SCERT AP Board 6th Class Telugu Solutions 9th Lesson ధర్మ నిర్ణయం Textbook Questions and Answers.
AP State Syllabus 6th Class Telugu Solutions 9th Lesson ధర్మ నిర్ణయం
6th Class Telugu 9th Lesson ధర్మ నిర్ణయం Textbook Questions and Answers
వినడం – ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
చిత్రాలను చూసి కథ చదవండి, మాట్లాడండి.
జవాబు:
కథ :
ఒక జింక ఒక పులికి చిక్కింది. తనను చంపవద్దని పులిని ప్రార్థించింది. తన బిడ్డకు పాలిచ్చి వస్తానని నమ్మబలికింది. పులికి దయకలిగింది. జింకను విడిచిపెట్టింది. జింక బిడ్డకు పాలిచ్చి, బిడ్డకు మంచి మాటలు చెప్పి తిరిగి వచ్చింది. పులి ఆశ్చర్యపోయింది. అన్నమాట నిలబెట్టుకొన్న జింకను చంపకుండా విడిచి పెట్టింది.
జింక యొక్క నిజాయితీయే దాని ప్రాణాలు కాపాడింది. మాట తప్పకుండా వచ్చిన జింక, క్రూరమైన పులి స్వభావాన్ని కూడా మార్చింది. సత్యమునకు తప్పక విజయం లభిస్తుంది.
అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
మాధవవర్మ వంటి ధర్మాత్ములు ఇప్పుడు మనల్ని పరిపాలిస్తే ఎలా ఉంటుంది? మాట్లాడండి. చెప్పండి.
జవాబు:
మాధవవర్మ వంటి ధర్మాత్ములు పరిపాలిస్తే ప్రజలంతా ధర్మపరాయణులై ఉంటారు. ఎవరూ అబద్దం ఆడరు. మోసం చేయరు. పెద్దలను ఎదిరించరు. తమది కాని దానిని ఆశించరు. తమకు కేటాయించిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు. హత్యలు, ఆత్మహత్యలు ఉండవు. ప్రమాదాలు జరుగవు. సుభిక్షంగా ఉంటుంది.
ప్రశ్న 2.
రాజకుమారుడు చేసిన పొరపాటు ఏమిటి?
జవాబు:
అతివేగంగా పరిగెత్తే గుజ్రాలను కట్టిన రథాన్ని ప్రజలు తిరిగే కోటవీధిలో వేగంగా నడపడం తప్పు. అతని మితిమీరిన ఉత్సాహం వలన ఆ రథ చక్రాల కిందపడి ఒక యువకుడు మరణించాడు. అది రాజకుమారుడు చేసిన పొరపాటు.
ప్రశ్న 3.
దుర్గాదేవి ఎందుకు ప్రసన్నురాలైంది?
జవాబు:
ఒక వృద్ధురాలి కొడుకు మరణానికి తన కుమారుడు కారణమయ్యాడని మాధవవర్మకు తెలిసింది. మాధవవర్మ ధర్మాత్ముడు. వివేకి. తన కుమారునికి మరణశిక్ష విధించాడు. ఆ సాయంకాలమే అమలు జరిపాడు. ఆయన ధర్మనిరతికి దుర్గాదేవి ప్రసన్నురాలయింది. బంగారు వర్షం కురిపించింది. మరణించిన వారిద్దరినీ బ్రతికించింది.
ప్రశ్న 4.
కింది సంభాషణ చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
కెజియా : సుప్రజా ! సెలవుల్లో ఎక్కడి కెళ్ళావ్?
సుప్రజ : నేనా ! మా కుటుంబంతో యాగంటి క్షేత్రం చూడటానికి వెళ్ళాను.
కెజియా : ఓహెూ ! అలాగా ఆ పుణ్యక్షేత్రం ప్రత్యేకత ఏమిటో !
సుప్రజ : ఒకటేమిటి? అనేక ప్రత్యేకతల నిలయమది.
కెజియా : నిజమా ! అవేమిటో చెప్పు.
సుప్రజ : ‘యాగంటి’ కర్నూలు జిల్లా నల్లమల కొండల్లో ఉంది. అత్యంత రమణీయ ప్రదేశం, సాధారణంగా శివాలయాల్లో శివుడు లింగరూపంలో ఉంటాడు. కానీ ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు.
కెజియా : అలాగా !
సుప్రజ . : ఔను ! ఆలయం వెలుపల ‘అగస్త్య పుష్కరిణి’ అనే కొలను ఉంది. అందులో నీళ్ళు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి. అంతేకాదు అక్కడ ఉన్న నంది విగ్రహం రోజు రోజుకూ పెరుగుతూ ఉండటం ముఖ్యమైన విశేషం. అక్కడ మూడు సహజసిద్ధంగా ఏర్పడిన గుహలున్నాయి. వీరబ్రహ్మంగారు ఆ గుహల్లోనే కూర్చుని కాలజ్ఞానం రాశారట !
పర్వీన్ : ఏంటి ? మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండిపోయారు. పదండి. బడికి వెళ్తాం ! (ముగ్గురూ నిష్క్రమిస్తారు)
ప్రశ్నలు – జవాబులు :
అ) యాగంటిలోని ఉమామహేశ్వరాలయానికి, మిగిలిన శివాలయాలకు తేడా ఏమిటి?
జవాబు:
సాధారణంగా శివాలయాలలో శివుడు లింగరూపంలో ఉంటాడు. కాని యాగంటిలో పార్వతీ, పరమేశ్వరులు విగ్రహరూపంలో ఉంటారు.
ఆ) అగస్త్య పుష్కరిణి ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
అగస్త్య పుష్కరిణిలో నీరు ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది.
ఇ) కాలజ్ఞానం ఎవరు రాశారు?
జవాబు:
వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు.
ఈ) పై సంభాషణ ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
యాగంటి క్షేత్రం ఏ జిల్లాలో ఉంది?
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
దుర్గాదేవిని కనకదుర్గగా ప్రజలెందుకు పిలుస్తున్నారు?
జవాబు:
మాధవవర్మ కుమారుని రథం క్రింద పడి ఒక యువకుడు మరణించాడు. ధర్మాత్ముడైన మాధవవర్మ తన కుమారుడు చేసిన తప్పుకు మరణశిక్ష విధించి అమలు జరిపాడు. అతని ధర్మనిరతికి దుర్గాదేవి ఆనందించింది. విజయవాడ నగరమంతా బంగారుకాసుల వర్షం కురిపించింది. అలా కనకవర్షం కురిపించిన దుర్గాదేవిని ఆనాటి నుంచి కనకదుర్గగా ప్రజలంతా పిలుస్తున్నారు.
ప్రశ్న 2.
మాధవవర్మ దృష్టిలో అందరూ సమానులేనని ఎట్లా చెప్పగలవు?
జవాబు:
మాధవవర్మ రాజ్యంలో ఎవరు తప్పుచేసినా తగిన శిక్ష విధించేవాడు. తప్పు చేసిన వారిపట్ల తనవాళ్ళు, పరాయివాళ్ళు అనే భావన ఉండేది కాదు. అతని రాజ్యంలో వ్యక్తిని చంపినవాడికి మరణశిక్ష విధించేవాడు. రథాన్ని వేగంగా నడిపి ఒక యువకుని మరణానికి మాధవవర్మ కొడుకే కారణమయ్యాడు. ఆ నేరానికి తన కుమారునికి కూడా
మరణశిక్ష విధించి అమలు జరిపాడు. అందుచేత మాధవవర్మ దృష్టిలో అందరూ సమానులే అని చెప్పగలను.
ప్రశ్న 3.
పుత్రవాత్సల్యం అంటే ఏమిటి?
జవాబు:
తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల ఉండే ప్రేమను పుత్రవాత్సల్యం అంటారు.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
విజయవాడలో బంగారు వర్షం ఎందుకు కురిసిందో వివరంగా రాయండి.
జవాబు:
విజయవాడను పరిపాలించే మహారాజు పేరు మాధవవర్మ. ఆయన ధర్మాత్ముడు. ఒకసారి ఆయన కుమారుడు రథం మీద చాలావేగంతో కోట వీధిలో ప్రయాణించాడు. ఒక యువకుడు రథం కిందపడి మరణించాడు.
అతని తల్లి వృద్ధురాలు. తనకు న్యాయం చేయమని రాజును అర్థించింది. ఆ నేరం చేసినవాడు తన కుమారుడే అని తెలిసింది. న్యాయం ప్రకారం అతనికి మరణశిక్ష విధించాడు. ఆ సాయంత్రమే అతనిని ఉరి తీయించాడు.
అతని ధర్మనిరతికి దుర్గాదేవి ఆనందించింది. ఘడియసేపు బంగారు వర్షం కురిపించింది. ప్రజలంతా వీథులలోకి వచ్చి, బంగారు కాసులు ఏరుకొన్నారు. మరణించిన వారిద్దరిని బతికించింది.
ప్రశ్న 2.
ధర్మపరాయణుడైన మాధవవర్మ గురించి సొంత మాటల్లో రాయండి.
జవాబు:
మాధవవర్మ ధర్మ పరాయణుడు. ధర్మం, న్యాయం విషయంలో ఆయనకు తనవారు, పరాయివారు అనే భేదం లేదు. ఒకరోజు తన కుమారుని రథచక్రాల కిందపడి ఒక యువకుడు మరణించాడు. ధర్మనిర్ణయం చేయమని, న్యాయాధికారులను ఆదేశించాడు మాధవవర్మ. దానికి మరణశిక్ష తప్ప మరో దారి లేదని న్యాయాధికారులు చెప్పారు. రాజకుమారుడైనా, సామాన్యుడైనా న్యాయదేవతకు సమానమేనని చెప్పారు. బంధుప్రీతికి చోటులేదని చెప్పారు. తీర్పు వింటున్నంతసేపూ మాధవవర్మ మౌనంగా ఉన్నాడు. గంభీరంగా ఉన్నాడు. ఆయన ధర్మాన్ని కాదనలేడు. పుత్రవాత్సల్యం, ధర్మ నిర్ణయం రెండింటికీ ఘర్షణ ఏర్పడినపుడు ధర్మ నిర్ణయమే గెలిచింది. అందుకే మాధవవర్మ పట్ల దుర్గాదేవి కూడా ప్రసన్నురాలైంది.
ప్రశ్న 3.
కింద ఇవ్వబడిన పదాల ఆధారంగా కథను రాయండి.
శిబిచక్రవర్తి – కొలువు – పావురం-డేగ – ప్రవేశించడం – శరణు – అభయం – ఇవ్వడం – తక్కెడ – తేవడంతూచడం – సరితూగకపోవడం – సిద్ధమవడం – త్యాగనిరతి – ప్రజలు – మెచ్చుకోవడం – అగ్ని – ఇంద్రుడు – ప్రత్యక్షమవడం – ప్రవేశించడం.
జవాబు:
త్యాగం
ఒకనాడు శిబిచక్రవర్తి కొలువుతీరి ఉన్నాడు. ఆయన కొలువులోనికి ఒక పావురం ప్రవేశించింది. దానిని తరుముకొంటూ ఒక డేగ వచ్చింది. పావురం .శిబి చక్రవర్తిని శరణు వేడింది. తనను కాపాడమని ప్రార్థించింది. శిబి అభయం ఇచ్చాడు. అది తన ఆహారం కనుక తనకు మాంసం కావాలని డేగ అడిగింది. శిబి చక్రవర్తి తక్కెడ తెమ్మన్నాడు. తన శరీరం నుండి మాంసం కోసి తక్కెడలో వేసి పావురంతో తూచాడు. ఎంత మాంసం వేసినా సరిపోలేదు. చివరకు తానే కూర్చున్నాడు. ఆయన త్యాగనిరతిని ప్రజలు మెచ్చుకొన్నారు. అగ్ని, ఇంద్రుడు ప్రత్యక్షమయ్యారు. తామే డేగ, పావురం రూపంలో వచ్చినట్లు చెప్పారు. శిబి చక్రవర్తిని ఆశీర్వదించారు.
భాషాంశాలు
అ) కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
ఉదా : శ్రీకృష్ణుని చేతిలో కంసుడు అసువులు వదిలాడు.
అసువులు = ప్రాణాలు
సమయానికి సరైన వైద్యం అందడంచేత ఒక వ్యక్తి ప్రాణాలు నిలిచాయి.
1. ఘడియ మాత్రంలోనే సత్య వంటపని ముగించింది.
ఘడియ = 24 నిముషాలు.
ఈ రోజు 24 నిముషాల్లోనే 20 కిలోమీటర్లు వెళ్లాను.
2. పర మతాన్ని గౌరవించడం ధర్మం.
పర = ఇతర
ఇతర విషయాలు పట్టించుకోకుండా చదువుకోవాలి.
3. పూర్వం అశ్వాన్ని వాహనంగా ఉపయోగించేవారు.
అశ్వం = గుర్రం
దూరం పరుగెత్తినా గుఱ్ఱం తొందరగా అలసిపోదు.
4. సువర్ణ భూషణాలంటే అందరికీ ప్రీతి.
సువర్ణం = బంగారం
బంగారం ధర నానాటికీ పెరిగిపోతోంది.
ఆ) కింది వాక్యాలలో సమానార్థక పదాలు (పర్యాయ పదాలు) గుర్తించి రాయండి.
1. వాసు గుర్రం ఎక్కి ఊరు బయలుదేరాడు.. ఆ అశ్వం వేగవంతమైంది. గంట లోపలే హయం వల్ల ఊరు చేరిపోయాడు.
జవాబు:
1) గుర్రం
2) అశ్వం
3) హయం
2. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఆదిత్యుని రశ్మి సోకి ప్రకృతి నిదుర లేచింది. రవి తాపాన్ని భరించడం సాధ్యం కాదు.
జవాబు:
1) సూర్యుడు
2) ఆదిత్యుడు
3) రవి
3. అద్రి శిఖరం నుండి సెలయేరు జాలువారుతోంది. కొండపైన నగరం విస్తరించింది. ఆ పర్వతం మీదనే . దేవాలయం వెలసింది.
జవాబు:
1) అది
2) కొండ
3) పర్వతం
ఇ) కింది ప్రకృతులను వికృతులతో జతపర్చండి.
1) రథం | అ) ఆన |
2) కుమారుడు | ఆ) అరదం |
3) ఆజ్ఞ | ఇ) కొమరుడు |
జవాబు:
1) రథం | ఆ) అరదం |
2) కుమారుడు | ఇ) కొమరుడు |
3) ఆజ్ఞ | అ) ఆన |
ఈ) కింది ఖాళీలను వ్యతిరేక పదాలతో పూరించండి.
1) న్యాయం 2) అసామాన్యం 3) అస్తమిస్తాడు 4) దుఃఖం |
1. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. పడమరన …………… (అస్తమిస్తాడు)
2. నా కుమారునికి అన్యాయం జరిగిందని అనుకుంటే ……………….. జరిగింది. (న్యాయం)
3. సుఖం …………….. కావడి కుండలు అంటారు. (దుఃఖం)
4. ప్రతి సామాన్య విషయం ఒక్కోసారి ……………… గా మారుతుంది. (అసామాన్యం)
వ్యాకరణాంశాలు
అ) కింది పదాలను గమనించండి.
1) నాలుగు ముఖాలు
2) మూడు కన్నులు
3) పంచ పాండవులు
4) ముల్లోకాలు
5) ఏడు ద్వారాలు
పై పదాలన్నీ సమాస పదాలే. వాటిలో పూర్వపదం సంఖ్యను సూచిస్తోంది. ఉత్తరపదం నామవాచకాన్ని సూచిస్తోంది. సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాలను ద్విగు సమాసాలంటారు.
కింది వాక్యాల్లో ద్విగు సమాస పదాలున్నాయి. గుర్తించి రాయండి.
1. వ్యాసుడు వేదాలను చతుర్వేదాలుగా విభజించాడు.
జవాబు:
చతుర్వేదాలు
2. శంకుస్థాపనలో నవధాన్యాలు వాడతారు.
జవాబు:
నవధాన్యాలు
3. ఇంద్రధనుస్సులో సప్తవర్ణాలు ఉంటాయి.
జవాబు:
సప్తవర్ణాలు
ఆ) ముందటి పాఠాలలో అత్వ సంధి పదాలను తెలుసుకున్నారు కదా! కింద ఇచ్చిన అత్వ సంధి పదాలను విడదీయండి.
1. చిన్నప్పుడు
2. తిరగకేమి
3. రామయ్య
4. జరగకేమి
5. రామక్క
6. సీతమ్మ
జవాబు:
1. చిన్నప్పుడు = చిన్న + అప్పుడు – అత్వ సంధి
2. తిరగకేమి = తిరగక + ఏమి – అత్వ సంధి
3. రామయ్య = రామ + అయ్య అత్వ సంధి
4. జరగకేమి జరగక + ఏమి – అత్వ సంధి
5. రామక్క = రామ + అక్క – అత్వ సంధి
6. సీతమ్మ = సీత + అమ్మ – అత్వ సంధి
ఇ) ఈ కింది సంధి పదాలను కలిపి రాయండి.
1. రవ్వ + అంత 2. చింత + ఆకు 3. వెంక + అప్ప
జవాబు:
1. రవ్వ + అంత = రవ్వంత – అత్వ సంధి
2. చింత + ఆకు = చింతాకు – అత్వ సంధి
3. వెంక + అప్ప = వెంకప్ప – అత్వ సంధి
ఈ) సంయుక్త వాక్యం :
సమప్రాధాన్యం గల ‘రెండుగాని, అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్తవాక్యం ఏర్పడుతుంది. ఇందులో అన్నీ ప్రధానవాక్యాలే ఉంటాయి. కాబట్టి, కాని, మరియు వంటి పదాలు వాక్యాలను కలుపుతాయి.
కింద ఇచ్చిన వాక్యాలను గమనించండి. సంయుక్త వాక్యాలుగా మార్చండి.
ఉదా :
మధు బడికి వెళ్లాడు. రహీమ్ బడికి వెళ్ళాడు. జాన్ బడికి వెళ్ళాడు.
మధు, రహీమ్, జాన్ బడికి వెళ్ళారు.
1. సీత అక్క. గీత చెల్లెలు.
2. శారద సంగీతం నేర్చుకుంది. శారద నాట్యం నేర్చుకుంది.
3. నగీస్ స్టేషన్ కి వెళ్లింది. రైలు వెళ్ళిపోయింది.
4. మాధవి పరుగెత్తింది. బస్సు అందలేదు.
5. వర్షాలు వచ్చాయి. చెరువులు నిండలేదు.
జవాబు:
1. సీత, గీత అక్కాచెల్లెళ్ళు.
2. శారద సంగీతం, నాట్యం నేర్చుకుంది.
3. నగీస్ స్టేషనుకు వెళ్ళింది కానీ రైలు వెళ్ళిపోయింది.
4. మాధవి పరుగెత్తింది కానీ బస్సు అందలేదు.
5. వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు.
ప్రాజెక్టు పని (నాలుగవ నిర్మాణాత్మక మూల్యాంకనం కోసం)
* మీ ప్రాంతంలోని దర్శనీయ స్థలాలను గూర్చిన వివరాలు సేకరించి రాయండి.
జవాబు:
మేము విజయవాడలో నివసిస్తాం.
విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్నది. లెనిన్ విగ్రహం నాకు చాలా నచ్చింది. విక్టోరియా మ్యూజియం కూడా చాలా బాగుంటుంది.
గాంధీ కొండపై మహాత్ముడి సంస్మరణార్థం ఒక స్మారక స్తూపం ఉంది. ఈ స్తూపం 52 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ గాంధీ స్మారక గ్రంథాలయం, నక్షత్రశాల చూడతగినవి. ప్రకాశం బ్యారేజీ కూడా దర్శనీయ ప్రాంతమే. రాజీవ్ గాంధీ పార్కులో చాలా పూలమొక్కలు ఉన్నాయి. సంగీతాన్ని వినిపించే ఫౌంటేను, మినీ జూపార్కు ఇక్కడ ప్రత్యేకాకర్షణ. విజయవాడకు 4 కిలోమీటర్ల దూరంలో భవానీ ద్వీపం చక్కటి పర్యాటక క్షేత్రం. విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గమ్మ గుడి, చాలా బాగుంటుంది. గుణదల మేరీమాత గుడి కూడా చూడదగిన ప్రాంతం.
కఠిన పదాలు – అర్ధాలు
కోలాహలం = హడావిడి
సువర్ణం = బంగారం
అశ్వం = గుఱ్ఱం
రథం = తేరు
ధ్వని = శబ్దం
అసువులు = ప్రాణాలు
ఆకస్మికంగా = హఠాత్తుగా
వదనం = ముఖం
మూర్తీభవించిన = రూపుదాల్చిన
ఆశ్రితులు = ఆశ్రయించినవారు
ఆపన్నులు = ఆపదలో ఉన్నవారు
మృతదేహం = శవం
సొమ్మసిల్లుట = స్పృహ తప్పుట
సపర్యలు = సేవలు
ఆనతి = ఆజ్ఞ
శాసనం = చట్టం
సూక్తి = మంచిమాట
శోకము= ఏడ్పు