SCERT AP Board 6th Class Telugu Solutions 3rd Lesson మాకొట్టి తెల్ల దొరతనము Textbook Questions and Answers.
AP State Syllabus 6th Class Telugu Solutions 3rd Lesson మాకొట్టి తెల్ల దొరతనము
6th Class Telugu 3rd Lesson మాకొట్టి తెల్ల దొరతనము Textbook Questions and Answers
వినడం – ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
చిత్రం చూడండి. చిత్రం గురించి మాట్లాడండి.
జవాబు:
చిత్రంలో మన జాతీయ పతాకం ఉంది. ఆ బొమ్మలోని వారు దేనికో గొడవపడుతున్నారు. పోలీసులు లాఠీలతో కొడుతున్నారు. అది బహుశా స్వాతంత్ర్యోద్యమం కావచ్చు. అందుకే స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించారు. పోలీసులు ఆ ఉద్యమం చేసేవారిని అడ్డుకొంటున్నారు. కొడుతున్నారు.
ప్రశ్న 2.
పై చిత్రంలో ఎంతమంది రక్షకభటులున్నారు?
జవాబు:
పై చిత్రంలో ఆరుగురు రక్షకభటులున్నారు.
ప్రశ్న 3.
పై చిత్రంలో ఉద్యమం చేసే వారి కళ్లల్లో ఏ భావాలు కనబడుతున్నాయి?
జవాబు:
పై చిత్రంలో ఉద్యమం చేసేవారు కొందరి కళ్లల్లో కోపం కనబడుతోంది. కొందరి కళ్లల్లో భయం కనబడుతోంది.
అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి. అభినయించండి.
జవాబు:
ఉపాధ్యాయుని అనుసరిస్తూ, స్పష్టమైన ఉచ్చారణతో పాడాలి. అభినయించాలి.
ప్రశ్న 2.
కింది వాక్యాలను చదవండి. వీటికి సంబంధించిన పంక్తులు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి, రాయండి.
అ) మా ధనం మూటలు దోచుకున్నాడు.
జవాబు:
మాదు మూటాముల్లెలు దోచినాడు
ఆ) కీడుతో మమ్మల్ని చెడిపోమంటున్నాడు.
జవాబు:
చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు.
ఇ) ఈ దేశం మీద దాడి చేస్తున్నాడు.
జవాబు:
ధాటీ చేస్తాడీ దేశమున
ఈ) ఉప్పు తాకితే తప్పంట.
జవాబు:
ఉప్పు ముట్టుకుంటే దోషమండీ
3. కింది ఖాళీలను సరైన గేయ భాగంతో పూరించండి.
గాంధీ టోపీ పెట్టి ………………………
రావద్దు ………………..
రాట్నం బడిలో ……………….
………………. వీపులు బాదుతాడు.
అయ్యో ! ……………….. రాట్నంలో ఉన్నదంట.
జవాబు:
గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ
రావద్దు రావద్దంటాడు.
రాట్నం బడిలో పెట్టవద్దంటాడు
టోపీ తీసి వీపులు బాదుతాడు.
అయ్యో! రాజద్రోహమంత రాట్నంలో ఉన్నదంట.
4. ఈ కింది కవితను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఏమి మహిమంబు గలదొ నీనామమందు
‘బాపు’ అని పేరు వీనులబడిన యంత
నిలువునను నాదు మేనెల్ల పులకరించు
జల్లుమని నాదు హృదయంబు జలదరించు
సర్వసారస్వత ప్రపంచంబు నందు
గాంధి యనియెడి వర్ణయుగంబు తోడ
సాటి వచ్చెడు వేక్కమాట గలదె – నాళం కృష్ణారావు
అ) ఎవరి నామం వినడం వలన మేను పులకరిస్తుందని కవి అంటున్నారు?
జవాబు:
బాపు (గాంధీ) గారి నామం వినడం వలన మేను పులకరిస్తుందని కవి అంటున్నారు.
ఆ) ఈ కవిత ఎవరిని గురించి తెలుపుతుంది?
జవాబు:
ఈ కవిత గాంధీ గారిని గురించి తెలుపుతుంది.
ఇ) ఈ కవితలో ‘అక్షరాల జంట’ అని అర్థం వచ్చే పదబంధం ఏది?
జవాబు:
ఈ కవితలో ‘అక్షరాల జంట’ అని అర్థం వచ్చే పదబంధం వర్ణయుగంబు.
ఈ) పై కవిత ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
హృదయం ఏమని జలదరించింది?
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
భారతీయులు పట్టెడన్నం కోసం ఎటువంటి పాట్లు పడ్డారు?
జవాబు:
భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనూ పంటలు చక్కగా పండుతున్నాయి. కానీ, భారతీయులు పట్టెడన్నం కోసం పాట్లు పడుతున్నారు. ఎందుకంటే ఉప్పు పైన కూడా తెల్లవాడు పన్ను వేశాడు. ఉప్పులేనిదే వంట చేసుకోలేరు. అన్నిటిపైనా పన్నులు వేసి, భారతీయులకు తిండి లేకుండా చేశాడు. కుక్కలతో సమానంగా పోరాడి చెత్తకుప్పలపై మెతుకులు ఏరుకొని తినే నీచస్థితికి భారతీయులను తెల్లవాడు దిగజార్చాడు.
ప్రశ్న 2.
ఆంగ్లేయులు భారతీయులపై దాడి చేయడం అమానుషమని ఎలా చెప్పగలరు?
జవాబు:
ఆంగ్లేయులు భారతీయులు కారు. భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు. ఇక్కడి పరిపాలనా వ్యవహారాలలో తలదూర్చారు. పరిపాలనను ప్రారంభించారు. వాడి తాతగారి సొమ్మేమీ ఇక్కడ లేదు, ఈ దేశం మనది. ఈ సంపద మనది. కష్టపడి పండించుకొనేది మనం. ఐనా తెల్లవాడికి పన్ను కట్టాలట. వాడు చెప్పినట్లు వినాలట. వినకపోతే వాళ్ల పోలీసుల చేత కొట్టించాడు, ఇది కచ్చితంగా దారుణం. అమానుషం. రాక్షసత్వం.
ప్రశ్న 3.
బడిలో చదువుకున్న ఆనాటి పిల్లల పరిస్థితి ఎలా ఉండేది? ఈనాటి పరిస్థితి ఎలా ఉంది? మీరు గమనించిన తేడాలు ఏమిటి?
జవాబు:
ఆనాడు బడిలో చదువుకొనే పిల్లలకు స్వేచ్ఛ లేదు. ఏ సదుపాయాలూ లేవు. పాలకులు చెప్పినట్లే చేయాలి. పిల్లలను చావబాదేవారు. అడిగే దిక్కు లేదు. అడిగినా ఎవ్వరూ పట్టించుకొనేవారు కాదు. గాంధీ టోపీ పాఠశాలల్లో ధరించకూడదు. రాట్నం ఉండకూడదు. స్వాతంత్ర్యం గురించి మాట్లాడకూడదు.
ఈనాడు పాఠశాలలో చదువుకునే పిల్లలకు స్వేచ్ఛ ఉంది. మధ్యాహ్న భోజనం ఉంది, బూట్లు, పుస్తకాలు, బట్టలు మొదలైనవన్నీ ఇస్తారు. నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు కొత్త భవనాలు, ప్రహారీలు, విద్యుత్తు, పంకాలు, మంచినీరు మొదలైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈనాడు బడిలో పిల్లలను దండించరు, అర్థం అయ్యేలా పాఠాలు చెబుతున్నారు.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
ఆంగ్లేయుల పాలనను భారతీయులు వద్దనడానికి గల కారణాలను గేయం ఆధారంగా వివరించండి.
జవాబు:
ఆంగ్లేయుల పాలన భారతీయులకెంత మాత్రమూ నచ్చలేదు. ఎందుకంటే వారు భారతీయుల ప్రాణాలను తీసేవారు. భారతీయులను తెల్లవారు గౌరవించేవారు కాదు. భారతదేశంలో చక్కగా పంటలు పండుతున్నా తిండి లేకుండా చేశారు. ఉప్పు పైన కూడా ఆంగ్లేయులు పన్ను వేశారు. తిండిలేక కుక్కలతో పోరాడి తినే పరిస్థితిని కల్పించారు.
తెల్లవారెప్పుడూ భారతీయుల బాగు గురించి పట్టించుకోలేదు. ధనం కోసం సారా అమ్మారు. అది తాగి అనేకమంది మరణించారు. గాంధీ టోపీతో బడులకు పిల్లలను రానిచ్చేవారు కాదు. టోపీ పెట్టుకొని ఎవరైనా వస్తే చావబాదేవారు. బడిలో రాట్నం పెడితే రాజద్రోహం నేరం మోపి జైలులో పెట్టేవారు.
సమావేశాలు పెడితే సెక్షన్ 144 కింద అరెస్టు చేసేవారు. వందేమాతరం పాడనిచ్చేవారు కాదు. తమ అధికారాన్ని ధిక్కరిస్తే జైల్లో పెట్టేవారు. భారతీయులను అన్ని విధాలుగా చెడిపోయేలా చేశాడు. వాడి తాత సొమ్మేదో ఇక్కడ దాచినట్లుగా భారతదేశంపై దండయాత్రలు చేశాడు. యుద్ధాలు చేశాడు. అందుకే ఆంగ్లేయుల పరిపాలనను భారతీయులు అంగీకరించలేదు. తిరుగుబాటు చేశారు.
ప్రశ్న 2.
బానిసతనం అంటే ఎవరూ ఇష్టపడరు. అందరూ స్వేచ్చనే కోరుకొంటారు. ఎందుకు?
జవాబు:
బానిసత్వాన్ని ఎవ్వరూ ఇష్టపడరు. ఎందుకంటే బానిసతనంలో స్వేచ్ఛ ఉండదు. నచ్చినట్లుగా ఉండడం కుదరదు. ఏ పని చేయడానికి స్వతంత్రం ఉండదు. ప్రతిదానినీ ఇతరులు శాసిస్తారు.
స్వేచ్చ వలన బానిసత్వం పోతుంది. అందుకే స్వేచ్చను అందరూ ఇష్టపడతారు. స్వేచ్చగా ఉంటే మనకు నచ్చినట్లుగా మనం ఉండవచ్చు. మనకు నచ్చినట్లు చదువుకోవచ్చు. ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, పరిపాలించు కోవచ్చు. మన చట్టాలను మనమే తయారుచేసుకోవచ్చు. మనకు నచ్చని చట్టాలను రద్దు చేసుకోవచ్చును. మనకు నచ్చిన వృత్తిని చేపట్టవచ్చు. మనపైన ఎవ్వరి పెత్తనం ఉండదు. ఇలా చాలా ప్రయోజనాలున్నాయి. కనుకనే అందరూ స్వేచ్ఛనే కోరుకొంటారు. ఇష్టపడతారు.
ప్రశ్న 3.
ఆంగ్లేయుల పాలనలో మగ్గిన సగటు భారతీయుని ఆవేదనను ఏకపాత్రగా రాయండి. ప్రదర్శించండి.
జవాబు:
భారతీయుడు
నేను భారతీయుడను. నా పేరు ఏదైతేనేం? నేను సగటు భారతీయుడిని, మా పాలకులు తెల్లవాళ్లు. నాకు స్వేచ్ఛ లేదు. నేను ఇష్టపడిన చదువును చదువుకోలేక పోయాను. నచ్చిన ఉద్యోగం చేయలేకపోయాను. నేను బడిలో చదివేటపుడు గాంధీ టోపీ పెట్టుకొని బడిలోకి వెళ్లాను. అంతే, చచ్చేలా కొట్టారు. ఎదిరించాను. ఇంకా గట్టిగా కొట్టారు. నాకు భయం వేయలేదు. పౌరుషం పెరిగింది. మరునాడు రాట్నం కూడా పట్టుకెళ్లాను. మళ్లీ కొట్టారు. జైలులో పెట్టారు. పది సంవత్సరాలు జైలులో గడిపాను. విడుదలయ్యాక స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాను. గొంతెత్తి బిగ్గరగా ‘వందేమాతరం’ పాడాను. ఊరూరా తిరిగాను. నన్ను భయపెట్టే కొద్దీ నాలో స్వాతంత్ర్య కాంక్ష పెరిగిపోయింది. తిండిలేదు, నీరసం. అనేక రోగాలు పట్టుకొన్నాయి. నాకు మరణ భయం లేదు. భారతమాత సేవను వదలను. అదిగో పోలీసులు వచ్చారు. జైలు నుంచి వస్తే మళ్లీ మాట్లాడతా.
భాషాంశాలు
అ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
ఉదా : విదేశీయుల దొరతనం లో స్వేచ్ఛ ఉండదు.
దొరతనం = పాలన
‘శ్రీరాముని పాలనలో అయోధ్య ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారు.
1. కూడు లేని పేదలను ఆదరించాలి.
జవాబు:
కూడు = తిండి
తిండి తింటే కండ కలదోయ్.
2. సొంత లాభం సుంతైన మానుకొని పొరుగువారికి తోడుపడాలి.
జవాబు:
లాభం = ప్రాప్తి
ప్రతిదానిలోనూ ప్రాప్తిని ఆశించకూడదు.
3. ముల్లె సంపాదించినంత మాత్రాన గొప్పవాళ్ళం కాము.
జవాబు:
ముల్లె = ధనపు మూట
అన్నివేళలా మన ధనపు మూటలు మనల్ని కాపాడవు.
ఆ) కింది వాక్యాలలో సమానార్థక పదాలు (పర్యాయపదాలు) గుర్తించి రాయండి.
1. చేటు కలిగించే పనులు చేయకూడదు. అవి జీవితానికి ఎంతో కీడు చేస్తాయి.
జవాబు:
చేటు, కీడు
2. విజయనగర రాజు కృష్ణదేవరాయలు. ఆ ప్రభువు తెలుగుభాషను ఎంతగానో ఆదరించాడు.
జవాబు:
రాజు, ప్రభువు
3. అధికారం కోసం పోరాటం, ఆస్తుల కోసం యుద్ధం చేయడం మంచిది కాదు.
జవాబు:
పోరాటం, యుద్ధం
ఇ) కింది పదాలను సరైన వ్యతిరేకార్థక పదాలతో జతపరచండి.
1. కావాలి | అ) చెడు |
2. మంచి | ఆ) వినడు |
3. వింటాడు | ఇ) వద్దు |
జవాబు:
1. కావాలి | ఇ) వద్దు |
2. మంచి | అ) చెడు |
3. వింటాడు | ఆ) వినడు |
వ్యాకరణాంశాలు
అక్షర విభాగం
అ) తెలుగు భాషలో 56 అక్షరాలున్నాయి. ఇవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలని మూడు విధాలు.
ఆ) అచ్చులు – విభాగం
1. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు – అ, ఇ, ఉ, ఋ, ఇ, ఎ, ఒ – హ్రస్వాలు.
2. రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు – ఆ, ఈ, ఊ, ఋ, 2, ఏ, ఐ, ఓ, ఔ – దీర్ఘాలు.
ఇ) హల్లులు – విభాగం
‘క’ నుండి ‘మ’ వరకు గల అక్షరాలను అయిదు వర్గాలుగా విభజించవచ్చు. అవి :
1. కఠినంగా పలికే అక్షరాలు – క, చ, ట, త, ప – పరుషాలు |
2. తేలికగా పలికే అక్షరాలు – గ, జ, డ, ద, బ – సరళాలు |
3. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు – ఖ, ఘ, ఛ, ఝ, ఠ, డ, ఢ, ధ, ఫ, భ – వర్గయుక్కులు |
4. ముక్కు సాయంతో పలికే అక్షరాలు – జ, ఇ, ణ, న, మ – అనునాసికాలు |
5. అంగిలి సాయంతో పలికే అక్షరాలు – య, ర, ఱ, ల, ళ, వ – అంతస్థాలు |
6. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు – శ, ష, స, హ – ఊష్మాలు |
7. పరుష, సరళాలు కాకుండా మిగిలిన హల్లులు – స్థిరాలు |
8. ‘క’ నుండి ‘మ’ వరకు గల హల్లులు – స్పర్శాలు |
ఈ) వర్ణోత్పత్తి స్థానాలు
ఉ) కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. కింది పదాలలో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి. వాటిని గుర్తించండి.
వింత, పథం, వందనం, విధం, మనం
జవాబు:
ఇందులో త వర్గం అక్షరాలు – త, థ, ద, ధ, న లు ఉన్నాయి.
2. కింది వాక్యంలో పరుషాలను గుర్తించండి.
కలిసి చరించనిట హితము తెలుప.
జవాబు:
3. కింది వాక్యంలో సరళాలను గుర్తించండి.
తగవు జరుగు నెడల నాదరి నిలబడరాదు
జవాబు:
4. కింది పదాల్లో ఊష్మాలు గుర్తించండి.
దేశం, ఝషం, గ్రాసం, లోహం
జవాబు:
ప్రాజెక్టు పని (ఇది రెండవ నిర్మాణాత్మక మూల్యాంకనం కోసం)
1. స్వాతంత్ర్యోద్యమ గీతాలను సేకరించండి. వాటిని చార్టుమీద ప్రదర్శించండి.
జవాబు:
దేశభక్తి – గురజాడ అప్పారావు
దేశమును ప్రేమించుమన్న
మంచియన్నది పెంచుమన్నా
వట్టిమాటలు కట్టి పెట్టోయ్
గట్టి మేల్ తల పెట్టవోయ్
పాడిపంటలు పొంగి పొర్లే
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితే కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్!
దేశాభిమానము నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూనియేదైనాను ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్ !
సొంతలాభము కొంత మానుకు
పొరుగువాడికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
చెట్టపట్టాల్ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ములు వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్ !
మతం వేరైతేను ఏమోయ్
మనసు ‘లొకటై మనుషులుంటే
జాతియన్నది లేచిపెరిగీ
లోకమున రాణించునోయ్ !
దేశమనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్త వలెనోయ్
నరుల చెమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్ !
2. జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శతసహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ సశ్యామల సుశ్యామ చలశ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణా.
చమత్కార పద్యం
కరయుగంబు గలదు చరణంబు లా లేవు
కడుపు, నడుము వీపు మెడయుగలవు
శిరము లేదుగాని నరులబట్టుక మ్రింగి
సొగసు గూర్చు దీని సొగసు గనుడి
భావం :
రెండు చేతులుంటాయి. పాదాలు ఉండవు. పొట్ట, నడుము, వీపు, మెడ ఉంటాయి. తల ఉండదు. కాని ఇది మనుషులను మింగి అందాన్ని ఇస్తుంది. దాని అందాన్ని చూడండి.
(ఈ చమత్కారానికి జవాబు = చొక్కా)
మాకొదీ తెల దొరతనము – కవి పరిచయం
పేరు : గరిమెళ్ల సత్యనారాయణ
జననం : శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట తాలూకా గోనెపాడులో 14.7.1893న జన్మించారు.
తల్లిదండ్రులు : సూరమ్మ, వేంకట నరసింహం గార్లు
నివాసం : ప్రియా అగ్రహారం
ఉద్యోగం : గంజాం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గుమాస్తాగా, విజయనగరంలో ఉపాధ్యాయుడుగా, గ్రంథాలయ కార్యదర్శిగా, జర్నలిస్టుగా, సంపాదకుడుగా పనిచేశారు.
ప్రసిద్ధి : స్వాతంత్ర సమరయోధుడు, కవి రచయిత.
రచనలు : 1921లో స్వరాజ్య, గీతాలు, 1923లో హరిజనుల పాటలు. 1926లో ఖండ కావ్యాలు, భక్తి గీతాలు, బాల గీతాలు రచించారు. దండాలు దండాలు భారతమాత, మాకొద్దీ తెల్లదొరతనము గేయాలతో సామాన్య ప్రజలలో కూడా స్వాతంత్ర్యోద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించారు.
ప్రత్యేకతలు : జాతీయకవి, దేశభక్తి కవితలు రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో మొదటివారు ప్రజాపాటల త్యాగయ్యగా ప్రసిద్ధులు.
18. 12. 1952న స్వర్గస్తులయ్యా రు.
గేయ భాగాలు – అర్ధాలు- భావాలు
1&2 పద్యాలు
మాకొద్దీ తెల్ల దొరతనము, దేవ
మాకొద్దీ తెల్ల దొరతనము
మా ప్రాణాలపై పొంచి
మానాలు హరియించె | మాకొద్దీ ||
పన్నెండు దేశాలు పండుచున్నా గాని
పట్టెడన్నమె లోపమండీ
ఉప్పు ముట్టుకుంటే దోషమండీ
నోట మట్టిగొట్టి పోతాడండీ,
అయ్యో ! కుక్కలతో పోరాడి కూడూ తినమంటాడు. || మాకొద్దీ ||
అర్థాలు :
తెల్ల దొరతనము = ఆంగ్లేయుల పరిపాలన
మానము = అభిమానం
హరియించు = చంపు
ముట్టుకుంటె = తాకితే
దోషం = తప్పు
కూడు = అన్నం
భావం :
ఓ దేవా ! భారతీయులమైన మా మాన ప్రాణాలను తీయడానికి తెల్లవారు (ఆంగ్లేయులు) చూస్తున్నారు. వారి పరిపాలన మాకు. వద్దు. పన్నెండు దేశాలలో పంటలు పండుతున్నాయి కాని మాకు పట్టెడన్నం దొరకడం లేదు. ఉప్పును ముట్టుకుంటే తప్పు అంటున్నారు. నోట్లో మట్టి కొడుతున్నారు. కుక్కలకు అన్నం వేసి, ఆ అన్నం కోసం కుక్కలతో పోరాడి ఆకలి తీర్చుకోమంటున్నారు.
3&4 పద్యా లు
ధనము కోసము వాడు దారి చేసికోని
కల్లు సారాయమ్ముతాడు
మాదు మూటాముల్లెలు దోచినాడు
ఆలి మెళ్లో పుస్తెలు తెంచుతాడు
మాదు కళ్లల్లో దుమ్మేసి కొటికి దరిచేసాడు || మాకొద్దీ ||
గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ
రావద్దు రావద్దంటాడు
రాట్నం బడిలో పెట్టవద్దంటాడు
టోపి తీసి వీపులు బాదుతాడు
అయ్యో ! రాజద్రోహమంత రాట్నంలో ఉన్నదంట || మాకొద్దీ ||
అర్థాలు :
ధనము = డబ్బు
ముల్లె = ధనం / మూట
ఆలి = భార్య
సుంతైన = తాళిబొట్టు
కాడు = శ్మశానం
బాదు = కొట్టు
రాజద్రోహం = రాజుకు చేసే అపరాధం
భావం :
ఆంగ్లేయులు డబ్బు కోసం కల్లు, సారాయి అమ్ముతారు. ఆ నెపంతో మేము దాచుకున్న డబ్బంతా దోచుకుంటున్నారు. భార్యల మెడలలో తాళిబొట్లు ఉండనీయడం లేదు. మా కళ్ళలో దుమ్ముకొట్టి
గాంధీ టోపి పెట్టుకొని బడికి రావద్దు రావద్దు అంటారు. బడిలో రాట్నం పెట్టవద్దంటారు. తలపై టోపీ ఉంటే తీసి వీపులపై బాదుతారు. రాట్నం ఉపయోగిస్తే రాజద్రోహం అంటారు.
5&6 పద్యాలు
నూటనలుబదినాలు నోటికి తగిలించి
మాటలాడ వద్దంటాడు
మమ్ము పాట పాడవద్దంటాడు
తనను దాటి వెళ్ళవద్దంటాడు
అయ్యో ! చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు || మాకొద్దీ ||
వాడి తాతగారి ముల్లె దాచి పెట్టినట్లు .
ధాటీ చేస్తాడీ దేశమున
పోరాటమాడుతాడు పైన
మోమాటము పడడు
వాడి పాటు పాడైపోను మాటచెపితే వినడు || మాకొద్దీ ||
అర్థాలు :
చేటు = కీడు, అనర్థం
ధాటి = దాడి
పోరాటం = యుద్ధం
మోమాటము = జంకు, సంకోచం
సుంత = కొంచెం మమ్ములను చంపుతున్నారు.
పాటు = ఆపద
భావం :
నూట నలభై నాలుగు చీటీని నోటికి తగిలించి మాట్లాడవద్దంటాడు. స్వాతంత్ర్యం గురించి పాటలు పాడవద్దంటాడు. తన అనుమతి లేకుండా ముందుకు వెళ్ళవద్దంటాడు. మాకు కీడు చేస్తూ మమ్ము బానిసలుగా బతకమంటాడు.
వారి తాతలు సంపాదించిన ధనం ఈ దేశంలో దాచి పెట్టినట్లు ఆంగ్లేయులు భారతీయుల మీద దాడి చేస్తారు. అనవసరంగా జగడాలు పెట్టుకుంటారు. ఏ మాత్రం జంకు లేకుండా ఉన్నారు. వారి వలన కలిగే ఆపద తొలగిపోవాలి. వారి పాలన అంతం కావాలి.