These AP 6th Class Social Important Questions 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు will help students prepare well for the exams.
AP Board 6th Class Social 4th Lesson Important Questions and Answers ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు
ప్రశ్న 1.
పర్వతాలు అనగానేమి? వీని గురించి నీకేమి తెలుసు?
జవాబు:
భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతాలు పర్వతాలు పర్వతాలు కింది భాగంలో విశాలంగానూ, పై భాగంలో చిన్న శిఖరాన్ని కలిగి ఉంటాయి. పరిసరాల కంటే ఇవి బాగా ఎత్తులో, కొన్నిసార్లు మబ్బుల కంటే ఎత్తుగా ఉంటాయి. పర్వతాలపై ఎక్కువ ఎత్తుకి వెళ్లేకొద్దీ శీతోష్ణస్థితి చల్లగా ఉంటుంది. భారతదేశం హిమాలయాల వంటి పెక్కు ఉన్నత పర్వత శ్రేణులను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎత్తయిన భూస్వరూపాలలో ఎక్కువ – భాగం కొండలు.
ప్రశ్న 2.
పీఠభూములు అంటే ఏవి? ఇక్కడ శీతోష్ణస్థితి పరిస్థితి ఎలా ఉంటుంది?
జవాబు:
పీఠభూములు అనగా ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు. ఇవి పరిసరాల కంటే ఎత్తయిన సమ ఉపరితలం గల బల్లపరుపు భూములు. పీఠభూములు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వైపుల నిటారుగా ఉండి సున్నితమైన వాలు కలిగి ఉంటాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న కొన్ని పీఠభూములలో శీతోష్ణస్థితి కఠినంగా ఉండి నివాస యోగ్యమైన పరిస్థితులు లేవు. ‘తక్కువ ఎత్తులో ఉండే మిగిలిన పీఠభూములలో చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
ప్రశ్న 3.
పీఠభూములు ఆర్థికంగా ఏ విధంగా లాభదాయకమైనవని చెప్పవచ్చు?
జవాబు:
సాధారణంగా పీఠభూములు ఖనిజసంపదను కలిగి ఉంటాయి. అందువలన ఎక్కువ భాగం గనులు పీఠభూములలోనే ఉంటాయి. సున్నపురాయి, మాంగనీస్, రాతినార, ఇనుపఖనిజం, బంగారం, వజ్రాలు, గ్రాఫైట్, డోలమైట్, క్వార్ట్ సిలికా మొదలగు ఖనిజాలు పీఠభూమి ప్రాంతాలలో లభిస్తాయి. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. ఈ లావా పీఠభూములు పత్తి పండించడానికి అనుకూలమైన సారవంతమైన నల్లరేగడి నేలలకి ప్రసిద్ధి. పీఠభూములు అనేక సుందర దృశ్యాలతో ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా నిలిచి ఉన్నాయి.
ప్రశ్న 4.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులను తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ గురించి మీకు తెలిసిన విశేషాలు రాయండి.
జవాబు:
భారతదేశంలో గల 28 రాష్ట్రాలలో ఇది ఆగ్నేయ దిక్కులో గల ఒక రాష్ట్రం. భారతదేశపు తూర్పు తీర మైదానాన్ని ఆనుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. ఉత్తరాన చత్తీస్ఫడ్, ఒడిశా రాష్ట్రాలు, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన తెలంగాణా, నైఋతిలో కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం దీనికి సరిహద్దులు. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది భారతదేశంలో విస్తీర్ణత పరంగ ఏడవ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా పదవ పెద్ద రాష్ట్రం. కోస్తా ఆంధ్ర, రాయలసీమ అనే రెండు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉన్నది.
1. కోస్తా ఆంధ్ర :
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాన్ని ఆనుకుని ఉన్న 9 జిల్లాలను కోస్తా ఆంధ్రగా పిలుస్తారు. ఈ ప్రాంతం కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల వలన ఏర్పడిన సారవంతమైన నేలలను, అధిక జన సాంద్రతను కలిగి ఉన్నది.
2. రాయలసీమ :
ఈ ప్రాంతం రాతిపొరలు, పొడి నేలలతో కూడిన 4 జిల్లాల సమాహారం. ఇక్కడి అల్ప మరియు అనిశ్చిత వర్షపాతం వ్యవసాయానికి అంతగా అనుకూలం కాదు.
ప్రశ్న 5.
పోలవరం ప్రాజెక్ట్ ముంపు మండలాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంకు సంబంధించిన ఏ మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయబడ్డాయి?
జవాబు:
పోలవరం ప్రాజెక్టు నిర్మించడం వలన తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయబడినవి. వరరామ చంద్రపురం, కూనవరం, చింతూరు, భద్రాచలం మండలాలు తూర్పు గోదావరి జిల్లాలోనూ, బూర్గుంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ విలీనం చేయబడినవి.
ప్రశ్న 6.
తూర్పు కనుమలను వివిధ జిల్లాల్లో స్థానికంగా ఏ పేర్లతో వ్యవహరిస్తారో రాయండి.
జవాబు:
తూర్పు కనుమలను వివిధ జిల్లాల్లో స్థానికంగా క్రింది పేర్లతో వ్యవహరిస్తారు.
కొండల పేర్లు | జిల్లా పేరు |
1. యారాడ మరియు అనంతగిరి కొండలు | విశాఖపట్నం |
2. బైసన్ కొండలు మరియు పాపి కొండలు | తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు |
3. మొగల్ రాజపురం, కొండపల్లి కొండలు | కృష్ణ |
4. బేరంకొండ, నాగార్జున కొండ, కోటప్పకొండ | గుంటూరు |
5. వేలికొండలు | ఎస్.పి.ఎస్. ఆర్. నెల్లూరు |
6. నల్లమల్ల, ఎర్రమల | కర్నూలు |
7. వేలికొండలు, పాలకొండలు | వై.ఎస్.ఆర్. కడప |
9. శేషాచలం, హార్సిలీ కొండలు | చిత్తూరు |
10. పెనుకొండ, మడకశిరకొండలు | అనంతపురం |
ప్రశ్న 7.
“ఆంధ్రాకాశ్మీర్” అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఇది ఎక్కడ ఉంది?
జవాబు:
లమ్మసింగి/లంబసింగి, విశాఖపట్నం మన్య ప్రాంతంలోని చింతపల్లి మండలంలో మారుమూల ప్రాంతం. ఇక్కడ చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీనిని ‘ఆంధ్రాకాశ్మీర్’గా పిలుస్తారు.
ప్రశ్న 8.
పోడు వ్యవసాయం గురించి రాయండి.
జవాబు:
కొండ ప్రాంతాలలో ‘పోడు’ అనేది ఒక గిరిజన వ్యవసాయ పద్ధతి. దీనినే ‘స్థల మార్పిడి’ వ్యవసాయం లేదా ‘ఝూమ్’ వ్యవసాయం అని కూడా పిలుస్తారు. ఈ పద్ధతిలో, ప్రజలు అడవిలో కొంత ప్రాంతాన్ని చదును చేసి కొన్ని సంవత్సరాల పాటు పంటలు పండిస్తారు. తరువాత భూసారం తగ్గడం వలన వేరే స్థలానికి మారతారు. జొన్న, మొక్కజొన్న మొదలగు పంటలను ఈ పద్ధతిలో పండిస్తారు.
ప్రశ్న 9.
గిరిజనులు అడవులపై ఏ విధంగా ఆధారపడతారు?
జవాబు:
పోడు వ్యవసాయం, పెరటి తోటలనుండి వచ్చే దిగుబడి వీరి కుటుంబాలు సంవత్సరం పొడవునా జీవించడానికి సరిపోదు. కాబట్టి వివిధ రకాల అటవీ ఉత్పత్తుల సేకరణ, వేట వారి జీవినంలో కీలక భూమికను పోషిస్తాయి. వివిధ రకాల పళ్లు దుంపలు, గింజలు ఆకుకూరలు సేకరించడానికి, చిన్న జంతువులను వేటాడడానికి అడవిపైనే ఆధారపడతారు.
ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏదైనా ఒక గిరిజన సమూహం గూర్చి వివరించండి.
జవాబు:
వ్యవసాయం పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తున్న చెంచులు ఒక గిరిజన సమూహం. భారత ప్రభుత్వం వీరిని ఒక నిర్దిష్ట హానికర తెగగా గుర్తించింది. వారు ప్రాచీన కాలం నుండి నల్లమల అటవీ ప్రాంత నివాసులు. సాంప్రాదాయకంగా వారు వేటగాళ్లు. వీరు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో వ్యాపించారు.
ప్రభుత్వం వీరిని స్థిర వ్యవసాయంలోకి తీసుకురావడానికి వారి వ్యవసాయ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా చాలా ప్రయత్నాలు చేస్తోంది. వారిలో విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక పాఠశాలలను నివాస సౌకర్యాలతో నడుపుతోంది. ప్రభుత్వం 1989లో శ్రీశైలంలో ఇంటెగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. వారి మౌఖిక సాహిత్యం మానవ భావాలు మరియు ఆలోచనల యొక్క పురాతన రికార్డులలో ఒకటిగా పరిగణించబడుతుంది. (The chenchus by – Haimendorf పుస్తకం ఆధారంగా)
ప్రశ్న 11.
రాయలసీమ ప్రాంతం ఎందుకు కరవు పీడిత ప్రాంతంగా ఉన్నది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని పీఠభూమి ప్రాంతం దక్కన్ పీఠభూమిలోని తూర్పుభాగానికి చెందినది కాగా రాయలసీమ ఈ ప్రాంతంలో కలదు. ఈ ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఇక్కడ అల్ప, అనిశ్చిత వర్షపాతంతో బాటు చాలాసార్లు అసలు వర్షమే కురవకపోవడం సర్వ సాధారణం. అందువలనే ఇది కరవుపీడిత ప్రాంతంగా ఉన్నది.
ప్రశ్న 12.
రాయలసీమ (పీఠభూమి) ప్రాంతంలోని నేలల గురించి వివరించండి.
జవాబు:
ఇక్కడి నేలలు నల్లరేగడి, లేటరైట్, ఎర్రనేలలు మరియు ఇసుకనేలల రకానికి చెందినవి. కడప, కర్నూలు జిల్లాల్లో నల్లరేగడి నేలలు కలవు. రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ ఉన్న ఎర్రమట్టి నేలలకు వీటిని నిల్వ ఉంచుకునే , సామర్థ్యం లేకపోవడంతో భూమిని సాగు చేయకుండానే వదిలివేస్తారు. పీఠభూమి ప్రాంతాలలో అక్కడక్కడ ఉండే చౌడు నేలల్లో ఎక్కువగా సున్నం, క్షారలవణాలు ఉంటాయి. కాబట్టి ఆ నేలలు పంటలు పండించడానికి అనుకూలంగా ఉండవు.
ప్రశ్న 13.
రాయలసీమ (పీఠభూమి) ప్రాంతంలోని నీటి వనరుల గురించి తెలియజేయండి.
జవాబు:
పీఠభూమి ప్రాంతాలలో వర్షాలు తక్కువగా కురవడం వల్ల రైతులు వర్షపునీటిని నిల్వ చేసుకుంటారు. భూగర్భజలాలను వాడుకుంటారు. పూర్వకాలంలో వర్షపునీటిని నిల్వ ఉంచుకోవడానికి చెరువులు తవ్వేవారు. పీఠభూమి ప్రాంతాలలో సహజంగా ఉండే అగాధాలు, చిన్న కొండలవలన చెరువులను నిర్మించడం సులభం. చిన్న చిన్న చెరువులు నీటిని నిల్వచేయడానికి ఉపయోగపడితే, నూతులు భూగర్భ జలాలని వెలికి తీయడానికి ఉపయోగపడతాయి. ఇటీవల కాలంలో రైతులు ఎక్కువగా నూతులకు బదులు గొట్టపు బావులను వాడుతున్నారు. అయితే పీఠభూమి ప్రాంతంలో గొట్టపుబావులను తవ్వడం చాలా ఖర్చుతో కూడిన పని. కొద్దిమంది రైతులు మాత్రమే ఎక్కువ ధనాన్ని దీనికొరకు వెచ్చించగలుగుతున్నారు. ఎక్కువ భూములున్న 5-10 శాతం రైతులకు మాత్రమే గొట్టపు బావులున్నాయి. మిగిలిన వారు వర్షం పైనే ఆధారపడుతున్నారు. పెరుగుతున్న గొట్టపుబావుల సంఖ్య వలన భూగర్భ జల మట్టాలు తగ్గిపోతున్నాయి.
ప్రశ్న 14.
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు తీర మైదాన స్వరూపం గురించి వివరించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు తీర మైదానం కృష్ణా గోదావరి డెల్టాలో తప్ప శ్రీకాకుళంలోని వంశధార, నెల్లూరులోని పెన్నా డెల్టా ప్రాంతాలలో ఇరుకుగా ఉంటుంది. ఈ మైదానాలలో ప్రసిద్ధి పొందిన (కొల్లేరు మంచినీటి సరస్సు), పులికాట్ (ఉప్పునీటి సరస్సు) సరస్సులు కలవు. కొల్లేరు సరస్సు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ, పులికాట్ సరస్సు నెల్లూరు జిల్లాలోనూ కలదు.
ఆంధ్రప్రదేశ్ లోని ఈ విశాల తీరమైదానం రైతులకు, వ్యవసాయానికి గొప్ప కానుక వంటిది. ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తి మాత్రమే కాక మైదాన ప్రాంతంలోని చాలాభాగంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను పండిస్తారు. అందువలనే ఈ ప్రాంతం అధిక జనాభాకీ జనసాంద్రతకీ కూడా పెట్టింది పేరు.
ప్రశ్న 15.
అత్యల్ప వర్షపాతం మరియు భూగర్భజలం తగ్గుదల వలన ఎటువంటి ముప్పు పొంచి ఉందో తెల్పండి.
జవాబు:
అత్యల్ప వర్షపాతం మరియు భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉదా : రాయదుర్గం, కళ్యాణదుర్గం మొదలగు ప్రాంతాలు. ఈ ప్రాంతాలలోని నేలలు క్రమంగా రాతిమయంగా మారిపోవడమే కాక ఎడారీకరణ ముప్పు కూడా పొంచి ఉంది.
ప్రశ్న 16.
క్రింది వానిని ఉదాహరణలతో నిర్వచించండి.
1) నగదు పంట 2) ఆహార పంట 3) ఆక్వాకల్చర్ (జలసేద్యం) దీనివలన ఏర్పడే సమస్యలు ఏవి?
జవాబు:
1. నగదు పంట :
ఇది రైతుకి ఎక్కువ ఆదాయాన్ని లాభాన్ని ఇచ్చేది. వీటిని వ్యాపార / వాణిజ్య పంటలుగా కూడా వ్యవహరిస్తారు.
ఉదా : వేరుశనగ, పసుపు, చెరకు, పొగాకు మొదలగునవి.
2. ఆహార పంట :
ఆహార పంటలు సామాన్యంగా వినియోగం కొరకు సాగు చేసేవి.
ఉదా : వరి, చిరుధాన్యాలు, కూరగాయలు – వీటిని కూడా వినియోగానికి పోగా మిగిలిన వాటిని అమ్ముతారు.
3. ఆక్వాకల్చర్ (జలసేద్యం) :
ఆహారం కొరకు జలచరాలను పెంచుటను (సాగు చేయుటను) ‘ఆక్వాకల్చర్’ అంటారు. ఉదా : రొయ్యలు, చేపలు, పీతలు మొదలగునవి. ఇటీవలికాలంలో కోస్తా జిల్లాల్లో చాలామంది రైతులు ఆక్వాకల్చర్ వైపు మొగ్గు చూపుతున్నారు. వరి పండించే పొలాలను చాలాభాగం చేపల చెరువులుగా మారుస్తున్నారు. ఈ రకమైన మార్పు నీటి కాలుష్యానికి తద్వారా వరి పండించే పొలాలకి నీరు అందించే చెరువులలోని నీరు కలుషితం కావడానికి కారణమవుతోంది.
ప్రశ్న 17.
క్రింద ఇవ్వబడిన ఆంధ్రప్రదేశ్ పటం పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానములివ్వండి.
జవాబు:
1) రాయలసీమలో ఎన్ని జిల్లాలు కలవు?
జవాబు:
4
2) కోస్తా ఆంధ్రాలో ఎన్ని జిల్లాలు కలవు?
జవాబు:
9
3) ఆంధ్రప్రదేశ్ కు ఏ దిక్కున ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలదు?
జవాబు:
ఉత్తరం
4) డెల్టా ఏ జిల్లాలో ఉన్నాయి?
జవాబు:
ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు.
5) తూర్పు దిక్కున సరిహద్దుగా ఏమి ఉంది?
జవాబు:
బంగాళాఖాతం.