These AP 7th Class Telugu Important Questions 5th Lesson పద్య పరిమళం will help students prepare well for the exams.
AP Board 7th Class Telugu 5th Lesson Important Questions and Answers పద్య పరిమళం
I. అవగాహన-ప్రతిస్పందన
పరిచిత పద్యాలు
కింది పద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. క్షమ గలిగిన సిరి గలుగును
క్షమ గలిగిన వాణి గలుగు సౌఖ్యము లెల్లన్
క్షమ గలుగఁ దోన కలుగును
క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుఁడు తండ్రీ !
ప్రశ్నలు – జవాబులు :
అ) ‘క్షమ’ అంటే ఏమిటి?
జవాబు:
ఓర్పు
ఆ) ‘వాణి’ నానార్థాలు ఏమిటి?
జవాబు:
వాక్కు, సరస్వతి
ఇ) ‘శౌరి’ వ్యుత్పత్తి ఏమిటి?
జవాబు:
శూరసేనుని మనుమడు
ఈ) ‘సదయుడు’ విగ్రహవాక్యం ఏమిటి?
జవాబు:
దయతో కూడినవాడు
2. పరుల దిట్ట నోరు పాప పంకిల మౌను
పెద్దలను నుతింప శుద్ధియగును
నోటి మంచి తనము పాటించు సుజ్ఞాని
కాళికాంబ ! హంస కాళికాంబ!
ప్రశ్నలు – జవాబులు :
అ) ‘పంకిలం’ వికృతి పదం ఏది?
జవాబు:
పంకం
ఆ) ‘పెద్దలను నుతింప’ లోని గీత గల అక్షరం ఏ విభక్తి ప్రత్యయం?
జవాబు:
ద్వితీయా
ఇ) ‘సుజ్ఞాని’కి వ్యతిరేక పదం ఏమిటి?
జవాబు:
అజ్ఞాని
ఈ) ‘కాళికాంబ’ పదం విడదీయండి.
జవాబు:
కాళిక + అంబ
3. సత్యమె యశముకు మూలము
సత్యమె భవమోహపాశ సంసృతి బాపున్
సత్యమె శీలము నిలుపును
సత్యముతో నెట్టివ్రతము చాలదు నగజా
ప్రశ్నలు – జవాబులు :
అ) ‘సంసృతి’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
సంసారం
ఆ) ఈ పద్యంలోని మకుటం ఏది?
జవాబు:
నగజా
ఇ) యశముకు మూలం ఏది?
జవాబు:
సత్యం
ఈ) సత్యం దేనిని నిలుపుతుంది?
జవాబు:
శీలాన్ని
4. గురుభక్తియు విద్యలపై
తరగని విశ్వాస సంపద వినయము నిరం
తర సాధన, ధారణ పున
శ్చరణము విద్యార్థికి యవసర లక్షణముల్
ప్రశ్నలు – జవాబులు :
అ) ‘ధారణ’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
జ్ఞాపకశక్తి
ఆ) ‘పునశ్చరణము’ పదాన్ని విడదీయండి.
జవాబు:
పునః + చరణము
ఇ) ‘విశ్వాసము’కి వికృతి పదం ఏది?
జవాబు:
విసువాసము
ఈ) ‘గురుభక్తి’ ఏ సమాసం?
జవాబు:
సప్తమీ తత్పురుష సమాసం
అపరిచిత పద్యాలు
కింది అపరిచిత పద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. కలిమిగల లోభికన్నను
విలసితముగ బేద మేలు వితరణి యైనన్
చలిచెలమ మేలు కాదా
కులనిధి యంభోధికన్న గువ్వలచెన్నా!
ప్రశ్నలు – జవాబులు :
అ) ఎవరి కన్న పేద మేలు?
జవాబు:
సంపదకల లోభి కన్న పేద మేలు.
ఆ) లోభికన్న పేద ఎప్పుడు మేలు?
జవాబు:
పేద వితరణి (దాత) అయితే, లోభివాని కన్న మేలు.
ఇ) చలిచెలమ దేనికన్న మేలు?
జవాబు:
చలిచెలమ అంభోధి (సముద్రము) కన్న మేలు.
ఈ) చలిచెలమ అంభోధి కన్న ఎందుకు మేలని చెప్పగలవు?
జవాబు:
చలిచెలమలో నీళ్ళు కొంచెమే ఉన్నా అవి త్రాగడానికి పనికి వస్తాయి. సముద్రంలో నీళ్ళు ఎక్కువగా ఉన్నా ఉప్పగా ఉండి అవి త్రాగడానికి పనికి రావు. అండువల్ల చలిచెలమ, అంభోధికన్న మేలు.
2. పుస్తకముల నీవు పూవువలెను జూడు
చింపఁబోకు మురికి చేయఁబోకు
పరుల పుస్తకముల నెరవు తెచ్చితి వేని
తిరిగి యిమ్ము వేగ, తెలుఁగు బిడ్డ !
ప్రశ్నలు – జవాబులు :
అ) పుస్తకములను ఎలా చూడాలి?
జవాబు:
పుస్తకములను పువ్వుల్లా చూడాలి.
ఆ) పుస్తకాల విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి?
జవాబు:
పుస్తకాలను చింపరాదు. మురికి చేయరాదు.
ఇ) ఇతరుల పుస్తకముల విషయంలో ఎలా ఉండాలి?
జవాబు:
ఇతరుల పుస్తకాలు ఎరవు తెస్తే వేగంగా వారికి తిరిగి ఇయ్యాలి.
ఈ) ఎరవు తేవడం అంటే ఏమిటి?
జవాబు:
అవసరం కోసం ఇతరులను అడిగి తెచ్చుకోవడం.
3. పుత్తడిగలవాని పుండు బాధైనను
వసుధలోన చాల వారకెక్కు
పేదవాని యింట పెండైన యెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ.
ప్రశ్నలు – జవాబులు :
అ) ఎవరి విషయం చాలా ప్రాచుర్యం పొందుతుంది?
జవాబు:
పుత్తడి గలవాని / ధనవంతుని
ఆ) ఎవరి యింట పెండ్లి అయిన ఎరుగరు?
జవాబు:
పేదవాని యింట
ఇ) అవని, పుడమి భూమికి పర్యాయపదాలు. పై పద్యంలో భూమికి గల మరో పర్యాయపదాన్ని గుర్తించుము.
జవాబు:
వసుధ
ఈ) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఈ పద్యము ఏ శతకములోనిది?
4. పత్రికొకటియున్న పదివేల సైన్యము
పత్రికొక్కటున్న మిత్రకోటి
ప్రజకు రక్షలేదు పత్రికలేకున్న
వాస్తవమ్ము నార్లవారి మాట
ప్రశ్నలు – జవాబులు :
అ) ప్రజలకు రక్షణ ఇచ్చేది ఏది?
జవాబు:
పత్రిక
ఆ) పత్రిక ఎంత మంది సైన్యమునకు సమానము?
జవాబు:
10వేల సైన్యంతో
ఇ) “మిత్రకోటి” అనే పదానికి అర్థము తెలపండి.
జవాబు:
స్నేహితుల సమూహం
ఈ) పై పద్యానికి శీర్షిక ప్రకటించండి.
జవాబు:
పత్రిక – ప్రజలకు రక్ష
5. సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు జనులకు గలుషమడఁచు
గీర్తిఁ బ్రకటించు చిత్తవిస్ఫూర్తిఁ జేయు
సాధుసంగంబు సకలార్థ సాధకంబు.
ప్రశ్నలు – జవాబులు :
అ) సకలార్థ సాధకము ఏది?
జవాబు:
సాధుసంగము (సజ్జన సహవాసులు) సకలార్థ సాధకము.
ఆ) సాధుసంగము దేనిని ఘటిస్తుంది?
జవాబు:
సాధుసంగము సత్యసూక్తిని ఘటిస్తుంది.
ఇ) సాధుసంగము దేనిని పోగొడుతుంది?
జవాబు:
సాధుసంగము’ ధీజడిమను అనగా బుద్ధిమాంద్యాన్ని పోగొడుతుంది.
ఈ) ‘కీర్తిని వ్యాపింపజేస్తుంది. మనస్సును బాగుచేస్తుంది’ అనే అర్థం వచ్చే పంక్తి ఏది?
జవాబు:
కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి ‘జేయు’ అనే పద్య పంక్తి పై భావాన్ని ఇస్తుంది.
6. “ఇందుగలడందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు దానవాగ్రణి వింటే”
ప్రశ్నలు – జవాబులు :
అ) సర్వోపగతుండెవరు?
జవాబు:
సర్వోపగతుండు ‘చక్రి’. చక్రి అనగా చక్రమును ధరించే శ్రీమహావిష్ణువు.
ఆ) చక్రి ఎక్కడున్నాడు?
జవాబు:
చక్రి. అన్ని చోట్లా ఉంటాడు.
ఇ) ఈ పద్యం ఎవరిని సంబోధిస్తుంది?
జవాబు:
ఈ పద్యం, దానవాగ్రణిని అంటే రాక్షసరాజు హిరణ్య కశిపుని సంబోధిస్తుంది.
ఈ) ఈ పద్యం ఏ గ్రంథంలోనిది? (రామాయణం, భారతం, భాగవతం)
జవాబు:
ఈ పద్యం భాగవతం లోనిది.
7. “కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ”
ప్రశ్నలు – జవాబులు :
అ) కమలములకు, సూర్యునికి గల సంబంధమేమి?
జవాబు:
కమలములు నీటిలో నుండి బయటకు వస్తే సూర్యుని కాంతి తాకి వాడిపోతాయి.
ఆ) ‘కమలిన భంగిన్’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
వాడిపోయిన విధంగా అని అర్థము.
ఇ) తమ స్థానములు కోల్పోతే అనే అర్థం ఇచ్చే పాదం ఏది?
జవాబు:
‘తమ తమ నెలవులు దప్పిన’ అనే మూడో పాదం.
ఈ) మిత్రులు శత్రువులెందుకవుతారు?
జవాబు:
తమ తమ స్థానాలను కోల్పోతే మిత్రులు శత్రువులు అవుతారు.
8. అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా
నెక్కిన బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ !
ప్రశ్నలు – జవాబులు :
అ) సమయమునకు సహాయము చేయని చుట్టమును ఏం చేయాలి?
జవాబు:
‘సమయమునకు సహాయము చేయని చుట్టమును విడిచిపెట్టేయాలి.
ఆ) ఈ పద్యంలో నీతి ఏమిటి?
జవాబు:
అవసరానికి ఉపయోగపడని వాటిని వెంటనే విడిచి పెట్టాలి.
ఇ) ఈ పద్యము ఏ శతకంలోనిది?
జవాబు:
ఈ పద్యము సుమతీ శతకంలోనిది.
ఈ) వెంటనే విడువవలసినవి ఏవి?
జవాబు:
అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీయని దేవుడు, పరుగెత్తలేని గుఱ్ఱము.
9. మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్టవిప్పి చూడ పురుగులుండు
పిఱికి వాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు – జవాబులు :
అ) మేడి పండు పైకి ఎలా ఉంటుంది?
జవాబు:
మేలిమిగా
ఆ) పైకి ధైర్యంగా లోపల భయంగా ఉండడాన్ని సూచించే పద్యపాదం ఏది?
జవాబు:
పిటికి వాని మదిని బింకమీలాగురా.
ఇ) మేడి పండును ఎవరితో పోల్చారు?
జవాబు:
పిటికివానితో
ఈ) ఈ పద్యానికి మకుటం ఏది?
జవాబు:
విశ్వదాభిరామ వినురవేమ.
10. సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరితా పోయిన పోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ !
ప్రశ్నలు – జవాబులు :
అ) ‘సిరి’ ఎట్లా వస్తుంది?
జవాబు:
టెంకాయలోనికి నీరెలా తెలియకుండా చేరుతుందో అలాగే సంపద తెలియకుండానే వస్తుంది.
ఆ) ‘సిరి’ ఎలా పోతుంది?
జవాబు:
ఏనుగు తిన్న వెలగపండు గుజ్జువలె సంపద పోతుంది.
ఇ) ఈ పద్యాన్ని చదివి నీవు ఏమి గ్రహించావు?
జవాబు:
సంపదలు నిత్యములు కావు.
ఈ) ఈ పద్యము ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
సుమతీ శతక కర్త ఎవరు?
11. పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులము కన్న నెంచ గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు – జవాబులు :
అ) పూజకంటే ఏది ముఖ్యం?
జవాబు:
బుద్ధి
ఆ) మాటకంటే ఏది దృఢంగా ఉండాలి?
జవాబు:
మనసు
ఇ) పై పద్యం ఏ శతకంలోనిది?
జవాబు:
వేమన
ఈ) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
కులం కన్నా ఏది ప్రధానం?
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
గువ్వల చెన్నడు తన పద్యం ద్వారా మీ పాఠ్యాంశంలో ఏం చెప్పారు?
జవాబు:
గువ్వల చెన్నడు తన పద్యం ద్వారా ధనం యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ధనం వలన స్నేహాలేర్పడతాయి. ‘విరోధాలేర్పడతాయి. ఎన్ని మంచిగుణాలున్నా సభలలో గౌరవం తెచ్చేది కూడా ధనమేనని చెప్పారు.
ప్రశ్న 2.
విద్యార్థికి ఏయే లక్షణాలుండాలి?
జవాబు:
విద్యార్థికి తను చదివే చదువుపై నమ్మకం ఉండాలి. గురువుల పట్ల భక్తి ఉండాలి. వినయం ఉండాలి. నిరంతరం అభ్యాసం చేయాలి. చదివినది గుర్తు పెట్టుకోవాలి. పునశ్చరణ చేయాలి. ఇవన్నీ విద్యార్థికి అవసరమైన లక్షణాలు.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘పరులను తిట్టనోరు.పాప పంకిలమౌను’ అని కవిగారెందుకన్నారు?
జవాబు:
ఇతరులను నిందించడం మహాపాపం. మనకు పవిత్రతను కాని, అపవిత్రతను కానీ, కీర్తిని గానీ, అపకీర్తిని గాని తెచ్చేది మన నోరే. నోటితో మంచి మాటలు మాట్లాడితే కీర్తి పెరుగుతుంది. మంచి పేరు వస్తుంది.
పరులను తిట్టడం వలన వారు బాధపడతారు. ఆ బాధలో వాళ్లు కూడా తిట్టుకొంటే అవే శాపాలై తగులుతాయి. వాటి ప్రభావం వలన అనేక బాధలు పడవలసి వస్తుంది. బురదగుంటలో ఎవ్వరూ స్నానం చేయరు. ముక్కు మూసుకొంటారు. తిట్టేవాళ్ల నోరు కూడా బురదగుంటతో సమానమే. ఎవ్వరూ స్నేహం చేయరు. చెవులు మూసుకొని – దూరంగా వెళ్లిపోతారు. పాపమంటే అందరికీ భయమే కదా ! అందుకే తిట్టేనోరు పాప పంకిలమన్నారు.
ప్రశ్న 2.
‘వృద్ధజన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞుడు’ అని పండితులు ఎందుకంటారు?
జవాబు:
వృద్ధులను సేవించాలి. వృద్ధులను సేవిస్తే వారు మనకు ఎన్నో విషయాలు వివరిస్తారు. చక్కని కథలు చెబుతారు. పొడుపు కథలు చెబుతారు. చమత్కారాలు చెబుతారు. చరిత్రలోని విషయాలెన్నో చెబుతారు. వారి జీవిత అనుభవాలు చెబుతారు. అవన్నీ చాలా విలువైనవి. మనకు ఎక్కడ పుస్తకాలలో దొరకవు. క్లిష్ట పరిస్థితులలో ఎలా ప్రవర్తించాలో తెలిసిన వారినే బుద్ధిమంతుడు అంటారు. వృద్ధులు చెప్పే విషయాల ద్వారా మనకు బుద్ధి, జ్ఞానం పెరుగుతాయి. చాలా జ్ఞానం కలవారిని విశేషులు అంటారు. అందుకే వృద్ధులను సేవించాలి. బుద్ధి, జ్ఞానం కలవారనిపించు కోవాలి. అందుకే పండితులు అలాగ అన్నారు.
II. భాషాంశాలు
పర్యాయపదాలు
క్షమ = ఓర్పు, ఓరిమి
సిరి = ధనము, డబ్బు
వాణి = మాట, పలుకు
సౌఖ్యము = సుఖము, హాయి
మెచ్చు = పొగుడు, నుతించు
శౌరి = వాసుదేవుడు, శ్రీకృష్ణుడు
తండ్రి = జనకుడు, పిత
ధనము = డబ్బు, అర్థము
సభ = ఓలగము, కొలువు
ఘనత = గొప్పదనం, శ్రేష్ఠత
గొనము = గుణము, లక్షణము
వృద్ధులు = ముసలివారు, ముదుసలులు
బుద్ధి = మతి, తెలివి
పూతము = పవిత్రం, పునీతం
బుధులు = పండితులు, విద్వాంసులు
ప్రేమ = అనురాగం, మమకారం
కుమారుడు = పుత్రుడు, కొడుకు
పరులు = ఇతరులు, పరాయివారు
నోరు = వక్రము, ముఖము
పాపము = దోషము, దురితము
నుతి = పొగడ్త, స్తుతి
కాళిక = కాళి, కాళికాదేవి
శుద్ధి = పునీతం, పవిత్రం
సత్యము = నిజం, యథార్థం
మూలము = ఆది, మొదలు
భవము = పుట్టుక, జన్మ
మోహము = కోరిక, కాంక్ష
సంసృతి = సంసారం, కాపురం
పాశము = త్రాడు, రజ్జువు
శీలము = స్వభావము, గుణము
వ్రతము = నోము, బతము
నగజ = పార్వతీదేవి, శైలజ
గురువు = ఉపాధ్యాయుడు, ఆచార్యుడు
విద్య = కళ, చదువు
విశ్వాసం = నమ్మకం, నమిక
సంపద = విభూతి, ఐశ్వర్యం
వినయము = అణకువ, వినమ్రత
నిరంతరం = ఎల్లప్పుడు, ఎప్పుడు
సాధన = అభ్యాసం, తర్ఫీదు
ధారణ = గుర్తు, జ్ఞాపక శక్తి
విద్యార్థి = శిష్యుడు, ఛాత్రుడు
అగ్ని = హుతాశనుడు, జ్వలనుడు
గాలి = పవనము, వాయువు
సుత్తి = సంపెట, సమ్మెట
దెబ్బ = హతి, ఆఘాతము
సొమ్ము = ఆభరణము, భూషణము
పసిడి = బంగారము, కనకము
అఖిలము = సర్వము, నిఖిలము
మిత్రుడు = స్నేహితుడు, చెలికాడు
చేష్ట = పని, చేత
నేర్పు = నైపుణ్యం, పనితనం
రాగి = తామరసము, తామ్రము
జనులు = ప్రజలు, జనత
భాస్కరుడు = సూర్యుడు, రవి
కరము = చేయి, హస్తము
దానము = ఈవి, సంప్రదానం
చరణములు = పాదాలు, అంఘ్రులు
అభివాదనం = వందనం, నమస్కారం
దోః = బాహువు, భుజము
వీనులు = చెవులు, శ్రుతులు
భూషణము = ఆభరణం, నగ
శూరులు = వీరులు, పరాక్రమవంతులు
పునశ్చరణ = తిరిగి గుర్తు చేసుకోవడం, జ్ఞప్తి చేసుకోవడం
ప్రకృతి – వికృతులు
పద్యము – పద్దెము
శ్రీ – సిరి
ఘనము – గనము
గుణము – గొనము
వృద్దు – పెద్ద
బుద్ధి – బుద్ధి
విశ్వాసము – విసువాసము
ధర్మము – దమ్మము
సత్యము – సత్తెము
ప్రేమ – ప్రేముడి
యశము – అసము
భవము – బాము
వ్రతము – బతము
గురువు – గఱువ
భక్తి – బత్తి
విద్య – విద్దె
సాధన – సాదన
ధారణ – దారణ
లక్షణము – లక్కణము, లచ్చనము
అగ్ని – దుష్టుడు
చేష్ట – చేత
బహిర్భాగము – బయలు
భృంగారము – బంగారము
నిత్యము – నిచ్చలు
హృదయము – ఎద
ముఖము – మొగము
వ్యతిరేక పదాలు
పరిమళం × దుర్వాసన
సౌఖ్యము × అసౌఖ్యము
దయ × నిర్దయ
మైత్రి × వైరం
వృద్ద × బాల
ధర్మము × అధర్మము
పొగడ్త × తెగడ్త
ప్రేమ × ద్వేషం
శుద్ది × అశుద్ధి
సుజ్ఞాని × కుజ్ఞాని
జ్ఞాని × అజ్ఞాని
పాపము × పుణ్యము
సత్యము × అసత్యము
యశము × అపయశము
మోహము × నిర్మోహము
విశ్వాసము × అవిశ్వాసము
అవసరం × అనవసరం
హితము × అహితము
వర్ధిల్లు × నశించు
అఖిలము × ఖిలము
దుష్టుడు × శిష్టుడు
మూసి × తెరచి
సంధులు (ఉత్వసంధి):
సౌఖ్యములెల్లన్ = సౌఖ్యములు + ఎల్లన్
ధనమే = ధనము + ఏ
విశేషజ్ఞుడనుచు = విశేషజ్ఞుడు + అనుచు
పంకిలమౌను = పంకిలము + ఔను
దెబ్బలకోర్చి = దెబ్బలకు(న్) + ఓర్చి
సొమ్ములగుచు = సొమ్ములు + అగుచు
బాధలోర్చు = బాధలు + ఓర్చు
ఉండదది = ఉండదు + అది
జనులెల్ల = జనులు + ఎల్ల
వాదనమకుంఠిత = వాదనము + అకుంఠిత
వర్తనమంచిత = వర్తనము + అంచిత
భూషణంబులివి = భూషణంబులు + ఇవి
యడాగమం:
ప్రేమయెసంగ = ప్రేమ + ఎసంగ
శుద్ధియగును = శుద్ధి + అగును
విద్యార్థికియవసరము = విద్యార్థికి + అవసరము
మూసినయంతటన్ = మూసిన + అంతటన్
ముట్టకయుండదు = ముట్టక + ఉండదు
వాణియ్దల = వాణి + ఔదల
లేనియప్పుడున్ = లేని + అప్పుడున్
ఇత్వ సంధి:
అదెట్లు = అది + ఎట్లు
సవర్ణదీర్ఘ సంధి :
కాళికాంబ = కాళిక + అంబ
చరణాభివాదనము = చరణ + అభివాదనము
ఖాళీలు : క్రింది ఖాళీలను వ్యతిరేక పదాలతో పూరించండి.
1. మానవులు సౌఖ్యమును కోరతారు…………….. కోరుకోరు. (అసౌఖ్యము)
2. మూగజీవుల పట్ల దయతో ఉండాలి. …………….. పనికిరాదు. (నిర్దయ)
3. పొగడ్తలకు పొంగకు. ……………….. లకు కుంగకు. (తెగడ్త)
4. జ్ఞానిని ………………. ని కూడా సమంగా చూడాలి. (అజ్ఞాని)
5. పాపము, …………… చివరకు మిగిలేవి. (పుణ్యము)
6. యశము సంపాదించాలి. కాని, ………………. కాదు. (అపయశము)
7. అవసరం ఐతే మాట్లాడాలి. …………………. గా మాట్లాడకూడదు. (అనవసరం)
8. హితము నే పలకాలి. …………………….. ను పలకకూడదు. (అహితము)
9. దుష్టులను శిక్షించాలి. ……………… రక్షించాలి. (శిష్టులను)
10. అందరితో మైత్రిగా ఉండాలి. ……………………….. వద్దు. (వైరం)
వ్యాకరణాంశాలు: ఈ క్రింది ఖాళీలను సరైన విభక్తి ప్రత్యయంతో పూరించండి.
1. తల్లిదండ్రుల ………………… గౌరవించాలి. (ను)
2. ……………… రామా ! ఇటురారా ! (ఓ)
3. ధనము ……………….. కీర్తి రాదు. (వలన)
4. భీముడు, దుర్యోధనుని గద ………………. కొట్టాడు. (తో)
5. పిల్లల ……………….. తల్లిదండ్రులు కష్టపడతారు. (కొఱకు)
6. చెరువు ………………… నీరు ఎండిపోయింది. (లో).
7. మంచిపనుల …………………. భగవంతుడుంటాడు. (అందు)
8. రామున ……………… రణరంగంలో ఎదురులేదు. (కు)
9. రాము ………………. మంచి బాలుడు. (డు)
10. సీతారాము ……………. ఆదర్శ దంపతులు. (లు)
సంధులు: ఈ క్రింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
1. అదెట్లు = అది + ఎట్లు – ఇత్వ సంధి
2. ఉండదది = ఉండదు + అది – ఉత్వ సంధి
3. సౌఖ్యములెల్లన్ = సౌఖ్యములు + ఎల్లన్ – ఉత్వ సంధి
4. చరణాభివాదనము = చరణ + అభివాదనము – సవర్ణదీర్ఘ సంధి
5. సొమ్ములనుచు = సొమ్ములు + అనుచు – ఉత్వ సంధి
6. బాధలోర్చు. బాధలు – ఓర్చు – ఉత్వ సంధి
7. లేనియప్పుడున్ = లేని + అప్పుడున్ – యడాగమ సంధి
8. శుద్ధియగును = శుద్ది + అగును – యడాగమ సంధి
9. వర్తనమంచిత = వర్తనము + అంచిత – ఉత్వ సంధి
10. మూసినయంతటన్ = మూసిన + అంతటన్ – యడాగమ సంధి
IV. బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. భాషాంశాలు
అర్థాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.
1. క్షమ ఉంటే దేనినైనా సాధించవచ్చు.
a) డబ్బు
b) తెలివి
c) ఓర్పు
d) చదువు
జవాబు:
c) ఓర్పు
2. మా గురువుగారు సదయుడు.
a) కరుణామయుడు
b) తెలివైనవాడు
c) మేథావి
d) అందగాడు
జవాబు:
a) కరుణామయుడు
3. మంచివారితో మైత్రి చేయాలి.
a) ఉద్యోగం
b) వ్యాపారం
c) ప్రయాణం
d) స్నేహం
జవాబు:
d) స్నేహం
4. ఎవ్వరితోనూ వైరం పెంచుకోకూడదు.
a) స్నేహం
b) విరోధం
c) ప్రేమ
d) ద్వేషం
జవాబు:
b) విరోధం
5. తిరుమల పూతమైన ప్రదేశం.
a) పవిత్రం
b) కొండ
c) దైవం
d) భక్తి
జవాబు:
a) పవిత్రం
6. మంచివారిని బుధులు మెచ్చుకొంటారు.
a) రాజులు
b) అధికారులు
c) పండితులు
d) విద్యార్థులు
జవాబు:
c) పండితులు
7. దేవుని నుతి చేయాలి.
a) నూతి నీరు
b) గొప్ప
c) పూజ
d) స్తోత్రం
జవాబు:
d) స్తోత్రం
8. సత్యమునే పలకాలి.
a) నిజం
b) న్యాయం
c) గౌరవం
d) ఆనందం
జవాబు:
a) నిజం
9. మనిషికి విద్య కీర్తి తెస్తుంది.
a) డబ్బు
b) చదువు
c) తెలివి
d) ఉద్యోగం
జవాబు:
b) చదువు
10. నగజను శివుడు పెండ్లాడెను.
a) పార్వతీదేవి
b) లక్ష్మీదేవి
c) సరస్వతీ దేవి
d) భార్య
జవాబు:
a) పార్వతీదేవి
పర్యాయపదాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.
11. సభలో మర్యాదగా మాట్లాడాలి.
a) ఓలగము, కొలువు
b) వీథి, కూడలి
c) తరగతి, అసెంబ్లీ
d) దేశం, రాష్ట్రం
జవాబు:
a) ఓలగము, కొలువు
12. మంచి గొనములు కలిగి ఉండాలి.
a) సంపద, డబ్బు
b) తెలివి, మేద
c) గుణము, లక్షణము
d) నడక, నడత
జవాబు:
c) గుణము, లక్షణము
13. బుద్ధి కలవాడెలాగైనా తప్పించుకొంటాడు,
a) చదువు, విద్య
b) మతి, తెలివి
c) అధికారం, పదవి
d) ధనం, డబ్బులు
జవాబు:
b) మతి, తెలివి
14. విద్యార్థి ధారణ కలిగి ఉండాలి.
a) పిల్ల, పిల్లవాడు
b) బడి, తరగతి
c) శిష్యుడు, ఛాత్రుడు
d) గది, నుతి
జవాబు:
c) శిష్యుడు, ఛాత్రుడు
15. మంచి కుమారుడు కావాలని తల్లిదండ్రులనుకొంటారు.
a) బిడ్డ, వరుడు
b) రాముడు, లక్ష్మణుడు
c) పుత్రి, బిడ్డ
d) కొడుకు, పుత్రుడు
జవాబు:
d) కొడుకు, పుత్రుడు
16. బంగారపు సొమ్ములు దాచుకోవాలి.
a) భూషణము, ఆభరణం
b) కాసు, అరకాసు
c) నగ, నగదు
d) నిథి, నిక్షేపం
జవాబు:
a) భూషణము, ఆభరణం
17. రాగి పాత్రలలో నీరు త్రాగాలి.
a) తామర, వెండి
b) ఇత్తడి, కంచు
c) తామరసం, తామ్రం
d) వెండి, రజితం
జవాబు:
c) తామరసం, తామ్రం
18. బుధులు గౌరవింపతగినవారు.
a) పండితులు, విద్వాంసులు
b) గురువులు, ఉపాధ్యాయులు
c) ప్రధానోపాధ్యాయులు, హెడ్మాష్టర్
d) వృద్ధులు, పెద్దలు
జవాబు:
a) పండితులు, విద్వాంసులు
19. వినాయకుని తల్లి నగజ.
a) రమ, లక్ష్మి
b) వాణి, సరస్వతి
c) పార్వతి, శైలజ
d) రాణి, రాబ్రజ్ఞ
జవాబు:
c) పార్వతి, శైలజ
20. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.
a) వక్రము, ముఖము
b) ముఖము, వదనం
c) నయనం, వక్షం
d) ఆననం, వదనం
జవాబు:
a) వక్రము, ముఖము
ప్రకృతి-వికృతులు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి-వికృతులను గుర్తించండి.
21. మా తెలుగు ఉపాధ్యాయులు పద్యము బాగా చదువుతారు.
a) పద్య ము
b) పద్యగానం
c) పద్య విద్య
d) పద్దెము
జవాబు:
d) పద్దెము
22. పెద్దలను గౌరవించాలి.
a) వృద్దు
b) ముసలి
c) తాత
d) మామ్మ
జవాబు:
a) వృద్దు
23. నిత్యము మంచినే గమనించాలి.
a) ఎల్లపుడు
b) ఎపుడూ
c) నిచ్చలు
d) నిచ్చెన
జవాబు:
c) నిచ్చలు
24. మనపైన మనకు విశ్వాసము ఉండాలి.
a) విశ్వసము
b) విసువాసము
c) విశవము
d) వివశము
జవాబు:
b) విసువాసము
25. పెద్దలకు పిల్లల పట్ల ప్రేమ ఎక్కువ.
a) ప్రేముడి
b) పెరిమ
c) పెరీమా
d) అనురాగం
జవాబు:
a) ప్రేముడి
26. సత్య వ్రతమును మించిన వ్రతం లేదు.
a) నోము
b) బతము
c) పూజ
d) అర్చన
జవాబు:
b) బతము
27. సత్తెమునే పలకాలి.
a) సత్తియము
b) సత్తిము
c) సత్యము
d) సతాయము
జవాబు:
c) సత్యము
28. చదువు వలన యశము పెరుగును.
a) ఆశ
b) కీర్తి
c) యశస్సు
d) అసము
జవాబు:
d) అసము
29. మంచి లక్కణము కలిగి ఉండాలి.
a) లచ్చనము
b) లక్షణము
c) లక్ష్మి
d) లచ్చి
జవాబు:
b) లక్షణము
30. చేతలు మంచిగా ఉండాలి.
a) చేష్ట
b) చెయ్యి
c) పని
d) చేయూత
జవాబు:
a) చేష్ట
2. వ్యాకరణాంశాలు
ఈ క్రింది ఖాళీలకు సరైన విభక్తి ప్రత్యయాలను గుర్తించండి.
31. కత్తి ………. యుద్ధం చేసెను.
a) ని
b) ను
c) తో
d) కొరకు
జవాబు:
c) తో
32. తిండి ……… పని చేయాలి.
a) తో
b) కొరకు
c) చేత
d) వలన
జవాబు:
b) కొరకు
33. మంచి మార్కుల ……….. సంపాదించాలి.
a) ను
b) కొరకు
c) తో
d) వలన
జవాబు:
a) ను
34. ఉపాధ్యాయుని ………. మాట్లాడాలి.
a) కొరకు
b) కై
c) ను
d) తో
జవాబు:
d) తో
35. వాడి ………. తన్నులు తిన్నావా?
a) చేత
b) ని
c) ను
d) లు
జవాబు:
a) చేత
36. వాహనం ……… ఎదురు చూస్తున్నాను.
a) తో
b) ను
c) కొఱుకు
d) చేత
జవాబు:
c) కొఱుకు
37. బియ్యం ……… అన్నం వండుతారు.
a) ను
b) ని
c) చేత
d) తో
జవాబు:
d) తో
38. కాకి ………. కబురంపినా వస్తాను.
a) చేత
b) కి
c) ని
d) కోసం
జవాబు:
a) చేత
39. మనదేశ స్వాతంత్ర్యం ……. పోరాడారు.
a) ను
b) గురించి
c) చేత
d) తో
జవాబు:
b) గురించి
40. గాంధీజీ ………. జాతిపిత అంటారు.
a) ను
b) గురించి
c) ని
d) కొరకు
జవాబు:
c) ని
41. వృద్ధుల ………. సేవ చేస్తే మంచిది.
a) ను
b) ని
c) చేత
d) యొక్క
జవాబు:
d) యొక్క
42. గురవుల …….. భక్తి కలిగి ఉండాలి.
a) ను
b) అందు
c) యొక్క
d) కు
జవాబు:
b) అందు
43. ……. రామా ! ఇటురమ్ము.
a) నీ
b) యొక్క
c) చేత
d) ఓ
జవాబు:
d) ఓ
44. మంచి ఆహారం ………. బలం వస్తుంది.
a) వలన
b) యొక్క
c) కొఱుకు
d) అందు
జవాబు:
a) వలన
45. పేదల ……… సహాయం చేయాలి.
a) యొక్క
b) చేత
c) కు
d) ను
జవాబు:
c) కు
సంధులు: ఈ క్రింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
46. బడియున్నది – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) బడి + ఉన్నది
b) బడియు + ఉన్నది
c) బడియును + ఉన్నది
d) బడి + యున్నది
జవాబు:
a) బడి + ఉన్నది
47. మనకొక – సంధి పేరు గుర్తించండి.
a) అత్వసంధి
b) ఇత్వసంధి
c) ఉత్వసంధి
d) యడాగమం
జవాబు:
c) ఉత్వసంధి
48. క్రిందివానిలో సవర్ణదీర్ఘ సంధి పదం గుర్తించండి. –
a) చింతాకు
b) శిఖరాగ్రం
c) వంటాముదం
d) దొంగాట
జవాబు:
b) శిఖరాగ్రం
49. పూర్తియగును – దీని సంధి పేరు గుర్తించండి.
a) యణాదేశం
b) ఇత్వసంధి
c) యడాగమం
d) ఉత్వసంధి
జవాబు:
a) యణాదేశం
50. కవీశ్వరుడు – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) కవి + ఈశ్వరుడు
b) కవ + ఈశ్వరుడు
c) కవీ + ఈశ్వరుడు
d) కవులు + ఈశ్వరుడు
జవాబు:
a) కవి + ఈశ్వరుడు
51. ఆంధ్రావని – సంధి పేరు గుర్తించండి.
a) అత్వసంధి
b) సవర్ణదీర్ఘ సంధి
c) ఉత్వసంధి
d) ఇత్వసంధి
జవాబు:
b) సవర్ణదీర్ఘ సంధి
52. ఎన్నెనా – సంధి పేరు గుర్తించండి.
a) ఇత్వసంధి
b) వృద్ధి సంధి
c) ఉత్వసంధి
d) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
a) ఇత్వసంధి
53. క్రిందివానిలో ఉత్వసంధి పదం గుర్తించండి.
a) మహేశ్వరుడు
b) అదుపు
c) విశేషజ్ఞుడనుచు
d) కనకపు శోభ
జవాబు:
c) విశేషజ్ఞుడనుచు
54. మూసినయంతటన్ – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) మూసిన + యంతటన
b) మూసినయంత + టన్
c) మూసిన + అంతటన్
d) మూసినయుతట + ఇన్
జవాబు:
c) మూసిన + అంతటన్
55. పాపీడి – సంధి పేరు గుర్తించండి.
a) ఉత్వసంధి
b) ఇత్వసంధి
c) అత్వసంధి
d) యడాగమం
జవాబు:
b) ఇత్వసంధి
నేనివి చేయగలనా?
1. పాఠంలోని పద్యాలను రాగయుక్తంగా, భావయుక్తంగా పాడగలను. [ ఔను / కాదు ]
2. పద్యభావాలను సొంత మాటలలో చెప్పగలను, రాయగలను. [ ఔను / కాదు ]
3. పాఠంలోని పదాలను సొంత వాక్యాలలో ఉపయోగించగలను. [ ఔను / కాదు ]
4. పాఠంలోని ప్రశ్నలకు జవాబులు సొంతమాటలలో రాయగలను. [ ఔను / కాదు ]
చదవండి – ఆనందించండి
ఆశాపాత్ర
విశాల రాజ్యానికి రాజు ఇంద్రసేనుడు. ఒకరోజు మహారాజు అంతఃపురం పైనుంచి కిందికి చూశాడు. ఒక బిచ్చగాడు చెట్టు కింద కూర్చుని కనిపించాడు. అతని స్థితిని చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. నేను ఎంతో చక్కగా పరిపాలిస్తున్నాను; రాజ్యంలో అందరూ సిరి సంపదలతో వర్ధిల్లాలి కదా! మరి నా ఎదురుగానే ఒక బిచ్చగాడు కనబడడమేమిటి ? అనుకున్నాడు. గబగబా అంతఃపురం నుంచి బయటికి వచ్చాడు. మంత్రులందరూ అతనిని అనుసరించారు. రాజు బిచ్చగాడిని సమీపించాడు. రాజు ఎదురుగా నిలబడడంతో ‘బిచ్చగాడు భయం భయంగా లేచి నిల్చున్నాడు. ఇంద్రసేనుడు అతనితో “ఏం కావాలో కోరుకో” అని అన్నాడు. అప్పుడు బిచ్చగాడు నేను కోరుకున్నది మీరు ఇవ్వలేరు మహారాజా అన్నాడు. రాజుకు పౌరుషం వచ్చింది: ఏం కావాలన్నా ఎంత కావాలన్నా ఇస్తాను అన్నాడు. జోలె నుంచి భిక్షాపాత్రను తీశాడు. బిచ్చగాడు ఖాళీ పాత్ర రాజుకి చూపించాడు. ఈ పాత్ర నిండుగా దానం చేయండి చాలు మహాప్రభు అన్నాడు.
“వెండి వరహాలు తెచ్చి నిండుగా పోయండి” అని రాజు తన పరివారాన్ని ఆజ్ఞాపించాడు. దోసిళ్ళతో వరహాలు తీసుకువచ్చారు. రాజుగారి ఆజ్ఞ నెరవేర్చడానికి మంత్రులు పోటీపడ్డారు. ఒక దోసెడు చాలు పాత్ర నిండిపోతుంది. అంటూ ఓ మంత్రి వైపు దానం చెయ్యమన్నట్లుగా రాజు చూశాడు. ఆ మంత్రి భిక్షా పాత్రలో వరహాలు పోశాడు. దోసెడు వరహాలకు పాత్ర నిండిపోవాలి. కానీ నిండలేదు. పోసిన వరహాలు పోసినట్టే మాయమైపోయాయి.
పాత్ర ఖాళీగానే ఉంది. పాత్రను నింపడానికి మంత్రులంతా దోసిళ్ళతో వరహాలు పోస్తున్నారు. ఎన్ని వరహాలు పోసినా పాత్ర నిండడం లేదు. అది చూసి అంతా ఆశ్చర్యపోయారు. అప్పటికే అక్కడికి సామంతులు, పుర ప్రముఖులు వచ్చి చేరారు. నేను కోరింది మీరు ఇవ్వలేరు. ఇవ్వలేనని ఒప్పుకోండి. ఎవరి దారిన వారు హాయిగా బతుకుదాం అన్నాడు బిచ్చగాడు. రాజు ఒప్పుకోలేదు. తాను ఓడిపోవడం ఏమిటి ? అనుకున్నాడు. కోశాగారం మొత్తం తీసుకొచ్చి భిక్షాపాత్రలో వేయమన్నాడు.
వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, మాణిక్యాలు, బంగారం, వెండి ఆభరణాలు అన్నీ తెచ్చి భిక్షాపాత్రలో పోశారు. . ఎన్ని పోసినా ఎంత పోసినా పాత్ర ఖాళీగానే కనిపిస్తుంది. కోశాగారం ఖాళీ అయిపోయింది. సామంతుల కోశాగారాలు కూడా ఖాళీ అయిపోయాయి. చేతిలో చిల్లిగవ్వ లేకుండా అంతా కట్టుబట్టలతో నిల్చున్నారు. అయినా రాజు పట్టువీడలేదు. ఆ బిచ్చగాడు ముందు ఓడిపోవడాన్ని భరించలేక పోతున్నాడు. భిక్షా పాత్రను నింపేందుకు అందులో ఏనుగులనూ, రథాలనూ, గుర్రాలనూ, సైనికులను ఇలా అన్నింటిని ఉంచాడు. అయినా ఫలితం లేకపోయింది. పాత్ర ఖాళీగానే ఉంది. చివరి ప్రయత్నంగా సామంతరాజులనూ, మంత్రులనూ, అంతఃపురంలోని రాణులను కూడా ఉంచాడు.
అయినా పాత్ర నిండలేదు. ప్రజలంతా స్వచ్ఛందంగా అందులోకి ప్రవేశిస్తామన్నారు. రాజు వారించాడు. ఈ అప్పటికే సూర్యాస్తమయం అయింది. రాజు చేతులు జోడించి బిచ్చగాడి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా నేను ఓడిపోయాను. మీరే గెలిచారు. కానీ ఒక్క మాట దయచేసి చెప్పండి. ఈ భిక్షాపాత్ర మర్మమేమిటి? అని అడిగాడు. అప్పుడు ఆ బిచ్చగాడు పెద్దగా నవ్వుతూ మహారాజా ఈ పాత్ర మనిషి ఆశలకు మూలమైన మానవకపాలం (పుర్రె)తో తయారయింది. ఇది ఒక ఆశాపాత్ర. ఒకటి లభిస్తే ఇంకొకటి ఆశించే మనిషి నైజం (స్వభావం) తో తయారైన పాత్ర ఇది. మొత్తం ప్రపంచాన్నే మింగేస్తుంది. ఆశ ఉన్నంత వరకూ అందరూ బిచ్చగాళ్ళే అన్నాడు.
తేనె కన్న మధురంగా తెలుగు – ఆ తెలుగుదనం మా కంటి వెలుగు – ఆరుద్ర