SCERT AP Board 7th Class Telugu Guide వ్యాసాలు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu వ్యాసాలు

II. స్వీయరచన – వ్యవహార రూపాలు

1. నీకు నచ్చిన కవి గూర్చి వ్యాసరూపంగా రాయండి.
జవాబు:
నాకు నచ్చిన కవి
“రాజు మరణించె నొక తార రాలిపోయె
కవియు మరణించె నొక తార గగన మెక్కె
రాజు జీవించు రాతి విగ్రహముల యందు
సుకవి జీవించే ప్రజల నాలుకల యందు !”

అంటూ తన కవితాకేతనాన్ని తెలుగు సాహితీ గగనాన సముజ్వలంగా ఎగురవేసిన కవి చక్రవర్తి జాషువా. ఈ కవి అంటే నాకు చాలా ఇష్టం. ఈయన 1895 సెప్టెంబరు 28న గుంటూరు జిల్లా వినుకొండలో వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించాడు. చిన్ననాటి నుండి సమాజంలోని అసమానతలను చూసి, అనుభవించి, బడుగుల బతుకు వెతలను అనన్య సామాన్యంగా పద్యరూపంలో చిత్రించిన అసాధారణ కవి జాషువా. మూఢ విశ్వాసాలపై తిరుగు బావుటాను ఎగురవేశాడు. ఈ విశ్వమే మమతల మందిరం కావాలని అభిలషించిన నిత్య సత్య కృషీవలుడు జాషువా.”

పద్యం, గద్యం, పాట, మాట….. అన్నీ ఆయన మస్తిష్క అక్షయపాత్ర నుండి మనకు వడ్డించిన అమృతాన్నాలే. పద్య గద్య విద్యలతో అప్రతిహతంగా శరసంధానం చేసిన సవ్యసాచి జాషువా. నాటక రచనలోను తనదైన శైలిలో రవ్వలు రాల్చి గరగరల్ పచరించిన దిట్టగా గణుతికెక్కాడు.

జాషువా కలం నుంచి వెలువడ్డ అసంఖ్యాక రచనల్లో “గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తు చరిత్ర, ముంతాజ్ మహల్, గిజిగాడు, శ్మశాన వాటిక” మొదలైన రచనల ద్వారా తెలుగు లోకానికి ఆప్తులయ్యారు. వీరి ‘క్రీస్తు చరిత్ర’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కళాప్రపూర్ణ, పద్మభూషణ్, కవికోకిల, కవితా విశారద, నవయుగ కవితా చక్రవర్తి” అంటూ ఆంధ్రదేశం కీర్తించింది. 1951లో గుంటూరులో కనకాభిషేకంతో గజారోహణం, గండపెండేరంతో ఈ తెలుగునేల సత్కరించింది. “వడగాడ్పు నా జీవితమైతే, వెన్నెల నా కవిత్వం” అని చాటిన ‘విశ్వనరుడు’ జాషువా.

2. ‘పోలమ్మ’లాంటి గుండెధైర్యం ఉన్న స్త్రీలు సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో మీకు తెలిసిన ఒకరి గురించి, వారి కష్టం గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
మన భారతదేశంలో స్త్రీలను శక్తి స్వరూపిణులుగా భావిస్తారు. దేశాభివృద్ధికి స్త్రీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నిలబడుతున్నారు. మనదేశంలో స్త్రీలు అన్ని రంగాలలోను సాధిస్తున్న విజయాలు కోకొల్లలు. యువతను సక్రమ మార్గంలో నడిపించాలన్నా, విద్యాబుద్ధులు నేర్పాలన్నా స్త్రీ పాత్ర ప్రధానమైనది. అలాంటి స్త్రీలు వంచనకు గురై బలౌతున్నారు. వారిలో కొందరే తమ సమస్యలను అధిగమించగల్గుతున్నారు. దేశానికి రైతు ఎంత అవసరమో ఇంటికి ఇల్లాలు అంతే.

మా ఊరిలో ఇటీవల ఒక రైతు మరణించాడు. చాలా అప్పులు ఉన్నాయి. అతని భార్య అప్పులవాళ్ళతో రెండు సంవత్సరాలు ఆగమని, సాగు చేసి ఋణం తీరుస్తానని చెప్పింది. ఆ మాటలకు అక్కడున్న వాళ్ళంతా ఆడదానివి నీవు వ్యవసాయం చేస్తావా ? అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఆవిడ వారి మాటలను ప్రేరణగా తీసుకొని . వ్యవసాయం మొదలు పెట్టింది. నిజంగానే రెండేళ్ళలోనే వారి అప్పులు తీర్చింది. ఆ తర్వాత ఆమె సొంత ట్రాక్టరు కొన్నది. నవ్విన వాళ్ళే ఆశ్చర్యపోయేటట్లు నలుగురికి ఆదర్శంగా నిలిచింది.

AP Board 7th Class Telugu వ్యాసాలు

3. లలితకళల్లో నీకు నచ్చిన అంశం గురించి వ్యాసం రాయండి.
జవాబు:
లలితకళలు తెలుగు సంప్రదాయానికి పట్టుకొమ్మలు. భారతీయ సంస్కృతికి నిలువుటద్దాలు. పూర్వం నుండి మానవుడు తన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ఎన్నో పద్ధతులను అనుసరిస్తున్నాడు. మానవ హృదయానికి ఆనందాన్ని కలిగించేవి లలితకళలు. లలితకళలను ఆంగ్లంలో FINE ARTS అంటారు. ‘సాహిత్యం , సంగీతం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం’ ఇవి లలితకళలు. వీటిలో సంగీతం అంటే నాకు చాలా ఇష్టం.

సంగీతం – శ్రవణేంద్రియముల ద్వారా మనస్సుకు ఆనందం కలిగిస్తుంది. ఈ సంగీతం. ఇది కేవల స్వరమయమైనది. తాళ, లయ ఆశ్రయమైనది. ఇది మానవులనే కాక ప్రాణవంతమైన జంతుజాలమునంతను తన వైపు ఆకర్షించుకొనగలదు. అందుచేతనే …… శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి:….. అను నానుడి ఏర్పడింది. సప్తస్వరాల సమ్మేళనంతో మనస్సుకు సంగీతం ఆనందాన్ని అందిస్తుంది. సంగీతానికి మోళ్ళు చిగురిస్తాయి. పాములు పడగ విప్పి నాట్యం చేస్తాయి. ఏడ్చే పసిపాప హాయిగా నిద్రిస్తుంది. మనకు అన్నమయ్య, త్యాగయ్య, రామదాసులు ఉన్నారు. నేడు ఘంటసాల, మంగళంపల్లి, బాలు, ఏసుదాసు, సుశీల, జానకి, చిత్ర వంటి సంగీత , గాయకులూ ఉన్నారు.

4. కోవిడ్ – 19

సార్స్ వైరస్ కుటుంబమైన కోవిద్ – 19కు చెందినది కరోనా వైరస్. ఇది 2019 డిసెంబర్ లో చైనాలోని వూహాలో బయటపడింది. అప్పటినుండి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. అనేక లక్షల మంది మరణానికి కారణమైంది. ప్రపంచం పాలిట మహమ్మారిగా నిలిచింది.

ఇది ఇన్ఫెక్షన్ కలిగించే వైరస్. కరోనా వైరస్ సోకితే జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, వాంతులు, రుచి, వాసన తెలియకపోవడం మొదలైన లక్షణాలుంటాయి. దీనిని నిర్ధారించడానికి RT. P CR పరీక్ష,

CT స్కాన్, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష వంటివి చేస్తారు. కరోనా వైరస్ సోకితే సుమారు 5 రోజులు నుండి 10 నెలల వరకు కూడా మందులు వాడవలసి రావచ్చును.

ఇంట్లో ప్రత్యేక గదిలో ఉండాలి. ఎవరితోనూ ఏవిధంగా కలిసిమెలిసి తిరగకూడదు. కనీసం 14 రోజులు అలా ఉండాలి. తర్వాత పరీక్షించుకొని కరోనా వైరస్ లేదని తేలితే మరొక 20 రోజులు బైటకు రాకూడదు.

వ్యాక్సిన్ వేయించుకోవాలి. మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. శానిటైజర్ వాడాలి. అనవసరంగా బైట తిరగకూడదు. జనసమూహాలలోకి వెళ్లకూడదు. అప్పుడు కరోనా వైరసను పూర్తిగా జయించవచ్చు.

జూలై 2021 నాటికి భారతదేశంలో 3 కోట్ల 4 లక్షలమందికి కరోనా సోకింది. 2 కోట్ల 95 లక్షలమంది కోలుకున్నారు. మూడు లక్షల 99 వేలమంది కరోనాతో మరణించారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా 18 లక్షల 90 వేల మందికి సోకింది. 18 లక్షల 40 వేల మంది కోలుకున్నారు. 12,706 మంది కరోనాతో మరణించారు.

అందుచేత కరోనా మన ప్రపంచానికి పట్టిన మహమ్మారిగా వైద్యులు పేర్కొన్నారు.

5. బాల్య వివాహాలు

బాల్యవివాహాలు అంటే చిన్నతనంలోనే పెళ్ళిళ్లు చేయడం. ఒకప్పుడు ఆటలాడుకొనే వయస్సులోనే పెళ్ళిళ్ళు చేసేవారు. బ్రిటిష్ ప్రభుత్వం శారదా చట్టం పెట్టి చిన్నతనంలో పెళ్ళి చేయరాదని నిషేధించింది.

బాల్యవివాహాలు మంచివి కావు. చిన్నతనంలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోలేరు. తల్లిదండ్రుల, అత్తమామల పెత్తనం సాగుతుంది. దానితో చిక్కులు వస్తాయి. 13, 14 ఏళ్ళ వయస్సులోనే వారికి సంతానం కలుగుతుంది. అందువల్ల ఆడువారికి ఆరోగ్యం పాడవుతుంది.

కాబట్టి ప్రభుత్వము ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన యువతీయువకులకే పెళ్ళిళ్ళు చేయాలని నియమం పెట్టింది. భార్యాభర్తలు ఇద్దరూ పెద్దవారైతే వారు ఒకరినొకరు ప్రేమగా మంచిగా చూసుకుంటారు. వారు వారికి పుట్టిన పిల్లలను చక్కగా పెంచుతారు. వారి పిల్లలు బలంగా, ఆరోగ్యంగా పెరుగుతారు. వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది.

కాబట్టి బాల్య వివాహాలను అరికట్టాలి. వయస్సు వచ్చిన పిల్లలకే పెళ్ళిళ్లు చేయాలి. అప్పుడు వారి జీవితాలు ఆనందంగా హాయిగా సాగుతాయి.

6. కాలుష్యం (లేదా) పర్యావరణం (లేదా) కాలుష్యం గురించి 3 పేరాలలో వ్యాసం రాయండి

మన పరిసరాలన్నీ కాలుష్యంతో నిండి పోతున్నాయి. దేశంలో జనాభా పెరిగిపోయింది. మానవ జీవితంపై, వారి ఆరోగ్యాలపై కాలుష్య ప్రభావం ఉంటుంది. కాబట్టి మన పరిసరాలనూ, మనం పీల్చేగాలినీ, నీటినీ, శుభ్రంగా ఉంచుకోవాలి.

పరిసరాలలో కాలుష్యం మూడు రకాలుగా ఉంటుంది. 1) జల కాలుష్యం 2) ధ్వని కాలుష్యం 3) వాతావరణ కాలుష్యం.
1) జలకాలుష్యం :
నదుల్లో, కాలువల్లో, చెరువుల్లో స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం, పశువుల్ని కడగడం మొదలయిన కారణాల వల్ల జలకాలుష్యం ఏర్పడుతోంది.

2) ధ్వని కాలుష్యం :
రోడ్లపై కార్లు, మోటారు కార్ల హారన్స్, యంత్రాల చప్పుళ్ళు, మైకుల హోరు మొదలైన వాటి వల్ల ధ్వని కాలుష్యం వస్తోంది.

3) వాతావరణ కాలుష్యం :
కర్మాగారాలూ, బస్సులూ, మొదలైన వాటి నుండి, విషవాయువులు పొగ రూపంలో గాలిలో కలిసి ‘వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. ప్రజలు శుభ్రత పాటించి, చెట్లను పెంచి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. వారు కాలుష్యం కోరలలో చిక్కుకోరాదు.

AP Board 7th Class Telugu వ్యాసాలు

7. వార్తా పత్రికలు

వార్తలను అందించే పత్రికలను వార్తాపత్రికలు అంటారు. ప్రాచీనకాలంలో వార్తలను చేరవేయడానికి మనుషుల్నీ, జంతువుల్నీ, పక్షుల్నీ వాడేవారు. విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందిన తరువాత ముద్రణాయంత్రాలు కనిపెట్టబడ్డాయి. వార్తాపత్రికల వ్యాప్తి జరిగింది.

ప్రపంచంలో మొట్టమొదటగా వెనిస్ నగరంలో వార్తాపత్రిక ప్రారంభించబడిందని చెప్తారు. సుమారు క్రీ.శ. 1620 నాటికి వార్తాపత్రికలు వచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ‘ఇండియా గెజిట్’ అని కొందరూ, ‘బెంగాల్ గెజిట్’ అని కొందరూ చెబుతారు. 1850 నుంచి మన దేశంలో పత్రికల ప్రచురణ అధికమైంది.

వార్తాపత్రికలు అనేక భాషలలో వెలువడుతున్నాయి. మన తెలుగుభాషలో ఈనాడు, వార్త, సాక్షి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర మొదలైనవి బాగా ప్రచారంలో ఉన్న దినపత్రికలు.

వార్తాపత్రికలవల్ల లాభాలు చాలా ఉన్నాయి. వీటివల్ల దేశవిదేశవార్తలు తెలుసుకోవచ్చు. విజ్ఞానం పెరుగుతుంది. వీటివల్ల ప్రభుత్వం చేపట్టే పనులూ, లోపాలూ ప్రజలకి తెలియజేస్తాయి. ఇవి ప్రజల కష్టనష్టాలూ, సమస్యలూ, అభిప్రాయాలూ ప్రభుత్వానికి తెలియజేస్తాయి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ వార్తాపత్రికలు, కరదీపికలవంటివి. ఇవి జాతీయాభివృద్ధికీ, జాతి సమైక్యతకూ దోహదపడతాయి.

8. గ్రంధాలయాలు

తరతరాల విజ్ఞాన సంపదను అందించేవి గ్రంథాలు. అటువంటి గ్రంథాలు గల స్థలాన్ని గ్రంథాలయం అంటారు.

ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలయాలు ఉన్నాయి. అమెరికాలోని ‘కాంగ్రెసు లైబ్రరీ’, రోమ్ నగరంలోని వాటికన్ లైబ్రరీ’ మొదలైనవి ప్రపంచంలో పేరు పొందాయి. మన దేశంలో చెన్నైలోని ‘కన్నెమరా’ గ్రంథాలయం, తంజావూరులోని ‘సరస్వతీ మహలు’, హైదరాబాదులోని ‘శ్రీకృష్ణదేవవూయాంధ్రభాషా నిలయం’, వేటపాలెంలోని ‘సారస్వత నికేతనం’ మొదలైనవి చెప్పుకోదగిన గ్రంథాలయాలు.

అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నాళం కృష్ణారావు మొదలైనవాళ్ళు మన రాష్ట్రంలో గ్రంథాలయోద్యమాన్ని చేపట్టి గ్రంథాలయాలను స్థాపించారు. ఇప్పుడు ప్రతి విద్యాలయంలోనూ గ్రంథాలయాలున్నాయి.

గ్రంథాలయాలలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు ఉన్నాయి.

గ్రంథాలయాలవల్ల చాలా లాభాలున్నాయి. గ్రంథ పఠనంవల్ల విజ్ఞాన వినోదాలు పొందవచ్చు. అక్కడ లభించే దిన, వార, పక్ష, మాసపత్రికలను చదివి రాజకీయ, సాహిత్య, క్రీడారంగాది విషయాలు తెలుసుకోవచ్చు. గ్రంథాలయాలు మనిషిని మనీషిగా మారుస్తాయి. దేశాభ్యుదయానికీ, సమాజ వికాసానికీ మూలస్తంభాలు గ్రంథాలయాలు.

9. విజ్ఞాన యాత్రలు (విహార యాత్రలు)

విజ్ఞానాన్ని సంపాదించాలనే కోరికతో విద్యార్థులు చేసే యాత్రలను విజ్ఞాన యాత్రలు అంటారు. వీటినే ‘విహారయాత్రలనీ, వినోదయాత్రలనీ’ కూడా పిలుస్తారు.

పుస్తక పఠనంవల్ల పుస్తక జ్ఞానం, మాత్రమే లభిస్తుంది.. లోకానుభవం, ప్రజల ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే పర్యటనలు తప్పనిసరిగా చేయాలి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా గ్రహించాలంటే యాత్రలు చేయాలి. ఉదాహరణకు నీటి నుంచి విద్యుత్ ఎలా లభిస్తుందో పుస్తకాలలో వివరంగా ఉంటుంది. అది చదివితే కొంతమాత్రమే తెలుస్తుంది. జల విద్యుత్ కేంద్రానికి వెళ్ళి, పనిచేసే విధానాన్ని పరిశీలించినప్పుడు సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. ముఖ్యంగా చరిత్ర, సైన్సు వంటి విషయాలను అర్థంచేసుకోవడానికి ఈ యాత్రలు ఎంతో అవసరం.

విజ్ఞాన యాత్రలవల్ల చాలా లాభాలు ఉన్నాయి. వీటివల్ల లోకజ్ఞానం అలవడుతుంది. మానసిక విశ్రాంతి లభిస్తుంది. విభిన్న సంస్కృతుల్ని, భాషల్ని, జీవన విధానాల్ని తెలుసుకోవచ్చు. విజ్ఞాన యాత్రల వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యార్థులలో ఐకమత్యం పెంపొందుతుంది.

విజ్ఞానయాత్రలు లేదా విహారయాత్రలు కేవలం విద్యార్థులకే అనుకోవడం సరికాదు. అన్ని వయస్సుల వాళ్ళకీ, – అన్ని వృత్తుల వాళ్ళకీ ఇవి అవసరమే. పెద్దలు చేసే తీర్థయాత్రలు కూడా ఒక రకంగా విజ్ఞానయాత్రలే.

AP Board 7th Class Telugu వ్యాసాలు

10. చలనచిత్రాలు ( సినిమాలు)

చలనచిత్రాలు అంటే ‘కదిలే బొమ్మలు’ అని అర్థం. వీటినే సినిమాలు అంటారు. పూర్వం ప్రజల విజ్ఞాన వినోదాల కోసం తోలుబొమ్మలాటలు, భామా కలాపాలు, వీథినాటకాలు ప్రదర్శింపబడుతుండేవి.

కెమేరాలు కనిపెట్టబడ్డ తరువాత ‘మూకీ’ చిత్రాలు ప్రదర్శించేవారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన తరువాత ‘టాకీ’ చిత్రాలు వచ్చాయి. ప్రపంచంలో నేడు చలనచిత్రరంగాన హాలీవుడ్ పేరుగాంచింది. మన దేశంలో ముంబయి సినీరంగాన పేరుగాంచింది. చెన్నై, హైదరాబాదులు సినీ పరిశ్రమలో ముందున్నాయి.

ప్రజలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదాన్ని పొందడానికి ఈ సినిమాలు ఉపయోగిస్తాయి. ప్రపంచంలోగానీ, దేశంలోగానీ ఉన్న వివిధ సుందర దృశ్యాల్ని సినిమాలలో చూసి ఆనందించవచ్చు. సినిమాలు సాంఘికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా గొప్ప ప్రచార సాధనాలు.

నేడు ఈ పరిశ్రమ పెక్కుమందికి జీవనోపాధిని కలిగిస్తున్నది. అనేకమంది నటీనటులు, కళాకారులు దీనివల్ల ధనవంతులవుతున్నారు. కార్మికులు, విద్యార్థులు, పిన్నలు, పెద్దలు అందరూ వీటిని చూసి మానసిక విశ్రాంతిని, వినోదాన్ని పొందుతున్నారు.

ఈ సినిమాలను సరైన పద్ధతిలో తీయకపోతే సమాజానికి చెడు కలుగుతుంది. కాబట్టి నిర్మాతలు కేవలం వ్యాపారదృష్టితోనే కాక, కళాత్మకపు విలువలను, నైతిక విలువలను పెంచే చిత్రాలను నిర్మించాలి.

11. రేడియో (ఆకాశవాణి)

రేడియోను ‘మార్కొని’ అనే ఇటలీ దేశస్థుడు 1895లో కనిపెట్టాడు. శబ్దతరంగాలను విద్యుత్తరంగాలుగా మార్చి నిస్తంత్రీ విధానంతో ప్రపంచంలోని అన్ని మూలలకు ఎక్కడెక్కడి విషయాలనూ తెలియజేసే అద్భుత సాధనం రేడియో.

మన దేశంలో రేడియో కేంద్రాలు పెద్ద పెద్ద నగరాలలో ఉన్నాయి. వాటిని బ్రాడ్ కాస్టింగ్ స్టేషన్లు అంటారు. కొన్ని ఉపకేంద్రాలు ప్రసారం మాత్రమే చేస్తాయి. వాటిని రిలే కేంద్రాలు అంటారు.

రేడియోలో వార్తలు, సంగీతం, నాటకాలు, సినిమాలు, హరికథలు, ప్రసంగాలు, ప్రసారం చేయబడతాయి. అలాగే రైతులకు వ్యవసాయ కార్యక్రమాలు, మహిళలకు మహిళామండలి కార్యక్రమాలు, బాలబాలికలకు బాలానందం, యువకులకు యువవాణి కార్యక్రమాలు ప్రసారం చేయబడతాయి.

ఇంకా భక్తిరంజని కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, విద్యావిషయకమైన కార్యక్రమాలు, క్రీడలు, ధరవరలు, ప్రకటనలు మరెన్నోరకాల కార్యక్రమాలూ రేడియోలో ప్రసారం చేయబడతాయి. టీవీల వ్యాప్తి జరిగాక రేడియోలు * వెనుకబడ్డాయి. –

అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందిస్తూ, ప్రజలలో దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాల్ని పెంపొందింపజేస్తున్న అద్భుతసాధనం రేడియో.

AP Board 7th Class Telugu వ్యాసాలు

12. దూరదర్శన్ (టీ.వీ)

విజ్ఞానశాస్త్ర ప్రగతికీ, మానవుడి ప్రతిభకీ నిదర్శనం టెలివిజన్. ఇది బ్రిటన్ లో 1936లో మొదట వ్యాప్తిలోకి వచ్చింది. దీనిని స్కాట్ దేశపు ఇంజనీర్ జాన్ లాగ్. బైర్డ్ 1928లో కనిపెట్టాడు.

రేడియోలో శబ్దాన్ని మాత్రమే వింటాం. శబ్దంతో పాటు దృశ్యాన్ని చూసే అవకాశం టెలివిజన్ లో ఉంటుంది. టెలివిజన్ ఈనాడు ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. నేడు టీవీ లేని ఇల్లు లేదు.

టీ.వీ. ల వల్ల చాలా లాభాలున్నాయి. ఇది కేవలం ప్రచార సాధనమో, వినోద సాధనమో కాదు. దీనిద్వారా ప్రభుత్వమూ, వాణిజ్య సంస్థలు ప్రచారం చేసుకోవచ్చు. మనం స్వయంగా వెళ్ళి చూడలేని ప్రదేశాలెన్నో ఇందులో చూడవచ్చు.

విద్యారంగంలో, వైద్య రంగంలో, వాణిజ్య రంగంలో, విజ్ఞానశాస్త్ర రంగంలో ఈనాడు టెలివిజన్ కు తిరుగులేని స్థానం ఉంది. నిరక్షరాస్యతా నిర్మూలనలో టెలివిజన్ కీలకపాత్ర వహిస్తోంది. ప్రజల్ని అన్ని రంగాలలోనూ చైతన్యవంతం చేస్తున్న శక్తివంతమైన సాధనం టెలివిజన్. ‘వీడియో’ పరిజ్ఞానానికి టీవీ మూలకారణం. మన సంస్కృతిని, కళలను , కాపాడుకోవడానికి టీవీ ఎంతగానో ఉపయోగపడుతుంది.

టీ.వీల వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. అతి ఎక్కడా పనికిరాదు. టీవీలను ఎక్కువగా చూస్తూ కొందరు వృధా కాలయాపన చేస్తున్నారు. విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతోంది. ఎక్కువగా చూడటంవల్ల కండ్ల జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

13. కంప్యూటర్

కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. కంప్యూటర్ లో ‘డేటా’ ను నిల్వచేయవచ్చు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ చాలా కచ్చితంగా, త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైన కంప్యూటర్‌ను కనిపెట్టినవాడు ఛార్లెస్ బాబ్బేజి.

కంప్యూటర్ వల్ల చాలా లాభాలున్నాయి. కూడికలు, తీసివేతలు, గుణకారాలు (హెచ్చవేతలు), భాగహారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనికివస్తుంది. కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు.

విమానాలు, బస్సులు, రైళ్ళు మొదలైనవాటి టిక్కెట్ల రిజర్వేషన్లకు కంప్యూటర్లను ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్యా, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.

కంప్యూటర్‌ను ఉపయోగించి ఇంటర్నెట్ అనే సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు. ఆధునిక విజ్ఞాన ప్రగతికి నిదర్శనం కంప్యూటర్.

AP Board 7th Class Telugu వ్యాసాలు

14. ఒక పండుగ (దీపావళి)

మనం జరుపుకొనే ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఇది ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసం కృష్ణపక్షంలో వస్తుంది. దీన్ని రెండు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు నరక చతుర్దశి. రెండోరోజు దీపావళి అమావాస్య. ఈ దీపావళి పండుగను మన దేశంలో అన్ని రాష్ట్రాలవారూ జరుపుకొంటారు.

నరక చతుర్దశిని గూర్చి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం నరకుడనే రాక్షసుడు లోకాల్ని బాధిస్తుండేవాడు. . . ఆ బాధలు భరించలేక ప్రజలు శ్రీకృష్ణుడితో మొరపెట్టుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకుడిపై యుద్ధానికి వెళ్ళి, వాడిని సంహరించాడు. నరకుడు మరణించినందుకు ప్రజలందరూ సంతోషించారు. అది చతుర్దశినాడు జరిగింది. కాబట్టి నరక చతుర్దశి అనే పేర పండుగ చేసుకున్నారు. నరకునివల్ల చీకటిలో మ్రగ్గిన ప్రజలు వెలుగు చూశారు. కాబట్టి దీపాల వెలుగులో మరునాడొక పండుగ చేసుకున్నారు.

నరక చతుర్దశి రోజు తెల్లవారు జామున లేచి పిల్లలు, పెద్దలు శిరస్నానం చేస్తారు. నూతన వస్త్రాలు ధరించి, పిండివంటలతో భోజనాలు చేస్తారు. ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. దీపావళి రోజు రకరకాల టపాకాయలు, మతాబులు, చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలవంటి మందు- సామానులు కాలుస్తారు. కొందరు దీపావళి పండుగరోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.

15. లాల్ బహదూర్ శాస్త్రి (జాతీయ నాయకుడు)

లాల్ బహదూర్ 1904 వ సంవత్సరం అక్టోబర్ రెండో తేదీన, వారణాసిలో జన్మించాడు. ఆయన తల్లి పేరు రామ్ దులారీదేవి. తండ్రి శారదా ప్రసాద్.

లాల్ బహదూర్ కాశీ విశ్వవిద్యాలయం నుండి ‘శాస్త్రి’ పట్టా పొందాడు. ఆనాటి నుండి లాల్ బహదూర్ శాస్త్రిగా పిలువబడ్డాడు. ఆయన భార్య పేరు లలితాదేవి.

మన దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో జవహర్ లాల్ నెహ్రూకు కుడిభుజంగా పనిచేశాడు. రవాణా, తంతి తపాలా శాఖలు, హోం శాఖ, పరిశ్రమల శాఖ, వాణిజ్య శాఖ, రైల్వేశాఖల మంత్రిగా భారతదేశానికి ఎంతో సేవ చేశాడు.

నెహ్రూ తర్వాత శాస్త్రి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. జై జవాన్, జై కిసాన్ అన్న నినాదంతో భారతదేశాన్ని , ఉర్రూతలూగించాడు. ఆయనలో పట్టుదల ఎక్కువ. నైతిక విలువలకు, నిజాయితీకి, నిరాడంబరతకు ఈయనది పెట్టింది పేరు. ఆయన 1966వ సంవత్సరం జనవరి పదకొండవ తేదీన మరణించాడు.

16. అక్షరాస్యత

‘విద్య లేనివాడు వింత పశువు’ అని పెద్దలంటారు. చదవడం, రాయడం, లెక్కలు నేర్చుకోవటమే. అక్షరాస్యత.

విద్య నేర్చినవాడు అన్ని రంగాల్లోనూ రాణిస్తాడు. కాబట్టి అందరూ బాగా చదువుకోవాలి. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మనదేశంలో చదువుకున్నవారి శాతం చాలా తక్కువ. దీనికి కారణాలు ప్రజల్లో చైతన్యం లేకపోవడం మరియు పేదరికం.

ప్రభుత్వం ప్రత్యేకంగా వయోజనుల కోసం అక్షరాస్యతా పథకాలు ప్రారంభించింది. పగలంతా పనుల్లో మునిగిపోయినవారికోసం, రాత్రి పాఠశాలలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం జిల్లాల వారీగా సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమాలు చేపట్టింది.

పనిపాటలు చేసుకుంటూ చదువుకోవాలనుకునే వారి కోసం, మధ్యలో బడి మానేసిన పిల్లల కోసం అనియత విద్యాకేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే ఇంట్లో కూర్చొని తీరిక వేళల్లో చదువుకోవడానికి వీలుగా సార్వత్రిక పాఠశాల విద్య ఏర్పాటు చేశారు.

మనదేశంలో జనవిజ్ఞాన వేదిక, భారత జ్ఞాన విజ్ఞాన సమితి వంటి స్వచ్ఛంద సంస్థలు సాక్షరతా ఉద్యమంలో ఎక్కువగా పాల్గొంటున్నాయి. సుఖసంతోషాలతో బతకాలంటే ప్రతివ్యక్తి విద్యావంతుడు కావాలి.

AP Board 7th Class Telugu వ్యాసాలు

17. బాలకార్మికులు

నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయస్సులోనే కార్మికులుగా చేరుతున్నారని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (ఐ.ఎల్.ఒ) తన సర్వేలో వెల్లడించింది.

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఎల్.ఒ. నిర్వహించిన సర్వేలో తెలియజేసింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా బాలకార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలు సందర్భాలలో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాలకార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేట్లు చూడాలి.

భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళల్లోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పని చేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాలకార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళకు చదువుకొనే అవకాశం కల్పించాలి.

మన రాష్ట్రంలో 16 లక్షల మంది బాలకార్మికులు ఉన్నారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది.

బాలకార్మికులను కూలివారుగానే చూస్తే వారు కార్మికులుగానే మిగిలిపోతారు. వారిలో ఉన్న యోగ్యతను, ప్రతిభను వెలికి తీసేందుకు సహకారం అందజేస్తే భవిష్యత్తులో ఒక మంచి నిపుణుడిని అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

18. కరవు – నివారణోపాయాలు

అనావృష్టి వల్ల కరవు వస్తుంది. కరవును క్షామం అని కూడా అంటారు. సామాన్య వర్షపాతంలో 75% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘కరవు’గాను, 50% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘తీవ్రమైన కరవు’ గాను భారత వాతావరణ శాఖ నిర్వచించింది.

ఋతుపవనాల నియమరహిత స్వభావం వల్ల దేశంలో ఏదో. ఒకచోట ప్రతి సంవత్సరం తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. . ఎక్కువగా వాయవ్య భారతదేశం, ఆ తరువాత దక్షిణ మరియు మధ్య భారతదేశంలో తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులు అతిగా కరవులు సంభవించే రాష్ట్రాలు.

నివారణోపాయాలు :

  1. కరవు పీడిత ప్రాంతాలలో భూమిశిస్తు పూర్తిగా తొలగించడం గానీ, తగ్గించడం గానీ చేయాలి.
  2. క్షామపీడిత ప్రాంతాలలో ప్రజలు తిరిగి వ్యవసాయం చేసుకొనేందుకు వీలుగా ఆర్థిక సహాయం అందించడం, నీటి పారుదల సౌకర్యాలు కలిగించడం వంటివి చేయాలి.
  3. ఆయా ప్రాంతాలను బట్టి ఏయే పంటలు వేస్తే బాగా పండుతాయో వ్యవసాయదారులకు సూచనలివ్వాలి.
  4. పండిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కలిగించాలి.
  5. తుపానులు వచ్చినపుడు తట్టుకొని నిలబడి పంటనిచ్చే కొత్త రకాలను శాస్త్రజ్ఞులు కనిపెట్టాలి.
  6. వాతావరణ సమతౌల్యాన్ని కాపాడాలి.

కరవు నష్టాలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం “కరవుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక” (Drought prone area programme) ప్రవేశపెట్టింది.. ఈ ప్రణాళికలో నీటిపారుదల, మృత్తికా పరిరక్షణ, వనీకరణ మొదలగు పథకాలున్నాయి. ప్రభుత్వమేకాకుండా ప్రజలు కూడా మానవతాదృష్టితో కరవుపీడిత ప్రాంతీయులను ఆదుకోవడం తమ కర్తవ్యంగా భావించాలి.

AP Board 7th Class Telugu వ్యాసాలు

19. మాతృభాషలో విద్యను నేర్చుకోవడం (విద్యలో మాతృభాష ప్రాముఖ్యం)

మాతృభాష అంటే తల్లిభాష అని అర్థం. మనం పుట్టిన చోట జనవ్యవహారంలో ఉండే భాష మాతృభాష. మానవుడు పుట్టింది మొదలు గిట్టేవరకు మాతృభాషలోనే ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. మనం ఏ భాషలో మాట్లాడతామో, ఏ భాషలో కలలు కంటామో ఆ భాషలోనే విద్యను నేర్చుకోవడం ఎంతైనా అవసరం.

పరాయి భాషలో విద్యాభ్యాసం చేస్తే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుగా పరాయి భాషను అర్థం చేసుకోవడానికి చాలా ప్రయాస పడాల్సి వస్తుంది. అందులో తగినంత పరిజ్ఞానం అలవడనిదే విషయ గ్రహణంగానీ, విషయ వ్యక్తీకరణగానీ సాధ్యపడదు. మాతృభాషలో విద్యాభ్యాసంవల్ల విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పిన విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. గుర్తుంచుకొని పరీక్షలు బాగా వ్రాయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ విజ్ఞానాన్ని పొందవచ్చు.

మాతృభాషలో విద్యను నేర్చుకోవడం తల్లిపాలు త్రాగి పెరగడం వంటిది. పరభాషలో విద్యను నేర్చుకోవడం దాది పాలు త్రాగడం వంటిది. ఆంగ్లం వంటి పరాయిభాషలో విద్యార్థికి సరైన పరిజ్ఞానం లేనందువల్ల విద్యార్థికి ఆ భాష రాక బట్టీపట్టి ఏదోవిధంగా కృతార్థుడవుతున్నాడు. ఉపాధ్యాయులు చెప్పేది అర్థంకాక గైడ్సు (Guides) వెంట పడుతున్నాడు. కాబట్టి కనీసం సెకండరీ విద్యాస్థాయి వరకు మాతృభాషలోనే విద్యను బోధించడం, విద్యను నేర్చుకోవడం అవసరం.