SCERT AP 7th Class Social Study Material Pdf 7th Lesson మొఘల్ సామ్రాజ్యం Textbook Questions and Answers.
AP State Syllabus 7th Class Social Solutions 7th Lesson మొఘల్ సామ్రాజ్యం
7th Class Social 7th Lesson మొఘల్ సామ్రాజ్యం Textbook Questions and Answers
కింది తరగతులలోని విషయ పునశ్చరణ
పటాన్ని పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
మీరు ఎప్పుడైనా ఈ పై చిత్రాన్ని చూశారా?
జవాబు:
ఈ చిత్రం ఎర్రకోట. నేను చూసాను.
ప్రశ్న 2.
ఈ చిత్రం గురించి కొన్ని విషయాలు చెప్పగలరా?
జవాబు:
- ఈ కోటను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడు.
- అంత:పుర భవనంగా ఎర్రకోట నిర్మించబడింది.
- దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాస్ వంటి ఇతర నిర్మాణాలున్నాయి.
ప్రశ్న 3.
చరిత్రలో ఈ కోట యొక్క ప్రాముఖ్యత మీకు తెలుసా?
జవాబు:
స్వాతంత్ర్య దినోత్సవం రోజు భారత ప్రధానమంత్రి, ఇక్కడి నుండే జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
I. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
మొఘల్ చక్రవర్తులలో అక్బర్ ప్రముఖ స్థానం పొందుటకు గల కారణాలను విశ్లేషించండి.
జవాబు:
మొఘల్ చక్రవర్తులలో అక్బర్ ప్రముఖ స్థానం పొందుటకు గల కారణాలు :
- అక్బర్ సువిశాల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. దాదాపు భారతావనినంతటిని సమైక్యపరచి ఒకే అధికారము క్రిందకి తెచ్చినాడు.
- అక్బర్ గొప్ప పరిపాలనాదక్షుడు – విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
- అక్బర్ ప్రజా సంక్షేమాభిలాషి – సంక్షేమ పాలనను అందించాడు.
- సారస్వత కళాభిమాని – ఇతని ఆస్థానములో అనేక మంది ప్రముఖ కవులు కలరు.
- అక్బర్ పరమత సహనాన్ని చాటినాడు – దీన్-ఇ-ఇలాహి అనే నూతన మతాన్ని స్థాపించాడు.
- గొప్ప సాంఘిక సంస్కర్త – ఆనాటి సమాజంలోని సాంఘిక దురాచారాలను అక్బర్ నిషేధించినాడు.
- అక్బర్ గొప్ప భవన నిర్మాత – ఫతేపూర్ సిక్రి నగరం, బులంద్ దర్వాజా, పంచమహల్, ఇబాదత్ ఖానా మొదలైన కట్టడాలు అక్బర్ వాస్తు కళాభిమానానికి తార్కాణాలు.
- అక్బర్ ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలు – రాజ్యాన్ని సుబాలుగా, సర్కారులుగా, పరగణాలుగా విభజించుట, భూమిని సర్వే చేయించి, పంట ఆధారంగా శిస్తు నిర్ణయం, జట్జ్ విధానం, మన్సబ్ దారీ విధానం మొదలైనవి అక్బర్ పాలనలో అగ్రస్థానంలో నిలిపినాయి.
ప్రశ్న 2.
వాస్తు మరియు శిల్పకళలకు మొఘలులు చేసిన కృషిని అభినందించండి.
జవాబు:
కళ మరియు వాస్తు శిల్పం :
- మొఘలుల కాలంలో వాస్తు శిల్పంలో కొత్త సాంప్రదాయం ప్రారంభమైంది.
- స్మారక చిహ్నాలు ఎత్తైన స్తంభాలపై నిర్మించబడ్డాయి.
- కట్టడాలలో పాలరాయిని ఎక్కువగా ఉపయోగించారు. నీరు ప్రవహించే ఫౌంటేన్లను విస్తృతంగా నిర్మించారు.
- పాలరాళ్ళతో పాటు భవనాలను అలంకరించడానికి అపురూపమైన రంగు రాళ్ళను ఉపయోగించారు. ఫతేపూర్ సిక్రి
- చిత్తోర్ మరియు రణతంబోర్ మీద సైనిక విజయాల తరువాత అక్బర్ తన మత గురువు షేక్ సలీం చిస్తి గౌరవార్థం రాజధానిని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలనుకొన్నాడు. అందుకోసం ప్రణాళికాబద్దమైన నగరాన్ని నిర్మించాడు.
- ఆ నగరానికి ‘ఫతేబాద్’ అని పేరు పెట్టాడు. ఫతే అనగా ‘విజయం ‘ అని అర్థం. తర్వాత కాలంలో ఇది ఫతే పూర్ సిక్రీగా పిలువబడింది.
- భారతదేశంలో మొఘలుల నిర్మాణాలలో ఇప్పటికీ మిగిలి వున్న కట్టడాలలో ఫతేపూర్ సిక్రీ ఒకటి.
ప్రశ్న 3.
“శివాజీ ” వ్యక్తిత్వం ఎందువలన కీర్తించదగినదో వివరించండి.
జవాబు:
- శివాజీ హిందూ మతస్తుడైనప్పటికీ ఇతర మతాలను కూడా గౌరవించాడు.
- అతను స్త్రీలను, ఇతర మత గ్రంథాలను, గౌరవించవలసిందిగా తన సైన్యాన్ని ఆదేశించాడు.
- అతడు ఎక్కువ విద్యావంతుడు కాకపోయినప్పటికీ ఎన్నో తెలివితేటలు, పరిపాలనా సామర్థ్యాలు, యుద్ధ వ్యూహాలలో నేర్పరి.
- తన సైన్యానికి గెరిల్లా యుద్ధవిద్యలో శిక్షణనిచ్చి వారిని గొప్ప యోధులుగా తయారుచేశాడు.
- నావికా బలాన్ని కూడా అభివృద్ధి చేసాడు. ఎంతగానో ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.
- ప్రజలకు ఒక ఆదర్శప్రాయునిగా నిలిచాడు.
- కొండజాతి ప్రజలైన మావళీలతో స్నేహం చేసి వారిలో జాతీయ భావనను నింపాడు.
- శివాజీ యొక్క దేశ భక్తి, జాతీయ భావన ఆ తరువాత కాలంలో జాతీయ నాయకులైన తిలక్, సావర్కర్ మొదలైన వారికి ఎంతో ప్రేరణగా నిలిచాయి.
ప్రశ్న 4.
షేర్షా సూర్ గురించి క్లుప్తంగా తెల్పండి.
జవాబు:
షేర్షా (క్రీ.శ. 1540-1545) :
- షేర్షా సూర్ ఒక ఆఫ్ఘన్ నాయకుడు. అతను స్వశక్తితో అభివృద్ధి చెందాడు. హుమాయూన్ ను రెండు సార్లు ఓడించి ఢిల్లీలో ‘సూర్’ రాజవంశాన్ని స్థాపించాడు.
- ఢిల్లీపై నియంత్రణ సాధించిన తర్వాత అతడు అనేక ఇతర ముఖ్యమైన యుద్ధాలలో విజయం సాధించాడు. తన సామ్రాజ్యాన్ని కాబూల్ నుండి బెంగాల్ మరియు మాళ్వా వరకు విస్తరించాడు.
- అతడు గొప్ప యుద్ధ వీరుడే కాక పరిపాలనాదక్షుడు కూడా. ఐదు సంవత్సరాల పరిపాలనలో అతడు భూమిశిస్తు పద్ధతి, నూతన ద్రవ్య విధానం, తపాలా సేవలు వంటి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. క్రీ.శ. 1545లో ఫిరంగి ప్రేలుడు కారణంగా అతడు చనిపోయాడు.
- షేర్షా తరువాతి వారసుల అసమర్థత కారణంగా హుమాయూన్ క్రీ.శ. 1555లో ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.
ప్రశ్న 5.
భారతదేశ పటంలో ఈ క్రింది ప్రదేశాలు గుర్తించండి.
1) ఆగ్రా 2)ఢిల్లీ 3) పంజాబ్ 4) ఫతేపూర్ సిక్రీ
జవాబు:
ప్రశ్న 6.
మొఘల్ సామ్రాజ్యం యొక్క కాలక్రమ చార్టును తయారుచేయండి.
జవాబు:
II. సరియైన సమాధానాన్ని ఎంచుకోండి.
1. అక్బర్ ఆస్థానంలోని గొప్ప సంగీత విద్వాంసుడు
ఎ) తాన్ సేన్
బి) అబుల్ ఫజల్
సి) రాజా బీర్బల్
డి) రాజా తోడర్మల్
జవాబు:
ఎ) తాన్ సేన్
2. భిన్నమైన దానిని గుర్తించండి.
ఎ) అక్బర్
బి) హుమాయూన్
సి) షేర్షా
డి) జహంగీర్
జవాబు:
సి) షేర్షా
3. ఇబాదత్ ఖానా ఎక్కడ ఉంది? (ఎ )
ఎ) ఫతేపూర్ సిక్రి
బి) ఢిల్లీ
సి) జహంగీరాబాద్
డి) ఔరంగాబాద్
జవాబు:
ఎ) ఫతేపూర్ సిక్రి
4. సరి కాని జతను గుర్తించండి.
ఎ) కుతుబ్ మీనార్ – హుమాయూన్
బి) తాన్సె న్ – రాగ్ దీపక్
సి) అబుల్ ఫజల్ – అక్బర్నామా
డి) శివాజీ – రాయగఢ్
జవాబు:
ఎ) కుతుబ్ మీనార్ – హుమాయూన్
5. శివాజీకి సమకాలీన మొఘల్ రాజు ఎవరు?
ఎ) అక్బర్
బి) బాబర్
సి) జహంగీర్
డి) ఔరంగజేబు
జవాబు:
డి) ఔరంగజేబు
III. కింది వాటిని జతపరచండి.
గ్రూపు-ఎ | గ్రూపు-బి |
1. రాగి నాణెం | ఎ) షాజహాన్ |
2. మన్నబాదార్ | బి) స్వీయ చరిత్ర |
3. తాజ్ మహల్ | సి) మంత్రి |
4. తోడర్మ ల్ | డి) దామ్ |
5. తుజుక్-ఇ- జహంగీరీ | ఇ) ర్యాంక్ |
జవాబు:
గ్రూపు-ఎ | గ్రూపు-బి |
1. రాగి నాణెం | డి) దామ్ |
2. మన్నబాదార్ | ఇ) ర్యాంక్ |
3. తాజ్ మహల్ | ఎ) షాజహాన్ |
4. తోడర్మ ల్ | సి) మంత్రి |
5. తుజుక్-ఇ- జహంగీరీ | బి) స్వీయ చరిత్ర |
7th Class Social Studies 7th Lesson మొఘల్ సామ్రాజ్యం InText Questions and Answers
7th Class Social Textbook Page No.11
ప్రశ్న 1.
అక్బర్ – బీర్బల్ గురించి కొన్ని కథలను సేకరించండి.
జవాబు:
1. అరచేతిలో వెంట్రుకలు
ఒకనాడు అక్బర్ పాదుషా వారికి బీర్బల్ తో హాస్యమాడాలనిపించింది. నిండు సభలో బీర్బల్ నుద్దేశించి “బీర్బల్ మాకొక సందేహం ఉంది, అది నువ్వే తీర్చాలి” అన్నారు. “ప్రభువులకు సందేహమా, అది సామాన్యుడైన విదూషకుడు తీర్చడమా ? అదేమిటో సెలవియ్యండి జహాపనా” అన్నాడు వినమ్రంగా, మరేం లేదు మనందరకు తెలిసున్న విషయమే, అది ఎందువల్ల జరుగుతుందో తెలియక నిన్నడుగుతున్నాను, అని. ‘మన శరీరము అంతటా వెంట్రుకలు కొంతగాక కొంతయినా ఉన్నాయి కాని నా అరచేతుల్లో మాత్రము ఎందుకు లేవన్నది మా సందేహం అని ప్రశ్నించాడు అక్బర్. దానికి బీర్బల్ ఏమున్నది ప్రభూ ! మీరు చేసే దానధర్మాల వల్ల తమ అరచేతులలో వెంట్రుకలు మొలవడం లేదు’ అన్నాడు. అప్పుడు అక్బర్-బీర్బలను తికమక పెట్టాలని “మరి నీ అరచేతిలో ఎందుకు మొలవలేదని” ప్రశ్నించాడు. ఏమున్నది ప్రభూ మీరిచ్చే కానుకలు, ధర్మాలు అందుకోవడంలో అరచేతులు అరిగిపోయి వెంట్రుకలు మొలవలేదు ప్రభూ” అంటూ చమత్కారంగా సమాధానమిచ్చాడు తీర్బల్.
2. మామిడి పళ్ళ విందు
ఒకనాడు అక్బర్ చక్రవర్తి మామిడి పళ్ళు ఆరగిస్తున్న సమయంలో బీర్బల్ అంతఃపురంలోకి వచ్చాడు. బీర్బలను చూసిన అక్బర్ ఆప్యాయంగా ఆహ్వానించి మామిడిపళ్ళను తినమని అందించాడు. బీర్బల్ కూడా వాటి యందు ఆసక్తి కలి, అందుకుని తినసాగాడు. అయితే అక్బర్ తాను తిన్న మామిడి టెంకలను బీర్బల్ ముందున్న టెంకలలో వేయసాగాడు. కొంత సేపటి తర్వాత ఏమయ్యా బీర్బల్ అంత ఆకలితో ఉన్నావా, చాలా కాయలు తిన్నట్లున్నావు” అన్నాడు. అందుకు బీర్బల్ కొంచెం మొహమాటంగా అవును ప్రభు అన్నాడు !” అప్పుడు అక్బర్, బీర్బల్లో బాగా ఆకలితో ఉన్నట్లున్నావు మరికొన్ని పళ్ళు తినమని పరాచకమాడాడు. దానికి బీర్బల్ “ప్రభు నాకు కడుపు నిండి పోయింది, ఇక ఒక్క పండును కూడా తినలేను, కాని మీరు నా కన్నా ఎక్కువ ఆకలితో ఉన్నట్లున్నారు. నేను టెంకలనయినా వదలివేసాను, తమరు ఒక్క టెంకను కూడా వదలకుండా, టెంకలను సైతం తిన్నారు, కావున మీరే నాలుగు పళ్ళు తినండి” అంటూ చమత్కరించాడు. బీర్బల్ చమత్కారానికి అక్బర్ చక్రవర్తి ఆనందించాడు.
7th Class Social Textbook Page No.13
ప్రశ్న 2.
ఔరంగజేబు తన గురువుకి రాసిన లేఖను గ్రంథాలయం / ఇంటర్నెట్ నుండి సేకరించండి. తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
ఔరంగజేబు తన ఉపాధ్యా యునికి వ్రాసిన లేఖ
అయ్యా ! మీరు నా నుండి ఏమి ఆశిస్తున్నారు? ఒక ప్రసిద్ధ ముస్లిం పాలకుడి హోదాలో నేను మిమ్మల్ని నా కోర్టు లోకి తీసుకోవాలని మీరు అడగడంలో ఏదైనా సమర్థత ఉందా.? మీరు నాకు సరైన రీతిలో విద్యను అందించి ఉంటే మీ అభ్యర్ధన సహేతుకంగా ఉండేది. మంచి విద్యను పొందిన విద్యార్థి తన తండ్రిని గౌరవించినట్లే గురువును గౌరవించాలి. కానీ, మీరు నాకు ఏమి నేర్పించారు? మొదటగా, యూరప్ అంటే పోర్చుగల్ అనే చిన్న దీవి అని, ఆ దేశ రాజు ఒక్కడే గొప్పవాడని, తర్వాత స్థానం పోలండ్ రాజు, ఆ తర్వాత ఇంగ్లండ్ రాజు వస్తాడని మీరు నేర్పారు. ఫ్రాన్స్ మరియు స్పెయిన్ రాజులు మన దేశంలో చిల్లర పాలకుల లాంటి వారని, హిందుస్తాన్ రాజు ఆ రాజులందరి కంటే గొప్పవాడని, వారు మొత్తం ప్రపంచాన్ని జయించిన చక్రవర్తులు మరియు పర్షియా, ఉజ్బెక్, టార్టార్, రాజులని కూడా మీరు చెప్పారు. చైనా, తూర్పు చైనా, పెరూ, మచినా, హిందుస్థాన్ రాజుల పేర్లు చెబితేనే వణుకు పుడుతుంది.
ఆహ్ ! మీరు అద్భుతమైన చరిత్ర మరియు భౌగోళిక శాస్త్రాన్ని నేర్పించారు. నిజానికి ! బదులుగా, మీరు నాకు ప్రపంచంలో వివిధ దేశాల గురించి మరియు వారి విభిన్న ఆసక్తులు ఆ రాజుల బలాలు మరియు బలహీనతలు, వారి యుద్ధ వ్యూహాలు, వారి ఆచారాలు, మతాలు, ప్రభుత్వ విధానాలు, ప్రయోజనాలు చరిత్ర, పురోగతి, పతనం, ఎలాంటి విపత్తులు గురించి నాకు నేర్పించి ఉండాలి. మరియు పొరపాట్లు గొప్ప మార్పులకు మరియు విప్లవాలకు దారితీశాయి. మీరు నాకు ఈ విషయాలన్నీ నేర్పించి ఉండాలి. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వ్యక్తుల గురించి నేను మీ నుండి ఏమీ నేర్చుకోలేదు. మీరు వారి జీవిత చరిత్రల గురించి నాకు ఏమీ బోధించలేదు. అద్భుతమైన విజయాలు సాధించేందుకు వారు అనుసరించిన విధానాలు, వ్యూహాల గురించి మీరు బోధించలేదు.
నేను అరబిక్ చదవడం మరియు వ్రాయడం ఎలాగో నేర్చుకోవాలని మీరు కోరుకున్నారు. మీరు నా సమయాన్ని చాలా వరకు వృథా చేసారు. నేను పది నుండి పన్నెండేళ్లు కష్టపడితే తప్ప ప్రావీణ్యం పొందలేదు. బహుశా, మీ అభిప్రాయం ప్రకారం ఒక యువరాజు గొప్ప భాషావేత్త మరియు పరిపూర్ణ వ్యాకరణవేత్తగా మారడం చాలా గొప్ప విషయం. తన మాతృభాష, తన ప్రజల భాష మరియు పొరుగు రాష్ట్రాల భాషలను నేర్చుకోకుండా ఇతర భాషలు మరియు విదేశీ భాషలను నేర్చుకోవడం వల్ల ఈ గౌరవం పెరుగుతుందని మీరు అనుకోవచ్చు ! నిజానికి అతనికి ఈ భాషలు అవసరం లేదు.
రాజకుటుంబానికి చెందిన నా లాంటి వారికి చిన్నతనంలో సమయం చాలా విలువైనది. ఎందుకంటే మనం చాలా బాధ్యతలను మోయవలసి ఉంటుంది. మనకు అందుబాటులో ఉన్న పరిమిత సమయంలో చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చాలాకాలం పాటు అరబిక్ బోధించడంలో నా సమయాన్ని వృథా చేసారు. ఇది విసుగు పుట్టించింది. అరబిక్ అధ్యయనం నా జీవితంలో విషాదకరమైన సంఘటన. ఇది పనికిరాని అన్వేషణ. విపరీతమైన అయిష్టతతో నేర్చుకోవలసి వచ్చింది. అది నా తెలివిని కూడా మట్టుబెట్టింది. (అప్పట్లో పర్షియన్ అధికార భాష)
సంతోషకరమైన చిన్ననాటి జ్ఞాపకాలు శాశ్వతంగా భద్రపరచబడతాయని యువ మనస్సులపై శాశ్వత ముద్ర వేసే వేలకొద్దీ విషయాలు నేర్చుకోవచ్చని మరియు వారి ప్రభావం అతను గొప్ప బాధ్యతలను స్వీకరించడానికి మానసికంగా సిద్ధమవుతాడని మీకు తెలియదా? చట్టాలు ప్రార్ధనలు, శాస్త్రాలు అరబిక్ లో నేర్చుకునే బదులు మన మాతృభాషలో నేర్చుకోవడం సాధ్యం కాదా?
మీరు నాకు తత్వం బోధిస్తానని మా నాన్న షాజహాన్ కి చెప్పారు. నాకు అది స్పష్టంగా గుర్తుంది చాలా సంవత్సరాలుగా మీరు నాకు సంతృప్తిని కలిగించని అనేక విషయాల గురించి సగం జ్ఞానంతో మనస్సును పోషించారు. ఆ కల్పిత విషయాలన్నీ మానవ సమాజానికి ఏమాత్రం ఉపయోగపడవు. వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం కానీ మర్చిపోవడం చాలా సులభం.
ఆ రకమైన ఊహాజనిత జ్ఞానాన్ని మీరు నాకు ఎంతకాలం నేర్పించారో నేను చెప్పలేను. చాలా తెలివైన వ్యక్తులను కూడా ఆశ్చర్యపరిచే మరియు గందరగోళానికి గురిచేసే వికారమైన మరియు భయంకరమైన పదజాలం మాత్రమే నాకు గుర్తుంది. మీ లాంటి అజ్ఞానాహంకారులు తమ చెడు గుణాలను దాచుకోవాలనుకునే వారు ఇలాంటి మాటలు సృష్టించి ఉండాలి. ఇలాంటి బొంబాయి మాటలు వింటూ, మీరు జ్ఞాన సర్వజ్ఞుడని భావించాలి! ఆ అద్భుతమైన పదాలు మీ లాంటి పండితులకే అర్ధమయ్యే కొన్ని అద్భుతమైన అంతర్గత అర్ధాలను కలిగి ఉన్నాయని భావించాలి !
మీరు నాకు విశ్లేషణాత్మక ఆలోచన ఉన్న వ్యక్తిగా శిక్షణ ఇచ్చి ఉండాలి. స్థిమిత మరియు చంచలమైన మనస్సు ఉన్న వ్యక్తిగా ఉండటానికి మీరు నాకు మెళకువలు నేర్పించారు ! మీరు నాకు విశ్వం యొక్క చట్టాలు మరియు గొప్పతనాన్ని మరియు జీవితం యొక్క ప్రాథమిక సూత్రాలను చెప్పాలి. మీరు నా మనస్సును ఈ రకమైన ఆచరణాత్మక తత్వశాస్త్రంతో నింపాలి. మీరు ఈ పనులు చేసి ఉంటే, అలెగ్జాండర్ తన గురువు అరిస్టాటిల్ పై చూపించిన గౌరవాన్ని నేను మీకు చూపించి ఉండేవాడిని. నేను మీకు అంతకంటే ఎక్కువ సహాయం చేసి ఉండేవాడిని.
ముఖస్తుతితో నన్ను ఆకాశానికి ఎత్తే బదులు, మంచి రాజుగా ఉండడానికి అవసరమైన విషయాలను మీరు నాకు నేర్పించి ఉండాలి. రాజుకు తన పౌరుల పట్ల ఉండే బాధ్యతల గురించి మరియు రాజు పట్ల వారి బాధ్యతల గురించి మీరు నాకు జ్ఞానాన్ని అందించాలి. నా సోదరుడితో యుద్ధంలోను కత్తిని ఉపయోగించాల్సిన రోజు వస్తుందని మీరు ముందే ఊహించి ఉండాలి. ఒక పట్టణాన్ని ఎలా ముట్టడించాలో మరియు గందరగోళంలో చెల్లాచెదరుగా ఉన్న సైనికులను ఎలా సమీకరించాలో మీరు నాకు నేర్పించి ఉండాలి. అయితే, నేను ఈ విషయాలన్నీ ఇతరుల నుండి నేర్చుకున్నాను, కానీ మీ నుండి కాదు.
కాబట్టి, ఇప్పుడు మీరు మీ గ్రామానికి వెళ్లాలి. నేను మీకు ఏ విధంగానూ సహాయం చేయను. మీరెవ్వరో ప్రజలకు తెలియదు. మీ జీవితాంతం ఒక సాధారణ పౌరుడిగా జీవించండి.
ప్రశ్న 3.
ప్రస్తుత భారతదేశ అవుట్ లైన్ మ్యాప్ లో ఈ క్రింది ప్రదేశాలను గుర్తించండి.
ఢిల్లీ, ఆగ్రా, ఫతేపూర్ సిక్రి, చిత్తోర్ గఢ్, అహ్మద్ నగర్
జవాబు:
7th Class Social Textbook Page No.17
ప్రశ్న 4.
మొఘలుల కాలంలో వ్యవసాయ పన్ను విధించే విధానాన్ని గూర్చి మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
జవాబు:
మొఘలుల కాలంలో వ్యవసాయ పన్ను విధించే విధానం :
- మొఘలులు రైతులకు అనుకూలంగా. రాజ్యానికి లాభదాయకంగా ఉండే పన్ను విధానాన్ని అభివృద్ధి చేసి అమలు చేసారు.
- గడచిన 10 సం||రాల ఉత్పత్తి, ధరల హెచ్చు తగ్గుల వివరాలను సేకరించి, వాటి ధరలను సగటున లెక్క కట్టి 1/3వ వంతు నుండి సగం వరకు శిస్తుగా నిర్ణయించారు.
- ఈ శిస్తును దామ్ లో చెల్లించేవారు.
7th Class Social Textbook Page No.21
ప్రశ్న 5.
అక్బర్ – బీర్బల్ కథల నుండి మీకు నచ్చిన కథను తీసుకుని ఆ కథలో అక్బర్ – బీర్బల్ మధ్య జరిగిన సంభాషణను మీ ఉపాధ్యాయుని సహాయంతో పాత్రపోషణ చేయండి.
జవాబు:
విద్యార్థి కృత్యం
7th Class Social Textbook Page No.23
ప్రశ్న 6.
అక్బర్ ఆస్థానంలోని ‘నవరత్నాల’ పేర్లు సేకరించండి.
జవాబు:
- అబుల్ ఫజల్,
- రాజా తోడర్మల్,
- అబ్దుల్ రహీం ఖాన్-ఇ-ఖానా,
- రాజా బీర్బల్ (మహేష్ దాస్),
- ఫైజీ,
- ఫకీర్ అజియోద్దీన్,
- తాన్ సేన్,
- రాజా మాన్ సింగ్,
- ముల్లాదో పియాజ.
ఆలోచించండి – ప్రతిస్పందించండి
7th Class Social Textbook Page No.7
ప్రశ్న 1.
మొఘలు సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలోనే మొదట స్థాపించబడటానికి కారణాలు విశ్లేషించండి.
జవాబు:
మొఘలు సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలోనే మొదట స్థాపించబడటానికి కారణాలు :
- భారతదేశంలో (మొదట) మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినది ఆఫ్ఘన్ పాలకుడైన బాబర్.
- బాబర్ దండయాత్ర సమయమున ఉత్తర భారతము అనేక చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విభజింపబడి, – అంతఃకలహాలతో, అనైక్యతతో ఉండెను.
- నాడు రాజకీయ సుస్థిరత చేకూర్చే, విదేశీ దాడులను ప్రతిఘటించే రాజులెవ్వరూ లేకపోవడం.
- ఆప్షన్ నుండి ఉత్తర భారతదేశంనకు సైన్యంను నడుపుటకు, పాలనకు అనుకూలంగా ఉండటం.
- స్థానిక (ఉత్తర భారత) పాలకులు బాబర్‌ను ఆహ్వానించటం.
- నాటి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడి అసమర్థుడవ్వటం.
7th Class Social Textbook Page No.11
ప్రశ్న 2.
అక్బర్ జీవితంలో బైరాం ఖాన్ లేకపోతే మొఘల్ సామ్రాజ్యంలో ఏమి జరిగి ఉండేది?
జవాబు:
- అక్బర్ తండ్రి హుమాయూన్ చనిపోయేనాటికి అక్బర్ వయస్సు కేవలం 13 సంవత్సరాలు. అతని సంరక్షకుడు బైరాం ఖాన్ అక్బర్ తరపున పరిపాలనా వ్యవహారాలు సాగించాడు.
- బైరాం ఖాన్ మార్గదర్శకత్వంలో అక్బర్ రెండవ పానిపట్టు యుద్ధం, గ్వాలియర్, జోధ్ పూర్, అజ్మీర్, మాల్వా మరియు చునార్ దుర్గములు ఆక్రమణలు జరిగాయి.
- బైరాం ఖాన్ సంరక్షకుడుగా లేకపోతే అక్బరు ఈ విజయాలు, మొఘల్ సామ్రాజ్యం కైవసం అయ్యేవి కావు.
- మొఘల్ సామ్రాజ్యం హేము పరమయ్యేది, మొఘల్స్ పాలన అంతమై ఉండేది.
ప్రశ్న 3.
చాలామంది రాజపుత్ర రాజులు అక్బర్ ఆస్థానంలో చేరారు. కాని రాణాప్రతాప్ చేరలేదు. ఎందువలన?
జవాబు:
- అనేక మంది రాజపుత్రులు తమ కుమార్తెలను అక్బర్ కు ఇచ్చి వివాహం చేసి లొంగిపోయారు.
- కాని మేవాడ్ పాలకుడైన మహారాణా ప్రతాప్ అక్బర్ తో జీవితాంతం పోరాటం చేసాడే తప్ప, అక్బర్ ఆస్థానంలో చేరలేదు.
- మహారాణా ప్రతాప్ ధైర్యసాహసములు కల్గి ఉండుట.
- హైందవ సంస్కృతి పరిరక్షణకు పూనుకొనుట.
- స్వతంత్రంగా పాలన కొనసాగించాలని భావించుట, స్వేచ్ఛా పిపాసి అగుట.
- రాణా ప్రతాప్ సైన్యంలో అనేక మంది వీరులు కలరు. దేశభక్తి (రాజ్యభక్తి) కల్గిన సైనికులు విరివిగా కలరు.
7th Class Social Textbook Page No.19
ప్రశ్న 4.
ప్రస్తుత భూమి శిస్తు పద్ధతిని మొఘలుల కాలం నాటి భూమి శిస్తు పద్దతితో పోల్చండి.
జవాబు:
మొఘల్ కాలం నాటి భూమిశిస్తు పద్ధతి, ప్రస్తుత భూమి శిస్తు పద్ధతికి పోలికలు :
- నాడు భూమిశిస్తును రైతులు ప్రత్యక్షంగా రాజుకు చెల్లించేవారు. నేడు కూడా రైత్వారీ పద్ధతి అమల్లో ఉంది.
- నాడు భూమిశిస్తు దామ్ లో (ద్రవ్యరూపంలో) చెల్లించేవారు. నేడు కూడా ద్రవ్యరూపంలోనే చెల్లిస చెలిస్తుంటారు.
- భూమి శిస్తును నిర్ణయించడానికి భూమిసారంను అంచనా వేసి నిర్ణయించేవారు. నేడు కూడా అలాగే నిర్ణయిస్తున్నారు.
- కరువు, కాటకాల సమయంలో భూమి శిస్తు తగ్గించడం లేదా రద్దు చేయటం జరుగుతుండేదానాడు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది.
అన్వేషించండి
7th Class Social Textbook Page No.9
ప్రశ్న 1.
షేర్షా అధికారంలోకి రావడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి?
జవాబు:
షేర్షా అధికారంలోకి రావడానికి దారి తీసిన పరిస్థితులు :
- షేర్షా యుద్ధ నిర్వహణలో నాటి సమకాలీన చక్రవర్తులలో అగ్రగణ్యుడు కావటం.
- నాటి సమకాలీన మొఘల్ చక్రవర్తి అతనిని ఎదుర్కోలేకపోవటం.
- షేర్ షా సూర్ జాగీర్దారుగ, బీహార్ కొలువులో సంపాదించిన అనుభవం.
- షేర్షా రాజనీతి చతురత, నాటి పాలకులలో లోపించుట.
- నాటి రాజులలోని అనైక్యత.
7th Class Social Textbook Page No.17
ప్రశ్న 2.
“దీన్-ఇ-ఇలాహి మతం ప్రజాదరణ పొందలేకపోయింది” – ఎందువలన? మీ ఉపాధ్యాయుణ్ణి అడిగి తెలుసుకోండి.
జవాబు:
దీన్-ఇ-ఇలాహి మతం ప్రజాదరణ పొందలేకపోవటానికి కారణం :
- ఈ మతమును స్వీకరించమని ఎవ్వరిని నిర్బంధము చేయలేదు.
- మత సూత్రముల వ్యాప్తికి అశోకుని వలె ప్రత్యేక కృషి గావింపలేదు.
- మత సూత్రములు సామాన్య మానవులకు అందుబాటులో లేకపోవుట వలన.
- అక్బరు మరణముతో దీనిని ముందుకు తీసుకువెళ్ళేవారు లేకపోవటంతో ఈ మతము అదృశ్యమయ్యెను.
- ఈ మతము సమకాలికులైన సాంప్రదాయ ముస్లిమ్ కు, క్రైస్తవ మిషనరీలకు సంతృప్తి నొసంగలేదు. కావున వారు ఈ దీన్-ఇ-ఇలాహి మతమును పరిహసించిరి.
7th Class Social Textbook Page No.23
ప్రశ్న 3.
అంతర్జాలం లేదా గ్రంథాలయ పుస్తకాలలో శోధించి, మొఘలుల కాలం నాటి మినియేచర్ చిత్రలేఖనం మరియు దాని ప్రత్యేక లక్షణాలను గూర్చి తెలుసుకోండి.
జవాబు:
- మొఘల్ చిత్రలేఖనంకు దక్షిణాసియాలో ఒక ప్రత్యేక శైలి ఉంది. ఇది పర్షియన్ సూక్ష్మ చిత్రలేఖనం నుండి ఉద్భవించింది.
- మొఘల్ (సూక్ష్మ) మినియేచర్ చిత్రలేఖనం చిత్రకారులు ఇష్టపడే బోల్డ్, స్పష్టమైన రంగుల మిశ్రమం.
- ఈ సూక్ష్మ చిత్రాలు చాలా చిన్నవి, (కొన్ని అంగుళాలు మించి ఉండవు) ముదురు రంగులో ఉంటాయి మరియు మాన్యు లు మరియు ఆర్ట్ పుస్తకాలు వివరించే పెయింటింగ్లు.
- కొన్ని పంక్తులకు ఒకే వెంట్రుకతో చేయబడిన బ్రష్ ను ఉపయోగించారు.
- ఫరూఖ్ బేగ్, బసవద్ హిందూ, ఉస్తాద్ మన్సూర్, బిషందాస్ మొ|| వారు ప్రసిద్ధ చిత్రకారులు.
ప్రాజెక్ట్ పని
ప్రశ్న 1.
మొఘల్ పరిపాలనా కాలానికి చెందిన నీకు నచ్చిన ఒక వారసత్వ కట్టడాన్ని గూర్చి సంక్షిప్తంగా వ్రాసి, దానికి సంబంధించిన చిత్రాన్ని సేకరించండి.
జవాబు:
నాకు నచ్చిన మొఘల్ కట్టడాలు ఎర్రకోట మరియు తాజ్ మహల్.
ఎర్రకోట :
మొఘల్ చక్రవర్తి షాజహాన్ రాజధాని అయిన షాజహానాబాద్లో రాజ కుటుంబం నివసించే అంతఃపుర భవనంగా ఎర్రకోట నిర్మించబడింది. ఎర్రకోట షాజహాన్ కాలం నాటి మొఘలుల సృజనాత్మక నిర్మాణ శైలికి తార్కా ణం. ఇది దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాస్, మోతీ మసీదు, హయత్ బక్షి బాగ్ మరియు రంగ మహల్ వంటి ఇతర ముఖ్యమైన నిర్మాణాలను కలిగి ఉంది.
తాజ్ మహల్ :
తాజ్ మహల్ తెల్ల పాలరాతితో కట్టబడిన సమాధి. ఇది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందు ఆగ్రాలో ఉంది. దీనిని షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్ ప్రేమకు గుర్తుగా నిర్మించాడు. తాజ్ మహల్ మొఘలుల వాస్తు శిల్పానికి చక్కటి ఉదాహరణ. ఇది ప్రపంచ ఏడు వింతలలో ఒకటిగా పేరు పొందింది. తాజ్ మహల్ మొఘలుల యొక్క ఆభరణంగా విస్తృతంగా గుర్తించబడింది మరియు ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటిగా కీర్తించబడటమే కాకుండా మొఘలుల కళావైభవంలో కలికితురాయి వంటిదిగా గుర్తింపు పొందినది.