప్రయత్నించండి.
జవాబు:
పటం – 1 లో స్వేచ్చా వస్తుపటం FBD :
F1, F2 లు → అభిలంబ బలాలు
Fg → గురుత్వబలం
Fm1 → మొదటి వ్యక్తి కండర బలం
Fm2 → రెండవ వ్యక్తి కండర బలం
X – అక్షం వెంట ఫలితబలం Fnet = Fm2 – Fm1
X – అక్షం వెంట ఫలిత బలం = Fg – (F1+ F2)
పటం – 2 లో ఆటలో గెలుపును పొందిన భావనతో స్వేచ్ఛా వస్తుపటం
F1, F2 లు → అభిలంబ బలాలు
Fg → గురుత్వబలం
Fm1 → మొదటి వ్యక్తి కండర బలం
Fm2 → రెండవ వ్యక్తి కండర ,బలం
X – అక్షం వెంట ఫలిత బలం = (Fm1 + F1 + F2) – (Fg+ Fm1)
ప్రశ్న 7.
బలాలు ఏమి చేయగలవు?
జవాబు:
- నిశ్చలస్థితిలో గల వస్తువును గమన స్థితిలోకి మార్చగలవు.
- గమన స్థితిలో గల వస్తువుల వడిని పెంచగలవు.
- గమన స్థితిలో గల వస్తువుల వడిని తగ్గించగలవు.
- గమన స్థితిలో గల వస్తువులను నిశ్చలస్థితిలోకి మార్చగలవు.
- వస్తువుల ఆకృతిని మరియు ఆకారాన్ని మార్చగలవు.
8th Class Physical Science Textbook Page No. 16
ప్రశ్న 8.
పీడనానికి దిశ ఉంటుందా? వివరించండి.
జవాబు:
- పీడనం అదిశ రాశి. పీడనానికి పరిమాణం మాత్రమే ఉంటుంది. దిశ ఉండదు.
- మృదువైన పదార్థాలు మాత్రమే బలాన్ని ప్రయోగిస్తే పీడనాన్ని కలుగజేస్తాయి.
- దృఢమైన వస్తువులపై బలాన్ని ప్రయోగిస్తే బలం ప్రయోగించిన దిశలో వస్తువు కదులుతుంది.
- మృదువైన పదార్థాలపై బలాన్ని కలుగజేస్తే, ఆ పదార్థాలు అన్ని దిశలలో పీడనాన్ని కలుగజేస్తాయి.
ఉదా : నీరు గల పాత్ర ; వాయువు గల వాయుపాత్ర మరియు గాలి గల బెలూను.
8th Class Physical Science Textbook Page No. 15
ప్రశ్న 9.
స్కూలు బ్యాగులు, షాపింగ్ బ్యాగులకు వెడల్పైన బెల్ట్ లు ఉండడానికి కారణమేమిటి?
జవాబు:
స్కూలు బ్యాగులు, షాపింగ్ బ్యాగులకు వెడల్పైన బెల్ట్ లు ఉండడానికి కారణము స్పర్శా బలం పెరిగి బల ప్రభావమును, పీడనమును తగ్గించుటకు.
ప్రశ్న 10.
అధిక బరువులు తీసుకువెళ్ళే లారీలకు ఎక్కువ సంఖ్యలో వెడల్పైన టైర్లు ఎందుకు ఉంటాయో తెల్పండి.
జవాబు:
అధిక బరువులు తీసుకువెళ్ళే లారీలకు ఎక్కువ సంఖ్యలో వెడల్పైన టైర్లు ఉంటాయి. ఎందుకంటే భూమిపైన పీడనమును తగ్గించుటకు.
పరికరాల జాబితా
స్ట్రా, డస్టరు, అయస్కాంతము, తాడు, టూత్ పేస్టు, మూతగల సీసా, కార్పెట్, గరుకు రోడ్డు, నున్నని గచ్చు, వివిధ దారాలు, సూది, థర్మోకోల్ బాల్స్, బెలూన్, కాగితపు ముక్కలు, డ్రాయింగ్ షీట్, టేబుల్, రబ్బరు బ్యాండ్, క్యారమ్ బోర్డు, స్పాంజ్, ప్లాస్టిక్ బాటిల్, అద్దము, పెన్సిల్, వాలుతలము, రూపాయి నాణెం, స్ప్రింగ్ త్రాసు, భారాలను తగిలించే కొక్కెం, భారాలు, దండాయస్కాంతం, ఇనుపరజను, పుట్ బాల్ (పెద్దబంతి), ప్లాస్టిక్ ట్రేలు, ఇటుకలు.
8th Class Physical Science 1st Lesson బలం Textbook Activities
కృత్యములు
కృత్యం -1
1. వివిధ పనులలో నెట్టడాన్ని, లాగడాన్ని గుర్తించడం :
ఈ క్రింది పట్టికలో వివిధ పనులు చేస్తున్న పటాలను పరిశీలించి నెట్టడాన్ని, లాగడాన్ని గుర్తించి పట్టికలో నమోదు చేయండి.
జవాబు:
కృత్యం – 2
2. అయస్కాంత బలాన్ని పరిశీలించుట :
ఒక సూదిని తీసుకోండి. ఒక దండయస్కాంతాన్ని తీసుకుని దానిపై ఒకే దిశలో అనేకసార్లు రుద్దండి. ఆ సూది అయస్కాంతంగా మారడం మీరు గమనించవచ్చు. దిక్సూచి సహాయంతో ఆ సూది యొక్క ఉత్తర, దక్షిణ ధృవాలను గుర్తించవచ్చు. దక్షిణ ధృవం ఉన్న వైపు ఒక చిన్న ఎరుపు బెండు బంతిని గుచ్చండి. ఉత్తర ధృవం వైపు ఒక తెల్ల బెండు బంతిని గుచ్చండి. ఇదే విధంగా ఇంకొక సూదిని తీసుకొని తయారుచేయండి. ఈ క్రింది విధంగా చేయండి.
ఎ) ఒకే రంగు బంతులు కలిగిన సూదుల చివరలు ఎదురెదురుగా ఉండేలా ఆ సూదులను నీటిలో ఉంచండి. ఏం జరుగుతుంది?
జవాబు:
ఒకే రంగు బంతులు కలిగిన సూదుల చివరలు వికర్షించుకోవటం గమనించవచ్చును.
బి) వేర్వేరు రంగు బంతులు కలిగిన సూదుల చివరలు ఎదురెదురుగా ఉండేలా నీటిలో వదలండి. ఏం జరిగింది?
జవాబు:
వేరువేరు రంగు బంతులు కలిగిన సూదుల చివరలు ఆకర్షించుకోవడం గమనించవచ్చును.
సి) ఆ సూదులు ఒకదానికొకటి ఆకర్షించుకొంటే లేదా వికర్షించుకొంటే ఆ బలాన్ని ఏమంటారు?
జవాబు:
రెండు అయస్కాంతాల మధ్య కంటికి కనిపించకుండా పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని అయస్కాంత బలం అంటారు.
కృత్యం – 3
3. స్థావర విద్యుత్ బలాలను పరిశీలించుట :
ఒక బెలూనను ఊది దాని చివర ముడి వేయండి. ఒక కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి గచ్చుపై వేయండి. ఇప్పుడు బెలూనను ఒక కాగితంతో బాగా రుద్ది కాగితం ముక్కల వద్దకు తీసుకురండి.
ఎ) ఏం జరిగింది? చిన్న చిన్న కాగితపు ముక్కలు బెలూన్ వైపుకి లాగబడ్డాయా?
జవాబు:
చిన్న చిన్న కాగితపు ముక్కలు బెలూన్ వైపుకి లాగబడ్డాయి.
బి) కాగితపు ముక్కలను బెలూన్ ఎందుకు ఆకర్షించింది?
జవాబు:
బెలూనను రుద్దడం వల్ల దానిపై విద్యుత్ బలం ఏర్పడడం వలన కాగితం ముక్కలు ఆకర్షింపబడినవి.
సి) కాగితపు ముక్కలకు బదులు ఉప్పు, మిరియాల పొడిని ఉపయోగించి చూడండి. ఏం జరుగుతుందో గమనించండి.
జవాబు:
ఉప్పు, మిరియాల పొడి బెలూన్ చే ఆకర్షింపబడవు.
కృత్యం – 4
4. అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించుట :
ఒక దండయస్కాంతాన్ని టేబుల్ పై పెట్టి దానిపై మందంగా ఉండే ఒక తెల్లకాగితాన్ని ఉంచండి. ప్రక్క పటంలో చూపిన విధంగా కాగితంపై ఇనుప రజను వెదజల్లండి. ఇపుడు టేబుల్ ని గానీ, కాగితాన్ని గానీ మెల్లగా పెన్ / పెన్సిల్ తో తట్టండి.
ఎ) ఏం గమనించారు? ఇనుప రజను ఏదైనా ఒక ప్రత్యేక ఆకృతిలో అమరిందా?
జవాబు:
- దండయస్కాంతం యొక్క అయస్కాంత బలం ప్రభావం వల్ల ఇనుపరజను ఆ అయస్కాంతం చుట్టూ కొంత ప్రాంతంలో వక్రరేఖలుగా తమకు తాము సర్దుకోవడం గమనించాను.
- ఇనుపరజను దండయస్కాంతం యొక్క ఉత్తర ధృవం నుండి దక్షిణ , ధృవం వరకు వరుసగా వక్రరేఖ వలె అనేక రేఖలు ఏర్పడ్డాయి. ఈ వక్రరేఖలు దండయస్కాంతంకు ఇరువైపుల ఏర్పడ్డాయి. ఈ రేఖలు అయస్కాంత క్షేత్రం ఏర్పడిన ప్రాంతాన్ని అయస్కాంత క్షేత్రం అంటారు.
కృత్యం – 5
5. కండర బలాన్ని ఉపయోగించే సందర్భాల జాబితా తయారు చేయడం :
కండర బలాన్ని ఉపయోగించి పనిచేసే సందర్భాలను వ్రాయండి.
- సైకిల్ తొక్కడం
- ఈత కొట్టడం
- పరుగెత్తడం
- బరువులు మోయడం
- త్రవ్వడం
- స్ట్రాతో పానీయాన్ని తాగడం
- డస్టరుతో నల్లబల్లపై అక్షరాలను చెరపడం
- ఇల్లు ఊడ్చటం
- కొండరాళ్ళు కొట్టడం
- స్నానం చేయడం
- ఆటలు ఆడడం
కృత్యం – 6
6. పనిచేసేటప్పుడు ఏదేని కండరంలోని మార్పును పరిశీలించుట :
బంతిని విసిరినపుడు కండరంలోని మార్పును పరిశీలించి వ్రాయండి.
జవాబు:
బంతిని విసురుతున్నపుడు ఛాతి, భుజం ముందు భాగంలోని కండరాలు వ్యాకోచించి మన చేతిని ముందుకు లాగితే, భుజం వెనుక భాగంలోని కండరాలు సంకోచించి మన కదలికని నియంత్రిస్తాయి.
కృత్యం – 7
7. వివిధ తలాలపై బంతి గమనాన్ని పరిశీలించుట :
కార్పెట్, గరుకుతలం, నున్నటి తలాలపై బంతి గమనాన్ని పరిశీలించి, బంతి గమనాన్ని ఏ తలం ఎక్కువగా నిరోధించునో, ఏ తలం తక్కువగా నిరోధించునో పరిశీలించి తెల్పండి.
జవాబు:
- కార్పెట్, గరుకు తలం మరియు నున్నటి తలాలపై ఒకే బలం ఉపయోగించి ఒక బంతిని కదిలేటట్లు చేసినాను.
- కార్పెట్ తలంపై బంతి తక్కువ దూరం ప్రయాణించినది.
- కార్పెట్ కంటె గరుకు తలంపై బంతి ఎక్కువ దూరం ప్రయాణించినది.
- కార్పెట్, గరుకు తలాల కంటె నున్నటి తలంపై బంతి ఎక్కువ దూరం ప్రయాణించింది.
- బంతి చలనాన్ని నిరోధించే క్రమము : కార్పెట్ తలం > గరుకుతలం > నున్నటి తలం
- బంతి కదిలిన దూరాల క్రమం : కార్పెట్ తలం – గరుకు తలం < నున్నటి తలం.
కృత్యం – 8
8. వాలుతలంపై వస్తువుల చలనాన్ని పరిశీలించుట :
ఒక ట్రేని తీసుకోండి. దానిమీద ఒక చివర అంచు దగ్గర చిన్న మంచు ముక్కను, ఎరేజర్ (రబ్బరు)ను మరియు ఒక రూపాయి బిళ్ళను ఒకే వరుసలో పెట్టండి. ఇపుడు ప్రక్క పటంలో చూపిన విధంగా ట్రేను అదే చివర పట్టుకొని నెమ్మదిగా పైకి ఎత్తి పరిశీలించండి.
ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
ఎ) ఈ మూడు వస్తువులలో ఏది మొదట కిందికి జారడం ప్రారంభించింది?
జవాబు:
ఈ మూడు వస్తువులలో మొదట జారిన వస్తువు మంచు ముక్క.
బి) అన్ని వస్తువులకు ఒకే పరిమాణంలో ఘర్షణ పనిచేస్తుందా?
జవాబు:
అన్ని వస్తువులకు ఘర్షణ, పరిమాణం వేరువేరుగా ఉన్నాయి.
సి) ఏ వస్తువుపై ఘర్షణ బలం ఎక్కువ? ఏ వస్తువుపై ఘర్షణ బలం తక్కువ?
జవాబు:
ఎరేజరు ఘర్షణ బలం ఎక్కువ. మంచు ముక్కకు ఘర్షణ బలం తక్కువ.
డి) ఈ మూడు వస్తువుల ఘర్షణ బలాల క్రమాన్ని వ్రాయండి.
జవాబు:
ఈ మూడు వస్తువుల ఘర్షణ బలాల క్రమం : ఎరేజర్ > రూపాయి బిళ్ళ > మంచు ముక్క
ప్రయోగశాల కృత్యం
9. ఉద్దేశ్యం : దారం భరించగలిగే గరిష్ఠ బలాన్ని కనుగొనుట.
కావలసిన పరికరాలు : స్ప్రింగ్ త్రాసు, భారాలు, తేలిక దారాలు, భారాలు తగిలించే కొక్కెం (వెయిట్ హేంగర్)
నిర్వహణ పద్ధతి :
i) పరికరాలని పటంలో చూపిన విధంగా అమర్చండి.
ii) 50గ్రా.ల భారాన్ని వెయిట్ హేంగర్ కి వేలాడదీసి, స్ప్రింగ్ త్రాసులో రీడింగ్ గమనించండి.
iii) అలా దారం తెగిపోయేంత వరకు కొద్ది కొద్దిగా భారాలు పెంచుతూ స్ప్రింగ్ త్రాసులో రీడింగులు గమనిస్తూ ఉండండి.
iv) దారం తెగే దగ్గర రీడింగును గుర్తించండి.
v) వివిధ రకాల దారాలను ఉపయోగించి, అవి భరించగలిగే గరిష్టబలము యొక్క విలువలను క్రింది పట్టికలో నమోదు చేయండి.
vi) ఈ మొత్తం వ్యవస్థని (అమరికని) సీలింగ్ నుంచి వేరుపరచి, మరల దారానికి భారాన్ని తగిలించే కొక్కెంను అమర్చి హేంగర్ పై తక్కువ భారం ఉండేలా చూసుకుని, చేతితో నెమ్మదిగా పైకి లేపండి.
vii) అలా పైకి ఎత్తుతున్నప్పుడు స్ప్రింగ్ త్రాసు రీడింగును గమనించండి.
అలాగే మెల్లగా కిందికి దించుతూ స్ప్రింగ్ త్రాసు రీడింగును గమనించండి.
ఎ) పైకి ఎత్తేటప్పుడు, కిందికి దించేటప్పుడు మీరు గమనించిన స్ప్రింగ్ త్రాసు రీడింగులను బట్టి మీరు ఏం చెప్పగలరు?
జవాబు:
స్ప్రింగ్ త్రాసులోని రీడింగులను బట్టి వేరొక బల ప్రభావం ఈ వ్యవస్థపై ఉందని తెలుస్తోంది.
బి) ఒక్కసారిగా మొత్తం అమరికని వేగంగా పైకి లేపితే దారం తెగిపోయిందా?
జవాబు:
ఒక్కసారిగా మొత్తం అమరికని వేగంగా, పైకిలేపితే దారం ఒక్కొక్కసారి తెగవచ్చు లేదా తెగకపోవచ్చు.
కృత్యం – 9
10. టేబుల్ పై ఫలితబలం ప్రభావం :
ఒక టేబుల్ ను ఇద్దరు విద్యార్థులు కింద పటంలో చూపిన విధంగా నెట్టుచున్నారు. ఆ పటాలను పరిశీలించి పటాల కింద గల ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
ఎ) పటం -1 లో చూపిన విధంగా బరువైన టేబుల్ ను నెట్టడానికి ప్రయత్నించండి. కష్టంగా ఉంటుందా? సులభంగా ఉంటుందా?
జవాబు:
కష్టంగా ఉంటుంది.
బి) పటం – 3 లో టేబుల్ ఏ దిశలో కదిలింది?
జవాబు:
ఇద్దరు విద్యార్థుల బలం ప్రయోగించిన దిశలో కదిలింది.
సి) పటంలో – 3లో చూపిన విధంగా టేబుల్ ని ఇద్దరు విద్యార్థులు ఒకే వైపు నుండి నెట్టినారు. ఇపుడు సులభంగా ఉందా? ఉంటే ఏమిటి?
జవాబు:
సులభంగా కదిలింది. ఎందుకంటే ఇద్దరి బలాలు ఒకే దిశలో పనిచేయడం వల్ల, ఫలిత బలం పెరిగి ఆ టేబుల్ సులభంగా కదిలింది.
డి) పటం – 2లో చూపిన విధంగా విద్యార్థులు బలాన్ని ప్రయోగించినపుడు ఒకవేళ టేబులు కదలలేదు. ఎందుకు కదలలేదో వివరించండి.
జవాబు:
ఇద్దరు విద్యార్థులు రెండు వైపుల నుండి (వ్యతిరేక దిశలో) నెడుతున్నప్పుడు ఇద్దరి బలపరిమాణం సమానంగా ఉంటే ఫలితబలం శూన్యం అగును కాబట్టి,టేబులు కదలదు.
ఇ) పటం – 2 లో చూపిన విధంగా విద్యార్థులు బలాన్ని ప్రయోగించినపుడు ఒకవేళ టేబులు కదిలినది. ఎందుకు కదిలినదో వివరించండి. ఏ దిశలో కదులనో తెల్పుము.
జవాబు:
ఇద్దరు విద్యార్థులు రెండు వైపుల నుండి (వ్యతిరేక దిశలో) నెడుతున్నప్పుడు ఇద్దరి బలపరిమాణాలు సమానంగా లేకుంటే ఫలిత బలం శూన్యం కాదు కాబట్టి టేబులు కదులును. ఏ విద్యార్థి బలం పరిమాణం ఎక్కువ ఉన్నదో ఆ విద్యార్థి ప్రయోగించిన బలదిశలో టేబులు కదులుతుంది.
కృత్యం – 10
11. చేతివేళ్ళపై సాగదీసిన రబ్బరుబ్యాండు ప్రభావం :
ఒక రబ్బరు బ్యాండుని తీసుకొని మీ చేతివేళ్ళతో సాగదీయండి. ఇలా సాగదీస్తున్నప్పుడు రబ్బరు బ్యాండు మీ వేళ్ళపై కలుగజేసే బలాన్ని మీరు అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. ఇప్పుడు అలాంటిదే ఇంకొక రబ్బరు బ్యాండుని తీసుకుని, రెండింటిని కలిపి ఒకే పొడవుకి సాగదీయండి.
ఎ) ఏం గమనించారు? ముందుకన్నా ఇప్పుడు మీ వేళ్ళపై కలుగజేయబడిన బలం అధికంగా ఉందా?
జవాబు:
ముందుకన్నా ఇప్పుడు వేళ్లపై కలుగజేయబడిన బలం అధికంగా ఉంది.
బి) ఇలాగే రబ్బరు బ్యాండ్ల సంఖ్య పెంచుతూ, అవి మీ వేళ్ళపై కలుగజేసే బలాన్ని పరిశీలించండి.
జవాబు:
రబ్బరు బ్యాండ్ల సంఖ్య పెరిగేకొలదీ అవి వేళ్ళపై కలుగజేసే బలం పెరుగుతుంది.
కృత్యం – 11
12. వస్తువు చలనదిశపై, స్థితిపై బల ప్రభావం : –
మీ పాఠశాలలో ఆటల పీరియడ్ నందు మైదానంలో ఫుట్ బాల్ ఆడినపుడు ఫుట్ బాల్ ను వివిధ రకాలుగా తన్నే ఉంటారు. ఫుట్ బాల్ ను తన్నినపుడు బాల్ గమనంలో జరిగే మార్పులను మీరు పరిశీలించిన వాటిని వ్రాయండి.
జవాబు:
నేను ఫుట్ బాల్ ఆట ఆడినపుడు బాల్ లో కనిపించిన మార్పులు
- ఫుట్ బాల్ ను తన్నినపుడు బలప్రయోగం వల్ల నిశ్చల స్థితిలోని బాల్ గమన స్థితిలోకి మారినది.
- గమనస్థితి గల బాల్ పై బలప్రయోగం వల్ల వడిని పెంచవచ్చును.
- గమనస్థితిలో గల బాల్ పై బల ప్రయోగం వల్ల వడిని తగ్గించవచ్చును.
- గమన స్థితిలో గల బాల్ పై బల ప్రయోగం వల్ల గమన దిశను మార్చవచ్చును.
- గమన స్థితిలో గల బాల్ ను బల ప్రయోగం వల్ల నిశ్చల స్థితికి తీసుకు రావచ్చును.
కృత్యం – 12
13. వస్తువు దిశని మార్చడంలో ఫలితబల ప్రభావం :
ఒక కేరమ్ బోర్డు కాయిన్ ను స్టైకర్ తో కొట్టండి. మీ స్నేహితులని కూడా అలాగే కొట్టమని చెప్పండి. మీరు కొట్టిన ప్రతీసారీ కాయిన్ ఒకే దిశలో కదులుతుందా? లేదా? ఎందుకు? ఈ ఆటలో మీరు పరిశీలించిన పరిశీలనలను వ్రాయండి.
జవాబు:
- ప్రతి సందర్భంలో కాయిన్ కదిలే దిశ మారుతుంది.
- కేరమ్ కాయినను స్టెతో కొట్టినప్పుడు కాయితో పాటు స్ట్రైకర్ కూడా దిశని మార్చుకుంటుంది.
- కాయిన్ లేదా స్ట్రైకర్ దిశ మారుతుంది. ఎందుకంటే ఫలిత బలం దిశలో కాయిన్ లేదా స్ట్రైకర్ కదులుట వలన.
కేరమ్ బోర్డ్ ఆటలో పరిశీలించిన పరిశీలనలు :
- ఫలిత బలం నిశ్చల స్థితిలో ఉండే కాయిన్లను గమనస్థితిలోకి మారుస్తుంది.
- ఫలిత బలం గమనస్థితిలో ఉండే స్ట్రైకర్ ను నిశ్చల స్థితిలోకి మారుస్తుంది.
- ఫలిత బలం స్ట్రైకర్ వడిని, దిశను మారుస్తుంది.
కృత్యం – 13
14. వస్తువు ఆకారంపై బలం ప్రభావం :
ఈ క్రింది పట్టిక మొదటి వరుసలో ఇచ్చిన వివిధ సందర్భాలు వస్తువుపై బలం ప్రయోగించడానికి ముందు, బలం ప్రయోగించిన తర్వాత వస్తువు యొక్క ఆకారంలో మార్పు గమనించండి. ఆయా వస్తువు ఆకృతి తాత్కాలికంగా మారిందో, శాశ్వతంగా మారిందో గుర్తించి పట్టికలో నింపండి. తాత్కాలిక మార్పును “T’ తో, శాశ్వత మార్పును ‘P’తో సూచించండి.
జవాబు:
బలం ప్రయోగించు సందర్భం | ఆకారంలో మార్పు (తాత్కాలికం (1), శాశ్వతం(P)) |
రబ్బరు బ్యాండును సాగదీయడం | T |
స్పాంజ్ ని పిండటం | T |
కాగితాన్ని చింపడం | P |
ప్లాస్టిక్ బాటిల్ ని / గ్లాసును నలిపివేయడం | P |
రొట్టె చేయడం | P |
అద్దాన్ని పగలగొట్టడం | P |
కృత్యం -14
15. స్పర్శాతల వైశాల్యాన్ని బట్టి బల ప్రభావంలో మార్పు :
ఒక పెన్సిల్ ను తీసుకుని, పెన్సిల్ యొక్క వెనుకవైపు గుండ్రని చివరతో మీ అరచేతిపై నొక్కండి. తరవాత పెన్సిల్ యొక్క ముందువైపు అంటే మొనదేలి ఉన్న వైపు నుంచి మీ అరచేతిపై గుచ్చండి.
ఈ రెండు సందర్భాలలో మీరు పొందిన అనుభూతిలో తేడా ఏమైనా ఉందా? ఎందుకు?
జవాబు:
- ఈ రెండు సందర్భాలలో మనము పొందే అనుభూతి తేడాగా ఉంటుంది. మొనదేలి ఉన్నవైపున గుచ్చుకొన్నట్లుగా ఉంటుంది. ఎందుకనగా పెన్సిల్ వెనకవైపు వైశాల్యము ఎక్కువ కనుక చేతిపై పీడనము తక్కువగా ఉంటుంది.
- పెన్సిల్ మొనదేలి ఉన్నవైపు వైశాల్యము తక్కువగా ఉంటుంది కనుక పీడనము ఎక్కువగా ఉంటుంది.
కృత్యం – 15
16. బలం ప్రభావాన్ని గుర్తించుట :
రెండు ట్రేలు తీసుకుని వాటిని పొడి సున్నంతో లేదా మెత్తని ఇసుకతో నింపండి. ఒకే ఆకారం, ఒకే ద్రవ్యరాశి గల రెండు ఇటుకలు తీసుకోండి. ప్రక్కపటంలో చూపిన విధంగా ఒక ఇటుకని మొదటి ట్రేలో నిలువుగా, రెండవ దానిని వేరొక ట్రేలో అడ్డంగా పెట్టండి. రెండు ఇటుకలు సున్నంలోకి ఒకే లోతుకి దిగాయా పరిశీలించి ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
ఎ) ఏ ట్రేలోని ఇటుక ఎక్కువ లోతు సున్నంలోకి దిగినది? కారణం ఏమిటి?
జవాబు:
మొదటి ట్రే (ఎ) లోని ఇటుక ఎక్కువ లోతు సున్నంలోకి దిగినది. కారణం, మొదటి ట్రేలో సున్నంపై తాకే నిలువుగా పెట్టిన ఇటుక యొక్క స్పర్శా వైశాల్యం తక్కువగా ఉండుట.
బి) ఏ ట్రేలోని ఇటుక తక్కువ లోతు సున్నంలోకి దిగినది? కారణం ఏమిటి?
జవాబు:
రెండవ ట్రే (బి) లోని ఇటుక తక్కువ లోతు సున్నంలోకి దిగినది. కారణం, రెండవ ట్రేలో సున్నంపై తాకే అడ్డంగా పెట్టిన ఇటుక యొక్క స్పర్శా వైశాల్యం ఎక్కువగా ఉండుట.
సి) ఈ కృత్యం వల్ల నీవు పరిశీలించినది ఏమిటి?
జవాబు:
ప్రయోగించిన బలం ఒకటే అయినప్పుడు తక్కువ స్పర్శా వైశాల్యం గల వస్తువు ఎక్కువ పీడనాన్ని కలుగజేస్తుంది.