SCERT AP Board 7th Class Telugu Solutions 2nd Lesson మాయాకంబళి Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu 2nd Lesson Questions and Answers మాయాకంబళి

7th Class Telugu 2nd Lesson మాయాకంబళి Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 7th Class Telugu Solutions 2nd Lesson మాయాకంబళి 1

ప్రశ్న 1.
చిత్రం ద్వారా మీరేమి గమనించారో చెప్పండి.
జవాబు:
చిత్రంలోని మామ్మగారు తన వేళ్ళతో తమాషా చేసి, పిల్లలకు చూపిస్తూ కథను చెబుతున్నారు. పిల్లలు చాలా ఆశ్చర్యంగా చూస్తూ వింటున్నారు.

ప్రశ్న 2.
మీరు చదివిన కథల పుస్తకాల పేర్లు చెప్పండి.
జవాబు:
చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, బాలానంద బొమ్మల పంచతంత్రం, బేతాళకథలు, అపూర్వ చింతామణి, సుజ్ఞానబోధిని, నీతికథలు, భట్టి విక్రమార్క కథలు మొదలైనవి.

AP Board 7th Class Telugu Solutions 2nd Lesson మాయాకంబళి

ప్రశ్న 3.
కథల పుస్తకాలు చదవడం మీకు ఇష్టమా? ఎందుకు?
జవాబు:
కథల పుస్తకాలు చదవడం మాకు చాలా ఇష్టం. ఎందుకంటే కథలు ఆసక్తిని పెంచుతాయి. ఊహించని మలుపులు ఉంటాయి. కథలలోని పాత్రలు చాలా తెలివిగా, చమత్కారంగా ప్రవర్తిస్తాయి. మనకు తెలియని ఎన్నో విషయాలుంటాయి. చాలా విచిత్రమైన సమస్యలుంటాయి. వాటికి పరిష్కారాలుంటాయి. మంచి మంచి నీతులు – ఉంటాయి. అందుకే కథలంటే మాకు చాలా ఇష్టం.

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
పాఠంలోని మాయాకంబళి వలే మానవ జీవితంలో సెల్‌ఫోన్, సమయం, సంపద, మాటలు వంటివి విలువైనవే. వీటిని గురించి మీ సొంత మాటలలో చెప్పండి.
జవాబు:
1) సెల్‌ఫోన్ :
ఈ రోజులలో సెల్ ఫోన్ లేనివారు లేరు. దాని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నష్టాలు ఉన్నాయి. ఇంటర్నెట్లో శోధించి మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు హిమాలయాలు గురించి పాఠం విన్నాం. కాని, అవి ఎలా ఉంటాయో ఎంతలా వర్ణించి చెప్పినా మనకు వాటి స్వరూపం పూర్తిగా అర్థం కాదు. ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి చూస్తే హిమాలయాలు కనబడతాయి. చక్కగా అర్థం చేసుకోవచ్చు. అలాగే శిల్పాలు, దేశాలు, కవులు, రచయితలు, నదులు, అరణ్యాలు, జంతువులు, ప్రదేశాలు ఇలా దేనినైనా మన కళ్లతో చూసి తెలుసుకోవచ్చును. సైన్సులో చెప్పినవి కూడా తెలుసుకోవచ్చు. సెల్ ఫోన్ వలన ఇలాగ అనేక ఉపయోగాలున్నాయి. అనవసర విషయాలు చూడకూడదు. సెల్ఫీలు దిగడం ప్రమాదాలలో పడడం తప్పు. అనవసరమైన ‘ఆన్లైన్ గేమ్స్’ ఆడడం కూడా చాలా తప్పు. దాని వలన ధనం, సమయం, శక్తి వృథా అవుతాయి.

2) సమయం :
సమయం చాలా విలువైనది. గడిచిపోతే తిరిగిరాదు. సమయాన్ని వృథా చేయకూడదు. అనవసరంగా కాలక్షేపం చేయకూడదు. కాలాన్ని వినియోగించుకోవాలి. సరిగా వినియోగించుకోకపోతే తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు. చదువుకోవలసిన సమయంలో చదువుకోకపోతే జీవితమంతా బాధపడాలి. ఏ పనైనా అంతే.

3) సంపద :
మన దగ్గర సంపద అంటే డబ్బు ఉన్నపుడు చాలామంది చేరతారు. సంపద అయిపోయాక ఎవ్వరూ ‘రారు. డబ్బు సంపాదించడం కంటే దానిని కాపాడుకోవడం కష్టం. డబ్బు కోసం అబద్దాలు ఆడకూడదు. ఎవ్వరినీ మోసం చేయకూడదు. అడ్డదారులు తొక్కకూడదు. ‘డబ్బును అనవసరంగా ఖర్చు చేయకూడదు. అవసరాలలో ఉన్నవారిని ఆదుకోవాలి. ఆపదలలో ఉన్నవారికి సహాయపడాలి. డబ్బు ఉందని గర్వపడకూడదు. చెడుపనులు చేయకూడదు. అందరికీ ఉపయోగపడాలి.

4) మాటలు :
‘నోరావీపుకు దెబ్బలు తేకే’ అన్నారు. అంటే మనము చెడుమాటలు మాట్లాడితే అవమానాలు, నిందలు తప్పవు. మంచిగా మాట్లాడితే ఎవ్వరైనా స్నేహితులౌతారు. అందుకే ‘నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది’ అన్నారు. మనకు మంచి పేరు కాని, చెడ్డపేరు కానీ తెచ్చేది మనం మాట్లాడే పద్ధతే. అందుకే ఆలోచించి మాట్లాడాలి. ఇతరులను బాధపెట్టేలా మాట్లాడకూడదు.. ఎవ్వరినీ అపహాస్యం చేయకూడదు. నలుగురితో కలుపుగోలుగా ఉండాలి. స్నేహంగా మాట్లాడాలి. మాట కత్తి కంటే పదునైనది. కఠినంగా మాట్లాడితే ఇతరుల మనసు గాయపడుతుంది. స్నేహాలు చెడిపోతాయి. బంధుత్వాలు దూరం అయిపోతాయి. ఇతరులు మనల్ని నొప్పించేలా మాట్లాడినా మౌనంగా ఉండాలి. అనవసరమైన వాద ప్రతివాదనలు పెంచుకోకూడదు. స్పష్టంగా మాట్లాడాలి. సంస్కారవంతం అయిన భాషనే ఉపయోగించాలి. మాటలలో వినయం, సంస్కారం, గౌరవం ఉట్టిపడాలి.

ప్రశ్న 2.
కథలోని మాయాకంబళి మీకు లభిస్తే దానిని ఏ విధంగా ఉపయోగిస్తారో చెప్పండి.
జవాబు:
నాకు మాయాకంబళి లభిస్తే దానిని కప్పుకొంటే నేనెవరికీ కనబడను కదా ! లంచగొండులు చేసే మోసాలను అదృశ్యరూపంలో గమనించి వారిని పోలీసులకు పట్టిస్తాను. సరుకులను కలీ చేసే వ్యాపారస్తులను అదృశ్య రూపంలో గమనించి, వారిని కూడా తూనికలు-కొలతలవారికి పట్టిస్తాను. దొంగలను కూడా అదృశ్యరూపంలో గమనించి పట్టిస్తాను. మోసాలు, దొంగతనాలు అరికట్టడానికి మాయాకంబళిని ఉపయోగిస్తాను. స్త్రీలను, పిల్లలను, బలహీనులను బాధపెట్టేవారి భండారం కూడా బయటపెడతాను. అదృశ్యరూపంలో ఎక్కడికైనా వెళ్లవచ్చుకదా ! మా స్నేహితులను ఆటపట్టిస్తాను. ‘మాయమైతే కనిపెట్టే’ ఆట ఆడుకొంటాం. చాలా రకాలుగా ‘మాయాకంబళి’తో ఆటలు ఆడుకొంటాం. ఆనందపడతాం.

AP Board 7th Class Telugu Solutions 2nd Lesson మాయాకంబళి

ప్రశ్న 3.
మీరు చదివిన ఏదైనా కథను మీ సొంత మాటలలో చెప్పండి.
జవాబు:
అనగనగా ఒక ఊళ్లో ఒక మామ్మ, మనవడు ఉన్నారు. మనవడికి తల్లిదండ్రులిద్దరూ చనిపోయేరు. అందుచేత మామ్మకి మనవడంటే గారం. ఆ గారాబం వలన పాఠశాలకు వెళ్లేవాడు కాదు, చదువు రాలేదు. మామ్మగారు అతనిని రోజూ తిట్టేది. ఎక్కడికైనా వెళ్లి డబ్బు సంపాదించాలంటే చదువు ఉండాలని. కానీ, వినేవాడు కాదు. కనీసం బైటకి కూడా వెళ్లేవాడు కాదు. ఇంట్లోనే ఉండేవాడు. అలాగే పెద్దవాడైపోయాడు. 20 సంవత్సరాలు వచ్చేయి. అయినా. ఇల్లు వదిలేవాడు కాదు. అతని పేరు చెప్పలేదు కదూ ! అతని పేరు రాము.

“రామూ ! ఈ రోజు నువ్వు బైటకి వెళ్లి, డబ్బు సంపాదించుకురా ! వెళ్లు !” అంది మామ్మ.
“రేపు వెడతాను” అన్నాడు బద్దకంగా.
“రోజూ ఇలాగే అంటున్నావు. ఒక్క పదిరూపాయలు సంపాదించుకొనిరా ! డబ్బు విలువ తెలుస్తుంది.” అంది మామ్మ.
“పది రూపాయిలు కాదు మామ్మా ! పది. లక్షల కోట్లు సంపాదిస్తాను” అన్నాడు.
“అబ్బో ! కబుర్లకు లోటు లేదు. ఇలాగే కూర్చో ! నీకెవ్వరూ పిల్లనివ్వరు. పెళ్లి కాదు” అంది.
“కోటీశ్వరురాలు చేసుకొంటుందే మామ్మా” అన్నాడు.
“అలాగే కోతి కూడా చేసుకోదు” అంది.
“సరే ! రేపే వెడతాను. కోట్లు సంపాదించుకొని వస్తాను. కాని, నాకు మూడు మినపరొట్టెలు వేసి ఇయ్యి !” అన్నాడు.

మర్నాడు మూడు మినపరొట్టెలు, కొబ్బరి పచ్చడి, తేనె పానకం ఇచ్చింది. మనవడు ఆ రొట్టెలు పట్టుకొని బయల్దేరాడు. చాలా దూరం వెళ్లిపోయేడు. చీకటి పడే సమయానికి ఒక పెద్ద మర్రిచెట్టు దగ్గరికి చేరాడు.

“బాగా ఆకలి వేస్తోంది. పెద్దదాన్ని తినేయాలి. తేనెపానకం వేసుకొని తింటే భలే రుచిగా ఉంటుంది” అన్నాడు.

ఆ చెట్టు మీద మూడు దెయ్యాలున్నాయి. వాటికి భయపడి ఎవ్వరూ అటురారు. వీడు ధైర్యంగా వచ్చాడంటే వాడికి ఏవో మంత్రాలు వచ్చేమో ! అని దెయ్యాలు భయపడ్డాయి. పెద్ద దెయ్యం భయంతో కిందికి వచ్చింది.

“నన్ను తినకు ! నీకు దండం పెడతాను” అంది.

“దండం పెడితే కడుపునిండదమ్మా ! ఆకలిగా ఉంది తప్పదు. తినేస్తాను” అన్నాడు,

“ఒక్క క్షణం ఆగమని ఒక గిన్నె, గరిటె ఇచ్చింది.” గిన్నెలో గరిటె పెట్టి ‘వడ్డించు’ అంటే, నీకు కావలసిన ఆహార పదార్థాలు వస్తాయి. కడుపునిండా తిను ! నన్ను వదిలేయి !” అంది. తృప్తిగా తిన్నాడు. ఊళ్లోకి వెళ్లి ఒక కిరాణా వ్యాపారికి ఇచ్చి, జాగ్రత్త చేయమని, మళ్లీ చెట్టు కిందకు వచ్చాడు. కిరాణా వ్యాపారికి దాని రహస్యం కూడా చెప్పాడు. తన ఇంట్లో వారంతా తృప్తిగా తిన్నాక, ఊరందరినీ పిలిచి ఆ వ్యాపారి భోజనాలు పెట్టాడు.

అర్ధరాత్రి రాముకు మళ్లీ ఆకలి వేసింది. రెండోదాన్ని తినేస్తానన్నాడు. రెండో దెయ్యం భయపడింది. కిందకు వచ్చి బ్రతిమాలింది. ఒక సంచీ ఇచ్చింది. ఆ సంచీ దులిపితే బంగారు కాసులు పడ్డాయి. దేనిలో దులిపితే దాని నిండా పడతాయని చెప్పింది. రాము మళ్లీ ఊళ్లోకి వెళ్లి వ్యాపారికి ఇచ్చి, దీనిని ‘దులపకండి’ అన్నాడు. ‘అలాగే’ అన్నాడు. రాము వెళ్లిపోయాక ఒక గిన్నెలో దులిపాడు, గిన్నె నిండా బంగారుకాసులు పడ్డాయి. ఒక పెద్ద సంచీలో దులిపాడు. సంచి నిండా బంగారుకాసులు పడ్డాయి. . – ఊరందరికీ భోజనాలు పెట్టి, అందరికీ తలొక గుప్పెడు బంగారుకాసులిచ్చాడు. ఆ నోటా ఈ నోటా తెలిసి … కొన్ని వేలమంది జనం వచ్చేశారు. అందరికీ ఇస్తున్నాడు.

మర్నాడు ఉదయమే “చంటి దాన్ని తినేస్తాను” అన్నాడు రాము. చిన్న దెయ్యం భయపడి వచ్చింది. ఒక కర్ర – ఇచ్చింది. “వడ్డించు అంటే ఎంతమందినైనా కొడుతుంది. నువ్వు ఆగమంటేనే ఆగుతుంది” అంది. మళ్లీ పట్టుకెళ్లి వ్యాపారికి ఇచ్చాడు. “వడ్డించు అనకండి” అన్నాడు. నవ్వుతూ. “అలాగే బాబూ” అన్నాడు.

అందరికీ భోజనాలు పెట్టి, కాసులిచ్చాడు. కర్రమ ‘వడ్డించు’ అన్నాడు. అందరినీ చితక్కొడుతోంది. అందరూ గోల గోల పెట్టేస్తున్నారు. కర్ర ఆగడం లేదు. చివరికి రాము దగ్గరికి వెళ్లారు. బ్రతిమాలి తీసుకొచ్చారు. కర్రను ఆపించారు. అందరూ పారిపోయారు. మోసం చేయాలనుకొన్న వ్యాపారికి నాలుగు వడ్డించి తన గిన్నె, గరిటె, . సంచీ, కర్రతో ఇంటికి వెళ్లాడు. పేదలకు అన్నం పెట్టి, డబ్బులిస్తూ, పోషించేవాడు. ఆ డబ్బుతో ఊరిని బాగుచేశాడు. పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నాడు.

ప్రశ్న 4.
కింది గద్యాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రతి ఇంట్లో ఎన్ని భాషలు. నేర్చుకున్నా మాతృభాషను విస్మరించకుండా ఉండాలి. భాష నిత్యం ప్రవహించే స్రవంతి. జీవనదిలా ప్రవహించే గోదావరి. నన్నయ కాలం నాటి గోదావరే ఇప్పుడూ ఉన్నా అందులో నీరు నిత్యం మారుతూనే ఉంటుంది. పాతనీరు పోయి కొత్తనీరు వచ్చి చేరుతూనే ఉంటుంది. భాష కూడా మార్పులకు గురవుతూనే ఉంటుంది. భాష నిలువ నీటి మడుగుగా మారితే అది సజీవ భాష కాదు అనే చెప్పాలి. అటువంటి పరిస్థితి ఏ భాషకు కలుగకూడదని గిడుగు రామ్మూర్తి గారు అన్నారు.
ప్రశ్నలు:
1) ప్రతి ఇంట్లో ఏ భాష మాట్లాడుతారు?
జవాబు:
ప్రతి ఇంట్లో తమ మాతృభాషను మాట్లాడుతారు.

2) భాష అనేది నిత్యం ఏమవుతూ వుంటుంది?
జవాబు:
భాష అనేది నిత్యం మార్పులకు లోనవుతూ ఉంటుంది.

3) భాషను ఏ నదితో పోల్చారు?
జవాబు:
భాషను గోదావరి నదితో పోల్చారు.

4) ఈ వచనంలోని మాటలు ఎవరన్నారు?
జవాబు:
ఈ వచనంలోని మాటలను గిడుగు రామ్మూర్తిగారన్నారు.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
భిక్షగాడు మాయా కంబళిని ఎందుకు వద్దనుకున్నాడు?
జవాబు:
బిచ్చగాడు ముసలివాడు. అది చలికాలం. అతనికి కప్పుకొందుకు కంబళి లేదు. అందుచేత శోభావతీ నగరంలో ఆ ముసలి బిచ్చగాడు చలిబాధ భరించలేక పాత కంబళిని చౌకలో కొనుక్కున్నాడు. వెంటనే దానిని కప్పుకున్నాడు. వెంటనే అదృశ్యమయ్యాడు. ఆ వార్త నగరమంతా వ్యాపించింది. చాలామంది దురాశాపరులు బిచ్చగాడి కోసం వెదకసాగారు. అది తెలిసి బిచ్చగాడు తనకు రానున్న ప్రమాదం ఊహించాడు. ఆ నగరంలో తనకు భద్రత లేదనుకున్నాడు.

ఆ కంబళి వలన తనకు అడుక్కుతినడానికి కూడా లేకపోయిందని బాధపడ్డాడు. ఊరి బయట పాడుబడిన దేవాలయం దగ్గర దొంగలు కూడా తన గురించే మాట్లాడుకోవడం గమనించాడు. ఆ రాత్రంతా ఆలోచించాడు. ఆ కంబళి కోసం హేమాహేమీలు పోటీ పడుతున్నారని గ్రహించాడు. ఆ కంబళి తనకెందుకూ పనికిరాదని నిర్ధారించుకున్నాడు. అది తనకు వద్దనుకున్నాడు. రాజు గారికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇచ్చేశాడు.

ప్రశ్న 2.
ఆత్మానందుడు రాజుకు రక్షాబంధం ఎందుకు కట్టాడు?
జవాబు:
రాజుకు భిక్షగాడు మాయాకంబళిని ఇచ్చాడు. దాని మహత్తును రాజు స్వయంగా పరీక్షించి తెలుసుకున్నాడు. అంతలో ఆత్మానందుడు వచ్చాడు. రాజైన చండీదత్తుని కలుసుకున్నాడు. కంబళిని ఇమ్మన్నాడు. రాజ్యశ్రేయస్సు దృష్ట్యా అది తనవద్దే ఉండాలని రాజు అన్నాడు.

అసాధారణ శక్తుల వల్ల మంచికంటే చెడు జరగటానికే ఎక్కువ అవకాశాలున్నాయని ఆత్మానందుడు చెప్పాడు. మాయాకంబళి , వంటి మహిమాన్వితమైన వస్తువు మనిషిని పాపకార్యాలకు, నీతి బాహ్యమైన పనులకు పురిగొల్పుతుందని చెప్పాడు. ఉత్తముడైన చండీదత్తుడు భ్రష్టుడుకావడం తనకిష్టం లేదని ఆత్మానందుడు చెప్పాడు. ఎన్ని విధాల చెప్పినా రాజు వినలేదు. స్వానుభవంతో తప్ప రాజుకు. విషయం బోధపడదని చెప్పాడు. రాజు క్షేమం కోసం రాజు చేతికి రక్షాబంధం కట్టాడు. ఆ రక్షాబంధనం వలన మాయాకంబళి కప్పుకొని మాయమైనవారు రాజుకు కనబడతారు. దాని వలననే చంచల, విక్రముల మోసాన్ని కనిపెట్టి, రాజు తనను, రాజ్యాన్ని రక్షించుకొన్నాడు.

AP Board 7th Class Telugu Solutions 2nd Lesson మాయాకంబళి

ప్రశ్న 3.
కలువకొలను సదానంద గురించి మీరు తెలుసుకున్న అంశాలను రాయండి.
జవాబు:
కలువకొలను సదానంద

జననం : చిత్తూరు జిల్లా పాకాలలో 22.2. 1939లో జన్మించారు.
తల్లిదండ్రులు : నాగమ్మ, కృష్ణపిళ్లే దంపతులు.
వృత్తి : ఉపాధ్యాయుడు – 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎంపికయ్యారు.
రచనలు (పిల్లలకథలు): శివానందలహరి, విందుభోజనం, చల్లని తల్లి, నీతికథా మంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి మొదలైనవి 200 కథలు, 2 నవలలు, 100 కి పైగా గేయాలు, కొన్ని గేయ కథలు రచించారు. చందమామ కథలు, వార్తా పత్రికలలో కథానికలు వ్రాశారు.

బహుమతులు : ‘బంగారు నడచిన బాట’ నవలకు 1966లో కేంద్రప్రభుత్వ విద్యాశాఖ బహుమతి వచ్చింది.
‘నవ్వే పెదవులు-ఏడ్చే కళ్లు’ కథాసంపుటికి 1976లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ‘అడవితల్లి’ పిల్లల నవలకు 2010లో కేంద్రసాహిత్య, బాలసాహితీ అవార్డు లభించింది.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
మాయాకంబళిని రాజు మొదట ఎందుకు కావాలనుకున్నాడు? తరువాత ఎందుకు తిరిగి ఇచ్చేశాడు?
జవాబు:
రాజ్యశ్రేయస్సు కోసం బిచ్చగాని వద్ద మాయాకంబళిని రాజు తీసుకొన్నాడు. అది తన దగ్గర ఉంటే దొంగలను, మోసగాళ్లను పట్టుకోవచ్చుననుకొన్నాడు. అందుచేతనే ఆత్మానందుడు ఆ కంబళిని అడిగినా రాజు ఇవ్వలేదు. ఆ కంబళి వలన పాపకార్యాలు, నీతి బాహ్యమైన పనులు పెరిగిపోతాయని చెప్పినా వినలేదు. ఆ కంబళి వలన రాజుకే ప్రమాదమన్నా పట్టించుకోలేదు.

ఆ కంబళి సహాయంతో నేరాలు, అక్రమాలు అరికట్టాడు. రాజనర్తకి చంచల కోరికపై ఆమెకు ఆ కంబళి ఇచ్చాడు. ఆత్మానందుడు కట్టిన రక్షాబంధం వలన కంబళి కప్పుకొని మాయమైన చంచలను చూశాడు. ఆమె కోశాధికారి విక్రముడి వద్దకు వెళ్లింది.

విక్రముడు ఆ కంబళి కప్పుకొని, అదృశ్యరూపంలో రాజుగారి పడకగదిలోకి వచ్చాడు. రాజును చంపాలను కున్నాడు. అది గ్రహించిన చండీదత్తుడు కత్తి దూశాడు. విక్రముని చంపాడు. చంచలను బంధించాడు, దేశ బహిష్కార శిక్షను విధించాడు.

మాయాకంబళి వలన మంచి చేయవచ్చుననుకున్నాడు కాని, దాని వలన మానవులలో స్వార్థం, నీచత్వం, . చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకే ముప్పు కలుగుతుందని రాజు గ్రహించాడు. ఆ మాటలే ఆత్మానందుడికి చెప్పాడు. కంబళిని తిరిగి ఆత్మానందుడికి ఇచ్చేశాడు.

ప్రశ్న 2.
మాయాకంబళి కథా సారాంశాన్ని మీ సొంతమాటలలో రాయండి.
జవాబు:
పూర్వం హిమాలయ పర్వతాలలో ఒక వృద్ధ యోగి ఉండేవాడు. అతని పేరు ఆత్మానందుడు. ఆయన చాలా మహిమలు కలవాడు. ఆయనకు భక్తుల తాకిడి ఎక్కువయింది. వారి నుండి తప్పించుకొనేందుకు తన పాత కంబళి మీద మంత్రజలం చల్లాడు. దాని మహిమతో ఆ కంబళి కప్పుకుంటే అదృశ్యమైపోతాడు.

ఒకరోజు ఆత్మానందుడు ఒక లోయలోకి పడిపోయాడు. ఆ కంబళి పడిపోయింది. అది ఒక వ్యాపారికి దొరికింది. ఆ వ్యాపారి శోభావతీ నగరంలో సంతకు వచ్చాడు. సంతలో దానిని ఒక ముసలి బిచ్చగాడు చౌక ధరకు కొన్నాడు. చలికి తట్టుకోలేక అది కప్పుకొని మాయమయ్యాడు. ఈ వార్త అందరికీ తెలిసింది.

దొంగలు, మోసగాళ్లే కాకుండా హేమాహేమీలు కూడా ఆ బిచ్చగాని కోసం వెతుకుతున్నారు. అది బిచ్చగాడు గమనించాడు. తనకు భద్రత లేదని తెలుసుకున్నాడు. కనీసం అడుక్కొని తినే అవకాశం కూడా లేనందుకు బాధ పడ్డాడు. అదృశ్యరూపంలో, చండీదత్త మహారాజు వద్దకు వెళ్లాడు. సభలో ప్రత్యక్షమయ్యాడు. మాయాకంబళిని రాజుకు ఇచ్చేశాడు. రాజు అతనికి జీవించడానికి సదుపాయాలు కల్పించాడు.

అంతలో ఆత్మానందుడు వచ్చాడు. రాజును కంబళి ఇమ్మన్నాడు. రాజు ఇవ్వలేదు. ఆ మాయాకంబళితో అన్యాయాలు, అక్రమాలను రాజు నివారించాడు.

రాజ్యంలో శాంతి ఏర్పడింది. రాజనర్తకి చంచల కోరగా మాయాకంబళిని ఆమెకు ఇచ్చాడు. ఆత్మానందుడు కట్టిన రక్షాబంధం మహిమతో చంచలను గమనించాడు. ఆమె మాయాకంబళిని కప్పుకొని మాయమై, కోశాధికారి విక్రముని దగ్గరకు వెళ్లడం చూశాడు. ఆ రాత్రి విక్రముడు మాయాకంబళిని కప్పుకొని, రాజును చంపడానికి వచ్చాడు. అది గమనించిన రాజు కత్తిదూసి, అతనిని చంపాడు. చంచలను రాజ్యం నుండి బహిష్కరించాడు.

మాయాకంబళి వలన కలిగే ప్రమాదం తెలుసుకున్నాడు. వెంటనే హిమాలయాలకు వెళ్లి, ఆత్మానందుడికి ఆ మాయాకంబళిని ఇచ్చేశాడు.

AP Board 7th Class Telugu Solutions 2nd Lesson మాయాకంబళి

ప్రశ్న 3.
విద్యార్థులారా ! మీరు మీ ఊహాశక్తితో ఒక కథను రాయండి.
జవాబు:
ఒకరోజు రెండు రాళ్లు మాట్లాడుకుంటున్నాయి.
“అడుగో ! శిల్పి వస్తున్నాడేవ్” అంది ఒక రాయి.
“అతనంటే నాకు భయం. ఒళ్లంతా చెక్కేస్తాడు” అంది మరొక రాయి.
“ఆ దెబ్బలు భరిస్తేనే కదా ! మనకు గౌరవం దక్కుతుంది.” అంది మొదటి రాయి.
“గౌరవం లేదు. గాడిద గుడ్డూ లేదు. నేను భరించలేను, పారిపోతున్నాను.” అని క్రిందికి దొర్లిపోయింది.

పది సంవత్సరాల తర్వాత, గుడిలో వినాయక విగ్రహం ఎదురుగా మెట్ల క్రింద రాయి ఉంది. ఆ రాయి వినాయకుని కాపాడమని ప్రార్థించింది. అందరూ తనను తొక్కుతూ వెడుతున్నారని, ఆ బాధ భరించలేకపోతున్నానని, విముక్తి కల్గించమని ప్రార్థించింది. వినాయక విగ్రహం పకపకా నవ్వింది. పది సంవత్సరాల క్రితం మనిద్దరం ప్రక్క ప్రక్కనే ఉండేవాళ్లం.

“నువ్వు ఉలిదెబ్బలకు భయపడి పారిపోయావు. నేను భరించాను. అందుకే ఈ రోజు పూజలందుకొంటున్నాను. కష్టపడితే ఫలితం వస్తుంది. చిన్నప్పుడు కష్టపడి చదువుకొంటే, జీవితమంతా సుఖపడవచ్చు. చిన్నప్పుడు చదువుకు భయపడితే, నీలాగే జీవితమంతా బాధపడాలి. అందుకే మొదట కష్టపడు. తర్వాత సుఖపడు అన్నారు. ఎవరూ ఎవరినీ రక్షించలేరు. నీ జీవితానికి నువ్వే కర్తవు. “జాలి పడడం’ తప్ప నేనేం చేయలేను” అంది వినాయక శిల్పంగా మారిన రాయి.

భాషాంశాలు

అ) కింద గీత గీసిన పదాలకు అర్ధాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.

1. పక్షులు యథేచ్ఛగా ఆకాశంలో తిరుగుతున్నాయి.
ఉదా : యథేచ్ఛగా = స్వేచ్ఛగా
సొంతవాక్యం : మనం స్వేచ్ఛగా మనలోని భావాలు చెప్పాలి.

2. బియ్యం చౌక ధరకు అమ్ముతున్నారు.
చౌక = తక్కువ ధర
సొంతవాక్యం : ప్రభుత్వం తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు ఇస్తుంది.

3. చెడ్డ పనులు ఎవరైనా చేస్తే అభ్యంతరం చెప్పాలి.
అభ్యంతరం : ఆటంకం
సొంతవాక్యం : మంచిపనికి ఆటంకం కల్గించకూడదు.

4. చలి వేసినప్పుడు గొంగళి కప్పుకుంటాను.
గొంగళి = రగ్గు
సొంతవాక్యం : శీతాకాలంలో రగ్గు చాలా అవసరం.

ఆ) కింది ప్రకృతికి వికృతిని జతపరచండి.

1. ఆశ్చర్యము అ) మొగము
2. రాత్రి ఆ) జేడు
3. రాజు ఇ) అచ్చెరువు
4. ముఖము ఈ) సుకం
5. సుఖం ఉ) రాతిరి

జవాబు:

1. ఆశ్చర్యము ఇ) అచ్చెరువు
2. రాత్రి ఉ) రాతిరి
3. రాజు ఆ) జేడు
4. ముఖము అ) మొగము
5. సుఖం ఈ) సుకం

ఇ) కింది వాక్యాలలో సమానార్థక పదాలు గుర్తించి రాయండి.

1. పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి. ఆ శైలము మీద చెట్లు ఉన్నాయి. ఆ గిరులు మంచుతో కప్పబడి ఉన్నాయి.
జవాబు:
పర్వతము, శైలము, గిరి

2. ఆ పట్టణంలో రాజు ఎంతో ఉత్తముడు. అందుకే ఆ భూపాలుడ్ని అందరూ నరేంద్రుడు అని పిలుస్తారు.
జవాబు:
రాజు, భూపాలుడు, నరేంద్రుడు

3. రాజు కరవాలంతో యుద్ధం చేస్తాడు. ఆ ఖడ్గం శత్రువుల తలను ఖండిస్తుంది.
జవాబు:
కరవాలం, ఖడ్గం

ఈ) కింది పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి.
ఉదా : ఏకాగ్రత = అవధానము
సొంతవాక్యం : ఏ విషయం మీదైనా ఏకాగ్రత పెట్టినట్లయితే విజయం సాధిస్తారు.

1. ప్రశాంతత = శాంతం
సొంతవాక్యం : ప్రశాంతత లేకపోతే ఎంత సంపద ఉన్నా ప్రయోజనం లేదు.

2. తిరుగుముఖం = వెనుకకు ప్రయాణం కావడం
సొంతవాక్యం : కరోనా తిరుగుముఖం పట్టిందనుకొంటే, మళ్లీ చెలరేగిపోతోంది.

3. ప్రలోభ పెట్టడం = లంచం ఇచ్చి వశపరచుకోవడం
సొంతవాక్యం : తప్పుడు పని కోసం ఇతరులను ప్రలోభపెట్టడం తప్పు.

4. శ్రేయస్సు = మేలు
సొంతవాక్యం : గురువులు ఎప్పుడూ శిష్యుల శ్రేయస్సునే కోరతారు.

5. దురాశాపరులు = చెడ్డదైన ఆశ కలవారు
సొంతవాక్యం : దురాశాపరులు తమ అవసరం కోసం ఎంత తప్పుగానైనా ప్రవర్తిస్తారు.

6. కంటపడకుండా = ఇతరులు గమనించకుండా
సొంతవాక్యం : పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన చందు ప్రధానోపాధ్యాయురాలి కంటపడకుండా జాగ్రత్త పడ్డాడు.

AP Board 7th Class Telugu Solutions 2nd Lesson మాయాకంబళి

ఉ) ఎటునుంచి చదివినా ఒకే పదం వచ్చే ‘కచిక’ పదాలకు (పద భ్రమణం) వాక్యాల ఆధారంగా జవాబులు రాయండి.
ఉదా : నటులు చేసేది – నటన
1. చింతకాయ రుచి
జవాబు:
పులుపు

2. శరీరాన్ని కప్పే వస్త్రానికి మరొక పేరు
జవాబు:
వలువ

3. గాలి, వెలుతురు కోసం ఇంటికి పెట్టేది.
జవాబు:
కిటికి

4. ఇది తీయడమంటే నిద్రపోతున్నాడని అర్థం
జవాబు:
కునుకు

5. సముద్రపు ఆల్చిప్పలో వుండేది
జవాబు:
ముత్యము

ఇలాంటి మరికొన్ని పదాలను సేకరించి రాయండి.
1. గరగ
2. విరివి
3. కలక
4. జలజ
5. కచిక
6. మహిమ

ఇటువంటి వాక్యం : సినిమాకురా పరాకు మానిసి.

వ్యాకరణాంశాలు

అ) కింది వాక్యాలను గమనించండి.

1. పోతన భాగవతం రచించాడు.
2. ఆవు పాలు ఇచ్చింది.
3. రాజు వేటకు వెళ్ళాడు.
4. రాము అన్నం తిన్నాడు.
5. గీత పుస్తకం తెచ్చింది.

క్రియకు ముందు భాగంలో ఎవరు? ఏది? అని ప్రశ్నిస్తే వచ్చే జవాబును గమనించండి.
ఉదా : భాగవతాన్ని ఎవరు రచించారు? – పోతన

1. పాలు ఇచ్చే జంతువు ఏది?
జవాబు:
ఆవు

2. వేటకు ఎవరు వెళ్ళారు?
జవాబు:
రాజు

3. అన్నం ఎవరు తిన్నారు?
జవాబు:
రాము

4. పుస్తకం ఎవరు తెచ్చారు?
జవాబు:
గీత

క్రియను ఎవరు? ఏది? అని ప్రశ్నించినప్పుడు వస్తున్న సమాధానాన్ని కర్తగా చెప్పవచ్చు.

కింది వాక్యాలను చదవండి. కర్తను గుర్తించి గీతగీసి, పక్కన రాయండి.
ఉదా : ఆత్మానందుడు కంబళిని భుజాన వేసుకొని వెళ్ళాడు. (ఆత్మానందుడు)
1. భిక్షగాడు మాయాకంబళితో అదృశ్యమయ్యాడు. (భిక్షగాడు)
2. విక్రముడు కత్తి పట్టుకొని రాజు మందిరానికి వెళ్ళాడు. (విక్రముడు)
3. చండీదత్తుడు విక్రముడిని సంహరించాడు. (చండీదత్తుడు)
4. భటులు చంచలను బంధించారు. (భటులు)

ఉత్వసంధి

ఆ) కింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను పరిశీలించి, విడదీసి రాయండి.
1. భద్రాచల రాముడతడు.
2. వినాయక చవితికి సెలవిచ్చారు.
3. బడి గంటలు మ్రోగుచున్నవి.
4. మనిషికి కొంచెమైనా ధర్మగుణం ఉండాలి.
5. గంగి గోవు పాలు పద్య భావమేమి.
6. ప్రజలందరూ కరోనాకు భయపడుతున్నారు.

సంధిరూపం – విడదీసిన రూపం
ఉదా : రాముడతడు = రాముడు + అతడు
1. మ్రోగుచున్నవి = మ్రోగుచు + ఉన్నవి (ఉకార వికల్ప సంధి)
2. కొంచెమైనా = కొంచము + ఐనా (ఉకార వికల్ప సంధి)
3. భావమేమి = భావము + ఏమి (ఉకార వికల్ప సంధి)
4. ప్రజలందరూ = ప్రజలు + అందరూ (ఉకార వికల్ప సంధి)

పై ఉదాహరణలు గమనించినప్పుడు పూర్వ స్వరంగా ‘ఉ’ ఉంది. కనుక దీనిని ఉత్వసంధి అని చెప్పవచ్చు. ఈ పాఠంలో ఉన్న ఉకారసంధి పదాలను గుర్తించి విడదీసి రాయండి.
ఉదా : నగరమంతా = నగరము + అంతా (ఉకార వికల్ప సంధి)
1. కలవాడని = కలవాడు + అని (ఉకార వికల్ప సంధి)
2. ఎవరైనా = ఎవరు + ఐనా (ఉకార వికల్ప సంధి)
3. రాజయిన = రాజు + అయిన (ఉకార వికల్ప సంధి)
4. పనికిరాదని = పనికిరాదు + అని (ఉకార వికల్ప సంధి)
5. ప్రత్యక్షమయ్యాడు = ప్రత్యక్షము + అయ్యాడు (ఉకార వికల్ప సంధి)

AP Board 7th Class Telugu Solutions 2nd Lesson మాయాకంబళి

ఇ) కింది గద్యాన్ని చదివి, భాషాభాగాలను గుర్తించండి.

సంతోష్, శ్యామల జంతు ప్రదర్శనశాలకు వెళ్లారు. వారు అక్కడ క్రూర మృగాలైన సింహం, పులి, పొడవైన దంతాలు కలిగిన ఏనుగును చూశారు. శ్యామల సంతోషాన్ని ఆపుకోలేక అబ్బో ! ఎంత పెద్ద జంతువులో ! అని ఆశ్చర్యపోయింది. పచ్చని రామచిలుకలు, అందమైన నెమళ్ళను చూశారు. తరువాత అక్కడ ఉన్న దుకాణంలోకి వెళ్ళి తినుబండారాలు తిన్నారు. “ఓ…… సంతోష్ ఇటువైపు చూడు అవి ఎంత బాగున్నాయో !” అని కౌజుపిట్టలను శ్యామల, సంతోష్ కి చూపించింది. ప్రదర్శనశాలలో ఉన్న ఒక లేడి కాలికి గాయం కాగా దానిని చూసి సంతోష్ అయ్యయ్యో ! లేడి కాలి నుండి రక్తం కారుతోందని సానుభూతిని వ్యక్తం చేశాడు.
1. నామవాచకం :
సంతోష్, శ్యామల, జంతుప్రదర్శనశాల, మృగాలు, సింహం, పులి, దంతాలు, ఏనుగు, జంతువు, రామచిలుక, నెమళ్లు, దుకాణం, తినుబండారాలు, కౌజుపిట్టలు, లేడి, కాలు, గాయం, రక్తం.

2. సర్వనామం :
వారు, అక్కడ, అవి, దానిని, ఒక

3. క్రియ :
వెళ్లారు, చూశారు, పోయింది, వెళ్లి, తిన్నారు, చూపించింది, చూసి, చేశాడు.

4. విశేషణం :
క్రూర, పొడవైన, పెద్ద, పచ్చని, అందమైన, బాగు

5. అవ్యయం :
అబ్బో, ఓ, అయ్యయ్యో

మాయాకంబళి పాఠంలోని భాషాభాగాలను ఐదింటిని గుర్తించి రాయండి.

1. నామవాచకం :
పర్వతాలు, ఆత్మానందుడు, కంబళి, జలం, భుజం, కాలు, శిల, లోయ, కనుమ, వ్యాపారి, సంత, మనిషి, మూట, శోభావతి, నగరం, బిచ్చగాడు, వార్త, రాజు, చండీదత్తుడు, ప్రత్యర్థి, పొద, ముష్టివాడు, దేవాలయం, రాత్రి, సభ, కొండ, రాజ్యం , వస్తువు, కార్యం , ఉత్తముడు, భ్రష్టుడు, మందిరం, నర్తకి, చంచల, విక్రముడు, అధికారి, కత్తి, రాణి, దేశం

2. సర్వనామం :
ఆయన, తమకు, తన, దానికి, ఈ, ఒక, అతను, ఆ, అది, దానిని, వాటిని, వారు, అందుకు, ఇలాంటి, నువ్వు, నేను, ఆమె, కాబట్టి, వాడు.

3. క్రియ :
వచ్చి, పెట్టి, చేశాడు, వేసుకొని, జారి, పడిపోయి, కోల్పోయాడు, పడిపోయింది, పోతూ, చూశాడు, వెళ్లాడు, పడుతూ, కప్పుకొన్నాడు, గమనించి, ఆశ్చర్యపోయారు, పాకింది, ఉన్నాయి, సాగారు, విని, గ్రహించి, మసలసాగాడు, చేరుకున్నాడు, వచ్చారు, మాట్లాడుకున్నారు, ఆలోచించి, కప్పుకుని, వెళ్లి, తీసి, అయ్యాడు, ఇచ్చాడు, పరీక్షించి, తెలుసుకుని, చేసి, తీసుకున్నాడు, కోలుకొని, తెలుసుకుని, కలుసుకుని, అన్నాడు, చెబుతున్నాను, ఉన్నాయి, చెప్పినా, నిట్టూర్చాడు, ఒప్పుకొని, చెప్పి, వెళ్లిపోయాడు, పోయాయి, చేకూరింది, అడిగాడు, అని, కోరింది, వచ్చి, వెళ్లు, పట్టింది, చూసి, తోచింది, ఆలోచిస్తూ, వెళ్లక, పడుకున్నాడు, గ్రహించి, లేచి, దూసి, పడ్డాడు, పోయాు , బంధించి, తెచ్చారు, బహిష్కరించాడు, ఇచ్చేశాడు, కట్టాడు, అని, నవ్వుతూ, తీసుకున్నాడు.

4. విశేషణం :
పూర్వం, వృద్ధ, గొప్పు, తరచు, చెడు, పాత, ఏకాంతం, మంచి, కఠినం, తగ్గి, కొంత, స్పష్టం, శయన, చివాలున, తేతిక, సిద్ధం, ముప్పు.

5. అవ్యయం :
యథా, ప్రతి

గ్రంథాలయంలో మీరు చదివిన 5 కథలను అందులోని నీతిని కింది పట్టికలో రాయండి.

పుస్తకం / కథ పేరు తెలుసుకున్న నీతి
1. కోతి – మేకు కథ జోలిమాలిన పనికి పోరాదు.
2. జిత్తులమారి నక్క ఎత్తుకు పై ఎత్తు వేస్తే విజయం వరిస్తుంది.
3. సింహం – కుందేలు కథ అహంకారం ప్రమాదకరం.
4. పులి – కంకణం కథ తెలియని వారిని నమ్మరాదు.
5. చీకగ్రద్ద – పక్షి పిల్లలు క్రొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు.

నీతిపద్యం

తే॥గీ॥ | సర్వ తీర్థాభిగమనంబు సర్వవేద
సమధిగమము సత్యంబుతో సరియుగావు
ఎఱగు మెల్ల ధర్మంబుల కెందు పెద్ద
యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు.

భావం :
పుణ్య నదులలో స్నానం చేయడం, సమస్త వేదాలు అధ్యయనం చేయడం ఒక్క సత్యానికి సాటిరావు. అన్ని ధర్మాల కంటే నిజం పలకడమే గొప్ప ధర్మం అని మునులు చెపుతారు. నన్నయ ఈ చిన్న పద్యంలో సత్యాన్ని దాని ప్రాధాన్యతను గురించి ఎంతో చక్కగా చెప్పాడు.

అశ్వమేధం వంటి యాగాలు చేయడం రాజులకే సాధ్యం. పుణ్యక్షేత్రాలు దర్శించడానికి ధనం ఉండాలి. నిజం చెప్పడానికి మాత్రం ఏమీ ఖర్చు లేదు. అయితే దాని ఫలితం ఎంతో విలువైనది. ఒక్క సత్యవాక్కు ఎంతటి పుణ్యాన్ని కలిగిస్తుందో, ఒక అబద్దం అంతకంటే ఎక్కువ పాపాన్ని, నష్టాన్ని కలిగిస్తుందని గ్రహించాలి.

మీకు తెలుసా?

శతవిధాల :
శతవిధాలుగా అంటే వంద విధాలుగా చెప్పడం. ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నారని తెలిపే పదబంధం.

స్వానుభవం :
తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పు.

ఉపాధ్యాయులకు సూచనలు

  1. విద్యార్థుల చేత పాఠాన్ని చక్కగా చదివించాలి.
    విద్యార్థులకు కథల పట్ల ఆసక్తి కల్గించేలా మరిన్ని కథలు సేకరించి చదివించండి.
    రచయిత కలువకొలను సదానంద కథలను సేకరించండి.

కవి పరిచయం

AP Board 7th Class Telugu Solutions 2nd Lesson మాయాకంబళి 2
కవి పేరు : కలువకొలను సదానంద
జననం : చిత్తూరు జిల్లా పాకాలలో 22.2.1939లో జన్మించారు.
తల్లిదండ్రులు : నాగమ్మ, కృష్ణపిశె దంపతులు.
వృత్తి : ఉపాధ్యాయుడు – 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎంపికయ్యారు.

రచనలు (పిల్లలకథలు) : శివానందలహరి, విందుభోజనం, చల్లని తల్లి, నీతికథా మంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి మొదలైనవి 200 కథలు, 2 నవలలు, 100 కి పైగా గేయాలు, కొన్ని గేయ కథలు రచించారు. చందమామ కథలు, వార్తా పత్రికలలో కథానికలు వ్రాశారు.

బహుమతులు : ‘బంగారు నడచిన బాట’ నవలకు 1966లో కేంద్రప్రభుత్వ విద్యాశాఖ బహుమతి వచ్చింది. ‘నవ్వే పెదవులు-ఏడ్చే కళ్లు’ కథాసంపుటికి 1976లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ‘అడవితల్లి’ పిల్లల నవలకు 2010లో కేంద్ర సాహిత్య, బాలసాహితీ అవార్డు లభించింది.
(ఈ పాఠ్యాంశం ‘మాయాకంబళి’ సంపుటి నుండి గ్రహించబడింది.)

పదాలు – అర్థాలు

1. పూర్వం…… దెబ్బతీయవచ్చని వారి ఆలోచన.
అర్థాలు :
పర్వతాలు = కొండలు
వృద్ధుడు – ముసలివాడు
ఏకరువు పెట్టు = గట్టిగా చెప్పు
మార్గము = దారి
జలం = నీరు
రహస్యం = గుట్టు
యథేచ్ఛ = ఇష్టం వచ్చినట్లు
అవినీతి = నీతిలేకపోవడం
ప్రత్యర్థి = వ్యతిరేకి
కనుమ = లోయ
ధర = వెల
మడిచి = మడత పెట్టి
చౌక = తక్కువ ధర
అదృశ్యం = కనబడకుండా పోవడం
వార్త = విషయం
స్పర్థ = విరోధం
పెచ్చుమీరు = బాగా పెరిగిపోవు
మహత్తు = మహిమ
అదృశ్యకరణి = అదృశ్యం చేసేది

AP Board 7th Class Telugu Solutions 2nd Lesson మాయాకంబళి

2. కంబళి సహాయంతో …… ప్రత్యక్షమయ్యాడు.
అర్థాలు :
మసలడం = తిరగడం
భద్రత = భయంలేని స్థితి
పాడుబడిన = పాడైపోయిన
దేవాలయం గుడి – శిల రాయి
హేమాహేమీలు = గొప్పవారు
తహతహలాడడం = ఆత్రుత పడడం
రూఢీ = నిర్ధారణ
ప్రత్యక్షం = కనబడడం

3. మహాప్రభూ …… తీసుకొని వెళ్లు అన్నాడు.
అర్థాలు :
ప్రాణహాని = ప్రాణానికి ప్రమాదం
స్వయంగా = తనంతట తానుగా
ఏకాంతం = ఒక్కరే ఉన్న స్థితి
అభ్యంతరం = ఆటంకం
శ్రేయస్సు = మేలు, అభివృద్ధి
శక్తి = బలము
మహిమాన్వితం = మహిమతో కూడిన
కార్యము = పని
నీతిబాహ్యము = నీతిలేనిది
పురికొల్పడం = ప్రోత్సహించడం
భ్రష్టుడు = సర్వనాశనమైనవాడు
ఏకీభవించడం = కలియడం
స్వానుభవం = తన అనుభవం
నిట్టూర్పు = నిరాశతో గాలిని విడవడం
రక్షబంధం = రక్ష కొరకు కట్టే దారం
అవినీతిపరులు = నీతిలేనివారు
అక్రమం = చట్టబద్ధం కానిది, సరైనది కానిది
మందిరం = గది
నర్తకి = నాట్యం చేసే స్త్రీ
ఆనందభరితుడు = ఆనందంలో మునిగినవాడు
ముచ్చట = కోరిక
నిరాకరించడం = ఒప్పుకోకపోవడం
శయన మందిరం = పడకగది

AP Board 7th Class Telugu Solutions 2nd Lesson మాయాకంబళి

4. రాజు తన మందిరానికి … దానిని తీసుకొన్నాడు.
అర్థాలు :
తిరుగుముఖం = వెనుకకు ప్రయాణం
కోశాధికారి = భాండాగార రక్షకుడు (ధనాన్ని రక్షించే అధికారి)
చివాలున = వెంటనే
ప్రలోభపెట్టడం = దేనినో ఆశ చూపి లొంగ దీసుకోవడం
పరిణామం = మార్పు
బహిష్కరించడం = వెళ్లకొట్టడం, వెలివేయడం
స్వార్థం = తన గురించిన ఆలోచన